వ్రతాల సాధన..బోనాల జాతర

ఆంగ్లమానం ప్రకారం ఆరవ నెల జూన్‍. ఇది తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ట – ఆషాఢ మాసాల
కలయిక. జ్యేష్ట మాసంలోని కొన్ని రోజులు, ఆషాఢ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. జ్యేష్ఠంలో గృహ నిర్మాణ పనులను ప్రారంభించడం మంచిది కాదని మత్స్య పురాణంలో ఉంది. జూన్‍ 18 వరకు జ్యేష్ఠ మాస తిథులు, ఆపై 19 నుంచి 30 వరకు ఆషాఢ మాస తిథులు కొనసాగుతాయి. తొలి ఏకాదశి, యోగినీ ఏకాదశి, పూరీ జగన్నాథస్వామి రథోత్సవం వంటివి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్య పర్వాలు. ఇంకా జ్యేష్ట, ఆషాఢ మాసాల కలయిక అయిన జూన్‍ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, పర్వాల గురించి తెలుసుకుందాం..

2023- జూన్‍ 1, గురువారం, జ్యేష్ట శుద్ధ ద్వాదశి నుంచి
2023- జూన్‍ 30, శుక్రవారం, ఆషాఢ శుద్ధ ద్వాదశి వరకు..
శ్రీశోభకృతు నామ సంవత్సరం-జ్యేష్ఠం-ఆషాఢం- గ్రీష్మ రుతువు- ఉత్తరాయణం

జ్యేష్ట మాస తిథులు ఇరవై రోజులు.. ఆషాఢ మాస తిథులు పది రోజుల పాటు ఉండే జూన్‍ నెల- శూన్య మాసం. శుభ ముహూర్తాలు లేకున్నా.. ఆచరించదగిన, పాటింపదగిన పర్వాలు, ఆచారాలు ఈ నెలలో కూడా ఉన్నాయి. ప్రధానంగా ఆషాఢ మాసం ప్రారంభమయ్యేది ఈ నెలలోనే. అతివల అరచేత గోరింటాకు సింగారమై మెరిసేది ఈ నెలలోనే! ఆషాఢంలో సాధారణంగా శుభ ముహూర్తాలు పెట్టుకోరు. వివాహ, గృహ సంబంధ కార్యాలను ఈ నెలలో వాయిదా వేస్తారు. అయితే, ఆయా తిథులను అనుసరించి నిర్వర్తించాల్సిన పూజాధికాలు, ఆచారాలు కొన్ని ఈ నెలలో ఉన్నాయి. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు. మునగ కూర కూడా తినాలని నియమం. అలాగే, ఆషాఢంలో అనపపప్పు వాడాలని అంటారు. ఈ నెలలో వచ్చే పర్వాల్లో అత్యంత విశిష్టమైనది, విష్ణువుకు ప్రీతికరమైనది.. ‘తొలి ఏకాదశి’. చాతుర్మాస్య వ్రతం కూడా ఈ నెల నుంచే ఆరంభం అవుతుంది. అలాగే, గురువును సైతం దైవంగా భావించి, ఎంచి కొలిచే మన భారతీయ గడ్డపై గురువును పూజించడానికి ఒక విశిష్టమైన రోజు ఉంది. అదే గురుపూర్ణిమ. అదీ ఈ నెలలోనే వస్తుంది. ఈ నెలలో తెలుగు రాష్ట్రాలలోని పల్లెల్లో జాతర సంరంభం నెలకొంటోంది. ఎటుచూసినా అమ్మవార్ల పూజలతో బోనమెత్తిన పల్లెలు.. శివాలూగే భక్తజనంతో సందడి వాతావరణం అలముకుంటుంది. అందుకే ఆషాఢ మాసం అమ్మ వారి ఆరాధనకు శ్రేష్ఠమైనది. గృహనిర్మాణాలను ఈ మాసంలో ఆరంభించరు. శుభ కార్యక్రమాలను తలపెట్టరు. అయితే, ఆధ్యాత్మికంగా చూస్తే శక్తివంతమైనది ఈ మాసం. జ్యేష్ఠ – ఆషాఢ మాసాల కలయికతో కూడిన జూన్‍ మాసం.. అటు మండు వేసవికి, ఇటు వర్ష రుతువు ఆరంభ దినాలకు వారధి. నెల చివరకు వచ్చేసరికి ఎండలు చల్లబడతాయి.

జ్యేష్ట శుద్ధ ద్వాదశి/చంపక ద్వాదశి
జూన్‍ 1, గురువారం

జ్యేష్ట శుద్ధ ద్వాదశి తిథి నాడు చంపక ద్వాదశి వ్రతాన్ని ఆచరించాలని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు త్రివిక్రమ పూజ చేయాలని కూడా అంటారు. అలాగే, దీనిని రామలక్ష్మణ ద్వాదశి అని కూడా అంటారు. ఈనాడు కూర్మ జయంతి అని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీశంకరాచార్య కైలాసగమనం ఈ తిథి నాడే జరిగింది. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.

జ్యేష్ట శుద్ధ త్రయోదశి/
తివ్రతాల ముహూర్త దినం
జూన్‍ 2, శుక్రవారం

మూడు వ్రతాలు చేసే ముహూర్త దినం- జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి.
ఒకటి- దుర్గంధ దౌర్భాగ్య నాశన త్రయోదశీ వ్రతం.
రెండు- జాతి త్రిరాత్రి వ్రతం.
మూడు- రంభా త్రిరాత్రి వ్రతం.
చివరి రెండు వ్రతాలు ఈనాటి రాత్రి మొదలు మూడు రాత్రుల పర్యంతం సాగేవి. ఈ మూడు వ్రతాల రీత్యానే కాక ఈనాడు మరొక విషయం చేత కూడా ఉద్ధిష్టమై ఉంది. ఈ తిథి విద్యారణ్యారాధాన దినం కూడా. విద్యారణ్యుల వారు ఈ తిథి నాడే సిద్ధి పొందారు. విద్యారణ్య స్వామి వేదత్రయ భాష్యకర్త. విద్యానగరమును, విద్యానగర సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు. లౌకికం, వైదికం.. రెండింటా అసమాన ప్రతిభ గలవారీయన. ఆయనకు వివేకం తెలిసే సరికి ఉత్తర హిందుస్థానమంతా మహ్మదీయుల వశమైంది. దక్షిణాదినా అన్య మతస్తులు అక్కడక్కడా అడుగుపెట్టారు. ఇవి విద్యారణ్యస్వామిని కలతపెట్టాయి. అప్పుడు ఆయన తుంగభద్ర నదీ తీరాన భువనేశ్వరి అమ్మవారిని గురించి తీవ్రమైన తపస్సును గాయత్రీ మంత్రంతో ప్రారంభించాడు. అమ్మవారు ప్రసన్నరాలై ప్రత్యక్షమైంది. వరం కోరుకొమ్మనగా, ఐశ్వర్యం కోరుకున్నాడు. అమ్మ వారు అది వీలు కాదంది. దీంతో అక్కడికక్కడే విద్యారణ్య పేరుతో సన్యసించి శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించాడు. విరూపాక్ష పీఠం నెలకొల్పినది ఈయనే. హరిహర రాయలు, బుక్కరాయలుకు కొంతకాలం ఈయన మంత్రిగానూ ఉన్నారు.
విద్యారణ్య స్వామి ఆంధ్రుడా, ద్రవిడుడా, కర్ణాటకుడా, మహారాష్ట్రుడా అనే సందేహం ఉంది. ఆయన జాతి విషయమై వివరణ ‘విద్యారణ్య చరిత్ర’లో ఉంది. ఆయన ఆంధ్రుడే అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆది శంకరుల తరువాత అంతటి వారు విద్యారణ్య స్వామి. ఆది శంకరుడు కశ్మీరం నుంచి శృంగేరికి తెచ్చిన శారదా విగ్రహం చందన ప్రతిమను విద్యారణ్య స్వామి తన హయాంలో పంచలోహాలతో తయారు చేయించి పూర్ణకుంభాలతో అభిషేకం చేశాడు. ఆ విగ్రహమే నేటికీ శృంగేరీ పీఠంలో పూజలందుకుంటోంది.
ఇక, ఈ రోజు మన రెండు తెలుగు రాష్ట్రాలకు పుట్టినరోజులాంటిది. జూన్‍ 2ను ఆంధప్రదేశ్‍లో పునర్విభజన దినంగానూ, తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవంగానూ నిర్వహిస్తున్నారు.

జ్యేష్ట శుద్ధ చతుర్దంశి/చంపక చతుర్దశి,
జూన్‍ 3, శనివారం

జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి చంపక చతుర్దశి. ఈనాడు వాయు వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, రుద్ర వ్రతం చేయాలని స్మతి కౌస్తుభం చెబుతున్నాయి.

జ్యేష్ట శుద్ధ పూర్ణిమ/ఏరువాక పూర్ణిమ/వట సావిత్రి వ్రతం
జూన్‍ 4, ఆదివారం

వర్ష రుతువు ఆరంభానికి సంకేతం.. జ్యేష్ట శుద్ధ పూర్ణిమ. ఈనాడు జరుపుకునే పర్వం ఏరువాక పున్నమి. ఇదే తెలుగునాట ఏరువాక పున్నమిగా ప్రసిద్ధి. మన పంచాంగంలో జ్యేష్ఠ పూర్ణిమ నాటి వివరణలో ‘వృషభ పూజా, హల ప్రవాహ’ తదితర పదాలున్నాయి. ఎద్దులను పూజించడం, నాగలి సాగించడం ఈనాటి విధాయ కృత్యాలని ఈ పదాలకు గల అర్థాలను బట్టి తెలుస్తోంది. ఏరువాక అంటే వివిధ అర్థాలున్నాయి.
ఏరు= సర్వావయవములు గల నాగలికి ఎడ్లను కట్టినది, సర్వావయములు గల నాగలి.
ఏరువాక= దున్నుటకు ఆరంభం.
శబ్ద రత్నాకరం నిఘంటువులో పేర్కొన్న ప్రకారం..
ఏరు= ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధంచేసిన నాగలి.
ఏరువాక= దుక్కి యొక్క ప్రారంభం.
ఈ రెండు అర్థాలను విశదీకరించి చూస్తే ఇది వ్యవసాయదారులకు సంబంధించిన పర్వమని స్పష్టంగా తెలుస్తోంది. ఏరువాక పున్నమిని వర్ష రుతువు ఆరంభంలో ఆచరిస్తారు. ఈ సమయంలో వర్షాలు కురిసి భూమి పదునెక్కితే పునర్వసు కార్తెలో పునాస విత్తనాలను జల్లుతారు. ఈ పని పునర్వసు కార్తెలో జరుగుతుంది కాబట్టే ఈ కాలంలో పండే పంటను పునాస పంట అంటారు. ఏరువాక పండుగ నాడు రైతులు ఎద్దులను శుభ్రంగా కడుగుతారు. వాటి కొమ్ములకు రంగులను పూస్తారు. గజ్జెలు, గంటలు, అద్దం, కుచ్చులు తదితరాలను ఎద్దులకు అలంకరిస్తారు. ఉదయాన్నే ఇంట్లో పొంగలి (పులగం) వండి ఎద్దులకు పెడతారు. ఎద్దులను కట్టి ఉంచే కాడికి ధూపదీప నైవేద్యాలు ఇస్తారు. సాయంకాలం తప్పెట, మేళం తదితర మంగళవాద్యాలతో ఎద్దులను ఊరి బయటకు తోలుకుని వెళ్తారు. ఊరి పొలిమేరలో పుంటినారతో చేసిన తోరణాన్ని కడతారు. ఈ తోరణాన్ని రైతులు తమ చర్నాకోలలతో కొట్టి

పీచుపీచు చేసి ఎవరికి దొరికిన పీచు వారు తీసుకొనిపోతారు. దానిని ఇంట్లో పెట్టుకుంటారు. ఇది పశువులకు మేలు కలిగిస్తుందనేది వారి నమ్మకం.
కన్నడనాట కూడా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఇదే మాదిరిగా ఎద్దులను పూజిస్తారు. ఈ పర్వాన్నే వారు ‘కారుణిపబ్బ’ అని పిలుస్తారు.
ఏరువాక పుర్ణిమ పూర్వ కాలం నుంచి సంప్రదాయంలో ఉన్న పర్వం. మనది వ్యవసాయ ప్రధాన దేశం కావడంతో అనాదిగా ఇది ఆచారంగా వస్తోంది.
ఎద్దులతో మన రైతులది అవినాభావ సంబంధం.
‘ఎద్దులు లేని సేద్యం చద్దిలేని పయనం’, ‘ఒంటి ఎద్దుసేద్యం వరిగాలు నొప్పి’, ‘గొడ్లు, వడ్లు ఉన్న వాడిదే వ్యవసాయం’, ‘ఎక్కువ వెల పెట్టి గుడ్డను తక్కువ వెల పెట్టి గొడ్డును కొనకూడదు’.. తెలుగు నాట ప్రాచుర్యం గల ఈ సామెతలన్నీ ఎద్దుల ప్రాముఖ్యతను తెలిపేవే.
ఈ కాలంలో బండలు పగిలే భరణి కార్తె ఎండలు, రోళ్లు పగిలే రోహిణి కార్తె ఎండలు తగ్గుతాయి. మృగశిర కార్తెతో ముంగిళ్లు చల్లబడతాయి. ఆపై ఆరుద్ర వాన అదును వాన. ఇది వ్యవసాయానికి అనువైన కాలం. రోహిణిలో విత్తనాలు చల్లితే రోళ్లు కూడా నిండని అల్ప పంట చేతికందుతుందని మన రైతుల నమ్మకం.
ఇక, జ్యేష్ఠ పూర్ణిమ.. సావిత్రీ వ్రతాచరణ దినం కూడా. ఈనాడు బంగారంతో కానీ, మట్టితో కానీ సావిత్రీ, సత్యవంతుల ప్రతిమలను చేసి యథాశక్తి పూజించాలి. ఆ రాత్రి సావిత్రి కథ వింటూ జాగారం చేయాలి. తెల్లవారిన తరువాత సావిత్రి ప్రతిమను దక్షిణసహితంగా దానం చేయాలి. ఇది స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతం. ఇంకా ఈనాడు తిలచ్ఛత్రాదిదానం, బిల్వత్రిరాత్రి, పుత్రకామ, అశోకత్రిరాత్ర తదితరమైన వ్రతాలు కూడా చేస్తారని వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. ఆమాదేర్‍ జ్యోతిషి అనే గ్రంథంలో ఈ వ్రతాన్ని గురించి స్నాన పూర్ణిమ వ్రతంగా పేర్కొంది.
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు వట పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. దీనినే వట సావిత్రీ వ్రతం అనీ అంటారు. వివాహితులైన స్త్రీలు జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పర్వాన్ని ఆచరిస్తారు. ఈరోజున ఉపవాసం ఉంటారు. స్త్రీలకు వైధవ్యం రాకుండా ఈ పర్వం చేస్తుందని అంటారు. ఇది మూడు రోజుల వ్రతం. త్రయోదశి నాడు మొదలుకుని పౌర్ణమి వరకు ఉపవసిస్తారు. కొందరు పౌర్ణమి నాడు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ‘వట’ అంటే మర్రి చెట్టు. ఆ చెట్టుకు ఈనాడు పూజలు చేస్తారు. మర్రిచెట్టుకు దారం చుడుతూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని అంటారు.
జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున చేసే వస్త్ర దానాలు విశేష ఫలాన్నిస్తాయి.
కాగా, కబీరుదాసు జయంతి తిథి కూడా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడే.
జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ అనంతరం వచ్చే జ్యేష్ఠ బహుళ పాడ్యమి మొదలు జ్యేష్ఠ బహుళ సప్తమి వరకు ఎటువంటి ప్రత్యేక దినాలు లేవు.

జ్యేష్ట బహుళ అష్టమి/శివపూజకు
అంకురార్పణ
జూన్‍ 11, ఆదివారం

జ్యేష్ట బహుళ అష్టమి తిథి నాడు తిందుకాష్టమీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇక్కడి నుంచి మొదలుకుని దాదాపు ఏడాది పాటు శివపూజ చేయాలని నియమం. అలాగే ఈనాడు వినాయకాష్టమిగా నీలమత పురాణంలో పేర్కొన్నారు. త్రిలోచన పూజ, శీతలాష్టమి అనీ అంటారు.

జ్యేష్ట బహుళ ద్వాదశి
జూన్‍ 15, గురువారం

జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు ప్రత్యేకించి ఆచరించదగిన వ్రతాలు, ముఖ్యమైన పూజాధికాలేమీ లేవు. కానీ, ప్రదోష వ్రతం మాత్రం ఆచరిస్తారు.

జ్యేష్ట బహుళ త్రయోదశి
జూన్‍ 16, శుక్రవారం

జ్యేష్ఠ బహుళ త్రయోదశి నాడు రోహిణీ వ్రతాన్ని ఆచరిస్తారు.

జ్యేష్ట బహుళ చతుర్దశి
జూన్‍ 16, శనివారం

జ్యేష్ఠ బహుళ చతుర్దశి తిథి శివుడికి ప్రీతికరమైనది. ఇది మాస శివరాత్రి తిథి.

జ్యేష్ట బహుళ అమావాస్య/
భోగశాయి పూజ
జూన్‍ 17, ఆదివారం

జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు భోగశాయి పూజ చేయాలని అంటారు. ఈ పూజ చేసి ఉపవాసం ఉండాలి. హేమాద్రి పండితుడు ఈ పూజకు సంబంధించిన వివరాలను హేమాద్రి వ్రత ఖండంలో పేర్కొన్నారు. ఇంకా ఈనాడు సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. జ్యేష్ఠ బహుళ అమావాస్య మిథున సంక్రాంతి పర్వదినం.
అలాగే, జూన్‍ 17, ఆదివారం అంతర్జాతీయ పితృ దినోత్సవం (ఫాదర్స్ డే)గా పాటిస్తారు.

ఆషాఢ శుద్ధ పాడ్యమి
జూన్‍ 19, సోమవారం

ఈనాటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది.

ఆషాఢ శుద్ధ విదియ/జగన్నాథ రథయాత్ర
జూన్‍ 20, మంగళవారం

ఆషాఢ శుద్ధ విదియ తిథి నాడు పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. ఈనాడు ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్రను చూసి తీరవలసిందే. ఈ రథయాత్ర జగత్ప్రసిద్ధమైనది. అలాగే, ఈ తిథి శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినమని ప్రతీతి. ఒడిశాలోని పూరీ క్షేత్రానికి ‘పురుషోత్తమ క్షేత్రం’ అని మరో పేరు. వివిధ పురాణాల్లో ఈ క్షేత్ర ప్రశస్తి ఉంది. నారాయణుడు మొదట ఈ సాగర తీరంలోని అరణ్యాల్లో నీల మాధవుడిగా నెలకొని ఉన్నాడని అంటారు. ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు స్వామికి రథయాత్ర జరుగుతుంది. నాటి నుంచి పది రోజులు గుండిచా మందిరంలో కొలువుదీరి సర్వులనూ అనుగ్రహించే దర్శనం ఒక మహా సౌభాగ్యం. ఈ రథయాత్ర ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రధానాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి వెళ్లే విశాల మార్గం (బొడొదండొ) లక్షలాది భక్తులతో కళకళలాడుతుంది. ఉపనిషత్తుల్లో వర్ణించిన విధంగా- శరీర రథంలో పరమాత్మను దర్శించే (కఠోపనిషత్తు) అంతర్ముఖ సాధనకు ఈ యాత్ర ఒక ప్రతీక. శ్రీ క్షేత్రమని కూడా ప్రసిద్ధి పొందిన ఈ మహా స్థలం, ఇక్కడి ధర్మాలు ఒడిశా సంస్క•తిపై ప్రగాఢ ప్రభావం కలిగి ఉండటమే కాక, ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించే సాంస్క•తిక అంశాలుగా మారిపోయాయి. జగన్నాథుని ‘నందిఘోష’ రథం, బలభద్రుడి ‘తాళధ్వజ’ రథం, సుభద్రాదేవి ‘దర్పాదళన’ రథాలను ఏటా దారువులతో నిర్మిస్తుంటారు. వాటి శిల్ప వైఖరి, వాటిలో పరివేష్టించే దేవతలు, ఈ క్షేత్రానికే పరిమితమైన ప్రత్యేకతలు. రథంలో ఉన్న జగన్నాథుడిని, పది రోజులు గుండిచా మండపంలో ఉండే స్వామిని దర్శిస్తే వేయి యాగాలు చేసిన ఫలం లభిస్తుందని స్కంద పురాణం చెబుతోంది. ఆదిశంకరులు ఈ క్షేత్రంలో గోవర్ధన మఠాన్ని స్థాపించి, స్వామిపై అద్భుతమైన స్తోత్రాలు రచించారు. శ్రీరామానుజాచార్య, నింబార్కాచార్య, చైతన్య మహాప్రభు, గురునానక్‍, తులసీదాస్‍, వల్లభాచార్య వంటి మహాత్ములు జగన్నాథుని దర్శనంతో పులకించారు. ఆధ్యాత్మిక శక్తికి, చారిత్రక ప్రశస్తికి కేంద్రం ఈ క్షేత్రం. పూరీ జగన్నాథుని రథయాత్రను జీవితంలో ఒకసారైనా కనులారా వీక్షించాలని భక్తులు తలుస్తారు.

ఆషాఢ శుద్ధ తదియ/యోగా దినోత్సవం
జూన్‍ 21, బుధవారం

ఆషాఢ శుద్ధ తదియ నాడు ఆచరించాల్సిన ప్రత్యేక వ్రతాలేమీ లేవు. అయితే, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈనాడే. యోగాకు పుట్టినిల్లు మన భరతఖండమే కావడం విశేషం. ఈ గడ్డపై పుట్టిన యోగా పక్రియ ప్రస్తుతం దాదాపు 180కిపైగా దేశాల్లో అధికారిక ఆరోగ్య విధానంగా అమలవుతోంది. ఇది భారతీయులకు గర్వకారణం.
అలాగే, సంవత్సరంలోనే సుదీర్ఘమైన రోజు జూన్‍ 21. ఈ రోజు పగలు, రాత్రి సమయాలు సుదీర్ఘంగా ఉంటాయి. దీనినే లాంగెస్ట్ డే అంటారు.

ఆషాఢ శుద్ధ పంచమి
జూన్‍ 23, శుక్రవారం

ఆషాఢ శుద్ధ పంచమి తిథి నాడు కావేరీ నదీ తీరవాసులు ‘ఆడిపదినెట్టు’ అనే పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఆదిపదినెట్టు అంటే ఆషాఢ మాసం పద్దెనిమిదో రోజు అని అర్థం. మనకు మాత్రం ఇది ఆషాఢ మాసం ఐదవ రోజువుతుంది. ప్రాయకంగా ఈనాటికి కావేరి నదికి కొత్త నీళ్లు వస్తాయి. కాబట్టి అక్కడ ఇది వ్యవసాయ పనులకు అనువైన కాలం. కావేరీ వాసులు ఈ మాసాన్ని ‘ఆడా మాసం’గా కూడా వ్యవహరిస్తారు. ఈ తిథిని ‘స్కంద పంచమి’గా కూడా పిలుస్తారు. స్కందుడి (కుమారస్వామి)ని ఈ రోజు విశేషంగా ఆరాధిస్తారు.

ఆషాఢ శుద్ధ షష్ఠి
జూన్‍ 24, శనివారం

ఆషాఢ శుద్ధ షష్ఠి నాడు స్కంద వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతంలో సుబ్రహ్మణ్యేశ్వరుడిని శోడశోపచారాలతో పూజించాలి. ఉపవాసం ఉండాలి. నీళ్లు మాత్రమే తీసుకోవాలి. మర్నాడు స్వామిని దర్శించుకోవాలి. ఈ వ్రతాచరణను ప్రధానంగా శరీరారోగ్యానికి నిర్దేశించారు.

ఆషాఢ శుద్ధ సప్తమి/తెలంగాణ బోనాలు పండుగ ప్రారంభం
జూన్‍ 25, ఆదివారం

ఆషాఢ శుద్ధ సప్తమి నాడు ద్వాదశీ సప్తమీ పూజ నిర్వహిస్తారు. ఇది సూర్యారాధనకు ఉద్ధిష్టమైన తిథి. ఈనాడు చేసే పూజను ‘మిత్రాఖ్య భాస్కర పూజ’ అని అంటారు.
ఇక, తెలంగాణలో ఈనాటి నుంచి బోనాల పండుగ. ఇది బోనాల పర్వానికి ఆరంభ దినం. జూన్‍ 25వ తేదీ, ఆదివారం, ఆషాఢ శుద్ధ సప్తమి నుంచి మొదలయ్యే ఈ పండుగ ఆపైన వచ్చే ఆదివారాల (జూలై 2, 9, 16)లో తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. వీటినే ఆషాఢ బోనాలుగా వ్యవహరిస్తారు. సృష్టి, స్థితి, లయ కారణభూతమైన ఆది పరాశక్తే బోనాల ఉత్సవాల్లో ఆరాధ్య దేవత. ఈనాటి నుంచి తెలంగాణ పల్లెల్లో కొలువుదీరిన అమ్మవార్లు ప్రత్యేక పూజలు అందుకుంటారు. వీరికి బోనం (అన్నం, ఇతర పదార్థాలతో కూడిన కుండ)లో భక్తులు మొక్కులు, నైవేద్యాలు సమర్పిస్తారు. బోనంలో వండిన అన్నం, బెల్లం, పెరుగు, వేపాకులతో కలిపిన నీరు ఉంటాయి. సాంక్రమిక వ్యాధుల నివారణకు ఈ దినుసులన్నీ ఎంతగానో ఉపకరిస్తాయి. మహిళలు మొక్కుబడులను బోనాల రూపంలో తీర్చుకుంటారు. మహంకాళి దేవతకు ఈ సంబరాల్లో విశేషమైన పూజలు జరుగుతుంటాయి. ప్రకృతి శక్తి విభిన్న కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతం చెబుతోంది. వీరి శుభ దీవెనల వల్లే గ్రామాల్లో ఉపద్రవాలు, అరిష్టాలు కలగకుండా సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. తొలుత గోల్కొండ అమ్మవారి పూజలతో బోనాల తొలి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆపై హైదరాబాద్‍ పాత నగరంలోని లాల్‍దర్వాజా అమ్మవారి జాతర, సి•కింద్రాబాద్‍ ఉజ్జయినీ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర నిర్వహిస్తారు.

ఆషాఢ శుద్ధ అష్టమి
జూన్‍ 26, సోమవారం

ఆషాఢ శుద్ధ అష్టమి తిథి నాడు మహిషఘ్నీ పూజ చేయాలని స్మతి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. గదాధర పద్ధతి అనే మరో గ్రంథంలో ఆషాఢ శుద్ధ అష్టమి దుర్గాష్టమి అనీ, పరశురామి యాష్టమీ అని పేర్కొన్నారు. అష్టమి నాడు మహిషాసుర మర్దని పూజ చేయాలని అందులో ఉంది.

ఆషాఢ శుద్ధ నవమి
జూన్‍ 27, మంగళవారం

ఆషాఢ శుద్ధ నవమి తిథి నాడు ఐంద్రాదేవిని పూజించాలని స్మతి కౌస్తుభంలో వివరించారు. ఈమె శక్తి దేవత.

ఆషాఢ శుద్ధ దశమి
జూన్‍ 28, బుధవారం

ఆషాఢ శుద్ధ దశమి నాటి నుంచే శాక వ్రత మహాలక్ష్మీ వ్రతం ఆరంభం అవుతుంది. దీనినే దధి వ్రతారంభమనీ అంటారు. ఈనాడు మహాలక్ష్మిని పూజించి నెల పాటు ఆకుకూరలు తినడం మాని ఆకు కూరలు దానం చేయాలి. శాక వ్రతం అనేది చాతుర్మాస్య వ్రతం ఆచరించే నాలుగు నెలల్లో ఒక వ్రతాచరణ మాసం. ఈ మాసానికి సంబంధించి, ఈ మాసంలో లభించే ఆహార పదార్థాలనే భుజించాలని నియమంగా పెట్టారు. ఆరోగ్య పరిరక్షణ ఈ శాక వ్రతం ఉద్దేశం. అలాగే, ఆషాఢ శుద్ధ దశమి చాక్షుస మన్వంతరాది దినం. చాక్షుస మనువు మనువుల్లో ఆరవ వాడు. ఈయన ఉగ్రుడనే రాజు కుమార్తె అయిన విదర్భను వివాహమాడాడు. ఇతని మన్వంతరమున మనోజవుడు అనేవాడు ఇంద్రుడు. సుమేధ, అతి నామ మున్నగు వారు సప్తర్షులు.

ఆషాఢ శుద్ధ ఏకాదశి/తొలి ఏకాదశి
జూన్‍ 29, గురువారం

ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా ప్రతీతి. దీనినే ‘సర్వేషాంశయనైక’ ఏకాదశి అని, దేవశయని ఏకాదశి అనీ అంటారు.
ఏకాదశి అనగా, ప్రతి పక్షము (15 రోజులు)నకు ఒకసారి వచ్చే పదకొండవ (11) తిథి. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏడాది పొడవునా ఇలా 24 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశులన్నీ పుణ్యప్రదాలు. ఆ రోజున హరినామ కీర్తన ప్రధానంగా చేస్తారు. కాబట్టి ఏకాదశిని ‘హరివాసరం’ అని కూడా అంటారు. శిష్టులు ఏకాదశి నాడు పరమ నిష్టగా ఉండి ఉపవాసం ఆచరిస్తారు. దశమి నాటి రాత్రి నిరాహారుడై, ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా, ద్వాదశి ఉదయం పారాయణమొనర్చి, ద్వాదశి నాడు రాత్రి కూడా నిరాహారుడై ఉండాలి. అప్పుడు కాని ఏకాదశి వ్రతం సంపూర్ణం కాదు. ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఆ రోజు సూర్యచంద్రాది గ్రహణముల కాలంలో భూరి దానం ఇస్తే పుణ్యం కలుగుతుంది. అంతేకాక అశ్వమేథ యజ్ఞ ఫలం, అరవై వేల సంవత్సరాల తపఃఫలం పొందుతారని ప్రతీతి. ఏకాదశి నాడు ఉపవసించడం- బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కంటే, విద్యార్థులకు వేద విద్యాదానం చేయడం కంటే ఉత్తమమైనదని పురాణేతిహాసాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండలేని వారికి వాయు పురాణంలో ప్రత్యామ్నాయాలు చూపారు. ఉపవాసం చేయలేనపుడు వాయు భక్షణం, అది చేతకానపుడు పంచగవ్యం లేక నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు తినవచ్చు. అదీ సాధ్యం కానపుడు ఉడకని పదార్థాలు లేక హవిష్యాన్నం తినవచ్చు. ఇది కూడా చేయలేని వారు ఒక్క పొద్దు ఉండవచ్చు.
ఏకాదశి నాడు భుజించే వాడు చాంద్రాయణ వ్రతం చేస్తే కాని ఆ పాపాన్ని పోగొట్టుకోలేడని ప్రతీతి. ఒకసారి బ్రహ్మ ఫాల భాగం నుంచి ఒక చెమట బిందువు కిందపడిందట. దాని నుంచి ఓ రాక్షసుడు పుట్టాడు.
‘ప్రభూ నాకు నివాసం చూపు’ అని ఆ రాక్షసుడు బ్రహ్మను కోరాడు. అప్పుడు బ్రహ్మ- ‘నువ్వు ఏకాదశి నాడు ఎవరైతే భుజిస్తారో వారి శాల్యన్నపు మెతుకులతో నివసిస్తావు. పిదప వారి కడుపుల్లోకి చేరి క్రిములుగా మారతావు’ అని చెప్పాడట.
అందువల్లే దక్షిణ భారతదేశంలో ఏకాదశి నాడు వరి అన్నం చాలామంది తినరు.
ఇక, ఆషాఢ శుద్ధ ఏకాదశి విషయానికి వస్తే- ఇది తొలి ఏకాదశి. ఇది పుణ్యతిథిగా, పవిత్రమైన రోజుగా ప్రసిద్ధి కుల, వర్గ భేదాలకు అతీతంగా ఈ పండుగ రోజున భగవంతుడి ధ్యానంలో ఉపవసించడం సంప్రదాయంగా వస్తున్న గొప్ప ఆచారం. శరీరాన్ని, మనసును శుభ్రం చేసుకోవడానికి అనువైన సమయమిది. ఏకాదశి మహాత్మ్యం గురించి అనేక పౌరాణిక గాథలు ఈ వ్రతం ఇహపరాల నడుమ సేతుబంధనం వంటిదని వర్ణించాయి. తొలి ఏకాదశి పర్వం అనేక విధాలుగా ఉద్ధిష్టమై ఉంది. ఈ తిథి నాడు ఉపవససించి యథాశక్తి భగవంతుడిని కొలవాలని ఆయా పురాణాలు చెబుతున్నాయి.

ఆషాఢ శుద్ధ ద్వాదశి/చాతుర్మ్యాస వ్రతారంభం/వాసుదేవ ద్వాదశి
జూన్‍ 30, శుక్రవారం

ఆషాఢ శుద్ధ ద్వాదశిని వాసుదేవ ద్వాదశిగా వ్యవహరిస్తారు. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ఇంకో ముఖ్య విశేషం ఏమిటంటే ఈనాటి నుంచే చాతుర్మ్యాస వ్రతం ఆరంభమవుతుంది. వర్ష (ఏడాది) కాలంలో అపథ్య ఆహారం మాన్పించే ఆరోగ్య పరిరక్షణ సూత్రంగా ఈ వ్రతం రూపుదాల్చిందని అంటారు. సంప్రదాయ ధార్మిక భావనలు, ఆరోగ్య పరిరక్షణ నియమాల సమ్మేళనమే ఈ వ్రతాచరణ సంకల్పంగా భావించవచ్చు. అందుకే మహిళలకు చాతుర్మాస్య వ్రతం అత్యంత ప్రీతకరమైనది.
చాతుర్మాస్య వ్రత విధానం గురించి స్కాంద, భవిష్యోత్తర పురాణాల్లో విపులంగా ఉంది. శ్రావణ మాసంలో కూరలను, భాద్రపదాన పెరుగును, ఆశ్వయుజాన పాలును, కార్తీక మాసాన పప్పు పదార్థాలను వదిలిపెట్టి భుజించాలని వాటిలో ఉంది. ఇంకా నిమ్మ, రా•మాషములు, ముల్లంగి, ఎర్రముల్లంగి, గుమ్మడి, చెరుకు, కొత్త ఉసిరిక, చింత మొదలైన వాటిని త్యజించాలని స్కాంద పురాణంలో ఉంది. పాత ఉసిరిక ఎక్కడ దొరికినా, దానిని సంపాదించి తినాలని అందులో పేర్కొన్నారు. పై ఆహార పదార్థాల నిషేధాన్ని బట్టి వర్షాకాలంలో అపథ్య ఆహారాన్ని మానిపించి, ఆరోగ్య పరిరక్షణమే ఈ వ్రత పరమార్థమని స్పష్టమవుతోంది. వర్షా కాలం క్రిమికీటకాలకు పుట్టినిల్లు. కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఈ వ్రతం అపథ్య ఆహారాన్ని త్యజించిందని భావించాలి.
‘చతుర్మాస్య’మనగా నాలుగు నెలల కృత్యం. రుతువులు మూడు. అవి- వర్ష రుతువు, హేమంతం, వసంతం. వైదిక కాలంలో ఒక్కో రుతువు కాల వ్యవధి నాలుగు నెలలు. వానాకాలంతోనే సంవత్సరం ఆరంభం అవుతుంది. అందుకే సంవత్సరాన్ని ‘వర్ష’ అని కూడా అంటారు. ప్రతి రుతువు ప్రారంభంలో ప్రత్యేక యాగాలు కూడా ఆరంభమవుతాయి. ఈ పద్ధతి ప్రకారం- ఫాల్గుణ పూర్ణిమ నుంచి వైశ్య దేవ యజ్ఞం, ఆషాఢ పూర్ణిమ నుంచి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుంచి సాకమేథ యజ్ఞం నిర్వహించాలని శతపథ బ్రాహ్మణం అనే గ్రంథంలో ఉంది. ఈ వరుస క్రమంలో వర్ష రుతువున చాతుర్మాస్యం నిర్వహించుకోవడం ఆచారంగా వస్తోంది.
చాతుర్మాస్యం ఆషాఢ శుక్ల (శుద్ధ) ఏకాదశితో ప్రారంభమై కార్తీక శుక్ల ద్వాదశితో సమాప్తం అవుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి సంవత్సరానికి ప్రథమ ఏకాదశి. ఈ ఏకాదశినాడు విష్ణువు క్షీర సముద్రంలో శేష పానుపుపై శయనిస్తాడని పురాణ ప్రతీతి. ఈ వ్రతమును ఏకాదశి నుంచి కానీ, కటక సంక్రాంతి దినం నుంచి కానీ, ఆషాఢ పూర్ణిమ నుంచి కానీ ఆరంభించవచ్చు. చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరకృత్య పాపాలన్నీ నశిస్తాయని భారత వచనం.
భీష్ముడు శేషధర్మంలో చాతుర్మాస్యం స్త్రీలకే ముఖ్యమైనదని పేర్కొన్నాడు. అయినా ఇది అందరూ ఆచరించదగిన వ్రతం. ముఖ్యంగా ఆశ్రమవాసులకు ఇది ముఖ్యమైన వ్రతమని పురాణాల్లో ఉంది. ఇక, బుద్ధుడు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్టు జాతక కథల్లో ఉంది. ఈ వ్రతాన్ని ఆ కథల్లో ‘కత్తిక నక్ఖత్త’, ‘కత్తికరత్తి’, ‘కత్తికఛన’ అని వర్ణించారు. రాజగృహం, అవంతి, వారణాసి తదితర మహా నగరాల్లో ఈ చాతుర్మాస్య సమాప్యుప్త ఉత్సవాల సప్తాహం అత్యంత వైభవంగా నిర్వహించే వారు. జైనులు ఇప్పటికీ చాతుర్మాస్య కాలంలో అత్యంత నిష్టగా అహింసా వ్రతాన్ని ఆచరిస్తారు.

Review వ్రతాల సాధన..బోనాల జాతర.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top