కొత్త ఉషస్సుకు స్వాగతం

2025- డిసెంబరు 1, సోమవారం, మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచి
2025- డిసెంబరు 31, బుధవారం, పుష్య శుద్ధ ద్వాదశి వరకు..

ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో చివరిదైన పన్నెండవ మాసం- డిసెంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర – పుష్య మాసాల కలయిక. చైత్రాది మాస పరిగణనలో మార్గశిర మాసం తొమ్మిదవది. డిసెంబరు 19, 2025- శుక్రవారం వరకు మార్గశిర మాస తిథులు, ఆపై డిసెంబర్‍ 20, 2025- శనివారం నుంచి పుష్య మాస తిథులు ఆరంభమవుతాయి. గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి, హనుమద్వ్రతం, శ్రీ దత్తాత్రేయ జయంతి, కూర్మ ద్వాదశి వంటి పర్వాలు ఈ నెలలో వస్తాయి. అలాగే, సంక్రాంతికి శ్రీకారం చుట్టే ధనుస్సంక్రమణం కూడా ఈ నెలలోనే. దక్షిణాయనంలో ఇది చివరి మాసం.

మార్గశిరం – పుష్యం.. ఈ రెండు మాసాలు కలిసి హేమంత రుతువు కాలం. ఈ రుతువును భాగవంత దశమ స్కంధంలో వర్షిస్తూ పోతన గారు- ‘గోపమారికలు రేపకడ లేచి, చని, కాళిందీ జలంబులం దోగిజలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబు చేసి.. మాస వ్రతంబు సలిపిరి’ అని వర్ణించారు. మార్గశిర మాసంలో విష్ణువు విశేష రీతిలో పూజలు అందుకుంటాడు. ఈ మాసంలో ఈయనకు అందే పూజల్లో వైకుంఠ ఏకాదశి ప్రధానమైనది. అలాగే గీతా జయంతి సందర్భం కూడా ఈ నెలలోనిదే. ఈ మాసం విష్ణు సంబంధమైనదే కాక, మరెన్నో విధాలుగా కూడా మహత్తరమయినది. ధనుర్మాసం ప్రారంభయ్యేది కూడా ఈ మాసంతోనే. ఆధ్యాత్మికంగా మార్గశిరం ఇంతలా పవిత్రమై ఉంటే, ఇక డిసెంబరులోనే మొదలయ్యే పుష్యమి మరింత ప్రశస్తమైనది. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య ం. ఈ నిండార శీతాకాలంలో మంచు ఉధృతంగా కురుస్తుంది. చలి జివ్వుమనిపిస్తుంది. మంచు తెరల దుప్పటి ప్రకృతిని పరదాలా చుట్టుకుంటుంది. ఈ మాసంలో వేకువ వేళ ఆకుపచ్చని సస్యం (పంటలు/ప్రకృతి) శ్వేతవర్ణపు మంచు బిందువులతో స్నానమాడుతున్నట్టు గోచరిస్తుంది. ‘పుష్య’ అనే పదానికి ‘పోషణ శక్తి కలిగినది’ అని అర్థం. పాడిపంటలు సమృద్ధిగా పండి.. జనులకు కావాల్సిన ఆహారాన్ని నిండుగా సమకూర్చే మాసమిది. హేమంత రుతువు కాలంలో వచ్చే పుష్య మాసం పూర్తి శీతాకాలం. చలి గజగజ వణికిస్తుంది. పుష్య మాసంలో పూసగుచ్చే పొద్దుండదని నానుడి. అంటే, పగటి సమయం తక్కువగా ఉంటుంది. తొందరగా చీకటి పడిపోతుంది. ఆధ్యాత్మికంగా జపతపాలకు, ధ్యాన పారాయణాదులకు మేలైనది. వేదాధ్యయనానికి ఉద్ధిష్టమైన మాసమిది. ఆశ్వయుజం అమ్మవారికి, భాద్రపదం వినాయకుడికి, మార్గశిరం శ్రీమహా విష్ణువుకు, సుబ్రహ్మణ్యేశ్వరుడికి, కార్తీకం పరమశివుడికి ప్రీతికరమైన మాసాలైతే.. పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. అందుకే ఈ మాసానికి శని అధిపతి. నక్షత్రాధిపతి గురువు (బృహస్పతి). వీరిద్దరిని పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. నెల పొడవునా తనను పూజించే వారి పట్ల శనైశ్చరుడు ప్రసన్నుడై శుభాలను ప్రసాదిస్తాడని పురాణ ప్రవచనం. పుష్య మాసంలో అమావాస్య రోజు శని గ్రహానికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నుంచి నివృత్తి పొందవచ్చు. ఆ రోజు ఇంకా వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వల్ల శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. మార్గశిర – పుష్య మాసాల తిథులతో కూడిన డిసెంబరులో వచ్చే ప్రధాన పర్వాలు, ముఖ్య తిథుల వివరాలు..

మార్గశిర శుద్ధ ఏకాదశి
డిసెంబరు 1, సోమవారం

మార్గశిర శుద్ధ ఏకాదశికి సౌఖ్యదైకాదశీ అనే నామం కూడా ఉంది. వైఖానసుడు అని ఒకరాజు. ఆయనకు ఒకనాడు తన తండ్రి నరకంలోనే ఉండిపోయి యమ యాతనలు పడుతున్నట్టు కల వచ్చింది. దీంతో ఆయన మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసాది నియమాలతో వ్రతం చేశాడు. ఈ వ్రత ఫలితంగా అతని తండ్రి నరక లోకం నుంచి స్వర్గలోకానికి వెళ్లాడు. ఈ విధంగా తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత ఈ ఏకాదశికి మోక్షదైకాదశి అనే పేరు కూడా ఉంది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కలుగుతుందని చెబుతారు.
ఇక, భారత సారస్వతంలో తలమానికమైన భగవద్గీత పుట్టిన రోజు కూడా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడేనని పంచాంగ కర్తలు అంటారు. అయితే ఈ తిథి నిర్ణయం విషయంలో అనేక సందేహాలు, భిన్న వాదనలు ఉన్నాయి. కాబట్టి గీతా జయంతి ఎప్పుడనే విషయం పక్కనపెడితే, ప్రస్తావన వచ్చింది కాబట్టి గీతా జయంతి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం.
కార్తీక బహుళ అమావాస్య నాడే భగవద్గీత పుట్టిన దినంగా గుర్తించాల్సి ఉందని కొందరు అంటారు. అంటే, గీతా జయంతి ఈనాడే జరపాలనేది వారి మాట. అయితే, ఉత్తరాదిన మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతి నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు గల పద్దెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందని, ఆ యుద్ధ ప్రారంభ దినమైన మార్గశిర శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీతను శ్రీకృష్ణుడు బోధించాడని అందుచేత ఈనాడు గీతా జయంతి నిర్వహించడం సముచితమని అంటారు.
ఇక, భారత కాలమానాలను బట్టి చూస్తే, మాఘ శుద్ధ అష్టమి భీష్మ నిర్వాణ దినం. భీష్ముడు అంపశయ్య మీద యాభై ఎనిమిది రోజులు ఉన్నట్టు భారతంలో స్పష్టంగా ఉంది. భీష్ముడు యుద్ధం చేసింది పది రోజులు. భీష్ముడు మరణించిన మాఘ శుద్ధ అష్టమి నుంచి మొత్తం అరవై ఎనిమిది దినాలు రెండు మాసాల ఎనిమిది రోజులు. వెనక్కి లెక్తిస్తే.. భారత యుద్ధ దినం తేలుతుంది. ఈ గణన ప్రకారం భారత యుద్ధ ప్రారంభ దినం కార్తీక బహుళ అమావాస్య అవుతుంది.
కార్తీక మాసంలో రేవతి నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్లినట్టు భారతంలో ఉంది. కార్తీక పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడో పూర్వపు నక్షత్రం రేవతి. ఆనాడు శుద్ధ త్రయోదశి తిథి. రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులు ఉన్నాడు. వస్తూ కర్ణుడితో మాట్లాడాడు. ఆ సంభాషణలో శ్రీకృష్ణుడు కర్ణుడితో జ్యేష్టా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ఆరంభమవుతుందని తెలిపాడు. ఈ లెక్కలను బట్టి కార్తీక బహుళ అమావాస్యే భారత యుద్ధ

ప్రారంభ దినమని నిర్ధారించి చెప్పవచ్చని కొందరు అంటారు. కాగా, భారత యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడు కాగల బంధువధకు శంకించాడు. ఆ సందర్భంలో కృష్ణుడు అతనికి తత్త్వోపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, కార్తీక బహుళ అమావాస్య నాడు జరిగిందని.. కాదు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అని రెండు రకాలుగా వ్యాప్తిలో ఉంది. ఏరోజైతేనేం.. రెండు తిథుల్లోనూ గీత ప్రాశస్త్యాన్ని గౌరవించుకుంటే మరీ మంచిది.

మార్గశిర శుద్ధ ద్వాదశి
డిసెంబరు 2, మంగళవారం

మార్గశిర శుద్ధ ద్వాదశి గొప్ప పర్వదినం. ఈనాడు ఆచరించాల్సిన వ్రతాలు అనేకం ఉన్నాయి. ఈ రోజు ఏ వ్రతం ఆచరించినా పుణ్యమేనని ప్రతీతి. ముఖ్యంగా ఈనాడు మత్స్య ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామ ద్వాదశి, తారకా ద్వాదశి, అపరా ద్వాదశి, నామ ద్వాదశి, శుభ ద్వాదశి, అఖండ ద్వాదశి, దశావతార వ్రతం, సాధ్య వ్రతం, ద్వాదశాదిత్య వ్రతం మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. హనుమద్వ్రతం చేస్తారని మరో వ్రత గ్రంథంలో ఉంది. వీ•న్నిటిని బట్టి ఇది ఒక గొప్ప పర్వదినంగా భావించాలి. తెలుగు వారి ఇలవేల్పు అయిన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పుష్కరిణికి ఈనాడు తీర్థ దినం.

భూలోకంలో మూడు కోట్ల తీర్థ రాజాలు ఉన్నాయి. ఆ తీర్థాలన్నీ మార్గశీర్ష శుద్ధ ద్వాదశి నాడు అరుణోదయ కాలాన తిరుపతి కొండ మీద స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని పురాణ వచనం. ఆనాడు అక్కడ స్నానం చేయడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది.

మార్గశిర శుద్ధ త్రయోదశి
డిసెంబరు 3, బుధవారం

మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు అనంగ త్రయోదశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. అలాగే, ఈనాడు గోదావరి తీర ప్రాంతాలలో హనుమజ్జయంతిని వైభవంగా జరిపే ఆచారం కూడా ఉంది. ఇది ప్రత్యేకంగా గోదావరి జిల్లాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈనాడు ఊరూవాడా హనుమద్‍ ఆలయాలలో పచ్చని కొబ్బరాకులు, తాటాకులతో పందిళ్లు వేసి అత్యంత వైభవోపేతంగా హనుమజ్జయంతి వేడుకలు నిర్వహిస్తారు. దీనినే హనుమద్వ్రతం అని కొన్ని ప్రాంతాలలో వ్యవహరిస్తారు. ఈనాటి నుంచి జ్యేష్ఠ కార్తె ప్రారంభం అవుతుంది.

మార్గశిర శుద్ధ చతుర్దశి
డిసెంబరు 4, గురువారం

మార్గశిర శుద్ధ చతుర్దశి నాటి నుంచి చాంద్రాయణ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి, తరువాత గౌరీదేవిని ఆరాధించాలి. పాషాణాకార పిష్ట భోజనం చేయాలి. కాబట్టే దీనిని పాషాణ చతుర్దశీ వ్రతం అని కూడా అంటారు. శివ చతుర్దశీ శావ్రణికా తదితర వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు. చతుర్దశికి ముందురోజు రాత్రి భోజనం మాని చతుర్దశి నాడు నిరాహారిగా ఉండి ఆంబోతును పూజించాలి. మరునాడు కమలాలతో ఉమాసహితుడైన శివుడిని పూజించాలి.
కాగా, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుల వారి జయంతిని కొన్ని ప్రాంతాల్లో ఈనాడే నిర్వహిస్తారు. మరికొన్ని తావుల్లో మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు ఆయన జయంతిని జరుపుతారు.

మార్గశిర శుద్ధ పూర్ణిమ
డిసెంబరు 4, గురువారం

మార్గశిర శుద్ధ చతుర్దశి ఘడియల్లోనూ పూర్ణిమ తిథి కూడా కూడి ఉంది. కాబట్టి ఈనాడే పూర్ణిమ సంబంధ పూజాధికాలను నిర్వహించుకోవాలి. మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు చంద్రపూజ చేయాలని నీలమత పురాణం, చంద్ర వ్రతం చేయాలని హేమాద్రి పండితుడు చెబుతున్నారు. నాడు ఆగ్నేయ పురాణాన్ని దానం చేస్తే సర్వ క్రతు ఫలం కలుగుతుందని పురాణోక్తి. ఇంకా అన్నపూర్ణ జయంతి, భైరవ జయంతి పర్వాలను కూడా ఈనాడే నిర్వహించే ఆచారం ఉంది. ఇటువంటి ప్రసిద్ధి గల ఈ మార్గశిర పూర్ణిమను తెలుగు దేశంలో కోరల పూర్ణిమ అంటారు. కోరల పున్నమి అంటే, కోరల అమ్మవారి పున్నమి. ఈ కోరల అమ్మవారు యముని వద్ద ప్రధాన లేఖకుడైన చిత్రగుప్తుని సోదరి. ఆమె కోటి పుర్రెల నోము పడుతుందట. కానీ, ఏటా ఒక పుర్రె లోటు వస్తుందట. అందుచేత మళ్లీ సంవత్సరం మళ్లీ ఆ నోము పడుతుందట. అప్పుడూ ఇట్లాగే నోము అసంపూర్తిగా మిగిలిపోతుంది. ఏటేటా ఇదే వరస. ఇది పురాణ కథనం. కానీ, నిష్టతో 33 పున్నాల నోము పట్టే వారు కూడా ఈ పున్నమి నాడు ఏమీ చేయరు. అది ఒక కట్టుబాటు.
మహా మార్గశీర్ష అనే పేరు గల ఈ పున్నమి నాడు నరక పూర్ణిమ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. నరక అనే పదం యమ సంబంధమైనది.
వైద్య శాస్త్రంలో కార్తీక పూర్ణిమ మొదలు మార్గశిర పూర్ణిమ వరకు గల 30 దినాలను యమదంష్ట్రలు అంటారు. అంటే ఈ రోజులలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడని భావం. ఈ రోజులు చాలా అనారోగ్యకరాలైనవి. ఈ దినాలలో మరణాలు జాస్తీ. మార్గశిర పూర్ణిమతో యమదంష్ట్ర దినాలు తుదముట్టుతాయి. మార్గశిర పూర్ణిమ రోజున ఆంధ్ర ప్రాంతాలలో అతి ప్రాచీన కాలం నుంచి ‘రొట్టెలు కొరికి కుక్కలకు వేయుట’ అనే ఆచారం ఒకటి పరంపరగా వస్తోంది. ఇలా రొట్టెలు కొరికి వేయడం ద్వారా యముని కోరల్లో ఉండే విషం పోతుందని విశ్వాసం.
మార్గశిర పూర్ణిమను వ్రత గ్రంథాలు నరకపూర్ణిమ అనీ, తెలుగు వారు కోరల పూర్ణిమ అని భీతి గొలిపే నామాలతో వ్యవహరిస్తుంటే, మహారాష్ట్రులు ఈనాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటున్నారు. దత్తాత్రేయుల వారు మార్గశిర శుక్ల (శుద్ధ) చతుర్దశి నాడు అవతరించినా, ఆయన జయంతిని
మాత్రం మార్గశిర పూర్ణిమ నాడే జరుపుకోవడం విశేషం.
ఉపవాసాలకు ఉద్ధిష్టమైన పర్వదినమిది. ఈ పర్వానికి ఉత్సవ శోభ కల్పించే ఘట్టాలూ ఉన్నాయి. గద్వాల (తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం) మొదలికల్లు అనే ఊరు సుప్రసిద్ధమైన శ్రీవేంకటేశ్వర క్షేత్రం. మొదలికల్లు అంటే సంస్క•తంలో శిలా క్షేత్రమని అర్థం. మార్గశిర పున్నమి నుంచి ఇక్కడ గొప్ప జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. కర్నూలు, నెల్లూరు వంటి దూర ప్రాంతాల నుంచి మేలు జాతి పశువులను ఇక్కడకు తీసుకువచ్చి ఈ ఉత్సవాలలో ప్రదర్శిస్తుంటారు. సంవత్సరంలోని మూడు వందల అరవై అయిదు రోజులు ఏదో ఒక ఉత్సవంతో అలరారడమే తెలుగు సంస్క•తి గొప్పదనం.

మార్గశిర బహుళ పాడ్యమి
డిసెంబరు 5, శుక్రవారం

మార్గశిర బహుళ పాడ్యమి నాడు కశ్మీరులో ఈనాడు కొత్త సంవత్సర మహోత్సవం జరుపుకుంటారని తెలుస్తోంది. నీలమత పురాణం కశ్మీరు దేశ ప్రధాన రచన. అందులో నవ సంవత్సరోత్సవ మహోత్సవం ఈనాడు జరుపుకుంటారని ఉంది. ఈనాడు చంద్రార్ఘ్య దానం చేయాలని గదాధర పద్ధతిలో ఉంది. శీలావాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు.

మార్గశిర బహుళ చతుర్థి
డిసెంబరు 8, సోమవారం

మార్గశిర బహుళ చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. ఇది గణపతి సంబంధమైనది. ప్రతి మాసంలో వచ్చే రెండు చతుర్థులు గణపతి పూజకు ఉద్ధిష్టమైనవి.

మార్గశిర బహుళ సప్తమి
డిసెంబరు 11, గురువారం

మార్గశిర బహుళ సప్తమి తిథి నాడు ఫల
సప్తమీ వ్రతం, తమశ్చరణ వ్రతం
ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఉంది. అయితే, ఆయా వ్రతాలను ఎలా ఆచరించాలనే వివరాలేవీ పెద్దగా
అందుబాటులో లేవు.

మార్గశిర బహుళ అష్టమి
డిసెంబరు 12, శుక్రవారం

మార్గశిర బహుళ అష్టమి నాడు అనఘాష్టమీ వ్రతం, కృష్ణాష్టమీ వ్రతం, రుక్మిణ్యష్టమీ వ్రతం, కాలాష్టమీ వ్రతం మొదలైనవి చేస్తారని ఉంది. కాలభైరవాష్టమిగా భావించి ఈ రోజున భైరవ జయంతి వ్రతం ఆచరించే ఆచారం కూడా ఉందని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.

మార్గశిర బహుళ నవమి
డిసెంబరు 13, శనివారం

మార్గశిర బహుళ నవమి నాడు రూప నవమి వ్రతం ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.

మార్గశిర బహుళ ఏకాదశి
డిసెంబరు 15, సోమవారం

మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశి పర్వం. లుంపకుడు అనే వాడు మహిష్మంతుని కుమారుడు. అతను దేశం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. దేశాలు పట్టి తిరుగుతుండగా, ఒక ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. దీంతో అతను బలవంతాన ఉపవాసం ఉండాల్సి వచ్చింది. అజ్ఞాతంగానే అతను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. అయినా ఆ వ్రతం యొక్క ఫలాన్ని అతను పొందాడు. కాబట్టే ఈ ఏకాదశికి సఫలైకాదశి అనే పేరు వచ్చింది. వైతరణి, ధనద సర్వకామ తదితర వ్రతాలు ఈ రోజు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈనాటి నుంచి మూలకార్తె ప్రారంభమవుతుంది.

మార్గశిర బహుళ ద్వాదశి
డిసెంబరు 16, మంగళవారం

మార్గశిర బహుళ ద్వాదశి నాడు మల్ల ద్వాదశి, కృష్ణ ద్వాదశీ వ్రతాలు ఆచరిస్తారని తెలుస్తోంది. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈ రెండు వ్రతాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఈనాటి నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది సంక్రాంతికి ఆరంభ సూచిక. ఈనాటి నుంచి మొదలుకుని సంక్రాంతి వరకు తెలుగు నాట మహిళలు ఉదయాన్నే లేస్తారు. ముంగిళ్లు తుడిచి కళ్లాపి చల్లి, ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల మీద గోమయంతో ముద్దలు చేసి ఉంచుతారు. వాటికి వరిపిండితో, కుంకుమతో బొట్లు పెట్టి పైన పువ్వులు గుచ్చుతారు. వాటిని పూజిస్తారు. ధనుస్సంక్రమణం నాటి నుంచి సంక్రాంతి వరకు నెల రోజుల పాటు ఇళ్ల ముందు ముగ్గులు పెట్టి పెద్ద పండుగ నాడు రథం ముగ్గుతో సాగనంపుతారు. ధనుర్మాసమంతా ముఖ్యంగా అమ్మాయిలకు ఉత్సాహాన్నిస్తుంది. వేకువనే లేచి, ఇంటి ముందు కళ్లాపి చల్లి, రంగవల్లులపై గొబ్బెమ్మల్ని అలంకరించి గొబ్బి పాటలు పాడతారు. ఇళ్ల ముందు పోటీపడి ముగ్గుల్ని అలంకరిస్తారు. అవెంత అందంగా వచ్చాయో చూసుకుని మురిసిపోతారు. ధనుస్సంక్రమణం నాటి నుంచే హరిదాసులు తెల్లవారుజామునే ఇంటింటికీ హరికీర్తనలు ఆలపిస్తూ తిరుగుతారు. ఈ మాసమంతా ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాచరణకు సంబంధించిన వివరాలు శ్రీమద్భాగవతంలో విపులంగా ఉన్నాయి.
ఇక, ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం. వారంతా ఆ సమయంలో విష్ణుమూర్తిని దర్శిస్తారు. ముక్కోటి దేవతలు ఆయనను ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు.

మార్గశిర బహుళ త్రయోదశి
డిసెంబరు 17, బుధవారం

మార్గశిర బహుళ త్రయోదశి యమ దర్శన త్రయోదశి పర్వమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.

మార్గశిర బహుళ చతుర్దశి
డిసెంబరు 18, గురువారం

మార్గశిర బహుళ చతుర్దశి తిథికే మహోదధ్యమావాస్య అని పేరు. బకులామావాస్య అని మరికొందరు అంటారు. దీనికే ‘బకులక్షీరేణపాయసంకృత్యా’ అని నానుడి. అంటే, పాలతో పాయసం వండి ఇష్టదైవాలకు నివేదించే రోజు ఇదని అర్థం. ఇది మాస శివరాత్రి పర్వం.

మార్గశిర బహుళ అమావాస్య
డిసెంబరు 19, శుక్రవారం

మార్గశిర బహుళ అమావాస్య.. అమావాస్య తిథి. ఈ తిథి నాడు పితృ దేవతలకు తర్పణాలు విడుస్తారు. శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు.

పుష్య శుద్ధ పాడ్యమి
డిసెంబరు 20, శనివారం

ఈనాటి నుంచి పుష్య మాసం ఆరంభమవుతుంది. ఈ మాసపు ఆరంభ తిథి పుష్య శుద్ధ పాడ్యమి. తెలుగు నెలల వరుసలో పుష్య మాసం సంవత్సరంలో పదో మాసం. పుష్యంలో ఆవు ఈనితే ఆడపడుచుకు ఇచ్చివేయాలనే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. పుష్యమాసంలో పూస గుచ్చ పొద్దుండదని నానుడి. డిసెంబరు 21న కూడా పాడ్యమి తిథి ఘడియలే కొనసాగుతున్నాయి.

పుష్య శుద్ధ విదియ
డిసెంబరు 22, సోమవారం

పుష్య శుద్ధ విదియ తిథి నాడు ఆరోగ్య ద్వితీయ వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు రోజులు విష్ణు వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాచరణకు మొదటి రోజు పుష్య శుద్ధ విదియ. అంటే ఈనాడే. దీనినే మహా విష్ణు పూజ అని కూడా అంటారు. ఈ వ్రతంలో విష్ణువు విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచి పువ్వులు, పండ్లు, దీపధూపాలు సమర్పించి మంత్రాలు జపిస్తారు. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలాన్ని శుద్ధి చేసి పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రంపై విష్ణువు విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచాలి. పువ్వులు, తులసి దళాలు, పండ్లు, నైవేద్యం, దీపం, ధూపం వంటివి సిద్ధం చేసుకోవాలి. విష్ణువు విగ్రహాన్ని శుభ్రంగా అలంకరించిన బలిపీఠంపై ఉంచాలి. విష్ణు నామాలను జపిస్తూ ఆయన కోసం సిద్ధం చేసిన వాటిని ఆయనకు సమర్పించాలి. ఈ పూజను సంరక్షణ, ఆధ్యాత్మిక వృద్ధిని కోరుతూ చేస్తారు.

పుష్య శుద్ధ పంచమి
డిసెంబరు 25, గురువారం

పుష్య శుద్ధ పంచమి నాడు మధుసూదన భగవానుడిని పూజించాలి. ప్రతి మాసంలోని శుక్ల, కృష్ణ పక్షములలోని తిథులలో నాగుల పూజ యోగ్యమై ఉంది. ఇక, డిసెంబరు 25 క్రైస్తవుల పర్వదినమైన క్రిస్మస్‍ డే.

పుష్య శుద్ధ షష్టి
డిసెంబరు 26, శుక్రవారం

పుష్య శుద్ధ షష్ఠిని కుమారషష్ఠి అని కూడా అంటారు. కుమార షష్ఠి అంటే కుమారస్వామిని పూజించడానికి ఉద్ధిష్టమైన షష్ఠి. ఈ పర్వం మనకంటే తమిళుల్లో ఎక్కువగా ఆచరణలో ఉంది. తమిళవాసులకు కుమారస్వామి ఇలవేల్పు. చాళుక్యుల కాలంలో తెలుగునాట కుమారస్వామి పూజ ఎక్కువగా ఉండేది. అయితే, ప్రస్తుతం తెలుగునాట కుమారస్వామికి పర్యాయ నామమైన సుబ్రహ్మణ్యుడిగానే కుమారస్వామి ప్రసిద్ధుడై ఉన్నాడు. కుమారస్వామి సుబ్రహ్మణ్య నామంతో తెలుగునాట విశేషంగా పూజలు అందుకుంటున్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు వచ్చే సుబ్బారాయుడి షష్ఠి గోదావరి తీర ప్రాంతాలలో పెద్ద ఉత్సవం.

పుష్య శుద్ధ సప్తమి
డిసెంబరు 27, శనివారం

పుష్య శుద్ధ సప్తమి తిథి నాడు మార్తాండ సప్తమి, ద్వాదశ సప్తమి వ్రతాలను విశేషంగా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.

పుష్య శుద్ధ అష్టమి
డిసెంబరు 28, ఆదివారం

పుష్య శుద్ధ అష్టమిని వివిధ వ్రత గ్రంథాలు మహా భద్రాష్టమి, జయంత్యష్టమి, దుర్గాష్టమి తదితర నామాలతో పేర్కొంటున్నాయి. ఈనాడు అష్టకా సంజ్ఞకమమైన శ్రాద్ధం చేస్తే పితృ దేవతలకు సంతుష్టి కలుగుతుందని, కులాభివృద్ధి జరుగుతుందని అంటారు.

పుష్య శుద్ధ నవమి
డిసెంబరు 28, ఆదివారం

పుష్య శుద్ధ అష్టమి తిథి ఘడియల్లోనే నవమి కూడా కూడి ఉంది. కాబట్టి ఈనాడే పుష్య శుద్ధ నవమి. ఈనాడు ధ్వజ నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈనాడు ఒంటిపూట భోజనం చేయాలి. మహా మాయను పూజిస్తూ వ్రత నియమం పాటించాలి.

పుష్య శుద్ధ దశమి
డిసెంబరు 29, సోమవారం

పుష్య శుద్ధ దశమి నాడు ద్వార పూజ (గడపకు పూజ) చేయడం ఆచారం. అయితే ఈ పూజ చేయడం ఉత్కళ దేశంలో ఎక్కువ ఆచారంలో ఉంది. ఈనాడు ద్వార ధర్మ దేవతలను పిండి మొదలైన వాటితో పూజిస్తారు. తెలుగు నాట కూడా చాలా ప్రాంతాల్లో గడప పూజకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే, దానిని ఈ తిథి నాడే కచ్చితంగా జరుపుతారనేందుకు ఆధారాలు లేవు. కాగా, వివిధ వ్రత గ్రంథాలు ఈ దశమిని శాంబరీ దశమి అని పేర్కొంటున్నాయి.

పుష్య శుద్ధ ఏకాదశి
డిసెంబరు 30, మంగళవారం

పుష్య శుద్ధ ఈ ఏకాదశి ముక్కోటి/వైకుంఠ ఏకాదశి పర్వం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ తొలి పర్వం నాడు ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారని ప్రతీతి. అందుకే పుష్య మాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైనది. అలాగే ఈ ఏకాదశికి రైవత మన్వాది దినమని పేరు. ఇది పుత్రదైకాదశిగా కూడా ప్రసిద్ధమై ఉంది. సుకేతువు అనే రాజు పుష్య శుద్ధ ఏకాదశి నాడు విద్యుక్తంగా వ్రతాన్ని ఆచరించి పుత్రుడిని వరంగా పొందాడు. కాబట్టి దీనికి పుత్రదైకాదశి అనే పేరు వచ్చింది.
ఇక, పుష్య శుద్ధ ఏకాదశికి రైవత మన్వాది దినమనే పేరు రావడానికి కారణమైన రైవతుడి కథ మిక్కిలి ఆసక్తికరమైనది. రుతువాక్కు అని ఒక ముని ఉండేవాడు. రేవతి నక్షత్రం నాలుగో పాదంలో ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడైన కొద్దీ మిక్కిలి దుర్మార్గంగా వ్యవహరించసాగాడు. అతనిలోని ఈ దుష్టత్వానికి కారణం అతని రేవతీ నక్షత్ర చతుర్థ పాద జాతక ఫలితమే అని తెలుసుకుని అతని తండ్రి రుతువాక్కు.. రేవతీ నక్షత్రాన్ని కిందపడిపోవాలని శపించాడు.
ఆ శాపం చేత రేవతి నక్షత్రం ద్వారకకు దగ్గరలో ఉన్న కుముదం అనే కొండ మీద పడింది. రేవతి నక్షత్రం అక్కడ పడటం చేత ఆ కొండకు అప్పటి నుంచి రైవతకము అనే పేరు వచ్చింది. రేవతి నక్షత్రం పడిన తాకిడికి ఆ కొండ మీద ఒక కొలను కూడా ఏర్పడింది. ఆ రైవత పర్వతం మీద ఆ తామర కొలను నుంచి ఒక కన్యక పుట్టింది. ఆమెను ఆ కొలను చెంత ఉండిన ప్రముచుడు అనే ముని పెంచి పోషించాడు. ఆమెకు ఆయన రేవతి అనే పేరు పెట్టాడు.
రేవతి పెళ్లీడుకు వచ్చింది. ప్రముచుడు ఆమెకు యోగ్యుడైన వరుడి కోసం వెతికి, దుర్దముడు అనే రాజునకు ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. పెళ్లి పనులు చేయసాగాడు.
అప్పుడు రేవతి, తన వివాహం రేవతీ
నక్షత్ర యుక్త లగ్నంలో చేయాలని ప్రముచుడిని కోరింది.
అప్పుడు ప్రముచుడు- ‘ఇప్పుడు నక్షత్ర మండలంలో రేవతీ నక్షత్రమే లేదు. అది కిందపడిపోయింది. నక్షత్రమే లేనపుడు దానికి చంద్ర సంయోగం ఎలా కలుగుతుంది? చంద్ర సంయోగం లేని నక్షత్రం వివాహానికి యోగ్యం కాదు. కాబట్టి వివాహానికి అర్హమైన శుభ నక్షత్రములు చాలా ఉన్నాయి. వాటిలో ఒక శుభ నక్షత్ర యుక్త సమయంలో నీకు వివాహం చేస్తాను’ అని బదులిచ్చాడు.
అప్పుడు రేవతి ప్రముచునితో- ‘నేనే రేవతి నక్షత్రాన్ని. మీ తపో మహిమ చేత రేవతీ నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలపండి. ఆ నక్షత్రమే నా వివాహానికి అనుకూలమైనది. మరొక నక్షత్రంలో చేసే వివాహం నాకు అవసరం లేదు’ అంది.
దీంతో ప్రముచుడు తన తపోధనాన్ని ధారపోసి రేవతి నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలిపాడు. దానికి చంద్ర సంయోగం కలిగించాడు. ఆ మీదట రేవతి నక్షత్రయుక్తమైన ఒక లగ్నంలో ఆమెను దుర్దముడికి ఇచ్చి వివాహం చేశాడు.
రేవతీ దుర్దముల కుమారుడు రైవతుడు. అతడు కాలక్రమాన సకల ధర్మవేది అయి మనువుగా ఆవిర్భవించాడు. మనువుల్లో అతను ఐదవవాడు.
రైవతుని మన్వంతరంలో విభుడు అనే వాడు ఇంద్రుడు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ద్వబాహుడు, వశిష్ఠుడు మున్నగు వారు సప్త రుషులు.

పుష్య శుద్ధ ద్వాదశి
డిసెంబరు 31, బుధవారం

పుష్య శుద్ధ ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి పర్వాన్ని జరుపుకుంటారు. ఇంకా ఈ తిథి నాడు సుజన్మ ద్వాదశీ వ్రతం కూడా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు.

ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చి..
శ్రీ మహా విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని భక్తులకు దర్శనమిచ్చే అపూర్వ సందర్భం వైకుంఠ ఏకాదశి పర్వం.
మార్గశిర మాసంలో వచ్చే విశిష్ట రోజుల్లో ఇదే పరమ విశిష్టమైనది. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఇంకా దీనినే మోక్షదైకాదశి, వైకుంఠ ఏకాదశి, పుత్రదైకాదశి, సౌఖ్యదైకాదశి అనే పేర్లతోనూ వ్యవహరిస్తారు. ఆధ్యాత్మికత, శాస్త్రీయతల కలయికకు ప్రతీకగా నిలిచే పర్వదినమిది. దక్షిణాయన పుణ్యకాలం పూర్తవుతూ, ఉత్తరాయణం సమీపించే సంధికాలంలో వచ్చే ఏకాదశి ఇది. మనకు గల ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఇది అత్యంత పవిత్రమైనది.
నెలకు రెండు ఏకాదశులు
మన పూర్వీకులు ఏడాదిని రెండు ఆయనాలుగా, పన్నెండు మాసాలుగా విభజించారు. ప్రతి మాసంలో రెండు పక్షాలు వస్తాయి. అంటే ప్రతి నెల రెండుసార్లు ఏకాదశి తిథి వస్తుంది. ఇలా ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు.. ఒక్కో దానికి ఒక్కో విశిష్టత. కానీ, వీటన్నిటిలో అత్యంత పవిత్రంగా భావించేది వైకుంఠ ఏకాదశి. ధనుర్మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. తెలుగు వారు అన్ని పండుగలను చాంద్రమానంలో ఆచరించినప్పటికీ ఈ ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకోవడం విశేషం.
శయన ఏకాదశికి నిద్రించి..

ముక్కోటి నాడు మేల్కొని..
ఆషాఢ శుద్ధ ఏకాదశి మనకు తొలి ఏకాదశి. ఈనాడు మహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. ఈ ఏకాదశి నాడు పీఠాధిపతులు, సన్యాసాశ్రమంలో ఉన్న వారు చాతుర్మాస్య వ్రతదీక్ష చేపడతారు. తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు. విష్ణువు ఈనాటి నుంచి యోగనిద్రలోకి వెళ్తాడు కాబట్టే దీనికి శయన ఏకాదశి అనే పేరు వచ్చింది. దీనికి నాలుగు నెలల తరువాత విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. అలా పుష్య శుద్ధ ఏకాదశి నాడు నిద్ర మేల్కొన్న విష్ణువును ఉత్తర ద్వారం నుంచి ముక్కోటి దేవతలు దర్శించుకుని తరిస్తారు. అదే వైకుంఠ లేదా ముక్కోటి లేదా మోక్షద ఏకాదశి. ఇది ధనుర్మాసంలో వస్తుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనూ రాశిలోకి ప్రవేశించే సమయం వరకూ ధనుర్మాసంగా పరిగణిస్తారు. ధనుర్మాసం 30 రోజులు. ఇది మార్గశిర, పుష్య మాసాల్లో విస్తరించి ఉంటుంది. ధనుర్మాస కాలం ఎంతో పుణ్యప్రదమైనదనీ, విష్ణువును ఈ మాసంలో ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి నాడు పూజించడం విశేషమైందని అంటారు. శ్రీ మహా విష్ణువుకు సూర్యచంద్రులు దక్షిణ, వామ నేత్రాలు. ఒకటి తేజస్సు, మరొకటి ఆహ్లాదం అందిస్తాయి. నేత్రాలు వేరైనా స్వామి కాంతితత్వ్తం ఒక్కటేనన్న మహా తత్త్వాన్ని ఈ పర్వం విశదపరుస్తుంది.
ఏ కొరతా లేనిది ‘వైకుంఠం’
‘కుంఠ’ అంటే కొరత కలది అని అర్థం. వైకుంఠ అంటే ఏ కొరతా లేనిదని భావం. అటువంటి వైకుంఠం శ్రీ మహా విష్ణువు లక్ష్మీదేవితో కూడి ఉండే నివాసం. విష్ణువు ఆ నివాసంలో లక్ష్మీదేవితో శేషశయ్యపై నివసిస్తాడు. త్రేతాయుగంలో రావణుని బాధలకు తాళలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠానికి వచ్చి హరి దర్శనం చేసుకున్నారు. వారికి ఏకాదశియే ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం కల్పించి మార్గదర్శి

Review కొత్త ఉషస్సుకు స్వాగతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top