పలు పుణ్యాల ఫాల్గుణం

ఆంగ్లమానం ప్రకారం మూడవ మాసం మార్చి. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మాఘ- ఫాల్గుణ మాసాల కలయిక. మాఘ మాసంలోని కొన్ని రోజులు, ఫాల్గుణ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. మాఘ మాసంలో వచ్చే పర్వాలలో స్వామి దయానంద సరస్వతి, వైకుంఠ ఏకాదశి, మహా శివరాత్రి ముఖ్యమైనవి. మార్చి 6వ తేదీతో మాఘ మాసపు తిథులు ముగుస్తాయి. మార్చి 7వ తేదీ నుంచి ఫాల్గుణ మాస తిథులు ప్రారంభమవుతాయి. ఫాల్గుణ శుద్ధ పాడ్యమితో మొదలయ్యే ఈ మాసపు తిథులు చతుర్థీ వ్రతం, యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, పొట్టి శ్రీరాములు జయంతి, తిరుమల శ్రీవారి తెప్పోత్సవ ప్రారంభ- ముగింపు, రంగ పంచమి, శీతల సప్తమి, పాప విమోచన ఏకాదశి, హోలీకా దహన్‍, హోలీ, శ్రీరామకృష్ణ పరమహంస జయంతి వంటి పుణ్య తిథులు, పర్వాలు, పండుగలతో ముగుస్తాయి. ఆంగ్లమానం ప్రకారం మార్చి 1, మాఘ బహుళ దశమి, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మాసం మార్చి 31, ఫాల్గుణ బహుళ ఏకాదశి, ఆదివారంతో ముగుస్తుంది.

తెలుగు సంవత్సరాలలో ఫాల్గుణ మాసం పన్నెండవ మాసం. ఇది గృహ నిర్మాణానికి అత్యంత అనుకూలమైన మాసమని మత్స్య పురాణం చెబుతోంది. ఈ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభించడం వల్ల సువర్ణ పుత్ర లాభం కలుగుతుందని ప్రతీతి. ధనధాన్యాదులనిచ్చే లక్ష్మీదేవి ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి వేళ జన్మించిందని అంటారు. కాబట్టి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంతో ఆయన ఇష్టసఖి అయిన శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించిన ఈ మాసంలో ఆయనను లక్ష్మీసమేతంగా పూజిస్తే, విశేషంగా ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని పంచాంగకర్తల ఉవాచ. ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పున్నమి కలది కావడం వల్ల ఈ మాసానికి ఫాల్గుణమనే పేరు స్థిరపడింది. ఈ నెలతోనే శిశిర రుతువుకు తెరపడుతుంది. నువ్వులు, ఉసిరిక, చూత కుసుమం (మామిడిపూత) విరివిగా వాడటానికి కొన్ని నెలలు ప్రత్యేకమై ఉన్నాయి. అందులో ఫాల్గుణం ఒకటి. ఇక, దశావతారాల్లో అతి ముఖ్యమైనదైన నృసింహస్వామి ద్వాదశి ఈ మాసంలోనే వస్తుంది. ఇంకా మరికొన్ని ముఖ్య తిథులు, పండుగలు, పర్వాలు కూడా ఉన్నాయి. ఉసిరికాయతో ముడిపడి ఉన్న ఓ తిథి ఈ నెలలోనే వస్తుంది. అది- అమలకైక్యాదశి. అమలకం అంటే ఉసిరి. ఘంటా కర్ణ పూజ, విష్ణుమూర్తికి గురువింద పువ్వులతో పూజ ఫాల్గుణంలో చేయదగినవి. ఈ మాసం తరువాత నుంచి కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. అందుకే దేశంలోని చాలా ప్రాంతాలలో ఈ నెలతో పాత సంవత్సరం ముగుస్తుంది. అలాగే, ఈ ఆంగ్ల మాసంలోని మొదటి ఆరు రోజులు మాఘ మాసపు తిథులు. ఈ తిథుల కాలంలో వచ్చే పర్వాలలో మహా శివరాత్రి, వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనవి, విశేషమైనవి. ఇంకా ఈ మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాల గురించి తెలుసుకుందాం.

మాఘ బహుళ (కృష్ణ) ఏకాదశి, మార్చి 2, శనివారం

ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథం దీనిని విజయైకాదశి అని పేర్కొంటోంది. ఈనాడే రాముడు లంక మీదకు దండెత్తి వెళ్లడానికి గాను సేతువు నిర్మించడాన్ని విజయవంతంగా పూర్తి చేశాడని అంటారు.

మాఘ బహుళ (కృష్ణ) ద్వాదశి, మార్చి 3, ఆదివారం

ఈ తిథికి ముందు రోజు ఉపవాసం ఉండి, ఈ తిథి నాడు తిలస్నానం చేయాలని నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో రాశారు. ఈనాడు తిలద్వాదశీ వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే మరో గ్రంథంలో వివరించారు. మూలా, ఆషాఢ నక్షత్రాలతో కూడిన మాఘ కృష్ణ ద్వాదశిని నీల ద్వాదశి అని కూడా అంటారని నీలమత పురాణం చెబుతోంది.

మాఘ బహుళ (కృష్ణ) త్రయోదశి, మార్చి 4, సోమవారం

మాఘ కృష్ణ త్రయోదశి ద్వాపర యుగాది దినం. ద్వాపర యుగ ప్రమాణ: 8,64,000 సంవత్సరాలు. ఇందులో రెండు పాళ్లు ధర్మం నడుస్తుంది. భగవంతుడు ఆ కాలంలో పీతవర్ణధారిగా ఉంటాడు. ఈ యుగాన్ని తామ్ర యుగమని కూడా అంటారు. శ్మృతి, స్మ•తి ధర్మాలలో సందేహం, ద్వైవిధ్య బుద్ధి ప్రజలలో ఎక్కువ అవుతుంది. సందేహాతిశయం ఉండటం వల్ల దీనికి ద్వాపర యుగం అనే పేరు వచ్చింది. ఈ యుగంలోని ధర్మం ప్రకారం శరీరంలో రక్తం ఉన్నంత కాలం మనుషులు ప్రాణాలు ధరించి ఉంటారు. అడిగిన వారికి దానాలు చేస్తారు. ద్వాపర యుగ సంధిలో వేదవ్యాసుడు అవతరించి వేదాలను విభాగిస్తాడు. ధర్మశాస్త్ర పురాణేతిహాసాలను రచి స్తాడు.

మాఘ బహుళ (కృష్ణ) చతుర్దశి, మార్చి 4-5 తేదీలు, సోమ/మంగళవారాలు

మాఘ కృష్ణ చతుర్దశి మహా శివరాత్రి పర్వం. ఈనాడు రటంతీ చతుర్దశీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో రాశారు. అరుణోదయానే స్నానం చేసి యమతర్పరణం చేయాలని శాస్త్ర వచనం. అలాగే, ఈనాడు కృష్ణ చతుర్దశీ వ్రతం, సర్వకామ వ్రతం చేస్తారని హేమాద్రి వ్రతఖండంలో ఉంది. ఈ తిథి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి యమునికి గల పద్నాలుగు నామాలతో తర్పణం నువ్వులు, దర్భ, నీరు వీనితో ఇవ్వాలి. ఈనాడు పులగం తినాలి. శివుడికి లక్ష బిల్వార్చనం చేయాలి. తుమ్మి పూలతో పూజించాలి. శివరాత్రి సోమవారంతో కలిసి వస్తే విశేష ఫలప్రదమవుతుందని అంటారు.
(మహా శివరాత్రి పర్వం విశేషాలు ప్రత్యేక పేజీలలో చదవవచ్చు).

మాఘ బహుళ (కృష్ణ) అమావాస్య, మార్చి 6, బుధవారం

ఆమాదేర్‍ జ్యోతిషీ ఈ తిథిని మన్వాదిగా పేర్కొంది. ఈనాడు నవనీతధేను దానం చేస్తారని పురుషార్థ చింతామణిలో ఉంది. ఈనాడు పితృశ్రాద్ధం చేయడం అధిక ఫలదాయకమని అంటారు. ఇది కుంభ సంక్రాంతి సంక్రమణ కాలం. కాబట్టి ఈనాడు యాదవ రాముడిని, అనగా బలరాముడిని పూజించాలి. ఉపవాసం ఉండాలని హేమాద్రి పండితుని ఉవాచ. ఈ సంక్రాంతికి సుజన్మా వాప్తి వ్రతం ఆచరించి, సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. కుంభ సంక్రమణ ప్రయుక్త విష్ణుపద పుణ్య కాలం.

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి, మార్చి 7, గురువారం

ఈనాడు భద్రచతుష్టయ వ్రతంతో పాటు గుణావాప్తి, పయో మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

ఫాల్గుణ శుద్ధ తదియ, మార్చి 9, శనివారం

ఈ తిథి నాడు మధూక వ్రతం, సౌభాగ్య తృతీయా వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

ఫాల్గుణ శుద్ధ చవితి, మార్చి 10, ఆదివారం

ఈనాడు అవిఘ్న గణపతి వ్రతం చేస్తారని స్మ•తి కౌస్తుభంలో పేర్కొన్నారు. ఈ తిథి నాడు మంగళకరమైన డుంఢి రాజవ్రతం ఆచరించాలి. నువ్వు బిళ్లలతో భోజనం, నువ్వుల దానం, హోమం పూజ, అగ్ని వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. అలాగే ఈ తిథి.. శ్రీరామకృష్ణ పరమహంస జనన తిథి.

ఫాల్గుణ శుద్ధ పంచమి, మార్చి 11, సోమవారం

అనంత పంచమీ వ్రతం ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

ఫాల్గుణ శుద్ధ సప్తమి, మార్చి 13, బుధవారం

చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్న ప్రకారం ఈనాడు- అర్క సంపుట సప్తమి, కామదా సప్తమి, త్రిగత సప్తమి, ద్వాదశ సప్తమి వంటి తదితర వ్రతాలు ఆచరించాలని ఉంది.

ఫాల్గుణ శుద్ధ అష్టమి, మార్చి 14, గురువారం

తిథి తత్వం అనే గ్రంథంలో పేర్కొన్న ప్రకారం ఈనాడు లలిత కాంతీదేవి వ్రతం ఆచరించాలి. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే మరో గ్రంథంలో ఈ తిథిని దుర్గాష్టమిగా వర్ణించారు.

ఫాల్గుణ శుద్ధ నవమి, మార్చి 15, శుక్రవారం

ఈనాడు ఆనంద నవమీ వ్రతం ఆచరించాలి. అలాగే, దుర్గాపూజ చేయాలి. ఈ వివరాలు చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, మార్చి 17, ఆదివారం

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు చిత్రరథుడు పరశురాముని పూజించాడని ఒక పురాణ గాథ. ఈ ఏకాదశినే గోదావరీ తీరవాసులు కోరుకొండ ఏకాదశి అంటారు. కోరుకొండలోని నరసింహస్వామి కోవెలలో ఈనాడు గొప్ప తిరునాళ్లు సాగుతాయి. కాకతీయుల అనంతరం ప్రసిద్ధికెక్కిన కాపయ నాయకుని కాలం నుంచి ప్రసిద్ధమైన క్షేత్రం ఇది. వేలకొద్దీ జనం వస్తారు ఈనాడు అక్కడికి. గోదావరి ప్రాంతంలో ఈ తీర్థకాలాన్ని పురస్కరించుకుని ‘కోరుకొండ ఏకాదశికి కోడి గుడ్డులంత’ అనే సామెత ఒకటి ఉంది

ఈ సామెత మామిడికాయలకు సంబంధించినది. మకర సంక్రాంతికి మంచి పూత మీదుండే మామిడి.. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాటికి కోడిగుడ్డంత పరిమాణానికి ఎదుగుతాయి.
ఇక, ఈ ఏకాదశిని ఆమలక్యేకాదశి అనీ అంటారు. ఆమలకి అంటే ఉసిరి. ఉసిరితో ముడిపడిన పర్వాలు ఫాల్గుణ మాసంలో రెండు ఉండగా, ఒకటి- ఈ ఏకాదశి నాడు ఉసిరి చెట్టు కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం. రెండు- ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు ఆమలకీ వ్రతం ఆచరించడం. ఈ రెండు వ్రతాలను బట్టి ఉసిరికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉసిరి చెట్టు జనార్థన స్వరూపమని భావిస్తారు.

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి, మార్చి 18, సోమవారం

పుష్యమితో కూడిన ద్వాదశిని గోవింద ద్వాదశి అంటారు. ఈనాడు గంగా స్నానం మహా పాతక నాశనంగా ఉంటుందని తిథి తత్వంలో పేర్కొన్నారు. ఈనాడు మనోరథ ద్వాదశి, సుకృత ద్వాదశి, సుగతి ద్వాదశి, విజయా ద్వాదశి తదితర వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు. అలాగే, ఉసిరికాయతో ముడిపడిన ఆమలకీ వ్రతం కూడా చేస్తారు.

ఫాల్గుణ శుద్ధ చతుర్దశి, మార్చి 20, బుధవారం

ఈనాడు లలిత కాంత్యాఖ్యదేవీ వ్రతం చేస్తారని తిథితత్వంలోనూ, మహేశ్వర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలోనూ ఉంది.

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి, మార్చి 21, గురువారం

పూర్ణిమ ఘడియల్లోనే పాడ్యమి కూడా ప్రవేశిస్తోంది. ఈనాడు వసంతారంభోత్సవం చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీలో ఉంది. ఈనాడు ధూళి వందనం అనే పండుగ చేస్తారని స్మ•తి కౌస్తుభంలో రాశారు. అలాగే, ఆమ్ర పుష్ప భక్షణం చేయాలని కూడా ఆ పుస్తకంలో ఉంది. తైలాభ్యంగం చేసి డోలోత్సవం నిర్వహించాలని అంటారు.

ఫాల్గుణ బహుళ (కృష్ణ) విదియ, మార్చి 22, శుక్రవారం

ఈనాడు కామ మహోత్సవం నిర్వహించాలని స్మ•తి కౌస్తుభం అనే గ్రంథంలో రాశారు.

ఫాల్గుణ బహుళ (కృష్ణ) తదియ, మార్చి 23, శనివారం

ఫాల్గుణ కృష్ణ తదియ కల్పాది దినమని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది.

ఫాల్గుణ బహుళ (కృష్ణ) చవితి, మార్చి 24, ఆదివారం

ఫాల్గుణ కృష్ణ చతుర్థి వ్యాసరాజ స్మ•తి దినం. వ్యాసరాయ స్వామి కృష్ణరాయల వారి సమకాలికుడు. కృష్ణదేవరాయల వద్ద ఆయనకు ఎక్కువ పలుకుబడి ఉండేది. వ్యాసరాజును చతుర్థాశ్రమంలో ప్రవేశపెట్టడానికి గురువు అధికమైన ఆసక్తిని కనబరిచారు. కానీ, వ్యాసరాయనికి వయసు ఇంకా సరిపోకపోవడం వల్ల దృష్టి ఇంటి మీదకు మరలింది. అందుచేత ఒకనాడు అతను హఠాత్తుగా ఆశ్రమాన్ని వీడి ఇంటిదారి పట్టాడు. దారిలో ప్రయాణపు బడలిక చేత ఒక చెట్టు నీడన విశ్రమించి.. నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు లక్ష్మీనారాయణులు ఆయనకు కలలో కనిపించి అతనిని భూలోకం మీదికి ఒక ఘనకార్యాన్ని చేయడానికి పంపి ఉన్నామనే సంగతి మరిచిపోవద్దని గుర్తు చేశారు. వ్యాసరాజు మేలుకొని ఇంటికి వెళ్లడం మానివేసి తిరిగి ఆశ్ర మానికి చేరుకున్నాడు. గురువు ఆయనను చతుర్థాశ్రమంలో ప్రవేశ పెట్టాడు. ఆ ఆశ్రమంలో ప్రవేశించిన వ్యాస రాయలు లౌకిక విష యాలపై అశ్రద్ధ వహించలేదు. విదేశీ రాయబారులు వచ్చి ఆయనను కలుసుకునే వారు. తాను తలపెట్టిన సమర సన్నాహాల సందర్భా లలో కృష్ణదేవరాయలు వ్యాసరాజస్వామి సలహాలు, సూచనలు పొందేవాడు. రాయచూరు యుద్ధంలో కృష్ణరాయలకు కలిగిన విశేష విజయానికి వ్యాసరాజ స్వామి సలహాయే కారణమని అంటారు.

ఫాల్గుణ బహుళ (కృష్ణ) అష్టమి, మార్చి 28, గురువారం

కృత్యరాజ సముచ్చయం అనే గ్రంథంలో ఈనాడు సీతాపూజ చేయాలని ఉంది. ఇది సీతాదేవి పుట్టిన రోజు పండుగ. సీత రాముని భార్య అనే విషయం తెలిసిందే. ఆమె జనక మహారాజు పుత్రిక. ఆమె పూర్వజన్మలో వేదవతి అనే కన్యక. వేదవతి కథ చదవదగినది.

కుశధ్వజుడు అనే మునికి మాలావతి అనే భార్య ఉండేది. ఈ దంపతుల కుమార్తె వేదవతి. కుశధ్వజుడు వేదాలు చదువుతూ ఉండగా, ఈమె పుట్టడం వల్ల, ఈమె పుట్టినపుడు పురిటింటి నుంచి వేదఘోష వెలువడుట వల్ల ఆ శిశువుకు వేదవతి అనే పేరు పెట్టారు. శిశువు పెరిగి పెద్దదయ్యింది. ఈమెను విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేస్తానని కుశధ్వజుడు చెబుతుండే వాడు. అంతలో ఒకసారి దంభుడు అనే రాక్షసుడు వచ్చి ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరాడు. కుశధ్వజుడు అందుకు నిరాకరించాడు. దీంతో రాక్షసుడు ఒక రాత్రివేళ దొంగచాటుగా వచ్చి నిద్రపోతున్న కుశధ్వజుడిని హతమార్చాడు. అప్పుడు అతని భార్య మాలావతి భర్త మరణాన్ని తట్టుకోలేక తానూ ప్రాణాలు విడిచింది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి తండ్రి నిశ్చయం ప్రకారం విష్ణువును పతిగా కోరి తపస్సు చేయడానికి వెళ్లింది. తపోదీక్షలో ఉన్న ఆమెను ఒకసారి రావణుడు దిగ్విజయార్థం వెళ్తూ చూశాడు. ఆమె రూపానికి మోహితు డయ్యాడు. తనను వరించాలని కోరాడు. విష్ణు మూర్తిని తప్ప ఇతరులను తాను పెళ్లాడనని వేదవతి ఖరాఖండీగా చెప్పింది.

రావణుడు మోహపారవశ్యం వీడక ఆమెను బలాత్కారంగా ముట్టుకున్నాడు. అప్పుడామె కఠిన స్వరంతో- ‘నువ్వు నీచుడవని తెలిసీ నీతో మాట్లాడాను. నువ్వు నన్ను అవమానించావు. అవమానితమైన ఈ దేహం ఇప్పుడే త్యజిస్తున్నాను. నేను అయోజనిగా ఈ భూమీ మీద తిరిగి పుట్టి నిన్ను పుత్ర మిత్ర కళత్రంగా నాశనం చేయడానికి కారణభూతురాలిని అవుతాను’ అని యోగాగ్నిని సృష్టించు కుని అందులోకి దూకి దహనమైంది.

అనంతరం ఆమె లంకలో ఒక తామర కొలనులోని ఒక తామర పువ్వు బొడ్డులో సూక్ష్మరూపంతో దాగి తపస్సు చేసుకోసాగింది. శివపూజ కోసం రావణుడు ఒకనాడు తామరపువ్వులను కోస్తూ వేదవతి దాగిన పువ్వును కూడా కోశాడు. అన్ని పువ్వుల కంటే ఈ పువ్వు బాగా బరువుగా ఉంది. కారణం ఏమిటోనని అతను ఆ పువ్వును చీల్చి చూశాడు. అందులో నుంచి కన్యక బయటకు వచ్చింది.

‘రావణా! నన్ను వదులు. లేకుంటే నువ్వు చచ్చిపోతావు’ అని ఆ కన్యక పలికింది. అయినా సరే, రావణుడు ఆ కన్యకను తన మందిరానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆస్థాన జ్యోతిష్యులతో సంప్రదించాడు. ఆమె జన్మ లంకకు చాలా అరిష్ట సూచకంగా ఉందని వారు చెప్పారు. అప్పుడు రావణుడు ఆమెను ఒక బంగారపు పెట్టెలో పెట్టి సముద్రంలోకి వదిలేశాడు. అది అలల తాకిడికి కొట్టుకునిపోయి జనక మహారాజు రాజ్యంలో భూస్థాపితమైంది. జనకుడు ఒకసారి యజ్ఞశాల నిమిత్తం భూమిని దున్నిస్తుం డగా, ఒక నాగలికర్రుకు ఈ బంగారపు పెట్టె తగిలింది. ఆయన దానిని వెలికి తీయించి తెరిచి చూశాడు. ఒక కన్య బయపడింది. ఆనాడు ఫాల్గుణ అష్టమి. నాగలి చాలును సంస్క•తంలో సీత అంటారు. నాగలిచాలులో లభ్యమైనందున ఆమెకు సీత అనే పేరు పెట్టారు. ఆమెను కాల క్రమంలో రాముడికి ఇచ్చి వివాహం చేశారు. సీత తాను వేదవతిగా ఉన్నప్పుడు పలికినట్టే.. సీతగా పుట్టి లంకకు చేటు తెచ్చింది. అదెలాగో నన్న విషయం అందరికీ తెలి సిందే. సీతాదేవి పుట్టిన ఫాల్గుణ కృష్ణ అష్టమి నాడు సీతాదేవిని పూజిస్తే పుణ్యము. గ్రంథాంత రాల్లో ఈ తిథి నాడు కాలా ష్టమి, శీతలాష్టమి అనే పర్వాలు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు.

ఫాల్గుణ బహుళ (కృష్ణ) ఏకాదశి, మార్చి 31, ఆదివారం

కాశ్మీర్‍లో ఈనాడు ఛందో దేవపూజ చేస్తారని నీలమత పురాణం చెబుతోంది. ఈనాడు కృష్ణైకాదశీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. మంజుఘోష అనే అప్సరస మేధావి అనే ముని తపస్సుకు భంగం కలిగించింది. దీంతో ఆ ముని ఆగ్రహించి ఆమెకు శాపం ఇచ్చాడు. ఫాల్గుణ కృష్ణ ఏకాదశి నాడు ఆమె ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శాప కారణమైన పాపాన్ని పోగొట్టుకుంది. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ ఏకాదశిని పాపమోచిన్యేకాదశి అనీ, గదాధర పద్ధతిలో పాపనాశిన్యే కాదశి అనీ వర్ణించారు. ఇది శ్రీ చైతన్య మహాప్రభు జననం సంభవించిన దినం.

అమలైకాదశి విశిష్టత

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – మార్చి 17, ఆదివారం
కార్తీక మాసంలో మాదిరిగానే ఫాల్గుణ మాసంలోనూ మళ్లీ ఉసిరిక ఉపయోగానికి రెండు రోజులను మన పెద్దలు ప్రత్యేకించారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వివరణలో ‘అమలకే వృక్షే జనార్దన:’ అని ఆమాదేర్‍ జ్యోతిషీ తదితర గ్రంథాలలో ఉంది. ఆమలక (ఉసిరి) వృక్షం జనార్దన స్వరూపమనీ, దాని కింద అమలైకాదశి వ్రతాన్ని నిర్వహించాలని శాస్త్ర వచనం. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు ఆమలకి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది.
చైత్ర మాసంలో ఆమలక ఫలాలు వైద్యానికి మంచివని అనుభవజ్ఞుల మాట. దీనిని బట్టి కార్తీక మాసం నుంచి చైత్ర మాసం వరకు గల ఆరు మాసాల్లోనూ ఉసిరిని ఏదో విధంగా ఆహారంగా తీసుకోవాలని మన పెద్దల నియమం.
అధిక మాస ప్రశంస లేని సాధారణ సంవత్సరాల్లో మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. ఆ ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు నామాలు ఉన్నాయి. వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు.
విష్ణువు చర్యలను బట్టి శయనైకాదశి, పరివర్తనైకాదశి, ప్రభోదిన్యేకాదశి,
వ్రత నియమాలను బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి,
వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రైకాదశి మొదలైనవి ఏర్పడ్డాయి. కానీ, అన్నింటిలోకి ఒక పండుతో సంబంధించిన ఏకాదశి మాత్రం అమలైకాదశి మాత్రమే. ఏకాదశి వంటి గొప్ప తిథిలో ఉసిరిని జత చేయడం వల్లనే ఆమలికలో ఏదో విశిష్టత ఉందని భావించాలి.
మన తెలుగు సంప్రదాయంలో కొన్ని పండుగలు వచ్చే నెలలో కొన్ని ఫలాలు పూజనీయం, వరణీయమై భాసిల్లుతున్నాయి. వాటిని ఆయా తిథుల్లో భుజించాలని మన పెద్దలు నియమం విధించారు. దీనివల్ల ఎనలేని ఆరోగ్యం చేకూరేలా వారు నియమాలు రూపొందించారు. అటువంటి వృక్షాలు, ఫలాలతో ముడిపడిన ముఖ్యమైన కొన్ని తిథుల వివరాలు..
చైత్ర మాసం అశోక కలికాప్రాశనం.
ఫాల్గుణ మాసం ఆమ్రపుష్ప భక్షణం.
కార్తీకం బిల్వపత్ర పూజ.

తెలుగు మాసాలలో చివరిదైన ఫాల్గుణ మాసం ఎన్నో పుణ్య తిథులను కలిగి ఉంది. ఎన్నో వ్రతాలు, మరెన్నో పండుగలు.. ప్రత్యేకించి చేయవలసిన దైవారాధనలకు ఈ మాసం వేదికగా అనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో సంతానాన్ని ఆశించే వారు ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు పన్నెండు రోజుల పాటు ‘పయో వ్రతం’ చేస్తుంటారు.
ఫాల్గుణ శుద్ధ తదియ రోజున ‘మధుకతృతీయ వ్రతం’ ఆచరించే సంప్రదాయం కొన్ని తావుల్లో ఉంది.
ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ‘పుత్ర గణపతి వ్రతం’ ఆచరించాలని అంటారు.
ఫాల్గుణ శుద్ధ అష్టమి రోజున ‘బుధాష్టమీ వ్రతం’.. ఫాల్గుణ శుద్ధ నవమి రోజున సరస్వతీ దేవిని ఆరాధిస్తూ ‘ఆనంద నవమి వ్రతం’ నిర్వహించుకోవడం సంప్రదాయం. ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని ‘ఆమలక ఏకాదశి’ అని వ్యవహరిస్తారనే విషయం ముందే తెలుసుకున్నాం. ఈ రోజున ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తిని పూజించడం వలన, ఉపవాస, జాగరణలు చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాల్లో ఉంది. ఇక, తన తపస్సుకు భంగం కలిగించిన మన్మథుడిని శివుడు తన మూడో కన్నుతో భస్మం చేసిన తిథి.. ఫాల్గుణ శుద్ధ చతుర్దశి. దీనికి గుర్తుగానే ఈ రోజున కామదహనం జరుపు తారు. ఈ పండుగ చేసే సందడి పట్టణాల్లో కన్నా పల్లెల్లో ఎక్కువగా ఉంటుంది.
ఫాల్గుణ శుద్ధ చతుర్దశి మర్నాడే.. అంటే ఫాల్గుణ పూర్ణిమ నాడే ‘హోలికా’ అనే రాక్షసి సంహారం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘హోలీ’ పండుగ నిర్వహించుకుంటారు.
ఇలా సంతాన భాగ్యాలను, విజయాలను కోరుకునే వ్రతాలు, సందడిగా సంతోషాలను పంచే పండుగలతో ఫాల్గుణ మాసం ఆబాల గోపాలానికి ఆనందాన్ని పంచుతుంది. బహుశా చైత్రంలో వచ్చే వసంతానికి స్వాగతం పలుకుతూనే ఫాల్గుణంలో ఈ ఆనందోత్సాహాల పర్వాలు వచ్చి.

Review పలు పుణ్యాల ఫాల్గుణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top