తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర మాసం తొమ్మిదవది. ఆంగ్లమానం ప్రకారం పదకొండవ మాసం (నవంబరు). ఈ నెలలో కార్తీక మాసంలోని కొన్ని రోజులు, మార్గశిర మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. కార్తీక పౌర్ణమి, చిలుక ద్వాదశి, గీతా జయంతి, సుబ్రహ్మణ షష్ఠి వంటి ఎన్నో పండుగలు, పర్వాలు ఈ మాసంలో నెలవై ఉన్నాయి.
నవంబరు మాసం కార్తీకం – మార్గశిర తిథుల కలయిక. శివకేశవుల ఆరాధనకు ఈ నెల శ్రేష్ఠమైనది. లోకానికి వెలుగులు పంచే కార్తీక పౌర్ణమి పర్వం ఆధ్యాత్మికంగా మనసుల్ని దేదీప్యమానం చేస్తుంది. నవంబరు 18వ తేదీ వరకు కార్తీక తిథులు, ఆపై నవంబరు 19 నుంచి మార్గశిర మాస తిథులు ప్రారంభమవుతాయి. ఇక, మార్గశిర మాసం సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు స్వస్వరూప మాసంగా ప్రతీతి. భగవద్గీతలో పరమాత్ముడు- ‘నేను మాసాలలో మార్గశిరాన’ అని నుడివాడు. దీనిని బట్టి ఈ మాసం దేవదేవుడికి అత్యంత ప్రీతికరమైనదని భావించాలి. పూర్వం సంవత్సరారంభం (ఉగాది) మార్గశిరంతోనే ఆరంభమయ్యేదని తెలుస్తోంది. మార్గశిరం – పుష్య మాసాలు కలిపి హేమంత రుతువు. భాగవతంలోని దశమ స్కందంలో, ఈ మాసం, ఈ రుతువు గురించి వర్ణిస్తూ- ‘ఇది ఆరోగ్య మాసం’ అన్నారు. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం కావడం చేత దీనికి మార్గశిరమనే పేరు వచ్చింది. సరిగ్గా ఈ సమయంలో చలి మంచి ముమ్మరంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలానికి తగిన విధంగా ఈ మాసంలో తగిన వ్రతాలు, ఆరోగ్య నియమాలను మన పెద్దలు ఏర్పరిచారు. ఈ మాసంలోని శుద్ధ పాడ్యమి మొదలు బహుళ అమావాస్య వరకు వచ్చే దాదాపు అన్ని తిథులు ఆయా వ్రతాలకు, ఆధ్యాత్మిక సాధనకు అనుగుణమైనవే. అవేమిటో వివరాలు తెలుసుకుందాం.
కార్తీక శుద్ధ ఏకాదశి
నవంబరు 1, బుధవారం
వివిధ వ్రత గ్రంథాలలో ఈ తిథిని మథన ద్వాదశిగా పేర్కొన్నారు. క్షీర సముద్రాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడే దేవతలు మథించారని, అందుకే ఇది మథన ద్వాదశి అయ్యిందని అంటారు. దీనినే మన తెలుగు నాట చిలుకు ద్వాదశిగా వ్యవహరిస్తుంటారు. అలాగే, క్షీర సముద్ర మథన సంబంధ పర్వం కాబట్టే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా కూడా వ్యవహరిస్తుంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు క్షీరాబ్ది నుంచి బయల్దేరి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి బృందావనానికి బయల్దేరుతాడు. కాబట్టి ఈ తిథి నాడు తులసి మొక్కను విశేషంగా పూజించే ఆచారం ఉంది. అలాగే, కార్తీక శుద్ధ ద్వాదశిని కొన్ని వ్రత గ్రంథాలలో యోగిని ద్వాదశిగా కూడా పేర్కొన్నారు. ఇంకా విభూతి ద్వాదశి, గోవత్స ద్వాదశి తదితర వ్రతాల ఆచరణకు ఇది ఉద్ధిష్టమైన దినమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు.
కార్తీక శుద్ధ త్రయోదశి
నవంబరు 2, గురువారం
నవంబరు 2, గురువారం కార్తీక శుద్ధ త్రయోదశి పర్వం. ఇది శివునికి, శనిదేవునికి ప్రీతికరమైన తిథి. ఈనాడు శని త్రయోదశి పూజలు నిర్వహిస్తారు. శనిదేవుని విశేషంగా ఆరాధిస్తారు. అలాగే, ఈనాడు గో త్రిరాత్రి వ్రతం కూడా ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.
కార్తీక శుద్ధ చతుర్దశి.
నవంబరు 3, శుక్రవారం
విష్ణుమూర్తి శంకరుడిని పూజించిన తిథి పర్వమిది. విష్ణువు వైకుంఠం నుంచి బయల్దేరి వారణాసికి వెళ్లి స్వయంగా శివుడిని పూజించినది ఈ రోజేనని చెబుతారు. కాబట్టి ఇది పవిత్రమైన పర్వదినంగా భావించాలి. కార్తీక శుద్ధ చతుర్దశినే వైకుంఠ చతుర్దశి పర్వంగానూ వ్యవహరిస్తారు.
కార్తీక బహుళ పాడ్యమి.
నవంబరు 5, ఆదివారం
కార్తీక బహుళ పాడ్యమి నాడు అన్నదానం మహా ఫలప్రదమైనదని అంటారు. అలాగే, ఈ తిథి నాడు లావణ్య వ్యాప్తి వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. ఈ వ్రతాన్ని ఒక నెల రోజుల పాటు నిష్టగా చేయాల్సి ఉంటుంది.
కార్తీక బహుళ విదియ/తదియ.
నవంబరు 6, సోమవారం
పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్న ప్రకారం ఈ తిథి నాడు అశూన్య వ్రతాన్ని ఆచరించాలి. దీనినే చాతుర్మ్యాస ద్వితీయ పర్వంగానూ వ్యవహరిస్తారు. అలాగే ఈ తిథి తెల్లవారుజాము గడియల్లోనూ తదియ కూడా ప్రవేశిస్తుంది.
ఈ తిధినాడు భద్ర వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. అయితే, ఇది దేవికి సంబంధించిన వ్రతమని తెలియ వస్తోంది.
కార్తీక బహుళ చవితి
నవంబరు 7, మంగళవారం
స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతాలలో కరక చతుర్ధి వ్రతం ఒకటి. స్త్రీలకు ఉద్ధిష్టమైన వ్రతమిది. ఈనాడు ఉదయాన్నే స్నానం చేసి మడి బట్టలు కట్టుకుని, నగలు ధరించి వినాయకుడిని పూజించాలి. గణపతికి పది పిండివంటలతో కూడిన పది పళ్లాలను నివేదించాలి. అనంతరం వాటిని ముత్తయిదువులకు పంచాలి. చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి భోజనం చేయాలి. ఇది 12, 16 సంవత్సరాల పాటు కానీ లేదా జీవితాంతం కానీ ఆచరించాల్సిన వ్రతం.
కార్తీక బహుళ సప్తమి
నవంబరు 10, శుక్రవారం
చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్న ప్రకారం ఈనాడు పైతామహాకృచ్ఛ వ్రతం ఆచరించాలి. ఇది కొంత ఆశ్చర్యకరమైన వ్రత విధానంతో కూడి ఉంటుంది. ఈ వ్రతాచరణ ప్రకారం.. సప్తమి నాడు నీళ్లు, అష్టమి నాడు పాలు, నవమి నాడు పెరుగు, దశమి నాడు నెయ్యి మాత్రమే తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. అయితే, ఈనాడు ప్రధానంగా ఏ దేవీదేవతలను పూజించాలనేది వివరించలేదు.
కార్తీక బహుళ అష్టమి
నవంబరు 11, శనివారం
సంవత్సరం పొడవునా వచ్చే వివిధ అష్టమి తిథుల నాడు వివిధ రకాలైన పూలతో శివుడిని పూజిస్తారు. ఈ క్రమంలో కార్తీక బహుళ అష్టమి నాడు వచ్చే తిథి దాంపత్యాష్టమిగా ప్రతీతి. ఈ వ్రతం చేయాలంటే ప్రతి సంవత్సరంలో వచ్చే అష్టమి నాడు శివుడిని వివిధ రకాల పూవులతో పూజించాలని వ్రత నియమం. అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో ఈ తిథి నాడు కాలభైరవుడిని పూజిస్తారు. ఇంకా కార్తీక బహుళ అష్టమి నాడు ఆచరించే వ్రతాలలో ప్రథమాష్టమి, కృష్ణాష్టమి, కాలాష్టమి అనేవి కూడా ఉన్నాయి..
కార్తీక బహుళ ఏకాదశి
నవంబరు 14, మంగళవారం
కార్తీక బహుళ ఏకాదశికి ఉత్పత్యైకాదశి అని కూడా పేరు. ఈ తిథి నాడు ఏకాదశ దేవి ఉత్పత్తి పొందింది కాబట్టి ఈ ఏకాదశికి ఆ పేరు వచ్చింది. కార్తీక బహుళ ఏకాదశి నాడు ఏకాదశి దేవి మురాసురుడిని సంహరించింది. ఈ క్రమంలోనే విష్ణువు ఆమెకు మూడు రకాలైన వరాలు ఇచ్చాడు. ఈనాడు ఆచరించే వ్రతం ఐదు రోజుల కార్యకలాపంగా ఉంటుంది. అలాగే, ఈనాడు కామధేను వ్రతం కూడా ఆచరిస్తారు.
కార్తీక బహుళ ద్వాదశి
నవంబరు 15, బుధవారం
చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం ప్రకారం ఈనాడు యోగీశ్వర ద్వాదశి వ్రతాన్ని ఆచరించాలి. అలాగే, స్మ•తికౌస్తుభం అనే వ్రత గ్రంథంలో పేర్కొన్న ప్రకారం ఈనాడు గోపూజ చేయాలి. దీనిని గోవత్స ద్వాదశి అని కూడా అంటారు. దూడతో కూడిన ఆవును పూజించడం ఈనాటి విధాయక కృత్యమని, పుణ్యం కలుగుతుందని ఆ వ్రత గ్రంథంలో ఉంది. గోపూజ ప్రాధాన్యాన్ని తెలిపే పర్వంగా దీనిని భావించవచ్చు.
కార్తీక బహుళ త్రయోదశి
నవంబరు 16, గురువారం
కార్తీక బహుళ త్రయోదశిని చిత్రా చతుర్దశి అని కూడా అంటారు. చిత్రా చతుర్దశి నాడు శివుడిని విశేషంగా పూజించాలని నియమం. తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో పేర్కొన్న ప్రకారం.. ఈనాడు సాయంకాల వేళ, చంద్రోదయ సమయంలో నువ్వుల నూనెను ఒంటికి పట్టించుకుని స్నానం చేయాలి. చంద్రాస్తమయ సమయంలో ఉల్కాదానం చేయాలి. తిరిగి సూర్యుడు ఉదయించే వేళ స్నానం చేస్తూ ఉత్తరేణిని తల చుట్టూ తిప్పుకోవాలి. అనంతరం స్నానం చేసి యమతర్పణం విడవాలి. ఈనాడు సాయంకాలం వేళ దీపదానం చేయాలి. అలాగే, యమదీప దానం, గోత్రిరాత్రి వ్రతం చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. కార్తీక బహుళ చతుర్దశి, మాస శివరాత్రి సందర్భాలలో ఏ నదిలో స్నానం చేసినా మహా పుణ్యం లభిస్తుంది. యమునా నదిలో స్నానం చేసి యముడికి తర్పణం విడిస్తే విశేష ఫలం కలుగుతుంది.
కార్తీక బహుళ అమావాస్య
నవంబరు 18, శనివారం
కార్తీక బహుళ అమావాస్య పలు విధాలుగా ప్రసిద్ధమై ఉన్నా.. గీతా జయంతిగా ఎక్కువగా వ్యావహారికంలో ఉంది. భగవద్గీత ఆవిర్భవించినది కార్తీక బహుళ అమావాస్య నాడేనని పలు ఆధారాలను బట్టి తెలుస్తోంది. కాబట్టి ఈ తిథి నాడు గీతా జయంతి నిర్వహించే ఆచారం ఏర్పడింది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీతా జయంతి జరుపుతుంటారు. అయితే, కార్తీక బహుళ అమావాస్య నాడే గీతా జయంతి అని ఇంకొందరు అంటారు. భారత కాలమానాన్ని బట్టి మాఘ శుద్ధ అష్టమి భీష్మ నిర్వాణ దినం. ఆయన అంపశయ్యపై 58 రోజులు ఉన్నట్టు భారతంలో స్పష్టంగా ఉంది. భీష్ముడు యుద్ధం చేసింది పది రోజులు. భీష్ముడు మరణించిన మాఘ శుద్ధ అష్టమి నుంచి మొత్తం 68 రోజులు రెండు నెలల 8 రోజులుగా లెక్క తేలుతోంది. ఈ కాలాన్ని వెనక్కి లెక్కిస్తే మహా భారత యుద్ధ ప్రారంభ దినం తేలుతుంది. ఈ గణనం ప్రకారం భారత యుద్ధ ప్రారంభ దినం కార్తీక బహుళ అమావాస్య అవుతుంది. భారత యుద్ధానికి ముందు అర్జునుడు కౌరవ పక్షంలోని తన బంధువులను చంపడానికి విముఖుడై ఉంటాడు. ఆ సందర్భంలోనే కృష్ణుడు అతనికి గీతోపదేశం చేశాడు. అదే భగవద్గీతగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం కార్తీక బహుళ అమావాస్య నాటి ఉదయం వేళ జరిగాయని అంటారు. దక్షిణాదిలో చాలాచోట్ల కార్తీక బహుళ అమావాస్య నాడే గీతా జయంతి నిర్వహిస్తారు. ఇంకా, ఈనాడు వృశ్చిక సంక్రాంతి, గోక్రీడాది, దీప ప్రజ్వలనం, లక్ష్మీపూజ, ద్యూత క్రీడా అలక్ష్మీ నిస్సారణ వంటి పూజలు నిర్వహిస్తారని ఆయా వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది.
మార్గశిర శుద్ధ పాడ్యమి
నవంబరు 19, ఆదివారం
ఈ తిథిలో మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈనాడు ధన్య, భద్ర చతుష్టయ వ్రతాలు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఈనాడు గంగాస్నానం మహా పుణ్యప్రదం. ఈనాటి స్నానం వల్ల కోటి సూర్య గ్రహణ స్నాన తుల్య ఫలం కలుగుతుందని తిథి తత్వంలో
ఉంది.
మార్గశిర శుద్ధ విదియ
నవంబరు 20, సోమవారం
సిక్కు మత గురువు జన్మదినం.
మార్గశిర శుద్ధ తదియ
నవంబరు 21, మంగళవారం
ఎన్నో వ్రతాల ఆచరణకు శుభమైన ముహూర్త తిథి ఇది. ఈనాడు ఉమామహేశ్వర, అనంత తృతీయ, అవియోగ తృతీయ, నామ తృతీయ, ఫలత్యాగ వ్రతాలు తదితరమైనవి ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ప్రస్తావించారు. అలాగే, పురుషా•
చింతామణి అనే మరో వ్రత గ్రంథంలో ఈనాడు రంభా తృతీయ వ్రతం చేస్తారని పేర్కొన్నారు.
మార్గశిర శుద్ధ చతుర్థి
నవంబరు 22, బుధవారం
ఈ తిథి నాడు ఢుండి రాజ పూజ చేయాలని అంటారు. ఈ పూజలో నువ్వులు ఉపయోగించాలని నియమం. ఇంకా ఈనాడు పాపదాన కృచ్ఛ్ర చతుర్థి, వరద చతుర్థి, నక్త చతుర్థి వ్రతాలు ఆచరించాలని పెద్దలు నిర్దేశించారు. నక్త వ్రతం వినాయక సంబంధమైనదిగా తెలుస్తోంది.
మార్గశిర శుద్ధ పంచమి
నవంబరు 23, గురువారం
నాగపంచమిగా ఈ తిథి ప్రసిద్ధి. ఈనాడు నాగులను విశేషంగా పూజిస్తారు. నాగులు సంతాన భాగ్యం కలిగించేవిగా భక్తులు విశ్వసిస్తారు. ప్రతి మాసంలో పంచమి వచ్చినా.. మార్గశిరంలో వచ్చే పంచమి తమకు అత్యంత పూజాధికమై ఉండాలని గరుడుడు బ్రహ్మ నుంచి వరం పొంది ఈ పంచమిని ఏర్పరిచాడని పురాణ కథనం. అలాగే, మార్గశిర శుద్ధ పంచమి నాడు శ్రీ పంచమి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో పేర్కొన్నారు.
మార్గశిర శుద్ధ షష్ఠి
నవంబరు 24, శుక్రవారం
ఈ తిథి సుబ్రహ్మణ్య షష్ఠిగా ప్రసిద్ధి. ఆంధప్రదేశ్ ప్రాంతంలోని కొన్ని జిల్లాలలో దీనినే సుబ్బారాయుడి షష్ఠిగా వ్యవహరిస్తారు. తమిళులు దీనిని స్కంద షష్ఠి అంటారు. సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) ఆరాధనకే కాక ఇంకా ఈనాడు చంపాషష్ఠి, ఫలషష్ఠి, ప్రావారణ షష్ఠి వ్రతాలు చేస్తారని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. కానీ, వీ•ంన్నింటిలో సుబ్రహ్మణ్యషష్ఠి మాత్రమే ముఖ్యమైనది. శివుని రెండో కుమారుడైన కుమారస్వామిని పూజించడానికి ఇది ఉద్ధిష్టమైన పర్వం. సుబ్రహ్మణ్యషష్ఠితో పాటు ఇతరత్రా చాలా వ్రతాలు చేయడానికి అనుకూలమైనదిగా చెప్పడం వల్ల ఈ తిథి పవిత్రమైనదిగా వినుతికెక్కింది.
మార్గశిర శుద్ధ సప్తమి
నవంబరు 26, ఆదివారం
సూర్యపూజకు ఉద్ధిష్టమైన దినమిది. నీలమత పురాణంలో ఈనాడు సూర్యుడిని పూజించాలని రాశారు. అలాగే, స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో దీనిని ‘మిత్ర సప్తమి’గా వ్యవహరించారు. నయన ప్రద సప్తమి, సిత సప్తమి, ఉభయ సప్తమి, పుత్రీయ సప్తమి, ద్వాదశి సప్తమి వంటి ఇతర వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో పేర్కొన్నారు. హేమాద్రి పండితుడు ఈనాడు- నందా సప్తమీ వ్రతం ఆచరించాలని రాశాడు. దీనికే నందా జయంతి అనే పేరు కూడా ఉంది.
మార్గశిర శుద్ధ అష్టమి
నవంబరు 27, సోమవారం
తెలుగు నాట ఈ తిథి కాలభైరవాష్టమిగా ప్రసిద్ధిలో ఉంది. దీనినే కాలాష్టమి అని కూడా అంటారు. ఒకసారి కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. శివుడి ఆజ్ఞ మేరకు ఆ పాపం పోవడానికి కపాలం చేతబట్టుకుని తీర్థయాత్రలు చేశాడు. చివరకు కాశీ నగరంలో స్థిరపడ్డాడు. ‘నా దర్శనార్థం వచ్చే భక్తులు ముందు నిన్ను సేవించిన తరువాతే నన్ను సేవించాలి’ అని శివుడు కాలభైరవునికి వరమిచ్చాడు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. నీలకంఠునికి ఇష్టుడైన ఈ కాలభైరవుడిని ‘కాశికాపురాధినాథ కాలభైరవం భజే’ అనే మకుటంతో, ఎనిమిది శ్లోకాలలో శ్రీమచ్ఛంకర భగవత్పాదాచార్యులు (ఆదిగురు శంకరా చార్యులు) స్తోత్రించారు. ఇంకా, ఈ తిథి నాడు మహేశ్వరాష్టమి, సౌమ్యాష్టమి, ప్రథమాష్టమి, భద్రాష్టమీ, భీష్మాష్టమి, దుర్గాష్టమి, అన్నపూర్ణా ష్టమి తదితర వ్రతాలు, పూజలు చేస్తారని గదాధర పద్ధతిలో వివరించారు.
మార్గశిర శుద్ధ నవమి
నవంబరు 28, మంగళవారం
ఈనాడు దేవీపూజ చేయాలని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంటే, త్రివిక్రమ త్రిరాత్ర వ్రతం ఆచరించాలని మరికొన్ని గ్రంథాలలో ఉంది.
మార్గశిర శుద్ధ దశమి
నవంబరు 29, బుధవారం
మార్గశిరంలో చలిపులి విరుచుకు పడుతుంది. ఈ కాలంలో పాటించాల్సిన ఆహార నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ తిథి నాడు ‘ఆరోగ్య వ్రతా’నికి మన పెద్దలు రూపకల్పన చేశారు. ఈ వ్రతం ఆచరించి ఒంటిపూట భోజనం చేయాలి. ఈ వ్రతాన్ని ఆచ రించిన వారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారని అంటారు. అలాగే, ఈనాడు ఇంకా పదార్థ వ్రతం, ధర్మవ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. ఇందులో పదార్థ వ్రతం కూడా ఆరోగ్యానికి సంబంధించిన వ్రతమే కావడం విశేషం.
మార్గశిర శుద్ధ ఏకాదశి
నవంబరు 30, గురువారం
వైఖానసుడనే రాజు నరకంలో ఉన్న తన తండ్రి ప్రీత్యర్థం ఈ తిథి నాడు ప్రత్యేక వ్రతం చేసిన ఫలితంగా అతని తండ్రికి నరకం నుంచి విముక్తి లభించింది. తండ్రికి మోక్షం కలిగించిన ఏకాదశి కాబట్టి దీనికి మోక్షదైకాదశి అనే పేరు వచ్చింది. ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో మాత్రం ఈ ఏకాదశిని ‘సౌఖ్యదైకాదశి’గా పేర్కొన్నారు.
Review ఆరోగ్య మాసం.