పుష్యశ్యామలం

2024- జనవరి 1, సోమవారం, మార్గశిర బహుళ పంచమి నుంచి
2024- జనవరి 31, బుధవారం, పుష్య బహుళ పంచమి వరకు..
శ్రీశోభకృతు నామ సంవత్సరం- మార్గశిరం-పుష్యం- హేమంత రుతువు-ఉత్తరాయణం

ఆంగ్లమానం ప్రకారం జనవరి మాసం కొత్త ఏడాదిలో వచ్చే తొలి నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర – పుష్య మాసాల కలయిక. మార్గశిర మాసంలోని కొన్ని రోజులు, పుష్య మాసంలోని మరికొన్ని రోజుల ఈ నెలలో కలుస్తాయి. జనవరి నుంచి వరుసగా ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం. జనవరి 1, మార్గశిర బహుళ పంచమి నుంచి జనవరి 11 మార్గశిర బహుళ అమావాస్య వరకు మార్గశిర మాస తిథులు, ఆపై జనవరి 12 పుష్య శుద్ధ పాడ్యమి నుంచి జనవరి 31 పుష్య బహుళ పంచమి వరకు పుష్య మాస తిథులు కొనసాగుతాయి. ఈ మాసంలో వచ్చే ప్రధాన పర్వాలలో సంక్రాంతి పెద్దపండుగ. ఇది మనకు సౌరమానాన్ని అనుసరించే వచ్చే పర్వం.

హేమంత రుతువు కాలంలో వచ్చే పుష్య మాసంలో పూసగుచ్చే పొద్దుండదని నానుడి. అంటే, పగటి సమయం తక్కువగా ఉంటుంది. తొందరగా చీకటి పడిపోతుంది. ఈ నిండార శీతాకాలంలో మంచు ఉధృతంగా కురుస్తుంది. చలి జివ్వుమనిపిస్తుంది. మంచు తెరల దుప్పటి ప్రకృతిని పరదాలా చుట్టుకుంటుంది. ఆకుపచ్చని వర్ణం తెలవారుతూనే శ్వేతవర్ణపు మంచు బిందువులతో స్నానమాడుతున్నట్టు గోచరిస్తుంది. ఇక, ఏ ఇల్లు చూసినా అందమైన రంగవల్లులు హరివిల్లుల్లా పరుచుకుని ఉంటాయి. పాడిపంటలు ఇళ్లకు చేరుతుంటాయి. పిల్లల భోగిమంటల సన్నాహాలు, పెద్దల పండుగ పిండివంటల హడావుడి.. ఇవన్నీ కొత్త క్రాంతిని చేకూరుస్తూ సంక్రాంతిని ముంగిటకు తెస్తాయి. పుష్యం అంటే పోషణ శక్తి గలదని అర్థం. పాడిపంటలు సమృద్ధిగా పండి.. జనులకు కావాల్సిన ఆహారాన్ని నిండుగా సమకూర్చే మాసం ఇది. సంక్రాంతి, వైకుంఠ ఏకాదశి వంటి పవిత్ర పర్వాలు, విశేష దినాలకు నెలవైన పుణ్యప్రదమైన మాసం పుష్యం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం పుష్యంలోనే జరుగుతుంది. ఉత్తరాయణం అంటే దైవిక కాలం. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సందర్భాన్ని పురస్కరించుకొని జరుపుకొనే పర్వమే సంక్రాంతి. పుష్య మాసంలో పెద్దగా శుభ కార్యాలు తలపెట్టరు. ఈ నెలలో గృహ నిర్మాణాన్ని ప్రారంభించరాదని, చోరభయం వెంటాడుతుందని మత్స్య పురాణం చెబుతోంది. అలాగే, ఈ మాసంలో ఆవు ఈనితే ఆడపడుచుకు ఇచ్చి వేయాలనే సంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఇంకొన్ని ప్రాంతాల్లో వ్యవసాయదారులు పుష్యంలో గేదె ఈనితే శాంతి చేస్తారు.

చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం కాబట్టి ఇది పుష్య మాసమైంది. ఆధ్య్యాత్మికంగా జపతపాలకు, ధ్యాన పారాయణాలకు, వేదాధ్యయనానికి అనువైన మాసమిది. శ్రావణ పౌర్ణమి నుంచి పుష్య పౌర్ణమి వరకు గల కాలం వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైనదని పండితులు చెబుతారు. పై లోకాలలో ఉండే పితృ దేవతలను పూజించి, అందరూ దోషరహితులయ్యేందుకు అవకాశం కల్పించేది కూడా ఈ మాసమే. పుష్య మాసంలోనే పంటలు చేతికి అందిన సంతోషంతో రైతులు ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుసమేతంగా పూజిస్తారు. ఈ మాసంలో గృహ ప్రవేశాలు, వివాహ ముహూర్తాలు, ఇతర శుభ కార్యాలు అంతగా ఉండవు. అయితే, సాధారణ పూజలు, పెద్దల స్మరణకు, ఇతర పుణ్యకార్యాలను ఆచరించడానికి మాత్రం ఇది విశేష మాసం. పుష్య పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం విశేష పుణ్యాన్ని కలుగచేస్తుంది. ఈ రోజు చేసే దానాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి.
ఆశ్వయుజం అమ్మవారికి, భాద్రపదం వినాయకుడికి, మార్గశిరం శ్రీమహా విష్ణువుకు, సుబ్రహ్మణ్యేశ్వరుడికి, కార్తీకం పరమశివుడికి ప్రీతికరమైన మాసాలైతే.. పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ మాసానికి అధిపతి ఆయనే. ఇక, నక్షత్రాధిపతి బృహస్పతి. ఈ మాసంలో శని, బృహస్పతిలను పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. నెల పొడవునా తనను పూజించే వారి పట్ల శనైశ్చరుడు ప్రసన్నుడై శుభాలను ప్రసాదిస్తాడని పురాణ ప్రవచనం. పుష్య మాసంలో అమావాస్య రోజు శని గ్రహానికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నుంచి నివృత్తి పొందవచ్చు. ఆ రోజు ఇంకా వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వల్ల శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు.

మార్గశిర బహుళ పంచమి
జనవరి 1, సోమవారం

ఆంగ్లమానం ప్రకారం జనవరి సంవత్సరానికి ప్రారంభ మాసం. ఈ నెలలోని మొదటి రోజు ఆంగ్ల నూతన సంవత్సర దినం. కొత్త జీవితాన్ని నూతనోత్సాహంతో ప్రారంభించడానికి సన్నాహకంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు. ఇక, తిథి ప్రకారం.. పంచమి తిథి నాగులను పూజించడానికి ఉద్ధిష్టమైనది. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈనాటి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం పరిసమాప్తి అవుతుంది.

మార్గశిర బహుళ షష్ఠి
జనవరి 2, మంగళవారం

షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన తిథి. ఈనాడు స్కందుడు, కార్తికేయుడు, కుమారస్వామి అనే ఇత్యాధి నామాలు కలిగిన సుబ్రహ్మణేశ్వరుడిని విశేషంగా పూజిస్తారు.

మార్గశిర బహుళ సప్తమి
జనవరి 3, బుధవారం

మార్గశిర బహుళ సప్తమి తిథి నాడు ఫల సప్తమీ వ్రతం, తమశ్చరణ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

మార్గశిర బహుళ అష్టమి
జనవరి 4, గురువారం

మార్గశిర బహుళ అష్టమి నాడు కాలాష్టమి వ్రతాన్ని, పూజల్ని చేస్తారు. అష్టమి తిథి నాడు కాలభైరవాష్టమిగా భావించి ఈ రోజున భైరవ జయంతి వ్రతం ఆచరించే ఆచారం కూడా ఉందని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఇంకా ఈ తిథి నాడు అనఘాష్టమీ వ్రతం, కృష్ణాష్టమీ వ్రతం, రుక్మిణ్యష్టమీ వ్రతం, కాలాష్టమీ వ్రతం మొదలైనవి చేస్తారని అంటారు.

మార్గశిర బహుళ నవమి
జనవరి 5, శుక్రవారం

మార్గశిర బహుళ నవమి నాడు రూప నవమీ వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

మార్గశిర బహుళ ఏకాదశి
జనవరి 7, ఆదివారం

మార్గశిర బహుళ ఏకాదశికే ‘సఫలైకాదశి’ అని కూడా పేరు. తెలిసీ, తెలియక ఉపవాసం ఉంటే చాలు.. ఈనాడు తగిన ఫలాన్ని పొందుతారని ప్రతీతి. అందుకు నిదర్శనంగా నిలిచే కథ కూడా ఒకటి ఉంది. లుంపకుడు అనే వాడు మహిష్మంతుని కొడుకు. అతను దేశం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. అతనలా తిరుగుతుండగా, ఒక ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. అందుచేత అతను బలవంతాన ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఇదంతా తనకు తెలియకుండానే మార్గశిర కృష్ణ ఏకాదశి నాడు జరిగింది. అయినా, లుంపకుడు ఆ వ్రతం యొక్క ఫలితాన్ని పొందగలిగాడు. అందుచేత ఈ ఏకాదశికి సఫలైకాదశి అనే పేరు వచ్చింది.

మార్గశిర బహుళ ద్వాదశి
జనవరి 8, సోమవారం

మార్గశిర బహుళ ద్వాదశి.. మల్ల ద్వాదశి, కృష్ణ ద్వాదశిగా ప్రసిద్ధి. ఈనాడు ఈ రెండు వ్రతాలు చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

మార్గశిర బహుళ త్రయోదశి
జనవరి 9, మంగళవారం

మార్గశిర బహుళ త్రయోదశి తిథిని గురించి చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో యమ దర్శన త్రయోదశిగా వర్ణించారు. ఈనాడు యముడిని విశేషంగా పూజించాలి.

మార్గశిర బహుళ చతుర్దశి
జనవరి 10, బుధవారం

సాధారణంగా ప్రతి మాసంలో వచ్చే చతుర్దశి తిథి మాస శివరాత్రి తిథి. ఈనాడు శివుడిని తగినరీతిలో పూజించాలి. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరించే సంప్రదాయం ఉంది.

మార్గశిర బహుళ అమావాస్య
జనవరి 11, గురువారం

మార్గశిర బహుళ అమావాస్య గురించి.. మహోదధ్యమావాస్య అని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో రాశారు. దీనినే బకులామావాస్య అనీ అంటారు. పాలతో పాయసం వండి నివేదిస్తారు. దీన్నే ‘బకులక్షీరేణ పాసంకృత్యా’ అంటారు. ఈనాటి నుంచే ఉత్తరాషాఢ కార్తె ఆరంభమవుతుంది.

పుష్య శుద్ధ పాడ్యమి
జనవరి 12, శుక్రవారం

పుష్య శుద్ధ పాడ్యమి తిథానుసారం పుష్య మాసపు ఆరంభ దినం. అలాగే, ఈనాడు స్వామి వివేకానంద జయంతి దినం. యువతను ఆయన జాగృతం చేసినందుకు స్మరణగా ఈనాడు దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

పుష్య శుద్ధ విదియ
జనవరి 13, శనివారం

పుష్య శుద్ధ విదియతో చంద్ర దర్శనం ప్రారంభమవుతుంది. ఈనాడు ఆరోగ్య ద్వితీయ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, నాలుగు రోజుల పాటు సాగే విష్ణు వ్రతాన్ని కూడా ఈనాడే మొదలుపెట్టాలని అంటారు.

పుష్య శుద్ధ తదియ
జనవరి 14, ఆదివారం

పుష్య శుద్ధ తదియ భోగి పర్వదినం. సాధారణంగా ఏదైనా ప్రధాన పర్వానికి ముందు రోజును భోగి అనడం కద్దు. అంటే అట్లతద్దికి ముందు వచ్చే తిథిని అట్లతద్ది భోగి అంటారు. అలాగే పెద్ద పండుగగా వ్యవహరించే సంక్రాంతికి ముందు వచ్చే తిథిని భోగి అంటారు. మూడు రోజుల సంక్రాంతి పర్వాల్లో తొలి రోజైన భోగిని కీడు పండుగగానూ వ్యవహరిస్తారు. ఈనాడు పిల్లలు భోగిమంటలు వేస్తారు. పిల్లలకు కలిగిన దిష్టి దోషాలు పోవడానికి వారికి తలంటి పోసిన తరువాత తలపై భోగిపళ్లను జారవిడుస్తారు. దీనివల్ల వారికున్న గ్రహ, దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్మిక. సూర్యుడు దక్షిణాయణంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది. అందుకే భోగి మంటలు వేసే సంప్రదాయం ఏర్పడింది. సూర్యుడు ఉత్తరాయణం (సంక్రాంతి)లోకి మళ్లింది మొదలు వాతావరణంలో వేడి పెరుగుతుంది. ఈ వేడిని, వాతావరణ మార్పును తట్టుకునేందుకే భోగి మంటలతో రాబోయే ఈ మార్పునకు శరీరాన్ని సన్నద్ధం చేసినట్టవుతుంది.
ఈనాడు ప్రధానంగా ముగ్గురు దేవతలను పూజించాలని అంటారు. అందులో ఒకరు ఇంద్రుడు. మరో కథ ప్రకారం ఈనాడు బలి చక్రవర్తి పాతాళానికి తొక్కిన దినంగా కూడా భోగిని భావిస్తారు. భోగి నాడే విష్ణువు వామనడై బలి చక్రవర్తి నెత్తిన మూడో పాదాన్ని పెట్టి అతనిని పాతాళానికి తొక్కేశాడు. బలిని మూడు అడుగులతో అణచివేసిన దినం కాబట్టి, సంక్రాంతి పర్వం మూడు రోజులనే ఆచారం ఏర్పడిందని కూడా అంటారు. అందుకే, ఈనాడు వామన నామస్మరణ, బలిచక్రవర్తి ప్రస్తుతి చేయడం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచారం. గోదాదేవిని కూడా ఈనాడు విశేషంగా పూజిస్తారు. శ్రీరంగంలో కొలువైన శ్రీరంగనాథుడిని తప్ప మానవమాత్రులు ఎవరినీ పెళ్లి చేసుకోనని గోదాదేవి తండ్రితో తెగేసి చెబుతుంది. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం ఆమె ధనుర్మాస వ్రతం పూనుతుంది. ఈ వ్రతం ఆచరించిన నెల రోజుల్లో ఒక్కో రోజు తనకు కలిగిన అనుభూతుల్ని వర్ణిస్తూ తమిళంలో కవిత చెప్పి, రోజుకు ఒక పాశురం (మన తెలుగులో సీస పద్యం వంటిది) చొప్పున ముప్ఫయి రోజులు ముప్ఫై పాశురాలను రచించి స్వామికి కృతి ఇచ్చేది. ఆ నెల రోజులు ఆమె పొంగలి మాత్రమే తీసుకునేది. ఈ ముప్ఫయి పాశురాలతో కూడిన గ్రంథమే ‘తిరుప్పావై’. తిరుప్పావై పూర్తయిన ముప్ఫయ్యోనాడు స్వామి ప్రత్యక్షమై ఆమెను వివాహమాడతాడు. మహిమోపేతమైన ఇంతటి కార్యం నడిచిన పుణ్య దినం, పర్వదినం భోగి.

పుష్య శుద్ధ చవితి
జనవరి 15, సోమవారం

తత్ర మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరితః
సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరరాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః
సంక్రాంతి ఆగమనాన్ని తెలిపే ఈ శ్లోకం జయసింహ కల్పద్రుమంలోనిది. ‘సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది’ అని పై శోక్లానికి అర్థం.
పుష్య శుద్ధ చవితి నాడే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరగతుడవుతాడు. ఈనాటి నుంచి ఉత్తరాయణ దినాలు ఆరంభమవుతాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాడు మకర సంక్రాంతి పర్వాని ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల సంక్రాంతి పర్వంలో సంక్రాంతి రెండో రోజు. దీనినే పెద్దల పండుగ అనీ అంటారు. పెద్ద పండుగ (సంక్రాంతి)తో పాటు కనుమ నాడు కూడా పితృదేవతలకు తర్పణాలు విడిచే ఆచారం కొందరిలో ఉంది. పెద్దల పేరుతో ఈ రోజుల్లో ఆరుబయట అన్నం ముద్దలుగా చేసి ఉంచుతారు. పితృదేవతల ప్రీత్యర్ధం వారికి ఇష్టమైనవి కూడా వండి బయట ఉంచి కాకులను ఆహ్వానిస్తారు.
అవి వచ్చి తింటే పితృదేవతలు తిన్నట్టే భావిస్తారు. సంక్రాంతి మూడు రోజులు ఊళ్లో ఎటు చూసినా తనకు సమృద్ధిగా ఆహారం లభిస్తోంది కాబట్టి, కాకి ఎటూ కదలాల్సిన అవసరం ఉండదు. ఈ కారణంగానే కాబోలు.. ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత ఏర్పడింది. సంక్రాంతికి నువ్వుల వాడకం పెంచాలని అంటారు. ఈ పండుగ రోజులు చలికాలం. ఈ కాలంలో నువ్వులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే నువ్వులతో చేసిన లడ్డూలను తప్పక తినాలని అంటారు.

మకర సంక్రాంతి నిజానికి తిథి పర్వం కాదు. కానీ, మహా పండుగై ఆచారంలో ఉంది. ముఖ్యంగా ఇది తిలలతో (నువ్వులతో) ముడిపడి ఉన్న పర్వమని ఈ తిథి నాడు ఆచరించే వ్యవహారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. అందుకే ఈనాడు ఆచరించే వ్రతాన్ని తిల పర్వమనీ అంటారు. అయితే, దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. మకర సంక్రాంతి నాటి ఉదయం లేవగానే, నువ్వులు ముద్ద చేసి దానిని ఒంటికి రుద్దుకోవడం ఈనాటి ముఖ్య విషయాల్లో ఒకటి. నువ్వుల ముద్దతో నలుగు పెట్టుకుని ఇంట్లో అందరూ తలంటి పోసుకున్న తరువాత పుణ్యస్త్రీలు చక్కగా అలంక రించుకుని ఐదు మట్టి ముంతలు తీసుకుని, తమకు తెలిసిన పేరంటాళ్ల ఇళ్లకు వెళ్తారు. ఒక్కొక్క ముంతలో బియ్యం, పప్పు దినుసులు, తరిగిన క్యాబేజి ముక్కలు, చెరుకు ముక్కలు ఉంచుతారు. ముంత మీది మూకుడు మూతలో బెల్లం పాకంలో నువ్వులు వేసి తయారు చేసిన ఉండలు ఉంచుతారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పిడత ఇచ్చి ఆ ఇంటిలో నుంచి మళ్లీ అటు వంటిదే ఒక్కొక్క పిడత తీసు కుంటారు. ఎరిగి ఉన్నవాళ్ల అందరి ఇళ్లలోనూ ఇలా మార్చుకున్న పిమ్మట ఆ స్త్రీలు తమ ఇళ్లకు వచ్చేస్తారు.
సంక్రాంతి నాడు స్నానం చేయనివాడు ఏడు జన్మల వరకు రోగిగా, దరిద్రుడిగా ఉంటాడట. దక్షిణాయనంలోని గత పాపం ఉత్తరాయణ పుణ్యకాలంలో పోగొట్టుకోవాలి. అందుకోసం ఈనాడు సూర్యుని ఆరాధించి తిలలు, కూష్మాండం, భాండం, కంబళ, ధాన్య, లోహ, వస్త్ర, తైల దీప దానాలు చేయాలని శాస్త్ర వచనం.

సంక్రాంతి నాడు తిలలతో ముడిపడిన ‘దధిమంధన’ వ్రతం చేసే ఆచారమూ ఉంది. ఈ వ్రతాన్ని జాబాలి మహర్షి సునాగుడనే మునికి వివరించాడట. సంక్రాంతి నాడు శివుడి ప్రతిమకు నేతితో అభిషేకం చేయాలని, నువ్వుపూలతోను, మారేడాకులతోను పూజించాలని ఈ వ్రత విధానం చెబుతోంది. దధిమంధన వ్రతం వల్ల అఖండ సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని దూర్వాస మహాముని చెప్పగా, ద్రోణాచార్యుడి పత్ని కృపి ఈ వ్రతం ఆచరించి దారిద్య్రం నుంచి విముక్తి పొందిందని, అశ్వత్థామను పుత్రుడిగా కన్నదని ఐతిహ్యం. అలాగే నందుని భార్య యశోద ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కుమారునిగా కన్నదని పురాణాల ద్వారా తెలుస్తోంది. సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానమాచరించి, బ్రాహ్మణులకు పెరుగు, తిలపాత్రలు, రాగి పాత్రలు, ఇత్తడి కుందులు, గొడుగులు, ఇతర వస్తువులు కూడా బహుమానాలుగా అందచేస్తారు.
సంక్రాంతినాడు బ్రాహ్మణుడిని ఇంటికి భోజనానికి పిలుస్తారు. నువ్వుల పప్పుతో చేసిన లడ్లు ఆనాటి ప్రధాన భక్ష్యాలు. భోజనం అయిన తరువాత బ్రాహ్మణుడికి దక్షిణ ఇస్తారు. కొత్త అల్లుడిని ఈ పండుగకు తప్పకుండా తీసుకువస్తారు.
శబరిమలైలో స్వామి అయ్యప్ప మకర జ్యోతి దర్శనం అయ్యేది కూడా ఈనాడే.

పుష్య శుద్ధ పంచమి/షష్ఠి
జనవరి 16, మంగళవారం

పుష్య శుద్ధ పంచమి.. కనుమ, ముక్కనుమల పర్వదినం. రెండు తిథులూ ఒకేనాడు కూడి ఉండటం వల్ల ఇది రెండు పర్వాల దినమైంది. ఇది సంక్రాంతిలో మూడో రోజు పర్వం. కనుమను పశువుల పండుగగానూ చేసుకునే ప్రజలు.. వాటిని అందంగా అలంకరించి ఆటవిడుపుగా ఉంచుతారు. వాటితో ఈరోజు పనులేమీ చేయించరు. కనుమ నాడు రథం ముగ్గు వేసి ఆనాటితో సంక్రాంతి సంబరాలకు ముగింపు పలకడం రివాజు. సంకురుమయ్య (సూర్య దేవుడు/ సంక్రాంతి దేవుడు) ఉత్తరాయణం వైపుగా మరలే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను సాగనంపేందుకా అన్నట్టు ఇలా రథం ముగ్గును వేయడం ఆచారం. ఈ ముగ్గుకు ఉన్న కొసను మాత్రం ఇంటి బయటకు వెళ్లేలా దిద్దుతారు.
కనుమ నాడు పొలిమేర దాటకూడదని నియమం. కనుమ మర్నాడు వచ్చే ముక్కనుమ రోజున కొత్త వధువులు ‘సావిత్రీ గౌరీ వ్రతం’ అనే వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది బొమ్మలతో చేసే వ్రతం కాబట్టి దీనికి బొమ్మల నోము అనే పేరూ ఉంది. సంక్రాంతితో పాటు కనుమ నాడు గాలిపటాలను ఎగరేయడం సంప్రదాయం. అప్పుడప్పుడే వేడెక్కే ఎండల్లో గాలిపటాలను ఎగరేయడం ద్వారా సూర్యరశ్మి శరీరానికి తగినంత సోకి డి-వి•మిన్‍ లభిస్తుంది. దీనివల్ల చర్మవ్యాధులు దరిచేరవు.
ఇక, ముక్కనుమ నాడు గ్రామ దేవతలను తల్చుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కూడా ఉంది. అందుకనే ముక్కనుమను ముక్కల పండుగగానూ పిలుస్తారు.
పుష్య శుద్ధ పంచమి నాడు చతుర్ధీ వ్రతం ఆచరించాలని వ్రత నియమం. మధుసూదన భగవానుడిని ఈనాడు పూజించాలి. ప్రతి మాసంలోని శుక్ల, కృష్ణ పక్షములలోని పంచమి తిథులలో నాగపూజ చేయడం తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో ఆచారం.
పుష్య శుద్ధ కుమారషష్ఠి అని అంటారు. కుమారషష్ఠి అంటే కుమారస్వామిని పూజించడానికి ఉద్ధిష్టమైన షష్ఠి. ఈ పర్వం ఆచరణ తమిళులలో ఎక్కువగా కనిపిస్తుంది. అరవ వారిలో పలువురికి కుమారస్వామి ఇలవేల్పు. వారిలో ఆర్మొగమ్‍, షణ్ముగన్‍, కుమరన్‍ మున్నగు పేర్లు ఎక్కువగా ఉంటాయి. ప్రాచీనాంధ్ర కవులు తమ కావాల్యలలో ఇష్టదేవతా స్తుతిలో కుమారస్వామి స్తుతిని కూడా చేర్చారు. చాళుక్యుల కాలంలో కుమారస్వామి పూజ ఆంధ్ర దేశంలో హెచ్చుగా ఉండేది. ‘కుమారదేవం’ తదితర ఊళ్లు తెలుగునాట నేటికీ నిలిచి ఉన్నాయి. దీనివల్ల ఒకప్పుడు ఇక్కడ కూడా కుమారస్వామి ఉత్క•ష్ట స్థాయిలో పూజలందుకున్నాడని తెలియ వస్తోంది. అయితే, ప్రస్తుతం తెలుగు వారిలో కుమారస్వామికి పర్యాయ నామమైన సుబ్రహ్మణ్యస్వామి పూజ విశేషమై ఉంది. కుమారస్వామి సుబ్రహ్మణ్య నామంతో తెలుగు నాట విశేష పూజలందుకుంటున్నాడు. సుబ్బారాయుడి షష్ఠి అని పిలిచే మార్గశిర శుద్ధ షష్ఠి తెలుగు నాట పెద్ద పర్వమే. ఇదే మాదిరిగా తమిళులు జరుపుకునే విశేషమైన పండుగ- పుష్య శుద్ధ షష్ఠి.

పుష్య శుద్ధ సప్తమి
జనవరి 17, బుధవారం

పుష్య శుద్ధ సప్తమి నాడు మార్తాండ సప్తమిగా ప్రతీతి. అలాగే ఈనాడు ద్వాదశ సప్తమి వ్రతం కూడా ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. వీటి పేర్లను బట్టి పరిశీలిస్తే.. ఇవి సూర్య సంబంధమైనవిగా కనిపిస్తున్నాయి. ఈనాడు సూర్య భగవానుడిని యథాశక్తి పూజించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు సావిత్రి గౌరీ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.

పుష్య శుద్ధ అష్టమి
జనవరి 18, గురువారం

పుష్య శుద్ధ అష్టమిని గురించి వివిధ వ్రత గ్రంథాలు మహా భద్రాష్టమి, జయంత్యష్టమి, దుర్గాష్టమి తదితర నామాలతో వ్యవహరిస్తున్నాయి. ఈనాడు అష్టకా సంజ్ఞకమైన శ్రాద్ధం చేస్తే పితృ దేవతలకు సంతుష్టి కలుగుతుందని, వంశాభివృద్ధి జరుగుతుందని ప్రతీతి. పుష్య మాసం పితృ దేవతల పూజకు ఉద్ధిష్టమైనది. కాబట్టి ఈనాడు పితృ దేవతల ప్రీత్యర్థం కార్యాలు తలపెట్టాలి. అందుకే దీనిని మాసిక దుర్గాష్టమిగానూ వ్యవహరిస్తారు.

పుష్య శుద్ధ నవమి
జనవరి 19, శుక్రవారం

పుష్య శుద్ధ నవమి నాడు ధ్వజ నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు ఒంటిపూట భోజనం చేసి మహామాయను పూజిస్తూ వ్రత నియమాన్ని పాటించాలి.

పుష్య శుద్ధ దశమి
జనవరి 20, శనివారం

పుష్య శుద్ధ దశమిని వివిధ వ్రత గ్రంథాలు శాంబవీ దశమి అని పేర్కొంటున్నాయి. ద్వార ధర్మ దేవతలకు పిండి మొదలైన వాటితో పూజ చేయడం ఉత్కళ దేశంలో ఆచారంలో ఉందని తెలుస్తోంది. ద్వార పూజ అంటే గడప పూజ. మన తెలుగు నాట కూడా చాలా ప్రాంతాల్లో గడప పూజకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే, దానిని ఈ తిథి నాడే కచ్చితంగా జరుపుతారనేందుకు ఆధారాలు లేవు.

పుష్య శుద్ధ ఏకాదశి
జనవరి 21, ఆదివారం

పుష్య శుద్ధ ఏకాదశి తిథి పుత్రదైకాదశిగా ప్రసిద్ధం. సుకేతువు అనే రాజు పుష్య శుద్ధ ఏకాదశి నాడు విద్యుక్తంగా వ్రతాన్ని ఆచరించి పుత్రుడిని వరంగా పొందాడు. కాబట్టి దీనికి పుత్రదైకాదశి అనే పేరు వచ్చింది. ఇక, పుష్య శుద్ధ ఏకాదశికి రైవత మన్వాది దినమని కూడా పేరు. రైవతుడు కథ ఆసక్తికరమైనది.
రుతువాక్కు అని ఒక ముని ఉండేవాడు. రేవతి నక్షత్రం నాలుగో పాదంలో ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడైన కొద్దీ దుర్మార్గంగా వ్యవహరించసాగాడు. అతనిలోని ఈ దుష్టత్వానికి కారణం అతని రేవతీ నక్షత్ర చతుర్థ పాద జాతక ఫలితమే అని తెలుసుకుని అతని తండ్రి రుతువాక్కు.. రేవతీ నక్షత్రాన్ని కిందపడిపోవాలని శపించాడు.
ఆ శాపంతో రేవతి నక్షత్రం ద్వారకకు దగ్గరలో ఉన్న కుముదం అనే కొండ మీద పడింది. రేవతి నక్షత్రం అక్కడ పడటం చేత ఆ కొండకు అప్పటి నుంచి రైవతకము అనే పేరు వచ్చింది. రేవతి నక్షత్రం పడిన తాకిడికి ఆ కొండ మీద ఒక కొలను కూడా ఏర్పడింది. ఆ రైవత పర్వతం మీద ఆ తామర కొలను నుంచి ఒక కన్యక పుట్టింది. ఆమెను ఆ కొలను చెంత ఉండిన ప్రముచుడు అనే ముని పెంచి పోషించాడు. ఆమెకు ఆయన రేవతి అనే పేరు పెట్టాడు. రేవతి పెళ్లీడుకు వచ్చింది. ప్రముచుడు ఆమెకు యోగ్యుడైన వరుడి కోసం వెతికి, దుర్దముడు అనే రాజుకిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాడు. అప్పుడు రేవతి, తన వివాహం రేవతీ నక్షత్ర యుక్త లగ్నంలో చేయాలని ప్రముచుడిని కోరింది. ‘ఇప్పుడు నక్షత్ర మండలంలో రేవతీ నక్షత్రమే లేదు. అది కిందపడిపోయింది. నక్షత్రమే లేనపుడు దానికి చంద్ర సంయోగం ఎలా కలుగుతుంది? చంద్ర సంయోగం లేని నక్షత్రం వివాహానికి యోగ్యం కాదు. కాబట్టి వివాహానికి అర్హమైన శుభ నక్షత్రములు చాలా ఉన్నాయి. వాటిలో ఒక శుభ నక్షత్ర యుక్త సమయంలో నీకు వివాహం చేస్తాను’ అని ప్రముచుడు బదులిచ్చాడు.
అప్పుడు రేవతి ప్రముచునితో- ‘నేనే రేవతి నక్షత్రాన్ని. మీ తపో మహిమ చేత రేవతీ నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలపండి. ఆ నక్షత్రమే నా వివాహానికి అనుకూలమైనది. మరొక నక్షత్రంలో చేసే వివాహం నాకు అవసరం లేదు’ అంది.
దీంతో ప్రముచుడు తన తపోధనాన్ని ధారపోసి రేవతి నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలిపాడు. దానికి చంద్ర సంయోగం కలిగించాడు. ఆ మీదట రేవతి నక్షత్రయుక్తమైన ఒక లగ్నంలో ఆమెను దుర్దముడికి ఇచ్చి వివాహం చేశాడు.
రేవతీ దుర్దముల కుమారుడు రైవతుడు. అతడు కాలక్రమాన సకల ధర్మవేది అయి మనువుగా ఆవిర్భవించాడు. మనువుల్లో అతను ఐదవవాడు. రైవతుని మన్వంతరంలో విభుడు అనే వాడు ఇంద్రుడు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ద్వబాహుడు, వశిష్ఠుడు మున్నగు వారు సప్త రుషులు.

పుష్య శుద్ధ ద్వాదశి
జనవరి 22, సోమవారం

పుష్య శుద్ధ ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి, సుజన్మ ద్వాదశీ వ్రతాలు చేస్తారని ‘చతుర్వర్గ చింతామణి’లో ఉంది.

పుష్య శుద్ధ చతుర్దశి
జనవరి 24, బుధవారం

పుష్య శుద్ధ చతుర్దశి నాడు విరూపాక్ష వ్రతం ఆచరిస్తారు. ఇది విద్యాధీశ తిరు నక్షత్రమని ప్రతీతి. ఈనాడు విరూపాక్షుడైన శివుడిని పూజించాలి. లోతు ఎక్కువగా గల నీటిలో స్నానం చేసి, గంధమాల్య నమస్కార ధూపదీప నైవేద్యాలతో ఈనాడు కపర్దీశ్వరుడు ప్రత్యేక పూజలను అందుకుంటాడు.

పుష్య శుద్ధ పూర్ణిమ
జనవరి 25, గురువారం

పుష్య శుద్ధ పూర్ణిమకు ‘పౌషీ’ అని పేరు. పుష్య నక్షత్రంతో కూడిన పున్నమి కాబట్టి ఆ పేరొచ్చింది. ఏ మాసంలో పూర్ణిమావాస్య వస్తుందో ఆ మాసానికి పుష్య మాసమని పేరు. శ్రావణ పూర్ణిమ నాడు అధ్యాయోపా కర్మ చేసుకుని వేద పఠనాన్ని ప్రారంభించి ఆరు మాసాలు వేదాధ్యయనం సాగించాలి. పుష్య పూర్ణిమ నాడు అధ్యాయోత్సర్జన కర్మ చేయాలి. మళ్లీ శ్రావణ మాసం వచ్చే వరకు ఇతర విద్యలు అభ్యసించాలి.
మనకు వచ్చే పూర్ణిమలు రెండు రకాలు. ఒక కళ చేత తక్కువైన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ ఒకటి. దీనికి ‘అనుమతి’ అని పేరు. పదహారు కళలలో కూడిన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ మరొకటి. దీనికి ‘రాకా పూర్ణిమ’ అని పేరు. అనుమతి అయితేనేం, రాకా అయినేతేం.. మొత్తానికి మనకు ఏడాదికి పన్నెండు పూర్ణిమలు.. పన్నెండు పర్వాలు.
హిందువుల పండుగలను పరిశీలిస్తే.. కృష్ణ పక్షంలో కంటే శుక్ల పక్షంలో పండుగలు ఎక్కువ. ఆస్వాదనీయమైన శుక్ల పక్షపు వెన్నెల వ్యర్థం కాకుండా మన పెద్దలు ఆ రోజుల్లో పండుగలు, పబ్బాలు, వ్రతాలు, ఉత్సవాలు ఏర్పాటు చేసి ఉంటారు. అందుకే తెలుగు నాట ‘పున్నమి’ గొప్ప తిథి.
ఇక, మహా పౌషి (పుష్య పూర్ణిమ) విషయానికి వస్తే.. తమిళులు దీనిని ‘పూసమ్‍’ అంటారు. తై పూసమ్‍ అనేది వారి పండుగలలో ఒకటి. తిరునల్‍వేణిలో పార్వతి తామ్రపర్ణి నదీ తీరాన ఒకసారి శివుని గురించి తపస్సు చేసింది. ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించాడు. కాగా, ఆనాడు తిరునల్‍వేణిలో తామ్రపర్ణి నదిలో స్నానం పాపక్షయకరమై ఉంటుంది. అంబ సముద్రం తాలూకా తిరుప్పుదైమారుతూరు అనే ఊరిలోని దేవాలయంలో ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఇంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని, అందుచేత ఈనాడు అక్కడి దైవతాన్ని పూజించడం పుణ్యప్రదమని అంటారు. తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో కూడా తైపూసమ్‍ నాడు గొప్ప ఉత్సవం సాగుతుంది. పౌష్య పూర్ణిమ నాడు భవిష్య పురాణం దానమిస్తే అగ్నిష్టోమ ఫలం కలుగుతుంది. పుష్య పూర్ణిమ నాటి స్నానం అలక్ష్మిని నాశనం చేస్తుందని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది. అలాగే, మహాపౌషి నాడు అయోధ్యలో స్నానం చేస్తే విశిష్ట ఫలాన్నిస్తుంది. పుష్య శుద్ధ పూర్ణిమినే హిమశోధన పూర్ణిమ అని అంటారు. ఈనాడు సావిత్రి గౌరీ వ్రతాన్నీ ఆచరిస్తారు.

పుష్య బహుళ పాడ్యమి
జనవరి 26, శుక్రవారం

పుష్య కృష్ణ (బహుళ) పాడ్యమి తిథినాడు విద్యా వ్యాప్తి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు భారత గణతంత్ర దినోత్సవం.

పుష్య బహుళ చవితి
జనవరి 29, సోమవారం

పుష్య బహుళ చవితి నాడు సంకష్ట హరి చతుర్థి వ్రతం ఆచరిస్తారు. గణనాథుడు ఈనాడు పూజలందుకునే దైవం.

Review పుష్యశ్యామలం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top