విష్ణు విలాస వైశాఖం..

1, ఏప్రిల్‍, ఆదివారం, చైత్ర బహుళ పాడ్యమి నుంచి – 30, ఏప్రిల్‍, సోమవారం, వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు.
విలంబి నామ సంవత్సరం-చైత్రం-వైశాఖం-వసంత రుతువు-ఉత్తరాయణ

ఆంగ్లమానం ప్రకారం నాల్గవది మార్చి నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం రెండవది. ఏప్రిల్‍.. చైత్ర-వైశాఖ మాసాల కలయిక. చైత్ర మాసంలోని కొన్ని రోజులు, వైశాఖ మాసంలోని మరికొన్ని రోజులు కలుస్తాయి. పరశురామ జయంతి, సింహాచల నరసింహస్వామి చందనోత్సవం, అక్షయ తృతీయ, ఆదిశంకరాచార్య జయంతి, శ్రీ రామానుజాచార్య జయంతి, భాను సప్తమి, గంగా జయంతి, అన్నవరం సత్యదేవుని కల్యాణం, పరశురామ ద్వాదశి, నృసింహ జయంతి, కుర్మ జయంతి, బుద్ధ పూర్ణిమ, అన్నమాచార్య జయంతి వంటి పండుగలు, పర్వాలు వచ్చేది ఏప్రిల్‍ మాసంలోనే.

శ్రీ మహా విష్ణువు లీలా విలాసాల విశేష మాసమే వైశాఖం. ఇది మాధవునికి అత్యంత ప్రీతికరమైన మాసం. దశావతారాల్లో రెండు విశిష్టమైన పరశురామావతారం, నృసింహావతారాల జయంతులు వచ్చేది ఈ నెలలోనే. ఇంకా శంకర జయంతి, రామానుజ జయంతి తిథులు ఈ మాసంలోనే వస్తాయి. తెలుగు సంవత్సర గణనలో వైశాఖ మాసం రెండవది. చైత్ర బహుళ పాడ్యమి, ఏప్రిల్‍ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ మాసం వైశాఖ శుద్ధ పౌర్ణమి, ఏప్రిల్‍ 30 వరకు కొనసాగుతుంది. ఈ మాస
ంలో గృహ నిర్మాణం సర్వ శుభప్రాప్తి అని ప్రతీతి. ఇంకా అక్షయ తృతీయ వంటి సర్వ శుభకారక తిథి ఈ మాసంలోనిదే. మరెన్నో తిథులకు, పర్వాలకు నెలవైన ఈ మాసం నుంచే ఎండలు ముదురుతాయి. ఇక ఈ నెల ప్రారంభంలోని మొదటి సగం రోజులు తెలుగుమానం ప్రకారం చైత్రమాసంలోనివి. మిగతా సగం రోజులు వైశాఖ మాసంలోనివి. చెట్లు ఆకులు రాల్చే కాలమిది. అయినా పూలు మాత్రం విరబూస్తాయి. ఎటుచూసినా వసంత పరిమళాలు వెదజల్లుతుంటాయి.
చంద్రుని గతిని, ఆ గతిలో చంద్రునికి సన్నిహితంగా ఉండే ప్రధాన నక్షత్రాలను- చంద్రుడు ఆ నక్షత్రాలను సమీపించడంతో ప్రకృతిలో కలిగే మార్పులను అనాదిగా మనిషి నిశితంగా పరిశీలిస్తున్నాడు. నక్షత్ర మండలానికి ఆయా పేర్లు పెట్టుకుని ఆ మండలాలలో చంద్రుడు ప్రవేశించినపుడు ఆయా నెలలకు ఆయా నక్షత్రాల పేరును పెట్టాడు. చిత్తా నక్షత్రంలో పూర్ణ చంద్రుడున్న చైత్రమని,. విశాఖ నక్షత్రాన పూర్ణ చంద్రుడున్న వైశాఖమని పేర్లు పెట్టాడు. అలా చంద్రుడు విశాఖ నక్షత్రంలో ప్రవేశించినపుడు పుట్టినదే వైశాఖ మాసం. ఈ మాసంలోని వచ్చే ప్రధాన తిథులు, ముఖ్యమైన పర్వదినాల గురించి తెలుసుకుందాం.

చైత్ర బహుళ పౌర్ణమి ఏప్రిల్‍ 1, ఆదివారం
చైత్ర బహుళ పాడ్యమి తిథి నాడు పాతాళ వ్రతం ఆచరిస్తారు. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో తెలిపిన ప్రకారం ఈనాడు జ్ఞానవ్యాప్తి వ్రతం కూడా ఆచరిస్తారు.. అయితే, ఈ వ్రతాచరణలకు సంబంధించి వివరాలు అందుబాటులో లేవు. ఈనాడు ప్రపాదానం చేయాలని, ధర్మఘటాది దినమని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
చైత్ర బహుళ పంచమి/ మత్స్య జయంతి
ఏప్రిల్‍ 5, గురువారం
విష్ణుమూర్తి దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది. ఈ అవతార జయంతి దినం ఎప్పుడనేది కొంత వివాదమై ఉంది. అయితే, ఒకటి రెండు ప్రమాణ గ్రంథాలను బట్టి చైత్ర బహుళ పంచమి నాడే మత్స్య జయంతి దినమని అంటున్నారు. ఏదేమైనా మత్స్యావతార గాథ ముచ్చటైనది.
ఆ కాలంలో సోమకుడు అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. వాడు బ్రహ్మ నిద్రపోతున్న సమయం చూసి బ్రహ్మ ముఖంనందు ఉంటే నాలుగు వేదాలను ఎత్తుకుని పోయి సముద్రంలో దాక్కున్నాడు. వేదాల తోడ్పాటు లేక బ్రహ్మకు సృష్టి కార్యం సరిగా సాగలేదు. ఆ విషయం ఆయన విష్ణుమూర్తితో చెప్పుకున్నాడు. అప్పుడు మత్స్యమూర్తిగా ఉన్న జనార్థనుడు నీటిలో వెదకి సోమకుడిని సంహరించాడు. తన నాలుగు చేతులతో నాలుగు వేదాలు తెచ్చి బ్రహ్మకు ఇచ్చాడు.
ఇది మరో గాథ. వైవస్వత మనువు పితృ తర్పణం చేస్తూ ఉన్నాడు. అతని దోసిట్లో ఒక చిన్న చేప పడింది. కరుణించి ఆయన దానిని తన కమండలంలో వేశాడు. అందులో అది ఒక పగలు, ఒక రాత్రి ఉండి పదహారు అంగుళాలు పెరిగింది. తను ఉండటానికి ఆ కమండలం చాలకుండా ఉందని అది గోల పెట్టింది. అప్పుడు మనువు దానిని ఎత్తి ఒక నీళ్ల కాలువలో ఉంచాడు. అందులో అది ఒక రాత్రి ఉంది. ఆ రాత్రికి రాత్రి అది మూడు మూరల పొడవు పెరిగింది. నాకీ చోటు చాలక చచ్చిపోతున్నాను.. నన్ను రక్షింపవలసింది అని ఆ చేప మనువుకు మొర పెట్టుకుంది. అప్పుడు మనువు దానిని ఒక నూతిలో వేశాడు. అది ఆ నుయ్యి కూడా సరిపోనంత పెద్దగా పెరిగింది. అందుమీద మనువు దానిని ఒక చెరువులో వదిలాడు. అది ఆ చెరువు పట్టనంతటి పెద్ద చేపగా మారింది. అంతట ఆయన దానిని ఒక నదిలో వదిలాడు. పెరుగుతూ వచ్చిన చేపకు ఆ నది కూడా సరిగా సరిపోలేదు. ఆ పిమ్మట మనువు దానిని సముద్రంలో ఉంచాడు. అది సముద్రంలోకి చేరడంతోనే కడలి అంతా అల్లకల్లోలమైంది. ఆ అల్లకల్లోలంలో ఆ మీనం మేను రెండు లక్షల యోజనాల ప్రమాణానికి పెరిగింది. అంత బ్రహ్మాండంగా పెరిగి కూడా అది ‘నన్ను రక్షించు.. నన్ను రక్షించు’ అని మొర పెట్టుకోవడం మానలేదు.
మనువుకి ఇదంతా చూసి ఆశ్చర్యం వేసింది. ‘ఓ మత్స్యమా! నీ లీలలు లోగడ చూచి ఉండనివిగా ఉన్నాయి. కనీసం విని అయినా ఉండనివి ఉన్నాయి. నీవు నిజానికి వాసుదేవుడవో, కాకపోతే అసురువో అయి ఉండాలి’ అన్నాడు.
అప్పుడు ఆ చేప ‘ఓ వైవస్వతా! నీవు నన్ను గుర్తించావు. కాబట్టి నీకు ఒక సంగతి చెబుతున్నాను. ఇదిగో ఈ నావను చూడు. ప్రళయ కాలం సమీపించింది. ఇప్పుడు చాక్షుష మన్వంతరం నడుస్తోంది. ఆ మన్వంతరం నూరేండ్లలో ముగుస్తుంది. ఆ ముగింపునకు ముందు అనావృష్టి దోషం కలుగుతుంది. ఆ కారణంగా కరువు ఏర్పడుతుంది. ఆ పిమ్మట సంవర్తం, భీమనాదం, ద్రోణము, ఇంద్రము, వలాహకము, విద్యుత్పతాకము, శోణము అనే ఏడు మేఘాలు విజృంభించి అధిక వ••ష్టిని కలిగిస్తాయి. ఆ వానకు సప్త సముద్రాలు ఏకమై జళ ప్రళయం కలుగుతుంది. భూమి వనసర్వత సహితంగా జలార్ణవంలో మునిగిపోతుంది. కాబట్టి ముందుగానే వేదములు, విద్యలు, బీజములు మున్నగునవి- నేను, బ్రహ్మ, దేవతలు మున్నగు వారు నీచే రక్షితులు కావాలి. ఆ జల ప్రళయంలో అనంతుడనే పాము నీటి మీద తేలుతూ ఉంటుంది. ఆ పామును తాడుగా చేసి ఈ నావను నా కొమ్ముకు కట్టివేయి. అప్పుడు ప్రళయ మారుతం వీచి ఈ ఓడను కుదుపి వేస్తుంది. ఆ అల్లకల్లోలానికి నీవు ఏమీ భయపడవద్దు’ అని చెప్పి ఆ చేప అంతర్థానమైంది.
ప్రళయ కాలంలో మనువు ఆ చేప చెప్పినట్టే చేశాడు. మత్స్యమూర్తి అయి ఆనాడు ఇట్లు వేదాలు తెచ్చి వేథకు ఇచ్చి లోకాన్ని కాపాడినాడు. కావున ఆనాడు మత్స్యమూర్తి ప్రతిమను పూజించాలనే నియమం ఏర్పడింది.
క్రైస్తవులలో మత్స్యం శాంతి దేవతగా, మహమ్మదీయులలో చేప భగవానుడిగా పేర్కొని ఉంది. బౌద్ధ జాతక కథలలో బుద్ధుడు చేపగా పుట్టినట్టు ఉంది.

చైత్ర బహుళ ఏకాదశి
ఏప్రిల్‍ 12, గురువారం
ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో చైత్ర బహుళ ఏకాదశి వరూధిన్యేకాదశిగా (వరూధిని ఏకాదశి)గా చెప్పబడింది. దీనినే మన పంచాంగకర్తలు వరూధిని వ్రతమని అంటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసాదులు ఉండి వ్రతం చేసిన వారికి వేయి గోదానములు చేసిన ఫలము కలుగుతుందని అంటారు. అలాగే, చైత్ర కృష్ణ ఏకాదశి తిథి శ్రీ వల్లభాచార్యా జన్మదినము కూడా.
చైత్ర బహుళ త్రయోదశి/ వరాహ జయంతి

ఏప్రిల్‍ 14, శనివారం
వరాహావతారము విష్ణుమూర్తి పది అవతారాల్లో మూడవది. ఈ అవతారం శ్రీరామావతారం జరిగిన చైత్ర శుద్ధ నవమి నాడే అని కొందరు అంటారు. కానీ, ఈ జయంతి తిథి కూడా వివాదగ్రస్తమై ఉంది.
వరాహావతారం చైత్ర బహుళ త్రయోదశి నాడు ఆవిర్బవించిందని తెలుగు పంచాంగాలు చెబుతున్నాయి. కాగా, ఆనాడే వరాహ జయంతి జరపవలసి ఉంది.
ఈ అవతారంలో విష్ణుమూర్తి లోకకంటకుడైన హిరణ్యాక్షుని సంహరించాడు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బలగర్వితుడై భూమిని చాప చుట్టినట్టు చుట్టి ఎత్తుకునిపోయి పాతాళ లోకంలో దాక్కున్నాడు. అప్పుడు భూదేవి తన బాధలు విష్ణుమూర్తితో చెప్పుకుంది. ఆ మొర విని విష్ణువు ఒక పెద్ద వరాహ రూపాన్ని ధరించి వెలశాడు. దాని శరీరం నల్లని పర్వతం లాగున ఉంది. దాని కోరలు తెల్లగా వాడి ఉన్నాయి. దాని దంతాలు ఇనుపదిమ్మెలుగా ఉన్నాయి. దాని కన్నులు పెద్ద జ్యోతుల లాగ ఉన్నాయి. అది ఘర్జిస్తే ఉరుము ఉరిమినట్టు ఉంది. ఇటువంటి రూపంతో గల ఆ వరాహం వచ్చి హిరణ్యాక్షుని ఎదుర్కొంది. ఇద్దరికీ పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో హిరణ్యాక్షుడు చనిపోయాడు. అప్పుడు ఆ వరాహ మూర్తి పాతాళంలో పడి ఉన్న భూమిని తన బలిష్టమైన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ఉంచాడు. తనను ఉద్ధరించిన వరాహమూర్తికి భూదేవి నమస్కరించి స్తుతించింది.
కల్పాంతంలో ఒకసారి సమస్తమూ జలమయమై పోయింది. బ్రహ్మాండమంతా చీకట్లు కమ్ముకున్నాయి. విష్ణుమూర్తి ఆ జలార్ణవంలో వటపత్రశాయి అయి యోగనిద్రలో ఉండిపోయాడు. నిత్యులైన మహర్లోక నివాసులు కొందరు అప్పుడు స్తుతింపగా ఆయన మేల్కొన్నాడు. తిరిగి జగత్‍ సృష్టికి పూనుకున్నాడు. మళ్లీ ప్రకాశింప చేసే ఉద్దేశంతో బ్రహ్మాండానికి ఊర్థ్వ, అథోముఖాలు అయ్యేటట్టు రెండుగా చేశాడు. వాటిని పద్నాలుగు లోకాలుగా చేశాడు.
అథోభాగాండ ఛిద్రం నుంచి యుల్బము భూమి మీద పడింది. అది మేరు పర్వతమైంది. పిదప నానావిధములైన పర్వతము, చెట్లు, చేమలు, జంతువులు, మనుష్యుల భారానికి భూమి పాతాళానికి కుంగింది. అప్పటి భూదేవి స్థితి బురదలో కూరుకుపోయిన ఆవు స్థితి వలే ఉంది. భూదేవి తన బాధను విష్ణువుకు చెప్పుకుంది. అప్పుడు విష్ణుమూర్తి భూదేవితో, ‘నీవు భయపడకు. నిన్ను ఉద్ధరిస్తాను’ అన్నాడు. భూమిని తేల్చడం కోసం ఆయన వరాహావతారాన్ని పొందాడు. నూరు ఆమడల వెడల్పు ఇన్నూరామడల పోడవు గల వరాహం రూపం ధరించాడు. అది నల్లని మబ్బు రంగులో ఉంది. యజ్ఞ స్వరూపాన్ని పోలి ఉన్న దానికి యజ్ఞ వరాహమూర్తి అనే పేరు వచ్చింది. ఆ యజ్ఞ వరాహ మూర్తి పాతాళ లోకానికి వెళ్లి భూమిని పైకి ఎత్తాడు. అది స్వస్థానాన్ని చేరింది. అప్పుడు భూదేవి విష్ణుమూర్తిని పలువిధాల స్తుతించింది.

చైత్ర బహుళ చతుర్దశి, ఏప్రిల్‍ 15, ఆదివారం
ఈ తిథి నాడు గంగాస్నానం చేస్తే పిశాచత్వం రాకుండా పోతుందని అంటారు. చైత్ర బహుళ చతుర్దశి పర్వం భౌమవారం (మంగళవారం)తో కూడి వస్తే మరీ ఫలప్రదమైనది.
చైత్ర బహుళ అమావాస్య, ఏప్రిల్‍ 16, సోమవారం
ఈనాడు వహ్ని వ్రతం ఆచరిస్తారు. పితృ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇక, ఇది అమావాస్య తిథి. అమావాస్య కూడా పర్వదినమే అని ఒక నానుడి వాడుకలో ఉంది. కానీ చిరకాలంగా అమావాస్య పర్వదినంగానే పరిగణనలో ఉంది.
బహుళ చతుర్దశి తిథికి అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందో తెలిపే కథ ఇది. అచ్ఛోదము అని ఒక కొలను ఉంది. సోమవులనే పితరుల మానస పుత్రిక ఆ కొలను ఒడ్డున ఉంది తపం చేయసాగింది. ఆమె అచ్ఛోద అయ్యింది. ఆమె తన పితరులను చిరకాలం వరకు చూడకుండా ఉండిపోయింది. అందుచేత వారిని చూడాలని ఆమెకు కోరిక పుట్టింది. పితరులు ఒకనాడు ఆమెకు దర్శనం ఇచ్చారు. అందులో మావసుడు అనే పితృదేవుడు చాలా అందంగా ఉన్నాడు. పైగా వారు దివ్యాలంకార భూషితునిగా కూడా ఉన్నాడు. అతనిని అచ్ఛోద మోహించింది. కానీ మావసుడు మాత్రం చలించలేదు. ఆమె కోరికను నిరాకరించాడు. ఆ కారణం వల్ల ఆనాటికి అమావాస్య అనే పేరు వచ్చింది. అది పితరుల పాలిట పర్వదినంగా చెలామణిలోకి వచ్చింది. ఆనాడు మానవులు పితరులకు భక్తి ప్రపత్తులతో తిల తర్పణాదులు ఇవ్వడం ఆచారంగా వస్తోంది.

వైశాఖ శుద్ధ పాడ్యమి, ఏప్రిల్‍ 16, సోమవారం
ఈ తిథి చైత్ర బహుళ చతుర్దశి తిథిని అనుసరించి, సోమవారం నాడే వస్తోంది. ఇది వైశాఖ మాసానికి ప్రారంభ దినం. వైశాఖ స్నాన వ్రతాలు ఈ తిథి నుంచే మొదలవుతాయి. వాజ్ఞనః కాయజాశేష పాపాలు వైశాఖ స్నానంతో పోతాయని ప్రతీతి. ప్రాతఃకాలంలో నియమంగా స్నానం చేస్తే మాధవునికి ప్రీతి కలుగుతుంది. స
స్నానాంతరం రావి చెట్టుకు నీరుపోసి ప్రదక్షిణాలు చేయడం ఆరోగ్యకరం. ఈ మాసంలో తులసి దళాలతో మాధవుడికి పూజ చేస్తే పుణ్యం కలుగుతుంది.
వైశాఖ శుక్ల తదియ, ఏప్రిల్‍ 18, బుధవారం
వైశాఖ శుక్ల తృతీయ లేదా అక్షయ తృతీయ పర్వం. ఈ పర్వం వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో విశిష్టమై ఉంది. ఈ రోజు కేరళీయులకు ‘విషు’ అనే పర్వదినం. ఓనమ్‍ తరువాత వారు నిర్వహించుకునే ప్రధానమైన పర్వమిది. ఇక, అక్షయ తృతీయ పర్వం విశేషాల్లోకి వెళ్తే.. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ పర్వం గురించి స్వయంగా చెప్పినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. వైశాఖ మాసంలో సంపన్నులు వైశాఖ మాస వ్రతం ఆచరించే సంప్రదాయం ఉండేది. అందులో వేసవికి అవసరమైనవి,
వేసవిలో బాగా దొరికే పండ్లు వంటివి పూజానంతరం అందరికీ పంచిపెట్టే వారట. దీనిని బట్టి వేసవిలో అవసరమైనవి, వేసవిలో దొరికేవి అయిన వస్తువులు విరివిగా దానం చేయడం అక్షయ తృతీయ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశమని అర్థమవుతోంది. అక్షయ తృతీయ వ్రతం ధార్మిక గుణ సంపన్నమైనది. అక్షయ తృతీయ తిథి సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే కాలం. ఇది తమిళులకు ఉగాది పర్వంగా ఉంది. ఒకప్పుడు మనకు కూడా ఇది ఉగాది పర్వదినంగానే ఉండేదని తెలుస్తోంది (ఈ తిథి పర్వం గురించి పూర్తి వివరాలు ‘వ్రత మహిమ’ పేజీలలో చదవవచ్చు).

వైశాఖ శుద్ధ పంచమి/ శంకర జయంతి
ఏప్రిల్‍ 20, శుక్రవారం
వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు శంకరాచార్యుల వారి అవతరణ దినంగా ఉద్ధిష్టమై ఉంది. ఈ తిథిని పురస్కరించుకుని ఈనాడు శృంగేరి తదితర జగద్గురు పీఠాలలో జయంత్యుత్సవాలు నిర్వహిస్తారు. శంకరాచార్యులు భారతదేశమంతా తిరిగారు. నలుమూలలా నాలుగు మఠాలు స్థాపించారు. తూర్పున జగన్నాథంలో గోవర్థన మఠం, పడమట ద్వారకలో శారదా మఠం, ఉత్తరాన కేదారంలో జ్యోతిర్మఠం, దక్షిణాన శృంగేరిలో శృంగగిరి మఠం స్థాపించారు. ఈయన అద్వైత మత స్థాపనాచార్యుడు. వేదాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలో ఉన్నది అద్వైత మతమే. శంకరులు బ్రహ్మచర్యాశ్రమం నుంచే సన్యాసాశ్రమం స్వీకరించారు. సన్యాశి అయి ఉండీ తల్లికి అంత్యకర్మలు చేశారు. డెబ్బయి రెండు మతాల వారిని జయించారు. శతాదికమైన ఉద్గ్రంథాలను రచించారు. ఇదంతా ముప్పయి రెండు సంవత్సరాల వయసు నాటిక సాధించిన ఘనత ఆయనది. ముప్పది రెండవ ఏటనే కైలాసగమనం చేసిన ఆయన జగద్గురువుగా ప్రసిద్ధి పొందారు. ఈయనను ఆదిశంకరులు అని, జగద్గురువు అని జనులు స్మరించుకుంటారు. ఆదిశంకరాచార్యులకు సంబంధించి ఎన్నో కథలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిలో ఆసక్తికరమైనది ఇది.
ఒక చండాలుని ప్రబోధంలో ఆదిశంకరులు ప్రబుద్ధుడయ్యారు. ఆ కథ మిక్కిలి ఆసక్తికరం. కేరళలోని కాలడి అనే అగ్రహారంలో విద్యాధిరాజు అనే పండితునికి శివగురువు అనే పుత్రుడు ఉండేవాడు. శివగురువు భార్య ఆర్యాంబ. వీరికి శంకరుని కృపతో బిడ్డ కలగడంతో అతనికి శంకరుడనే పేరు పెట్టారు. శంకరుడి ఐదవ ఏటనే తండ్రి మరణించాడు. తల్లి ఉపనయనం చేసింది. అనంతరం శంకరుడు గురుకులవాసం చేశాడు. అచిరకాలంలోనే ఆయన చతుర్వేదాలు, షడంగాలు, షడ్డర్శనాలు, చతుష్షష్టి కళలు నేర్చాడు. విద్యార్థి దశలో ఉండగా శంకరుడు ఒక బ్రాహ్మణుడి ఇంటికి భిక్షాటనకు వెళ్లాడు. ఆ ఇంటి వారు కడుబీదలు. ఆ ఇంటి ఇల్లాలు- ‘నాయనా! మేమా కటిక దరిద్రులం. నేను నీకు అన్నం ఎలా పెట్టగలను?’ అంటూ ఇల్లంతా వెతికి ఒక ఉసిరికాయను కనుగొని దానిని శంకరునికి భిక్షగా వేసింది. ఆమె ఆదరణకు శంకరుని హృదయం కరుణార్థ్రమైంది. వెంటనే ఆ ఇంటి వాకిలిలో నిల్చుని లక్ష్మీస్తుతి గావించాడాయన. అనుగ్రహించిన లక్ష్మీదేవి ఆ ఇంటిలో బంగారపు ఉసిరికాయలను కురిపించింది. ఆనాడు శంకరుడు నుడివిన ఆ శ్లోకాలే ‘కనకధారాస్తవం’గా ప్రసిద్ధి చెందాయి.

వైశాఖ శుద్ధ షష్ఠి/ రామానుజ జయంతి
ఏప్రిల్‍ 21, శనివారం
వైశాఖ శుద్ధ షష్ఠి గురువారం నాడు రామానుజాచార్యుల వారు జయించారు. రామానుజలను శేషాంశ సంభూతుడని చెబుతారు. త్రిదండ సన్యాసి కావడం చేత ఆయనను యతిరాజు అనీ పిలుస్తారు. ఇక, వైశాఖ శుద్ధ షష్ఠి తిథి.. విద్యారణ్య స్వామి జయంతి దినంగానూ పరిగణిస్తారు. విద్యారణ్య స్వామి శ్రీకృష్ణదేవరాయలుకు గురు సమానులు. ఆయనకు అనేక యుద్ధ వ్యూహాల్లో సలహానిచ్చే వారని చెబుతారు. ఇక, రామానుజుల వారి విషయానికి వస్తే ఆయన తండ్రి ఆసూరి కేశవ పెరుమాళ్‍. తల్లి భూమి పిరట్టియార్‍. మద్రాసు నగర సమీపాన గల శ్రీపెరుంబుదూరు రామానుజుల వారి జన్మస్థలం. క్రీస్తు శకం 1017లో నల నామ సంవత్సరం ఆయన జన్మ తేదీ. శంకర, రామానుజ, మధ్వ అనే త్రిమతాల ఆచార్యులలో ఈయన రెండవ వారు. యాదవ ప్రకాశులు అను గురువు వద్ద రామానుజులు వేదాంతం అభ్యసించారు. అయితే, ఆయనతో వేదాంత బోధన విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకసారి స్థానిక రాజ ప్రముఖుని కుమార్తెకు దయ్యం పట్టింది. రాజ ప్రముఖులు యాదవ ప్రకాశుని పిలిచారు. ఆయన తన మంత్ర శక్తితో దయ్యాన్ని వదిలించలేకపోయాడు. అప్పుడు రామానుజుడు తన మంత్రశక్తితో దయ్యాన్ని వదిల్చాడు. దీంతో శిష్యునిపై యాదవ ప్రకాశకునికి అసూయ పుట్టింది. కాశీ యాత్ర తలపెట్టి మార్గమధ్యంలో రామానుజుడిని మట్టుబెట్టాలని ప్రణాళిక రచించాడు. ఈ విషయంలో గోవిందభట్టు అనే సహచర విద్యార్థి ద్వారా రామానుజుడికి విషయం తెలిసింది. దీంతో ఆయన ప్రయాణం మధ్యలోనే తప్పించుకుని వచ్చేశాడు. బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసిన మహనీయుడు రామానుజుల వారు. తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామికి పూజాధికాలు నిర్వహించే విషయమై రెండు తెగల మధ్య విభేదాలు పొడచూపాయి. ఆ సమయంలో తిరుపతికి వచ్చిన రామానుజులు.. ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిగా ఉండి దేవాలయంలో వైష్ణవ ప్రాబల్యం ప్రకారం పూజలు నిర్వహించాలని నిర్దేశించారు.

వైశాఖ శుద్ధ సప్తమి / గంగా సప్తమి
ఏప్రిల్‍ 22, ఆదివారం
గంగోత్పత్తి కథ పురాణ నామ చంద్రికలో విపులంగా ఉంది. తన ముత్తాతలైన సగర పుత్రులు కపిల మహాముని యొక్క కోపాగ్ని చేత నీరుగా
మారగా, వారికి సద్గతి కలిగించాలని తలంచి గంగను గురించి తపస్సు చేసి భూలోకానికి దిగి వచ్చేలా భగీరథుడు ప్రార్థించాడు. అప్పుడు ఆ మహానది ఆ మహర్షి ప్రార్థన మేరకు భూలోకానికి ఏతెంచింది. తొలిగా గంగా బిందువులు పడినచోటే బిందు సరస్సుగా వ్యవహరిస్తారు. ఈ సరస్సు నుంచి ప్రవహించే గంగా నది జహ్ను మహాముని ఆశ్రమాన్ని ముంచెత్తింది. ఆయన కోపగించి మొత్తం తాగేశాడు. పిమ్మట భగీరథుని ప్రార్థనతో ఆయన శాంతించి గంగను తన చెవి నుంచి విడిచి పెట్టాడు. ఈ కారణంగానే గంగకు జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. అలా గంగానది జహ్నుముని చెవి నుంచి పుట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి. ఈ రోజున గంగానదిలో స్నానం చేసి పూజ చేయాలి. ఇదెంతో పుణ్యప్రదం. శర్కరా సప్తమి, నింబా సప్తమి, అనోదన సప్తమి, ద్వాదశ సప్తమి మున్నగు వ్రతాలు కూడా ఈ తిథి నాడు ఆచరిస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే ఈనాడు పర్జన్య పూజ చేస్తారని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. వైశాఖ శుద్ధ సప్తమి నాడు గంగాదేవిని విశేషంగా పూజిస్తారు. భగీరథ మహర్షిని స్మరించుకుంటారు. ఈనాడు గంగానదీ స్నానం విశేష ఫలాన్ని ఇస్తుందని అంటారు. సగరులు తమ కులదైవమైన భగీరథుని స్మ•త్యర్థం ఆయనను విశేషంగా అర్చిస్తారు. వైశాఖ మాసం ప్రారంభదినమైన వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు నదీ స్నానం ఎంత శ్రేష్టమో వైశాఖ శుద్ధ సప్తమి నాడు కూడా స్నానం అంతే ఫలప్రదమైనది.
వైశాఖ శుద్ధ ఏకాదశి, ఏప్రిల్‍ 26, గురువారం
వైశాఖ శుద్ధ ఏకాదశి మోహినీ ఏకాదశి. ధనవంతుడైన ఒక కోమటి తన ధనాన్నంతా దుర్వినీయోగం చేశాడు. అప్పుడు బంధువులు అతనిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఏమీ తోచక అతడు ఒక అడవికి వెళ్లి తిరగసాగాడు. అక్కడ ఒక ముని కనిపించి అతనికి ఏకాదశి •వ్రతాన్ని ఉపదేశించాడు. ఆ కోమటి ఈనాడు ఏకాదశి వ్రతాన్ని చేసి తద్వారా కలిగిన పుణ్యం వలన తిరిగి ధనవంతుడు అయ్యాడు. అందువల్ల ఈ ఏకాదశి మిక్కిలి ఫలకారి.
ఇక, ఈనాడు అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు.

వైశాఖ శుద్ధ ద్వాదశి / పరశురామ జయంతి
ఏప్రిల్‍ 27, శుక్రవారం
వైశాఖ శుద్ధ ద్వాదశి తిథి పరశురామ జయంతి దినం. పరశురాముడు విష్ణువు యొక్క దశావతారాలలో ఆరో అవతారం. ఆయన వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు రాత్రి మొదటి జామున పునర్వసు నక్షత్రంలో ఆరు గ్రహాలు ఉచ్ఛంలో ఉండగా పుట్టాడు. తండ్రి జమదగ్ని. తల్లి రేణుక. పరశురాముడు మిక్కిలి చిన్నతనంలో తన తండ్రి పితామహుడైన భృగువు ఆశ్రమానికి వెళ్లాడు. అతని తేజస్సుకు తాళలేక భృగుముని శిష్యులు కళ్లు మూసుకున్నాడు. ముత్తాత ఇతనిని హిమాలయ పర్వతాల మీదకు వెళ్లి శివుని గురించి తపస్సు చేయాలని చెప్పాడు. పరశురాముడు అలాగే చేశాడు. శివుడు ప్రత్యక్షమై- ‘రామా! నీవింకా చిన్నవాడవు. రౌదాస్త్రాలు ధరించే శక్తి నీకు ఇంకా కలగలేదు. కొంతకాలం తీర్థయాత్రలు సాగించి తిరిగి రావాల’ని చెప్పాడు. తీర్థయాత్రలన్నీ చేసి పరశురాముడు తిరిగి తపం ప్రారంభించాడు. అప్పుడు శివుడు ఈయనకు గండ్రగొడ్డలిని ఆయుధంగా ఇచ్చాడు. అప్పటి నుంచి పరశురాముడు అయ్యాడు. ఈయన తల్లి రేణుక క్షత్రియకాంత. కానీ, ఈయన క్షత్రియులపై పగబట్టి వారందరినీ హతమార్చాడు. పరశురామ అవతారం విషయంలో కొన్ని విలక్షణాలు కనిపిస్తాయి. ఈ అవతారం తరువాతది రామావతారం. కాలంలో, నామంలో రెండూ సన్నిహితమైనవి. ఆజన్మ క్షత్రియ కులహంత అయిన పరశురాముడు క్షత్రియుడైన రాముడి చేతులలో తుదకు ఓడిపోయాడు. శివధనుస్సు విరిచి వివాహితుడై వస్తున్న రాముని ఎదిరించి పరశురాముడు భంగపడ్డాడు. విష్ణువు యొక్క ఒక అవతారం మరొక అవతారం చేతిలో ఓడిపోయిన సందర్భం ఇదొక్కటే.
వైశాఖ శుద్ధ చతుర్దశి / నృసింహ జయంతి
ఏప్రిల్‍ 29, ఆదివారం
నృసింహ జయంతి తెలుగునాట విశేష పర్వదినం. ఆంధప్రదేశ్‍, తెలంగాణ రాష్ట్రాలలోని నరసింహ క్షేత్రాలలో ఈనాడు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. విశేష పూజలు జరుగుతాయి. ఈ వైశాఖ శుద్ధ చతుర్దశి
నాడు ఉపవశించి నారసింహుడిని యథాశక్తి పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని వ్రత గ్రంథాలలో ఉంది. నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుగుతుంది. చతుర్దశి నాడు సాయంకాలం నృసింహమూర్తి హిరణ్యకశిపుని సంహారార్థం అతని ఆస్థాన మంటపంలో స్తంభంలో ఆవిర్భవించాడని పురాణ కథనం. వైశాఖ శుద్ధ త్రయోదశి నాటి రాత్రి
ఉపవశించి, చతుర్దశి నాడు కూడా ఉపవాసం ఉంది, ప్రదోషకాలమున నృసింహ విగ్రహాన్ని పూజించాలి. స్తంభం నుంచి ఆవిర్భవించిన అవతారం కనుక భవంతి, ఇంటి స్తంభాలకు తిరుమణి, తిరుచూర్ణములు పెట్టి పూజించాలి. రాత్రి జాగరణం చేసి, స్వర్ణసింహ విగ్రహాన్ని దానమిచ్చి మర్నాడు పారాయణ చేయాలి. ఈ కాలం వైశాఖం, గ్రీష్మం కనుక వడపప్పు, పానకాలను నైవేద్యంగా పెడతారు.
హిరణ్యకశిపుని సంహరించిన పిదప శాంతకోపుడై సుఖాశీనుడైన నృసింహునికి ప్రహ్లాదుడు చేతులు జోడించి- ‘దేవా! నీవు నాకు శత్రుకోటిలోని వాడవు. నీ యందు నాకు భక్తి కలగడానికి కారణం ఏమిటి? నేను నీకెట్లు ప్రీతిపాత్రుడనైతిని?’ అని అడిగాడు. నృసింహ భగవానుడు ఇలా చెప్పాడు- ‘వత్సా! వినుము. నీవు నాకు ప్రీతిపాత్రుడవు అగుటకు నీ భక్తే కారణం. నువ్వు పూర్వజన్మలో వాసుదేవుడనే విప్రుడవు. వేశ్యాలోలుడవై నా వ్రతం తప్ప వేరొక వ్రతం చేయకుంటివి. నా వ్రత ప్రభావాన నీకు నాయందు భక్తి కలిగినది. దాని కారణం కూడా వినుము. అవంతీ నగరాన సుశర్మ అనే వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుశీల ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు. వారిలో కనిష్టుడవు నీవు. నీవు వేశ్యాలోలుడవై చేయరాని పనులన్నీ చేసితివి. ఒకనాడు నీకు, వేశ్యకు మధ్య కలహం జరిగింది. ఆ రాత్రి నువ్వు కలహ కారణం చేత భోజనం చేయలేదు. ఆనాడు నా జయంతి. వేశ్య తోడు లేనందున ఆ రాత్రి నువ్వు జాగరణ కూడా చేశావు. వేశ్య కూడా అట్లే చేసినది. తెలియకనే ఇలా వ్రతం చేయడం వల్ల మీరిద్దరూ ముక్తులై ఉత్తమ గతులు పొందారు’ అని వివరించాడు. ఇదీ నృసింహ పురాణ గాథ.

వైశాఖ శుద్ధ పూర్ణిమ / బుద్ధ జయంతి/ కూర్మ జయంతి
ఏప్రిల్‍ 30, సోమవారం
వైశాఖ పూర్ణిమ ఎన్నో విశేషాల ఉద్ధిష్టమైన తిథి. ఈ పూర్ణిమ నాడు పరమ పవిత్ర పర్వదినాలు ఉన్నాయి. ఏ మాసంలో వైశాఖి పూర్ణిమ వస్తుందో ఆ మాసాన్ని వైశాఖ మాసమని అంటారు. మహా వైశాఖి చాలా విధాలుగా పవిత్రమైనది. ఈనాడు బుద్ధ జన్మ మహోత్సవమని నీలమత పురాణం చెబుతోంది. వైశాఖ శుద్ధ పూర్ణిమను మహా వైశాఖి అంటారు. విశాఖ అంటే కాంతిని వ్యాపింప చేసేది అని అర్థం. అటువంటి విశాఖ నక్షత్రంతో కూడిన పూర్ణిమకు వైశాఖి అని పేరు.
కుమారోద్భవం: తమిళులు ఈ పర్వాన్ని ‘వెయ్‍కాసి విశాఖ’ అంటారు. తమిళనాడులో ఈనాడు యమధర్మరాజు పూజలు అందుకుంటాడు. సుబ్రహ్మణ్యస్వామి విశాఖ పూర్ణిమ నాడే అవతరించినట్టు చెబుతారు. నమ్మాళ్వారు అనే వైష్ణవ స్వామి ఈ పూర్ణిమ నాడే పుట్టాడని చెబుతారు. వైశాఖ పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయాలి. ఈనాడు ధర్మరాజు ప్రీతిని కోరి నానావిధ దానాలు చేసే వారు విశేష ఫలాలను పొందుతారని అంటారు. మహా వైశాఖి పర్వదినాన మహాన•ధిలో స్నానం చేసి పురుషోత్తముడిని దర్శించుకుంటే కోటి జన్మలలోని పాపం పోతుందని ప్రతీతి. ఇంకా ఈనాడు సోమవార వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
కూర్మ జయంతి: కూర్మావతారం కూడా ఈనాడే ప్రాదుర్భవించింది. కాబట్టి ఈ తిథి కూర్మ జయంతి పర్వదినం కూడా. ఇది విష్ణువు దశావతారాల్లో రెండవది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించినప్పుడు విష్ణువు కూర్మావతారాన్ని దాల్చి తన వీపుపై మందరగిరిని ఉంచుకుని పైకి ఎత్తాడని పురాణ కథనం.
బుద్ధ జయంతి: దశావతారాల్లో ఒకటని చెప్పే బుద్ధావతారం ఈనాడే అవతరించింది. బుద్ధుని జీవితకాలంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యాన్ని వహించింది.
1. ఒకానొక వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధుడు లుంబినివనంలో
సాలవృక్ష ఛాయలలో జన్మించాడు.
2. మరో వైశాఖ పూర్ణిమ నాడు గయలో మర్రిచెట్టు కింద జ్ఞానబోధ కలిగి బుద్ధుడు అయ్యాడు.
3. ఇంకో వైశాఖ పూర్ణిమ నాడు కుసినరలో సాల వృక్షాల కింద బుద్ధుడు నిర్యాణం చెందాడు.
బుద్ధుని జీవితంలో ఇవి ముఖ్య ఘట్టాలు. ఈ మూడు ముఖ్య ఘట్టాల్లో ప్రదేశాలు మారాయి. చెట్లు మారాయి. తిథి మాత్రం మారలేదు. అందుచేత వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు మహా పర్వమై ఉంది. వైశాఖ పూర్ణిమ నాడు బోధి వృక్షానికి పూజ చేసే ఆచారం బుద్ధుని జీవితకాలంలోనే ప్రారంభమైంది.
శరభ జయంతి: వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు విష్ణువు నరసింహావతారం ఎత్తాడు. ఈ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నృసింహునిలో ఆగ్రహం చల్లారలేదు. ఆ ఆగ్రహాగ్నికి లోకాలు గజగజలాడుతున్నాయి. అప్పుడు దేవతలు శివుని ప్రార్థించారు. శివుడు వైశాఖ పూర్ణిమ నాడు శరభావతారం ఎత్తాడు. కాబట్టి ఈనాడు శరభ జయంతి కూడా. శరభం ఎనిమిది కాళ్ల జంతువు. సింహాన్ని చంపగలిగే శక్తి కలది. శరభ రూపాన శివుడు నరసింహాన్ని సంహరించి ఆ చర్మాన్ని ఒలిచి కప్పుకున్నాడు.

Review విష్ణు విలాస వైశాఖం...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top