అంకపొంకాలు లేనివాడే మనిషి

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం..

అంకపొంకాలు లేనిది శివలింగం
అంకము అంటే సంఖ్య విలువ (అంకె). పొంకము అంటే గర్వము. అంటే శివలింగానికి సంఖ్యా విలువ కానీ, గర్వం కానీ ఉండవు. అంటే అది మిక్కిలి గొప్పదని అర్థం. మనుషులు కట్టే లెక్కలతో కూడిన సంఖ్యా శాస్త్రానికి, సాధారణ గర్వానికి శివలింగం అతీతమైనదని అర్థం. నిజానికి ఈ సామెత చాటే సందేశం ఏమిటంటే.. మనిషి అంకపొంకాలు లేకుండా శివలింగం మాదిరిగా ఉండాలని!. ఈశ్వరుడి గొప్పతనాన్ని తెలియచేసేందుకు సాధారణంగా ఈ సామెతను వాడతారు.

అంగట్లో ఎక్కువైతే ముంగిట్లోకి వస్తుంది
మార్కెట్లో ఏదైనా సరుకు జనం అవసరాని కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువుకు అమాంతం డిమాండ్‍ పెరిగిపోతుంది. ధర విషయాన్ని కూడా ఆలోచించకుండా జనం దాని కోసం ఎగబడతారు. దాన్ని కొనేందుకు బారులుతీరుతారు. అదే సరుకు అవసరానికి మించి ఎక్కువగా అందుబాటులో ఉంటే దాని వైపు ఎవరూ చూడరు. ధర, డిమాండ్‍ కూడా ఏకకాలంలో తగ్గిపోతాయి. అప్పుడు అమ్మకందారులు అదే సరుకును అనేక రాయితీలు, డిస్కౌంట్లు ఇచ్చి అమ్మజూపుతాయి. అంతెందుకు.. అదే సరుకును కోరుకుంటే ఇంటి వద్దకు కూడా పంపిస్తారు. అంటే మార్కెట్లో ఏదైనా సరుకు ఎక్కువగా ఉంటే అది తక్కువ ధరతో మన ముంగిటకే వస్తుందని పై సామెత అర్థం.

అంకెకు రాని ఆలి.. కీలెడలిన కాలు
భార్య అంటే భర్తను అర్థం చేసుకుని అతనికి చేదోడువాదోడుగా ఉండాలనేది మన సంప్రదాయం. అందుకే భర్తలో భార్య సగం. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకున్నా.. ఒకరి మాట మరొకరికి పడకున్నా ఆ కాపురం నిలవదు. అందుకే ఇంటి యజమానికి ఇల్లాలు కొంత ‘అంకెకు రావడం’ (వశమై ఉండటం) మంచిదని మన పెద్దలు చెబుతారు. అలా వశమై ఉండకపోతే, ఎడలిపోయిన (విడిపోయిన) కీలులాగా జీవితాంతం బాధిస్తుంటుందని ఈ సామెత భావం. కీళ్ల నొప్పులున్న కాళ్లతో ఎంత దూరమని నడవగలం? అలాగే, సహకరించని భార్యతో ఆ సంసారం సజావుగా సాగదని అర్థం.

అంగట్లో అరువు.. తల మీద బరువు
అరువు లేదా అప్పు అనేది ఎప్పటికీ ఇబ్బంది పెట్టే అంశమే. ఏదైనా దుకాణంలో అరువుకు సరుకు తీసుకున్నా.. ఎవరి వద్దనైనా అప్పు తీసుకున్నా అది తీర్చే వరకు కొండంత బరువు మోస్తున్న భావన కలుగుతుంది. అది తీరే వరకు ముప్పుగానే బాధిస్తుంది. ఈ క్రమంలోనే అంగట్లో అప్పు ఉంటే తల మీద బరువు ఉన్నట్టే అనే సామెతను వాడుతుంటారు. సదరు అప్పు తీరగానే కొండంత భారం దిగిపోయినట్టు ఉంటుంది. మనసు తేలికవుతుంది. అప్పు చేసే పరిస్థితి రాకుండా ఉంటే కలిగే ఆనందం, సంతోషకరమైన భావనకు సంబంధించిన సామెత ఇది.

అంగిట బెల్లం.. ఆత్మలో విషం
‘ఫయోముఖ విష కుంభం’ అనే సంస్క•త సామెత ఒకటి వాడుకలో ఉంది కదా!. అటువంటిదే ఈ సామెత కూడా. అంగిట అంటే నోరు అని అర్థం. అంగిట బెల్లం అంటే.. నోటితో తియ్యగా మాట్లాడతారు.. కానీ, మనసులో మాత్రం చాలా చెడు భావనతో ఉంటారు. కొందరు తియ్యగా మాట్లాడతారు. కానీ, లోలోన అసూయతో రగిలిపోతుంటారు. చెడు కోరుకుంటారు. అటువంటి వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు.

Review అంకపొంకాలు లేనివాడే మనిషి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top