విశేష వ్రతాల జ్యేష్టం

ఆంగ్లమానం ప్రకారం జూన్‍.. సంవత్సరంలో ఆరవ నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ-జ్యేష్ఠ మాసాల తిథుల కలయిక. జూన్‍ నెలలో వైశాఖ మాసంలోని కొన్ని రోజులు, జ్యేష్ఠ మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. జూన్‍ 1, శనివారం, వైశాఖ బహుళ నవమి నుంచి జూన్‍ 6, గురువారం, వైశాఖ బహుళ అమావాస్య వరకు వైశాఖ మాస తిథులు, జూన్‍ 7, శుక్రవారం, జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జూన్‍ 30, ఆదివారం, జ్యేష్ఠ బహుళ నవమి వరకు జ్యేష్ఠ మాస తిథులు ఉంటాయి. హనుమజ్జయంతి, రంభా వ్రతం, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, రామలక్ష్మణ ద్వాదశి, ఏరువాక పూర్ణిమ వంటివి ఈ మాసంలోని కొన్ని ముఖ్య పర్వదినాలు.

2024- జూన్‍ 1, శనివారం, వైశాఖ బహుళ నవమి నుంచి
2024- జూన్‍ 30, ఆదివారం, జ్యేష్ఠ బహుళ నవమి వరకు..
శ్రీ క్రోధి నామ సంవత్సరం – వైశాఖం – జ్యేష్ఠ మాసం- గ్రీష్మ రుతువు- ఉత్తరాయణం

తెలుగు పంచాంగాల ప్రకారం జ్యేష్ఠ మాసం (జూన్‍) చైత్రాది మాస పరిగణనలో మూడో మాసం. జూన్‍ నాటికి ఎండలు మరింత మండిపోతాయి. గ్రీష్మతాపంతో మానవాళే కాదు పశుపక్ష్యాదులు అల్లాడిపోతుంటాయి. ఈ నెల చివరి నాటికి వాతావరణం కొంత చల్లబడుతుంది. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసమని చెబుతారు. జ్యేష్ఠ మాసం నెలంతా బ్రహ్మను ఆరాధించాలని అంటారు. నెల పొడవునా ఆయన ప్రతిమను గోధుమపిండితో తయారు చేసుకుని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చని అంటారు. ఇలా చేస్తూ జ్యేష్ఠ మాసంలో తనను ఆరాధించే వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని విశ్వాసం. చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి జ్యేష్ఠ మాసమనే పేరు వచ్చింది. పితృదేవతల ప్రీత్యర్థం చేయాల్సిన కర్మలకు, వారి రుణం తీర్చుకోవడానికి, చేసిన పాపాల నుంచి విమోచనం పొందడానికి ఉద్దేశించిన కొన్ని మంచి తిథులు జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. జ్యేష్ఠంలో గృహ నిర్మాణ పనులను ప్రారంభించడం మంచిది కాదని మత్స్య పురాణంలో ఉంది. అలాగే శుభ ముహూర్తాల పరంగా కూడా ఈ మాసం అంతగా అనుకూలం కాదని అంటారు. అయితే, ఈ మాసంలో కొన్ని విశేషమైన పర్వాలు, వ్రతాలు ఉన్నాయి. స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించే సావిత్రి వ్రతం, పార్వతీదేవి ఆచరించిన రంభా వ్రతం, పచ్చి మంచినీళ్లయినా ముట్టకుండా ఆచరించే నిర్జల ఏకాదశి వంటివి జ్యేష్ఠ మాసంలో వచ్చే ముఖ్యమైన వ్రతాలు. ప్రధానంగా వ్యవసాయానికి జ్యేష్ఠ మాసమే శ్రేష్ఠమైనదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందరికీ అన్నం పెట్టే ఫలసాయానికి బీజం పడేది ఈ మాసంలోనే. అందుకే రైతులు ఆనందంగా ‘ఏరువాక’ జరుపుకుంటారు.

వృషభ పూజలు ఈ మాసంలో విశేషంగా జరుగుతాయి. తమకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువులకు కృతజ్ఞతా సూచకంగా రైతులు జ్యేష్ఠంలో వృషభ పూజలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే, వ్యవసాయంలో ప్రధానమైన ఖరీఫ్‍ సీజన్‍కు రైతులు శ్రీకారం చుట్టేది ఈ మాసంలోనే. ఇక, దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్య ఫలాలను ప్రసాదించే ‘జ్యేష్ఠ పౌర్ణమి’, శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింప చేసే ‘అపర ఏకాదశి’ ఈ మాసంలో ఆధ్యాత్మిక సాధనాపరులకు ఉన్నతిని కలిగిస్తాయి. ఇక, వైశాఖ మాస తిథుల్లో వచ్చే ముఖ్యమైన పర్వాల్లో హనుమజ్జయంతి ఒకటి. వైశాఖంలో కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే హనుమజ్జయంతిని ఆచరించే ఆచారం ఉంది. ఇంకా ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వాల విశేషాలు..

వైశాఖ బహుళ నవమి
జూన్‍ 1, శనివారం

వైశాఖ బహుళ నవమి జూన్‍ నెలలోని మొదటి రోజు. సాధారణంగా ప్రతి నెలలో వచ్చే నవమి నాడు దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఇక, తెలుగు రాష్ట్రాలలో ఈనాడు హనుమజ్జంతి పర్వదినాన్ని నిర్వహిస్తారు. చైత్ర మాసంలో కూడా కొన్నిచోట్ల హనుమజ్జయంతిని నిర్వహించే ఆచారం ఉంది. లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మన ముందు నిలుస్తాయి. ప్రతి దేవతా పాత్ర వెనుక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంది. అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు. రుద్రాంశ సంభూతుడిగా శైవులకు, రామకార్య దురంధరుడిగా వైష్ణవులకు హనుమంతుడు ఆరాధ్యుడు. హనుమత్‍ తత్త్వం మనసుకు ప్రతీక. మనసు నిత్యం చలిస్తుంటుంది. ఈ చాంచల్యాన్ని అరికట్టడానికి నిరంతర సాధన అవసరం. వానరం అయినప్పటికీ పరమార్థ సాధనకు, శ్రీరామచరణారవింద ప్రాప్తికి హనుమంతుడు గొప్ప ప్రయత్నం చేసి సఫలుడయ్యాడు. అందుకే అచంచల మనస్థితికి ప్రతినిధి మారుతి. హనుమంతుడు అంజనీదేవి పుత్రుడు. అందుకే ఆయన ఆంజనేయుడయ్యాడు. రాముడికి నమ్మినబంటు. వాక్చాతుర్యంలోనూ, బుద్ధికుశలతలోనూ, బలంలోనూ, స్థిరచిత్తం కలిగి ఉండటంలోనూ ఇంకా అనేక శుభమైన గుణాలు, లక్షణాలకు హనుమంతుడు పెట్టింది పేరు.
హనుమజ్జయంతి నాడు సూర్యోదయం మొదలు పూజలు, పునస్కారాలు, అర్చనలు, ఆరాధనలు, కీర్తనలు, ప్రార్థనలు మందిరాల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని కసాపురం, పొన్నూరు, కర్నూలు, బీచుపల్లి, కొండగట్టు, హైదరాబాద్‍ తాడ్‍బంద్‍, కర్మన్‍ఘాట్‍ తదితర చోట్ల ప్రసిద్ధమైన ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక, జూన్‍ 1నే నవమితో పాటు దశమి తిథి కూడా కూడి ఉంది. అయితే, వైశాఖ బహుళ దశమి నాడు ప్రత్యేకంగా ఆచరించదగిన పూజా విశేషాలేమీ లేవు.

వైశాఖ బహుళ ఏకాదశి
జూన్‍ 2, శనివారం

వైశాఖ బహుళ ఏకాదశిని అపరైకాదశి అని అంటారు. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ ఏకాదశి గురించి వివరణ ఉంది. ఈనాడు ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉంటే పవిత్ర తీర్థాల్లో స్నానం చేసిన ఫలం, పలు రకాల దానఫలం కలుగుతుందని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.
ఇక, జూన్‍ 2 ఆంధప్రదేశ్‍ పునర్విభజన దినం. 2014, జూన్‍ 1 పూర్వ ఆంధప్రదేశ్‍ నుంచి తెలంగాణ విడివడింది. కాబట్టి ఇదేరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటారు.

వైశాఖ బహుళ ద్వాదశి
జూన్‍ 3, సోమవారం

వైశాఖ బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం, సోమా ప్రదోష వ్రతం ఆచరించాలని అంటారు. సోమ అంటే చంద్రుడికి పర్యాయపదం. సోమా ప్రదోష వ్రతం అనడాన్ని బట్టి ఈనాడు చంద్రుడి ప్రీత్యర్థం వ్రతాన్ని ఆచరించాలని తెలుస్తోంది.

వైశాఖ బహుళ త్రయోదశి
జూన్‍ 4, మంగళవారం

వైశాఖ బహుళ త్రయోదశి.. ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి తిథి. ఇది శివుడిని పూజించడానికి అనువైనది. అలాగే సావిత్రీ వ్రతం ఈ తిథి నాటి నుంచే ప్రారంభమవుతుంది. ఈనాటి నుంచి ప్రారంభమయ్యే ఈ వ్రతం వైశాఖ బహుళ అమావాస్యతో ముగుస్తుంది.

వైశాఖ బహుళ చతుర్దశి
జూన్‍ 5, బుధవారం

వైశాఖ బహుళ చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. ప్రదోష కాలంలో స్నానం ఆచరించి తెల్లని వస్త్రాలు ధరించి, గంధం తదితర ఉపచారాలతో, మారేడు దళాలతో శివలింగాన్ని ఆరాధించాలి. ఇదే లింగ వ్రతం. దీనిని ఆచరించడానికి అనువైన తిథి వైశాఖ బహుళ చతుర్దశి. ఈనాడు పిండితో శివలింగాన్ని తయారుచేసి పంచామృతాలతో స్నానం చేయించి, కుంకుమ పూసి, ధూప, దీప నైవేద్యాలతో లింగాన్ని పూజించాలి. ఇంకా ఈనాడు సావిత్రీ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
ఇక, ఏటా జూన్‍ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆచరిస్తారు.

వైశాఖ బహుళ అమావాస్య
జూన్‍ 6, గురువారం

వైశాఖ బహుళ అమావాస్య గురువారంతో కలిసి వస్తే విశేష ఫలప్రదమని అంటారు. ఈ అమావాస్య ఈ ఏడాది గురువారంతోనే కూడి వస్తుండటం వల్ల ఇది విశేష దినంగా భావించాలి. ఈనాడు ప్రయాగలో స్నానం చేయడం పాపహరంగా ఉంటుందని అంటారు. త్రయోదశి నాడు ఆరంభించి ఈనాటితో సావిత్రీ వ్రతాన్ని పూర్తిచేయాలని పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. పితరులను పూజించడం, పార్వణవిధితో శ్రాద్ధం దానం చేయడం ఈనాటి ప్రధాన విధులు. అమావాస్యతో పాటే ఈ తిథి వృషభ సంక్రమణ దినం. అలాగే, ఈనాడు కృష్ణుడిని పూజించాలి. ఉపవాసం ఉండాలి. ఈ వివరాలు హేమాద్రి అనే వ్రత గ్రంథంలో ఉన్నదని చెబుతున్నారు. ఈనాడు ఇంకా సుజన్మా వాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు శని జయంతిని ఆచరిస్తారని తెలుగు పంచాంగాల ప్రకారం తెలుస్తోంది. ఈనాడు రోహిణీ వ్రతం ఆచరించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. మొత్తానికి వైశాఖ మాసంలోని ఈ చివరి రోజు మహా పుణ్యదినంగా ఆచరణలో ఉంది.

జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి
జూన్‍ 7, శుక్రవారం

ఈనాటి నుంచి జ్యేష్ఠ మాస తిథులు ఆరంభమవుతాయి. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి జ్యేష్ఠ మాస ఆరంభ తిథి. ఈనాడు ‘కరవీర వ్రతం’ చేయాలని అంటారు. ‘కరవీర’ అంటే ఎర్ర గన్నేరు పత్రం. వినాయకుడిని పూజించే 21 రకాల పత్రిలలో కరవీర (గన్నేరు) ఒకటి. అలాగే భద్ర చతుష్టయ వ్రతం చేయాలని వివిధ వ్రత గ్రంథాల ప్రకారం తెలుస్తోంది. అమావాస్య అనంతరం ఈనాడే చంద్ర దర్శనం.

జ్యేష్ఠ శుద్ధ తదియ
జూన్‍ 9, ఆదివారం

జ్యేష్ఠ శుద్ధ తదియ తిథి నాడు రంభా వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్నే చతుర్వర్గ చింతామణి తదితర వ్రత గ్రంథాలు‘రంభా తృతీయ’ వ్రతంగా కూడా వ్యవహరిస్తున్నాయి. ఇంకా, ఈనాడు రాజ్యవ్రతం, త్రివిక్రమ తృతీయా వ్రతం వంటివీ ఆచరిస్తారని తెలుస్తోంది. అయితే, వీటన్నిటిలో రంభా వ్రతమే దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉంది. కొందరు మునులు ఈశ్వరుడిని భర్తగా పొందేందుకు ఈ వ్రతాన్ని ఆచరించాలని పార్వతీదేవికి ఈ వ్రతాచరణ గురించి వివరించినట్టు పురాణాల్లో ఉంది. ‘రంభ’ అనగా అరటిచెట్టు. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు ఆచరించాలి. అరటి చెట్టు మొదలున ఈ పూజను ఆచరించాలి. రంభకు అధిష్ఠాన దేవత సావిత్రి కాబట్టి, అరటి చెట్టు కింద సావిత్రీదేవిని పూజించాలి. ఈ వ్రతాచరణ విధానం గురించి మరిన్ని వివరాల కోసం ‘ఈ మాసం ప్రత్యేకం’ పేజీని చూడవచ్చు. ఇంకా ఈనాడు మహారాణా ప్రతాప్‍ జయంతిని నిర్వహిస్తారు.

జ్యేష్ఠ శుద్ధ చవితి
జూన్‍ 10, సోమవారం

జ్యేష్ఠ శుద్ధ చవితి నాడు నాడు ఉమాపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో వివరించారు. దీనిని గణేశ చతుర్థి తిథిగానూ భావిస్తారు. అలాగే, శుక్లా దేవిని పూజించాలని అంటారు. ఈనాడు ఆచరించే చతుర్థి వ్రతం గణపతి సంబంధమైనదిగా భావిస్తారు.

జ్యేష్ఠ శుద్ధ పంచమి
జూన్‍ 11, మంగళవారం

జ్యేష్ఠ శుద్ధ పంచమి తిథి పితృ దేవతల ఆరాధనలకు ఉద్ధిష్టమైనది. ఈ కారణంగానే ఈనాడు పితృ దేవతలను విధిగా పూజించాలని ఆయా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.

జ్యేష్ఠ శుద్ధ షష్ఠి
జూన్‍ 12, బుధవారం

జ్యేష్ఠ శుద్ధ షష్ఠి తిథి నాడు అరణ్య గౌరీ వ్రతం, వింధ్యవాసినీ పూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు అరణ్యాల్లో, కొండల్లో గౌరిని పూజించే వారికి సౌభాగ్యం కలుగుతుందని అంటారు. అలాగే, ఈనాడు కుమారస్వామిని పూజించడం కూడా పుణ్యప్రదం. ఈనాడు ఆయనను పూజించడాన్నే స్కద షష్ఠిగా వ్యవహరిస్తారు.

జ్యేష్ఠ శుద్ధ సప్తమి
జూన్‍ 13, గురువారం

జ్యేష్ఠ శుద్ధ సప్తమి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, వరుణ పూజ చేయాలని మరికొన్ని గ్రంథాలలో రాశారు.

జ్యేష్ఠ శుద్ధ అష్టమి
జూన్‍ 14, శుక్రవారం

జ్యేష్ఠ శుద్ధ అష్టమి దుర్గాష్టమి తిథి అని ఆమాదేర్‍ జ్యోతిషీ వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. ఈనాడు దుర్గాదేవిని పూజించాలి. దీనినే దుర్గాష్టమి వ్రతం అంటారు.

జ్యేష్ఠ శుద్ధ నవమి
జూన్‍ 15, శనివారం

జ్యేష్ఠ శుద్ధ నవమి తిథి నాడు శుక్లాదేవిని పూజించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు శుక్లాదేవిని ‘బ్రహ్మణీ నామ్యా ఉమాయా: పూజా శుక్లాదేవి’ అని స్తుతించాలి.

జ్యేష్ఠ శుద్ధ దశమి
జూన్‍ 16, ఆదివారం

జ్యేష్ఠ శుద్ధ దశమి కొందరికి సంవత్సరాది దినంగానూ పరిగణనలో ఉంది. ఈనాడు వారు స్నానం, దానం చేయడాన్ని ముఖ్యమైన విధులుగా భావిస్తారు. జ్యేష్ఠ శుద్ధ దశమి తిథికి ‘దశపాపహర దశమి’ అని పేరు. గంగాదేవి కృపను సంపాదించడం ప్రధాన ఉద్దేశంగా దశపాపహర దశమిని జరుపుకుంటారు. అందుకే ఈ ఉత్సవాన్ని గంగోత్సవమని కూడా అంటారు. గంగానది నీరు అతి పవిత్రమైనది. ఎన్నాళ్లు నిలువ ఉన్నా చెడిపోదు. గంగా తీర ప్రదేశాలు అనేకం తీర్థ స్థలాలై ఉన్నాయి. అందుకే దశపాపహర దశమి లేదా గంగోత్సవ పర్వం నదీతీర గ్రామాల్లో విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా జరుగుతుంది. కాశి, హరిద్వార్‍, నాసిక్‍, మధుర, ప్రయాగ మొదలైన నదీ తీర నగరాల్లో గంగోత్సవాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. ఈ ప్రదేశాల్లో అక్కడక్కడ గంగాదేవి ఆలయాలు ఉండటం కూడా మరో కారణం. ఈనాడు అక్కడ గంగాపూజ విశేషంగా జరుగుతుంది. దశపాపహర దశమి అంటే, పది రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. దీన్ని జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజుల పాటు ఆచరించాలి. ఈ తిథి నాడు ఏ నదిలో స్నానం చేసినా అది విశేష ఫలాన్నిస్తుంది. గంగానదిలో చేస్తే ఇంకా ఫలం. కాశీలోని దశాశ్వమేధ ఘట్టంలో గంగాస్నానం మరీ విశేషం. అలాగే, గంగావతరణ ఈనాడే జరిగిందని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. జ్యేష్ఠ శుక్ల దశమి, బుధవారం, హస్తా నక్షత్ర కాలంలో గంగావతారణం జరిగిందనీ, ఈ విషయాన్ని వాల్మీకి రామాయణం చెబుతోందని
వ్రతోత్సవ చంద్రికాకారుడు చెబుతున్నారు.
వైశాఖ శుక్ల సప్తమి నాడు గంగావతరణ జరిగిందని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. అయితే, జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఏ విధంగా చూసినా గంగాదేవి పూజకు ఉద్ధిష్టమైనది. ఎందుకంటే, ఈనాడు ఆచరించే దశపాపహర దశమి వ్రతం గురించి స్కంధ పురాణంలో విపులంగా ఉంది. జ్యేష్ఠ శుక్ల దశమి సౌమ్యవారంతో హస్తా నక్షత్రంతో కలిసి వచ్చిన నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సర్వ పాపాలు సమసిపోతాయని నమ్మిక. జ్యేష్ఠ శుక్ల పాడ్యమి మొదలు దశమి వరకు రోజూ స్త్రీలు పిండి వంటలు చేస్తారు. రోజూ పదేసి భక్ష్యాలు దక్షణయుక్తంగా గురువులకు ఇస్తారు. పదకొండో నాడు, అనగా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. ఉపవాస కాలంలో పచ్చి మంచినీళ్లయినా ముట్టకూడదు. అదే నిర్జలైకాదశి.
ఇక, జూన్‍ 16న ఏటా తండ్రుల దినోత్సవాన్ని (ఫాదర్స్ డే) ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేసే తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని ఆచరిస్తారు.

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి/నిర్జల ఏకాదశి
జూన్‍ 17, సోమవారం

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి తిథి నిర్జలైకాదశి. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు గంగోత్సవాలు జరుగుతాయి. జ్యేష్ఠంలో ఎండలు మెండుగా ఉంటాయి. భూమిలో నీటిమట్టం చాలా అడుగుకు పడిపోతుంది. అటువంటి మండు వేసవిలో ఈ ఏకాదశి నాడు పచ్చి మంచినీళ్లయినా ముట్టకుండా ఉపవాసం ఉంటారు. అందుచేతనే దీనికి నిర్జలైకాదశి (నిర్జల + ఏకాదశి) అనే పేరొచ్చింది. ఈ ఏకాదశి భీముడి కారణంగా ఏర్పడినట్టు చెబుతారు.
భీముడు తిండిపోతు. ఒక పూట కూడా తిండి లేకుండా ఉండలేడు. అందుచేత దశమి నాడు ఏకభుక్తం మాత్రం చేసి ఏకాదశి నాడు ఒక పూట అయినా భోజనం లేకుండా అతడు ఉండలేడు. ఒకసారి భీముడు ఇదే విషయమై వ్యాసుడి వద్దకు వెళ్లాడు. అప్పుడు వ్యాసుడు భీముడితో ‘నువ్వు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు నీళ్లుకానీ, అన్నం కానీ తినకుండా ఉండు. ఏడాదిలోని ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలను చేసిన ఫలితం నీకు కలుగుతుంది’ అని చెప్పాడు. భీముడు అలాగే చేశాడు. ఏడాదికి ఒక వ్రతాన్ని చేసి భీముడు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాల ఫలితాలను పొందాడు. కాబట్టే నిర్జల ఏకాదశి అంత మహత్తయినది. ఈ ఏకాదశి పర్వం గురించి చతుర్వర్గ చింతామణి, స్మ•తి కౌస్తుభం తదితర వ్రత గ్రంథాలలో విపులంగా ఉంది. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి తిథి జూన్‍ 17, 18 తేదీలలో రెండు రోజుల పాటు కొనసాగుతుంది.
ఇంకా జూన్‍ 17న గాయత్రి జయంతి దినం. లోకానికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించిన మహాద్రష్ట విశ్వామిత్రుడు. ఆయన నుంచి జాలువారిన ఈ 21 బీజాక్షరాల గాయత్రి మంత్రం ఆధ్యాత్మికంగానే కాదు.. ఆరోగ్యపరంగానూ ఎంతో ప్రభావం చూపుతుందని వివిధ అధ్యయనాల్లో తేలింది.

జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి
జూన్‍ 19, బుధవారం

జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి తిథి చంపక ద్వాదశి పర్వమని గదాధర పద్ధతి అనే గ్రంథంలో ఉంది. ఈనాడు త్రివిక్రమ పూజ చేయాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. అంటే వామనుడిని ఈనాడు పూజించాలి. అలాగే, ఈ తిథి రామలక్ష్మణ ద్వాదశిగానూ ప్రసిద్ధి. ఈనాడు కూర్మ జయంతి ఆచరిస్తారు. శ్రీశంకరాచార్య కైలాస గమనం కూడా ఈనాడే జరిగింది. ఈనాడు ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.

జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి
జూన్‍ 20, గురువారం

జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి వివిధ పూజల ఆచరణకు మంచి ముహూర్త సమయం. ఇది మూడు వ్రతాలు చేసే ముహూర్త తిథిగా చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. వీటిలో ఒకటి- దౌర్భాగ్య నాశన త్రయోదశీ వ్రతం. మిగతా రెండు వ్రతాలు ఈనాటి రాత్రి మొదలు మూడు రాత్రుల పర్యంతం పర్యాప్తమై సాగేవి. వాటి పేర్లు- జాతి త్రిరాత్రి వ్రతం, రంభా త్రిరాత్రి వ్రతం. రెండో వ్రతాన్ని రాత్రి ప్రారంభించి, అరటి చెట్టు కింద ఉమామహేశ్వరులను పూజించాలని వ్రత నియమం. అలాగే, జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి- విద్యారణ్యుల ఆరాధన దినం కూడా.

జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి
జూన్‍ 21, శుక్రవారం

జ్యేష్ఠ శుద్ధ చతుర్దశికి చంపక చతుర్దశి అని మరోపేరు కూడా ఉంది. ఈనాడు వాయు వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే రుద్ర వ్రతం కూడా ఆచరిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈనాడే. యోగాకు పుట్టినిల్లు మన భరతఖండమే కావడం విశేషం. ఈ గడ్డపై పుట్టిన యోగా పక్రియ ప్రస్తుతం దాదాపు 180కిపైగా దేశాల్లో అధికారిక ఆరోగ్య విధానంగా అమలవుతోంది. ఇది భారతీయులకు గర్వకారణం.
అలాగే, సంవత్సరంలోనే సుదీర్ఘమైన రోజు జూన్‍ 21. ఈ రోజు పగలు, రాత్రి సమయాలు సుదీర్ఘంగా ఉంటాయి. దీనినే లాంగెస్ట్ డే అంటారు.

జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ/ ఏరువాక పూర్ణిమ
జూన్‍ 22, శనివారం

జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి తెలుగునాట ఏరువాక పున్నమిగా ప్రసిద్ధి. మన పంచాంగంలో జ్యేష్ఠ పూర్ణిమ నాటి వివరణలో ‘వృషభ పూజా, హల ప్రవాహ’ తదితర పదాలు ఉన్నాయి. ఎద్దులను పూజించడం, నాగలి సాగించడం ఈనాటి విధాయ కృత్యాలని ఈ పదాలకు గల అర్థాలను బట్టి తెలుస్తోంది.
ఏరువాక అంటే వివిధ అర్థాలున్నాయి.
ఏరు= సర్వావయవములు గల నాగలికి ఎడ్లను కట్టినది, సర్వావయములు గల నాగలి.
ఏరువాక= దున్నుటకు ఆరంభం.
శబ్ద రత్నాకరం నిఘంటువులో పేర్కొన్న ప్రకారం..
ఏరు= ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధంచేసిన నాగలి.
ఏరువాక= దుక్కి యొక్క ప్రారంభం.
ఈ రెండు అర్థాలను విశదీకరించి చూస్తే ఇది వ్యవసాయదారులకు సంబంధించిన పర్వమని స్పష్టంగా తెలుస్తోంది.
ఏరువాక పున్నమిని వర్ష రుతువు ఆరంభంలో ఆచరిస్తారు. ఈ సమయంలో వర్షాలు కురిసి భూమి పదునెక్కితే పునర్వసు కార్తెలో పునాస విత్తనాలను జల్లుతారు. ఈ పని పునర్వసు కార్తెలో జరుగుతుంది కాబట్టే ఈ కాలంలో పండే పంటను పునాస పంట అంటారు.
ఏరువాక పండుగ నాడు రైతులు ఎద్దులను శుభ్రంగా కడుగుతారు. వాటి కొమ్ములకు రంగులను పూస్తారు. గజ్జెలు, గంటలు, అద్దం, కుచ్చులు తదితరాలను ఎద్దులకు అలంకరిస్తారు. ఉదయాన్నే ఇంట్లో పొంగలి (పులగం) వండి ఎద్దులకు పెడతారు. ఎద్దులను కట్టి ఉంచే కాడికి ధూపదీప నైవేద్యాలు ఇస్తారు. సాయంకాలం తప్పెట, మేళం తదితర మంగళవాద్యాలతో ఎద్దులను ఊరి బయటకు తోలుకుని వెళ్తారు. ఊరి పొలిమేరలో పుంటినారతో చేసి తోరణాన్ని కడతారు. ఈ తోరణాన్ని రైతులు తమ చర్నాకోలలతో కొట్టి పీచుపీచు చేసి ఎవరికి దొరికిన పీచు వారు తీసుకునిపోతారు. దానిని ఇంట్లో పెట్టుకుంటారు. ఇది పశువులకు మేలు కలిగిస్తుందనేది వారి నమ్మకం.
కన్నడనాట కూడా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఇదే మాదిరిగా ఎద్దులను పూజిస్తారు. ఈ పర్వాన్నే వారు ‘కారుణిపబ్బ’ అని పిలుస్తారు.
ఏరువాక పున్నమ పూర్వ కాలం నుంచి ఆచరణలో ఉన్న పర్వం. మనది వ్యవసాయ ప్రధాన దేశం కావడంతో అనాదిగా ఇది ఆచారంగా వస్తోంది.
ఎద్దులతో మన రైతులది అవినాభావ సంబంధం.
‘ఎద్దులు లేని సేద్యం చద్దిలేని పయనం’
‘ఒంటి ఎద్దుసేద్యం వరిగాలు నొప్పి’
‘గొడ్లు, వడ్లు ఉన్న వాడిదే వ్యవసాయం’
‘ఎక్కువ వెల పెట్టి గుడ్డను తక్కువ వెల పెట్టి గొడ్డును కొనకూడదు’
తెలుగు నాట ప్రాచుర్యంలో గల ఈ సామెతలన్నీ ఎద్దుల ప్రాముఖ్యతను తెలిపేవే.
ఇక, జ్యేష్ఠ పూర్ణిమ.. సావిత్రీ వ్రతాచరణ దినం కూడా. ఈనాడు బంగారంతో కానీ, మట్టితో కానీ సావిత్రీ, సత్యవంతుల ప్రతిమలను చేసి యథాశక్తి పూజించాలి. ఆ రాత్రి సావిత్రి చరిత్ర వింటూ జాగారం చేయాలి. తెల్లవారిన తరువాత సావిత్రి ప్రతిమను దక్షిణసహితంగా దానం చేయాలి. ఇది స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతం. ఇంకా ఈనాడు తిలచ్ఛత్రాదిదానం, బిల్వత్రిరాత్రి, పుత్రకామ, అశోకత్రిరాత్ర తదితరమైన వ్రతాలు కూడా చేస్తారని వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. ఆమాదేర్‍ జ్యోతిషి అనే గ్రంథంలో ఈ వ్రతాన్ని గురించి స్నాన పూర్ణిమ వ్రతంగా పేర్కొంది.
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు వట పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. దీనినే వట సావిత్రీ వ్రతం అనీ అంటారు. వివాహితలైన స్త్రీలు జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పర్వాన్ని ఆచరిస్తారు. ఈరోజున ఉపవాసం ఉంటారు. స్త్రీలకు వైధవ్యం రాకుండా ఈ పర్వం చేస్తుందని అంటారు. ఇది మూడు రోజుల వ్రతం. త్రయోదశి నాడు మొదలుకుని పౌర్ణమి వరకు ఉపవసిస్తారు. కొందరు పౌర్ణమి నాడు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వట అంటే మర్రి చెట్టు. ఆ చెట్టుకు ఈనాడు పూజలు చేస్తారు. మర్రిచెట్టుకు దారం చుడుతూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని అంటారు.
జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున చేసే వస్త్ర దానాలు విశేష ఫలాన్నిస్తాయి. కాగా, కబీరుదాసు జయంతి తిథి కూడా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడే.
జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ అనంతరం వచ్చే జ్యేష్ఠ బహుళ పాడ్యమి మొదలు జ్యేష్ఠ బహుళ సప్తమి వరకు ఎటువంటి ప్రత్యేక దినాలు లేవు.

జ్యేష్ఠ బహుళ అష్టమి
జూన్‍ 29, శనివారం

జ్యేష్ఠ శుద్ధ అష్టమి తిథి నాడు వినాయకాష్టమిగా నీలమత పురాణంలో పేర్కొన్నారు. త్రిలోచన పూజ, శీతలాష్టమి అనీ అంటారు. ఈనాడు వినాయకాష్టమిగా నీలమత పురాణంలో పేర్కొన్నారు. త్రిలోచన పూజ, శీతలాష్టమి వ్రతాలు కూడా ఈ తిథి నాడు ఆచరిస్తారు.

జ్యేష్ఠ బహుళ నవమి
జూన్‍ 30, ఆదివారం

జ్యేష్ఠ శుద్ధ నవమి నాడు తిందుకాష్టమీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇక్కడి నుంచి మొదలుకుని దాదాపు ఏడాది పాటు శివపూజ చేయాలని నియమం.

Review విశేష వ్రతాల జ్యేష్టం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top