బ్రహ్మ మెచ్చిన జ్యేష్టం

జూన్‍ 1, శనివారం, వైశాఖ బహుళ త్రయోదశి నుంచి – జూన్‍ 30, ఆదివారం, జ్యేష్ఠ బహుళ ద్వాదశి వరకు.

శ్రీ వికారినామ సంవత్సరం-వైశాఖం-జ్యేష్ఠం- గ్రీష్మ రుతువు-ఉత్తరాయణం.

ఆంగ్లమానం ప్రకారం ఆరవ మాసం జూన్‍. ఇది తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ – జ్యేష్ఠ మాసాల కలయిక. వైశాఖ మాసంలోని కొన్ని రోజులు, జ్యేష్ఠ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. జ్యేష్ఠం తెలుగు మాసాలలో మూడవది. ఈ మాసంలో వచ్చే పర్వాలలో ఏరువాక పున్నమి, నిర్జల ఏకాదశి, దశ పాప హర దశమి, రంభా వ్రతం వంటివి ముఖ్యమైనవి.

చాంద్రమానం ప్రకారం చైత్ర, వైశాఖ మాసాల తరువాత వచ్చే జ్యేష్ఠ మాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలకు, పర్వదినాలకు ఆలవాలమైనది. పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, పాపాలను హరించుకోవడానికి, దైవసేవలో తరించడానికి ఉద్దేశించిన కొన్ని పుణ్య తిథులు జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి.
జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదని అంటారు. ఈ మాసంలో తనను ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆయా వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది.
పార్వతీదేవి ఆచరించిన ‘రంభా వ్రతం’, వివాహితలు ఆచరించే ‘అరణ్యగౌరీ వ్రతం’, గంగానది స్నానంతో పది రకాల పాపాలను హరించే ‘దశపాప హర దశమి’.. ‘త్రివిక్రమ ఏకాదశి’ పేరుతో పిలిచే ‘నిర్జల ఏకాదశి’ఈ మాసంలోని ప్రత్యేక తిథులు. అలాగే సూర్యుడిని ఆరాధించే ‘మిథున సంక్రమణం’, వ్యవసాయ సంబంధ పర్వమైన ‘ఏరువాక’ కూడా ఈ నెలలో వచ్చే విశేషాలే.
ఇక, దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్య ఫలాలను ప్రసాదించే ‘జ్యేష్ఠ పౌర్ణమి’, శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింప చేసే ‘అపర ఏకాదశి’ ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి.
అత్యంత విశిష్టమైనదిగా చెప్పే ‘యమునా నది పుష్కరాలు’ ఈ మాసంలోనే ఆరంభమవుతాయి.

వైశాఖ బహుళ చతుర్దశి – జూన్‍ 2, ఆదివారం

ఈ తిథి నాడు ఉపవాసం ఉండాలి. ప్రదోష కాలంలో స్నానం చేసి, తెల్లని వస్త్రాలు ధరించాలి. గంధం మొద లైన ఉపచారాలతో, మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాలి.
వైశాఖ బహుళ చతుర్దశి నాడు లింగ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈనాడు పిండితో శివలింగాన్ని తయారు చేసి పంచామృతాలతో స్నానం చేయించి, కుంకుమ పెట్టి, ధూప, దీప, నైవేద్యాలతో పూజ చేయాలి.
అలాగే, ఈనాడు సావిత్రీ వ్రతం కూడా ఆచరిస్తారని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.

వైశాఖ బహుళ అమావాస్య – జూన్‍ 3, సోమవారం

పితృ దేవతలను పూజించడం, పార్వణ విధితో శ్రాద్ధం దానం చేయడం వంటివి ఈ తిథి నాటి విధాయ కృత్యాలు.
వైశాఖ బహుళ అమావాస్య తిథి గురువారంతో కలిసి వస్తే విశేష ఫలప్రదమని అంటారు.
ఈనాడు ప్రయాగలో స్నానం చేయడం మహా పాపహరంగా ఉంటుందని అంటారు. త్రయోదశి నాడు ఆరంభించి ఈనాటితో సావిత్రీ వ్రతం పూర్తి చేస్తారని పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి- జూన్‍ 4, మంగళవారం

ఈ తిథి నాడు ‘కరవీర వ్రతం’ చేయాలని, అలాగే భద్ర చతుష్టయ వ్రతం చేయాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.

జ్యేష్ఠ శుద్ధ తదియ – జూన్‍ 6, గురువారం

జ్యేష్ఠ శుద్ధ తదియ తిథి రంభా వ్రతాచరణకు ఉద్ధిష్టమైనది. సాక్షాత్తూ పార్వతీదేవి ఈ వ్రతం ఆచరించి పరమ శివుడిని భర్తగా పొందిందని ప్రతీతి. ‘రంభ’ అంటే అరటి చెట్టు. ఈనాడు అరటి చెట్టు కిందే దాని అధిష్టాన దేవత అయిన సావిత్రిని పూజించాలి.

జ్యేష్ఠ శుద్ధ చతుర్థి- జూన్‍ 7, శుక్రవారం

ఇది ఉమా చతుర్థి తిథి. ఈనాడు ఉమాపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో వివరించారు. దీనిని గణేశ చతుర్థి తిథిగానూ భావిస్తారు. అలాగే, శుక్లా దేవిని పూజించాలని అంటారు.

జ్యేష్ఠ శుద్ధ పంచమి- జూన్‍ 7, శుక్రవారం

పంచమి తిథి కూడా చతుర్థి గడియల్లోనే ఉంది. ఈనాడు పితృ దేవతలను విధిగా పూజించాలని ఆయా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.

జ్యేష్ఠ శుద్ధ షష్ఠి- జూన్‍ 8, శనివారం

ఈనాడు అరణ్య గౌరీ వ్రతం, వింధ్యవాసినీ పూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. అరణ్యాల్లో, కొండల్లో గౌరిని పూజించే వారికి సౌభాగ్యం కలుగుతుందని అంటారు. అలాగే, ఈనాడు కుమారస్వామిని పూజించడం కూడా పుణ్యప్రదం.

జ్యేష్ఠ శుద్ధ సప్తమి- జూన్‍ 9, ఆదివారం

ఈ తిథి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, వరుణ పూజ చేయాలని మరికొన్ని గ్రంథాలలో రాశారు.

జ్యేష్ఠ శుద్ధ అష్టమి- జూన్‍ 10, సోమవారం

దుర్గాపూజకు ఉద్ధిష్టమైన తిథి ఇది. అందుకే దీనిని దుర్గాష్టమి అనీ అంటారు. ఈ తిథినే త్రిలోచ నాష్టమిగా ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో వర్ణించారు.

జ్యేష్ఠ శుద్ధ నవమి- జూన్‍ 11, మంగళవారం

ఈ రోజున శుక్లా దేవిని పూజించా లని అంటారు.

జ్యేష్ఠ శుద్ధ దశమి- జూన్‍ 12, బుధవారం

జ్యేష్ఠ శుద్ధ దశమి చాలా విశేషమైనది. దీనిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాల పాపాలను పోగొట్టేదని అర్థం. ఇది పది రోజుల వ్రతాచరణ. ఈనాడు నదీ స్నానం మహా ఫలప్రదం.

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి- జూన్‍ 13, గురువారం

సాక్షాత్తూ విష్ణువే భక్తులకు అనుగ్రహించిన వరం- ‘నిర్జల ఏకాదశి’. ఇది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే పర్వం. ఈ రోజున త్రివిక్రమ మూర్తిని ఆరాధించాలి. కాబట్టే దీనికి ‘త్రివిక్రమ ఏకాదశి’ అనే పేరూ ఉంది. నిర్జల ఏకాదశి రోజున నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. ఆచమనం సమయంలో మాత్రం నీళ్లు పుచ్చుకోవచ్చు. ఈ వ్రత మహిమ గురించి శివుడు పార్వతీదేవికి వివరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇదే విష యాన్ని ద్వాపర యుగంలో భీముడితో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానూ ఉంది. అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. బెల్లం, వడపప్పు, నెయ్యి వంటి పదార్థాలతో పాటు గొడుగును కూడా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ విధంగా నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏడాదిలోని మిగతా ఏకాదశి వ్రతాలన్నీ ఆచరించిన ఫలం దక్కుతుందని అంటారు.

జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి- జూన్‍ 14, శుక్రవారం

ఈ తిథిని చంపక ద్వాదశి అనీ అంటారు. అలాగే, రామలక్ష్మణ ద్వాదశి అని కూడా పేరు. ఈనాడు కూర్మ జయంతి పర్వమని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. శంకరాచార్యుల వారి కైలాస గమనం ఈనాడేనని అంటారు.

జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి- జూన్‍ 15, శనివారం

జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి తిథి మూడు వ్రతాలకు ముహూర్త దినం. ఈనాడు దుర్గంధ దౌర్భాగ్య నాశన త్రయోదశీ వ్రతం చేస్తారు. అలాగే, జాతి త్రిరాత్రి వ్రతం, రంభా త్రిరాత్రి వ్రతం కూడా ఈనాడే ఆచరిస్తారు. అలాగే, ఈ తిథి విద్యారణ్య ఆరాధన దినం కూడా. మహా యోగి అయిన విద్యారణ్యుల వారు ఈనాడే బ్రహ్మైక్యం పొందారని అంటారు. శృంగేరి పీఠంలో ఈనాడు విశేష ఆరాధనలు జరుగుతాయి.

విద్యారణ్య స్వామి వేదత్రయ భాష్యకర్త. అలాగే విద్యానగరమును, విద్యానగర సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు. లౌకికం, వైదికం.. రెండింటా అసమాన ప్రతిభ గలవారీయన. ఆయనకు వివేకం తెలిసే సరికి ఉత్తర హిందుస్థానమంతా మహ్మదీయుల వశమైంది. దక్షిణాదినా అన్య మతస్తులు అక్కడక్కడా అడుగు పెట్టారు. ఇవి విద్యారణ్యస్వామిని కలతపెట్టాయి. అప్పుడు ఆయన తుంగభద్ర నదీ తీరాన భువనేశ్వరి అమ్మవారిని గురించి తీవ్రమైన తపస్సును గాయత్రీ మంత్రంతో ప్రారంభించాడు. అమ్మవారు ప్రసన్నరాలై ప్రత్యక్షమైంది. వరం కోరుకొమ్మనగా, ఐశ్వర్యం కోరుకున్నాడు. అమ్మ వారు అది వీలు కాదంది. దీంతో అక్కడికక్కడే విద్యారణ్య పేరుతో సన్యసించి శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించాడు. విరూపాక్ష పీఠం నెలకొల్పినది ఈయనే. హరి హరరాయలు, బుక్కరాయలుకు కొంతకాలం ఈయన మంత్రిగానూ ఉన్నారు.

విద్యారణ్య స్వామి ఆంధ్రుడా, ద్రవిడుడా, కర్ణాటకుడా, మహారాష్ట్రుడా అనే సందేహం ఉంది. ఆయన జాతి విషయమై వివరణ ‘విద్యారణ్య చరిత్ర’లో ఉంది. ఆయన ఆంధ్రుడే అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆది శంకరుల తరువాత అంతటి వారు విద్యారణ్య స్వామి. ఆది శంకరుడు కాశ్మీరం నుంచి శృంగేరికి తెచ్చిన శారదా విగ్రహం చందన ప్రతిమ. విద్యారణ్య స్వామి తన హయాంలో ఈ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేయించి పూర్ణకుంభాలతో అభిషేకం చేశారు. ఆ విగ్రహమే నేటికీ శృంగేరీ పీఠంలో పూజలందుకుంటోంది.

జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి- జూన్‍ 16, ఆదివారం

జ్యేష్ఠ శుద్ధ చతుర్దశిని చంపక చతుర్దశి అనీ అంటారని ఆమాదేర్‍ జ్యోతిషీలో రాయగా, ఈనాడు వాయు వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతా మణి, రుద్ర వ్రతం చేస్తారని స్మ•తి కౌస్తుభం వ్రత గ్రంథాలలో ఉంది.

జ్యేష్ఠ పూర్ణిమ- జూన్‍ 17, సోమవారం

జ్యేష్ఠ పూర్ణిమనే ఏరువాక పున్నమి అంటారు. జ్యేష్ఠ మాసంలో వృషభాన్ని (ఎద్దు) పూజించడం పుణ్యప్రదమని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు రైతులు పశువులను శుభ్రం చేసి, వాటి కొమ్ములకు రంగులు పూసి, మువ్వలతో అలంకరిస్తారు. తరువాత ఎడ్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఉల వలు, పొంగలి పెడతారు. సాయంత్రం ఎడ్లను పొలానికి తీసుకెళ్లి దుక్కి దున్నడం ప్రారంభిస్తారు.
ఇక, మరో విధంగానూ జ్యేష్ఠ పౌర్ణమి విశేషమైనది. ఈనాడు వివాహితలు వట సావిత్రీ వ్రతాన్ని ఆచరిస్తారు. వట అంటే మర్రి చెట్టు. ఆ చెట్టుకు ఈనాడు పూజలు చేస్తారు. మర్రిచెట్టుకు దారం చుడుతూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని అంటారు. అలాగే, జ్యేష్ట పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆరా ధించాలి. ఈ రోజున చేసే వస్త్ర దానాలు విశేష ఫలాన్నిస్తాయి.

జ్యేష్ఠ బహుళ నవమి- జూన్‍ 26, బుధవారం

ఈ తిథి నాడు తిందుకాష్టమీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇక్కడి నుంచి మొదలుకుని దాదాపు ఏడాది పాటు శివపూజ చేయాలని నియమం. అలాగే ఈనాడు వినాయకాష్టమిగా నీలమత పురాణంలో పేర్కొన్నారు. త్రిలోచన పూజ, శీతలాష్టమి అనీ అంటారు.

జ్యేష్ఠ బహుళ ఏకాదశి- జూన్‍ 29, శనివారం

జ్యేష్ఠ బహుళ ఏకాదశి యోగిని ఏకాదశి అంటారు. కుబేరుని తోటమాలి.. కుబేరుని శాపంతో కుష్టు వ్యాధిగ్రస్తుడయ్యాడు. చివరకు అతను ఈ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని శాస్త్రయుక్తంగా చేశాడు. ఫలితంగా కుష్టు రోగం పోయింది.
అలాగే, ఈనాటి రాత్రి మర్రిచెట్టు కింద ఉన్న సావిత్రిని పూజించాలి. ఈనాడు స్త్రీలు ఉపవాసం ఉండి జలముతో వటవృక్షాన్ని తడపాలి. ఆ చెట్టు చుట్టూ ఎనిమిదిసార్లు దారం చుడుతూ ప్రదక్షిణం చేయాలి. మర్నాడు సువాసినీ స్త్రీలకు భోజనం పెట్టాలి. ఆ వ్రతం చేసే స్త్రీ సర్వదా సౌభాగ్యవతి అవుతుందని ప్రతీతి.

Review బ్రహ్మ మెచ్చిన జ్యేష్టం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top