మహా మాఘం

1, ఫిబ్రవరి, గురువారం, మాఘ బహుళ పాడ్యమి నుంచి-28, ఫిబ్రవరి, బుధవారం, ఫాల్గుణ శుక్ల త్రయోదశి వరకు
హేవళంబి నామ సంవత్సరం-మాఘ-ఫాల్గుణ-శిశిర రుతువు-ఉత్తరాయన

ఆంగ్లమానం ప్రకారం ఫిబ్రవరి నెల మాసాలలో రెండవది. ఇది తెలుగు పంచాంగం ప్రకారం పన్నెండవది. ఇది మాఘ – ఫాల్గుణ మాసాల కలయిక. మాఘ మాసంలోని కొన్ని రోజులు, ఫాల్గుణ మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. లోకాలనేలే ఈశ్వరుడి మహా లింగోద్భవ కాలమైన శివరాత్రి పర్వం ఫిబ్రవరిలోనే.. ఇంకా యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు, తిరుపతి వేంకటేశ్వరుడి తెప్పోత్సవం, దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వంటివి ఈ నెలలోనే వస్తాయి.
మాఘ – ఫాల్గుణ మాసాల కలయిక ఫిబ్రవరి మాసం. యజ్ఞ యాగాదులకు శ్రేష్ఠమైనది మాఘ మాసం. యజ్ఞాలకు అధి దైవం ఇంద్రుడు. అందుకే ఇంద్రుడిని ‘మఘవుడు’ అని అంటారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ‘మాఘం’ అయ్యింది. అలాగే, చంద్రుడు మఖ నక్షత్రాన ఉండే మాసం కనుక ఇది ‘మాఘం’ అయ్యింది. ఇది శిశిర రుతువు మాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం. ఉసిరికలు విస్త•తంగా కాస్తాయి. శూన్యమాసంగా పరిగణించే పుష్యం తరువాత వచ్చే ఈ మాసం కల్యాణకారక మాసం. పవిత్ర స్నానాలకూ, భగవత్‍ చింతనకూ ఉత్క•ష్టమైన కాలం మాఘ మాసం.
ఇక, ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాల్లో ఫాల్గుణ మాసం పన్నెండవది. ఇది గృహ నిర్మాణానికి అత్యంత అనుకూలమైన మాసమని మత్స్య పురాణం చెబుతోంది. ఈ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభించడం వల్ల సువర్ణ, పుత్ర లాభం కలుగుతుందని ప్రతీతి. ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పున్నమి కలది కావడం వల్ల ఈ మాసానికి ఫాల్గుణ మనే పేరు స్థిరపడింది. ఈ నెలతోనే శిశిర రుతువుకు తెరపడుతుంది. నువ్వులు, ఉసిరికలు, చూత కుసుమం (మామిడిపూత) విరివిగా వాడటానికి కొన్ని నెలలు ప్రత్యేకమైనవి. అందులో ఫాల్గుణం ఒకటి. ఇక, దశావతారాల్లో అతి ముఖ్యమైనదైన నృసింహస్వామి ద్వాదశి ఈ మాసంలోనే వస్తుంది.
ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే మాఘ, ఫాల్గుణ మాసాల కలయికలో వచ్చే ముఖ్యమైన తిథులు, పండుగలు, పర్వముల గురించి తెలుసు కుందాం.

భారతీయ సంవత్సరానికి పదకొండో చాంద్రమాసం, పదవ సౌర మాసం.. మాఘ మాసం. ‘మఖ’ నక్షత్రయుక్త ‘పూర్ణిమ’ ఈ మాసంలో రావడం వల్ల ఇది మాఘ మాసమైంది. వాస్తవానికి సంవత్సర కాలంలోని ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాలు చాలా పవిత్రమైనవి. ఈ నాలుగు మాసాల్లో మాఘ మాసానికి విశిష్ట స్థానం ఉంది. ఈ నాలుగు మాసాల పూర్ణిమ దినాలు అత్యంత పవిత్రమైనవి. ఈ దినాల్లో ప్రధానంగా సముద్ర స్నానాలు చేయడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శరీరాలు సముద్రంలోని ఉప్పునీటిలో సంవత్సరంలో కనీసం నాలుగు సార్లయినా మునగడం వల్ల ఆ ఉప్పదనం, రోమకూపాల ద్వారా మన శరీరంలోకి వెళ్లి మాలిన్యాలను, వ్యర్థ లవణాలను తొలగిస్తుందని వైద్య శాస్త్రం చెబుతోంది. ఇలాంటి సముద్ర స్నానాలు పూర్ణిమ నాడే ఎందుకు చేయాలంటే- చంద్రుడి పదహారు కళల శక్తీ సముద్రంలో ఉండేది ఆ ఒక్క పూర్ణిమ తిథి నాడే కాబట్టి. పౌరాణికులు మాఘ మాసాన్ని జ్ఞాన మాసంగా అభివర్ణించారు. అహం అనే పాపాన్ని తొలగించేది, అజ్ఞానమనే మృత్యువును హరించేది, నశింప చేసేది మాఘమని వేద ప్రవచనం. అందుకే దీన్ని వేద మాసం అన్నారు. ఇంకా ఈ మాసపు విశేషాలు, ఈ మాసంలో వచ్చే విశేష దినాలు, పర్వదినాల గురించి తెలుసుకుందాం.

మాఘ కృష్ణ (బహుళ) పాడ్యమి
ఫిబ్రవరి 1, గురువారం
చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్న ప్రకారం మాఘ కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్యవాప్తి వ్రతం ఆచరించాలి.
మాఘ కృష్ణ సప్తమి

ఫిబ్రవరి 7, బుధవారం
చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈనాడు విక్షుభార్క సప్తమి, సర్వాప్తి సప్తమి వంటి వ్రతాలు ఆచరించాలని ఉంది.
మాఘ కృష్ణ అష్టమి

ఫిబ్రవరి 8, గురువారం
ఈ తిథి సీతాష్టమి. అలాగే, దీనిని కాలా ష్టమిగా కూడా వ్యవహరిస్తారని ఆమాదేర్‍ జ్యోతిషి అనే గ్రంథంలో ఉంది. మంగళా వ్రతం ఆచ రించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
మాఘ కృష్ణ ఏకాదశి

ఫిబ్రవరి 11, ఆదివారం
మాఘ కృష్ణ ఏకాదశి నాడే శ్రీరాముడు రావణుడి లంకపై దండెత్తడానికి అనువుగా చేపట్టిన సేతువు నిర్మాణాన్ని విజయవం తంగా పూర్తి చేశాడని అంటారు. అందుకే ఈ తిథి నాడు వివిధ పనుల విజయవం తానికి శ్రీకారం చుట్టే ఆచారం తమిళనాడు తదితర దక్షిణాది రాష్ట్రాలలో ఆచరణలో ఉంది. అలాగే, ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో మాఘ బహుళ (కృష్ణ) ఏకాదశి తిథిని విజయైకాదశిగా పేర్కొంది.
మాఘ కృష్ణ ద్వాదశి

ఫిబ్రవరి 12, సోమవారం
మూల, ఆషాఢ నక్షత్రాలతో కూడిన మాఘ కృష్ణ ద్వాదశిని నీల ద్వాదశి అని కూడా అంటారని నీలమత పురాణం చెబుతుండ గా, ఈ తిథికి ముందురోజున ఉపవాసం ఉండి ఈనాడు నువ్వులు దానం చేయాలని అందులో ఉంది. చతుర్వర్గ చింతామణిలో రాసిన ప్రకారం.. ఈనాడు తిల ద్వాదశీ వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం ఆచ రించాలి.
మాఘ కృష్ణ త్రయోదశి

ఫిబ్రవరి 13, మంగళవారం
ఇది ద్వాపర యుగాది తిథి. ఈ యుగ సంధిలోనే వేదవ్యాసుడు అవతరించి వేదాన్ని విభాగించాడని, ధర్మశాస్త్ర పురాణేతిహాసాలను రచించాడని ప్రతీతి. ఈనాడు విరివిగా దానాలు చేయాలని అంటారు. ద్వాపర యుగ ప్రమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల (8,64, 000) మానవ సంవత్సరాలు. ఇందులో రెండు పాళ్లు ధర్మం నడుస్తుందని అంటారు. భగ వంతుడు ఈ యుగంలో పీతవర్ణధారిగా
ఉంటాడు. ఈ యుగాన్ని తామ్ర యుగమనీ అంటారు. ప్రజల్లో వైరుధ్య బుద్ధులు, సందేహాలు ఎక్కువవుతాయనీ, ప్రతి విషయంలో ప్రజలు సంశయ పీడితులుగా ఉండటం వల్ల ఈ యుగానికి ద్వాపర యుగం అనే పేరు వచ్చిం దని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ఈ యుగంలోని మనుషులు శరీరంలో రక్తం ఉన్నంత కాలం ప్రాణాలు ధరించి ఉంటారు. ఇక, మాఘ కృష్ణ త్రయోదశి తిథి నాడు విరివిగా దానాలు చేస్తారు.
మాఘ కృష్ణ చతుర్దశి

ఫిబ్రవరి 14, బుధవారం
ఇది మహా శివరాత్రి పర్వ తిథి. ఈరోజు రటంతీ చతుర్దశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈ తిథి నాడు అరుణో దయాన్నే స్నానం చేసి యమ తర్పణం చేయాలని శాస్త్ర వచనం. ఈనాడు కృష్ణ చతుర్దశీ వ్రతం, సర్వకామ వ్రతం చేయాలని హేమాద్రి వ్రత ఖండంలో ఉంది. ప్రధానం ఇది- శివరాత్రి పర్వదినం. శివయోగ యుక్తమైన ఈ తిథి మహా
శివరాత్రి పర్వదినమని శివరాత్రి మహాత్మ్యం అనే గ్రంథం చెబుతోంది. అలాగే, ఈనాడు విష్ణు చిత్తరామానుజ స్వామి తీర్థం కూడా. మాఘ బహుళ చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి యమునికి గల పద్నాలుగు నామాలతో తర్పణం, నువ్వులు, దర్భ, నీరు కలిపి ఇవ్వాలి. ఈనాడు పులగం తినాలి. శివుడిని బిల్వ పత్రాలతో, తుమ్మి పూలతో పూజించాలి.
మాఘ కృష్ణ అమావాస్య

ఫిబ్రవరి 15, గురువారం
పితృకర్మలు నిర్వహించడానికి ఇది అనువైన తిథి. ఈ దినం మన్వాది అని ఆమాదేర్‍ జ్యోతిషీ పేర్కొంటుండగా, ఈనాడు నవనీతధేను దానం చేయాలని పురుషార్థ చింతామణి చెబుతోంది. అలాగే, ఈనాడు శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాము డిని యథాశక్తి కొలవాలి. మాఘ కృష్ణ అమావాస్య కుంభ సంక్రమణ ప్రయుక్త విష్ణుపద పుణ్యకాలం. ఈ కాలంలో సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నానం వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఇది మాఘ మాసపు చివరి దినం.
ఫాల్గుణ శుక్ల (శుద్ధ) పాడ్యమి

ఫిబ్రవరి 16, శుక్రవారం
తెలుగు చాంద్రమానం ప్రకారం ఫాల్గుణం సంవత్సరంలో పన్నెండవ మాసం. శిశిర రుతువుకు ఈ మాసంతో తెరపడుతుంది. ఈ మాసపు తొలి దినం- ఫాల్గుణ శుద్ధ పాడ్యమి. ఈనాడు భద్ర చతుష్టయ, గుణావాప్తి, పయో మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం చెబుతోంది.
ఫాల్గుణ శుద్ధ తదియ

ఫిబ్రవరి 18, ఆదివారం
ఈ తిథి నాడు మధూక వ్రతం, సౌభాగ్య తృతీయా వ్రతం వంటివి చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది.
ఫాల్గుణ శుద్ధ చవితి

ఫిబ్రవరి 19, సోమవారం
అవిఘ్న గణపతి వ్రతాన్ని ఈ తిథి నాడే ఆచరించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఈనాడు వినాయకుడిని డుంఢి గణపతిగా పూజించాలి. రాజవ్రతం చేయాలి. ఇది మంగళ కరమైంది. నువ్వు బిళ్లలతో భోజనం, నువ్వుల దానం, హోమం పూజ, అగ్ని వ్రతం వంటివి కూడా చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈ తిథి రామకృష్ణ పరమహంస జనన తిథి.
ఫాల్గుణ శుద్ధ పంచమి

ఫిబ్రవరి 20, మంగళవారం
ఫాల్గుణ శుద్ధ పంచమి తిథి నాడు అనంత పంచమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
ఫాల్గుణ శుద్ధ సప్తమి

ఫిబ్రవరి 22, గురువారం
చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్న ప్రకారం.. అర్క సంపుట సప్తమీ, కామదా సప్తమీ, త్రిగతి సప్తమీ, ద్వాదశ సప్తమీ తదితర వ్రతాలను ఈనాడు ఆచరించాలి.
ఫాల్గుణ శుద్ధ అష్టమి

ఫిబ్రవరి 23, శుక్రవారం
ఫాల్గుణ శుద్ధ అష్టమి తిథి నాడు లలిత కాంతీదేవి వ్రతం చేస్తారని తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు దుర్గా ష్టమి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే మరో గ్రంథంలో ఉంది.
ఫాల్గుణ శుద్ధ నవమి

ఫిబ్రవరి 23, శనివారం
ఫాల్గుణ శుద్ధ నవమి నాడు ఆనంద నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. అలాగే, ఈనాడు దుర్గాపూజ చేయాలని ఆయా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి

ఫిబ్రవరి 26, సోమవారం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు చిత్రరథుడు పరశురాముని పూజించాడని పురాణగాథ. దీనినే ఆంధప్రదేశ్‍లోని గోదావరి జిల్లాల వారు కోరుకొండ ఏకాదశి అనీ అంటారు. కోరు కొండలో నరసింహ స్వామి కోవెలలో ఈరోజు గొప్ప తిరునాళ్లు జరుపుతారు. కాకతీయుల అనంతరం ప్రసిద్ధికెక్కిన కాపయ నాయకుని కాలం నుంచి ప్రసిద్ధమైన కాటమ క్షేత్రం ఇది. ఈనాడు వేలకొద్దీ జనం అక్కడికి వస్తారు. గోదావరి తీరంలో ఈ తీర్థకాలాన్ని పురస్కరించు కుని ‘కోరుకొండ ఏకాదశికి కోడి గుడ్డులంత’ అనే సామెత ఒకటి ఉంది. ఈ సామెత మామిడి కాయలకు సంబంధించి వాడతారు. మకర సంక్రాంతికి మంచి పూత మీద ఉండిన మామిడికాయలు ఇప్పటికి కోడిగుడ్డు పరిమాణానికి ఎదుగుతాయి. ఇది చెప్పడానికే పై సామెతను గోదావరి తీర ప్రాంతవాసులు తమ సంభాషణల్లో ప్రయోగిస్తుంటారు. ఇక, వ్రత గ్రంథాల ప్రకారం.. ఈ ఏకాదశి ఉసిరికాయతో ముడిపడి ఉంది. అందుకే దీనిని అమలైక్యాదశిగా పేర్కొన్నాయి. ‘ఆమలకి’ అంటే ఉసిరికాయ. కార్తీక మాసంలో మాదిరిగానే ఫాల్గుణ మాసంలో మళ్లీ ఉసిరిక ఉపయోగానికి రెండు రోజులు మన పెద్దలు ప్రత్యేకించారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వివరణలో ‘ఆమలకే వృక్షే జనార్థనః’ అని ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆమలక వృక్షం జనార్ధన స్వరూపమనీ, దాని కింద ఆమలైకాదశి వ్రతాన్ని నిర్వహించాలని శాస్త్ర వచనం. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు ఆమలకి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. చైత్ర మాసంలో ఆమలక ఫలాలు వైద్యానికి మంచివని అనుభవజ్ఞుల మాట. దీనిని బట్టి కార్తీక మాసం నుంచి చైత్ర మాసం వరకు గల ఆరు మాసాల్లోనూ ఉసిరిని ఏదో విధంగా వాడాలని మన పెద్దలు నియమం విధించారు. అధిక మాస ప్రశంస లేని సాధారణ సంవత్సరాల్లో మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. ఆ ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు వివిధ నామాలు ఉన్నాయి. విష్ణువు చర్యలను బట్టి శయనైకాదశి, పరివర్తనైకాదశి, ప్రబోధిన్యేకాదశి, వ్రత నియమాన్ని బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి, వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రైకాదశి మున్నగునవి ఏర్పడ్డాయి. కానీ, అన్నింటిలోకి ఒక పండుతో సంబంధించిన ఏకాదశి ఆమలైకా దశి ఒక్కటే. ఏకాదశి వంటి గొప్ప తిథిలో ఉసిరిని జత చేయడం వల్లనే ఆమలకిలో ఏదో విశిష్టత ఉందని భావించవచ్చు. మన తెలుగు సంప్రదాయంలో కొన్ని పండుగలు వచ్చే నెలలో కొన్ని ఫలాలు పూజనీయం, వరణీయమై భాసిల్లుతున్నాయి. వాటిని ఆయా తిథుల్లో భుజించాలని మన పెద్దలు ఆరోగ్యరీత్యా నియమం విధించారు. ఆయా తిథి నియమాలను అనుసరించి ఆహారాన్ని, ఫలాలను తీసుకోవడం వల్ల ఎనలేని ఆరోగ్యం చేకూరుతుంది. ఈ క్రమంలోనే చైత్ర మాసంలో అశోక కలికా ప్రాశనం, ఫాల్గుణ మాసంలో ఆమ్రపుష్ప భక్షణం, కార్తీకంలో బిల్వపత్ర పూజ, ఆశ్వ యుజంలో శమీ వృక్ష పూజ వంటి వాటి వల్ల మనుషులకు ఆరోగ్యం చేకూరుతుంది. షడ్రసాల్లో ఉప్పు తప్ప మిగతా అన్ని రసాలు ఉసిరికలో ఉన్నాయి అని మన వైద్య గ్రంథాలన్నీ ఎలుగెత్తి చెబుతున్నాయి. ఇది మహత్తరమైన ఔషధీ గుణాలు గల ఫలం. అమృతాఫలం అనే గ్రంథంలో నలభై పేజీల్లో కేవలం ఉసిరిక ఔషధీ గుణాల గురించి ఉందంటే దీని ప్రశస్తిని అర్థం చేసుకోవచ్చు. అలాగే, ఫలజాతులు అనే గ్రంథంలోని యాభై పేజీల్లో దీని సర్వాంగాల గురించి వర్ణనలు ఉన్నాయి. వైద్యం, పారి శ్రామికంగా దీని ఉపయోగాల గురించి, వాగ్భటంలో పుంజీల కొద్దీ శ్లోకాలలో దీని రసాయనిక, కాయకల్పాది చికిత్సోపయోగాలను విపులీకరించారు. తెల్ల ప్లేగు అనే క్షయ వ్యాధి రాకుండా మానవుని రోగనిరోధక శక్తిని పెంపొందించే మహా ఔషధి ఉసిరిక. ఇంత ప్రాధాన్యం కలది కాబట్టే మన వ్రత నియమాల్లో దానికో స్థానాన్ని కలిగించి, దాని కోసం ఏకంగా ఏకాదశినే ప్రత్యేకించిన మన పెద్దల లోకహితం ఎంత విశిష్టమైనదో అర్థం చేసు కోవచ్చు. కాబట్టి ఫాల్గుణంలో ఉసిరికను ఆహా రంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఫాల్గుణ శుద్ధ ద్వాదశి

ఫిబ్రవరి 27, మంగళవారం
పుష్యమితో కూడిన ద్వాదశి గోవింద ద్వాదశి అనీ, ఆనాడు గంగా స్నానం మహా పాతక నాశనంగా ఉంటుందని తిథి తత్త్వం అనే గ్రంథంలో రాశారు. ఈనాడు మనోరథద్వాదశీ, సుకృత ద్వాదశీ, సుగతి ద్వాదశీ, విజయా ద్వాదశీ తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
అలాగే, ఈనాడు ఆమలకీ వ్రతం చేస్తారని కూడా పేర్కొన్నారు. ఇది కూడా ఉసిరికాయ సంబంధమైనదే కావడం విశేషం. ఇంకా, ఈ తిథి నాడు పుండరీకాక్ష పూజ కూడా చేస్తారు.
ఫాల్గుణ శుద్ధ చతుర్దశి, ఫిబ్రవరి 28, బుధవారం
ఈనాడు లలిత కాంత్యాఖ్యదేవీ వ్రతం ఆచరిస్తారని తితి తత్త్వంలోనూ, మహేశ్వర వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలోనూ ఉంది.

Review మహా మాఘం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top