మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
వెన్నెల హారతి
పాల వెన్నెల పూల వెన్నెల
పాల కడలికి పట్టి వెన్నెల
తేట వెన్నెల పాట వెన్నెల
పాలమీగడ తొరక వెన్నెల
తరపి వెన్నెల వలపు వెన్నెల
బతుకు పండిన పసిడి వెన్నెల
నగవు వెన్నెల తొగరు వెన్నెల
చెలిమి వెన్నెల కలిమి వెన్నెల
తెలుపు విరిసిన దిగంతాలకు
మెరుపుతీగల నగల వెన్నెల
కలల మెలకువ కొసలు తాకిన
పులకరింతల ముద్దు వెన్నె
పాల వెన్నెల పూల వెన్నెల
పాల కడలికి పట్టి వెన్నెల
తేనె కలిపిన వెన్న వలె
హృదయాలు చేసే జాలి వెన్నెల
వడగళ్లు హరివిల్లు
అమ్మా నాన్నా ఇద్దరె మాకూ
నేనూ చెల్లీ ఇద్దరమే!
లాలలు పోసీ, బువ్వలు పెట్టీ
జోలలు పాడే అమ్మే మంచీ!
బొమ్మలు తెచ్చీ మిఠాయి పెట్టీ
కతలను చెప్పే నాన్నే మంచీ!
అమ్మా నాన్నా ఇద్దరె మాకూ
నేనూ చెల్లీ ఇద్దరమే!
నేను నవ్వితే వడగళ్లూ, మరి
చెల్లి నవ్వితే హరివిల్లు
నేనూ చెల్లీ ఎంతో మంచీ
స్కూలుకు పోతూ వస్తాము!
అమ్మా నాన్నా ఇద్దరె మాకూ
నేనూ చెల్లీ ఇద్దరమే!
ఆటలు ఆడీ పాఠాలు చదివితే
అమ్మ ఎంతగా మెచ్చేనో
పేచీపెట్టి, చెల్లిని కొడితే
నాన్న కోపమున ఉరిమేనో!
అమ్మా నాన్నా ఇద్దరె మాకూ
నేనూ చెల్లీ ఇద్దరమే!
Review పాల వెన్నెల పూల వెన్నెల.