జయ..జయ ఆశ్వయుజి

ఆంగ్లమానం ప్రకారం పదవ మాసం
అక్టోబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద – ఆశ్వయుజ మాసాల కలయిక. భాద్రపదంలోని కొన్ని రోజులు, ఆశ్వయుజంలోని మరికొన్ని రోజులు ఈ మాసంలో ఉంటాయి. అక్టోబరు 1, భాద్రపద బహుళ విదియ నుంచి అక్టోబరు 14 భాద్రపద బహుళ అమావాస్య వరకు భాద్రపద మాస తిథులు, ఆపై అక్టోబరు 15 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అక్టోబరు 31 ఆశ్వయుజ బహుళ తదియ వరకు ఆశ్వయుజ మాస తిథులు కొనసాగుతాయి. ఇందిరైకాదశి, దేవీ శరన్నవరాత్రులు, విజయదశమి, పాపాంకుశ ఏకాదశి, వాల్మీకి జయంతి, పద్మనాభ ద్వాదశి, అట్లతద్ది వంటివి ఈ మాసంలో వచ్చే ప్రధాన పండుగలు, పర్వాలు.

2023- అక్టోబరు 1, ఆదివారం, భాద్రపద బహుళ విదియ నుంచి
2023- అక్టోబరు 31, మంగళవారం, ఆశ్వయుజ బహుళ తదియ వరకు..
శ్రీశోభకృతు నామ సంవత్సరం-భాద్రపదం – ఆశ్వయుజం- శరదృతువు-దక్షిణాయణం

సమస్త లోకానికీ విజయాలను అందించే విజయదశమి, ఆడపిల్లల వేడుక అట్లతద్ది, తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలు ఆశ్వయుజ మాసానికి శోభ తెస్తాయి. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఉంటాయి. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగినదే ఆశ్వయుజ మాసం. వర్షాలు తగ్గి ప్రకృతి వింతశోభను సంతరించుకునే కాలం- శరత్కాలం. అందమైన ఈ రుతువులో వచ్చే నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్క•తిలో విలక్షణమైనవి. ఈ మాసంలో సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు. ఈ నెలలో సూర్యచంద్రులు నిర్మలంగా దర్శనమిస్తారు. సూర్యుడు శక్తి కారకుడైతే, చంద్రుడు మన: కారకుడు. ఈ ఇద్దరూ కలిసి ఈ నెలలో ఆరాధించే అమ్మవారి భక్తులపై తమ శక్తులను ప్రసరిస్తారు. కాలం స్త్రీ పురుష రూపాత్మకం. సంవత్సరంలోని చైత్రం మొదలు భాద్రపదం వరకు తొలి అర్ధ భాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు గల ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మకం. ప్రత్యేకించి రెండో అర్ధ భాగంలోని తొలి మాసం ఆశ్వయుజం అమ్మవారి ఆరాధనకు ఉద్ధిష్టమైనది.

సర్వసృష్టి స్త్రీ నుంచే సంభవిస్తుంది. పురుషుడు ప్రాణదాత. స్త్రీ శరీరధాత్రి. అందుకు నిదర్శనంగానే ఆశ్వయుజం అతివల పర్వమై వెలుగొందుతోంది. మహిళలు నోచే నోములు, వ్రతాలు, మరీ ముఖ్యంగా అమ్మవారి వేడుకకు ఆటపట్టయినదీ మాసం. ఈ నెలలో వచ్చే అట్లతద్ది, దసరా తదితర పర్వాలన్నీ స్త్రీలకు సంబంధించినవే. ఆశ్వయుజి అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఈ మాసంలో వైశిష్ట్యం. సకల బ్రహ్మంలో సత్వరజోస్తమో గుణాలు ఉంటాయి. సత్యం నిలువెల్లా నింపుకుని ఉన్న పరతత్వాన్ని విష్ణువుగా, రజస్సుతో కూడిన దాన్ని బ్రహ్మగా, తమస్సుతో ఏర్పడిన పరతత్వాన్ని శివుడిగా వేద పురాణాలు రూపొందించాయి. సృష్టి, పోషణ, లయం వంటి నిర్దిష్ట కార్యాలను నెరవేర్చేందుకు వారికి సహకరించే శక్తి స్వరూపాలు- సరస్వతి, లక్ష్మి, పార్వతి. సమస్త జగత్తును పాలించే ఆ ఆది పరాశక్తి త్రివిధాలుగా రూపుదాల్చి లక్ష్మి, పార్వతి, సరస్వతి అయి లోకాలకు సకల సౌభాగ్యాలను, విద్య, శక్తులను ప్రసాదిస్తోంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులు. శైలిపుత్రిగా, బ్రహ్మచారిణిగా, కాత్యాయనిగా, కాళరాత్రి దేవిగా, మహాగౌరిగా, చంద్రఘంటా దేవిగా, కూష్మాండదేవిగా, స్కందమాతగా, సిద్ధిధాత్రిగా ఈ తొమ్మిది రోజులూ దేవిని అర్చించడం ఒక సంప్రదాయం. పదో రోజు విజయ దశమి. ఆ రోజునే శ్రీరాముడు రావణ సంహారం చేశాడని అంటారు. అర్జునుడు జమ్మిచెట్టుపై నుంచి ఆయుధాలను తీసి కౌరవ వీరులను జయించినదీ విజయదశమి నాడేనని పురాణోక్తి. ఇక, ఈ మాసంలో వచ్చే పండుగలు, పర్వాల విశేషాలు ఇవీ..

భాద్రపద బహుళ విదియ
అక్టోబరు 1, ఆదివారం

అక్టోబరు మాసపు తొలి రోజు ఇది. తిథి.. భాద్రపద బహుళ విదియ. ఈ తిథి ఉండ్రాళ్ల తద్ది భోగిగా ప్రసిద్ధి. కొన్ని పండుగలకు పూర్వ దినాలను భోగి అనడం వాడుకలో ఉంది. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది, మకర సంక్రాంతి.. ఈ పండుగల పూర్వ దినాలను (ముందు వచ్చే రోజును/ముందురోజులను) భోగి అని వ్యవహరిస్తారు. ఉండ్రాళ్ల తద్ది స్త్రీల పండుగ. కన్నెలు, పడుచులు, చిన్నారి మగపిల్లలు కూడా ఈ పర్వంలో పాల్గొంటారు. ఉండ్రాళ్ల తద్ది భోగి నాడు ఆడపిల్లలు అందరూ తలంటి పోసుకుంటారు. దీంతో భోగి పీడ వదులుతుందని అంటారు. తలంటు అయిన తరువాత చేతి, కాలి వేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారుగట్ల గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసు, గట్టి పెరుగు వంటివి వేసుకుని భోజనం చేసి, తాంబూలం వేసుకుని ఉయ్యాల ఊగడం, ఆడుకోవడం మున్నగు వాటితో కాలక్షేపం చేస్తారు.

భాద్రపద బహుళ తదియ/ఉండ్రాళ్ల తద్ది
అక్టోబరు 2, సోమవారం

భాద్రపద బహుళ తదియ (తద్ది) అమ్మాయిలకు ప్రీతిపాత్రమైన పర్వం. ఈనాడు ప్రతి ఇంట యువతులు ఆనందోత్సాహాలతో గడుపుతారు. వారి ఆనందమే తమ భాగ్యంగా పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. ఈనాడు స్త్రీలు తెల్లవారుజామునే అభ్యంగన స్నానాలు చేసి వేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. పిదప గవ్వలాట ఆడతారు. ఊరి బయట తోటలకు అట్లు, బెల్లపట్లు, పెరుగన్నం పట్టుకెళ్లి, వాటిని ఆరగించాక ఉయ్యాలలూగుతారు. రాత్రి గౌరీ పూజ చేస్తారు. ఈ పండుగ ప్రధానంగా స్త్రీల సౌభాగ్యం కోసం చేసే పండుగ. శ్రావణ, బాద్రపద మాసాలలో కొన్ని స్త్రీ సౌభాగ్యకారకమైన వ్రతాలు గురించి వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. కానీ, ఉండ్రాళ్ల తద్ది గురించి ఆయా గ్రంథాలలో లేదు. హేమాద్రి పండితుడు చెప్పిన ప్రకారం.. చైత్ర, భాద్రపద, మాఘ మాసాలలో రూప సౌభాగ్య సౌఖ్యదమైన తృతీయా వ్రతాన్ని గురించి తనకెందుకు చెప్పలేదని యుధిష్టరుడు కృష్ణుడిని ప్రశ్నించాడు. కృష్ణుడు- భవిష్యోత్తర పురాణం నుంచి ఓ వ్రతాన్ని ఉదహరించాడు. భాద్రపద తృతీయ అన్నాడే కానీ, భాద్రపద బహుళ తదియ అని స్పష్టంగా చెప్పలేదు. సాధారణంగా భాద్రపద శుద్ధ తృతీయ నాడు చేయాల్సిన వ్రతాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ, ‘గుడ తృతీయ’మనే ఒక వ్రతాన్ని కృష్ణుడు ఉదహరించాడు. గుడాపూపములు దేవికి నైవేద్యంగా పెట్టి, జలాశయాల్లో దేవీ ప్రతిమలను నిమజ్జనం చేస్తారు. వామదేవుని ప్రీతి కోసం పాయసాన్ని సమర్పించాలని ఈ వ్రతంలో ఉంది. ఈ వ్రతం కూడా ఏ పక్షపు తృతీయ అనేది స్పష్టంగా లేదు. గుడాపూపములు నైవేద్యంగా ఇవ్వాలని అనడం వల్ల నేటి ఉండ్రాళ్ల తద్దియే ఆ వ్రతమై ఉండవచ్చని వ్రతకారుల అభిప్రాయం. వర్షాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలనేది ఆరోగ్య సూత్రం. దానికి అనుగుణంగానే ఉండ్రాళ్లు ఆరగించే ఈ పండుగ ఆచరణలోకి వచ్చి ఉండవచ్చు. ఉండ్రాళ్ల తద్ది (తదియ) నాడు కొన్ని వర్ణాల వారు గొంతెమ్మ (కుంతి) పూజ చేయడం కూడా ఆచారంగా ఉంది.
ఇక, చారిత్రకంగా ఈనాడు మహాత్మాగాంధీ జయంతి. దివంగత భారత ప్రధాని లాల్‍బహదూర్‍ శాస్త్రి జయంతి దినం కూడా ఈనాడే. అలాగే, ఈనాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఇది గణపతి సంబంధ పూజాకృత్యం.

భాద్రపద బహుళ చతుర్థి/పంచమి
అక్టోబరు 3, మంగళవారం

భాద్రపద బహుళ చతుర్థి తిథి గణపతి పూజకు ప్రత్యేకం. ఈనాడు దిక్పాల పూజ చేయాలని నీలమత పురాణం చెబుతోంది. అలాగే, చతుర్థి తిథి గడియల్లోనే పంచమి తిథి కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ పంచమి నాడు నాగులకు పాలు పోయడం ద్వారా వాటిని తృప్తిపరచాలని అంటారు. ఈనాడు రుషులను పూజించాలి. ఇది ప్రధానంగా పురుషులు చేసేదిగా ఉంది. మొదట స్నానం చేసి మట్టితో వేదిక చేయాలి. దానిని పేడతో అలకాలి. పువ్వులతో అలంకరించాలి. దర్భలు పరిచి దాని మీద గంధం ఉంచాలి. పువ్వులు ఉంచాలి. ధూపం వేయాలి. దీపం ఉంచాలి. సప్తరుషి పూజ చేయాలి. అర్ఘ్యదానం ఇవ్వాలి. దున్నకుండా, నాటకుండా పండిన శ్యామాక ధాన్యంతో బియ్యం చేసి వండి నైవేద్యం పెట్టి తాను ఆ అన్నమే తినాలి. ఇలా చేస్తే సప్తర్షుల అనుగ్రహం కలుగుతుంది. అలాగే, ఈ తిథిని మహా భరణిగానూ వ్యవహరిస్తారు.

భాద్రపద బహుళ షష్ఠి
అక్టోబరు 4, బుధవారం

భాద్రపద బహుళ షష్టి నాడు కుమారస్వామిని పూజించాలి. ప్రతి మాసంలో వచ్చే షష్టి తిథి ఈయన పూజకు ఉద్ధిష్టమైనది.

భాద్రపద బహుళ అష్టమి
అక్టోబరు 7, శనివారం

భాద్రపద బహుళ అష్టమి నాడు జీమూత వాహనుడిని పూజించాలని అంటారు. అశోకాష్టమీ వ్రతం ఈనాడు ప్రారంభించి ప్రతి కృష్ణాష్టమి నాడు దేవీపూజ చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇక, ఈనాటి ప్రధాన దైవ సమానమైన జీమూత వాహనుడు విద్యాధర యువకుడు. గరుడుడికి ఆహారమైపోతున్న నాగులను రక్షించిన త్యాగశీలి. అలాగే, ఈనాడు కాలాష్టమి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. కాలభైరవుడిని పూజించాలి.

భాద్రపద బహుళ నవమి
అక్టోబరు 8, ఆదివారం

భాద్రపద బహుళ నవమి తిథి నీరాజన నవమి పర్వమని నీలమత పురాణం చెబుతోంది. ఈనాడు దుర్గాపూజ, గౌరీపూజాధికాలు చేయాలని అందులో వివరించారు. ఇక, కొన్ని పంచాంగాలలో ఈ తిథిని అహిర్ణవమిగానూ, దుర్గోత్థాపనగానూ వ్యవహరిస్తున్నారు.

భాద్రపద బహుళ ఏకాదశి
అక్టోబరు 10, మంగళవారం

భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరైకాదశి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో రాశారు. ‘హిందువుల పండుగలు’ అనే గ్రంథంలో దీనిని ‘ఇంద్రైకాదశి’గా పేర్కొన్నారు. ఇంద్రసేనుడనే వాడు ఈనాడు యమలోకంలో యాతనలు పడసాగాడు. అదే సమయంలో భూలోకంలో అతని కొడుకు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. కుమారుడు ఆచరించిన ఏకాదశి పూజ ఫలితంగా యమలోకం నుంచి ఇంద్రసేనుడు స్వర్గలోకానికి వెళ్లాడని పురాణకథ. ఈ ఏకాదశినే మతత్రయ ఏకాదశి అని కూడా పిలుస్తారు.

భాద్రపద బహుళ ద్వాదశి
అక్టోబరు 11, బుధవారం

భాద్రపద బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ఈనాటి నుంచి చిత్తకార్తె ఆరంభమవుతుంది. పితృ దేవతల పూజలకు సంబంధించిన యతి మహాలయం వంటి పూజలు ఈనాడు ఆచరిస్తారు.

భాద్రపద బహుళ త్రయోదశి
అక్టోబరు 12, గురువారం

భాద్రపద బహుళ త్రయోదశి మాస శివరాత్రి తిథి. ఈనాడు కలియుగాది అని ఆమాదేర్‍ జ్యోతిషీలో రాశారు. ద్వాపర యుగాది అని తిథి తత్వంలోనూ, చతుర్వర్గ చింతామణిలోనూ ఉంది. భాద్రపద కృష్ణ త్రయోదశి కలియుగాది దినం. ఈ యుగమున ఒక పాలు మాత్రమే ధర్మం నడుస్తుంది. కొంతకాలానికి అది కూడా నశిస్తుంది. అధర్మమే ప్రవర్తిస్తుంది. భగవంతుడు కృష్ణవర్ణధారిగా ఉంటాడు. ప్రజలు అనాచారవంతులై ఉంటారు. దీనిని అయోమయ యుగమని కూడా అంటారు. ఈ యుగమున ప్రజలు అన్నగత ప్రాణులు. ఈ యుగ ప్రమాణం 4,32,000 మానవ సంవత్సరాలు.

భాద్రపద బహుళ చతుర్దశి
అక్టోబరు 13, శుక్రవారం

భాద్రపద బహుళ చతుర్దశి నాడు ఉపవాసం ఉంటే శివలోకప్రాప్తి కలుగుతుందని తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో ఉంది. స్మ•తి కౌస్తుభంలో ఈ తిథి గురించి ‘శస్త్రాదిహితన్యైకోదిఇష్టం తత్పార్వణంచ’ అని పేర్కొన్నారు.

భాద్రపద బహుళ అమావాస్య
అక్టోబరు 14, శనివారం

భాద్రపద బహుళ అమావాస్య పితృకామావాస్య అనీ, మహాలయ అమావాస్య అనీ ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. పితృ దేవతల సంతృప్తి కోసం ఈ తిథి నాడు తగిన విధాయ కృత్యాలు ఆచరించాలని వాటిలో ఉంది. ఇంకా ఈనాడు కన్యకా సంక్రమణం అనీ, అశ్వశిరోదేవ పూజ చేసి ఉపవాసం ఉండాలని హేమాద్రి పండితుడు చెబుతున్నాడు. సంక్రాంతి స్నాన వ్రతం కూడా ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో రాశారు. తెలంగాణలో ఈనాటి నుంచే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈనాడు మొదలు ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. నవమి నాడు ముగింపు ఉత్సవం జరుగుతుంది. పూలతో అమ్మవారిని అలంకరించి పూజాదికాలు నిర్వహించే ఈ వేడుక ప్రకృతి ఆరాధనకు అద్దం పడుతుంది.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
అక్టోబరు 15, ఆదివారం

ఆశ్వయుజ మాసం, శరద్రుతువు ఈనాటి నుంచే ప్రారంభం. దేవీ నవరాత్రులు శ్రీకారం చుట్టుకునేది ఈనాటి నుంచే. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఈనాటి నుంచి ప్రారంభమవుతాయి. దేవీ నవరాత్రుల పూజలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకుని విజయదశమి వరకు చేస్తారు. ఈ గడియల్లోనే భద్రకాళి అష్టాదశ భుజ మహిషాసురమర్దనిగా అవతారమెత్తింది. ఆదిశక్తి- మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గలుగా అవతరించిందని, ఈ దేవతను హ్రీం, శ్రీం, క్లీం సంకేతమూర్తిగా ఆరాధిస్తారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా ప్రశాంతమైన చిత్తాన్ని ప్రసాదించే త్రిభువన పోషిణి, శంకరతోషిణి, విష్ణువిలాసిని ఈ అమ్మలగన్న అమ్మ. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి నాడు వాగ్దేవి సరస్వతీ పూజ చేయాలి. జ్ఞానభూమికగా సరస్వతిని దర్శించడం భారతీయ సంప్రదాయం. ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులు. శైలిపుత్రిగా, బ్రహ్మచారిణిగా, కాత్యాయనిగా, కాళరాత్రి దేవిగా, మహాగౌరిగా, చంద్రఘంటా దేవిగా, కూష్మాండదేవిగా, స్కందమాతగా, సిద్ధిధాత్రిగా ఈ తొమ్మిది రోజులూ దేవిని అర్చించడం ఒక సంప్రదాయం. పదో రోజు విజయ దశమి. ఇంకా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి నాడు స్తనవృద్ధి గౌరీవ్రతం ఆచరించాలని నియమం. నీలమత పురాణంలో ఈనాడు గృహదేవీ పూజ చేయాలని ఉంది. స్మ•తి కౌస్తుభంలో- ఈనాటి నుంచి నవరాత్రారంభమని ఉంది.

ఆశ్వయుజ శుద్ధ విదియ
అక్టోబరు 16, సోమవారం

ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు ప్రత్యేక పూజలేమీ లేవు. శరన్నవరాత్రుల్లో ఇది రెండో రోజు. ఈనాడు స్థానిక సంప్రదాయాలను అనుసరించి అమ్మవారు బాలా త్రిపురసుందరి, బ్రహ్మచారిణి అలంకరణలలో దర్శనమిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ తదియ
అక్టోబరు 17, మంగళవారం

ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు మేఘపాలీయ తృతీయా వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. ఇది శరన్నవరాత్రులలో మూడవ రోజు. ఈనాడు అమ్మవారు గాయత్రీదేవిగా, చంద్రఘంటా దేవిగా దర్శనమిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ చతుర్థి
అక్టోబరు 18, బుధవారం

ఆశ్వయుజ శుద్ధ చతుర్థి నాడు దేవతలను, సువాసినులను పూజించాలని నీలమత పురాణంలో ఉంది. గణేశ చతుర్థి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ పంచమి
అక్టోబరు 19, గురువారం

ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఉపాంగ లలితా గౌరీ వ్రతం ఆచరించాలని కొన్ని పంచాంగాలలో ఉంది. అలాగే, ఉపాంగ లలితా వ్రతం ఆచరించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఈ తిథి శాంతి పంచమీ వ్రత దినమని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు.

ఆశ్వయుజ శుద్ధ సప్తమి
అక్టోబరు 21, శనివారం

ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు గరుడ జయంతి దినం. ఈనాడు మూలా నక్షత్రం. నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈనాడు అమ్మవారిని సరస్వతిదేవిగా అలంకరించి పూజిస్తారు. ఈ తిథి శుభ సప్తమీ, ద్వాదశ సప్తమీ వ్రతాల దినమని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు స్నానం చేసి కపిల గోవును పూజించి అనంతరం, పంచగవ్యములను మాత్రమే సేవించి మర్నాడు భోజనం చేయాలి. ఈనాడే దేవీ త్రిరాత్ర వ్రతం కూడా ఆచరిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ అష్టమి
అక్టోబరు 22, ఆదివారం

ఆశ్వయుజ శుద్ధ ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమీ తిథి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది శరన్నవరాత్రుల్లో భాగమైన అష్టమి దినం. దుర్గాష్టమిగా వ్యవహరించే ఈనాడు మహాష్టమి, దుర్గపూజ, భద్రకాళీ పూజ వంటివి ఆచరిస్తారు. దుర్గాష్టమి వ్రతం ఆచరించాలి. ఇక, మాళవ దేశంలో ఈనాటి సాయంకాలం ఒక ఇంట స్త్రీలందరూ సమావేశమవుతారు. సీసామూతి దగ్గర నోటితో ఊది బాలురు శబ్దం తెప్పించేటట్లు ఈనాడు స్త్రీలు ఒక కుండమూతిలో కానీ, ఇత్తడి బిందె మూతిలో కానీ ఊది శబ్దం చేస్తారు. ఇలా ఊదుతూ బాగా శబ్దం చేసిన స్త్రీని మహాలక్ష్మి పూనినట్టు మిగతా స్త్రీలు నమ్ముతారు. ఆ పూనిన స్త్రీ వేసిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతుందట. తెల్లవారడంతోనే ఆ పూనకం పోతుంది. రాత్రి దేవత పూనిన స్త్రీకి ఇంటి యజమానురాలు ఉదయాన్నే కుంకుమ, కొబ్బరికాయ, బియ్యం, రవికల గుడ్డ ఇస్తుంది. ఈ ఉత్సవానికి పురుషులు రాకూడదు. ఇది మాళవ దేశపు ప్రత్యేక పర్వాల్లో ఒకటి.
ఇదే రోజు తెలంగాణలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభోగంగా నిర్వహిస్తారు. ప్రకృతిలో లభించే వివిధ పూలతో అమ్మవారి పసుపు బొమ్మను అలంకరించి, విశేషంగా పూజించి ఆటలు ఆడి, పాటలు పాడుతూ గౌరమ్మ (బతుకమ్మ)ను ఘనంగా చెరువుల్లోనూ, నదుల్లోనూ నిమజ్జనం చేస్తారు. ఈనాటితో బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి.
అలాగే, కొమరంభీం జయంతి దినం కూడా ఈనాడే.

ఆశ్వయుజ శుద్ధ నవమి
అక్టోబరు 23, సోమవారం

ఆశ్వయుజ శుద్ధ నవమి మహర్నవమి. మహా నవమి అనీ అంటారు. నవమి తిథి శరన్నవరాత్రుల్లో మహర్నవమిగా ప్రతీతి. ఈనాడు మాతృ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా నామ నవమి వ్రతమనీ, దుర్గా నవమీ వ్రతమని, శౌర్యవ్రతం, భద్రకాళీ వ్రతం, కోటి గుణ కరందానం, మహా ఫలవ్రతం, ప్రదీప్త నవమీ వ్రతం మున్నగు వ్రతాలు ఈనాడు ఆచరిస్తారని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఆశ్వయుజ శుద్ధ నవమి స్వారోచిష మన్వంతరాది దినమని కూడా అంటారు. ఈనాటి అమ్మవారి అలంకరణ- మహిషాసుర మర్దిని. మహిషాసురుడనే రాక్షసుడిని అమ్మవారు ఈనాడే సంహరించారని అంటారు. ఈనాడు ఆయుధ పూజ చేస్తారు. వివిధ కులవృత్తుల వారు తమ పనిముట్లను, విద్యార్థులు తమ విద్యాసామగ్రిని, వివిధ బతుకుదెరువులు, జీవనోపాధులకు ఆధారమైన వస్తువులను ఈనాడు విశేషంగా పూజిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ దశమి
అక్టోబరు 24, మంగళవారం

ఆశ్వయుజ శుద్ధ దశమి దసరా (విజయ దశమి) పర్వదిన తిథి. ఈ తిథి విజయదశమి పర్వదినం. ప్రాచీన కాలం నుంచి దసరా ఆచరణలో ఉంది. ఈ తిథినాడు శక్తిపూజ మహోత్కంష్టమైనది. గదాధర పద్ధతి, ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథాలలో ఇది అపరాజితా దశమిగా పేర్కొన్నారు. అపరాజితా దేవి పూజ రాజులకు మరీ ముఖ్యమైన పర్వం. దసరా నాడు శమీపూజ, దేవీ విసర్జనం, రాజ్ఞస్సీమోల్లంఘనం, అశక్తౌస్వాయుధాది నిర్గమనం, దశరథ లలితా వ్రతం, కూష్మాండ దశమీ వ్రతం మొదలైనవి కూడా ఆచరిస్తారని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. దసరా అనేది తొమ్మిది రోజుల- తొమ్మిది రాత్రుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలు నవమి వరకు ఈ పండుగ రోజులు. వీటినే శారద నవరాత్రులనీ, శారదీయ నవరాత్రులనీ అంటారు. భగవతి, పార్వతి ఇత్యాధి నామాలతో వ్యవహరించే దేవతా పూజకు ఈ దినాలు ప్రత్యేక పవిత్రతను ఆపాదిస్తున్నాయి. మొత్తానికి ఇది యుద్ధ దేవత ఆరాధన దినం. అపరాజితా దేవి విజయానికి అధి దేవత. ఆదిమ శక్తి, ఆదిమ కుటుంబిని అయిన పరమేశ్వరి దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే పర్యాయాభిదానాలతో ప్రజలచే పూజలను పొందే శుభవాసరాలిని. లోక కంటకుడైన మహిషాసురుని సంహరించి దుర్గ మహిషాసుర మర్దిని అయి ప్రజలను ఆలించి, పాలించిన శుభ ఘడియలను స్మరించుకోవడానికి ఏర్పడిన శుభదినాలు- ఈ శరన్నవరాత్రులు. శ్రీరాముడు విజయదశమి నాడే దుర్గాపూజ చేసి రావణుడిని సంహరించి సీతను పొందాడు. పాండవులు విజయదశమీ పర్వ సంబంధ కార్యకలాపాన్ని నిర్వర్తించిన అనంతరమే కౌరవులను సంహరించి రాజ్యాన్ని పొందారు.
ఇక, నవరాత్రి వేడుకలకు పశ్చిమబెంగాల్‍ ప్రసిద్ధి. తొమ్మిది రోజులు తొమ్మిది దుర్గావతారాలుగా అమ్మవారిని అలంకరించి బెంగాల్‍ ప్రజలు కొలుస్తారు.
మొదటి రోజు శైలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంటగా, నాలుగో రోజు కూష్మాండగా, ఐదవ రోజు స్కంధమాతగా, ఆరో రోజు కాత్యాయనిగా, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజున మహాగౌరిగా, తొమ్మిదో రోజున సిద్ధిధాత్రిగా దేవి పూజలు అందుకుంటుంది.
ఈ తొమ్మిది రోజులు రూపానికి తగిన అలంకరణలో ఆయుధాలు ధరించి దేవి నవదుర్గలుగా భాసిస్తూ శరన్నవరాత్రులలో దివ్యతేజంతో భక్తులను కరుణిస్తుంది. రావణుడిపై రాముడి విజయాన్ని ఉత్సవంగా జరుపుకునేదీ, సర్వ విధాలా విజయాలకు కేంద్రంగా పేరొందినది ఈ విజయదశమి. చెడుపై మంచి గెలిచిన తీరును వర్ణించే, ఉత్సవ హేలగా జరుపుకునే దుర్గాపూజల ముగింపులో దేవి నిమజ్జనం జరుగుతుంది. దసరా నాడు సాయంత్రం శమీపూజ చేయడం ఆచారం. సాయంకాలం శమీ (జమ్మి) వృక్ష దర్శనం మహా పుణ్యప్రదమని అంటారు. ఇంకా,
ఆశ్వయుజ మాస శుద్ధ దశమి మధ్వాచార్య జయంతి దినం కూడా. విళంబి, క్రీస్తు శకం 1238 సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడే త్రిమతాచార్యులలో మూడవ వాడైన మధ్వాచార్యులు జన్మించారు. మత త్రయాచార్యులలో శ్రీమధ్వాచార్యులు ఒకరు. వైష్ణవ మత బోధకులలో వీరు అగ్రగణ్యులు. హిందూమత వికాసానికి ఈయన చేసిన ఉపకారం అమూల్యమైనది. ఆయన తాను వాయుదేవుని మూడవ అవతారమని చెప్పుకునే వారు. ద్వైత సిద్ధాంతాన్ని లోకానికి ప్రసాదించిన ఈయన భక్తితత్త్వానికి నూతనోజ్జీవాన్ని కలిగించారు.

ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి
అక్టోబరు 25, బుధవారం

ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి పాపాంకుశ ఏకాదశిగా ప్రసిద్ధి. దీనినే పాశాంకుశ ఏకాదశి అనీ అంటారు. యమపాశానికి అంకుశంగా పనిచేసే ఏకాదశి ఇది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి నరకప్రాప్తి లేకుండా చేసి స్వర్గలోకాన్ని పొందేటట్టు చేస్తుంది. అందుకే దీనిని ‘పాపాంకుశ’ ఏకాదశిగా కొన్ని వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆచరించే మధన ద్వాదశి వ్రతానికి ఆశ్వయుజ శుక్ల ఏకాదశి ప్రారంభ దినం. ఈ వ్రతం స్త్రీలకు సౌభాగ్యప్రదమైనది. ఈ వ్రతం చేయదల్చిన వారు ఆశ్వయుజ శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తులసీ సహిత శ్రీ మహావిష్ణువును సమాహిత చిత్తంతో పూజించాలి. తులసీ కోట వద్ద పంచపద్మాలు పెట్టాలి. అయిదు దీపాలు పెట్టాలి. అయిదు విధాలైన నైవేద్యాలు ఉంచాలి. ఇట్లా కార్తీక శుక్ల పక్ష ఏకాదశి వరకు చేయాలి. ద్వాదశి నాడు చలిమిడి కర్రరోటిలో పాలు పోసి చెరుకు కర్రలతో చిలకాలి.

ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి
అక్టోబరు 26, గురువారం

ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి నాడు విశోక ద్వాదశి, గోవత్స ద్వాదశి వంటి వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇదే తిథి నాడు అఖండ ద్వాదశీ, పద్మనాభ ద్వాదశీ వ్రతం వంటివి కూడా ఆచరించాలని కూడా అందులో రాశారు. అలాగే, ఈనాడు వాసుదేవ పూజ చేయాలని, ఉపవాసం ఉండాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.

ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ
అక్టోబరు 28, శనివారం

ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ నాటి వివరణలో మన పంచాంగకర్తలు కౌముద్యుత్సవం, అక్షక్రీడ, కోజాగర్తి వ్రతం, లక్ష్మీంద్ర కుబేరాది పూజ అని పేర్కొంటారు. ఈనాడు ముఖ్యంగా కౌముదీ వ్రతం ఆచరించాలని, లక్ష్మిని, ఇంద్రుడిని పూజించాలని, రాత్రి జాగరణం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈ రాత్రి అంతా మేల్కొని ఉండటానికి అక్షక్రీడ (జూదం) అనే వినోదాన్ని కూడా ఈ వేడుకలో జోడించారు. ఇక, ఆంధప్రదేశ్‍లో ఈనాడు గొంతెమ్మ పండుగ జరుపుతారు. మాలలు ఈ దేవతను ఎక్కువగా పూజిస్తారని అంటారు. ఇందుకో కారణం కూడా ఉంది.
కురుక్షేత్ర యుద్ధం ముగిశాక యుద్ధంలో మరణించిన వారికి తిలోదకాలు, తర్పణాలను ధర్మరాజు విడుస్తుండగా మధ్యలో కర్ణుని చెయ్యి వచ్చింది. ఇదేమిటని ధర్మరాజు వ్యాసుడిని అడిగాడు. ‘అతను మీ అన్న. తర్పణం విడువు’ అని వ్యాసుడు చెప్పాడు. అలాగే చేసి ధర్మరాజు ఇంటికి వచ్చి తల్లి కుంతిని నిజం చెప్పాలని బలవంతం చేశాడు. ఆమె చిన్నప్పటి తన గాథను విచారంతో చెప్పింది. ‘ఇదే విషయం ముందు చెప్పి ఉంటే కర్ణుడిని చంపకుండా ఉండేవాళ్లం కదా! ఈ తప్పునకు కారణం నువ్వే. కాబట్టి నువ్వు మాలలకు దేవతవు కమ్ము’ అని శపించాడు.
ఇంకా- ఆడవారి నోటిలో నువ్వు గింజ నానదు’ అని కూడా శపించాడు. ఈ కారణంగానే గొంతెమ్మ (కుంతి) మాలలకు ఇలవేల్పు అయ్యింది. ఆశ్వయుజ పూర్ణిమ నాడు ఈ వ్రతం చేయదగినది.
ఇంకా ఈనాడు కోజాగౌరీ పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవికి, శ్రీరామునికి ప్రియమైన వ్రతమిది. ఈనాటి అర్ధరాత్రి వేళ లక్ష్మీపూజ చేస్తారు. ఆహ్వానించిన అతిథులకు కొబ్బరికాయలోని పాలు పంచిపెడతారు. ఆశ్వయుజ మాసంలో ఆచరించే వ్రతాల్లో విశేష భాగ్యప్రదమైన వ్రతం ఏదని వాలఖిల్య రుషిని ఇతర రుషులు ప్రశ్నించారట. అందుకు బదులుగా వాలఖిల్యుడు ‘కోజాగౌరీ’ వ్రతాన్ని గురించి చెప్పాడు.
ఆశ్వయుజ పౌర్ణమి నాటి రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కలియ దిరుగుతూ ప్రతి ఇంటి వద్దా నిలిచి పిలుస్తుందట. కాబట్టి ఈనాటి రాత్రి ప్రతి వారు కనీసం అర్ధరాత్రి అయ్యే వరకైనా మేలుకుని ఉంటారు. అర్థరాత్రి వేళ లక్ష్మి వచ్చి ప్రతి ఇంటి వద్ద ఎవరు మేలుకుని ఉన్నారని అడుగుతుందట. ఎవరూ పలకకపోతే చల్లగా వెళ్లిపోతుందట. అందుమీద ఈ ఇంటికి లక్ష్మీ ప్రసన్నం లేకుండా పోతుందట.
అశ్వనీ నక్షత్రానికి చంద్రుడు మిక్కిలి సమీపంగా ఉండే రోజున కోజాగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. కాబట్టి ఇది శుక్ల పక్ష చతుర్దశిని కానీ, పౌర్ణమిని కానీ కృష్ణ పక్ష పాడ్యమిని కానీ పడవచ్చు. ఈ పండుగను సాయంత్రం చేయాలి. తన తొలి చూలి బిడ్డకు ఈనాడు తల్లి కొత్త బట్టలు ఇస్తుంది. ఆ తల చుట్టూ ఒక దీపం తిప్పుతుంది. ఆపై అక్షతలు చల్లి దీర్ఘాయురస్తు అని దీవిస్తుంది. ఇది దేవవైద్యులైన అశ్వనీ కుమారుల రక్షణంలో తన బిడ్డను ఉంచడానికి తల్లులు చేసే పర్వంలా దీనిని బట్టి తోస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమ నాడు నారదీయ పురాణాన్ని దానం చేస్తే ఇష్టలోక ప్రాప్తి కలుగుతుందని అంటారు.
ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ నాడే వాల్మీకి జయంతి కూడా. రామాయణ గ్రంథకర్త అయిన వాల్మీకిని ఈనాడు ఆరాధిస్తారు. అలాగే, కృష్ణ భక్తురాలైన మీరాబాయి జయంతి దినం కూడా ఈనాడే.

ఆశ్వయుజ బహుళ పాడ్యమి
అక్టోబరు 29, ఆదివారం

ఆశ్వయుజ బహుళ పాడ్యమి తిథి నాడు జయావాప్తి వ్రతం ఆచరించాలి. ఈ వ్రతానికి సంబంధించిన వివరాలు చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి.

ఆశ్వయుజ బహుళ విదియ
అక్టోబరు 30, సోమవారం

ఆశ్వయుజ బహుళ విదియ నాడు అశూన్య వ్రతం ఆచరించాలని అంటారు. అలాగే ఇది అట్లతద్ది భోగి. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది, మకర సంక్రాంతి.. ఈ పర్వాలకు ముందు రోజును భోగి అని వ్యవహరించడం తెలుగు నాట రివాజు. ఉండ్రాళ్ల తద్ది భోగి మాదిరిగానే అట్లతద్ది భోగి నాడు కూడా (అంటే, ఈనాడు) తలంటి పోసుకుంటారు. గోరింటాకు నూరి గోళ్లకు, వేళ్లకు అలంకరించుకుంటారు. తెల్లవారగానే ఉట్టి కింద ముద్ద తింటారు. తాంబూలం వేసుకుని ఆడుకుంటారు. మర్నాడు అట్లతద్ది పండుగను జరుపుకుంటారు.

ఆశ్వయుజ బహుళ తదియ
అక్టోబరు 31, మంగళవారం

ఆశ్వయుజ బహుళ తదియ తిథి అట్లతద్ది పర్వం. ఈనాడు కనక గణేశ వ్రతం, లలితా గౌరీ వ్రతం, చంద్రోదయోమా వ్రతం మొదలైన వ్రతాలు చేస్తారని వ్రత గ్రంథాలలో ఉంది. వీటిలో చంద్రోదయోమా వ్రతం అట్లతద్ది పేరుతో తెలుగునాట వ్యావహారికంలో ఉంది. ఈ రోజు స్త్రీలు చంద్రుడు ఉదయించిన తరువాత ఉమాదేవిని పూజిస్తారు. భోగి నాడు మొదలుకుని తెల్లవారి తద్ది నాడు పగటి పూజ భోజనం చేయరు. తాంబూలం మాత్రం తరచూ సేవిస్తూ రాత్రి వరకు ఉపవాసం ఉంటారు. పగటి వేళలో వీలైనంత వరకు ఉయ్యాలలు ఊగుతారు. ఈ ఉయ్యాలలను ఇళ్లలో కాక తోటల్లో, దొడ్లలో పెద్దచెట్లకు వేస్తారు. సాయంత్రం ఉమాదేవిని పూజించి, చంద్రుడిని చూసిన తరువాత అట్లు తదితర పిండి వంటలతో భోజనం చేస్తారు. ఇదీ అట్లతద్ది నాటి తెలుగు మహిళల కార్యకలాపం. ఇది అతివల పండుగ. నగర స్త్రీల కంటే పల్లెటూరి పడుచులు ఈ పండుగను ఎక్కువగా, మనోజ్ఞంగా అనుభవిస్తారు. అట్లతద్ది నోము నోస్తే కన్యలకు ముసలి మొగుడు రాడని, వివాహమైన వారికి నిండు ఐదవతనం కలుగుతుందని అంటారు. అట్లతద్ది నాడు పగటి పూట భోజనం చేయరు. పొద్దు పొడిచాక స్త్రీలు అందంగా ముస్తాబై తోటలు, దొడ్ల వెంట తిరిగి సాయంకాలం తాము చేయబోయే పూజకు అవసరమైన పువ్వులు, పత్రి సమకూర్చుకుంటారు. పగలంతా వీలైనప్పుడల్లా ఊయల ఊగుతారు. ఆ సాయంత్రం ఉమాదేవి (పార్వతి)ని పూజించి చంద్రుడిని చూసి అట్లు తదితర పిండివంటలతో భోజనం చేస్తారు. ఇది అతివల పర్వం. తోటలలో, దొడ్లలో విలాసంగా తిరుగుతూ పత్రి, పువ్వులు సేకరించడం, యథేచ్ఛా విహారం, ఊయలలూగడం, వినోదించడం అంగనలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. తెల్లవారుజామునే చద్ది అన్నం, గోంగూర పచ్చడి, నువ్వుల ఉండ, ఉల్లిపాయ పులుసు వంటివి తినకపోయినా, అట్లతద్ది నోము నోచకున్నా, గోరింటాకు పెట్టుకోకపోయినా, ఉయ్యాల ఊగకపోయినా ముసలి మొగుడు వస్తాడని మరీ భయపెట్టి తమ ఆడపిల్లలు ఈ నోము ఆచరించేలా ఇంట్లోని పెద్దలు చేస్తారు. గోరింటాకు పెట్టుకోవడం ఆడవాళ్లకు వరణీయం. ఆషాఢంలో ఒకసారి, భాద్రపదంలోని ఉండ్రాళ్ల తద్దికి, ఆశ్వయుజంలోని అట్లతద్దికి.. ఇలా ఏడాదిలో మూడుసార్లు అతివలు గోరింటాకు పెట్టుకుంటారు. ఇది ఎంత బాగా పండితే అంత శుభప్రదమని భావిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త కోసం, పెళ్లయిన వారు భర్త ఆయురారోగ్యాల కోసం ఈ వ్రతం చేయడం తెలుగు నాట ఆచారంగా కొనసాగుతోంది.

Review జయ..జయ ఆశ్వయుజి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top