మార్గశిర పాపహహరః

1, డిసెంబరు, శుక్రవారం, మార్గశిర శుద్ధ ద్వాదశి – 31 డిసెంబరు, ఆదివారం, పుష్య శుద్ధ త్రయోదశి
హేవళంబి నామ సంవత్సరం-మార్గశిర-పుష్యం-హేమంత రుతువు-దక్షిణాయనాం.
ఆంగ్లమాసం ప్రకారం డిసెంబరు నెల మాసాలలో పన్నెండవది. ఇది తెలుగు పంచాంగం ప్రకారం పదవది. ఇది మార్గశిర-పుష్య మాసాల కలయిక. మార్గశిర మాసంలోని కొన్ని రోజులు, పుష్య మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. దత్తాత్రేయుని జయంతి, స్మార్త ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, కూర్మ ద్వాదశి, రమణ మహర్షి జయంతి వంటి విశిష్ట పర్వాలు ఈ నెలలోనే వస్తాయి.

డిసెంబరు మాసం మార్గశిర – పుష్య మాసాలలోని తిథుల కలయిక. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం కావడం వల ఈ నెలకు మార్గశీర్షం అని పేరు. కార్తీక మాసంలోని నాగుల చవితి నాడు ప్రవేశించే చలి ఈ మాసం నాటికి బాగా ప్రబలుతుంది. ‘మార్గశిరంలో పుట్టే చలి.. మంటల్లో పడినా పోద’ని సామెత. ఒకప్పుడు సంవత్సరారంభం మార్గశిర మాసంతోనే అయ్యేదట. ఈ మాసానికి అగ్రహాయణిక అనే పర్యాయ నామం కూడా ఉంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ‘మాసానాం మార్గశీర్షోహం’ అని నుడివాడు. గీతాకారుని ఈ పలుకు ఈ నెల యొక్క ఉత్క•ష్టతను చాటుతోంది. డిసెంబరులోని మొదటి పదిహేను రోజులు మార్గశిర మాస తిథులు ఉంటాయి. తదుపరి పదిహేను రోజులు పుష్య మాసంలోనివి. మార్గశిరంతో పాటు దీని తరువాత వచ్చే పుష్యం.. ఈ రెండూ కలిస్తే హేమంత రుతువు.
హేమంత రుతువు గురించి భాగవతం దశమ స్కందంలో అత్యద్భుతంగా వర్ణించారు.దీనిని కవిమాస వ్రతం అని కూడా అన్నారు. ఆరోగ్యం కోసం ఆచరించే వ్రతమిది. వ్రత గ్రంథాలలో ఈ మాసంలో పలు వ్రతాలను ఆచరించాలని సూచిస్తున్నాయి. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.
మార్గశిర గురువారం.. శ్రీవారికి పూలంగి సేవ
మార్గశిరంలో వచ్చే గురు వారాలు అత్యంత పవిత్రమైనవని ప్రతీతి. కార్తీక మాసంలో సోమ వారాలు, మాఘ మాసంలో ఆది వారాలు, శ్రావణ మాసంలో మంగళ, శుక్ర, శనివారాలు పవిత్ర మైనవి. ఇలా మూడు మాసాలలో ఐదు వారాలు ఉద్ధిష్టమై ఉన్నాయి. ఇక మిగిలిన బుధ, గురువారాలకు ఏ నెలతోనూ అనుబంధం కని పించదు. కానీ, మార్గశిర గురు వారం తిరుపతి మహా మహ నీయమై ఉంది. ఈనాటి సాయంకాలం స్వామికి గొప్ప పూలంగి సేవ నిర్వహిస్తారు. స్వామికి అలంకారంగా ఉన్న ఆభరణాలన్నిటినీ తీసివేసి, కేవలం పువ్వులతోనే శ్రీవారిని అలంకరిస్తారు.
మార్గశిరంలో గురువారమే లక్ష్మీపూజ
ఇంకా మరో విధంగా కూడా మార్గశిర మాసం ఉద్ధిష్టమై ఉంది. సాధారణంగా లక్ష్మీపూజలు, లక్ష్మీ ఆరాధాన శుక్రవారం చేస్తుంటారు. కానీ, మార్గశిరంలోని గురువారాల్లో లక్ష్మీదేవిని ఆరాధించడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కొత్తగా వివాహమైన పడుచులు ఏ కారణం చేతనైనా శ్రావణ శుక్రవారం నోములు చేయలేకపోతే మార్గశిరంలోని లక్ష్మీవారాలు నోచడం ఆనవాయితీ. విశాఖపట్నం జిల్లాలో గురువారం నాడే లక్ష్మీపూజలు విశేషంగా జరుగుతాయి. ఈ నగరానికి పొరుగున
ఉన్న ఒడిశాలో మార్గశిరంలోని గురువారం లక్ష్మీ వ్రతాలు ఆచరిస్తారు.
సంక్రాంతికి శ్రీకారం..
ధనుస్సంక్రమణం ఏర్పడేది మార్గశిర మాసంలోనే. ఈ నెలలోనే ధనుస్సు పడతారు. దీన్నే ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలో తెలుగు నాట బాలికలు తెల్లవారుజామునే లేస్తారు. ముంగిళ్లు తుడిచి కళ్లాపి చల్లి, ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల మీద గోమయంతో గొబ్బిళ్లు చేసి
ఉంచుతారు. వాటికి వరిపిండితో, కుంకుమతో బొట్లు పెట్టి పైన పువ్వులు గుచ్చుతారు. వాటిని పూజిస్తారు. ధనుర్మాసంలో విష్ణ్వాలయాల్లో తెల్లవారుజామునే ఆరాధనం చేస్తారు. చక్కెర పొంగళ్లు, దద్దోజనములు నైవేద్యాలు పెడతారు. శ్రీ భాగవతంలో ధనుర్మాస వ్రత ప్రస్తావన
ఉంది. ధనుస్సంక్రమణం నాటి నుంచి సంక్రాంతి వరకు నెల రోజుల పాటు ఇళ్ల ముందు ముగ్గులు పెట్టి పెద్ద పండుగ నాడు రథం ముగ్గుతో సాగనంపుతారు. ధనుస్సంక్ర మణం నాటి నుంచే హరిదాసులు తెల్లవారజామునే ఇంటింటికీ హరికీర్తనలు ఆలపిస్తూ తిరుగుతారు.

మార్గశిర శుద్ధ ద్వాదశి… డిసెంబరు 1, శుక్రవారం
మార్గశిర శుద్ధ ద్వాదశి గొప్ప పర్వదినం. ఈ రోజు ఏ వ్రతం ఆచరించినా పుణ్యమేనని ప్రతీతి. వివిధ వ్రత గ్రంథాలలో వర్ణించిన తీరును బట్టి చూస్తే ఇది గొప్ప పర్వదినంగా భావించాలి. అటువంటి గొప్ప పర్వంతో డిసెంబరు మాసం ఆరంభ మవుతుంది. ఈనాడు మత్స్య ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామ ద్వాదశి, తారకా ద్వాదశి, అపరా ద్వాదశి, సాధ్య వ్రతం, నామ ద్వాదశి, శుభ ద్వాదశి, అఖండ ద్వాదశి, దశావతార వ్రతం, ద్వాదశా దిత్య వ్రతం వంటివి ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణితో పాటు ఇతర వ్రత గ్రంథాలలో రాశారు.
అలాగే, మార్గశిర శుద్ధ ద్వాదశి తిథి నాడు హనుమ ద్రత్వం ఆచరిస్తారని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఇన్ని పర్వ దినాలు ఆచరించదగిన రోజు కాబట్టి ఇది గొప్ప పర్వ దినం. తెలుగు వారి ఇలవేల్పు అయిన ఏడుకొండల వేంకటేశ్వరస్వామి వారి పుష్కరిణికి ఈనాడు తీర్థ దినం. భూలోకంలో మొత్తం మూడు కోట్ల తీర్థ రాజాలు ఉన్నాయి. అవన్నీ మార్గశిర శుద్ధ ద్వాదశి అరుణోదయాన తిరుపతి కొండ మీద గల స్వామి పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయని పురాణ వచనం. ఈ సమయంలో స్వామి వారి పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు. అలాగే అనేక శుభ ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతారు.
కాగా, ద్వాదశి ఘడియల్లోనే డిసెంబరు 1వ తేదీ నాడే త్రయోదశి తిథి కూడా ప్రవేశిస్తుంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు అనంగ త్రయోదశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. అలాగే, ఈనాడు గోదావరి తీర ప్రాంతాలలో హనుమజ్జయంతిని వైభవంగా జరిపే ఆచారం కూడా ఉంది. ఇది ప్రత్యేకంగా గోదావరి జిల్లాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈనాడు ఊరూవాడా హనుమంతుని ఆలయాలలో పచ్చని కొబ్బరాకులు, తాటాకులతో పందిళ్లు వేసిఅత్యంత వైభవోపేతంగా హనుమజ్జయంతి వేడుకలు నిర్వహిస్తారు.

మార్గశిర శుద్ధ చతుర్దశి… డిసెంబరు 2, శనివారం
మార్గశిర శుద్ధ చతుర్దశి నాటి నుంచి చాంద్రాయణ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి, తరువాత గౌరీదేవిని ఆరాధించాలి. పాషాణాకార పిష్ట భోజనం చేయాలి. కాబట్టే దీనిని పాషాణ చతుర్దశీ వ్రతం అని కూడా అంటారు. శివ చతుర్దశీ శ్రావణి తదితర వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు. చతుర్దశికి ముందురోజు రాత్రి భోజనం మాని చతుర్దశి నాడు నిరాహారిగా ఉండి ఆబోతును పూజించాలి. మరునాడు కమలాలతో ఉమాసహితుడైన శివుడిని పూజించాలి.

మార్గశిర శుద్ధ పూర్ణిమ… డిసెంబరు 3, ఆదివారం
మార్గశిర పూర్ణిమ నాడు చంద్రపూజ చేయాలని నీలమత పురాణం, చందవ్రతం ఆచరించాలని హేమాద్రి పురాణం చెబుతున్నాయి. ఈనాడు
ఆగ్నేయ పురాణాన్ని దానం ఇస్తే సర్వక్రతు ఫలం కలుగుతుందని పురాణోక్తి. ఇంతటి ప్రసిద్ధి కలిగిన ఈ మార్గశిర పూర్ణిమను తెలుగు నాట ‘కోరల పున్నమి’ అంటారు.
కోరల పున్నమ అంటే కోరల అమ్మవారి పున్నమి. కోరల అమ్మవారు యముని వద్ద ప్రధాన లేఖకుడైన చిత్రగుప్తుని సోదరి. ఆమె కోటి పుర్రెల నోము పడుతుండేదట. కానీ, ఏటా ఒక పుర్రె లోటు వస్తుండేది. అందుచేత మళ్లీ సంవత్సరం మళ్లీ ఆ నోము ఆచరించేది. అప్పుడూ ఇలాగే లోటు ఏర్పడేది. ఏటేటా ఇదే వరస. ఇదీ పురాణగాథ.
మహా మార్గశీర్ష అనే పేరు గల పున్నమి నాడు సరక పూర్ణిమ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. వైద్య శాస్త్రంలో కార్తీక పూర్ణిమ మొదలు మార్గశిర పూర్ణిమ వరకు గల ముప్పయి రోజులను యమదంష్ట్రలు అంటారు. అంటే, ఈ రోజులలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడని భావం. ఈ రోజులు చాలా అనారోగ్యకరమైనవి. మార్గశిర పూర్ణిమతో ఈ రోజులు ముగుస్తాయి. ఆంధప్రదేశ్‍లోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజున అతి ప్రాచీన కాలంలో ‘రొట్టెలు కొరికి కుక్కలకు వేయడం’ అనే ఆచారం వాడుకలో ఉండేది.
ఉపవాసాలకు ఉద్ధిష్టమైన పర్వదినమిది. ఈ పర్వానికి ఉత్సవ శోభ కల్పించే ఘట్టాలూ ఉన్నాయి. గద్వాల (తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం) మొదలికల్లు అనే ఊరులో సుప్రసిద్ధమైన శ్రీవేంకటేశ్వర క్షేత్రం. మొదలికల్లు అంటే సంస్క•తంలో శిలా క్షేత్రమని అర్థం. మార్గశిర పున్నమి నుంచి ఇక్కడ గొప్ప జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. కర్నూలు, నెల్లూరు వంటి దూర ప్రాంతాల నుంచి మేలు జాతి పశువులను ఇక్కడకు తీసుకువచ్చి ఈ ఉత్సవాలలో ప్రదర్శిస్తుంటారు. సంవత్సరంలోని మూడు వందల అరవై అయిదు రోజులు ఏదో ఒక ఉత్సవంతో అలరారడమే తెలుగు సంస్క•తి గొప్పదనం.

మార్గశిర బహుళ పాడ్యమి… డిసెంబరు 4, సోమవారం
మార్గశిర కృష్ణ (బహుళ) పాడ్యమి.. నవ మహోత్సవ దినమని నీలమత పురాణంలో ఉంది. దీనిని బట్టి కాశ్మీరులో ఒకప్పుడు ఇది కొత్త సంవత్సర ప్రారంభ దినమని గుర్తించాలి. ఈనాడు చంద్రార్ఘ్య దానం చేయాలని గదాధర పద్ధతి, శీలావాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలోనూ రాశారు.

మార్గశిర బహుళ సప్తమి… డిసెంబరు 9, శనివారం
ఈ తిథి నాడు ఫల సప్తమీ వ్రతం, తమశ్చరణ వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఉంది. అయితే, వీటిని ఎలా ఆచరించాలనే వివరాలేవీ పెద్దగా అందుబాటులో లేవు.

మార్గశిర బహుళ అష్టమి… డిసెంబరు 10, ఆదివారం
మార్గశిర కృష్ణ అష్టమి నాడు అనఘాష్టమీ వ్రతం, కృష్ణాష్టమీ వ్రతం, రుక్మిణ్యష్టమీ వ్రతం, కాలాష్టమీ వ్రతం మొదలైనవి చేస్తారని ఉంది. కాలభైరవాష్టమిగా భావించి ఈ రోజున భైరవ జయంతి వ్రతం ఆచరించే ఆచారం కూడా ఉందని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.

మార్గశిర బహుళ నవమి… డిసెంబరు 11, సోమవారం
మార్గశిర బహుళ నవమి నాడు రూప నవమీ వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

మార్గశిర బహుళ ఏకాదశి… డిసెంబరు 13, బుధవారం
మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశిగానూ ప్రతీతి. వైతరణి, ధనద సర్వకామ తదితర వ్రతాలు ఈ రోజు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. దీనికే సఫలైకాదశి అని కూడా పేరు. లుంపకుడు అనే వాడు మహిష్మంతుని కుమారుడు. అతను దేశం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. దేశాలు పట్టి తిరుగుతుండగా, ఒక ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. దీంతో అతను బలవంతాన ఉపవాసం ఉండాల్సి వచ్చింది. అజ్ఞాతంగానే అతను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. అయినా ఆ వ్రతం యొక్క ఫలాన్ని అతను పొందాడు. కాబట్టే ఈ ఏకాదశికి సఫలైకాదశి అనే పేరు వచ్చింది.

మార్గశిర బహుళ ద్వాద•శి… డిసెంబరు 14, గురువారం
చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో- ఈనాడు మల్ల ద్వాదశి, కృష్ణ ద్వాదశీ వ్రతాలు ఆచరిస్తారని చెబుతోంది.

మార్గశిర బహుళ త్రయోదశి… డిసెంబరు 15, శుక్రవారం
మార్గశిర బహుళ త్రయోదశి యమ దర్శన త్రయోదశి పర్వమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

మార్గశిర బహుళ అమావాస్య… డిసెంబరు 18, సోమవారం
ఈ తిథికే మహోదధ్యమావాస్య అనీ పేరు. బకులామావాస్య అనీ అంటారు. దీనికే ‘బకులక్షీరేణపాయసంకృత్యా’ అని నానుడి. అంటే, పాలతో పాయసం వండి నివేదన చేసే దినం ఇదని.

పుష్య శుద్ధ విదియ… డిసెంబరు 20, బుధవారం
పుష్య శుద్ధ పాడ్యమితో డిసెంబరు 19 నుంచి పుష్య మాసం ఆరంభమవుతుంది. ఈ తెలుగు మాసాల వరుసలో ఇది సంవత్సరంలో పదో మాసం. పుష్యంలో ఆవు ఈనితే ఆడపడుచుకు ఇచ్చివేయాలనే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. పుష్యమాసంలో పూస గుచ్చ పొద్దుండదని నానుడి. ఇక, డిసెంబరు 20న పుష్య శుద్ధ విదియ. ఈ తిథి నాడు ఆరోగ్య ద్వితీయ వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు రోజులు సాగే విష్ణు వ్రతానికి శ్రీకారం చుడతారు.

పుష్య శుద్ధ పంచమి… డిసెంబరు 23, శనివారం
ఈ తిథి నాడు మధుసూదన భగవానుడిని పూజించాలి. ప్రతి మాసంలోని శుక్ల, కృష్ణ పక్షములలోని తిథులలో నాగుల పూజ యోగ్యమై ఉంది.

పుష్య శుద్ధ షష్ఠి… డిసెంబరు 24, ఆదివారం
పుష్య శుక్ల షష్ఠిని కుమారషష్ఠి అని కూడా అంటారు. కుమార షష్ఠి అంటే కుమారస్వామిని పూజించడానికి ఉద్ధిష్టమైన షష్ఠి. ఈ పర్వం మనకంటే తమిళుల్లో హెచ్చు. తమిళవాసులకు కుమారస్వామి ఇలవేల్పు. చాళుక్యుల కాలంలో తెలుగునాట కుమారస్వామి పూజ ఎక్కువగా ఉండేది. అయితే, ప్రస్తుతం తెలుగునాట కుమారస్వామికి పర్యాయ నామమైన సుబ్రహ్మణ్యుడిగానే కుమారస్వామి ప్రసిద్ధుడై ఉన్నాడు. కుమారస్వామి సుబ్రహ్మణ్య నామంతో తెలుగునాట విశేషంగా పూజలు అందుకుంటున్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠి (నవంబరు 24) నాడు వచ్చే సుబ్బారాయుడి షష్ఠి గోదావరి తీర ప్రాంతాలలో పెద్ద ఉత్సవం.

పుష్య శుద్ధ సప్తమి… డిసెంబరు 25, సోమవారం
ఈ తిథి నాడు మార్తాండ సప్తమి, ద్వాదశ సప్తమి వ్రతాలను విశేషంగా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.

పుష్య శుద్ధ అష్టమి… డిసెంబరు 26, మంగళవారం
పుష్య శుద్ధ అష్టమిని వివిధ వ్రత గ్రంథాలు మహా భద్రాష్టమి, జయంత్యష్టమి, దుర్గాష్టమి తదితర నామాలతో పేర్కొంటున్నాయి. ఈనాడు అష్టకా సంజ్ఞకమమైన శ్రాద్ధం చేస్తే పితృ దేవతలకు సంతుష్టి కలుగుతుందని, కులాభివృద్ధి జరుగుతుందని అంటారు.

పుష్య శుద్ధ నవమి… డిసెంబరు 27, బుధవారం
పుష్య శుక్ల నవమి నాడు ధ్వజ నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈనాడు ఒంటిపూట భోజనం చేయాలి. మహా మాయను పూజిస్తూ వ్రత నియమం పాటించాలి.

పుష్య శుద్ధ దశమి… డిసెంబరు 28, గురువారం
వివిధ వ్రత గ్రంథాలు పుష్య శుద్ధ దశమిని శాంకరీ దశమి అని పేర్కొంటున్నాయి. ద్వార ధర్మ దేవతలకు పిండి మొదలైన వాటితో పూజించడం ఉత్కల దేశంలో ఆచారంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ద్వార పూజ అంటే గడప పూజ అని అర్థం.

పుష్య శుద్ధ ఏకాదశి… డిసెంబరు 29, శుక్రవారం
పుష్య శుద్ధ ఏకాదశి రైవత మన్వాది దినం. అంతేకాక ఇది పుత్రదైకాదశిగా కూడా ప్రసిద్ధమై ఉంది. సుకేతువు అనే రాజు ఈ ఏకాదశి నాడు విద్యుక్తంగా వ్రతాన్ని ఆచరించి పుత్రుడిని పొందాడట. అందుచేత దీనికి పుత్రదైకాదశి అనే పేరు వచ్చింది.
ఇక, ఈ తిథి వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగానూ ప్రతీతి. ధనుర్మాసంలో నెల పట్టిన తరువాత శుద్ధంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇది మార్గశిరంలో కనీ, పుష్యంలో కానీ వస్తుంది. ఇది వైష్ణవులకు, రామానుజ, మధ్వ మతస్థులకు ముఖ్యమైన పండుగ. హిందువులందరికీ ఇది విశేష దినం.
వైకుంఠ ఏకాదశికి మూడు పేర్లు ఉన్నాయి.
ఈనాడు వైకుంఠ ద్వారాలు తెరుస్తారని, దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ అప్పుడు స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణంగా దక్షిణాదిలో కొన్ని ప్రాంతాల్లో ఈ ఏకాదశిని ‘స్వర్గ ద్వారం’ అనే పేరుతోనూ వ్యవహరిస్తారు.
అలాగే, విష్ణువు వైకుంఠం నుంచి మూడు కోట్ల దేవతలతో ఈనాడు భూలోకానికి దిగి వచ్చాడు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. అయితే, ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైనది కావడం చేత కూడా ‘ముక్కోటి ఏకాదశి’ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు.
ఇక, వైకుంఠ ఏకాదశి అనే పేరెలా వచ్చిందంటే.. కృత యుగంలో చంద్రావతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని ‘ముర’ అనే అసురుడు పాలిస్తుండే వాడు. దేవతల్ని హింసించే వాడు. దీంతో దేవతలు విష్ణువుకు మొర పెట్టుకున్నారు. విష్ణువు భూలోకానికి వచ్చి మురాసురుడిని సంహరిస్తాడు. ఇది ఏకాదశి నాడు జరిగింది. విష్ణువు వైకుంఠం నుంచి భూమి మీదకు వచ్చి శత్రు సంహారం చేసిన రోజు కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చిందని అంటారు.
ఈ పర్వదినాన దేవాలయం ఉత్తర ద్వారం నుంచి మహా విష్ణువును దర్శించిన వారికి పునర్జన్మ లేదని శాస్త్ర ప్రమాణం. ఈనాడు శ్రీరంగ క్షేత్ర వైభవం చూసి తీరాల్సిందే. ఇక్కడి రంగనాథస్వామికి భక్తులు ఈనాడు బ్రహ్మరథం పడతారు. ఈ ఆలయం గురించి ప్రశస్తి రామాయణంలోని ఉత్తరకాండలో కనిపిస్తుంది.

పుష్య శుద్ధ ద్వాదశి… డిసెంబరు 30, శనివారం
పుష్య శుద్ధ ద్వాదశి కూర్మ ద్వాదశి పర్వంగా ప్రసిద్ధి. అలాగే, ఇంకా సుజన్మ ద్వాదశీ వ్రతాలు కూడా చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఇక, డిసెంబరు 31 పుష్య శుద్ధ త్రయోదశి. ఈనాటితో డిసెంబరులో వచ్చే పుష్యమి రోజులు ముగుస్తాయి.

Review మార్గశిర పాపహహరః.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top