భక్తి శ్రధలకు ‘నెల’ వు

1, సెప్టెంబరు, శుక్రవారం, భాద్రపద శుద్ధ దశమి – 30 సెప్టెంబరు, శనివారం, ఆశ్వయుజ శుద్ధ దశమి హేవళంబి నామ సంవత్సరం-భాద్రపద, ఆశ్వయుజాలు-శరదృతువు-దక్షిణాయన.
తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసం ఆరవది. ఆంగ్లమానం ప్రకారం తొమ్మిదవ మాసం (సెప్టెంబరు). ఈ నెలలో భాద్రపద మాసంలోని కొన్ని రోజులు, ఆశ్వయుజ మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. విజయ దశమి, షిర్డీ సాయిబాబా పుణ్య తిథి, అట్లతద్ది వంటి ఎన్నో పండుగలు, పర్వాలు ఈ మాసంలో నెలవై ఉన్నాయి.
ఈ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం గల మాసం. సనాతన ధర్మంలో ప్రధాన పర్వాలన్నీ భాద్రపద మాసం నుంచే ఆరంభమవుతాయని అంటారు. మిగతా పండుగలకు మనల్ని సన్నద్ధం చేసి మనకు శుభాలు (భద్ర) కలిగేలా చేస్తుంది కాబట్టి ఇది భద్రమాసం. అదే భాద్రపదం అయ్యింది. గణపతికి ఈ మాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసం నుంచి మొదలయ్యే పండుగలన్నింటికీ మనల్ని సన్నద్ధం చేసి, ఆయా రోజుల్లో ఆయా దేవతల్ని కొలిచేందుకు, వారి ఆరాధనలో మనకు విఘ్నాలు రాకుండా ఉండేందుకు గణపతిని మొదట పూజించాలి. ఇక, సెప్టెంబరు 21వ తేదీ నుంచి ఆశ్వయుజ మాసం ఆరంభమవుతుంది. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగినది ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజ అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి.. వీరి ఆరాధన ఈ రోజుల్లో వైశిష్ట్యం. శరత్కాలం వర్షాలు తగ్గి ప్రకృతి వింత శోభను సంతరించుకునే కాలమిది. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. అందమైన ఈ రుతువులో వచ్చే నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్క•తిలో విలక్షణమైనవి. అమ్మ ఆరాధనకు ఆశ్వయుజాన్ని మించినది లేదు. విజయదశమి పర్వదిన వేళ అందరి మోముల్లో విజయకాంతులు నిండుతాయి. ఇక, సెప్టెంబరులోని భాద్రపద, ఆశ్వయుజ తిథుల్లో వచ్చే ముఖ్య పండుగలు, పర్వాల గురించి తెలుసుకొందాం.
సెప్టెంబరు 1: భాద్రపద శుద్ధ దశమి
ఈ తిథి నాడు దశావతారములను పూజించాలి. అందుకే ఈనాడు చేసే పూజకు దశావతార వ్రతమని పేరు. నీలమత పురాణంలో ఈనాడు వితస్తోత్సవం చేస్తారని ఉంది. వితస్త పాంచాల దేశంలోని ఒక నది. ఆ నది ఈనాడే పుట్టిందని అంటారు. ఈ దశమి మొదలుకుని ఏడు రోజులు విడవకుండా వితస్తా నదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది.
దశావతార వ్రతం నాడు దేవతలకు, రుషులకు, పితరులకు తర్పణ మివ్వాలి. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతార ప్రతిమలను తయారు చేసి పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి.
సెప్టెంబరు 2: భాద్రపద శుద్ధ (శుక్ల) ఏకాదశి
దీనికే వామన ఏకాదశి అని కూడా పేరు. విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనిస్తాడు. ఆయన నిద్రలోకి వెళ్లి ఇప్పటికి రెండు మాసాలు అవుతుంది. కాగా, ఆయన నిద్రలో ఈ ఏకాదశి నాడు ఎడమ నుంచి కుడికి ఒత్తిగిలుతాడు. అందుచేత దీనికి పార్శ్వపరివర్తిన్యేకాదశి (పరివర్తన ఏకాదశి) అనే పేరు వచ్చింది. ఈ పర్వాన్ని పురస్కరించుకుని దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు సంధ్యా కాలంలోనే జరగడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంలో ఉంది. అలాగే, ఈనాడు కటదానోత్సవం (కట అంటే చాప) అనే వ్రతం ఆచరిస్తారని స్మ•తి కౌస్తుభంలో వివరించారు. చాపను దానమివ్వాలి.
సెప్టెంబరు 3: భాద్రపద శుద్ధ ద్వాదశి
విష్ణువు ఐదవ అవతారమైన వామనుడికి ప్రీతికరమైన దినమిది. వామనుడు బ్రహ్మచారి వటుడు. తపస్విని అయిన అదితికి కశ్యప రుషి వల్ల పుట్టిన వాడు. విరోచనుడు అనే దైత్యుని కొడుకు బలి. దైత్య కులంలో పుట్టినా కూడా బలి గొప్ప విష్ణు భక్తుడు. అందుకే విష్ణువుకు బలి అంటే అభిమానం. దీన్ని ఆసరా చేసుకుని బలి చక్రవర్తి దేవతలను బాధించడానికి పూనుకొన్నాడు. దేవతలంతా ఈ విషయాన్ని విష్ణువుకు చెప్పి బాధపడ్డారు. అయినా, తన భక్తుడైన బలిని ఇబ్బంది పెట్టడం విష్ణువుకు ఇష్టం లేక పోయింది. దీంతో విష్ణువు వామనమూర్తి అయిన బ్రాహ్మణ యాచకుని వేషంలో బలి చక్రవర్తి వద్దకు వెళ్లాడు. మూడు అడుగులు దానం అడిగాడు. ఇచ్చిన మాట తప్పని బలి.. సరేనన్నాడు. అంతట వామనుడు బ్రహ్మాండాంత సవర్థియై ఒక పాదంతో భూమిని, ఒక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడో పాదం బలి నెత్తి మీద ఉంచి అతనిని పాతాళంలోకి తొక్కివేశాడు. అయినా బలి తన భక్తుడు కాబట్టి వామనుడు బలి భవనానికి ద్వారపాలకుడుగా ఉన్నాడు. బలి భక్తికి ఫలితంగా నిత్యం తన దర్శనం కావడం కోసమే వామనుడు (విష్ణు) ఈ పని చేశాడు.
భాద్రపద మాస శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రంలో వామనావతార జయంతి ఉత్సవం జరుపుతారు. దీనినే విజయ ద్వాదశి అని కూడా అంటారు. వామన ద్వాదశికి ముందటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగారం ఉండి వామనావతార విగ్రహాన్ని పూజించాలి. శ్రవణ ద్వాదశి నాడు ఉపవాసం చేసిన వారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయని ప్రతీతి.
సెప్టెంబరు 4: భాద్రపద శుక్ల త్రయోదశి
ఈ తిథి మొదలుకుని మూడు రోజుల పాటు అగస్త్యార్ఘ్య దానం చేయాలని కృత్యసార సముచ్చయం అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, చతుర్వర్గ చింతామణిలో ఈనాడు గో త్రిరాత్రి వ్రతం ఆచరించాలని ఉంది.
సెప్టెంబరు 5: భాద్రపద శుక్ల చతుర్దశి
భాద్రపద శుద్ద చతుర్దశి అనంత పద్మనాభ చతుర్దశి. త్రయోదశితో కూడిన చతుర్దశి అనంత పద్మనాభ వ్రతానికి పనికిరాదు. అనంత పద్మనాభ చతుర్దశి వ్రతమే కాని ఉత్సవం కాదు. పూర్ణిమతో కూడిన చతుర్దశి ఈ వ్రతానికి ముఖ్యం. అనంతుని పూజలో పద్నాలుగు సంఖ్య (14)కు ప్రాముఖ్యం ఉంది. విష్ణుమూర్తికి పాన్పు అయిన పాముకు ఏడు పడగలు (పద్నాలుగులో సగం). తిథి పద్నాలుగో తిథి. ఈనాడు అనంతునికి సమర్పించే తోరం పద్నాలుగు పోచలతో చేసినదై ఉండాలి. ఈ తోరానికి పద్నాలుగు గ్రంథులు ఉంటాయి. ఈనాడు పద్నాలుగు రకాల పత్రితో అనంతుని పూజించాలి. నైవేద్యంగా పద్నాలుగు రకాల పండ్లు, పద్నాలుగు రకాల పిండి వంటలు ఉంచడం ఆచారం. వాయన దానానికి పద్నాలుగు అతి రసములు వాడతారు. గోధుమ పిండితో ఇరవై ఎనిమిది (రెండు పద్నాలుగులు) అతి రసములు చేయాలని నియమం. పద్నాలుగేసి ఏళ్లకు ఒకసారి వ్రతానికి ఉద్యాపనం చేయాలి. ఈ రోజున అనంత పద్మనాభ వ్రతం చేసి శేషతల్ప సాయి ఆయన శ్రీహరిని కొలిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి.
సెప్టెంబరు 6: భాద్రపద శుద్ధ పూర్ణిమ
భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు భాగవత పురాణాన్ని దానం ఇస్తే పరమపదం కలుగుతుంది. ఈనాడు బదర్యాశ్రమంలో గడిపితే విశిష్ట ఫలప్రదమని పండితుల ఉవాచ. ఈ తిథి నాడు ద్విజలు ఉపాకర్మ చేసుకుంటారు. ఈనాడు భాద్రపద శుక్ల త్రయోదశి నాడు ప్రారంభించిన అగస్త్యార్ఘ దానాన్ని ఈనాటితో ముగించాలి. ఈనాడు దిక్పాల పూజ చేయా లని నీలమత పురాణంలో ఉంది. దీనినే ఇంద్ర పౌర్ణమాసీ అంటారని గదాధర పద్ధతిలో వివరించారు. ఈనాడు ఆచరించదగిన వ్రతాలలో ముఖ్యమైనది ఉమామహేశ్వర వ్రతమని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
సెప్టెంబరు 7: భాద్రపద బహుళ (కృష్ణ) పాడ్యమి
ఈ తిథి నుంచి మహాలయ పక్షం ఆరంభమవుతుంది. ఇది వేద కాలం నుంచీ ఆచరణలో ఉన్న పండుగ. దీనినే పితృపక్షమనీ అంటారు. భాద్రపద పూర్ణిమతో ఆరంభమై భాద్రపద బహుళ అమావాస్యతో పితృపక్ష కాలం ముగుస్తుంది. మహాలయ పక్షంనాడు సాముదాయకంగా పితృ దేవతలను పూజించడానికి ఏర్పడింది. రోమన్‍ జాతీయుల్లో ఫిబ్రవరి 19వ తేదీ పితృ దేవతల పూజకు నిర్ధిష్టమై ఉండేది. ఆనాడు వారు రోమ్‍ నగరం సమీపంలోని కొండలలో ఒక కొండపై పెద్ద గొయ్యి తీసేవారు. పితృ దేవతలు భూమి కింద ఉంటారని వారి విశ్వాసం. ఆ గోతుల్లో అన్నం ఉంచే వారు. వివాహాలు, వ్యాపారాలు, ఇతర శుభకార్యాలు ఆనాడు ఆచరించరు. మనలో కూడా దాదాపు ఇదే ఆచారం కొనసాగుతోంది. మన శాస్త్రాల్లో ఏడాదిలో చేయాల్సినవి 96 శ్రాద్ధాలని ఉంది. వీటిలో పితృపక్షం ముఖ్యమైనది. శ్రాద్ధ దినం నాడు కర్మ చేసే వాడు శ్రాద్ధం పూర్తయ్యే వరకు ఉపవసిస్తాడు. చివరిలో పితృలకు నైవేద్యంగా ఉంచిన పదార్థాలను కాకి వచ్చి ఎంత తొందరగా ముడితే పితృ దేవతలు అంత ఎక్కువ తృప్తి పడినట్టు. ఈ రోజు శ్రాద్ధ కర్మ చేయడం వీలుపడని వారు తర్పణం వదులుతారు.
సెప్టెంబరు 8: భాద్రపద బహుళ విదియ
భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్ల తద్ది. దీనికి ముందు రోజైన విదియ ఉండ్రాళ్ల తద్ది భోగి. ఈనాడు స్త్రీలు తెల్లవారుజామునే అభ్యంగస్నానాలు చేసి చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. అనంతరం గవ్వలాట ఆడుతారు. ఊరి బయట తోటలకు అట్లు, బెల్లంఅట్లు, పెరుగన్నం పట్టుకెళ్లి వాటిని ఆరగించాక ఉయ్యాల ఊగుతారు. రాత్రి గౌరీపూజ చేస్తారు. ఈ పండుగ ప్రధానంగా స్త్రీల సౌభాగ్యం కోసం చేసే పండుగ. శ్రావణ, భాద్రపద మాసాలతో కొన్ని స్త్రీ సౌభాగ్యకారకమైన వ్రతాల గురించి వివిధ వ్రత గ్రంథాల్లో పేర్కొన్నారు. కానీ, వాటిలో ఉండ్రాళ్ల తద్ది గురించి పూర్తి వివరాలు లేవు. ఉండ్రాళ్ల తద్ది నాడు కొన్ని వర్ణాల వారు గొంతెమ్మ (కుంతి) పూజ చేస్తారు. దీని వెనుకో గాథ ఉంది. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మృతులకు అంత్యక్రియలు జరుపుతూ తర్పణాలు విడుస్తాడు. తర్పణోదకం అందుకోవడానికి కర్ణుని చేయి వచ్చిందట. ధర్మరాజు ఆశ్చర్యపడి ఇదేమిటని వ్యాస మహర్షిని ప్రశ్నించాడు. ‘కర్ణుడు నీ జ్యేష్ట సోదరుడు. అతనికి తిలాంజలి ఇవ్వు’ అని వ్యాసుడు బదులిచ్చాడు. ధర్మరాజు ఆ ప్రకారమే చేసి, అనంతరం నిజం చెప్పాలని తల్లి కుంతిని నిలదీశాడు. ఆమె కర్ణోత్పత్తి గాథను దుఃఖంతో వివరించింది. ‘ఈ సంగతి ముందే చెప్పి ఉంటే యుద్ధమే జరిగేది కాదు కదా! ఘోరమైన తప్పు చేశావు. కనుక నీవు మాలల దేవతవు కమ్ము’ అని ధర్మరాజు తల్లిని శపించాడు. ఆడవారి నోట నువ్వు గింజైనా నానరాదని శాపమిచ్చాడు. అప్పటి నుంచి గొంతెమ్మ (కుంతి) మాలల ఇలవేల్పు అయ్యింది.
సెప్టెంబరు 9: భాద్రపద బహుళ తదియ
ప్రతి ఏటా భాద్రపద బహుళ తదియ మనకు ఉండ్రాళ్ల తద్ది పండుగ. పిండివంటలతో ఒకదాని పేర పుట్టిన పండుగల్లో ఇది ఒకటి. ఉండ్రాళ్లు తైల పక్వం కాక కేవలం ఆవిరి మీద ఉండికే పిండివంట. భాద్రపదంలో వచ్చే మూడు పండుగులకు ప్రత్యేకం ఉండ్రాళ్లే నివేదన వస్తువులుగా ఉండటం గమనించాలి. శివుడిని పతిగా కోరి పార్వతి సాగించిన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైన దినమిదని ధర్మసింధువు అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇది తెలుగు నాట పదహారు కుడుముల తద్దిగా ప్రఖ్యాతం. పదహారు బిళ్ల కుడుములు వండి పూజ చేసి నైవేద్యం పెట్టడం ఈనాటి తెలుగునాటి తెరవల ఆచారం. ఈనాటికి అనుకరణలో వ్రత నిష్ట విధానాలు చెప్పే షోడశోమా వ్రతం తెలుగులో ఈ పేరు కూర్చుకున్నది. ఉండ్రాళ్లను సంస్క•తంలో మోదకాలు అంటారు. వరి బియ్యపు పిండిని ముందు నీళ్లలో ఉడికిస్తారు. ఈ ఉడికే పిండిలో కొద్దిగా బొబ్బర్లు కానీ, శనగ పప్పు కానీ వేయడం కూడా కద్దు. ఉడికిన ఈ పిండిని ముద్దలుగా చేసి నీటి ఆవిరి మీద గుడ్డ వాసెన కట్టి కానీ వట్టి గడ్డి వెంటి చుట్టి కానీ ఇడ్లీల మాదిరిగా వండుతారు.
సెప్టెంబరు 9,10: భాద్రపద బహుళ చతుర్థి/పంచమి
భాద్రపద బహుళ పంచమి నాడు నాగులకు పాలు పోయడం ద్వారా వాటిని తృప్తి పరుస్తారు. అలాగే, ఇదే నాడు రుషులను పూజించాలి. ఇది ప్రధానంగా పురుషులు చేసే పర్వం. మొదట స్నానం చేసి మట్టితో వేదిక చేయాలి. దానిని పేడతో అలకాలి. పువ్వులతో అలంకరించాలి. దర్బలు పరిచి దాని మీద గంధం ఉంచాలి. పువ్వులు పరచాలి. ధూపం వేయాలి. దీపం ఉంచాలి. అనంతరం సప్తరుషి పూజ చేయాలి. అర్ఘ్య దానమివ్వాలి. దున్నకుండా, నాటకుండా పండిన శ్యామాక ధాన్యంతో బియ్యం చేసి వండి నైవేద్యం పెట్టి తానూ ఆ అన్నమే తినాలి. ఇలా చేస్తే సప్తర్షుల అనుగ్రహం కలుగుతుంది. తెలుగు నాట సంతానప్రాప్తి కోసం నాగులను విశేషంగా పూజించే సంప్రదాయం ఉంది. ప్రతి మాసంలో వచ్చే పంచమి తిథి నాగుల పూజకు ఉద్ధిష్టమై ఉంది.
సెప్టెంబరు 13: భాద్రపద బహుళ అష్టమి
భాద్రపద బహుళ అష్టమి అశోకాష్టమీ వ్రతం. ఈ వ్రతాన్ని ఈనాడు ప్రారంభించి ప్రతి కృష్ణాష్టమి నాడూ దేవీపూజ చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. అలాగే, ఇదే తిథి నాడు జీమూత వాహన పూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీలో రాశారు. జీమూత వాహనుడు విద్యాధర యువకుడు. త్యాగజీవి. గరుడునికి రోజూ పాములు ఆహారం అవుతున్నట్టు తెలుసుకొని ఒకనాడు తానే ఆహారంగా వెళ తాడు. ఆ విధంగా గరుడినిలో పరి వర్తన తెస్తాడు. చీనాబ్‍ నదీ లోయల్లో గల వాసుకి ఆలయాల్లో జీమూత వాహనుడి విగ్రహం కూడా ఉంటుంది.
సెప్టెంబరు 14: భాద్రపద బహుళ నవమి
ఈ తిథి నాడు నీరాజన నవమి వ్రతం ఆచరించాలని నీలమత పురాణం చెబుతోంది. ఈనాడు దుర్గాపూజ, గౌరీ పూజాధికాలు చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.
సెప్టెంబరు 16: భాద్రపద బహుళ ఏకాదశి
ఇంద్రసేనుడు అనే వాడు యమలోకంలో నానా శిక్షలకు గురవుతూ యాతన పడుతుండే వాడు. భూలోకంలో అతని కుమారుడు తండ్రి క్షేమాన్ని కాంక్షిస్తూ భాద్రపద బహుళ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని చేశాడు. ఫలితంగా ఇంద్రసేనుడు యమలోకం నుంచి స్వర్గ లోకానికి వెళ్లాడు. ఇది పురాణగాథ. ఈ కారణంగానే ఈ ఏకాదశిని గురించి ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ‘ఇందిరైకాదశి’గా పేర్కొన్నారు. ఇది విశేష పుణ్య ఫలాన్నిచ్చే పర్వపు తిథిగా ప్రతీతి.
సెప్టెంబరు 18: భాద్రపద బహుళ త్రయోదశి
భాద్రపద బహుళ త్రయోదశి ద్వాపర యుగాది అని తిథితత్వం, కలియుగాది అని ఆమాదేర్‍ జ్యోతిషీ పేర్కొంటున్నాయి. ఈ యుగంలో ధర్మం ఒక పాదం మీద మాత్రమే నడుస్తుందట. కొంత కాలం అయిన తరువాత అదీ నశిస్తుంది. అధర్మమే రాజ్యమేలుతుంది. భగవంతుడు అప్పుడు కృష్ణవర్ణధారిగా ఉంటాడు. ప్రజలు అనాచారవంతులవుతారు. ఈ యుగంలో ప్రజలు అన్నగత ప్రాణులు. ఈ యుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు.
సెప్టెంబరు 19: భాద్రపద బహుళ చతుర్దశి
భాద్రపద బహుళ చతుర్దశి మాస శివరాత్రి పర్వం. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల శివలోక ప్రాప్తి కలుగుతుందని తిథితత్వంలో ఉంది. శివుడిని యథోచితంగా పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రివేళ కొందరు జాగారం చేయడం కద్దు. మహా శివరాత్రి పర్వాన్ని ఆచరించనట్టే మాసానికి ఒకసారి వచ్చే మాస శివరాత్రినీ భక్తులు ఆచరిస్తారు.
సెప్టెంబరు 20: భాద్రపద బహుళ అమావాస్య
భాద్రపద బహుళ అమావాస్యను సప్తపితృకామావాస్యగా గదాధర పద్ధతిలో పేర్కొన్నారు. ఈనాడు అశ్వశిరోదేవ పూజ చేసి ఉపవాసం ఉండాలి. అలాగే, ఈనాడు సుజన్మావాప్తి వ్రతం చేస్తారని హేమాద్రి పండితుడు చెబుతున్నాడు. ఇది కన్యా సంక్రమణ దినం. సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారు. అలాగే, ఈ తిథి గజచ్ఛయా తిథి అనీ, మహాలయా అనీ అంటారు.
సెప్టెంబరు 21: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
ఆశ్వయుజ మాసం ఆరంభం. ఈ నాడు గృహదేవీ పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. స్మ•తి కౌస్తుభంలో ఈ దినం.. నవరాత్రారంభమని, నవదినాత్మకమని వర్ణించారు. ఈ రోజు మొదలు దశమి వరకు కలశ స్థాపన, చండీపాఠశ్చ దుర్గోత్సవం నిర్వహించాలని ఉంది. దేవీ నవరాత్రుల పూజలు ఈ పాడ్యమి మొదలు విజయ దశమి వరకు చేస్తారు. ఈ దినాల లోనే భద్రకాళి అష్టాదశభుజ మహిషాసుర మర్దనిగా అవతార మెత్తింది. ఆదిశక్తి, మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గలుగా అవత రించిందని, ఈ దేవతను హ్రీం, శ్రీం, క్లీం సంకేతమూర్తిగా ఆరాధిస్తారని అంటారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు ప్రశాంతమైన చిత్తాన్ని ప్రసాదించే త్రిభువన పోషణి, శంకరతోషిణి, విష్ణు విలాసిని ఈ అమ్మ.
సెప్టెంబరు 23: ఆశ్వయుజ శుద్ధ తదియ
ఈనాడు మేఘపాలీయ తృతీయా వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
సెప్టెంబరు 24: ఆశ్వయుజ శుద్ధ చవితి
ఈనాడు దేవతలను, సువాసినులను పూజించాలని నీలమత పురాణం చెబుతోంది.
సెప్టెంబరు 25: ఆశ్వయుజ శుద్ధ పంచమి
ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఉపాంగ లలితా వ్రతం ఆచరిస్తారు. దీనినే లలిత పంచమి అనీ అంటారు. చతుర్వర్గ చింతామణిలో ఈ దినాన్ని శాంతి పంచమీ వ్రతంగా పేర్కొన్నారు.
సెప్టెంబరు 27: ఆశ్వయుజ శుద్ధ సప్తమి
ఆశ్వయుజ శుద్ధ సప్తమినే శుభ సప్తమి, ద్వాదశ సప్తమి వ్రతమనీ అంటారు. ఈనాడు స్నానం చేసి కపిలగోవును పూజించి అనంతరం ఆ రోజుకి పంచగవ్యాలను మాత్రమే సేవించి మర్నాడు భోజనం చేయాలి.
సెప్టెంబరు 28: ఆశ్వయుజ శుద్ధ అష్టమి
ఆశ్వయుజ మాస శుక్లపక్ష అష్టమి మాళవ దేశపు ప్రత్యేక పర్వాల్లో ఒకటి. దీనినే దుర్గాష్టమి, మహాష్టమి, దుర్గపూజా దినం, భద్రకాళీ పూజా దినాలుగా వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈనాటి సాయంకాలం ఒక ఇంట స్త్రీలందరూ కలుస్తారు. ఒక కుండ మూతిలో కానీ, ఇత్తడి బిందె మూతిలో కానీ ఊదీ శబ్దం చేస్తారు. ఇలా ఊదుతూ శబ్దం చేయగల స్త్రీని మహాలక్ష్మి పూనినట్టుగా భావిస్తారు. ఆ పూనిన స్త్రీ ఇతర మహిళలు వేసే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతుందని విశ్వసిస్తారు. రాత్రి దేవత పూనిన స్త్రీ ఇంటి యజమానురాలు ఉదయాన్నే కుంకుమ, కొబ్బరికాయ, బియ్యం, రవికల గుడ్డ ఇస్తుంది. ఈ ఉత్సవానికి పురుషులు రాకూడదు.
సెప్టెంబరు 29: ఆశ్వయుజ శుద్ధ నవమి
ఆశ్వయుజ శుద్ధ నవమినే మాతృ వ్రతమని అంటారు. ఇంకా నామ నవమీ వ్రతమని, దుర్గా నవమి వ్రతమని, శౌర్యవ్రతం, భద్రకాళీ వ్రతం, కోటిగుణ కరందానం, మహా ఫల వ్రతం, ప్రదీప్త నవమి వంటి ఇతర వ్రతాలు కూడా ఈ రోజు ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు కలశ స్థాపనతో ప్రారంభమైన దుర్గాపూజ నవమి నాటికి మరింత వైభవోపేతమవుతుంది. ఈనాడు దుర్గాదేవికి ప్రశస్త్యమైనది. దేవిని విశేషంగా ఆరాధించి శుభ ఫలితాలను పొందాలని వ్రత, పూజా, పురాణేతిహాస గ్రంథాలు వివ రిస్తున్నాయి.

Review భక్తి శ్రధలకు ‘నెల’ వు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top