విశేషం.. ‘చైత్ర’ఫలం

2023- ఏప్రిల్‍ 1, శనివారం, చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి 2023- ఏప్రిల్‍ 30, ఆదివారం, వైశాఖ శుద్ధ దశమి వరకు..
శోభకృతు నామ సంవత్సరం-చైత్రం-వైశాఖం- వసంత రుతువు- ఉత్తరాయణం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో నాలుగో మాసం- ఏప్రిల్‍. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర – వైశాఖ మాసాల కలయిక. చైత్ర మాసంలోని కొన్ని రోజులు, వైశాఖ మాసంలోని మరికొన్ని రోజులు ఉంటాయి. ఏప్రిల్‍ 20వ తేదీ వరకు చైత్ర మాస తిథులు.. ఆపై ఏప్రిల్‍ 21వ తేదీ నుంచి వైశాఖ మాస తిథులు కొనసాగుతాయి. కామద ఏకాదశి, మదన పూర్ణిమ, వల్లభాచార్య జయంతి, రామానుజ జయంతి, ఆదిశంకరుల వారి జయంతి, వరూధునీ ఏకాదశి, హనుమజ్జయంతి అక్షయ తృతీయ వంటివి ఈ మాసంలోని ప్రత్యేక పండుగలు, పర్వాలు..

ఏప్రిల్‍ 1, చైత్ర శుద్ధ ఏకాదశి, శనివారంతో ప్రారంభమయ్యే ఏప్రిల్‍ మాసం.. ఏప్రిల్‍ 30, వైశాఖ శుద్ధ దశమి, ఆదివారంతో ముగుస్తుంది. ఏప్రిల్‍ 23 వరకు చైత్ర మాస తిథులు.. తదుపరి వైశాఖ మాస తిథులు ఉంటాయి. చంద్రుని గతిని, ఆ గతిలో చంద్రునికి సన్నిహితంగా ఉండే ప్రధాన నక్షత్రాలను- చంద్రుడు ఆ నక్షత్రాలను సమీపించడంతో ప్రకృతిలో కలిగే మార్పులను బట్టి ఆయా మాసాలకు ఆయా పేర్లు వస్తాయి. చంద్రుని గతి ఆధారంగా నక్షత్ర మండలానికి ఆయా పేర్లు పెట్టుకుని ఆ మండలాలలో చంద్రుడు ప్రవేశించినపుడు ఆ నెలకు ఆయా నక్షత్రాల పేర్లను మన పెద్దలు పెట్టారు. చిత్త నక్షత్రంలో పూర్ణ చంద్రుడున్న మాసం చైత్రమైతే.. విశాఖ నక్షత్రాన పూర్ణ చంద్రుడున్న మాసం వైశాఖమూ అవుతుంది. అలా చంద్రుడు విశాఖ నక్షత్రంలో ప్రవేశించినపుడు పుట్టినదే వైశాఖ మాసం. శ్రీ మహా విష్ణువు లీలా విలాసాలకు ఈ మాసం చిరునామా. ఆయన దశావతారాల్లోని విశిష్టమైన మూడు అవతారాల జయంతులు వైశాఖ మాసంలోనే వస్తాయి. ఇంకా శంకర జయంతి, రామానుజ జయంతి తిథులు ఈ మాసంలోనే వస్తాయి. ఈ నెలలో గృహ నిర్మాణం సర్వ శుభప్రాప్తి అని ప్రతీతి. ఇంకా అక్షయ తృతీయ వంటి సర్వ శుభకారక తిథి ఈ మాసంలోనిదే. ఈ నెలలో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అటు వాసంత సమీరాలు.. ఇటు వైఖాస మాసపు వెలుగులు వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతాయి. చెట్లు ఆకులు రాల్చే కాలమిది. అయినా పూలు మాత్రం విరబూస్తాయి. ఎటుచూసినా వసంత పరిమళాలు వెదజల్లుతుంటాయి. ఇది మాధవునికి (విష్ణువు) అత్యంత ఇష్టమైన మాసం. మరెన్నో తిథులకు, పర్వాలకు నెలవైన వైశాఖ మాసం నుంచే ఎండలు ముదురుతాయి. క్రమంగా వాతావరణం వేడెక్కుతుంది. ఇక ఈ నెల ప్రారంభంలోని మొదటి సగం రోజులు తెలుగుమానం ప్రకారం చైత్రమాసంలోనివి. మిగతా సగం రోజులు వైశాఖ మాసంలోనివి. ఆ రోజుల్లో వచ్చే తిథులు.. ఆ తిథుల్లో వచ్చే పర్వాల విశేషాలు..

చైత్ర శుద్ధ ద్వాదశి/కామద ఏకాదశి
ఏప్రిల్‍ 1, శనివారం

చైత్ర శుద్ధ ద్వాదశి నాడు సాధారణంగా విష్ణు దమనోత్సవం నిర్వహించాలని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. దీనిని వాసుదేవార్చనగా వ్యవహరిస్తారు. మన పంచాంగకర్తలు మాత్రం ఈనాటి వివరణలో వామన ద్వాదశి అని రాస్తారు. వామనుడిని లేదా విష్ణువును లేదా వాసుదేవుడిని ఈనాడు దమనంతో పూజించాలి. చైత్ర శుద్ధ ద్వాదశి గొప్పదనం గురించి పద్మ పురాణంలో కొంత ప్రస్తావన ఉంది. ఏకాదశి నాడే క్షీరసాగర మథనం ప్రారంభమైంది. ఏకాదశి మర్నాడు ద్వాదశి నాడు ఈ పక్రియలో భాగంగా దేవతలు పాల సముద్రాన్ని మథించగా లక్ష్మీదేవి నాలుగు చేతులలో రెండు చేతులతో బంగారు పద్మాలను, మిగతా రెండు చేతులతో ఒక సువర్ణ పాత్రను, మాదీ ఫలాన్ని పట్టుకుని ఆవిర్భవించింది. అనంతరం చంద్రుడు జన్మించాడు. ఆ సందర్భంలో నారాయణుడు దేవతలను ఉద్దేశించి ఇలా అన్నాడు- ‘ద్వాదశి నాడు లక్ష్మీసహితుడనైన నన్ను తులసీ దళాలతో విశేషంగా పూజిస్తారు. కాబట్టి ద్వాదశి తిథి నాకు మిక్కిలి ప్రియమైనది. ఇది మొదలు జనులు ఏ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాటి ప్రాత:కాలాన శ్రద్ధా భక్తులతో లక్ష్మీసహితుడనైన నన్ను తులసితో పూజిస్తారో వారు స్వర్గలోకాన్ని పొందుతారు. ద్వాదశి ధర్మార్థ కామ మోక్షాలను నాలుగింటిని ఇచ్చేది’ అని పలికాడు. కాగా, చైత్ర శుద్ధ ద్వాదశి ఘడియలు ఏప్రిల్‍ 2, ఆదివారం మొదలై ఏప్రిల్‍ 3, సోమవారం వరకు కూడా కొనసాగుతున్నాయి.

చైత్ర శుద్ధ ఏకాదశి/వామన ద్వాదశి
ఏప్రిల్‍ 2, ఆదివారం

చైత్ర శుద్ధ ఏకాదశి తిథి కామద ఏకాదశిగా ప్రసిద్ధి. తిథులన్నిటిలోకీ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఏకాదశి సాధారణంగా ఉపవాసాల రోజు. ఏకాదశి తిథి పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది. పక్షానికి ఒకటి, మాసానికి రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు. ఈ ఇరవై నాలుగు ఏకాదశులూ ఇరవై నాలుగు పర్వాలుగా ఉన్నాయి. ‘ఏకాదశి’ అనేది పౌరాణిక గాథల్లో ఒక దేవత పేరు. మురాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణువు వైకుంఠం నుంచి గరుడ వాహనం మీద భూమికి దిగి వచ్చాడు. అసురుడితో ఆయన బాగా యుద్ధం చేశాడు. యుద్ధం మధ్యలో అతను అలసిపోయి మూర్ఛపోయాడు. అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక సౌందర్యవతి ఆవిర్భవించి అసురుడితో యుద్ధం చేసి అతనిని సంహరించింది. ఆ సౌందర్యవతికి దేవతలు ‘ఏకాదశి’ అనే పేరు పెట్టారు. ఏకాదశి పొందిన విజయాన్ని స్మరించడం కోసం ఈ పర్వం ఏర్పడిందని అంటారు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించే వారిని ఆ దేవత రక్షిస్తుందని అంటారు. ఈనాడు ఏ కోరికలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఆ కోరికలు తీరుతాయి కాబట్టి ఈ ఏకాదశి పర్వాన్ని కామద ఏకాదశి అన్నారు. దీని వెనుక కూడా ఓ కథ ఉంది.
లలిత అనే గంధర్వ స్త్రీ ఈ తిథి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, తన కోరికలను తీర్చుకుందట. ఆమె మనసులోని కామితం (కోరిక) నెరవేరింది కాబట్టి ఇది కామదౌకాదశి (కామద ఏకాదశి) అయ్యింది. గోదావరి తీర ప్రాంతంలో ఈ ఏకాదశిని ఏపీలోని కోనసీమ జిల్లా వాడపల్లిలో ‘వాడపల్లి ఏకాదశి’ పేరుతో జరుపుకుంటారు. ఈనాడు అక్కడి వేంకటేశ్వరస్వామికి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈనాడు లక్ష్మీనారాయణులను దమనములతో పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు. ఇక, ఈనాడు భారత జాతీయ బ్యాంకులన్నింటికీ ఖాతాల ముగింపు రోజుగా వ్యవహరిస్తూ ఈరోజు బ్యాంక్‍ హాలీడేగా వ్యవహరిస్తారు.

చైత్ర శుద్ధ త్రయోదశి/అనంగ త్రయోదశి
ఏప్రిల్‍ 4, మంగళవారం

చైత్ర శుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశి అనీ లేదా మదన త్రయోదశి అనీ అంటారు. అనంగుడన్నా, మదనుడన్నా మన్మథుడని అర్థం. దీనిని బట్టి ఇది మదనుడికి సంబంధించిన పర్వమని అర్థమవుతోంది. మన్మథుడు శివాగ్రహానికి గురై అనంగుడిగా మారాడు. అనంగుడు అంటే దేహం లేని వాడు. దీనికి సంబంధించి పురాణాలలో రెండు కథలు ఉన్నాయి. అలాగే, ఈనాడు శివుడిని దమనాలతో పూజించాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు చేసే శివపూజ మిక్కిలి ఫలప్రదమైనదని అంటారు. ఈ ఒక్కనాటి పూజ వలన సంవత్సరం మొత్తం శివుడిని పూజించిన ఫలం కలుగుతుంది.
అలాగే, ఇదే రోజు భగవాన్‍ మహావీర్‍ జయంతి దినం కూడా.

చైత్ర శుద్ధ చతుర్దశి
ఏప్రిల్‍ 5, బుధవారం

చైత్ర శుద్ధ చతుర్దశి.. శైవ చతుర్దశి, కర్దమ క్రీడ, రౌచ్యమన్వాదిగా ప్రసిద్ధి. రౌచ్యుడు రుచి కుమారుడు. రుచి భార్య మాలిని. రుచికి పితృ దేవతలు అతని కొడుకు మనువు కాగలడని చెప్పారు. అలాగే, రౌచ్యుడు మనువు అయ్యాడు. ఈయన మన్వంతరంలో బృహస్పతి ఇంద్రుడు అయ్యాడు. అతని కుమారులైన చిత్రసేనుడు, దృఢుడు, సురధుడు మొదలైన వారు రాజులు అయి పాలించారు. ఈనాడు కూడా శివపూజ చేయగదగినది. ఈనాడు ఇంకా నృసింహ డోలోత్సవం చేస్తారని స్మ•తి కౌస్తుభం, మహోత్సవం వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతున్నాయి.
ఏప్రిల్‍ 5, బాబూ జగ్జీవన్‍రామ్‍ జయంతి దినం.

చైత్ర శుద్ధ పూర్ణిమ
ఏప్రిల్‍ 6, గురువారం

చైత్ర శుద్ధ పూర్ణిమను మహాచైత్రి అని కూడా అంటారు. మదన పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఈనాడు చిత్ర వస్త్ర దానం, దమన పూజ విహితకృత్యాలుగా ధర్మశాస్త్ర గ్రంథాలు నిర్దేశించాయి. చిత్ర వస్త్రదానం అంటే రంగురంగుల బట్టలను దానం చేయడం. ఈ పర్వం సందర్భంలో ఇంద్రాది సమస్త దేవతలకు దమన పూజ చేయడం మహా ఫలాన్నిస్తుంది. అలాగే చిత్రా పూర్ణిమ నాడు చిత్రగుప్త వ్రతం చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది.
చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు వరాహ పురాణాన్ని దానం ఇస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఈనాడు పశుపత వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామని అనే వ్రత గ్రంథంలో రాశారు.
పూర్ణిమలు రెండు రకాలు. ఒక కళ తక్కువైన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ ఒకటి. ఈ పూర్ణిమను ‘అనుమతి’ అంటారు. పదహారు కళలతో కూడిన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ మరొకటి. ఇది రాకా పూర్ణిమ. సూర్యేందు సంగమ కాలం అమావాస్య. అమావాస్య నుంచి పూర్ణిమకు పదహారు రోజులు. అమావాస్య నుంచి పున్నమికి, పున్నమి నుంచి అమావాస్యకు గల కాలాన్ని పర్వసంధి అంటారు. అమావాస్య నుంచి పూర్ణిమాస్య వరకు గల పదహారు దినాలలో ఒక్కొక్క దినానికి చంద్రుడికి ఒక్కో కళ హెచ్చుతూ ఉంటుంది. పూర్ణిమ నుంచి అమావాస్య వరకు గల పదహారు దినాలలో ఒక్కో దినానికి చంద్రునికి ఒక్కో కళ తగ్గుతూ ఉంటుంది. పదహారు కళలలో ఒప్పుతూ పూర్ణిమ నాడు చంద్రుడు కాంతివంతుడై ఉంటాడు. ఇలా చంద్రుడు కాంతివంతంగా ప్రకాశించే దినాలు ఏడాదికి పన్నెండు ఉంటాయి. అనగా, ఏడాదికి పన్నెండు పూర్ణిమలన్న మాట. ఈ పన్నెండు పూర్ణిమలలోనూ చంద్రుడు ఒక్కో నక్షత్రంతో కూడి ఉంటాడు. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పూర్ణిమకు పేరు వస్తుంది. మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో చిత్ర ఒకటి. అటువంటి చిత్తా నక్షత్రంతో కూడిన పూర్ణిమకు ‘చైత్రీ’ అని పేరు. ఈనాడు మధుర కవి ఆళ్వారు తిరు నక్షత్రం కూడా. అలాగే ఒక ఏడాదిలోని పన్నెండు పూర్ణిమలు పన్నెండు పర్వాలుగా కూడా ఉన్నాయి.
చైత్ర పూర్ణిమ తిథి హనుమజ్జయంతి పర్వంగా కూడా ప్రసిద్ధి. ఆంధ్రులలో మధ్వ మతస్తులకు ఇది మరీ ముఖ్యమైన పండుగ. హనుమంతుడు అంజనాదేవి పుత్రుడు. అంజన కేసరి అనే వానరుని భార్య. సంసారంలో విసుగుపుట్టి కేసరి తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు. తపస్సుకు వెళ్తూ అతను తన భార్యను వాయుదేవునికి అప్పగించాడు. ఆమె శ్రద్ధాభక్తులకు మెచ్చి, వాయువు తన గర్భమందున్న శివుని వీర్యాన్ని ఆమెకు ఇచ్చాడు. దాంతో ఆమె గర్భం ధరించి కుమారుడిని ప్రసవించింది. అతనే ఆంజనేయుడు. వాయు ప్రసాదితం కావడం చేత అతనికి వాయుపుత్రుడు అనే పేరు కూడా వచ్చింది.

చైత్ర బహుళ పాడ్యమి
ఏప్రిల్‍ 7, శుక్రవారం

చైత్ర బహుళ పాడ్యమి నాడు పాతాళ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు జ్ఞానావాప్తి వ్రతం కూడా చేస్తారని తెలుస్తోంది. అయితే, ఈ వ్రతాచరణలకు సంబంధించి వివరాలు అందుబాటులో లేవు. ఈ తిథి నాడు ప్రపాదానం చేయాలని, ధర్మఘటాది దినమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
ఇక, ఏప్రిల్‍ 7 క్రైస్తవులకు ‘గుడ్‍ ఫ్రైడే’.


Review విశేషం.. ‘చైత్ర’ఫలం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top