ఆంగ్ల సంవత్సరాల వరుసలో జ్యేష్ఠ మాసం.. జూన్ నెల కింద వస్తుంది. ఇది ఆంగ్లమానం ప్రకారం ఆరవ నెల అయితే, తెలుగు సంవత్సరాల వరుసలో మూడవ మాసం. పితృ దేవతల రుణం తీర్చుకోవడానికి, పితృదేవతల పూజలకు, శ్రాద్ధాధికాలకు జ్యేష్ఠ మాసం విశిష్టమైనది. ఈ నెలలోనూ కొన్ని ముఖ్యమైన పర్వాలు, వ్రతాలు ఆచరించవలసినవి ఉన్నాయి. జ్యేష్ఠ మాసం సృష్టికర్త బ్రహ్మకు ప్రీతికరమైన మాసమని అంటారు. ఏరువాక పున్నమి, రంభా వ్రతం, నిర్జల ఏకాదశి వంటి పర్వాలు, వ్రతాలు ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథులు.
2022- జూన్ 1, బుధవారం, జ్యేష్ఠ శుద్ధ విదియ నుంచి 2022- జూన్ 30, గురువారం, ఆషాఢ శుద్ధ పాడ్యమి వరకు..
శ్రీశుభకృతు నామ సంవత్సరం- జ్యేష్ఠ మాసం- గ్రీష్మ రుతువు- ఉత్తరాయణం
జ్యేష్ఠ మాసం అంతగా శుభ ముహూర్తాల కాలం కాదని అంటారు. ఈ మాసంలో గృహ నిర్మాణాన్ని ప్రారంభించకూడదని మత్స్య పురాణం చెబుతోంది. కానీ జ్యేష్ఠ మాసపు విశిష్టత జ్యేష్ఠ మాసానికి ఉంది. ముఖ్యంగా పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, పాపాలను హరించుకోవడానికి, దైవసేవలో తరించడానికి ఉద్దేశించిన కొన్ని పుణ్య తిథులు ఈ మాసంలో ఉన్నాయి. అలాగే, స్త్రీలకు సౌభాగ్యాన్నిచ్చే వ్రతాలకు జ్యేష్ఠ మాసం పెట్టింది పేరు. రంభా వ్రతం, రంభా తృతీయా, సావిత్రీ వ్రతం, వట సావిత్రీ వ్రతం వంటివన్నీ మహిళకు మంగళకరమైన ఫలితాలనిచ్చే వ్రతాలే. చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి జ్యేష్ఠ మాసమనే పేరు వచ్చింది. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో తనను ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని జ్యేష్ఠ మాసం పొడవునా పూజించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. పార్వతీదేవి ఆచరించిన ‘రంభా వ్రతం’, వివాహితలు ఆచరించే ‘అరణ్యగౌరీ వ్రతం’, గంగానది స్నానంతో పది రకాల పాపాలను హరించే ‘దశపాప హర దశమి’, ‘త్రివిక్రమ ఏకాదశి’ పేరుతో పిలిచే ‘నిర్జల ఏకాదశి’ ఈ మాసంలో వచ్చే ప్రత్యేక తిథులు. అలాగే సూర్యుడిని ఆరాధించే ‘మిథున సంక్రమణం’, వ్యవసాయ సంబంధ పర్వమైన ‘ఏరువాక పౌర్ణమి’ కూడా ఈ నెలలోని విశేషాలే. ప్రధానంగా వ్యవసాయానికి జ్యేష్ఠ మాసమే శ్రేష్ఠమైనదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అందరికీ అన్నం పెట్టే ఫలసాయానికి బీజం పడేది ఈ మాసంలోనే. అందుకే రైతులు ఆనందంగా ‘ఏరువాక’ జరుపుకుంటారు. వృషభ పూజలు ఈ మాసంలో
విశేషంగా జరుగుతాయి. తమకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటే పశువులకు కృతజ్ఞతా సూచనకంగా రైతులు జ్యేష్ఠంలో వృషభ పూజలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే, వ్యవసాయంలో ప్రధానమైన ఖరీఫ్ సీజన్‍కు రైతులు శ్రీకారం చుట్టేది ఈ మాసంలోనే. ఇక, దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్య ఫలాలను ప్రసాదించే ‘జ్యేష్ఠ పౌర్ణమి’, శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింప చేసే ‘అపర ఏకాదశి’ ఈ మాసంలో ఆధ్యాత్మిక సాధనాపరులకు ఉన్నతిని కలిగిస్తాయి. అత్యంత విశిష్టమైనదిగా చెప్పే ‘యమునా నది పుష్కరాలు’ ఈ మాసంలోనే ఆరంభమవుతాయి. ఇక, జూన్ నాటికి ఎండలు మరింత మండిపోతాయి. గ్రీష్మతాపంతో మానవాళే కాదు పశుపక్ష్యాదులు అల్లాడిపోతాయి. అయితే, నెల చివరి నాటికి వాతావరణం కొంత చల్లబడుతుంది. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వాల పరిచయం..
జ్యేష్ఠ శుద్ధ విదియ/
జూన్ 1, బుధవారం
జ్యేష్ఠ శుద్ధ విదియ నుంచి జూన్ నెల ప్రారంభమవుతుంది. ఈ తిథి నాడు ఆచరించాల్సిన పూజాధికాలు, వ్రతాలు ప్రత్యేకించి ఏమీ లేవు.
ఇది భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వర్ధంతి దినం.
జ్యేష్ఠ శుద్ధ తదియ/రంభా వ్రతం
జూన్ 2, గురువారం
జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు ‘రంభా వ్రతం’ ఆచరిస్తారు. దీనినే ‘రంభా తృతీయ’గా స్మ•తి కౌస్తుభం, తిథితత్త్వం, పురుషార్థ చింతామణి, చతుర్వర్గ చింతామణి తదితర వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఇంకా రాజ్య వ్రతం, త్రివిక్రమ తృతీయ వ్రతం తదితర వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారని తెలుస్తోంది. అయితే, వీటన్నిటిలో ‘రంభా వ్రతం’ కొంత వరకు ఆచరణలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ రంభా వ్రత కథ..
తపోనిష్టలో ఉన్న శివుడికి ఉపచారాలు చేసేందుకు హిమవంతుడు తన కుమార్తె పార్వతిని అప్పగించాడు. పార్వతిపై శివుడికి ప్రేమ కలగడానికి ఆ సమయంలో మన్మథుడు బాణాలు ప్రయోగించాడు. దీంతో శివుడికి చిత్తం చెదిరింది. పిమ్మట ఆగ్రహించిన శివుడు తన మూడో కన్ను తెరిచి చూశాడు. మన్మథుడు భస్మమయ్యాడు. శివుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
జరిగిన ఉదంతంతో పార్వతి చిన్నబుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. తల్లిని పట్టుకుని జరిగింది చెప్పి బావురుమంది. తల్లి ఓదార్చి, ఆమెను తండ్రి అయిన హిమవంతుని వద్దకు తీసుకు వెళ్లింది. అంతలో అక్కడికి సప్త మహా మునులూ వచ్చారు. వారికి హిమవంతుడు తన కుమార్తె సంగతి చెప్పాడు.
అప్పుడు ఆ మునులలో ఒకరైన భృగువు- ‘బిడ్డా! ఒక వ్రతం ఉంది. దానిని ఆచరిస్తే నీకు శివుడే భర్త అవుతాడు’ అని అన్నాడు.
పార్వతి- ‘మహాభాగా! ఆ వ్రతం ఎలా చేయాలి?’ అని అడిగింది.
భృగువు- ‘బిడ్డా! ఆ వ్రతాన్ని పెద్దలు ‘రంభా వ్రతం’ అని అంటారు. రంభ అంటే అరటి చెట్టు. ఆ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు ఆచరించాలి. నాటి ఉదయాన్నే స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి, పంచవన్నెల ముగ్గులు పెట్టాలి. రంభకు అధిష్ఠాన దేవత సావిత్రి. కాబట్టి అరటి చెట్టు కింద సావిత్రీ దేవిని పూజించాలి’ అని వివరించాడు.
‘మహాశయా! అరటిచెట్టుకు, సావిత్రీదేవి అధిష్టాన దేవత ఎలా అయ్యింది?’ అని పార్వతి ప్రశ్నించింది.
‘బిడ్డా! సావిత్రి, గాయిత్రి అని బ్రహ్మదేవుడికి ఇద్దరు భార్యలు. సావిత్రీదేవి సౌందర్య గర్వంతో ఒకసారి బ్రహ్మ వద్దకు వెళ్లడం మానేసింది. గాయిత్రి ఆమెకు నచ్చ చెప్పింది. అయినా సావిత్రి తన మంకుపట్టు వీడలేదు. దీంతో బ్రహ్మకు కోపం వచ్చింది. ఈ లోకాన్ని వదిలి మానవ లోకంలో బీజం లేని చెట్టువై పుట్టు అని సావిత్రిని శపించాడు. దీంతో సావిత్రికి పశ్చాత్తాపం కలిగింది. బ్రహ్మ కాళ్ల మీద పడి మన్నించాలని ప్రాథేయపడింది. గత్యంతరం లేక భూలోకాన అరటిచెట్టుగా పుట్టింది. ఆ చెట్టు రూపంలోనే ఐదేళ్లు బ్రహ్మ కోసం తపస్సు చేసింది. మనసు కరిగిన బ్రహ్మ ఆమెకు జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు ప్రత్యక్షమయ్యాడు.
‘నువ్వు ఒక అంశతో అరటిచెట్టును ఆశ్రయించుకుని ఉండు. అరటి చెట్టు ద్వారా నిన్ను పూజించే వారి కోరికలు ఈడేరుతాయి. ఇక నువ్వు నాతో సత్యలోకానికి వచ్చెయ్’ అని బ్రహ్మ ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ విధంగా సావిత్రికి శాప విమోచన అయిన దినం కాబట్టి జ్యేష్ఠ శుద్ధ తదియ పర్వదినమైంది’ అని భృగువు పార్వతికి వివరించాడు.
‘స్వామీ! ఈ వ్రతాచరణ విధం వివరించండి’ అని పార్వతి భృగువును కోరింది.
అప్పుడు భృగువు రంభా వ్రత నియమాల గురించి ఇలా వివరించాడు.
‘ముగ్గులు పెట్టిన అరటి చెట్టు కింద మంటపం వేయాలి. దానిని సరస పదార్థ సంపన్నం చేయాలి. అరటిచెట్ల నీడలో పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని సావిత్రి స్తోత్రం చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. మర్నాటి నుంచి రాత్రి జాగరణ అవసరం లేదు. పద్మాసనస్థ అయి, పగలు సావిత్రిని స్తుతిస్తూ, రాత్రులు అరటి చెట్ల కిందనే విశ్రమిస్తూ ఉండాలి. ఇలా నెల రోజులు చేసి ఆపై సరస పదార్థ సంపన్నమైన ఆ మంటపాన్ని పూజ్య దంపతులకు దానం చేయాలి. ఈ వ్రతాన్ని ఇంతకు మునుపు లోపాముద్ర చేసి భర్తను పొందింది’.
భృగువు చెప్పిన విధంగా పార్వతి రంభా వ్రతాన్ని ఆచరించింది. ఈ దీక్షకు శివుడు మెచ్చి ఆమెను పెళ్లాడాడు.
పద్మాసనం వేసుకుని కూర్చుని తపస్సు చేయాలనే చోట ‘కృత్యసార సముచ్ఛయం’ అనే గ్రంథంలో పంచాగ్ని సాధన చేయాలని ఉంది. పంచాగ్ని సాధన అనగా, నాలుగు పక్కలా నిప్పుల గుండాలు ఉంచుకుని తాను సూర్యుని వైపు రెప్పవేయకుండా చూస్తుండాలి. ఇది కఠోర దీక్ష.
రంభా వ్రతం ఆవిర్భావాన్ని బట్టి ఇది స్త్రీలకు ఉద్ధిష్టమైనదని తెలుస్తోంది. అరటిచెట్ల నీడన జ్యేష్ఠ శుద్ధ తదియ మొదలు ఆషాఢ శుద్ధ తదియ వరకు నెల రోజుల పాటు నివసించడం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వేసవిలో పగటి పూట చెట్ల నీడ దాహ తాపాన్ని తగ్గిస్తుంది. చల్లగా ఉంటుంది.
మన దేశం మీదికి దండెత్తి వచ్చిన అలెగ్జాండర్.. ఇక్కడి మునులు కొందరు ఈ చెట్ల ఫలాలు మాత్రమే తింటూ, ఈ చెట్లనే నివాసంగా చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాడట. అందుచేతనే అరటికి గ్రీకు భాషలో ‘సాపియంటమ్’ అనే పేరు పెట్టారు. దీనికి ‘జ్ఞానం కలది’ అని అర్థం. దీనిని బట్టి అరటి చెట్టు నీడ జ్ఞానదాయిని అని గ్రీకులు కూడా భావించినట్టు తెలుస్తోంది.
ఇక, రంభా వ్రతమే కాక, అరటి చెట్టుతో ముడిపడిన వ్రతం మరొకటి ఉంది. దీనిని ‘కదళీ వ్రతం’ అంటారు. అయితే, దీనిని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు కానీ, నాడు వీలు కాకపోతే కార్తీక శుద్ధ చతుర్దశి నాడు కానీ చేస్తారు. ఈ వ్రతం చేస్తే స్త్రీలు సౌభాగ్యవంతులై చిరకాలం జీవిస్తారని ప్రతీతి. అలాగే, ఈనాడు మహారాజా ప్రతాప్ జయంతి తిథి కూడా.
ఇంకా, జూన్ 2, ఉమ్మడి ఆంధప్రదేశ్ పునర్విభజన దినం. 2014లో ఉమ్మడి ఏపీ- ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడింది. అలాగే, ఇదే రోజు తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.
జ్యేష్ఠ శుద్ధ చతుర్థి/ఉమా చతుర్థి
జూన్ 3, శుక్రవారం
జ్యేష్ఠ శుద్ధ చవితి తిథి నాడు ఉమాపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో వివరించారు. అందుకే దీనిని ఉమా చతుర్థి అని కూడా అంటారు. ఈనాడు శుక్లా దేవిని పూజించాలని కూడా అంటారు. అలాగే, ఈ తిథిని గణేశ చతుర్థి తిథిగానూ భావిస్తారు. సాధారణంగా చవితి తిథి గణపతి సంబంధమైనదిగా భావిస్తారు.
జ్యేష్ఠ శుద్ధ పంచమి
జూన్ 4, శనివారం
జ్యేష్ఠ శుద్ధ పంచమి తిథి పితృ దేవతలను విధిగా పూజించాలని ఆయా గ్రంథాలలో ఉంది.
జ్యేష్ఠ శుద్ధ షష్ఠి/స్కంద షష్ఠి
జూన్ 5, ఆదివారం
జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు అరణ్య గౌరీ వ్రతం, వింధ్యవాసినీ పూజ చేయాలని ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. అరణ్యాల్లో, కొండల్లో గౌరిని పూజించే వారికి సౌభాగ్యం కలుగుతుందని అంటారు. అలాగే, ఈనాడు కుమారస్వామిని పూజించడం కూడా పుణ్యప్రదం. ఈ షష్ఠి తిథికి స్కంద షష్ఠి అని పేరు. స్కందుడు అంటే కుమారస్వామి.
జ్యేష్ఠ శుద్ధ సప్తమి
జూన్ 7, మంగళవారం
జ్యేష్ఠ శుద్ధ సప్తమి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. అలాగే, ఈనాడు వరుణ పూజ చేయాలని మరికొన్ని గ్రంథాలలో ఉంది.
జ్యేష్ఠ శుద్ధ అష్టమి
జూన్ 8, బుధవారం
జ్యేష్ఠ శుద్ధ అష్టమి తిథి దుర్గాపూజకు ఉద్ధిష్టమైన తిథి. అందుకే దీనిని దుర్గాష్టమి అనీ అంటారు. ఈ తిథినే త్రిలోచనాష్టమిగా ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో వర్ణించారు. ఈ తిథి నాటి నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది.
జ్యేష్ఠ శుద్ధ నవమి
జూన్ 9, గురువారం
జ్యేష్ఠ శుద్ధ నవమి నాడు శుక్లాదేవిని పూజించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు శుక్లాదేవిని ‘బ్రహ్మణీ నామ్యా ఉమాయా: పూజా శుక్లాదేవి’ అని స్తుతించాలి.
Review విశిష్టం.. జ్యేష్ఠం.