ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో పదకొండవ మాసం- నవంబరు. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం కార్తిక మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది ఎనిమిదవ మాసం. నవంబరు మాసంలోని మొదటి రోజు మాత్రమే ఆశ్వయుజ తిథి ఉంది. మిగతా 29 రోజులు కార్తిక మాస తిథులే. నవంబరు 1వ తేదీ, శుక్రవారం ఒక్కరోజు ఆశ్వయుజ తిథి. 2వ తేదీ శనివారం నుంచి నవంబరు 30, శనివారం వరకు కార్తిక తిథులు. శివకేశవుల ఆరాధనకు ఉద్ధిష్టమైన మాసం- కార్తికం. నెల పొడవునా దీపాలశోభతో కాంతులీనుతుందీ మాసం. దేవుత్తన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, కార్తిక పూర్ణిమ, గోవర్ధన పూజ, బాలల దినోత్సవం వంటివి ఈ నెలలోని ముఖ్యమైన పండుగలు, పర్వాలు.
2024- నవంబరు 1, శుక్రవారం, ఆశ్వయుజ భాద్రపద బహుళ అమావాస్య నుంచి
2024- నవంబరు 30, శనివారం, కార్తిక బహుళ చతుర్దశి వరకు..
శ్రీ క్రోధి నామ సంవత్సరం – ఆశ్వయుజం – కార్తికం – శరదృతువు- దక్షిణాయనం
ఆశ్వయుజం.. కార్తికం.. ఈ రెండు మాసాలు కలిపి శీతాకాలపు సంధి కాలం. ఆశ్వయుజం ముగియడంతోనే వానలకు తెరపడుతుంది. కార్తిక మాసం ప్రవేశిస్తూనే శీతల గాలులు పలకరిస్తాయి. శీతాకాలానికి ఇది ఆరంభ మాసం. ఈ కాలంలో చలి వణికిస్తుంది. మనిషి శారీరక ఆరోగ్యం తడి-పొడి వాతావరణంతో అంతా నజ్జు నజ్జుగా ఉంటుంది. అందుకే ఈ మాసం పొడవునా మనం ఆచరించాల్సిన పద్ధతులకు సంబంధించి మన పెద్దలు వివిధ వ్రతాలు, పూజా నియమాలను ఏర్పరిచారు. ఇవి ఆరోగ్యదాయకమైనవి. వణికించే చలిలో ఇక్కలాక్కుపోయే శరీరానికి ఉత్తేజాన్ని, వేడిని కలిగించే విధంగా ఆయా వ్రత నియమాలు విధించారు. వాటిని ఆచరించడం ద్వారా, ఆ వ్రత, పూజా విధుల్లో భాగంగా భగవంతునికి వివిధ నైవేద్యాలు నివేదించి.. తిరిగి వాటిని మహా ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఇక కార్తిక విశేషాల్లోకి వెళ్తే.. దీనికే కౌముదీ మాసం అని కూడా పేరు. కౌముది అంటే వెన్నెల. పిండారబోసినట్టు ఈ నెలంతా వెన్నెల వెలుగులు పరుచుకుని ఉంటాయి. ఇక, దీపారాధనలతో కార్తిక మాసం దేదీప్యమానం అవుతుంది. భువిలో జ్యోతులుగా వెలిగే ఈ దీపాలు ఆ వెన్నెల వెలుగులకు మరింత శోభను కలిగిస్తాయి. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండగా వచ్చిన మాసం కాబట్టి ఇది కార్తికం అయింది. మత్స్య పురాణం ప్రకారం కార్తిక మాసంలో ఇంటి నిర్మాణాన్ని ఆరంభిస్తే ధనధాన్య లాభాలు కలుగుతాయని అంటారు. ముఖ్యంగా ఈ మాసంలో ప్రాత:కాల స్నానాలు విధాయక కృత్యం. అలాగే ఉసిరికను దైవికంగా కొలిచి, విశిష్ట ఆహారంగా తీసుకోవాల్సిన మాసం కూడా కార్తిక మాసమే. పూర్తిగా ఈ నెలంతా శివ, వైష్ణవారాధనలకు అనువైనది. శివ-కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. ఈ మాసంలో కూరలేమీ తినకుండా ఉసిరికాయ వ్యంజనంగా పులగం తిన్న వారికి, మోదుగ ఆకుల్లో భోజనం చేసే వారికి, తెల్లవారుజామునే గోపూజ చేసే వారికి అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు. కార్తికంలో నదీ స్నానాలు చాలా ముఖ్యమైనవి. తెల్లవారుజామునే సముద్ర, నదీ స్నానాలు ఆచరించాలి. ఇలా చేయడం ద్వారా ఆ నీటిలోని లవణాలు, పోషకాలు ఒంటికి భేషుగ్గా పడతాయని, తద్వారా శీతాకాలానికి అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతలు మారతాయని అంటారు. ఈ మాసంలో వచ్చే ఆయా ముఖ్య తిథులు, ఆ తిథి కాలాల్లో వచ్చే వివిధ పర్వాలు, వ్రతాలు, పూజా నియమాల పరిచయం..
ఆశ్వయుజ బహుళ అమావాస్య
నవంబరు 1, శుక్రవారం
ఇది నవంబరు మాసంలోని తొలి రోజు. తిథి.. ఆశ్వయుజ బహుళ అమావాస్య. సాధారణంగా ఆశ్వయుజ బహుళ అమావాస్యను దీపావళి అమావాస్య అంటారు. కానీ, ఈసారి పంచాంగకర్తలు అక్టోబరు 30న దీపావళిగా నిర్ణయించారు. ఇక, ఉత్తర భారతీయులకు దీపావళి ఐదు రోజుల పర్వం. వారికి ఇది మూడో రోజు అవుతుంది. ఈనాడు కేదారగౌరి వ్రతం ఆచరించాలని వివిధ పంచాంగాలలో ఉంది. అలాగే, ఈనాడు ఆంధప్రదేశ్ అవతరణ దినోత్సవం. 1956, నవంబరు 1న ఆంధప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
కార్తిక శుద్ధ పాడ్యమి
నవంబరు 2, శనివారం
నవంబరు 2, శనివారం, కార్తిక శుద్ధ పాడ్యమి నుంచి కార్తిక మాస తిథులు ఆరంభమవుతాయి. పాడ్యమి ఆరంభ తిథి. ఆకాశదీపం ఈనాటి నుంచే ప్రారంభమవుతుంది. కార్తిక మాసం రాకకు సూచికగా ఈనాటి నుంచి నెల పొడవునా దీపాలు వెలిగిస్తారు. అలాగే కార్తిక స్నానాలు కూడా ఈనాటి నుంచే ప్రారంభం అవుతాయి. స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో పేర్కొన్న ప్రకారం.. ఈనాడు అన్నకూటము, గోవర్ధన ప్రతిపదము, అభ్యంగము, లక్ష్మీపూజ, ద్యూతము, గోవర్ధన పూజ, అన్నకూటోత్సవ అపరాహ్ణే మార్గపాలీ బంధనం వంటి వ్రత విధులు ఆచరించాలి. అలాగే, ‘గదాధర పద్ధతి’ అనే గ్రంథంలో- ఈనాడు బలిరాజోత్సవం, ద్యూతమ్, బలిప్రతిపత్, ద్యూత ప్రతిపత్ వ్రతాలు చేయాలని ఉంది. ‘పురుషార్థ చింతామణి’ అనే వ్రత గ్రంథం ప్రకారం.. ఈనాడు భాస్కర కృచ్ఛ వ్రతం ఆచరించాలి. అంటే మొదటి ఐదు రోజుల పాటు అన్నం, తరువాత ఐదు రోజులు పెరుగు అన్నం తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ఈ వ్రత విధి. కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అని కూడా అంటారు. బలి చక్రవర్తికి ప్రీతికరమైన పాడ్యమి ఇది. దీనికి ముందు వచ్చే ఆశ్వయుజ మాసంలో వచ్చే నరక చతుర్దశి, అమావాస్యల మాదిరిగానే ఈనాడూ అభ్యంగన స్నానం చేసి దీపావళి ఉత్సవం నిర్వహించడం కొన్ని ప్రాంతాలలో ముఖ్యం కేరళీయులలో ఆచారంగా ఉంది.
కార్తిక శుద్ధ విదియ
నవంబరు 3, ఆదివారం
కార్తిక శుద్ధ విదియ- యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అనే పర్వాల సమ్మేళనం. స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఈ తిథిని యమ ద్వితీయగా పేర్కొన్నారు. ఈనాడు యముడిని పూజించాలి. సోదరి ఇంట భోజనం చేయాలి. ఈ పక్రియనే భగినీ హస్త భోజనం అంటారు. మన సంప్రదాయంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే పర్వాల్లో రెండు ముఖ్యమైనవి. ఒకటి- రాఖీ పూర్ణిమ. రెండవది- భగినీ హస్త భోజనం. సోదరీ సోదరుల ఆప్యాయతానుబంధాలకు అద్దం పట్టే ఒక సంప్రదాయమే భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె సోదరుడికి పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అయ్యింది. కార్తిక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్లిన రెండవ నాడు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈనాడు అన్నదమ్ములు తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లి, బహుమానాలు ఇచ్చి, వారి చేతి వంట తిని వారి చేత తిలకం దిద్దించుకుంటారు.
పురాణ కథ ప్రకారం.. యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్లాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలుస్తుంది. కానీ, యమధర్మరాజు వెళ్లలేకపోయాడు. చివరకు ఒకసారి కార్తిక మాస విదియ రోజున యమున ఇంటికి యముడు వెళ్తాడు. సోదరుడు వచ్చిన సంతోషంతో యమున సంతోషంగా పిండివంటలు చేసి సోదరుడికి పెడుతుంది. చాలా రోజుల తరువాత కలుసుకోవడంతో సోదరీ సోదరులు సంతోషిస్తారు. ఆ సంతోషంతో యముడు ఏదైనా కోరుకొమ్మని యమునతో చెబుతాడు. దీంతో ఆమె కార్తిక శుద్ధ విదియ నాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని యమున కోరుతుంది. యముడు సంతోషించి, అలా వేడుక జరుపుకునే వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా ఉంటుందని, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చాడు. అందువల్లనే భగినీ హస్త భోజన విధి ఆచరణలోకి వచ్చింది.
ఇక, విదియ అంటే తిథుల్లో రెండవది. అందుకే కార్తిక శుక్ల విదియ (ద్వితీయ) తిథిని యమ ద్వితీయ అనీ అంటారు. ఈనాడు కాంతి ద్వితీయ, పుష్ప ద్వితీయ వ్రతాలు కూడా ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. ఈనాడు చంద్రార్ఘ్య దానం తప్పక చేయాలని అంటారు. శుక్ల విదియ నాడు చంద్రుడు చిన్నగా కనిపిస్తాడు. కాగా, కార్తిక శుద్ధ పాడ్యమి నాడు బలి పాడ్యమి పేరుతో పూజలు అందుకునే బలి చక్రవర్తి విదియ నాడు తిరిగి పాతాళానికి వెళ్లిపోతాడు. కాబట్టి ఈనాడు విధాయకంగా బలికి వీడ్కోలు పూజలు నిర్వహించాలి. అలాగే తాహతును బట్టి దాన ధర్మాలు నిర్వహించాలి. ఇక, ఉత్తర భారతదేశంలో ఈనాడు ‘భాయ్ దూజ్’ పేరుతో వేడుకలు నిర్వహించుకుంటారు.
కార్తిక శుద్ధ తదియ
నవంబరు 4, సోమవారం
కార్తిక శుద్ధ తదియ తిథిని ‘సోదరి తృతీయ’ అని కూడా అంటారు. చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఈనాడు వైష్ణవ కృచ్ఛ వ్రతం చేయాలని ఉంది. అలాగే ఈనాడు విష్ణు గౌరీ వ్రతం ఆచరించాలని కూడా అందులో రాశారు. లక్ష్మీదేవిని యథాశక్తి పూజించి, ముత్తయిదువులను పిలిచి మంగళ ద్రవ్యాలతో వారిని గౌరవించి, వారికి భోజనం పెట్టాలి. అలాగే మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉన్న ప్రకారం- ఈనాడు త్రిలోచన గౌరీ వ్రతం చేయాలని నియమం విధించారు. అయితే, వ్రతాలన్నిటి కంటే సోదరి తృతీయ పర్వంగానే ఈ తిథి మిక్కిలి ప్రసిద్ధి చెంది ఉంది. ఈనాడు సోదరి సోదరుడిని, సోదరుడు సోదరిని పరస్పరం గౌరవించుకుంటారు. అందుకే దీనికి ‘సోదరి తృతీయ’ అనే పేరు వచ్చింది. కార్తిక మాసంలో ఆచరించాల్సిన సోమవారం వ్రతం ఈ తొలి సోమవారం నాడే జరుపుకోవాలి.
కార్తిక శుద్ధ చవితి
నవంబరు 5, మంగళవారం
దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తిక శుద్ధ చవితి నాగుల చవితి పర్వదినం. ఇది ఆంధప్రదేశ్‍లో ఎక్కువ ఆచరణలో ఉన్న తిథి పర్వం (కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు నాగుల చవితిని జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో). ఈనాడు గోదావరి తీర ప్రాంతాల్లో నాగ పూజలను చేస్తారు. నాగుల చవితిగా వ్యవహరించే ఈనాడు పాముల పుట్టలలో ఆవు పాలు పోస్తారు. చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేసే పదార్థం), అరటిపండ్లు, తాటి బుర్రగుంజు, తేగలు మొదలైనవి ఈనాటి నివేదన ప్రసాదాలు. ఈ సందర్భంగా పాముల పుట్ట వద్ద దీపావళి నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు కాలుస్తారు. చిన్న పిల్లలు, యువతులకు ఆనందాన్ని పంచే పర్వమిది. భారతీయులలో చాలామంది ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈయనే స్కంధుడు, కుమారస్వామిగానూ ప్రసిద్ధి. నాగుల చవితి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో పూజలందుకునేది ఈయనే. ఇంకా, ఈనాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. కార్తీక శుద్ధ పంచమి నాడు జయపంచమి, శాంతి వ్రతాలు ఆచరించాలని కూడా ఆ గ్రంథంలో ఉంది. ఈ తిథి మొదలు వరుసగా ఏడు రోజులు క్రమం తప్పకుండా రోజూ ‘యవాగుయావక శాకదధి క్షీరఘృత జలనామాహార’ అనే వ్రతాన్ని ఆచరించాలని అంటారు. కార్తీక శుద్ధ పంచమినే నాగపంచమి అని కూడా అంటారు. జైనులకు కూడా ఈ తిథి ముఖ్యమైనదే. ఈనాడు వారు తమ ఇళ్లలోని పాత పుస్తకాలను దులిపి, శుభ్రం చేసుకుని తిరిగి వాటిని యథా స్థానంలో ఉంచుతారు.
కార్తిక శుద్ధ పంచమి
నవంబరు 6, బుధవారం
ఈనాటి నుంచి విశాఖ కార్తె ప్రారంభం అవుతుంది. కార్తిక శుద్ధ పంచమి నాడు జయపంచమి, జ్ఞాన పంచమి, శాంతి వ్రతాలు ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. ఈ తిథి మొదలు వరుసగా ఏడు రోజులు క్రమం తప్పకుండా రోజూ ‘యవాగుయావక శాకదధి క్షీరఘృత జలనామాహార’ అనే వ్రతాన్ని ఆచరించాలని అంటారు. కార్తీక శుద్ధ పంచమినే నాగపంచమి అని కూడా అంటారు. చవితి నాడు ఆంధ్రులు నాగపూజలు చేస్తే, కార్తిక శుద్ధ పంచమి నాడు తెలంగాణలో నాగపంచమి పర్వాన్ని నిర్వహించుకుంటారు.
కార్తిక శుద్ధ షష్ఠి
నవంబరు 7, గురువారం
కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరుడు)ని పూజించడానికి ఉద్ధిష్టమైనది. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈనాడు స్కంధ షష్ఠి వ్రతం ఆచరించాలని ఉంది. ఈ తిథి నుంచి వరుసగా మూడు రోజుల పాటు మూడు రాత్రులు పాలు తాగి ఉపవాసం ఉండాలి. ఈ విధంగా వ్రతం ఆచరించడాన్ని మహేంద్ర కృచ్ఛ వ్రతమనీ అంటారు. అలాగే, ఈనాడు మనవాళ మహాముని తిరు నక్షత్ర తిథి కూడా. కార్తీక శుక్ల షష్ఠి.. మహా షష్ఠి పర్వంగా ప్రసిద్ధి. ఈనాడు వహ్ని పూజ చేయాలని అంటారు. ఈ తిథిని స్కంద షష్ఠిగానూ, సూర్య షష్ఠిగానూ కూడా వ్యవహరిస్తారు.
కార్తిక శుద్ధ సప్తమి
నవంబరు 8, శుక్రవారం
కార్తిక శుద్ధ సప్తమి తిథిని భాను సప్తమిగా వ్యవహరిస్తారు. ఇది సూర్య సంబంధమైన తిథి. కాబట్టి సూర్యనారాయణుడిని ఆరాధించడానికి ఇది విశేషమైన రోజు. ఇంకా ఈనాడు కల్పాదిగా కూడా వ్యవహరిస్తారు. అలాగే, శాక సప్తమీ వ్రతం కూడా ఆచరిస్తారు. లక్ష్మీప్రద వ్రతం కూడా ఆచరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. నీరు, బిల్వ దళాలు, పద్మాలు, తామర తూళ్లు మాత్రమే తీసుకుని ఈ వ్రతాన్ని ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉండటాన్ని బట్టి ఇది చాలా కఠిన నియమాలతో కూడిన వ్రతమని అర్థమవుతోంది.
కార్తిక శుద్ధ అష్టమి
నవంబరు 9, శనివారం
కార్తిక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేయడం కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉంది. ఈనాడు గోపూజ చేయడం మిక్కిలి పుణ్యప్రదమని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. స్మ•తి కౌస్తుభంలో ఈ వ్రత నియమాల గురించి వివరించారు. అలాగే, ఈనాడు గోపాష్టమి నిర్వహించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. దుర్గాష్టమి వ్రతాన్ని కూడా ఈనాడు ఆచరిస్తారు. అలాగే, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పుష్పయాగ మహోత్సవం కూడా ఈనాడే.
కార్తిక శుద్ధ నవమి
నవంబరు 10, ఆదివారం
కార్తిక శుద్ధ నవమిని మన పంచాంగాల ప్రకారం ‘కృత యుగాది’ దినంగా పరిగణిస్తారు. యుగాలలో కృతయుగం శ్రేష్ఠమైనది. దీని కాల పరిమితి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల (17,28,000) మానవ సంవత్సరాలు. అలాగే ఈనాడు నదీ, సముద్ర స్నానం చేయడం గొప్ప ఫలాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో మాత్రం- ఈనాడు దుర్గా నవమి ఆచరించాలని ఉంది. తిథి తత్వం అనే మరో గ్రంథం ప్రకారం- ఈనాడు చండీపూజ చేయాలని ఉంది. ఇవి రెండూ అమ్మవారి ఆరాధనకు సంబంధించినవే కావడం విశేషం. మొత్తానికి మన పంచాంగ కాలమే ప్రమాణం కాబట్టి ఈనాటి తిథిని కృత యుగాదిగానే ఆచరించాలి. కొన్ని తెలుగు క్యాలెండర్లలో కార్తిక శుద్ధ నవమిని ‘అక్షయ నవమి’గానూ పేర్కొన్నారు.
కార్తిక శుద్ధ దశమి
నవంబరు 11, సోమవారం
కార్తిక శుద్ధ దశమి నాడు సార్వభౌమ వ్రతం, రాజ్యాప్తి దశమి వ్రతం వంటివి ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
కార్తిక శుద్ధ ఏకాదశి
నవంబరు 12, మంగళవారం
కార్తిక శుద్ధ దశమి చాలా విధాలుగా ప్రశస్తమైనది. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి ఇది. ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభమయ్యే చాతుర్మాసం కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. మొత్తం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టమైనవి. అత్యంత ప్రశస్తమైనవి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంటే, ఆనాడు పాల సముద్రంలో శేష తల్పంపై విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, అంటే ఈనాడు నిద్ర లేస్తాడు. అందుచేత, విష్ణువు నిద్రలేచిన దినం కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిన్యేకాదశి అని, దేవుత్తని ఏకాదశి, ఉద్ధాన ఏకాదశి అని కూడా అంటారు. ఈనాడు కాయ ధాన్యాలతో చేసిన ఆహారం ఏదీ కూడా తినకూడదని వ్రత నియమం. ఫలాలు మాత్రమే తీసుకోవాలి. మహారాష్ట్రలోని పండరీపురంలో విఠలుని ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పండరి భక్తులు అనేక మంది ఇక్కడకు కాలినడకన పాదయాత్రగా చేరుకుంటారు. ఇంకా స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలను బట్టి ఈనాడు ఆచరించాల్సిన వ్రతాలు ఇంకా అనేకం ఉన్నాయి.
కార్తిక శుద్ధ ద్వాదశి
నవంబరు 13, బుధవారం
కార్తిక శుద్ధ ద్వాదశి అనేక విధాలుగా ప్రసిద్ధం. ఈ తిథి అనేక వ్రతాలు, పూజలకు ముగింపు, ఆరంభ దినం. వివిధ వ్రత గ్రంథాలలో ఈ తిథిని మథన ద్వాదశిగా పేర్కొన్నారు. క్షీర సముద్రాన్ని కార్తిక శుద్ధ ద్వాదశి నాడే దేవతలు మథించారని, అందుకే ఇది మథన ద్వాదశి దినం అయ్యిందని అంటారు. దీనినే మన తెలుగు నాట ‘చిలుక ద్వాదశి’గా వ్యవహరిస్తారు. మథించడాన్నే చిలకడం అని కూడా అంటారు. కాబట్టి ఈ ద్వాదశికి ఆ పేరు వచ్చి ఉండొచ్చు. ద్వాదశి రోజున తులసి చెట్టు, ఉసిరిక (ధాత్రి)లోనూ విష్ణువు ఉంటాడు. అందుకే తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణుడిని ఈ రోజు పూజిస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని అంటారు. ఈనాడు తులసి కోట దగ్గర ఆవు నేతిలో దీపాలు వెలిగిస్తారు. ద్వాదశి నాడు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యమని చెబుతారు. పూజానంతరం దక్షిణ తాంబూలాలు పంచితే విశేష ఫలం లభిస్తుంది. ఆ పరమాత్మకు పండ్లు, కొబ్బరికాయ నైవేద్యం పెడతారు. కేవలం ఉసిరితో తినే పదార్థాలను మాత్రమే తయారు చేస్తారు.
అలాగే క్షీర సముద్ర మథన సంబంధ పర్వం కా•ట్టే కార్తిక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా కూడా వ్యవహరిస్తారు. కార్తిక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు నిద్రలేచి, క్షీరాబ్ధి నుంచి బయల్దేరి కార్తిక శుద్ధ ద్వాదశి నాటికి తులసీ బృందావనానికి చేరుకుంటాడు. అందుకు కాబట్టే ఈ తిథి నాడు తులసి మొక్కను విశేషంగా పూజించే ఆచారం ఏర్పడింది. కొన్నిచోట్ల కార్తిక శుద్ధ ద్వాదశి నాడు తులసి కల్యాణం కూడా నిర్వహిస్తారు. అలాగే, కార్తిక శుద్ధ ద్వాదశిని కొన్ని వ్రత గ్రంథాలలో యోగిని ద్వాదశిగా కూడా పేర్కొన్నారు. ఇంకా విభూతి ద్వాదశి, గోవత్స ద్వాదశి, నీరాజన ద్వాదశి, •కైశిక ద్వాదశి అనే పేర్లతో కూడా ఈనాడు వివిధ వ్రతాలు ఆచరిస్తారు. ఈ వ్రత నియమాలన్నీ చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో వివరంగా ఉన్నాయి. ఈనాటితో చాతుర్మాస వ్రతం పరిసమాప్తి అవుతుంది. ఈనాడు తిరుమల శ్రీవారికి ఆస్థానం నిర్వహిస్తారు.
కార్తిక శుద్ధ త్రయోదశి/చతుర్దశి
నవంబరు 14, గురువారం
కార్తిక శుద్ధ త్రయోదశి శని త్రయోదశి తిథి. శనిదేవునికి, శివుడికి ప్రీతికరమైన తిథి ఇది. ఈనాడు శని త్రయోదశి పూజలు విశేషంగా నిర్వహిస్తారు. శనిదేవుడిని విశేషంగా పూజిస్తారు. అలాగే గో త్రిరాత్ర వ్రతం ఈ తిథి నాడే ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. విశ్వేశ్వర వ్రతాన్ని ఆచరించాలని మరికొన్ని వ్రత పుస్తకాలలోనూ ఉంది.
త్రయోదశి ఘడియల్లోనే కార్తిక శుద్ధ చతుర్దశి తిథి కూడా కూడి ఉంది. కాబట్టి నవంబరు 14నే చతుర్దశి పర్వాన్ని నిర్వహించుకోవాలి. ఇక, ఈ శుద్ధ చతుర్దశి వైకుంఠ చతుర్దశిగా ప్రసిద్ధి. శివ కేశవుల మధ్య భేదం లేదని చాటడానికి ఈ తిథి ఒక నిదర్శనం. కార్తిక మాసం సహజంగానే శివకేశవులకు ఇష్టమైన మాసం. ఈనాడు విష్ణుమూర్తి శంకరుడిని పూజించాడని అంటారు. విష్ణువు వైకుంఠం నుంచి బయల్దేరి వారణాసికి వెళ్లి స్వయంగా శివుడిని ఈనాడు పూజించాడని ఆయా వ్రత గ్రంథాలలో, పురాణాలలో ఉంది. కాబట్టి ఇది శైవులకు, వైష్ణవులకు కూడా పవిత్రమైన పర్వదినం. ఇక, ఈనాడే భారత తొలి ప్రధాని జవహర్‍లాల్ నెహ్రూ జయంతి దినం. పిల్లలను అమితంగా ప్రేమించిన ఆయన స్మ•త్యర్థంగానే ఏటా నవంబరు 14న ఆయన జయంతిని బాలల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు.
కార్తిక శుద్ధ పూర్ణిమ
నవంబరు 15, శుక్రవారం
కార్తిక మాసం అంటేనే దీపోత్సవ మాసం. దీపకాంతులు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నలుదిశగా వెలుగొందుతుంటాయి. కార్తికమంతా వెలిగే కార్తీక దీపం కార్తిక శుద్ధ పూర్ణిమ నాడు మరింత దేదీప్యమానం అవుతుంది. కార్తిక పూర్ణిమ ఒక విధంగా దీపాల పండుగ వంటిదే. అదీ నిండు పున్నమి నాడు జరిగే దీప వేడుక ఇది. ‘ఈనాటి రాత్రి స్త్రీలు తులసి చెట్టు వద్ద 365 దూది వత్తులు నేతిలో ముంచి పెద్ద దీపం వెలిగిస్తార’ని కొఠారీస్ హిందూ హాలీడేస్ అనే గ్రంథంలో ఈ పర్వం గురించి వివరించారు. కార్తిక శుద్ధ పూర్ణిమ నాడే ఈశ్వరుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. శివుడికి, త్రిపురాసురుడికి మధ్య మూడు రోజుల పాటు కఠోర యుద్ధం జరిగింది. ఎట్టకేలకు శివుడు త్రిపురాసురుడిని సంహరించడంలో దేవలోకమంతా ఆయనను ఘనంగా స్తుతించింది. ఈ విజయ చిహ్నంగానే కార్తిక పూర్ణిమ నాడు దీపాల పండుగను జరుపుకుంటారని కొందరు వ్రతకారుల అభిప్రాయం. అలాగే, ఈ దినం త్రిపురాసురుని సంహరించిన దినం కాబట్టి ఈ పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. ఈనాడు శివుడి గౌరవార్థం పూజలు నిర్వహిస్తారు. మునిమాపు వేళ తులసి కోట వద్ద దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు వెలిగించేది కొన్ని ప్రాంతాల్లో మహిళలు అయితే, వాటి వద్ద పూజలు చేసేది మాత్రం పురుషులు.
జ్వాలాతోరణ ఉత్సవం
కార్తిక శుద్ధ పూర్ణిమ నాడు పలుచోట్ల జ్వాలా తోరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఇంకొన్ని చోట్ల ఈ తిథి నాడు శివాలయానికి ఎదుట రెండు స్తంభాలు పాతి అడ్డంగా ఒక దూలాన్ని కడతారు. ఎండు గడ్డి మోపులు ఆ మూడు బాజులకు దట్టంగా చుడతారు. దానికి నిప్పంటిస్తారు. ఆ గడ్డి ప్రజ్వలంగా మండుతుండగా శివుడిని, పార్వతిని ఒక పల్లకిలో ఉంచి దాని కిందుగా మూడుసార్లు తిప్పుతారు. ఈ సందర్భంగా మండుతున్న గడ్డిని కొందరు రైతులు పెనుగులాడి బయటకు లాగుతారు. అలా దక్కించుకున్న గడ్డిని వెంటనే తమ పశువులకు మేతగా వేస్తారు. మరికొందరు ఆ గడ్డిని తమ గడ్డిమేట్ల లోపల దూర్చి
దాచివేస్తారు. ఆ గడ్డి తిన్న పశువులు భద్రంగా ఉంటాయని, బాగా పాలు ఇస్తాయని విశ్వాసం. పార్వతీదేవి మొక్కు ఫలితంగా జ్వాలా తోరణ ఉత్సవం ఏర్పడిందని పురాణాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఆమె చేసిన సహగమన ప్రయత్నానికి ఈ ఉత్సవం ఒక సూచనమని అంటారు. సహగమనం అంటే అందరికీ సందేహం రావచ్చు. దీని వెనుక నేపథ్యమిదీ. ఒకనాడు శివుడు రాక్షసులను చంపడానికి వెళ్లి చాలా కాలం వరకు తిరిగి రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆయన క్షేమ సమాచారం పార్వతికి లభించలేదు. దీంతో తన భర్త యుద్ధంలో మరణించి ఉంటాడని ఆమె భావించింది. ఆ సందర్భంలో ఒక కార్తీక పౌర్ణమి నాడు ఆమె సహగమనానికి సిద్ధిమైందని అంటారు. అలాగే, రాక్షసులను జయించి వచ్చిన శివుడికి దృష్టి దోష పరిహారార్థం ఏర్పాటు చేసిన విజయచిహ్నమే ఈ పర్వమనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
ఇంకా, కార్తీక పూర్ణిమ ఎన్నో విధాలుగా ప్రాశస్త్యమైనది. ఈనాడు మార్కండేయ పురాణాన్ని దానం చేస్తే పౌండరీక యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుందని శాస్త్ర వచనం.
కార్తిక పౌర్ణమిని ఆధారంగా చేసుకుని అనేక నానుడులు వ్యావహారికంలో ఉన్నాయి. ‘కర్ణుడు చనిపోయాక భారతం లేదు. కార్తిక పౌర్ణమి వెళ్లాక వానలు లేవు’ అని తెలుగు రాష్ట్రాలలో ఒక నానుడి బాగా వ్యాప్తిలో ఉంది. ఈనాటితో ఇక, వానలుండవు. చలిమంచు తెరలు దట్టంగా కమ్ముకుంటాయి. శీతాకాలం పరాకాష్టకు చేరుకుంటుంది.
కార్తిక పూర్ణిమ నాడు కార్తిక పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. వ్రతాలలోనే గొప్ప వ్రతమిది. తెలుగు నాట ఈనాడు చలిమిడి చేస్తారు. పార్వతీదేవి కూడా ఒకనాడు కార్తిక పూర్ణిమ వ్రతం ఆచరించిందని అంటారు. మహిషాసురుడితో యుద్ధం చేసే సమయంలో పార్వతి (దుర్గ) తనకు తెలియకుండానే ఒక శివలింగాన్ని బద్దలుగొట్టిందట. ఆ పాపం పోవడానికి ఆమె ఒకానొక కార్తిక పూర్ణిమ నాడు శివారాధన చేసిందట. దీంతో దోష పరిహారం జరిగిందని అంటారు. కొన్నిచోట్ల ఈనాడు ఉమామహేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
గురునానక్ జయంతి దినం కూడా ఈనాడే. అలాగే, తెలుగు వారి ఆరాధ్య దైవం పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి పుణ్యతిథి కూడా ఈనాడే.
కాగా, ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల సువర్ణముఖీ నది తీర్థ ముక్కోటిని ఈనాడు నిర్వహిస్తారు. అలాగే, తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి వారి సన్నిధిలో ఈనాడు గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇదేరోజు నాడు నారాయణవనం శ్రీవేంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవం ముగుస్తుంది. చిత్తూరు జిల్లా నగరిలో వేంచేసి యున్న శ్రీ కరియ మాణిక్యస్వామి వారి పవిత్రోత్సవాన్ని ఈనాడే నిర్వహిస్తారు.
కార్తిక బహుళ పాడ్యమి
నవంబరు 16, శనివారం
కార్తిక బహుళ పాడ్యమి నాడు అన్నదానం చేస్తే మహా ఫలప్రదమని అంటారు. అలాగే, ఈ తిథి నాడు లావణ్య వ్యాప్తి వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. ఈ వ్రతాన్ని ఒక నెల రోజుల పాటు నిష్టగా చేయాల్సి ఉంటుంది. ఈనాటి నుంచి వృశ్చిక సంక్రమణం.
కార్తిక బహుళ విదియ
నవంబరు 17, ఆదివారం
కార్తిక బహుళ విదియ తిథి నాడు అశూన్య వ్రతాన్ని ఆచరించాలి. దీనినే చాతుర్మాస్య ద్వితీయ పర్వంగానూ వ్యవహరిస్తారు. ఈ వ్రతం గురించి పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు భద్ర వ్రతం ఆచరించాలని ఉంది. ఇది దేవి (అమ్మవారు)కి సంబంధించిన వ్రతంగా తెలియవస్తుంది.
కార్తిక బహుళ తదియ
నవంబరు 18, సోమవారం
కార్తిక బహుళ తదియ నాడే సంకష్టహర చతుర్థి జరుపుకోవాలని పంచాంగాలు, క్యాలెండర్లలో ఉంది. నిజానికి చతుర్థి తిథి నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. కానీ, దీనిని ఈనాడే జరుపుకోవాలి పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
కార్తిక బహుళ చతుర్థి
నవంబరు 19, మంగళవారం
కార్తిక బహుళ చతుర్ధి (చవితి) స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతాలను అందిస్తోంది. వాటిలో కరక చతుర్థి వ్రతం ఒకటి. ఇది పన్నెండు సంవత్సరాలు, లేదా పదహారు సంవత్సరాలు లేదా జీవితాంతం కానీ ఆచరించాల్సిన వ్రతం. స్త్రీలకు ఉద్ధిష్టమైన వ్రతమిది. ఈనాడు ఉదయాన్నే స్నానం చేసి మడి బట్టలు కట్టుకుని, నగలు ధరించి వినాయకుడిని పూజించాలి. గణపతికి పది రకాల పిండి వంటలతో కూడిన పళ్లాలను నివేదించాలి. అనంతరం వాటిని ముత్తయిదువులకు పంచాలి. చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి భోజనం చేయాలి. ఈ తిథిని దశరథ చతుర్థిగానూ వ్యవహరిస్తారు.
అలాగే, సంకష్ట హర గణపతిని విశేషంగా పూజిస్తారు. కానీ, సంకష్టహర చతుర్థిని ఇంతకుముందు రోజే జరుపుకోవాలని పంచాంగాలలో ఉంది. ఈనాటి నుంచి అనురాధ కార్తె ప్రారంభం అవుతుంది.
అలాగే, తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి వారి సన్నిధిలో ఈనాడు (నవంబరు 19) లక్ష బిల్వార్చన నిర్వహిస్తారు.
కార్తిక బహుళ సప్తమి
నవంబరు 22, శుక్రవారం
మనకు సంప్రదాయానుసారం వచ్చే అనేక వ్రతాలలో మిక్కిలి విచిత్రమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో పైతామహాకృచ్ఛ వ్రతం ఒకటి. కార్తీక బహుళ సప్తమి నాడు ఆచరించాల్సిన ఈ వ్రతం గురించి చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇది కొంత ఆశ్చర్యకరమైన వ్రత విధానంతో కూడి ఉన్నది. ఈ వ్రతాచరణ ప్రకారం- సప్తమి నాడు నీళ్లు, అష్టమి నాడు పాలు, నవమి నాడు పెరుగు, దశమి నాడు నెయ్యి మాత్రమే తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.
కార్తిక బహుళ అష్టమి
నవంబరు 23, శనివారం
కార్తిక బహుళ అష్టమి తిథి నాడు దాంపత్యాష్టమి. సంవత్సరం పొడవునా వచ్చే వివిధ అష్టమి తిథుల నాడు వివిధ రకాలైన పూలతో శివుడిని పూజిస్తారు. ఈ క్రమంలో కార్తిక బహుళ అష్టమి నాడు వచ్చే తిథి దాంపత్యాష్టమిగా ప్రతీతి. ఈ వ్రతం చేయాలంటే ప్రతి సంవత్సరంలో వచ్చే అష్టమి నాడు శివుడిని వివిధ రకాల పూలతో పూజించాలని వ్రత నియమం. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఈ తిథి నాడు కాలభైరవుడిని పూజిస్తారు. ఇంకా కార్తిక బహుళ అష్టమి నాడు ఆచరించే వ్రతాలలో ప్రథమాష్టమి, కృష్ణాష్టమి, కాలాష్టమి అనేవి కూడా ఉన్నాయి.
కార్తిక బహుళ నవమి
నవంబరు 23, శనివారం
కార్తిక బహుళ నవమి ప్రత్యేకించి ఏ పూజకూ, ఆచారానికీ నిర్దేశించి లేకపోయినా.. సాధారణంగా నవమి నాడు దుర్గామాతను పూజించడం సంప్రదాయం.
కార్తిక బహుళ ఏకాదశి
నవంబరు 26, మంగళవారం
కార్తిక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశిగా ప్రతీతి. ఏకాదశీ దేవి ఈనాడు ఉత్పత్తి పొందినది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి దేవి మురాసురుడనే రాక్షసుడిని వధించిందని అంటారు. మురాసురుడిని సంహరించిన ఏకాదశిదేవిని మెచ్చిన విష్ణువు, ఆమెను మూడు వరాలు కోరుకొమ్మన్నాడు. దాంతో ఆమె- ‘నా పేరు ఏకాదశి. నేను ఎల్లప్పుడూ మీకు ప్రియురాలిగా ఉండాలి, అన్ని తిథుల్లోనూ నాకు అధిక ప్రాముఖ్యం ఉండాలి, నా తిథి (ఏకాదశి) నాడు ఉపవాసం ఉండి, మిమ్మల్ని (విష్ణువు) ఉపాసించే వారికి మోక్షం ప్రసాదించాలి’ అని మూడు వరాలు కోరుకుంది. దీంతో ఆ మూడు వరాలను విష్ణువు ఆమెకు ప్రసాదించాడు. అలాగే, ఈనాడు కామధేను వ్రతం కూడా ఆచరిస్తారని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఇది అయిదు రోజుల వ్రత కార్యకలాపమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కార్తీక బహుళ దశమి నాడు పంచగవ్య భక్షనం చేసి కార్తీక బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు.
కార్తిక బహుళ ద్వాదశి
నవంబరు 27, బుధవారం
కార్తిక బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ఇంకా ఈనాడు యోగీశ్వర ద్వాదశి తిథి అని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు గోపూజ చేయాలని అంటారు. అందుకే దీనిని గోవత్స ద్వాదశిగానూ పిలుస్తారు. దూడతో కూడిన ఆవును పూజించాలని వ్రత నియమం.
ఇలా ఉండగా, నవంబరు 27వ తేదీ నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతీ తాయార్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఇదే రోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన కూడా నిర్వహిస్తారు. అలాగే, నాగులాపురంలోని శ్రీవేద నారాయణస్వామి వారి పవిత్రోత్సవం కూడా ఈనాడే.
కార్తిక బహుళ త్రయోదశి
నవంబరు 28, గురువారం
కార్తిక బహుళ త్రయోదశి నాడు యమదీప దానం చేయాలని నియమం. యమునా నదిలో స్నానం చేసి యమునికి తర్పణం విడిస్తే విశేష ఫలాన్నిస్తుందని అంటారు.
కాగా, త్రయోదశి తిథి నాడు ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరిని కూడా పూజిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్ ప్రకారం ధన త్రయోదశి, ధన్వంతరి జయంతి పర్వాలు ఈనాడే. త్రయోదశి తిథి నవంబరు 28, 29 తేదీలలో కూడా కొనసాగుతోంది. కాబట్టి ఈ రెండు రోజుల్లోనూ పైన చెప్పిన కృత్యాలను ఆచరించవచ్చు. కాగా, తిరుచానూరు శ్రీపద్మావతీ తాయార్ల బ్రహ్మోత్సవాలు ఈనాటి నుంచి ప్రారంభం అవుతాయి.
కార్తిక బహుళ చతుర్దశి
నవంబరు 30, శనివారం
కార్తిక బహుళ చతుర్దశి తిథి సాధారణంగా భౌమవారం (బుధవారం)తో కూడి వస్తే కనుక ఆనాడు చిత్రా చతుర్దశి అంటారు. కానీ, ఇది శనివారం నాడు వచ్చింది. సాధారణంగా చిత్రా చతుర్దశి నాడు శివుడిని పూజించాలి. చంద్రోదయ సమయంలో తిల తైలంతో స్నానం చేయాలి. చంద్రాస్తమయ వేళ ఉల్కాదానం చేయాలి. సాయంకాలం వేళ దీపదానం చేయాలి.
కార్తిక మాస విధులు
కార్తిక సోమవారం: కార్తిక సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. ఈ నెలలో సోమవారం వ్రతం చేసే వారు పరమశివుని అనుగ్రహానికి పాత్రులై, శివ సాయుజ్యాన్ని పొందుతారు. సోమవారం తెల్లవారుజామునే స్నానం చేసి దీపం పెడతారు. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి కార్తిక సోమవారం నాడు పొద్దుటి నుంచి అభిషేకాలు చేసి, సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు. పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలు వచ్చాక బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తరువాత తింటారు.
కార్తికంలో నదీ స్నానం: కార్తిక మాసంలో వాతావరణ మార్పు వల్ల సంభవించే చిన్న చిన్న రుగ్మతలను నాశనం చేసే గుణం మనకు గల ఏడు ప్రధాన నదుల్లోని నీటిలో ఉంది. అందుకే ఈ నదుల్లో కృత్తిక నక్షత్రం వెళ్లిపోకుండా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఈ నెలలో తెల్లవారుజామున మెడ వరకు నీటిలో మునిగి కొంత సమయం ఉండి స్నానం చేస్తే ఉదర సంబంధ వ్యాధులు నయం అవుతాయని శాస్త్రం చెబుతోంది.
33 పున్నముల నోము: కార్తిక శుద్ధ పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు. ఈ కారణంగానే ఈ మాసానికి కార్తికమనే పేరొచ్చింది. ఈ రోజు పుణ్య నదుల్లో స్నానం చేసి జపాలు, పూజలు చేస్తారు. స్త్రీలు 33 పున్నముల నోము ఆచరిస్తారు. సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటారు. అన్న సంతర్పణలు చేస్తారు. పౌర్ణమి నాడు సాయంత్రం పూర్ణ చంద్రుడు వచ్చాక ఎవరైతే పూజలు చేస్తారో వారింట్లో శ్రీ మహా విష్ణువు లక్ష్మీసమేతుడై కొలువు ఉంటాడని ప్రతీతి. ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుంది.
ద్వాదశి.. దీప ఫలం: కార్తిక మాసంలో ఉసిరిక చెట్టును భక్తితో పూజిస్తారు. ద్వాదశి రోజున తులసి చెట్టు, ఉసిరిక (ధాత్రి)లోనూ విష్ణువు ఉంటాడు. అందుకే తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణుడిని ఈ రోజు పూజిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. తులసి కోట దగ్గర ఆవు నేతిలో దీపాలు వెలిగిస్తారు. ద్వాదశి నాడు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం. పూజానంతరం దక్షిణ తాంబూలాలు పంచితే విశేష ఫలం లభిస్తుంది. పండ్లు, కొబ్బరికాయ నైవేద్యం పెడతారు. ఉసిరితో తినే పదార్థాలను తయారు చేస్తారు.
ఉసిరికి పట్టం..
తులసికి కల్యాణం
ఉసిరి, తులసికి పట్టం కడుతుంది కార్తిక మాసం. అందుకే ఈ రెండూ ఈ మాసంలో పూజనీయమైనవిగా అవతరించాయి. ఈ రెండూ పరమ పవిత్రమైనవి. తులసి చెట్టు గాలి వలే ఉసిరిక చెట్టు నీడ, గాలి కూడా చాలా ఆరోగ్యకరమైనవి. కార్తీక మాసంలో వన భోజనాలు, వన సంతర్పణలు ఉసిరి చెట్టు నీడనే జరపడం ఈ చెట్టుకున్న ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. అదీగాక, ఈ రెండు చెట్ల ప్రాముఖ్యత తెలిపేలా ఉసిరి, తులసి ఒకేచోట పుట్టినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి. ధాత్రి అనేది ఉసిరికి గల మరో పేరు. క్షీరాబ్ధి ద్వాదశి నాడు కాయలతో కూడిన దీని కొమ్మను తులసితో కలిపి పూజించడం ఆచారం. ఈ నేపథ్యంలో ఉసిరి, తులసి గుణగణాలేమిటో తెలుసుకుందాం..
అరుచిని పోగొట్టే ఉసిరిక
కార్తీక మాసంలో తప్పక తీసుకోవాల్సిన పదార్థం- ఉసిరిక. దీనికి మంచి రసాయనిక గుణాలున్నాయి. ఉసిరికాయతో చేసిన పదార్థాలను తింటే శరీరానికి అనేక విధాల మేలు కలుగుతుంది. ఉసిరిక శీతగుణం కలది. తీపి, పులుపు, కారం, చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే వేడిని పోగొడుతుంది. కండ్ల మంటలు, పాదాల మంటలు తగ్గుతాయి. అరుచిని పోగొడుతుంది. దాహం తగ్గుతుంది. ఉసిరికాయను ఏదో ఒక రూపంలో రోజూ ఆహారంలో తీసుకోవచ్చు.
తులసీ ధాత్రి సహిత విష్ణువు
కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును భక్తితో పూజిస్తారు. ద్వాదశి రోజున తులసి చెట్టు, ఉసిరిక (ధాత్రి)లోనూ విష్ణువు ఉంటాడు. అందుకే తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణుడిని ఈ రోజు పూజిస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి. తులసి కోట దగ్గర ఆవు నేతిలో దీపాలు వెలిగిస్తారు. ద్వాదశి నాడు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం. పూజానంతరం దక్షిణ తాంబూలాలు పంచితే విశేష ఫలం లభిస్తుంది. ఆ పరమాత్మకు పండ్లు, కొబ్బరికాయ నైవేద్యం పెడతారు. ఉసిరితో తినే పదార్థాలను తయారు చేస్తారు. ద్వాదశి నాడు తులసీ కల్యాణం నిర్వహించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది.
Review హరిహర మాసం.