చిన్న చేప పెద్ద చేపను మింగిందట!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.

అశోకుని రాజ్యంలో పశువైతే మాత్రమేమి?
పశుజన్మ కంటే మానవజన్మను ఉత్తమమైనదిగా భావిస్తాం. మానవ జన్మ ఎత్తినప్పటికీ రాజ్యంలో ఉండే పరిస్థితుల వల్లో, ఇతర పరిస్థితుల వల్లో హీనమైన పరిస్థితులు ఎదురైతే ‘పశువులా బతుకీడుస్తున్నాను’ అని వాపోతారు. ‘హీనంగా బతుకుతున్నాం’ అని చెప్పడానికి పశువు అనే శబ్దాన్ని ఉపయోగిస్తారు. ‘మనషి జన్మ ఎత్తి పశువులా బతకడం కంటే పశువు జన్మ ఎత్తయినా సరే మంచిగా బతకాలి. సుఖంగా బతకాలి’ అంటుంటారు. ఈ నేపథ్యంలో నుంచి పుట్టిన మాటే ‘అశోకుని రాజ్యంలో పశువైతేనేమి?’.గొప్ప చక్రవర్తిగా చరిత్ర ప్రసిద్ధి పొందాడు అశోకుడు. అతడు సాధించిన యుద్ధ విజయాల కంటే చేసిన మంచి పనులే అతడిని గొప్పవాడిని చేశాయి. ఒక మంచి వ్యక్తి దగ్గర ఏ స్థాయిలో పనిచేసినా మంచిదే అనుకునే సందర్భాలలో ఉపయోగించే జాతీయం ఇది.

ఎంత మీను వచ్చి ఎంత మీనును మ్రింగే!
అసాధ్యాలనుకున్నవి సాధ్యమైనపుడు, అబ్బురపరిచే వాటి విషయంలో వాడే జాతీయం ఇది. ఇది పెద్ద బలవంతుడు, ఒక బలహీనుడు ఉన్నారనుకుందాం. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? అనే ప్రశ్నకు చాలా సులువుగా సమాధానం చెప్పవచ్చు సింహం, మేకలలో ఏది గెలుస్తుంది? అని అడిగితే సమాధానం కోసం బుర్ర గోక్కోవలసిన పని లేదు కదా!. పుసుక్కున సీన్‍ రివర్స్ అయితే.. ఎంత పెద్ద ఆశ్చర్యమో కదా!. ఇలాంటి సందర్భంలో ‘ఎంత మీను వచ్చి ఎంత మీనును మ్రింగే!’ అనే జాతీయాన్ని వాడుతుంటారు. మీను అంటే చేప. చిన్న చేప పెద్ద చేపను మింగడం ఎంత ఆశ్చర్యం?!.

లుబ్దావధానులు
గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకంతో పరిచయం ఉన్న వారికి ‘లుబ్దావధానులు’ పాత్ర అపరిచితం ఏమీ కాదు. డబ్బుకు గడ్డి తినే రకం, తాను తినక ఇతరులను పస్తులుంచే రకం, చౌకగా దొరుకుతుంది అనుకుంటే ఎంతకైనా తెగించే రకం, తరచుగా వేషాలు మార్చే రకం.. ఇలా ఎన్ని విధాలుగానైనా మన లుబ్దావధానులను నిర్వచించుకోవచ్చు. ‘లుబ్దావధానులు’ అనే పేరులోనే అతడి స్వభావం దాగి ఉంది. లుబ్దుడు అంటే పిసినారి కదా! ‘కన్యాశుల్కం’ నాటక ప్రభావం మన మీద ఎంత బలంగా ఉందంటే, నిజ జీవితంలో ఎవరైనా పిసినిగొట్టుగా వ్యవహరించినా, ‘నా స్వార్థమేదో నాది’ అన్నట్టుగా వ్యవహరించినా, ‘వీడుత్త లుబ్దావధానుల్లా ఉన్నాడే’ అనడం పరిపాటైంది.

అజగరోపవాసం
కంటికి కనిపించేది వాస్తవం.
అయితే కంటికి కనిపించిందల్లా వాస్తవం కాకపోవచ్చు. కొంగ జపం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ వాస్తవం కాదు. మొసలి కన్నీరు కారుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ వాస్తవం కాదు. అజగరోపవాసం కూడా అలాంటిదేనూ. అజగరం అంటే కొండచిలువ. కొండచిలువ చేసే ఉపవాసమే అజగరోపవాసం.
ఏ జంతువునో మింగిన తరువాత, తిన్నది అరిగే వరకు కదలక, మెదలక ఒక మూలన పడుకుంటుంది కొండచిలువ. చుట్టు చుట్టుకుని పరుండి నీరసంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఉపవాసం చేస్తున్నట్టుగా కూడా కనిపించవచ్చు. కానీ, అది నిజం కాదు. హాయిగా జంతువును మింగేసి, దాన్ని హరాయించుకోవడానికి కొండచిలువ అలా పడుకుని ఉంటుంది.
పైకి అమాయకంగా కనిపిస్తూ, మోసాలు చేసే వినయవంతుల చేష్టలను ఇలా ‘అజగరోపవాసం’ పేరుతో పోలుస్తారు.

Review చిన్న చేప పెద్ద చేపను మింగిందట!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top