మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
తాయిలమేదో తీసీ పెట్టమ్మా
ఆటలు ఆడీ పాటలు పాడీ అలసీ వచ్చానే- తియ్యా తియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా
పిల్లిపిల్లా కళ్లుమూసి పీట ఎక్కింది కుక్కపిల్లా తోకాడిస్తూ గుమ్మమెక్కింది కడుపులోని కాకిపిల్ల గంతులేస్తోందీ
తియ్యాతియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా
గూట్లో ఉన్నా బెల్లమ్ముక్కా కొంచెం పెట్టమ్మా
చేటలో ఉన్న కొబ్బరి కోరు చారెడు పెట్టమ్మా
అటకా మీది అటుకుల కుండా అమ్మా దింపమ్మా
తియ్యా తియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా
ఆటలు ఆడీ పాటలు పాడీ అలసీ వచ్చానే- తియ్యా తియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా
చక్కని లోకంలో..
చక్కని లోకంలో దిక్కుల దారుల్లు
దిక్కుల దారుల్లో చిక్కని చీకటి
చిక్కని చీకటిలో చిక్కిన తారల్లు
చిక్కిన తారల్లో చెక్కిన రవ్వల్లు
చెక్కిన రవ్వల్లో నక్కిన కాంతుల్లు
నక్కిన కాంతుల్లో దక్కిన ఊహల్లు
దక్కిన ఊహల్లో మిక్కిలి వింతల్లు
సున్న విలువ సున్నా
అన్నా అన్నా అన్నావా
సున్నకు విలువ సున్నా
అక్షరానికి పక్కన ఉంటే అర్థం మారుతుందన్నా
అన్న పక్కన సున్న పెడితే అన్నం అవుతుంది
సున్న పక్కన సున్న ఉంచితే సున్నం అవుతుంది
జడలో సున్నా జండ
దడలో సున్నా దండ
బడిలో మడిలో గడిలో గుడిలో
బండి మండి గండి గుండి
పదిలో సున్న పంది
నదిలో సున్న న•ంది
మదిలో మంది కదిలో కంది
అంది గంది వంది బంది
అన్నా అన్నా అన్నావా
సున్నకు విలువ సున్నా
అక్షరానికి పక్కన ఉంటే అర్థం మారుతుందన్నా
లాలమ్మ లాలి
లాలి లాలమ్మ లాలి లాలమ్మ
లాలమ్మ గుర్రాలు లంకల్లో మేసె
బుల్లెమ్మ గుర్రాలు బీడుల్లో మేసె
అప్పన్న గుర్రాలు అడవుల్లో మేసె
ఊరుకో అబ్బాయి వెర్రి అబ్బాయి
ఉగ్గెట్టు మీయమ్మ ఊరెళ్లింది
పాలిచ్చు మీయమ్మ పట్నమెళ్లింది
నీలోసె మీయమ్మ నీళ్లకెళ్లింది
లాలి లాలమ్మ లాలి లాలమ్మ
Review మిక్కిలి వింతలు.