వెలుగు రేఖల వైశాఖం

మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే.. అతి పవిత్రమైన పండుగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ధమై ఉన్నాయి. ప్రతి నెలలో వచ్చే ముఖ్య పర్వదినాలు.. వాటి విశేషాలను అందించేదే ఈ శీర్షిక. ఈ మాసం.. వైశాఖం. ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో రెండవ మాసం. మరి, ఈ మాస విశేషాలేమిటో తెలుసుకుందామా.

వైశాఖ మాసంలో గృహ నిర్మాణ ఆరంభానికి ఉద్ధిష్టమైన నెల. వైశాఖ మాసమంతా తులసి, అశ్వత్థ వృక్షాలకు రోజూ నీళ్లు పోస్తే అనంత పుణ్యఫలం కలుగుతుందట. ఈ నెలలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తే, ధనరత్న ప్రాప్తి అని మత్స్య పురాణం చెబుతోంది. ఇలా ఈ నెలంతా తెల్లవారుజామునే స్నానాలు చేయాలని ఆయా వ్రత గ్రంథాల నియమం. అలాగే, ఈ నెలంతా విష్ణువుని తులసీ దళాలతో పూజించాలని పెద్దలు చెబుతారు.
వైశాఖ శుద్ధ పాడ్యమి
వైశాఖ స్నానాల ప్రారంభ దినం వైశాఖ
శుద్ధ పాడ్యమి. ఈ రోజున చేసే స్నానం వల్ల మానవుల్ని ఆశించే నాలుగు రకాల పాపాలు (వాజ్ఞన, కాయజాశేష పాపాలు) పోతాయని ప్రతీతి. పైగా ఈ మాసంలో ప్రాతఃకాల స్నానాలు మాధవునికి (విష్ణు) అత్యంత ప్రీతి కలిగిస్తాయని అంటారు. స్నానానంతరం రావిచెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం ఆరోగ్యకరం.
వైశాఖ శుక్ల తదియ
త్రేతాయుగానికి ఇది ప్రారంభ దినం. ఈ తిథినే అక్షయ తృతీయ అని కూడా అంటారు. ఈ పర్వం పూర్వాహ్ణ వ్యాపిని అని వ్రతరాజం అనే గ్రంథంలో ఉంది. అక్షయ తృతీయ సోమవారం కానీ బుధవారం కానీ వస్తే మరీ పవిత్రం. ఈనాడు చేసే దానాలు అక్షయమైన ఫలాన్ని ఇస్తాయని ప్రతీతి. ఇక, మరో విధంగా కూడా వైశాఖ శుద్ధ తదియ పవిత్రమై ఉంది. ఈ రోజు కేరళీయులకు సంవత్సరాది. దీనినే వారు ‘విషు’ పేరుతో జరుపుకొంటారు. ఇంకా ఈ పర్వదినం నాడు లక్ష్మీనారాయణ పూజ, త్రిలోచన గౌరీపూజ, చందన మహోత్సవం వంటివి కూడా ఆచరిస్తారు.
వైశాఖ శుద్ధ పంచమి
వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆది శంకరాచార్యుల వారు జన్మించారని ప్రతీతి. ఈనాడు శృంగేరి తదితర శంకరాచార్యుల పీఠాలలో జయంత్యుత్సవాలను నిర్వహిస్తారు. శంకరాచార్యులు అద్వైత మత స్థాపనాచార్యుడు. అద్వైత మతం వేదాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలో ఉన్నదే. ప్రజలు దానిని నాడు మరిచిపోగా శంకరాచార్యులు భారతావని మొత్తం తిరిగి వ్యాప్తిలోకి తెచ్చారు. బౌద్ధంలోని మంచి విషయాలను కూడా ఆయన అద్వైతంలోకి చేర్చారు.
వైశాఖ శుద్ధ షష్ఠి
వైశాఖ శుద్ధ షష్ఠి రామానుజాచార్యుల జయంతి. శంకర, రామానుజ, మధ్వ అనే త్రిమతాచార్యులలో ఈయన రెండవ వారు. విశిష్టాద్వైత మతోద్ధారకుడు. శ్రీపెరంబుదూరు ఈయన జన్మస్థలం. ఈయన వేదాంతసారం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం అనే గ్రంథాలు రాసి శ్రీభాష్యాన్ని పూర్తి చేశారు. భగవద్గీతకు కూడా ఈయన భాష్యం రాశారు. అలాగే, ఈ తిథి నాడు పుతప్రాప్తి వ్రతం కూడా ఆచరిస్తారు.
వైశాఖ శుద్ధ సప్తమి
ఈనాడు గంగోత్పత్తి జరిగిందని అంటారు. అందుకే ఈ సప్తమిని గంగా సప్తమి అని అంటారు. గంగా నది ఈనాడు జహ్నుముని చెవి నుంచి పుట్టిందట. కాగా, ఈ రోజున గంగానదిలో స్నానం చేసి పూజ చేయాలి. శర్కరా సప్తమి, నింబా సప్తమి, అనోదన సప్తమి, ద్వాదశ సప్తమి మున్నగు వ్రతాలు కూడా ఈనాడు చేస్తారు.
వైశాఖ శుద్ధ అష్టమి
ఈ తిథి నాడు కొన్ని చోట్ల దేవీ పూజ చేస్తారు.
వైశాఖ శుద్ధ ఏకాదశి
ధ•నవంతుడైన ఒక వైశ్యుడు తన సంపదనంతా దుర్వినియోగం చేసుకొన్నాడు. బంధువులు అతడిని వెళ్లగొట్టారు. ఏమీ తోచని అతను ఒక అడవిలోకి వెళ్లి తిరుగుతుండే వాడు. అక్కడ ఒక ముని కనిపించి అతనికి ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించాడు. ఆ వైశ్యుడు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ఆ వ్రతాన్ని ఆచరించి పుణ్యం దక్కించుకొన్నాడు. ఫలితంగా తిరిగి పోగొట్టుకున్న తన సంపదనంతా పొందాడు. అందువల్ల ఈ ఏకాదశికి ‘మోహిన్యేకాదశి’ అనే పేరు వచ్చింది. మిక్కిలి ఫలకారి అని ఈ ఏకాదశికి పేరు.
వైశాఖ శుద్ధ ద్వాదశి
వైశాఖ శుద్ధ ద్వాదశి.. పరశురామ జయంతి తిథి అని చతుర్వర్గ చింతామణిలో ఉంది. పరశురాముడు విష్ణువు యొక్క దశావతారాలలో ఆరో అవతారం. ఆయన వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు రాత్రి మొదటి జామున పునర్వసు నక్షత్రంలో ఆరు గ్రహాలు ఉచ్ఛదశలో ఉండగా పుట్టాడట. తండ్రి జమదగ్ని. తల్లి రేణుక. పరశురాముడు అనులోమ సంజాతుడు. క్షత్రియ స్త్రీ అయిన తల్లికి, బ్రాహ్మణుడైన తండ్రికి పుట్టిన వాడు. దశావతరాల్లో ఇది విలక్షణమైన అవతారం. అసోం రాష్ట్రంలో ప్రసిద్ధమైన కామాక్షి దేవి ఆలయం ఉంది. అదే నాడు జమదగ్ని ఆశ్రమం అని అంటారు. ఈ ప్రాంతంలోనే పరశురామాలయం కూడా ఉందని తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో మలబారు భూమి ఉన్న చోట కరువు ఉండదట. రత్నగిరిలో పరశురామ మందిరం ఉంది. అక్కడ వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ రోజున పరశురాముడికి అర్ఘ్యం ఇస్తే శత్రు నాశనం జరుగుతుందని అంటారు.
వైశాఖ శుద్ధ చతుర్దశి
ఈ తిథి నరసింహ చతుర్దశి వ్రత దినంగా పెక్కు వ్రత గ్రంథాలు పేర్కొన్నాయి. విష్ణుమూర్తి దశావతారాల్లో నరసింహావతారం నాలుగోది. దక్షిణ భారతదేశంలో ఈనాడు నృసింహ జయంతి పర్వదిన సందర్భంలో దీపోత్సవాలు గొప్పగా నిర్వహిస్తారు. ఊరేగింపులు కన్నులవిందుగా సాగుతాయి. హంపిలోని దేవాలయం ఈ ఉత్సవాలకు చాలా ప్రసిద్ధి. జయపుర సంస్థానంలో ఖండేలా అనే చోట పన్నెండు చేతులు గల అపూర్వ నృసింహ విగ్రహం ఉంది. మధుర, అయోధ్య నగరాల్లో ఈనాడు నృసింహ లీల అనే ఉత్సవం నిర్వహిస్తారు. ఈనాడు స్వామిని యథాశక్తితో పూజించి పానకాన్ని నివేదించాలి. పానకం నరసింహస్వామికి అత్యంత ప్రియమైనదని ప్రతీతి.
వైశాఖ శుద్ధ పూర్ణిమ
ఏ మాసంలో వైశాఖ పూర్ణిమ వస్తుందో ఆ మాసానికి వైశాఖమని పేరు. వైశాఖిని మహా వైశాఖి అని గొప్పగా వర్ణిస్తారు. వైశాఖ పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయాలట. ఈనాడు ధర్మరాజు ప్రీతిని కోరి విరివిగా దానాలు చేయాలని చెబుతారు. అలాగే, ఈనాడు బుద్ధుని జయంతిగానూ నిర్వహిస్తారు. అలాగే, ఈ తిథి నాడు శరభ జయంతి, కూర్మ జయంతి వంటి పర్వాలను కూడా నిర్వహించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది.
వైశాఖ బహుళ పాడ్యమి
ఈనాడు ‘భూతమాత్రుత్సవం’ నిర్వహించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు మొదలు జ్యేష్ఠ పూర్ణిమాంతం వరకు శ్రీప్రాప్తి వ్రతం ఆచరించాలని కూడా ఈ గ్రంథంలో పేర్కొన్నారు.
వైశాఖ బహుళ విదియ
ఈ తిథి నారద జయంతిగా ప్రసిద్ధి. ఈనాడు వీణా దానం చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. నారదుడు గాన విద్యా కుశలుడు. అతని వీణకు ‘మహతి’ అని పేరు. ఆ వీణపై సదా విష్ణుగానం చేస్తూ త్రిలోకాల్లో సంచరిస్తూ ఉంటాడు నారదుడు. నారదుడు గత కల్పములలో ఉపబర్హణుడు అనే గంధర్వుడుగా పుట్టాడట. ఆ జన్మలో అతను నారాయణ కథలు గానం చేసేవాడట. తరువాత కల్పమున బ్రహ్మ మానస పుత్రునిగా జన్మించి తిరిగి విష్ణు గానం చేయసాగాడట. అలా ఆయన జన్మ మొత్తం విష్ణువు ఆరాధనకే అంకితమైంది.
వైశాఖ బహుళ ఏకాదశి
ఈ తిథికి అపరైకాదశి అని పేరు. ఈనాడు ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉంటే పవిత్ర తీర్థాల్లో స్నానం చేసిన ఫలం, పలు రకాల దానం చేసిన ఫలం కలుగుతుందని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.
వైశాఖ బహుళ చతుర్దశి
ఈ తిథి నాడు ఉపవాసం ఉండి, ప్రదోష కాలంలో స్నానం చేసి, తెల్లని వస్త్రాలు ధరించి, గంధం మొదలైన ఉపచారాలతో, మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాలి. ఈ తంతునే లింగ వ్రతం అంటారు. ఈనాడు పిండితో శివలింగాన్ని తయారు చేసి పంచామృతాలతో స్నానం చేయించి కుంకుమ పూసి ధూప, దీప నైవేద్యాలతో శివుడిని పూజించాలి.
వైశాఖ బహుళ అమావాస్య
వైశాఖ బహుళ అమావాస్య గురువారంతో కలిసి వస్తే విశేష ఫలప్రదమని అంటారు. ఈనాడు ప్రయాగలో స్నానం పాపహరం. త్రయోదశి నాడు ఆరంభించి ఈనాటితో సావిత్రీ వ్రతం పూర్తి చేస్తారు. పితురులను పూజించడం, పార్వణవిధితో శ్రాద్ధము దానం ఈనాటి విధులు. అలాగే, ఈ తిథి నాడు వృషభ సంక్రాంతి •

Review వెలుగు రేఖల వైశాఖం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top