ప్రతి రోజూ పండుగే..

శ్రావణ-భాద్రపదాల కలయికతో వచ్చిన ఆగస్టు మాసం పొడవునా పండుగలు, పర్వాలే. ఆంగ్ల మానం ప్రకారం ఎనిమిదివ నెల అయిన ఆగస్టు మనకు శ్రావణ, భాద్రపద మాసాలతో కూడి వచ్చింది. ఇది పూర్తిగా వర్ష రుతు కాలం. ఈ మాసంలో ప్రతి రోజూ పండుగే.. నాగచతుర్థి మొదలుకుని వినాయక చవితి వరకు.. మధ్యలో నాగుల పంచమి, అజ ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పుత్రద ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, బలరామ జయంతి వంటి ఎన్నో పండుగలు, పర్వాలు, వ్రతాలకు ఆగస్టు ‘నెల’వు.

2022- ఆగస్టు 1, సోమవారం, శ్రావణ శుద్ధ చతుర్థి నుంచి 2022- ఆగస్టు 31, బుధవారం, భాద్రపద శుద్ధ చతుర్థి వరకు..
శ్రీశుభకృతు నామ సంవత్సరం-శ్రావణం-భాద్రపదం-వర్షరుతువు- దక్షిణాయణం

నిండైన వర్షాలతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం శ్రావణం. సస్యశ్యామలమైన వాతావరణం.. ప్రకృతి పులకరింతలతో శోభిల్లే ఈ వర్షరుతు కాలంలో ప్రతి రోజూ పండుగే. సాధారణంగా అష్టమి, నవమి, అమావాస్య తిథులు శుభకార్యాలకు అంతగా పనికిరావని అంటారు కదా! కానీ, ఈ మాసంలో ఈ తిథులు కూడా పూజలకు, ప్రత్యేక ఆరాధనలకు ప్రశస్తమైనవి. శ్రావణ మాసం ఎన్నో విధాలుగా విశేషమైనది. అందుకే ఈ మాసాన్ని ‘శుభ మాసం’ అని అంటారు. అలాగే, దీనికి ‘ఆకాశ (నభో) మాస’మనే పేరూ ఉంది. పైగా శ్రావణం విష్ణుమూర్తి జన్మ నక్షత్ర మాసం కూడా. లక్ష్మితో కూడిన విష్ణువును ఆరాధించడానికి శ్రావణం ఉద్ధిష్టమైన మాసం. అలాగే, శివపార్వతులకు ప్రీతికరమైనదీ నెల. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను విశేషంగా పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం మంగళగౌరీ వ్రతం, బుధవారం విఠలుడి, గణేశుడి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మి, తులసి పూజలు, శనివారం వేంకటేశ్వరస్వామి, హనుమంతుడి, శనీశ్వరుడి పూజలు, ఆదివారం సూర్యనారాయణస్వామి పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ఆచరించే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రధానంగా పూజలందుకునేది లక్ష్మీదేవి. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యత.. ఈ ఆరు సుగుణాలు- ఆరు లక్ష్మీ రూపాలు. ఈ ఆరింటి సాధనకు శ్రావణ మాసంలో శ్రావణలక్ష్మిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి. ఆమె- ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, ఉత్తమ గుణాలు, సిరిసంపదలు, శాంతం, శుభ్రత.. ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తీభవించిన స్వరూపం. ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుంది. తన గజ్జెల సవ్వడులతో ధనరాశుల్ని కురిపిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకొనే శుభ తరుణం శ్రావణమాసమే. ఇంకా, ఈ మాసంలో వచ్చే ముఖ్య తిథులు.. ఆయా తిథుల్లో ఆచరించాల్సిన ముఖ్య విధులు ఇవీ..

శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలది కావడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడి జన్మతిథి కూడా ఈ మాసంలోనిదే. హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే. అరవింద యోగి శ్రావణ మాసంలోనే జన్మించారు. ఇంకా ఆధ్యాత్మిక పరమ పురుషులైన ఆళవందారు, బదరీనారాయణ పెరుమాళ్‍, చూడికుడుత్త నాంచార్‍ తదితరుల తిరు నక్షత్రాలు ఈ మాసంలోనే. గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోని శుద్ధ పంచమి నాడేనని ప్రతీతి. దక్షిణాయనంలో వర్ష రుతువు మొదటగా వచ్చేది శ్రావణ మాసంలోనే. దక్షిణాయనం వర్షాకాలం. అంటే, వివిధ జబ్బులు, వ్యాధులు ముసురుకునే సమయమిది. అందుకే ఆరోగ్య పరిరక్షణార్థం ఈ మాసం పొడవునా మన పెద్దలు వివిధ వ్రతాలను ఆచరించాలని నియమం విధించారు.

• శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో శివుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేయాలి.
• శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే మొదటి పదిహేను రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజించాలి.
• శ్రావణ మాసంలో మంగళవారాల్లో ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్టు పురాణాల్లో ఉంది. కొత్తగా వివాహమైన వారు ఈ వ్రతాన్ని ఆచరించాలి. వివాహమైన తరువాత వచ్చే మొదటి శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. వరుసగా ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన ఇవ్వాలి.
• శ్రావణ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్రవారాలు అత్యంత పవిత్రమైనవి.

ఆగస్టు 2, మంగళవారం శ్రావణ శుద్ధ పంచమి/నాగపంచమి

శ్రావణ శుద్ధ నాగ పంచమికి సంబంధించి ప్రాచుర్యంలో ఉన్న కథల్లో రెండు ముఖ్యమైనవివీ..

పూర్వం ఒక రైతు పొలం దున్నుతుండగా, నాగటి కర్రు బొరియలో దిగబడిపోయింది. దాంతో బొరియలో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి. తల్లి నాగు వచ్చి చూసే సరికి పిల్లలన్నీ చనిపోయి ఉన్నాయి. పక్కనే ఉన్న నాగలి కర్రుకు నెత్తుటి మరకలు అంటుకుని ఉండటాన్ని అది చూసింది. రోషావేశంతో బుసలుకొడుతూ తల్లి నాగుపాము రైతు ఇంటికి వెళ్లింది. రైతు కుటుంబంలోని అందరినీ కాటువేసి చంపేసింది. అత్తింట కాపురం చేస్తున్న రైతు కుమార్తెను కూడా కాటేయాలనే ఆవేశంతో అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఫణిరాజైన ఆదిశేషుడిని పూజిస్తోంది. దీంతో ఆ తల్లి పాము ఆమె శేషుపూజను ముగించుకుని వచ్చే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అంతలోపున పూజ నిమిత్తం తొమ్మిది నాగవంశాలను రాసిన పీఠంపై ఉన్న చందనపు గిన్నెలో పగడ ముంచి పక్కనున్న పాలను తాగి, పేలాలను మింగింది. దాంతో తల్లి పాము ఆవేశం చల్లారిపోయింది. అనంతరం ఆమె ఎదుట పడగ విప్పి నిల్చుని ‘నువ్వు ఎవరి కుమార్తెవు?’ అని నాగు ప్రశ్నించింది. ఆమె బదులివ్వగానే, ‘నేను నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను చంపివేశాన’ని నాగు చెప్పింది. ఆమె ఎంతో చింతించడంతో నాగు ఆమెకు కొంచెం అమృతం ఇచ్చింది. దీంతో ఆమె తన వారి నోట అమృతం పోసి మళ్లీ బతికించుకుంది.అప్పటి నుంచి శ్రావణ శుద్ధ పంచమి నాడు రైతులు అరక ముట్టుకోరు. పొలాలు దున్నరు. కూరగాయలు తరగడం, వంటవార్పులు కూడా నిషిద్ధాలయ్యాయి. నాగరాజుకు పాలు నివేదించాలనే నియమం ఇప్పటికీ తెలుగునాట అన్నిచోట్లా ఆచారంలో ఉంది.

ఇది మరో కథ..
ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కోడళ్లు. కడపటి కోడలు తప్ప మిగతా వారంతా ఒకసారి తమ పుట్టినిళ్లకు వెళ్లారు. కడపటి కోడలికి తల్లిదండ్రులు లేరు. కనీసం కొద్ది రోజులు ఉంచుకునే బంధువులూ లేరు. ఆమె పరమ భక్తురాలు. ఆదిశేషుడిని విశేషంగా పూజించేది. ఆమె భక్తికి ఆదిశేషుడు కరుణించి ఓ వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఆమె మామ గారి వద్దకు వచ్చాడు. తాను ఆమె మేనమామనని, ఆమెను తనింటికి పంపాలని కోరాడు. ఆమెను మామగారి అనుమతితో తనతో తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో ఒక ఎలుక కలుగు వద్ద వృద్ధుడు తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. ఆమెను తన పగడపై ఎక్కించుకుని నాగలోకానికి తీసుకెళ్లాడు. ఆమెను ఎవరూ కరవరాదని ఆదిశేషుడు కఠినంగా ఆదేశించాడు. కొంతకాలానికి ఆదిశేషుని భార్య ప్రసవించింది. పాము పిల్లలన్నీ ఇంటి నిండా తిరగసాగాయి. ఒకనాడు ఆ కోడలు ఒక బరువైన ఇత్తడి దీపాన్ని పట్టుకుని వెళ్తుండగా, దారికి అడ్డంగా పారాడుతున్న పాము పిల్లలను చూసి భయంతో దీపాన్ని జారవిడిచింది. దీంతో పాము పిల్లలకు గాయాలయ్యాయి. కొన్నిటికి తోకలు తెగిపోయాయి. కొంతకాలానికి ఆదిశేషుడు ఆమెను అత్తారింటికి పంపేశాడు. అంతలో శ్రావణమాసం వచ్చింది. కోడలు శుక్ల పంచమి నాడు ఒక పీటపై నాగరూపాలను తీర్చిదిద్ది పూజ చేసింది. ఆనాడే, కాకతాళీయంగా తోకలు తెగిన పాము పిల్లలు తమ విరూపానికి కారణం ఏమిటని తల్లిని అడిగాయి. ఒకామె ఇత్తడి దీపాన్ని జారవిడవటం వల్ల మీద పడి మీకు గాయాలయ్యాయని తల్లి పాము చెప్పింది. దీంతో పాము పిల్లలన్నీ పగ తీర్చుకోవడానికి కోడలి ఇంటికి వచ్చాయి. కానీ, ఆమె తమను రక్షించాలని భగవంతుడిని వేడుకోవడం చూసి తమ దుష్టచింతనను మానుకున్నాయి. అక్కడ నైవేద్యంగా ఉంచిన పాలను, పేలాలను ఆరగించి, పాలగిన్నెలో ఓ రత్నహారాన్ని వదిలి వెళ్లిపోయాయి.

శ్రావణ శుద్ధ చతుర్థి/నాగ చతుర్థి
ఆగస్టు 1, సోమవారం

చతుర్థి నాడు సాధారణంగా గణేశ పూజలు విశేషంగా జరుగుతాయి. ఈనాటి పూజనే చతుర్థి వ్రతం అని అంటారు. అయితే శ్రావణ మాసపు శుద్ధ చతుర్థిని నాగ చతుర్థిగా భావించి పూజలు చేసే ఆచారమూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో నాగుల పూజ ఈ నాగ చతుర్థి నాడే జరుగుతుంది. ఆంధప్రదేశ్‍లో మాత్రం ఈ తిథి మర్నాడు వచ్చే నాగ పంచమి నాడు నాగుల పండుగ జరుపుకుంటారు.

శ్రావణ శుద్ధ పంచమి/నాగ పంచమి
ఆగస్టు 2, మంగళవార

శ్రావణ శుద్ధ పంచమి తిథి నాగపంచమి పర్వం. అలాగే, ఇది శ్రావణ మాసంలో వచ్చే తొలి మంగళవారం. ఈనాటి నుంచే మంగళగౌరీ వ్రతాలు ఆరంభమవుతాయి. అలాగే ఈనాడే గరుడ పంచమి కూడా. ఇక, జాతీయ పతాక రూపశిల్ప పింగళి వెంకయ్య గారి జయంతి తిథి కూడా ఈనాడే.
నాగ పంచమి గురించి హేమాద్రి స్కాంద పురాణంలో ఉంది. అందులో శివుడు పార్వతితో ఇలా చెప్పాడు.
‘ఓ పార్వతీ! శ్రావణ మాసాన శుక్ల (శుద్ధ) పంచమి నాడు ద్వారములకు రెండు పక్కలా పేడతో సర్ప చిత్రములను గీసి పూజించాలి. చతుర్థి నాడు ఒక్క పొద్దు ఉండి, పంచమి నాడు బంగారుతో కానీ, వెండితో కానీ, కర్రతో కానీ, మట్టితో కానీ ఐదు పడగల పామును చేయించాలి. లేక పసుపుతో కానీ, చందనంతో కానీ ఐదు లేక ఏడు పాముల చిత్రములు గీయాలి. విధిప్రోక్తంగా పంచామృతంతోనూ, గన్నేరు, సంపెంగ, జాజి తదితర పువ్వులతో ఈ నాగపంచకాన్ని పూజించాలి. పిదప ఘృతపాయసమోదకాలతో బ్రాహ్మణులను సంతృప్తి పరచాలి. అనంతాది నాగరాజులను ధ్యానించాలి. నాగులను ఎప్పుడూ భక్తితో పూజించాలి. పంచమి నాడు పాలు, పాయసాలను నైవేద్యంగా పెట్టాలి. ఆనాడు పగలు కానీ, రాత్రి కానీ భూమిని తవ్వరాదు’’.
శ్రావణ శుద్ధ పంచమి నాడు స్త్రీలు పాముల పుట్టల వద్ద పూజ చేస్తారు. ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజించడం ఈనాటి ఆచారం. మట్టితో చేసిన పామును పూజించి, పువ్వులు, మంచి గంధం, పసుపు, వేపుడు బియ్యం, చిక్కుడు గింజలు, వేసిన ఉలవలు మొదలైన పూజా ద్రవ్యాలతో దీపారాధనం, కర్పూర నీరాజనం ఫలాలు, భక్ష్యాలు నైవేద్యంగా సమర్పిస్తారు.

శ్రావణ శుద్ధ షష్ఠి/కల్కి జయంతి
ఆగస్టు 3, బుధవారం

శ్రావణ శుద్ధ షష్ఠి నాటి నుంచి ఆశ్రేష కార్తె ప్రారంభమవుతుంది. ఈ తిథి కల్కి జయంతి దినంగానూ ప్రతీతి. శ్రావణ శుద్ధ షష్ఠి తిథి కల్కి జయంతి దినమని ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఉంది. అలాగే, ఈ రోజు గుహస్య పవిత్రారోపణమ్‍ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. సూపౌదన వ్రతం చేస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలలో రాశారు. ఈనాడు శివుడిని పూజించి పప్పన్నం నివేదించాలి. అనంతరం దానినే భుజించాలి. (సూప + ఓదనం= సూపౌదనం. సూప అంటే పప్పు. ఓదనం అంటే అన్నం).

శ్రావణ శుద్ధ సప్తమి/ద్వాదశ సప్తమి వ్రతం
ఆగస్టు 4, గురువారం

శ్రావణ శుద్ధ సప్తమి తిథి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాల్లో ఉంది. ఇది సూర్యారాధనకు సంబంధించిన పర్వం. ఇంకా ఈనాడు పాపనాశినీ సప్తమి (హస్తా నక్షత్రం వస్తే) వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో, అవ్యంగ సప్తమీ వ్రతం, భాస్కరస్య పవిత్రారోపణమని మరికొన్ని గ్రంథాల్లో ఉంది. ‘రామచరిత మానస్‍’ రచించిన తులసీదాస్‍ జయంతి తిథి కూడా ఈనాడే. హస్తా నక్షత్రం దీని ముందురోజు వచ్చింది కాబట్టి ఆగస్టు 3నే సప్తమీ వ్రతం ఆచరించాలి.

శ్రావణ శుద్ధ అష్టమి/పుష్పాష్టమి
ఆగస్టు 5, శుక్రవారం

ఇది శ్రావణ మాసపు తొలి శుక్రవారం. దీని తరువాత వచ్చే మలి శుక్రవారమే (ఆగస్టు 12) వరలక్ష్మీ వ్రతదినం. ఆనాడే శ్రావణ పూర్ణిమ కూడా. సాధారణంగా దుర్గాపూజకు ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చే అష్టమి అనుకూలమైనది. శ్రావణ శుద్ధ అష్టమి దుర్గాపూజకు మరీ ఉద్ధిష్టమైనది. ఎందుకంటే అది శ్రావణ శుక్రవారం కావడంతో పాటు దుర్గాదేవి ఆరాధనకు ఉద్దేశించిన శుక్రవారం నాడే అష్టమి తిథి రావడం విశేషం. ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఈనాడు దుర్గాష్టమి అని ఉంది. ఈనాడు దుర్గాపూజను ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి నెలా రకరకాల పూలతో శివుని, దుర్గాదేవిని పూజించాలని శాస్త్ర వచనం. అందుకే ఈ అష్టమిని పుష్పాష్టమి అని కూడా అంటారు.

శావణ శుద్ధ నవమి
ఆగస్టు 6, శనివారం

కౌమార దశలో ఉన్న బాలికలు ప్రత్యేక పూజలు చేయడానికి ఒక తిథిని ఉద్దేశించారు. అదే శ్రావణ శుద్ధ నవమి తితి. ఈ తిథికి ‘కౌమారీ నామక పూజనమ్‍’ అని పేరు. ఈ పేరును బట్టి ఇది కౌమార దశలో ఉన్న యువతులు ఆచరించే వ్రతంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి.

Review ప్రతి రోజూ పండుగే...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top