లక్ష్మీ శోభ.. శ్రీకృష్ణ ప్రభ

శ్రావణ మాసంతో కూడిన ఆగస్టు నెల పొడవునా పండుగలు, పర్వాలే. ఆంగ్ల మానం ప్రకారం ఎనిమిదివ నెల అయిన ఆగస్టు మనకు ఆషాఢం-శ్రావణ మాసాలతో కూడి వచ్చింది. ఆషాఢ తిథులు నాలుగైదు రోజులే.. మిగతావన్నీ పూర్తిగా శ్రావణ మాసపు తిథులే ఈ మాసమంతా. ఇది పూర్తిగా వర్ష రుతు కాలం. ఈ మాసంలో ప్రతి రోజూ పండుగే.. నాగచతుర్థి మొదలుకుని నాగుల పంచమి, అజ ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ మంగళగౌరీ వ్రతాలు, శ్రావణ పుత్రద ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, బలరామ జయంతి వంటి ఎన్నో పండుగలు, పర్వాలు, వ్రతాలకు ఆగస్టు ‘నెల’వు.

2024- ఆగస్టు 1, గురువారం, ఆషాఢ బహుళ ద్వాదశి నుంచి 2024- ఆగస్టు 31, శనివారం శ్రావణ బహుళ త్రయోదశి వరకు..
శ్రీ క్రోధి నామ సంవత్సరం – ఆషాఢం – శ్రావణ మాసం
– వర్ష రుతువు- దక్షిణాయనం

నిండైన వర్షాలతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం శ్రావణం. ఇది పూర్తిగా వర్షరుతు కాలం. సస్యశ్యామలమైన వాతావరణం.. ప్రకృతి పులకరింతలతో శోభిల్లే ఈ వర్షరుతు కాలంలో ప్రతి రోజూ పండుగే. పసుపు పచ్చని శుభతోరణాలతో ప్రతి ఇల్లూ ఆలయాన్ని తలపిస్తుంది. ఈ మాసంలో తలపెట్టే ప్రతి పనీ ఎంతో పవిత్రతను సంతరించుకుంటుంది. సాధారణంగా అష్టమి, నవమి, అమావాస్య తిథులు శుభకార్యాలకు అంతగా పనికిరావని అంటారు కదా! కానీ, ఈ మాసంలో ఈ తిథులు కూడా పూజలకు, ప్రత్యేక ఆరాధనలకు ప్రశస్తమైనవి. శ్రావణ మాసం ఎన్నో విధాలుగా విశేషమైనది. అందుకే ఈ మాసాన్ని ‘శుభ మాసం’ అని అంటారు. అలాగే, దీనికి ‘ఆకాశ (నభో) మాస’మనే పేరూ ఉంది. పైగా శ్రావణం విష్ణుమూర్తి జన్మ నక్షత్ర మాసం కూడా. లక్ష్మితో కూడిన విష్ణువును ఆరాధించడానికి శ్రావణం ఉద్ధిష్టమైన మాసం. అలాగే, శివపార్వతులకు ప్రీతికరమైనదీ నెల. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను విశేషంగా పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం మంగళగౌరీ వ్రతం, బుధవారం విఠలుడి, గణేశుడి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మి, తులసి పూజలు, శనివారం వేంకటేశ్వరస్వామి, హనుమంతుడి, శనీశ్వరుడి పూజలు, ఆదివారం సూర్యనారాయణస్వామి పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ఆచరించే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రధానంగా పూజలందుకునేది లక్ష్మీదేవి. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యత.. ఈ ఆరు సుగుణాలు- ఆరు లక్ష్మీ రూపాలు. ఈ ఆరింటి సాధనకు శ్రావణ మాసంలో శ్రావణలక్ష్మిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి. ఆమె- ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, ఉత్తమ గుణాలు, సిరిసంపదలు, శాంతం, శుభ్రత.. ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తీభవించిన స్వరూపం. ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుంది. తన గజ్జెల సవ్వడులతో ధనరాశుల్ని కురిపిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకొనే శుభ తరుణం శ్రావణమాసమే. ఇంకా, ఈ మాసంలో వచ్చే ముఖ్య తిథులు.. ఆయా తిథుల్లో ఆచరించాల్సిన ముఖ్య విధులు ఇవీ..

శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలది కావడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడి జన్మతిథి కూడా ఈ మాసంలోనిదే. హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే. అరవింద యోగి శ్రావణ మాసంలోనే జన్మించారు. ఇంకా ఆధ్యాత్మిక పరమ పురుషులైన ఆళవందారు, బదరీనారాయణ పెరుమాళ్‍, చూడికుడుత్త నాంచార్‍ తదితరుల తిరు నక్షత్రాలు ఈ మాసంలోనే. గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోని శుద్ధ పంచమి నాడేనని ప్రతీతి. దక్షిణాయనంలో వర్ష రుతువు మొదటగా వచ్చేది శ్రావణ మాసంలోనే. దక్షిణాయనం వర్షాకాలం. అంటే, వివిధ జబ్బులు, వ్యాధులు ముసురుకునే సమయమిది. అందుకే ఆరోగ్య పరిరక్షణార్థం ఈ మాసం పొడవునా మన పెద్దలు వివిధ వ్రతాలను ఆచరించాలని నియమం విధించారు.
• శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో శివుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేయాలి.
• శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే మొదటి పదిహేను రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజించాలి.
• శ్రావణ మాసంలో మంగళవారాల్లో ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్టు పురాణాల్లో ఉంది. కొత్తగా వివాహమైన వారు ఈ వ్రతాన్ని ఆచరించాలి. వివాహమైన తరువాత వచ్చే మొదటి శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. వరుసగా ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన ఇవ్వాలి.
• శ్రావణ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్రవారాలు అత్యంత పవిత్రమైనవి.
• శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారమే వరలక్ష్మీ వ్రతం ఆచరణకు యోగ్యమైనది. ఈనాడు తెలుగు లోగిళ్లు అన్నీ లక్ష్మీకళతో ఉట్టిపడతాయి.

ఆషాఢ బహుళ ద్వాదశి
ఆగస్టు 1, గురువారం

ఆషాఢ బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలి. అలాగే, ఈనాడు రోహిణి వ్రతాన్ని కూడా ఆచరించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.

ఆషాఢ బహుళ త్రయోదశి
ఆగస్టు 2, శుక్రవారం

ఆషాఢ బహుళ త్రయోదశి నాడు శని త్రయోదశి పూజలు నిర్వహిస్తారు. సాధారణంగా త్రయోదశి తిథి శనీశ్వరుని పూజలకు ఉద్ధిష్టమైనది.
అలాగే, ఆగస్టు 2న ఏటా జాతీయ పర్వతారోహణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పర్వతాలపై అవగాహన కలిగించడానికి, పర్యావరణంలో అవి చేసే మేలును తెలియ చెప్పడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఈనాడు మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి దినం. ఈయన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. 1876, ఆగస్టు 2న జన్మించారు. 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలో చోటుచేసుకున్న వివిధ ఘట్టాలలో ఈయన పాల్గొన్నారు. తొలిసారి ఈయన రూపొందించిన జాతీయ పతాకాన్ని 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‍ సమావేశంలో ఎగురవేశారు.
1947, జూలై 22న భారత రాజ్యాంగసభలో జాతీయ జెండా గురించి తీర్మానాన్ని ఆమోదించారు. ఈయన రూపొందించిన మునుపటి త్రివర్ణ పతాకంలో రాట్నం ఉండేది. దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు.

ఆషాఢ బహుళ చతుర్దశి
ఆగస్టు 3, శనివారం

ఆషాఢ బహుళ చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రి. ఈనాడు శివుడిని విశేషంగా ఆరాధిస్తారు. ఈనాటి నుంచి ఆశ్లేష కార్తె ప్రారంభం అవుతుంది. ఈ కార్తె కాలంలో కురిసే వాన ఆరోగ్యప్రదమైనది నానుడి.

ఆషాఢ బహుళ అమావాస్య
ఆగస్టు 4, ఆదివారం

ఆషాఢ మాసంలో ఇది చివరి రోజు. ఈనాటితోనే తెలంగాణలో బోనాల పండుగ ముగుస్తుంది. ఈనాడు పాత నగరంలోని మహంకాళి ఆలయంలో రంగం నిర్వహిస్తారు. ఇక, ఆషాఢ బహుళ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈనాడు ఇంట్లోని ఇత్తడి దీప స్తంభాలు, కుందెలు అన్నీ శుభ్రంగా కడుగుతారు. కొయ్య పలకల్ని పేడతో అలికి దాని మీద ముగ్గులు పెడతారు. కుందెలు, దీప స్తంభాలు దాని మీద ఉంచుతారు. స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు, కుంకుమలతో పూజలు చేస్తారు. సాయంత్రం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు. ఈ పక్రియనే దీప పూజగా వ్యవహరిస్తారు. అలాగే, ఈనాడు కర్కాటక సంక్రమణం. దక్షిణాయం ఈనాటి నుంచే ప్రారంభమవుతుంది. ఈనాటితో ఆగస్టు మాసంలోని ఆషాఢ మాస తిథులు ముగుస్తాయి.
ఆగస్టు 4న ఏటా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. జీవితంలో చేదోడు వాదోడుగా ఉండే స్నేహితులను పరస్పరం గౌరవించుకోవడానికి, స్నేహబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఉద్దేశించిన రోజిది. 1935లో యునైటెడ్‍ స్టేట్స్ కాంగ్రెస్‍ ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఇది ఏటా ఆగస్టులో తొలి ఆదివారం నాడు నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది.

శ్రావణ శుద్ధ పాడ్యమి
ఆగస్టు 5, సోమవారం

శ్రావణ శుద్ధ పాడ్యమి తిథి నుంచి శ్రావణ మాసపు తిథులు ప్రారంభమవుతాయి. ఇది శ్రావణ మాస ఆరంభ తిథి. వర్ష రుతువు ఆరంభ దినం కూడా ఇదే. శ్రావణ మాసపు పవిత్రారోపణోత్సవాలు ఈనాటి నుంచే మొదలవుతాయి. ఈ తిథి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ తిథి పవిత్రారోపణాలకు ఉద్ధిష్టమైనది. అంటే శ్రావణ పూర్ణిమ వచ్చే వరకు వచ్చే పదిహేను రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు ఈ రోజుల్లో పవిత్రారోపణం చేస్తారు. దర్భలతో చేసిన తోరములను దేవతలకు అర్పించడాన్నే పవిత్రారోపణోత్సవం అంటారు. దీనినే తోరబంధన క్రియ అని కూడా అంటారు. దర్భలను ‘పవిత్రం’ అంటారు. వీటికి మొదట పూజ చేసిన తరువాత దేవునికి అలంకరణ ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం పవిత్రాలు తీసి ఆ రోజు తిథిని బట్టి వచ్చే గురు దేవతల పేరుతో పంచుతారు. ఇదే పవిత్రారోపణోత్సవ పక్రియ. ఈనాటి నుంచి శ్రావణ సోమవార వ్రతం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో శ్రావణ సోమవార వ్రతాలు ఆచరిస్తారు. ఆ వరుసలో ఇది మొదటి సోమవారం. ఆగస్టు 5, 12, 19, 26 తేదీల్లో వచ్చే సోమవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

శ్రావణ శుద్ధ విదియ
ఆగస్టు 6, మంగళవారం

శ్రావణ శుద్ధ విదియ నాటి నుంచే శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది శ్రావణ మాసం పొడవునా వచ్చే ప్రతి మంగళవారం (2024, ఆగస్టు 6, 13, 20, 27 తేదీలు) ఆచరించాల్సిన వ్రతం. ఈ వ్రతాచరణ, ఇతర విశేషాల గురించి ‘ఈ మాసం ప్రత్యేకం’ శీర్షికలో చదవవచ్చు. అలాగే, శ్రావణ శుద్ధ విదియ నాటి పగలు వాసుదేవుడిని అర్చించి, రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం, నక్తం, భోజనాదికాలు చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో రాశారు. శ్రావణ శుద్ధ విదియ తిథి ‘శ్రియఃపవిత్రారోపణం’ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. తిథి తత్వం దీనినే ‘మనోరథ ద్వితీయ’ అని చెబుతోంది.

శ్రావణ శుద్ధ తదియ
ఆగస్టు 7, బుధవారం

శ్రావణ శుద్ధ తదియ నాడు మధు శ్రావణీ వ్రతాన్ని ఆచరించాలని కృత్యసార సముచ్చయము అనే వ్రత గ్రంథంలో వివరించారు. అందులో ఈ వ్రతానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అలాగే, పంచాంగాలలో ఈనాడు స్వర్ణగౌరీ వ్రతంగా ఆచరించాలని ఉంది. అనోన్య దాంపత్యాన్ని కోరుకునే దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పార్వతీ పరమేశ్వరులను షోడశోపచారాలతో పూజించి, పదహారు ముడులు కలిగిన తోరమును మగవారు కుడిచేతికి, ఆడవారు ఎడమ చేతికి లేదా మెడలో కట్టుకోవడం ఈనాటి ప్రధాన విధాయ కృత్యం. ఈ వ్రతాన్ని గురించి శివుడు తన దేవేరి అయిన పార్వతికి చెప్పాడని అంటారు. ఈ వ్రతానికి సంబంధించి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు ఓ రాజు అడవిలో వేటకు వెళ్లాడు. అక్కడ నదీతీరాన మహిళలంతా గుమికూడి ఉంటారు. అక్కడేం చేస్తున్నారని రాజు అడుగుతాడు. స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నామని మహిళలు బదులిస్తారు. ఈ వ్రతకథ చెప్పాలని ఆయన కోరగా, వారు చెబుతారు. దీంతో ఆయన తన రాజమందిరానికి చేరుకుని తన భార్యలకు ఈ వ్రత విశేషం గురించి చెబుతాడు. ఆ ఇద్దరి భార్యలలో పెద్దావిడ వ్రతాన్ని పట్టించుకోకపోగా, హేళన చేస్తుంది. రెండో భార్య మాత్రం శ్రద్ధగా వ్రతాన్ని ఆచరిస్తుంది. వ్రతాన్ని నిర్లక్ష్యం చేసిన పెద్ద భార్య కష్టాల పాలవుతుంది. చిన్న భార్య మాత్రం వ్రతాచరణ ఫలంతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవిస్తుంది. గౌరీదేవి అంటే పార్వతీదేవి.
అలాగే, ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

శ్రావణ శుద్ధ చవితి
ఆగస్టు 8, గురువారం

చతుర్థి నాడు సాధారణంగా గణేశ పూజలు విశేషంగా జరుగుతాయి. చవితి తిథి విఘ్న పూజకు ఉద్ధిష్టమైనదని వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. అందుకే ఈనాడు ఆచరించే పూజనే చతుర్థి వ్రతం అని అంటారు. అయితే శ్రావణ మాసపు శుద్ధ చతుర్థిని నాగ చతుర్థిగా భావించి పూజలు చేసే ఆచారమూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో నాగుల పూజ ఈ నాగ చతుర్థి నాడే జరుగుతుంది. ఆంధప్రదేశ్‍లో మాత్రం ఈ తిథి మర్నాడు వచ్చే శుద్ధ పంచమి నాడు నాగుల పండుగ జరుపుకుంటారు.

శ్రావణ శుద్ధ పంచమి
ఆగస్టు 9, శుక్రవారం

ఈనాటి నుంచి శ్రావణ శుక్రవారాలు ఆరంభమవుతాయి. ఇది శ్రావణ మాసపు తొలి శుక్రవారం. దీని తరువాత వచ్చే శుక్రవారమే (ఆగస్టు 16, 2024) వరలక్ష్మీ వ్రతాచరణ వారం. ఇక, శ్రావణ శుద్ధ పంచమి విశేషాల్లోకి వెళ్తే.. శ్రావణ శుద్ధ పంచమి తిథి నాగపంచమి పర్వం. ఈనాడే గరుడ పంచమి కూడా.
నాగ పంచమి గురించి హేమాద్రి స్కాంద పురాణంలో ఉంది. అందులో శివుడు పార్వతితో ఇలా చెప్పాడు. ‘ఓ పార్వతీ! శ్రావణ మాసాన శుక్ల (శుద్ధ) పంచమి నాడు ద్వారములకు రెండు పక్కలా పేడతో సర్ప చిత్రములను గీసి పూజించాలి. చతుర్థి నాడు ఒక్క పొద్దు ఉండి, పంచమి నాడు బంగారుతో కానీ, వెండితో కానీ, కర్రతో కానీ, మట్టితో కానీ ఐదు పడగల పామును చేయించాలి. లేక పసుపుతో కానీ, చందనంతో కానీ ఐదు లేక ఏడు పాముల చిత్రములు గీయాలి. విధిప్రోక్తంగా పంచామృతంతోనూ, గన్నేరు, సంపెంగ, జాజి తదితర పువ్వులతో ఈ నాగపంచకాన్ని పూజించాలి. పిదప ఘృతపాయసమోదకాలతో బ్రాహ్మణులను సంతృప్తి పరచాలి. అనంతాది నాగరాజులను ధ్యానించాలి. నాగులను ఎప్పుడూ భక్తితో పూజించాలి. పంచమి నాడు పాలు, పాయసాలను నైవేద్యంగా పెట్టాలి. ఆనాడు పగలు కానీ, రాత్రి కానీ భూమిని తవ్వరాదు’’.
శ్రావణ శుద్ధ పంచమి నాడు స్త్రీలు పాముల పుట్టల వద్ద పూజ చేస్తారు. ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజించడం ఈనాటి ఆచారం. మట్టితో చేసిన పామును పూజించి, పువ్వులు, మంచి గంధం, పసుపు, వేపుడు బియ్యం, చిక్కుడు గింజలు, వేసిన ఉలవలు మొదలైన పూజా ద్రవ్యాలతో దీపారాధనం, కర్పూర నీరాజనం, ఫలాలు, భక్ష్యాలు నైవేద్యంగా సమర్పిస్తారు.
శ్రావణ శుద్ధ నాగ పంచమి నాడు రైతులు అరక ముట్టుకోరు. నాగలి పట్టరు. భూమిని దున్నరు. ఆ రోజు ఆ పని చేయకూడదనేందుకు ఒక ఆసక్తికరమైన కథ ప్రాచుర్యంలో ఉంది.
పూర్వం ఒక రైతు పొలం దున్నుతుండగా, నాగటి కర్రు ఒక బొరియలో దిగబడిపోయింది. నాగటి కర్రు గుచ్చుకుని బొరియలో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి. తల్లి నాగు వచ్చి చూసే సరికి పిల్లలన్నీ చనిపోయి ఉన్నాయి. పక్కనే ఉన్న నాగలి కర్రుకు నెత్తుటి మరకలు అంటుకుని ఉండటాన్ని అది చూసింది. రోషావేశంతో బుసలు కొడుతూ తల్లి నాగుపాము రైతు ఇంటికి వెళ్లింది. రైతు కుటుంబంలోని అందరినీ కాటువేసి చంపేసింది. అంతటితో కూడా దాని రోషం చల్లారలేదు. అత్తింట కాపురం చేస్తున్న రైతు కుమార్తెను కూడా కాటేయాలనే ఆవేశంతో అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఫణి రాజైన ఆదిశేషుడిని పూజిస్తోంది. దీంతో ఆ తల్లి పాము ఆమె శేషు పూజను ముగించుకుని వచ్చే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అంతలోపున పూజ నిమిత్తం తొమ్మిది నాగవంశాలను రాసిన పీఠంపై ఉన్న చందనపు గిన్నెలో పగడ ముంచి పక్కనున్న పాలను తాగి, పేలాలను మింగింది. దాంతో తల్లి పాము ఆవేశం చల్లారిపోయింది. అనంతరం ఆమె ఎదుట పడగ విప్పి నిల్చుని ‘నువ్వు ఎవరి కుమార్తెవు?’ అని నాగు ప్రశ్నించింది. ఆమె బదులివ్వగానే, ‘నేను నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను చంపివేశాన’ని నాగు చెప్పింది. ఆమె ఎంతో చింతించి వారిని మళ్లీ బతికించాలని కోరింది. దీంతో నాగు ఆమెకు కొంచెం అమృతం ఇచ్చింది. అది తీసుకుని ఆమె పరుగున తండ్రి ఇంటికి వెళ్లి వారి నోట అమృతం పోసి మళ్లీ బతికించుకుంది.
అప్పటి నుంచి శ్రావణ శుద్ధ పంచమి నాడు పొలాలు దున్నరు. ఆనాడు ఇంకా కూరగాయలు తరుగుట, వంటలు వార్పులు నిషిద్ధములయ్యాయి. నాగరాజుకు పాలు నివేదించాలనే నియమం ఇప్పటికీ తెలుగునాట అన్నిచోట్లా ఆచారంలో ఉంది.
నాగపంచమికి సంబంధించి
ఇది మరో కథ.
పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఏడుగురు కోడళ్లు. కడపటి కోడలు తప్ప మిగతా వారంతా ఒకసారి తమ పుట్టినిళ్లకు వెళ్లారు. కడపటి కోడలికి తల్లిదండ్రులు లేరు. కనీసం కొద్ది రోజులు ఉంచుకునే బంధువులు కూడా లేరు. ఆమె పరమ భక్తురాలు. ఆదిశేషుడే తనకు దిక్కని చెప్పుకునేది. ఆమె భక్తికి సహస్ర పడగలు కలిగిన ఆదిశేషుడు కరుణించి ఓ వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఆమె మామ గారి వద్దకు వచ్చాడు. తాను ఆమె మేనమామనని, ఆమెను తనింటికి పంపాలని కోరాడు. ఇంతకాలం మీ మేనమామ ఏమయ్యాడని మామ కోడలిని ప్రశ్నించాడు. ఆమె శేషుని చలవతో ఏదో కథ చెప్పి తప్పించుకుంది. ఆ తరువాత వృద్ధుడు ఆమెను మామగారి అనుమతితో తనతో తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో ఒక ఎలుక కలుగు వద్ద వృద్ధుడు తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. ఆమెను తన పగడపై ఎక్కించుకుని నాగలోకానికి తీసుకెళ్లాడు. ఆమె కొంతకాలం ఆదిశేషుని ఇంట, బంధుమిత్రులతో పాటు నివసించింది. ఆమెను ఎవరూ కరవరాదని ఆదిశేషుడు కఠినంగా ఆదేశించాడు. కొంతకాలానికి ఆదిశేషుని భార్య ప్రసవించింది. పాము పిల్లలన్నీ ఇంటి నిండా తిరగసాగాయి. ఒకనాడు ఆ కోడలు ఒక బరువైన ఇత్తడి దీపాన్ని పట్టుకుని వెళ్తుండగా, దారికి అడ్డంగా పారాడుతున్న పాము పిల్లలను చూసి భయంతో దీపాన్ని జారవిడిచింది. దీంతో పాము పిల్లలకు గాయాలయ్యాయి. కొన్నిటికి తోకలు తెగిపోయాయి. మరికొంత కాలానికి ఆదిశేషుడు ఆమెను అత్తారింటికి పంపించి వేశాడు. అంతలో శ్రావణ మాసం వచ్చింది. కోడలు శుక్ల పంచమి నాడు ఒక పీటపై నాగరూపాలను తీర్చిదిద్ది పూజ చేసింది. ఆనాడే, కాకతాళీయంగా తోకలు తెగిన పాము పిల్లలు తమ విరూపానికి కారణం ఏమిటని తల్లిని అడిగాయి. ఒకామె ఇత్తడి దీపాన్ని జారవిడవటం వల్ల మీద పడి మీకు గాయాలయ్యాయని తల్లి పాము చెప్పింది. దీంతో పాము పిల్లలన్నీ పగ తీర్చుకోవడానికి కోడలి ఇంటికి వచ్చాయి. కానీ, ఆమె తమను రక్షించాలని భగవంతుడిని వేడుకోవడం చూసి తమ దుష్టచింతనను మానుకున్నాయి. అక్కడ నైవేద్యంగా ఉంచిన పాలను, పేలాలను ఆరగించి, పాలగిన్నెలో ఓ రత్నహారాన్ని వదిలి వెళ్లిపోయాయి.

శ్రావణ శుద్ధ షష్ఠి
ఆగస్టు 10, శనివారం

శ్రావణ శుద్ధ షష్ఠి కల్కి జయంతి దినంగా ప్రతీతి. శ్రావణ శుద్ధ షష్ఠి తిథి కల్కి జయంతి దినమని ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఉంది. అలాగే, ఈ రోజు గుహస్య పవిత్రారోపణమ్‍ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. సూపౌదన వ్రతం చేస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలలో రాశారు. ఈనాడు శివుడిని పూజించి పప్పన్నం నివేదించాలి. అనంతరం దానినే భుజించాలి. (సూప + ఓదనం= సూపౌదనం. సూప అంటే పప్పు. ఓదనం అంటే అన్నం).

శ్రావణ శుద్ధ సప్తమి
ఆగస్టు 11, ఆదివారం

శ్రావణ శుద్ధ సప్తమి తిథి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాల్లో ఉంది. ఇది సూర్యారాధనకు సంబంధించినది. ఇంకా ఈనాడు పాపనాశినీ సప్తమి (హస్తా నక్షత్రం వస్తే) వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో, అవ్యంగ సప్తమీ వ్రతం, భాస్కరస్య పవిత్రారోపణమని మరికొన్ని గ్రంథాల్లో ఉంది.
కాగా, సప్తమి తిథి 11, 12 తేదీల్లో (ఆది, సోమవారాలు) ఉంది.

శ్రావణ శుద్ధ అష్టమి
ఆగస్టు 13, మంగళవారం

శ్రావణ శుద్ధ అష్టమి తిథి దుర్గాపూజకు ఉద్ధిష్టమైనది. సాధారణంగా దుర్గాపూజకు ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చే అష్టమి అనుకూలమైనది. శ్రావణ శుద్ధ అష్టమి దుర్గాపూజకు విశేషమైనది. ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఈనాడు దుర్గాష్టమి అని ఉంది. ఈనాడు దుర్గాపూజను ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి నెలా రకరకాల పూలతో శివుని, దుర్గాదేవిని పూజించాలని శాస్త్ర వచనం. అందుకే ఈ అష్టమిని పుష్పాష్టమి అనీ అంటారు.

శ్రావణ శుద్ధ నవమి
ఆగస్టు 14, బుధవారం

కౌమార దశలో ఉన్న బాలికలు ప్రత్యేక పూజలు చేయడానికి ఒక తిథిని ఉద్దేశించారు. అదే శ్రావణ శుద్ధ నవమి తిథి. ఈ తిథికి ‘కౌమారీ నామక పూజనమ్‍’ అని పేరు. ఈ పేరును బట్టి ఇది కౌమార దశలో ఉన్న యువతులు ఆచరించే వ్రతంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి.

శ్రావణ శుద్ధ దశమి
ఆగస్టు 15, గురువారం

శ్రావణ శుద్ధ దశమి తిథి ఆశా దశమిగా ప్రసిద్ధి. ఈనాడు చేసే వ్రతాచరణ వల్ల సమస్త ఆశలు నెరవేరుతాయని ప్రతీతి. పగలు ఉపవాసం ఉండాలి. రాత్రి ఆశాదేవిని నెలకొల్పి పూజించాలి. ఏడాది పాటు ఈ విధంగా వ్రతాన్ని ఆచరించాలని నియమం.
ఈనాడు భారత స్వాతంత్య్ర దినోత్సవం. 1947, ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం లభించింది. అందుకే ఏటా ఈ రోజున జాతీయ పతాకాలను ఆవిష్కరించి, గౌరవ వందనాలను సమర్పిస్తారు. ఇక, ఇదే రోజు అరవింద యోగి జన్మతిథి. ఈయన 1872, ఆగస్టు 15న పశ్చిమబెంగాల్‍లో జన్మించారు. సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు. కవి, జాతీయవాది, యోగి, ఆధ్యాత్మిక గురువు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ ఈయన పాల్గొన్నారు. వందేమాతరం గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించినది ఈయనే. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా ఈయన అలీపూర్‍లోని కారాగారంలో శిక్ష అనుభవించారు. ఆ సమయంలోనే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులయ్యారు. యోగ, భగవద్గీతపై ఈయన పలు గ్రంథాలను రచించారు. ‘ది లైఫ్‍ డివైన్‍’ అనేది అరవిందుల ప్రసిద్ధ గ్రంథం.

శ్రావణ శుద్ధ ఏకాదశి
ఆగస్టు 16, శుక్రవారం

మహిజిత్తు అనే అతడు శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఆచరించిన వ్రతం ఫలితంగా అతనికి పుత్ర సంతానం కలిగింది. పుత్రుడిని ప్రసాదించిన ఏకాదశి కాబట్టి ఇది పుత్రదైకాదశి, పుత్రద ఏకాదశి అయింది. ఈ మేరకు ఈ వ్రతం వివరాలు ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉన్నాయి. సంతానం లేని వారు, సత్సంతానం కావాలనుకునే వారు ఈ ఏకాదశి తిథి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇక, శ్రావణ మాసంలో అతివలు నిర్వహించే వరలక్ష్మీ వ్రతం ఈనాడే. శ్రావణ శుద్ధ ఏకాదశి తిథితో కూడిన శుక్రవారం వరలక్ష్మీ వ్రత తిథి. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీదేవిని పూజించడం ఆచారంగా వస్తోంది. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీమహాలక్ష్మీ దేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ, వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని అందిస్తుందని నమ్మకం. అందుకే మహాలక్ష్మిని అష్టైశ్వర్యప్రదాయినిగా పూజిస్తారు. లక్ష్మీదేవి క్రీగంటి చూపులపై ఆధారపడే విశ్వం మొత్తం కొనసాగుతోందని శ్రీగుణరత్న కోశం చెబుతోంది. మహాలక్ష్మికి మహదానందం చేకూర్చడం కోసమే శ్రీహరి ఈ లోకాలను సృజించాడని భాగవతం వెల్లడిస్తోంది. భగవంతుని సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తోంది. సంకల్పం చేసేది హృదయస్థానం. విష్ణువు హృదయంలో కొలువుదీరి ఉండే అమృతవల్లి మహాలక్ష్మి కాబట్టి ఆమె సకల కార్యాలకు సంకల్పశక్తి. కార్యాల్ని జయప్రదంగా కొనసాగింపచేసే ధీయుక్తి. ‘లోకైక దీపాంకురమ్‍’ అని సిరులతల్లిని మనం ఆరాధిస్తాం. ఆమె ఎల్ల లోకాలకు ఏకైక దీపం. ఈ మూడు లోకాలు ఆమె కుటుంబం. సకల జీవరాశులు ఆమె సంతానం. ఆ కృప కోసమే ఈనాడు విశేష వ్రతమాచరిస్తారు.

శ్రావణ శుద్ధ ద్వాదశి
ఆగస్టు 17, శనివారం

శ్రావణ శుద్ధ ద్వాదశి తిథి దామోదర ద్వాదశిగా ప్రతీతి. ఈనాడు విష్ణు ప్రతిమను దానం చేస్తారు. దీనినే శ్రీధర పూజగా కూడా వ్యవహరిస్తారు.

శ్రావణ శుద్ధ త్రయోదశి
ఆగస్టు 17, శనివారం

శ్రావణ శుద్ధ త్రయోదశి కూడా ద్వాదశి ఘడియల్లోనే ఉంది. కాబట్టి శనివారం ద్వాదశి, త్రయోదశి తిథుల సంగమ దినం. శ్రావణ శుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశిగా ప్రసిద్ధి. ఇది అనంగుడికి ప్రీతికరమైనది. అనంగుడు అంటే మన్మథుడు అని అర్థం. ఈ తిథి నాడు అనంగ వ్రతం చేయాలని, రతీమన్మథులను నెలకొల్పి పూజించాలని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. మినుములతో చేసిన మినపసున్ని ఉండలు, పాలను నివేదించాలి. మైనపువత్తితో హారతినివ్వాలి. ఈనాడు ఆయనకు పవిత్రారోపణం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. . అలాగే, ఈ తిథి శని త్రయోదశి పర్వం కూడా. ఆయనకు ప్రీత్యర్థమైన నువ్వులు, నువ్వుల నూనెతో పూజించాలి.

శ్రావణ శుద్ధ చతుర్దశి
ఆగస్టు 18, ఆదివారం

శ్రావణ శుద్ధ చతుర్ధశి తిథి శివుడికి ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ చతుర్దశి నాడు శివునికి పవిత్రారోపణం చేయాలి. శివుడు లింగరూపి. కాబట్టి లింగవ్యాసం అంత కానీ, దాని ఎత్తు అంత కానీ లేక 12-8-4 అంగుళాల మేరకు కానీ పొడవు ఉండి, ముడి ముడికి మధ్య సమ దూరం ఉండి, ఆ ఖాళీలు 50, 38, 21 ఉండేలా దర్భలు వేలాడదీయాలి. ఈ పక్రియనే ‘శివ పవిత్రం’ అంటారు.

శ్రావణ శుద్ధ పూర్ణిమ
ఆగస్టు 19, సోమవారం

శ్రావణ శుద్ధ పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అనీ, రాఖీ పూర్ణిమ (రక్షాబంధన్‍) అనీ, జంధ్యాల పౌర్ణమి అనీ వ్యవహరిస్తారు.
జంధ్యాన్ని ధరించే వారు శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడే పాతది వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే వేద పరిభాషలో ఉపాకర్మ అంటారు. ఈ ఉపాకర్మనే యజ్ఞోపవీతంగానూ వ్యవహరిస్తారు. జంధ్యం అంటే యోగకర్మతో పునీతమైన దారం అని అర్థం. ఈ కారణంగానే పాల్కురికి సోమనాథుడు ఈ పూర్ణిమను నూలి పూర్ణిమగా వ్యవహరించాడు. నూలుతో తయారుచేసిన జంధ్యాన్ని ధరించే రోజు కాబట్టి ఆ విధంగా ఆయన వర్ణించారు. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు. ఈనాడు ఉపనయనం కూడా నిర్వహించే ఆచారం ఉంది.
రుతువులను అనుసరించి ప్రతి కార్యాన్ని ప్రారంభించిన మన పూర్వీకులు విద్యారంభానికి ఒక కాలాన్ని నిర్ణయించారు. అదే- శ్రావణ పూర్ణిమ.
ఈ రోజు ‘అధ్యాయోపాకర్మ’ జరుపుతారు. అంటే, వేదాధ్యయన ప్రారంభం. వేదాధ్యయన ఆరంభానికి చిహ్నంగా ప్రతి వేదంలోని ఆద్యంత రుక్కులను, ఉపనిషత్తుల ఆద్యంత వాక్యాలను పఠించాలి. ఇంటికి వచ్చి అధ్యయన హోమం ఆచరించాలి. మర్నాడు ఉపాకర్మాంగభూతంగా 1,008 సార్లు గాయత్రీ జపం చేయాలి. గాయత్రీ హోమం కూడా చేసే ఆచారం ఉంది. ఇది ఒకప్పటి ఆచారం. ప్రస్తుతం ఈ తిథి రాఖీ పూర్ణిమగానే ఎక్కువ ఆచారంలో ఉంది. దీనినే మహారాష్ట్ర ప్రాంతంలో నార్లీ పూర్ణిమగా వ్యవహరిస్తారు. ఈనాడు అక్కడ వరుణ దేవుని పూజ కోసం సముద్రుడిని పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో దీనినే పౌవతి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివ, విష్ణు, గణేశులను పూజిస్తారు. అలాగే, సర్వరోగ ఉపశమనం కోసం, సర్వ శుభాల కోసం ఏం చేయాలని ధర్మరాజు కృష్ణుడిని అడిగాడట. అందుకు కృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధన విధిని ఉపదేశించాడట. శాస్త్రం ప్రకారం రక్షాబంధనం భార్య భర్తకు కట్టాలని ఉన్నా.. ఆచరణలో మాత్రం చెల్లెలు తమ్ముడు, అన్నకు చెల్లెలు కట్టడం ఆచారంగా మారింది.
ఈనాడు ముంబై ప్రాంతంలో ప్రజలు కొత్త బట్టలు కట్టుకుని సాయంకాలం చౌపతి సముద్ర తీరానికి వెళ్లి వరుణదేవుని తృప్తి కోసం కొబ్బరికాయలు సమర్పిస్తారు. కాబట్టే దీనికి నారికేళ పూర్ణిమ అనీ, నార్లీ పూర్ణిమ అనే పేర్లూ ఉన్నాయి. ఇంకా పూణె, గుజరాత్‍ ప్రాంతాల్లోనూ గొప్ప ఉత్సవంగా శ్రావణ పూర్ణిమను జరుపుకుంటారు.
అలాగే, ఈనాడు హయగ్రీవ జయంతి కూడా జరుపుతారు. హయగ్రీవుడు అంటే గుర్రపు ముఖము కలవాడని అర్థం.
ఇక, శ్రావణ శుద్ధ పూర్ణిమ రాఖీ పూర్ణిమగానూ ప్రసిద్ధి. తనను రక్ష కోరి వచ్చిన సోదరిని బలి చక్రవర్తి ఆమెను రక్షిస్తూ, ఈ క్రమంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఎదురొడ్డి నిలుస్తాడు. అటువంటి మహావీరునితో తన సోదరుడిని పోలుస్తూ సోదరి తన సోదరుడికి రక్షనివ్వాలని కోరుతూ కుడిచేతికి ఒక దారపు పోగును కడుతుంది. అదే రాఖీగా ప్రసిద్ధి. సోదర – సోదరి ప్రేమకు ప్రతీకగా నిలిచే పర్వమిది. మన హిందూ సంప్రదాయంలో కుటుంబ అనుబంధాలను బలపరిచే అనేక పర్వాలను ఏర్పరిచారు. అటువంటి అనేకానేక పర్వాల్లో రాఖీ పౌర్ణమి ఒకటి.

శ్రావణ బహుళ పాడ్యమి
ఆగస్టు 20, మంగళవారం

శ్రావణ బహుళ (కృష్ణ) పాడ్యమి తిథి నాడు ధనావాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఇది మొదలు భాద్రపద పూర్ణిమాంతం వరకు ఆచరించాల్సిన మాస వ్రతమిది. దీనినే శివ వ్రతమని కూడా అంటారు.

శ్రావణ బహుళ విదియ
ఆగస్టు 21, బుధవారం

శ్రావణ బహుళ విదియ నాడు అశూన్య వ్రతం ఆచరిస్తారు. ఈ మేరకు పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో దీని వివరాలు ఉన్నాయి. ఈ రోజు మొదలు నాలుగు నెలలు చంద్రార్ఘ్యాది కార్యకలాపాలు చేస్తూ చాతుర్మాస్య వ్రతం చేయాలని గ్రంథాంతరాలలో ఉంది. అందుచేతనే దీనిని చాతుర్మాస్య ద్వితీయ అని కూడా అంటారు. అయితే, ప్రస్తుతం ఈ తిథి శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన తిథిగా ప్రసిద్ధమై ఉంది. ఈనాడు విష్ణువు వాకుడు చెట్టు పరుపుగా లక్ష్మితో కూడి శయనిస్తాడని ప్రతీతి. ఈనాడు వీరిద్దరిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుందని అంటారు.

శ్రావణ బహుళ తదియ
ఆగస్టు 22, గురువారం

శ్రావణ బహుళ తదియ తిథి నాడు తుష్టి ప్రాప్తి తృతీయా వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో కబ్జలీ తృతీయా వ్రతం చేయాలని ఉంది. అయితే, ఈ వ్రతాచరణ వివరాలు మాత్రం తెలియరావడం లేదు.

శ్రావణ బహుళ చవితి
ఆగస్టు 23, శుక్రవారం

శ్రావణ బహుళ చవితి నాడు సంకష్ట చతుర్థీ వ్రతం చేస్తారని స్మ•తి కౌస్తుభంలో ఉంది. దీనికే ‘బహుళా చతుర్థి’ అనే పేరూ ఉంది. గోపూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీ చెబుతోంది. సంకష్ట చతుర్థి వ్రతాచరణ వల్ల సమస్త కష్టాలు తొలగిపోతాయని ఫలశ్రుతి. ఇది గణపతి సంబంధ తిథి. శివుడు, రావణుడు, రాముడు, ధర్మరాజు, పార్వతి, దమయంతి, అహల్య తదితరులు సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించినట్టు వ్రత కల్పంలో ఉంది.

శ్రావణ బహుళ పంచమి
ఆగస్టు 24, శనివారం

శ్రావణ బహుళ పంచమి తిథి రక్షా పంచమి వ్రత దినమని ఆమాదేర్‍ జ్యోతిషీ చెబుతోంది. ఈనాడు నాగపూజ చేసే ఆచారం కూడా ఉంది.

శ్రావణ బహుళ షష్ఠి
ఆగస్టు 24, శనివారం

శ్రావణ బహుళ పంచమి తిథి ఘడియల్లోనే షష్ఠి తిథి కూడా ఉంది. శ్రావణ బహుళ షష్ఠి తిథి బలరామ జయంతిగా ప్రసిద్ధి. ఈ తిథి నాడు హల షష్ఠి వ్రతం ఆచరించాలని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. హలం అంటే నాగలి. ఇది వ్యవసాయ పనిముట్టు. ఇది శ్రీకృష్ణుడి అన్నగారైన బలరాముడి ఆయుధ చిహ్నం. హలధారి (నాగలి చేతబట్టి ఉండేవాడు) అయిన బలరాముడిని కర్షకులు తమ ప్రతినిధిగా, తమ దైవంగా భావిస్తారు. కాబట్టి ప్రధానంగా రైతులు ఈనాడు బలరాముడిని పూజిస్తారు. కర్షకులకు నాగలే దైవం. దానిని పూజించడానికి శ్రావణ బహుళ షష్ఠి ఒక అనువైన పర్వదినం.

శ్రావణ బహుళ సప్తమి
ఆగస్టు 25, ఆదివారం

శ్రావణ బహుళ సప్తమి నాడు శీతలా సప్తమి వ్రతం ఆచరించాలని అంటారు. అలాగే, సప్తమి తిథి నాడు సూర్యుడిని విశేషంగా ఆరాధిస్తారు.

శ్రావణ బహుళ అష్టమి
ఆగస్టు 26, సోమవారం

శ్రావణ బహుళ అష్టమి బాలకృష్ణుడి జన్మతిథి. దీనినే కాలాష్టమి అని కూడా వ్యవహరిస్తారు. కృష్ణాష్టమి అంటే- కృష్ణ, అష్టమి. ఇది కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. కృష్ణుడు జన్మించిన అష్టమి. కృష్ణుని జన్మతిథి కాబట్టి ఇది జన్మాష్టమిగానూ ప్రసిద్ధి. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు. అందుచేత దీనిని గోకులాష్టమి అనీ అంటారు. కృష్ణ జయంతి నాడు ఉపవసించి ఆయనను పూజిస్తే సకల పాపాలు హరించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ కృష్ణ పక్ష అష్టమి నాటి రాత్రికి శాక్తేయ సిద్ధాంతంలో ‘మోహ రాత్రి’ అని పేరు. కృష్ణ జన్మకు పూర్వమే ఈ రాత్రి ఉపాసకులకు ప్రధానమైనది. ప్రత్యేక మహిమ కలిగిన రాత్రి ఇది. కృష్ణుడు పుట్టిన సమయానికే నంద గోకులంలో యశోదాదేవికి పుత్రికగా మహా శక్తి యోగమాయ జన్మించింది. ఆ తల్లి పుట్టిన అష్టమి కూడా ఇదే. కృష్ణుడు జన్మించిన తిథి ఘడియలు కృష్ణాష్టమి అయితే, మహాశక్తి యోగమాయ జన్మించిన అదే తిథి కాలాష్టమి తిథి అయ్యింది. దైవీ గుణ సంపద గలవారి మోహాది మాయాజాలాన్ని క్షయింప చేసే మోక్ష కారకుడు, జగన్మోహనుడు శ్రీకృష్ణుడు. ఆ అవతారం అగాధమైనది. అనంతమైనది. పరమాత్మ తత్వాన్ని, ఉపనిషత్‍ రహస్యాలను తన లీలల ద్వారా ప్రకటించిన భగవానుడు ఆయన. ప్రేమ, రౌద్ర, వీర, కరుణ, హాస, శాంతాధి భావాలను ప్రకటించిన గోవిందుడి గాథ- వివిధ కోణాల్లో దివ్యత్వాన్ని ఆవిష్కరించింది.
కృష్ణుడిని పూజిస్తే ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి, మహా జయం కలుగుతాయని స్కంద పురాణోక్తి. కృష్ణ జయంతిని ఆచరించని వారు మహా పాపాన్ని పొందుతారని, యమపాశంలో చిక్కుకుంటారని, మరుజన్మలో పాములై పుడతారని, క్రూర రాక్షసులుగా జన్మిస్తారని స్కాందాది పురాణాల్లో ఉంది. కృష్ణాష్టమి నాడు చంద్రుడికి అర్ఘ్యమివ్వాలని, బంగారంతో కానీ, వెండితో కానీ ద్వాదశాంగుల విస్తారమైన చంద్రబింబం చేసి వెండి, బంగారుపాత్రలతో దానిని ఉంచి, పూజించి అర్ఘ్యమివ్వాలని, అలా చేస్తే సర్వ కోరికలు నెరవేరుతాయని భవిష్యోత్తర పురాణంలో ఉంది. కృష్ణావతారం దశావతారాల్లో 8వది. కృష్ణ చరితం హరివంశ భాగవత విష్ణు పురాణా ల్లో విపులంగా ఉంది. ఆబాల గోపాలానికి కృష్ణుని లీలలు, కొంటె చేష్టలు తెలిసినవే. కృష్ణుడు లోకోత్తర సుందరమూర్తి. మహా బల పరాక్రమశాలి. రాజనీతి నిపుణుడు. తత్త్వవేత్త. ఆయన ప్రపంచానికి అందించిన గొప్ప గ్రంథం- భగవద్గీత. కృష్ణుని కాలంలో కంసుడు, నరకాసురుడు, కాలయవనుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన రాజులు ఎవరికి వారు చక్రవర్తులమని, రాజాధిరాజులమని చెప్పుకొంటూ దుష్పరిపాలన సాగించేవారు. కృష్ణుడు తాను రాజ్యాధికారం కోరక, పాండవులచే మిగతా రాజులను హతులను చేయించి ధర్మరాజును పట్టాభిషిక్తుడిని చేశాడు. కృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రాన రాత్రి జన్మించాడు కనుక అష్టమి నాడు పగలంతా ఉపవసించి, సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగిస్తారు. వీధులలో ఉట్లు కట్టి వాటిని కొట్టే ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇదే ఉట్ల పండుగగానూ ప్రసిద్ధి.
అవతార కాలంలోనే కాక, ఆ తరువాత కూడా తనను స్మరించి, ఆరాధించిన, కీర్తించిన యోగుల్ని తరింప చేసిన భగవానుడు కృష్ణుడు. శుక యోగి, ఆదిశంకరులు, రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు, వల్లభాచార్య, జయదేవుడు, పోతన, లీలాశుకుడు, నారాయణ తీర్థులు, మధుసూదన సరస్వతి, మీరాబాయి, తుకారాం, సక్కుబాయి, సూరదాసు.. ఇలా ఎందరెందరో కృష్ణ యోగులున్నారు. వారందరూ సాత్విక, మధుర, దివ్య భక్తి మార్గంలో జ్యోతి స్వరూపులై లోకాన వెలుగులు నింపారు.

శ్రావణ బహుళ నవమి
ఆగస్టు 27, మంగళవారం

శ్రావణ బహుళ నవమి నాడు చండికా పూజ చేస్తారు. అలాగే, ఈ తిథి అరవింద యోగి జన్మ తిథి. కౌమార పూజ కూడా ఆచరిస్తారు. రామకృష్ణ పరమహంస వర్ధంతి దినం కూడా ఈ రోజే. అలాగే, నవి నాడు కొన్ని ప్రాంతాలలో రోహిణీ వ్రతం కూడా ఆచరిస్తారు.

శ్రావణ బహుళ ఏకాదశి
ఆగస్టు 29, గురువారం

శ్రావణ బహుళ ఏకాదశి అజైకాదశి అనీ అంటారు. రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి నాడు విద్యుక్తంగా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతను తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడు. ఇంకా ఈనాడు కామికా వ్రతం, శ్రీధర పూజ చేస్తారని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. కామికా వ్రతం ఆచరించే దినం కాబట్టి ఈ తిథిని కామికా ఏకాదశి అని కూడా అంటారు.

శ్రావణ బహుళ ద్వాదశి
ఆగస్టు 30, మంగళవారం

శ్రావణ బహుళ ద్వాదశి నాడు రోహిణీ ద్వాదశీ వర్షం అనే పూజ చేస్తారు. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.

శ్రావణ బహుళ త్రయోదశి
ఆగస్టు 31, శనివారం

శ్రావణ బహుళ త్రయోదశి తిథి ద్వాపర యుగాది అని ఆమాదేర్‍ జ్యోతిషీ చెబుతోంది. ఈనాటి నుంచి పుబ్బ కార్తె ప్రారంభమవుతుంది.

Review లక్ష్మీ శోభ.. శ్రీకృష్ణ ప్రభ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top