మార్గశిర – పుష్య మాసాల కలయిక డిసెంబరు మాసం. ఆంగ్లమానం ప్రకారం ఇది పన్నెండవ నెల. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రాది మాస పరిగణనలో మార్గశిర మాసం తొమ్మిదవది. ఈ మాసంలోని డిసెంబరు 23వ తేదీ వరకు మార్గశిర మాస తిథులు. డిసెంబరు 24 నుంచి పుష్య మాస తిథులు ఆరంభమవుతాయి. దత్తాత్రేయుని జయంతి, స్మార్త ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, కూర్మ ద్వాదశి, రమణ మహర్షి జయంతి వంటి విశిష్ట పర్వాలు ఈ నెలలోనే వస్తాయి. ఇంకా మత్స్య ద్వాదశి, శ్రీ హనుమద్వ్రతం వంటి పర్వాలు కూడా ఈ నెలలోనే పలకరిస్తాయి.
2022- డిసెంబరు 1,
గురువారం, మార్గశిర శుద్ధ అష్టమి నుంచి
2022- డిసెంబరు 31, శనివారం,
పుష్యమి శుద్ధ నవమి వరకు..
శ్రీశుభకృతు నామ సంవత్సరం-మార్గశిరం
-పుష్యమి- హేమంత రుతువు- దక్షిణాయణం
డిసెంబరు మాసం మార్గశిర – పుష్య మాసాలలోని తిథుల కలయిక. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం కావడం వల ఈ నెలకు మార్గశీర్షం అని పేరు. మార్గశిర మాసానికి ‘అగ్రహాయణిక’ అనే పర్యాయ నామం ఉన్నట్టు ‘అమరం’ అనే గ్రంథంలో ఉంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో, ‘మాసానాం మార్గశీర్షోహ:’ అన్నాడు. అంటే, మాసాలలో నేను మార్గశీర్షాన్ని అని అర్థం. వికటకవి ఒకరు మార్గశిర మాసానికి ‘దారి తల’ మాసం అని తెలుగు అర్థం చెప్పారట. ఇది సరదాకి అన్నా.. నిజంగా కూడా మార్గశిర మొత్తం మాసాలకే ‘తల’ (శిరస్సు) వంటిది. అలాగే, మిగతా మాసాలకు ‘దారి’ (మార్గం) చూపేది కూడా. అందుకే కాబోలు ఒకప్పుడు సంవత్సరారంభం మార్గశిర మాసంలో అవుతుండేదని పంచాంగకర్తలు అంటారు. ఈ ఉపమానాలన్నీ ఈ మాసపు ఉత్క•ష్టతను చెప్పకనే చెబుతున్నాయి. కార్తీక మాసంలోని నాగుల చవితి నాడు ప్రవేశించే చలి మార్గశిరం నాటికి బాగా ప్రబలుతుంది. అందుకే ‘మార్గశిరంలో పుట్టే చలి.. మంటల్లో పడినా పోద’నే సామెత పుట్టింది. మార్గశిరం – పుష్యం.. ఈ రెండు మాసాలు కలిసి హేమంత రుతువు కాలం. ఈ రుతువును భాగవత దశమ స్కంధంలో వర్షిస్తూ పోతన గారు- ‘గోపమారికలు రేపకడ లేచి, చని, కాళిందీ జలంబులం దోగిజలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబు చేసి.. మాస వ్రతంబు సలిపిరి’ అని వర్ణించారు.
మార్గశిర మాసంలో విష్ణువు విశేష రీతిలో పూజలు అందుకుంటాడు. ఈ మాసంలో ఈయనకు అందే పూజల్లో వైకుంఠ ఏకాదశి ప్రధానమైనది. ఈ మాసం విష్ణు సంబంధమైనదే కాక, మరెన్నో విధాలుగా కూడా మహత్తయినది. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామిని మార్గశిర మాసంలో శుద్ధ స్కంద షష్ఠి నాడు విశేషంగా ఆరాధిస్తారు. మార్గశిర మాసంలోని గురువారం లక్ష్మీదేవి పూజలకు ఉద్ధిష్టమైనది. ఇక, దత్తాత్రేయుని జయంతి దినం కూడా ఈ మాసంలోనే వస్తుంది. అలాగే, ధనుర్మాసం ప్రారంభయ్యేది కూడా ఈ మాసంతోనే. ఆధ్యాత్మికంగా మార్గశిరం ఇంతలా పవిత్రమై ఉంటే, ఇక ఆరోగ్యపరంగానూ ఈ మాసంలో మన శాస్త్రకారులు పెద్దపీట వేశారు. చలి గజగజ వణికించే మాసమిది. అందుకు తగినట్టే ఆహార నియమాలను, వ్రత నిబంధనలను విధించారు. ఇంకా ఈ మాసంలో వచ్చే ప్రధాన పర్వాలు, ముఖ్య తిథుల పరిచయం.
మార్గశిర శుద్ధ అష్టమి
డిసెంబరు 1, గురువారం
మార్గశిర శుద్ధ అష్టమి తిథి కాలభైరవాష్టమిగా ప్రతీతి. దీనినే కాలాష్టమి అనీ అంటారు. ఈ తిథి నాడు కాలభైరవాష్టమి ఆచరించడం వెనుక ఓ కథ ఉంది. ఒకసారి బ్రహ్మకు, ఈశ్వరుడికి తమ మహత్వ విషయంలో తగవు వచ్చింది. ఆ సందర్భంలో బ్రహ్మదేవుని మధ్యమ ముఖం శివుడిని తూలనాడింది. శివుడికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడాయన కాలభైరవుడిని పుట్టించాడు. ఆనాడు మార్గశిర శుద్ధ అష్టమి. అలా పుట్టిన కాలభైరవుడు తాను చేయాల్సిన పని ఏమిటని శివుడిని అడిగాడు. బ్రహ్మ తల నరికివేయాలని శివుడు ఆజ్ఞాపించాడు. కాలభైరవుడు అలాగే చేశాడు. దీంతో కాలభైరవునికి బ్రహ్మహత్య పాతకం పట్టుకుంది. ఈ పాపం పోవడానికి తాను నరికిన బ్రహ్మ తల కపాలం పట్టుకుని తీర్థయాత్రలు చేయాలని శివుడు సూచించాడు. కాలభైరవుడు ఆ విధంగా చేశాడు. చివరకు కాశికాపురిలో కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం పోయింది. అందుచేత కాలభైరవుడు కాశీ నగరంలో స్థిరపడిపోయాడు. అప్పుడు శివుడు అతనితో ఇలా అన్నాడు- ‘నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. ఇక నీవు ఇక్కడే ఉండిపో. కాశీకి వచ్చిన ప్రతి వారు ముందు నిన్ను సేవించిన తరువాతే నన్ను అర్చించాలి’.
ఇప్పటికీ ఆ సంప్రదాయం నిలిచి ఉంది. కాశీలో ముందుగా కాలభైరవ పూజ చేయడమే కాకుండా ఇంటికి వచ్చాక కాశీ సంతర్పణకు ముందుగా కాలభైరవ సంతర్పణ కూడా చేస్తారు. నీలకంఠ యీప్సితార్థదాయకుడైన ఈ కాలభైరవుడిని ‘కాశికా పురాధినాథ కాలభైరవం భజే’ అనే మకుటంతో ఎనిమిది శ్లోకాలతో శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యులు (ఆది శంకరాచార్యులు) స్తోత్రం చేసి ఉన్నారు.
ఇంకా మార్గశిర శుద్ధ అష్టమి తిథికి మహేశ్వరాష్టమి, దుర్గాష్టమి, సౌమ్యాష్టమి, ప్రథమాష్టమి, భద్రాష్టమి, భీష్మాష్టమి, అన్నపూర్ణాష్టమి అనే పేర్లు కూడా ఉన్నాయి. కాగా, ప్రతి ఏటా డిసెంబరు 1ని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పించడానికి ఈ రోజును ఉద్దేశించారు.
దత్తాత్రేయుడి
ప్రాదుర్భావం
దత్తాత్రేయుల వారు మార్గశిర శుక్ల చతుర్దశి నాడు అవతరించినా, ఆయన జయంతిని మాత్రం మార్గశిర పూర్ణిమ నాడే జరుపుకోవడం విశేషం. దత్తాత్రేయుని కథ వినదగినది. కలహ కారకుడైన నారద ముని తన భక్తి ప్రపత్తులతో విష్ణువును ప్రసన్నుడిని చేసుకున్నాడు. విష్ణువు వరం కోరుకొమ్మన్నాడు. ‘నీ సత్వ రూపం చూడాలని ఉంది’ అని నారదుడు కోరాడు. అందుకు విష్ణువు- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకటిగా చేయగలిగితే నీవు కోరింది చూడగలుగుతావని చెప్పాడు. దీంతో నారదుడు భూలోకానికి వచ్చాడు. ఎలాగైనా త్రిమూర్తులను ఒకటిగా చేయాలని సంకల్పించుకుని, అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అత్రి మహర్షి ఆశ్రమంలో లేడు. ఆయన భార్య అనసూయ ప్రాతివత్యానికి పేరుమోసిన స్త్రీ రత్నం. నారదుడికి ఆమె ఆతిథ్యమిచ్చింది. ఆపై నారదుడు వైకుంఠానికి వెళ్లాడు. అక్కడ అతను లక్ష్మితో ముల్లోకాల్లోనూ అనసూయ వంటి పతివ్రత లేదని చెప్పాడు. అయితే, తన భర్తను భూలోకానికి పంపి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షింప చేస్తానని లక్ష్మీదేవి నారదుడితో అంది. ఆపై నారదుడు కైలాసాని, సత్యలోకానికి వెళ్లి పార్వతి, సరస్వతిలతో కూడా అనసూయ పాతివ్రత్యం గురించి చెబితే.. తమ భర్తలను పంపి పరీక్షిస్తామని చెప్పారు. భార్యల ఆలోచనల ఫలితంగా త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలు ధరించి అత్రి ఆశ్రమానికి వచ్చారు. తమకు ఆకలిగా ఉందని, అనసూయ విగత వస్త్రయై తమకు అన్నం పెట్టాలని కోరారు. ఈ వింత కోరికకు అనసూయకు ఆశ్చర్యం వేసింది. తన భర్తతో ఆలోచన చేసింది. అత్రి గొప్ప ఆత్మజ్ఞాని. యోగి. ఆయనకు అంతా తెలిసిపోయింది. వచ్చిన బ్రాహ్మణ పిల్లలు పరీక్షార్థం వచ్చిన త్రిమూర్తులనే సంగతి గ్రహించాడు. అప్పుడాయన భార్యకు మంత్రోదకం ఇచ్చాడు. ఆ ఉదకాన్ని వచ్చిన వారిపై చల్లి ఆపై వారికి అన్నం వడ్డించాలని చెప్పాడు. మగని ఆజ్ఞ ప్రకారం అనసూయ వారిపై మంత్రోదకం చల్లింది. తోడనే ఆ బ్రాహ్మలు ముగ్గురూ పసిపిల్లలైపోయారు. అప్పుడు అనసూయ వారికి తన స్తన్యం ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అక్కడకు వచ్చిన నారదుడు త్రిమూర్తులు చిన్నారి శిశువులై ఆడుతుండటం చూసి ఆనందించాడు. ఆ విషయాన్ని త్రిమూర్తుల భార్యలకు చెప్పాడు. వెంటనే అక్కడకు వచ్చిన వారు.. తమ భర్తలు బాలురై క్రీడిస్తుండటం చూశారు. దీంతో వారికి గర్వభంగమైంది. అనసూయ పాదాలపై సాష్టాంగపడి ఆ శిశువులు తమ భర్తలైన బ్రహ్మ విష్ణుమహేశ్వరుని, దయచేసి తమ పతుల్ని తమకు ఈయవలసిందని కోరారు. అప్పుడు అనసూయ భర్త ఆజ్ఞతో ఆ శిశువుపై మంత్రోదకాన్ని చల్లింది. తిరిగి ఆ శిశువులు నిజరూపం ధరించి, అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఏదైనా వరం కోరుకొమ్మన్నారు. అందుమీద ఆమె, ఆమె ధర్త అత్రి త్రిమూర్తులు తమకు పుత్రుడిగా పుట్టాలని కోరారు. తోడనే వారి కళలతో ముని దంపతులకు కుమారుడు పుట్టాడు. అతనే దత్తాత్రేయుడు. అతనికి ఆరు చేతులు, మూడు తలలు. నడిమి శిరస్సు విష్ణువుది. దానికి కుడిది శివుడిది. దానికి ఎడమది బ్రహ్మ శిరము.
స్థలాంతరంలో దత్తాత్రేయుని ఉత్పత్తి విధానం మరోలా ఉంది. శిశువులు తిరిగి త్రిమూర్తులుగా మారే కమ్రంలో నారదుడు హఠాత్తుగా అక్కడికి వచ్చి, త్రిమూర్తుల్ని దర్శించి, ‘మీరు ముగ్గురూ ఒక్కచోట ఉన్నారు. కాబట్టి మీ సత్వరూపం నాకు చూపాలని’ కోరాడు. నారదుని కోరికపై త్రిమూర్తులు ముగ్గురూ కలిసి దత్తాత్రేయ రూపాన్ని పొందారు. దత్తాత్రేయుడు గొప్ప సన్యాసి. అతను పుట్టిన వారం బుధవారం. తిథి మార్గశిర శుక్ల చతుర్దశి. నక్షత్రం కృత్తిక. దత్తాత్రేయ దేవాలయాల్లో ఈనాడు కీర్తనలు సాగుతాయి. ఈ దేవత పట్ల మహారాష్ట్రులు అతిశయోక్తమైన భక్తి కలిగి ఉంటారు. దత్తాత్రయుడు ఉగ్ర దేవత అని గర్గ సంహిత అని చెబుతోంది. కాబట్టే దేశంలో దత్తాత్రేయ ఆలయాలు తక్కువగా ఉన్నాయి. (డిసెంబర్ 7/8: దత్తాత్రేయ జయంతి)
మార్గశిర శుద్ధ నవమి
డిసెంబరు 2, శుకవ్రారం
మార్గశిర శుద్ధ నవమి నాడు త్రివిక్రమ త్రిరాత్ర వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. పురుషార్థ చింతామణిలో దేవీపూజ చేయాలని ఉంది. మొత్తానికి నవమి తిథి శక్త్యారాధనకు విశేషమైనది. ఈనాడు దుర్గాదేవిని విశేషంగా అర్చిస్తారు. తెలుగు పంచాగాలలో ఈనాటి తిథి గురించి శుక్ర మౌడ్యమి త్యాగము అని పేర్కొన్నారు.
మార్గశిర శుద్ధ దశమి
డిసెంబరు 2, శుకవ్రారం
మార్గశిర శుద్ధ నవమి ఘడియల్లోనే దశమి తిథి ప్రవేశిస్తుంది. ఈనాడు (డిసెంబ•రు 2) ఆరోగ్య వ్రతం ఆచరించాలని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఆరోగ్య వ్రతం ఆచరించే వారు ఒంటిపూట భోజనం చేయాలి. ఈ వ్రతం చేసిన వారు ఈ లోకంలోనే ఆరోగ్యం పొందుతారని ప్రతీతి. పదార్థ వ్రతం, ధర్మ వ్రతం వంటివీ ఈనాడు చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు ఆచరించాల్సిన ఆయా వ్రతాల పేర్లను బట్టి ఇది పూర్తిగా ఆరోగ్యానికి సంబధించి ఉద్దేశించిన తిథిగా కనిపిస్తోంది. ఇక మార్గశిర శుద్ధ దశమి నాటి నుంచి జ్యేష్ట కార్తె ప్రారంభమవుతుంది.
మార్గశిర శుద్ధ ఏకాదశి
డిసెంబరు 3, శనివారం
మార్గశిర శుద్ధ ఏకాదశి తిథి ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని అకూడా అంటారు. సౌఖ్యదైకాదశీ అనే నామం కూడా ఉంది. వైఖానసుడు అని ఒకరాజు. ఆయనకు ఒకనాడు తన తండ్రి నరకంలోనే ఉండిపోయి యమ యాతనలు పడుతున్నట్టు కల వచ్చింది. దీంతో ఆయన మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసాది నియమాలతో వ్రతం చేశాడు. ఈ వ్రత ఫలితంగా అతని తండ్రి నరక లోకం నుంచి స్వర్గలోకానికి వెళ్లాడు. ఈ విధంగా తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత ఈ ఏకాదశికి మోక్షదైకాదశి అనే పేరు కూడా ఉంది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కలుగుతుందని చెబుతారు.
ఇక, భారత సారస్వతంలో తలమానికమైన భగవద్గీత పుట్టిన రోజు కూడా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడేనని పంచాంగకర్తలు అంటారు. అయితే ఈ
తిథి నిర్ణయం విషయంలో అనేక సందేహాలు, భిన్న వాదనలు ఉన్నాయి. కాబట్టి గీతా జయంతి ఎప్పుడనే విషయం పక్కనపెడితే, ప్రస్తావన వచ్చింది
కాబట్టి గీతా జయంతి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం.
కార్తీక బహుళ అమావాస్య నాడే భగవద్గీత పుట్టిన దినంగా గుర్తించాల్సి ఉందని కొందరు అంటారు. అంటే, గీతా జయంతి ఈనాడే జరపాలనేది వారి మాట. అయితే, ఉత్తరాదిన మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతి నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు గల పద్దెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందని, ఆ యుద్ధ ప్రారంభ దినమైన మార్గశిర శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీతను శ్రీకృష్ణుడు బోధించాడని అందుచేత ఈనాడు గీతా జయంతి నిర్వహించడం సముచితమని అంటారు.
ఇక, భారత కాలమానాలను బట్టి చూస్తే, మాఘ శుద్ధ అష్టమి భీష్మ నిర్వాణ దినం. భీష్ముడు అంపశయ్య మీద యాభై ఎనిమిది రోజులు ఉన్నట్టు భారతంలో స్పష్టంగా ఉంది. భీష్ముడు యుద్ధం చేసింది పది రోజులు. భీష్ముడు మరణించిన మాఘ శుద్ధ అష్టమి నుంచి మొత్తం అరవై ఎనిమిది దినాలు రెండు మాసాల ఎనిమిది రోజులు. వెనక్కి లెక్తిస్తే.. భారత యుద్ధ దినం తేలుతుంది. ఈ గణన ప్రకారం భారత యుద్ధ ప్రారంభ దినం కార్తీక బహుళ అమావాస్య అవుతుంది.
కార్తీక మాసంలో రేవతి నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్లినట్టు భారతంలో ఉంది. కార్తీక పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడో పూర్వపు నక్షత్రం రేవతి. ఆనాడు శుద్ధ త్రయోదశి తిథి. రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులు ఉన్నాడు. వస్తూ కర్ణుడితో మాట్లాడాడు. ఆ సంభాషణలో శ్రీకృష్ణుడు కర్ణుడితో జ్యేష్టా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ఆరంభమవుతుందని తెలిపాడు. ఈ లెక్కలను బట్టి కార్తీక బహుళ అమావాస్యే భారత యుద్ధ ప్రారంభ దినమని నిర్ధారించి చెప్పవచ్చని కొందరు అంటారు. కాగా, భారత యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడు కాగల బంధువధకు శంకించాడు. ఆ సందర్భంలో కృష్ణుడు అతనికి తత్త్వోపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, కార్తీక బహుళ అమావాస్య నాడు జరిగిందని.. కాదు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అని రెండు రకాలుగా వ్యాప్తిలో ఉంది. ఏరోజైతేనేం.. రెండు తిథుల్లోనూ గీత ప్రాశస్త్యాన్ని గౌరవించుకుంటే వచ్చే నష్టమేం ఉంది?.
మార్గశిర శుద్ధ ద్వాదశి
డిసెంబరు 4, ఆదివారం
మార్గశిర శుద్ధ ద్వాదశి గొప్ప పర్వదినం. ఈనాడు ఆచరించాల్సిన వ్రతాలు అనేకం ఉన్నాయి. ఈ రోజు ఏ వ్రతం ఆచరించినా పుణ్యమేనని ప్రతీతి. ముఖ్యంగా ఈనాడు మత్స్య ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామ ద్వాదశి, తారకా ద్వాదశి, అపరా ద్వాదశి, నామ ద్వాదశి, శుభ ద్వాదశి, అఖండ ద్వాదశి, దశావతార వ్రతం, సాధ్య వ్రతం, ద్వాదశాదిత్య వ్రతం మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. హనుమద్వ్రతం చేస్తారని మరో వ్రత గ్రంథంలో ఉంది. వీ•న్నిటిని బట్టి ఇది ఒక గొప్ప పర్వదినంగా భావించాలి. తెలుగు వారి ఇలవేల్పు అయిన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పుష్కరిణికి ఈనాడు తీర్థ దినం.
భూలోకంలో మూడు కోట్ల తీర్థ రాజాలు ఉన్నాయి. ఆ తీర్థాలన్నీ మార్గశీర్ష శుద్ధ ద్వాదశి నాడు అరుణోదయ కాలాన తిరుపతి కొండ మీద స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని పురాణ వచనం. ఆనాడు అక్కడ స్నానం చేయడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది.
మార్గశిర శుద్ధ తయ్రోదశి
డిసెంబరు 5, సోమవారం
మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు అనంగ త్రయోదశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. అలాగే, ఈనాడు గోదావరి తీర ప్రాంతాలలో హనుమజ్జయంతిని వైభవంగా జరిపే ఆచారం కూడా ఉంది. ఇది ప్రత్యేకంగా గోదావరి జిల్లాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈనాడు ఊరూవాడా హనుమద్ ఆలయాలలో పచ్చని కొబ్బరాకులు, తాటాకులతో పందిళ్లు వేసి అత్యంత వైభవోపేతంగా హనుమజ్జయంతి వేడుకలు నిర్వహిస్తారు. త్రయోదశి తిథి ఘడియలు తెలుగు పంచాంగాల ప్రకారం డిసెంబరు 6వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. కాగా, డిసెంబరు 6వ తేదీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి దినం.
మార్గశిర శుద్ధ చతుర్దశి
డిసెంబరు 7, బుధవారం
మార్గశిర శుద్ధ చతుర్దశి నాటి నుంచి చాంద్రాయణ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి, తరువాత గౌరీదేవిని ఆరాధించాలి. పాషాణాకార పిష్ట భోజనం చేయాలి. కాబట్టే దీనిని పాషాణ చతుర్దశీ వ్రతం అని కూడా అంటారు. శివ చతుర్దశీ శావ్రణికా తదితర వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు. చతుర్దశికి ముందురోజు రాత్రి భోజనం మాని చతుర్దశి నాడు నిరాహారిగా ఉండి ఆబోతును పూజించాలి. మరునాడు కమలాలతో ఉమాసహితుడైన శివుడిని పూజించాలి.
కాగా, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుల వారి జయంతిని కొన్ని ప్రాంతాల్లో ఈనాడే నిర్వహిస్తారు. మరికొన్ని తావుల్లో మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు ఆయన జయంతిని జరుపుతారు.
అలాగే, శ్రీశ్రీశ్రీ కూర్తాళం సిద్ధేశ్వరానంద భారతీస్వామి వార్షిక పట్టాభిషేక మహోత్సవాన్ని ఈనాడు నిర్వహిస్తారు.
మార్గశిర శుద్ధ పూర్ణిమ
డిసెంబరు 8, గురువారం
మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు చంద్రపూజ చేయాలని నీలమత పురాణం, చంద్ర వ్రతం చేయాలని హేమాద్రి పండితుడు చెబుతున్నారు. నాడు ఆగ్నేయ పురాణాన్ని దానం చేస్తే సర్వ క్రతు ఫలం కలుగుతుందని పురాణోక్తి. ఇంకా అన్నపూర్ణ జయంతి, భైరవ జయంతి పర్వాలను కూడా ఈనాడే నిర్వహించే ఆచారం ఉంది. ఇటువంటి ప్రసిద్ధి గల ఈ మార్గశిర పూర్ణిమను తెలుగు దేశంలో కోరల పూర్ణిమ అంటారు. కోరల పున్నమి అంటే, కోరల అమ్మవారి పున్నమి. ఈ కోరల అమ్మవారు యముని వద్ద ప్రధాన లేఖకుడైన చిత్రగుప్తుని సోదరి. ఆమె కోటి పుర్రెల నోము పడుతుందట. కానీ, ఏటా ఒక పుర్రె లోటు వస్తుందట. అందుచేత మళ్లీ సంవత్సరం మళ్లీ ఆ నోము పడుతుందట. అప్పుడు ఇట్లాగే నోము అసంపూర్తి. ఏటేటా ఇదే వరస. ఇది పురాణ కథనం. కానీ, నిష్టతో 33 పున్నాల నోము పట్టే వారు కూడా ఈ పున్నమి నాడు ఏమీ చేయరు. అది ఒక కట్టుబాటు.
మహా మార్గశీర్ష అనే పేరు గల ఈ పున్నమి నాడు నరక పూర్ణిమ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. నరక అనే పదం యమ సంబంధమైనది.
వైద్య శాస్త్రంలో కార్తీక పూర్ణిమ మొదలు మార్గశిర పూర్ణిమ వరకు గల 30 దినాలను యమదంష్ట్రలు అంటారు. అంటే ఈ రోజులలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడని భావం. ఈ రోజులు చాలా అనారోగ్యకరాలైనవి. ఈ దినాలలో మరణిస్తే జాస్తీ. మార్గశిర పూర్ణిమతో యమదంష్ట్ర దినాలు తుదముట్టుతాయి.
మార్గశిర పూర్ణిమ రోజున ఆంధ్ర ప్రాంతాలలో అతి ప్రాచీన కాలం నుంచి ‘రొట్టెలు కొరికి కుక్కలకు వేయుట’ అనే ఆచారం ఒకటి పరంపరగా వస్తోంది. ఇలా రొట్టెలు కొరికి వేయడం ద్వారా యముని కోరల్లో ఉండే విషం పోతుందని విశ్వాసం.
మార్గశిర పూర్ణిమను వ్రత గ్రంథాలు నరకపూర్ణిమ అనీ, తెలుగు వారు కోరల పూర్ణిమ అని భీతి గొలిపే నామాలతో వ్యవహరిస్తుంటే, మహారాష్ట్రులు ఈనాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటున్నారు.
ఉపవాసాలకు ఉద్ధిష్టమైన పర్వదినమిది. ఈ పర్వానికి ఉత్సవ శోభ కల్పించే ఘట్టాలూ ఉన్నాయి. గద్వాల (తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం) మొదలికల్లు అనే ఊరు సుప్రసిద్ధమైన శ్రీవేంకటేశ్వర క్షేత్రం. మొదలికల్లు అంటే సంస్క•తంలో శిలా క్షేత్రమని అర్థం. మార్గశిర పున్నమి నుంచి ఇక్కడ గొప్ప జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. కర్నూలు, నెల్లూరు వంటి దూర ప్రాంతాల నుంచి మేలు జాతి పశువులను ఇక్కడకు తీసుకువచ్చి ఈ ఉత్సవాలలో ప్రదర్శిస్తుంటారు. సంవత్సరంలోని మూడు వందల అరవై అయిదు రోజులు ఏదో ఒక ఉత్సవంతో అలరారడమే తెలుగు సంస్క•తి గొప్పదనం.
మార్గశిర బహుళ పాడ్యమి
డిసెంబరు 9, శుకవ్రారం
మార్గశిర బహుళ పాడ్యమి నాడు కశ్మీరులో ఈనాడు కొత్త సంవత్సర మహోత్సవం జరుపుకుంటారని తెలుస్తోంది. నీలమత పురాణం కశ్మీరు దేశ ప్రధాన రచన. అందులో నవ సంవత్సరోత్సవ మహోత్సవం ఈనాడు జరుపుకుంటారని ఉంది. ఈనాడు చంద్రార్ఘ్య దానం చేయాలని గదాధర పద్ధతిలో ఉంది. శీలావాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు.
మార్గశిర బహుళ తదియ
డిసెంబరు 11, ఆదివారం
మార్గశిర బహుళ తదియ నాడు విఖ్యాత సంగీత విద్వాంసురాలు, గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి వర్ధంతి దినం.
మార్గశిర బహుళ చతుర్ధి
డిసెంబరు 12, సోమవారం
మార్గశిర బహుళ చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. ఇది గణపతి సంబంధమైనది. ప్రతి మాసంలో వచ్చే రెండు చతుర్థులు గణపతి పూజకు ఉద్ధిష్టమైనవి.
మార్గశిర బహుళ సప్తమి
డిసెంబరు 15, గురువారం
మార్గశిర బహుళ సప్తమి తిథి నాడు ఫల సప్తమీ వ్రతం, తమశ్చరణ వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఉంది. అయితే, ఆయా వ్రతాలను ఎలా ఆచరించాలనే వివరాలేవీ పెద్దగా అందుబాటులో లేవు. కాగా, ఈనాడు ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ వర్ధంతి దినం. అదేవిధంగా ఆంధప్రదేశ్ అవతరణకు ఆద్యుడైన పొట్టి శ్రీరాముల గారి వర్ధంతి దినం కూడా ఈనాడే.
మార్గశిర బహుళ అష్టమి
డిసెంబరు 16, శుకవ్రారం
మార్గశిర బహుళ అష్టమి నాడు అనఘాష్టమీ వ్రతం, కృష్ణాష్టమీ వ్రతం, రుక్మిణ్యష్టమీ వ్రతం, కాలాష్టమీ వ్రతం మొదలైనవి చేస్తారని ఉంది. కాలభైరవాష్టమిగా భావించి ఈ రోజున భైరవ జయంతి వ్రతం ఆచరించే ఆచారం కూడా ఉందని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.
కాగా, ఈనాటి నుంచే ధనుస్సంక్రమం ఆరంభమవుతుంది. అలాగే, మూల కార్తె ప్రారంభం కూడా ఈనాటి నుంచే.
మార్గశిర బహుళ నవమి
డిసెంబరు 17, శనివారం
మార్గశిర బహుళ నవమి నాడు రూప నవమి వ్రతం ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాటి నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుస్సంక్రమణం మర్నాడు వచ్చే మార్గశిర బహుళ నవమి నాడే ధనుస్సు పడతారు. దీన్నే ధనుర్మాసం పట్టడం అంటారు. ఇది సంక్రాంతికి ఆరంభ సూచిక. ఈనాటి నుంచి మొదలుకుని సంక్రాంతి వరకు తెలుగు నాట మహిళలు ఉదయాన్నే లేస్తారు. ముంగిళ్లు తుడిచి కళ్లాపి చల్లి, ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల మీద గోమయంతో ముద్దలు చేసి ఉంచుతారు. వాటికి వరిపిండితో, కుంకుమతో బొట్లు పెట్టి పైన పువ్వులు గుచ్చుతారు. వాటిని పూజిస్తారు. ధనుస్సంక్రమణం నాటి నుంచి సంక్రాంతి వరకు నెల రోజుల పాటు ఇళ్ల ముందు ముగ్గులు పెట్టి పెద్ద పండుగ నాడు రథం ముగ్గుతో సాగనంపుతారు. ధనుర్మాసమంతా ముఖ్యంగా అమ్మాయిలకు ఉత్సాహాన్నిస్తుంది. వేకువనే లేచి, ఇంటి ముందు కళ్లాపి చల్లి, రంగవల్లులపై గొబ్బెమ్మల్ని అలంకరించి గొబ్బి పాటలు పాడతారు. ఇళ్ల ముందు పోటీపడి ముగ్గుల్ని అలంకరిస్తారు. అవెంత అందంగా వచ్చాయో చూసుకుని మురిసిపోతారు. ధనుస్సంక్రమణం నాటి నుంచే హరిదాసులు తెల్లవారుజామునే ఇంటింటికీ హరికీర్తనలు ఆలపిస్తూ తిరుగుతారు.
ఈ మాసమంతా ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాచరణకు సంబంధించిన వివరాలు శ్రీమద్భాగవతంలో విపులంగా ఉన్నాయి.
ఇక, ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం. వారంతా ఆ సమయంలో విష్ణుమూర్తిని దర్శిస్తారు. ముక్కోటి దేవతలు ఆయనను ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు.
మార్గశిర బహుళ ఏకాదశి
డిసెంబరు 19, సోమవారం
మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశి పర్వం. లుంపకుడు అనే వాడు మహిష్మంతుని కుమారుడు. అతను దేశం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. దేశాలు పట్టి తిరుగుతుండగా, ఒక ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. దీంతో అతను బలవంతాన ఉపవాసం ఉండాల్సి వచ్చింది. అజ్ఞాతంగానే అతను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. అయినా ఆ వ్రతం యొక్క ఫలాన్ని అతను పొందాడు. కాబట్టే ఈ ఏకాదశికి సఫలైకాదశి అనే పేరు వచ్చింది. వైతరణి, ధనద సర్వకామ తదితర వ్రతాలు ఈ రోజు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది.
మార్గశిర బహుళ ద్వాదశి
డిసెంబరు 20, మంగళవారం
మార్గశిర బహుళ ద్వాదశి నాడు మల్ల ద్వాదశి, కృష్ణ ద్వాదశీ వ్రతాలు ఆచరిస్తారని తెలుస్తోంది. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈ రెండు వ్రతాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
మార్గశిర బహుళ తయ్రోదశి
డిసెంబరు 21, బుధవారం
మార్గశిర బహుళ త్రయోదశి యమ దర్శన త్రయోదశి పర్వమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.
మార్గశిర బహుళ చతుర్దశి
డిసెంబరు 22, గురువారం
మార్గశిర బహుళ చతుర్దశి తిథికే మహోదధ్యమావాస్య అని పేరు. బకులామావాస్య అని మరికొందరు అంటారు. దీనికే ‘బకులక్షీరేణపాయసంకృత్యా’ అని నానుడి. అంటే, పాలతో పాయసం వండి ఇష్టదైవాలకు నివేదించే రోజు ఇదని అర్థం.
కాగా, ఏడాదిలో వచ్చే రోజుల్లో ‘డిసెంబర్ 22’కి అతి చిన్న రోజు (షార్టెస్ట్ డే) అనే పేరుంది.
మార్గశిర బహుళ అమావాస్య
డిసెంబరు 23, శుకవ్రారం
మార్గశిర బహుళ అమావాస్య.. అమావాస్య తిథి. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి దినం ఇది.
పుష్య శుద్ధ విదియ
డిసెంబరు 25, ఆదివారం
పుష్య శుద్ధ పాడ్యమి (డిసెంబరు 24వ తేదీ) నుంచి పుష్య మాసం ఆరంభమవుతుంది. తెలుగు మాసాల వరుసలో ఇది సంవత్సరంలో పదో మాసం. పుష్యంలో ఆవు ఈనితే ఆడపడుచుకు ఇచ్చివేయాలనే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది.
పుష్యమాసంలో పూస గుచ్చ పొద్దుండదని నానుడి. ఇక, పాడ్యమి మర్నాడు వచ్చే విదియ (డిసెంబరు 25) తిథి నాడు ఆరోగ్య ద్వితీయ వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు రోజులు విష్ణు వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాచరణకు మొదటి రోజు పుష్య శుద్ధ విదియ.
ఇక, క్రైస్తవుల క్రిస్మస్ పర్వదినం ఈనాడే.
పుష్య శుద్ధ పంచమి
డిసెంబరు 27, మంగళవారం
పుష్య శుద్ధ పంచమి నాడు మధుసూదన భగవానుడిని పూజించాలి. ప్రతి మాసంలోని శుక్ల, కృష్ణ పక్షములలోని
తిథులలో నాగుల పూజ యోగ్యమై ఉంది.
పుష్య శుద్ధ షష్టి
డిసెంబరు 28, బుధవారం
పుష్య శుద్ధ షష్ఠిని కుమారషష్ఠి అని కూడా అంటారు. కుమార షష్ఠి అంటే కుమారస్వామిని పూజించడానికి ఉద్ధిష్టమైన షష్ఠి. ఈ పర్వం మనకంటే తమిళుల్లో ఎక్కువగా ఆచరణలో ఉంది. తమిళవాసులకు కుమారస్వామి ఇలవేల్పు. చాళుక్యుల కాలంలో తెలుగునాట కుమారస్వామి పూజ ఎక్కువగా ఉండేది. అయితే, ప్రస్తుతం తెలుగునాట కుమారస్వామికి పర్యాయ నామమైన సుబ్రహ్మణ్యుడిగానే కుమారస్వామి ప్రసిద్ధుడై ఉన్నాడు. కుమారస్వామి సుబ్రహ్మణ్య నామంతో తెలుగునాట విశేషంగా పూజలు అందుకుంటున్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠి (నవంబరు 24) నాడు వచ్చే సుబ్బారాయుడి షష్ఠి గోదావరి తీర ప్రాంతాలలో పెద్ద ఉత్సవం.
పుష్య శుద్ధ సప్తమి
డిసెంబరు 29, గురువారం
పుష్య శుద్ధ సప్తమి తిథి నాడు మార్తాండ సప్తమి, ద్వాదశ సప్తమి వ్రతాలను విశేషంగా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.
కాగా, డిసెంబరు 29 గురుగోవింద్‍సింగ్ జయంతి దినం.
పుష్య శుద్ధ అష్టమి
డిసెంబరు 30, శుకవ్రారం
పుష్య శుద్ధ అష్టమిని వివిధ వ్రత గ్రంథాలు మహా భద్రాష్టమి, జయంత్యష్టమి, దుర్గాష్టమి తదితర నామాలతో పేర్కొంటున్నాయి. ఈనాడు అష్టకా సంజ్ఞకమమైన శ్రాద్ధం చేస్తే పితృ దేవతలకు సంతుష్టి కలుగుతుందని, కులాభివృద్ధి జరుగుతుందని అంటారు.
పుష్య శుద్ధ నవమి
డిసెంబరు 31, శనివారం
పుష్య శుద్ధ నవమి నాడు ధ్వజ
నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ
చింతామణి చెబుతోంది. ఈనాడు
ఒంటిపూట భోజనం చేయాలి.
మహా మాయను పూజిస్తూ
వ్రత నియమం పాటించాలి.
Review భక్తికి ‘మార్గ’ం.