జంట పర్వాల కన్నుల పండువ

ఆశ్వయుజంలో ఆనందాన్ని పంచే దసరా, దీపావళి పండుగలు
విజయ వికాసాన్ని నేర్పే విజయదశమి.. జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి
ఆశ్వయుజ శుద్ధ దశమి, మంగళవారం, అక్టోబరు 8: దసరా
ఆశ్వయుజ బహుళ చతుర్దశి, ఆదివారం, అక్టోబరు 27: దీపావళి

మనుషుల్లో ఆధ్యాత్మికంగా ఆనందం, వికాసం రెండింతలు చేసే మాసం.. ఆశ్వయుజం. దసరా, దీపావళి వంటి రెండు విశేషమైన పర్వాలు ఈ మాసంలో మనల్ని ఉత్తేజితం చేస్తాయి. అసలు దసరా, దీపావళి పర్వాల వెనుక పరమార్థం ఏమిటి? వీటిలో అంతరార్థం ఏమైనా ఉందా?… ఎందుకంటే పండుగలను కేవలం భక్తిలో భాగంగా మాత్రమే చూస్తే వాటిలోని అంతరార్థం మనకు ఎప్పటికీ అవగతం కాదు. భక్తిని దాటి ఆధ్యాత్మిక జ్ఞాన దృక్కోణంలో వాటిని దర్శిస్తే.. అద్భుతమైన వికాసం కలుగుతుంది. ఈ పండుగలు, పర్వాలు మానవాళికి నేర్పే మంచి లక్షణాలేమిటో తెలిపే ప్రయత్నం.
ఆశ్వయుజం అంటేనే విజయ మాసం. ఈ మాసారంభమే శరన్నవరాత్రులతో ఆరంభ మవుతుంది. అధర్మం మీద.. ధర్మం విజయకేతనం ఎగురవేసే మాసం ఇది. ఈ మాసంలోని తొలి పది రోజులూ జగజ్జనని వీర విహారంతో నర్తించి మహిషాసుర సంహారం చేసి విజయశంఖారావం చేస్తే.. మాసాంతంతో చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి విజయదుందుభి మోగిస్తాడు. లోకకంటకులైన ఇద్దరు రాక్షసుల సంహారంతో సర్వ లోకాలూ ఆనంద దీపాలు వెలిగించిన రోజులివి.
దుష్ట శక్తులపై జగజ్జనని సాధించిన విజ యానికి ప్రతీకగా విజయ దశమి (దసరా)ని జరుపుకుంటారు. రాముడు రావణుడిని సంహ రించిన సందర్భం కూడా ఇదేనని అంటారు. అయితే, దసరా కథలతో ముడిపడిన రావణుడు, మహిషాసురుడు చెడుకు, దుష్ట స్వభావానికి ప్రతీకలు. మనలో ఉన్న చెడును జయించిన రోజునే నిజమైన పండుగ. మనోవికారాలను అధిగమించడానికి కావాల్సిన శక్తిని అమ్మవారు ప్రసాదిస్తారు. నవరాత్రులు నవదుర్గలను పూజిం చడం వెనుక ఉన్న అంతరార్థం కూడా ఇదే. రావణ సంహారానికి ప్రతీకగా దసరా నాడు ఊరూరా రావణుడి బొమ్మలు దహనం చేయడం.. దుష్ట బుద్ధిని మనకు మనమే హరించుకోవాలనే తత్వాన్ని బోధిస్తుంది.
సామాజిక సౌభ్రాతృత్వ వేడుక – దసరా
విజయ దశమి వెనుక ఆధ్యాత్మిక విశేషాలే కాదు.. ఆధ్యాత్మిక వికాసం కలిగించే సామాజిక కోణమూ ఉంది. దసరా వచ్చిందంటే చాలు ప్రతి పల్లె అతిథులతో కళకళలాడుతుంటుంది. ప్రతి లోగిలీ ఆడపడుచులతో సందడిగా మారుతుంది. శమీ వృక్షాన్ని పూజించడం, పాలపిట్టను దర్శిం చడం, ఒకరికొకరు బంగారాన్ని (శమీ పత్రాలను) ఇచ్చుకోవడం, అవి తీసుకుంటూ అభినందనలు తెలుపుకోవడం.. ఇలా దసరా ఉత్సవంలో ప్రతి సందర్భం అందరినీ కలిపి ఉంచుతుంది. సమష్టి తత్వాన్ని పెంచుకుంటూ దసరాతో సరికొత్త విజ యాలకు అందరూ నాంది పలకాలి.
శత్రువులపై విజయానికి శమీ పూజ
దసరా పూజల అనంతరం శమీ పూజ చేయడం ఆచారం. శమీ వృక్షం పాపాలను హరి స్తుంది. శత్రు బాధలను నివృత్తి చేస్తుంది త్రేతా యుగంలో రావణుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు అమ్మవారిని జమ్మి ఆకులతో పూజిం చాడని చెబుతారు. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసానికి ముందు శమీ వృక్షంపై తమ ఆయుధాలను ఉంచుతారు. ఏడాది తరువాత విజయ దశమి రోజున అర్జునుడు శమీ వృక్షాన్ని పూజించి, వాటిపై ఉంచిన ఆయుధాలను ధరించి గోగ్రసంరక్షణలో కౌరవులపై విజయం సాధిం చాడు. దసరా రోజున శమీ శమయతే.. అనే శ్లోకాన్ని కాగితం మీద రాసి శమీ వృక్షానికి పూజ చేసి దాని కొమ్మకు కడతారు. అనంతరం జమ్మి ఆకులను బంగారంగా భావిస్తూ పరస్పరం ఇచ్చు కుంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
ఆశావాహ దృక్పథానికి హేతువు పాలపిట్ట
దసరా రోజున పాలపిట్ట దర్శనం శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. శమీ పూజ తరువాత పాలపిట్ట దర్శనం తప్పనిసరి అని ఆచారం. పాలపిట్ట దర్శనం వెనుక ఒక పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనిపించిందట. అప్పటి నుంచి వారికి విజయాలు సిద్ధించాయని జాన పదుల నమ్మకం. అందుకే విజయ దశమి రోజున పాలపిట్టను దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. నిజానికి పాలపిట్టను చూడగానే, అంతా మంచే జరుగుతుందని మనసులో భావించడం వల్ల ఒక విధమైన ఆశావాహ దృక్పథం కలుగు తుంది. అది మనల్ని ముందుకు నడిపించడానికి ఛోదకశక్తిలా ఉపయోగపడుతుంది.
ఆ రాక్షసులు మనలోనే..
శరదృతువులో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగేవి శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల సమయంలోనే ఆది పరాశక్తి మహిషాసురుడిని సంహరించింది. శరన్నవ రాత్రులనే దేవీ నవరాత్రులని కూడా అంటారు. దేవీ నవరాత్రుల్లో శక్తి ప్రధానం. దుర్గ తొమ్మిది రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి, వధించింది. చివరికి పదో రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగానే పదవ రోజును దసరాగా, విజయదశమిగా నిర్వహించుకుంటారు. మనం ఇక్కడ గమంచాల్సిందేమిటంటే- మనలోని దుర్గుణాలే రాక్షసులు. మనలోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలో ఉండే దుర్గుణాలను తొలగించా లని వేడుకోవడమే దుర్గా నవరాత్రుల పూజల్లోని అంతరార్థం.
విజయదశమి నాడు దుర్గాదేవి మహిషాసురి డిని వదించినది. మహిషుడు అంటే దున్న అని అర్థం. మనలోని అహంకారం, అజ్ఞానం, ఇత్యాది చెడు అవలక్షణాన్నీ జంతు లక్షణాలే. అవే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు. ఆది పరాశక్తి బలికోరేది మనలోని ఈ దుర్గుణాలనే. వీటిని దును మాడే దేవత కాబట్టే ఆమెకు దుర్గ అనే పేరు వచ్చింది.
కొత్త జ్ఞానం కలిగే సమయం..
నవరాత్రులు అంటే- ‘నవ’ నూతనమైనది, కొత్తదీ అని అర్థం. ‘రాత్రి’ అంటే జ్ఞానమని అర్థం. రాత్రి చీకటికి ప్రతిబింబం కదా! మరి, జ్ఞానమెలా అవుతుందనే సందేహం రావచ్చు. జ్ఞానమనే దీపం చీకటనే అజ్ఞానంలోనే కనిపిస్తుంది. అందుకే రాత్రి అంటే ఇక్కడ జ్ఞానానికి ప్రతీక. మనిషికి నూతన జ్ఞానాన్ని ప్రసాదించే రోజులే నవరాత్రులు. వాటిని ప్రసాదించే తల్లే దుర్గాదేవి. ఆమే పరాశక్తి, మహా సరస్వతి, మహాలక్ష్మి. అందుకే మిగతా పండుగల్లో మాదిరి కాకుండా దసరా వేడుకల్లో ఒక్కో రోజు ఆ శక్తిని ఒక్కో రూపంలో ధ్యానించి, పూజించే ఆచారం ఏర్పడింది.
విజయ కాలం వచ్చింది..
అశ్విన్యస్య సితే పక్షే దశమ్యాం తారకోదయే
సకాలో విజయోనాయ సర్వకామ్యార్థ సాధక:
ఆశ్వయుజ శుక్ల దశమి నాటి సాయంసంధ్యా కాలాన్నే విజయ కాలం అంటారు. అది సర్వ కార్యసాధకమైన సమయం. ఈ దశమీ తిథి శ్రవణా నక్షత్రంతో కూడి ఉండాలనేది పెద్దల నియమం. దసరా పుణ్య దినాన ప్రజలంతా చేరి ఊరి పొలిమేర దాటుతారు. దీనినే సీమోల్లంఘనం అంటారు. ఊరికి ఈశాన్య దిక్కున ఉన్న శమీ వృక్షం వద్దకు చేరి పూజలు చేస్తారు.
హారేణతు విచిత్రేణ భాస్వత్కనక మే•లా
అపరాజితా భద్రరతా కరోతు విజయం మమ
మంచి హారంతో, తళుకులీను బంగారు కటి సూత్రంతో మంగళకారియైన దుర్గా! అపరాజితా దేవిగా నాకు విజయమిచ్చు గాక! అని పై శ్లోకానికి భావం.
శమీ వృక్షం అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జు నుడి ధనువును కాపాడింది. శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్ని ఇస్తుంది. పనులన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.
తర-తమ భేదాలను పోగొట్టే సీమోల్లంఘనం
ఇక, దసరా నాడు వినిపించే పదం- సీమో ల్లంఘనం. శమీ పూజ కోసం వెళ్లే ఊరి ప్రజలంతా ఈ సీమోల్లంఘన చేయాలి. అంటే, ఊరి పొలిమేరలు దాటి తిరిగి వెనక్కి రావడన్నమాట. ఇందులో అంతరార్థం ఏమిటంటే, సీమ అంటే పొలిమేర లేదా హద్దు. హద్దు అనేది సాధారణంగా శత్రువులు, మిత్రులు అనే భేదాభిప్రాయం వచ్చి నపుడు వారిరువురి మధ్య కొన్ని హద్దులు ఏర్పడ తాయి. వాటిని తుడిచేసి, శత్రువులు సైతం పాత కక్షలు మరిచిపోయి అందరూ మిత్రులుగా మారిపోవాలనేదే సీమోల్లంఘనలోని అంతరార్థం.
మాయ- శక్తి
మానవుల జీవనపథంలో ఆధ్యాత్మిక భావ మందారాలను పూయించే దివ్య కల్పతరువు ఆ ఆదిశక్తి. మాయ, శక్తి.. ఈ రెండింటికి 8-9 అంకెలతో ఉండే బంధం విడదీయరానిది. దేవీ నవ రాత్రుల పూజకూ, శ్రీ విద్యోపాసనకూ, మానవ దేహానికి ఎంతో సంబంధం ఉంది. మనిషిలో 9 చక్రాలు ఉన్నాయి. ఇవి శ్రీ విద్యోపాసనలోని 9 చక్రాలే. అంటే శ్రీ విద్యోపాసన చేయడం అంటే, ఆత్యోపాసనే. దేవీ అర్చన అంటే ఆత్మపూజే. దేహ స్థానం చక్రం. అది శ్రీ చక్రంలోని చక్రం. భ్రూ మధ్యం ఆజ్ఞా బిందువు. లంబిక ఇంద్రయోగి త్రికోణము. కంఠము విశుద్ధ అష్ట కోణము. హృదయము అనాహత అంతర్థశారము. నాభి మణిపూర బహిర్దశారము. వస్తి స్వాధిష్టాన చతుర్దశారము. గుదపానము మూలాధార అష్ట దళము. తదధోదేశము కులము షోడశారము.

దసరా అంటేనే ఒక సరదా, ఒక ఆనందం, ఒక ఉత్సాహం వెల్లువెత్తుతాయి. మన దేశంలో ఈ పర్వం జాతీయ పండుగ. మరి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో జరిగే దసరా ఉత్సవాలు లోక ప్రసిద్ధి కూడా. అంతర్జాతీయంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఉత్సవాల గురించి తెలుసుకుందాం.

మైసూర్‍: రాజసం.. దర్పం
మైసూరు రాజ ప్రాసాదంలో జరిగే దసరా ఉత్సవాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది వస్తుంటారు. మైసూరు క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు చాముండేశ్వరిగా పూజలందుకుంటారు. మైసూర్‍ ప్యాలెస్‍లో మొదటి దసరా వేడుకలు క్రీస్తు శకం 1610లో ప్రారంభమయ్యాయి. ఇక, క్రీ.శ 1805లో కృష్ణరాజ వడయార్‍-3 హయాంలో ప్రత్యేక దర్బార్‍ నిర్వహించే సంప్రదాయం మొదలైంది. ఈనాడు మైసూరు రాచవీధుల్లో ఏనుగుల రాజసాన్ని కళ్లారా చూడాల్సిందే కానీ, చెప్పనలవి కాదు. ఈ ఏనుగుల అంబారీపై అమ్మవారిని ఊరేగిస్తారు. అంబారీపై ఊరేగే అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. దీనినే జంభూస్వారీ అంటారు. ఈ ఊరేగింపు నాలుగు కి.మీ.మేర కొనసాగుతుంది. ఇక, దసరా సందర్భంగా ప్యాలెస్‍ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్‍ ప్రత్యేక ఆకర్షణ.

పశ్చిమబెంగాల్‍: ఆబాలగోపాలం..
దసరా అంటే మొదట గుర్తుకు వచ్చేది పశ్చిమ బెంగాల్‍ రాష్ట్రమే. ఇక్కడ జరిగే దసరా ఆరాధనలు శరన్నవరాత్రి వైభవాన్ని కళ్లకు కడతాయి. ఎక్కడ చూసినా కాళీదేవి మంటపాలే. ఏ వీధి చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. ఉత్సవ మూర్తుల ఊరేగింపులు, ప్రత్యేక పూజలు అలౌకిక ఆనందాన్ని పంచుతాయి. ఇక్కడి కాళికా మందిరం జగత్‍ ప్రసిద్ధి.

కులుశేఖర పట్టిణం, తమిళనాడు: చండికను చూడాల్సిందే
తమిళనాడు తీర ప్రాంత గ్రామం కుల శేఖరపట్టిణం. పాండ్య రాజు కులశేఖరుడి కాలంలో ఇది రేవు పట్టణం. అప్పట్లో రాజ్యానికి అవసరమైన బంగారు నాణేలు ఇక్కడ తయా రయ్యేవి. ప్రస్తుతం దసరా ఉత్సవాలకు ఈ గ్రామం పెట్టింది పేరు. ఇక్కడి సముద్ర తీరంలో కొలువైన ముత్తురమ్మన్‍ దేవి ఉత్సవాలు దసరా నాడు వైభవంగా జరుగుతాయి. ఈ ఊరి జనాభా 30 వేలు మాత్రమే. దసరా నాడు మాత్రం ఇక్కడ 20 లక్షల మంది నిండిపోతారు. ముఖ్యంగా చండిక వేషం కట్టి చిందులు వేయడాన్ని అత్యధిక మంది ఆనందిస్తారు. మండుతున్న కుండలను ధరించి నర్తిస్తూ అమ్మవారికి హారతినిస్తారు.

కుల్లు: దేవతలకు పుట్టినిల్లు
దేవతలు నివసించే రాష్ట్రంగా పేర్గాంచిన హిమాచల్‍ప్రదేశ్‍లో దసరా ఉత్సవాలు విభిన్నంగా సాగుతాయి. విజయదశమి నాడు శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. 17వ శతాబ్దంలో కుల్లు రాజ్యం క్షేమం కోరి అయోధ్య నుంచి రాముడి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెబుతారు. దసరా సమయంలో చుట్టుపక్కల గ్రామాల్లో గల అందరు దేవీదేవతల ఉత్సవ విగ్ర హాలను ఇక్కడకు చేరుస్తారు. ఈ సందర్భంగా హిమాచల్‍ప్రదేశ్‍ సంప్రదాయ నృత్యాలు అల రిస్తాయి. అన్నిచోట్లా దసరా నాడు రావణ దహనం జరిగితే, కుల్లులో మాత్రం బియాస్‍ నది ఒడ్డున ఎండుగడ్డి, చెట్ల పొదలకు నిప్పు పెట్టి లంకా దహనం నిర్వహిస్తారు.

బస్తర్‍: భలే సరదా
దండకారణ్యంలోకి బస్తర్‍లో జరిగే దసరా ఉత్సవాలు కూడా చాలా ప్రఖ్యాతిగాంచాయి. ఇక్కడ శ్రీరాముడు దాదాపు 14 ఏళ్లు వనవాసం చేశాడని చెబుతారు. ఇక్కడ ఉన్న దంతేశ్వరి ఆలయంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కోయ వారి ఆటపాటలు అలరిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు ఈ ఉత్సవాలకు హాజరవుతుంటారు.
రాజస్థాన్‍: ‘కోట’ దాటే ఆనందం
రాజస్థాన్‍లోని చంబల్‍ నదీ తీరంలో ఉన్న కోటలో దసరాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. భారతదేశంలోని మిగతా ప్రాంతాలలో జరిగే దసరా ఉత్సవాలతో పోలిస్తే ఇక్కడ జరిగే ఉత్సవాలు ప్రత్యేకం. దాదాపు 75 అడుగుల కంటే ఎత్తుగా ఉన్న రావణ, కుంభ కర్ణ విగ్రహాలను చెడుపై మంచి సాధించిన విజ యానికి గుర్తుగా ఇక్కడ తగులబెడతారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు, భక్తులు రంగురంగుల దుస్తులు ధరించి ఆకట్టుకుంటారు.

Review జంట పర్వాల కన్నుల పండువ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top