చిన్నారి లోకం

సీతాకోకచిలుక ఎలా రూపాంతరం చెందుతుంది?
అసహ్యకరమైన పురుగు రూపం సీతాకోకచిలుకలా సౌందర్యాన్ని ఎలా రంగరించుకుంటుంది?

ఒకరోజు ఒక రాజు గారికి ఈ సందేహం కలిగింది. గొంగళి పురుగు సీతాకోకచిలుకలా ఎలా మారుతుందో తెలుసుకోవాలని ఆయన అనుకున్నాడు. వెంటనే అందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రిని ఆదేశించాడు. ఒకరోజు సమీపంలోని ఉద్యానవనానికి మంత్రి.. రాజు గారిని తీసుకుని వెళ్లాడు. మొదట ఆకులను అంటిపెట్టుకుని ఉన్న లార్వా వంటి దశను మంత్రి రాజుకు చూపించి అది తొలి దశ అని చెప్పాడు.

తరువాత ఏడు రోజులకు ఆ లార్వా కోశస్థ దశకు చేరుకోవడాన్ని రాజు గమనించాడు. కోశస్థ దశలో గొంగళిపురుగు తన చుట్టూ ఒక కోశాన్ని (గూడు వంటిది) అల్లుకుంటుందని, మొక్కల ఆకులను గట్టిగా పట్టుదారంతో అంటిపెట్టుకుని ఈ దశలో ఉంటుందని మంత్రి రాజుకు వివరించాడు. కోశస్థ దశలో గొంగళి పురుగు తన చర్మం ద్వారానే శ్వాసించడాన్ని, ఆకులను తింటూ క్రమంగా పెరగడాన్ని రాజు గమనించాడు.

మరికొద్ది రోజులకు గొంగళిపురుగు ప్యూపా దశకు చేరుకుంది. ఈ దశనే విశ్రాంతి దశ అనీ అంటారు. నాలుగోది ఫ్రౌడ దశ. ఈ దశలో గొంగళిపురుగు తన చుట్టూ ఉన్న కోశాన్ని తొలగించుకుని చిన్న సీతాకోకచిలుకగా బయటకు వస్తుంది. క్రమంగా రెక్కలను విచ్చుకునే దశలో అదెంతో ఘర్షణను అనుభవిస్తుంది.
రాజును ఈ నాలుగో దశ ఆకర్షించింది. ఈ దశలోనే పురుగు కాస్తా సీతాకోకచిలుకలా ఎలా మారుతుందనేది ప్రత్యక్షంగా చూడాలని ఆయన కోరిక.
కొన్ని గొంగళిపురుగులు కోశాన్ని తొలగించుకుని సీతాకోకచిలుకలుగా మారడాన్ని ఒకరోజంతా ఆయన దగ్గరుండి పరిశీలించాడు.

గొంగళిపురుగు రెక్కలు తొడుక్కునేందుకు, కోశం నుంచి బయట పడేందుకు పడుతున్న ఘర్షణ… అనంతరం కొద్దిసేపటికి సీతాకోకచిలుకలా మారి గాల్లోకి ఎగరడాన్ని ఆయన చూడగలిగాడు.

అయితే, ఒక గొంగళిపురుగు కోశం నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుండగా, రాజు చలించిపోయి.. ఒక చిన్న పుల్ల తీసుకుని దాన్ని కోశం నుంచి బయట పడవేశాడు. అలా చేయడం ద్వారా దానికి శ్రమను తగ్గించి, గాల్లోకి ఎగిరిపోవాలనేది ఆయన ఉద్దేశం. కానీ, అది కోశం నుంచి బయటకు లాగగానే నేరుగా కిందపడిపోయింది. కొద్దిసేపటికి దానిలో వె•ంటనే కదలిక ఆగిపోయింది.

అస•డు మంత్రి రాజుకు ఇలా వివరించాడు.

‘గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారడం అనేది ప్రకృతి సహజ ధర్మం. అదలా మారే దశలో ఎంతో ఘర్షణ అనుభవిస్తుంది. ఆ ఘర్షణ నుంచే అది గాల్లోకి ఎగరడానికి అవసరమైన రెక్కలను, రాపిడి వల్ల రెక్కలు విచ్చుకునే శక్తిని సంపాదించుకుంటుంది. మీరు దానిని ఘర్షణ నుంచి బయటపడవేయడం కోసం సాయం చేశానని అనుకున్నారు. కానీ, ఈ చర్య వల్ల అది పూర్తిగా రెక్కలు విచ్చుకోకుండానే పడిపోయింది. ఘర్షణ లేకుండా, సహజ ధర్మానికి విరుద్ధంగా మీరు చేసిన సాయం వల్ల అది నేరుగా బయటికి వచ్చేయడం వల్ల అది సీతాకోకచిలుకలా మారే పరిణామ క్రమం ఆరంభంలోనే దాని దశను కోల్పోయింది. గొంగళిపురుగు సీతాకోకచిలుకలా ఎలా మారుతుందనేది మీరు చూడాలనుకోవడం ధర్మమే. కానీ, దానిని కోశస్థ దశ నుంచి మీకు మీరుగా బయటకు లాగడం మాత్రం ప్రకృతి విరుద్ధం. మీరు చేసిన పని వల్ల అది జీవితాన్ని కోల్పోయింది’.

మంత్రి చెప్పింది విని రాజు నొచ్చుకున్నాడు.

ఙఙఙ

ఈ కథ నేటి తరం పిల్లలకు కూడా వర్తిస్తుంది. పిల్లలను సహజంగా ఎదగనివ్వాలి. శక్తియుక్తులను సంపాదించుకునే నేర్పును వారికి చిన్ననాటే అలవర్చాలి. అందువల్ల వారు కొంత ఘర్షణకు గురైనా.. పెద్దలు చలించిపోకూడదు. అన్నీ అమర్చిపెట్టి, అన్నీ సమకూర్చి, నొప్పి తెలియకుండా పెంచితే రాజు గారి కథలోని సీతాకోకచిలుకలా పిల్లల భవిత మారుతుంది.

చిన్నారులంటే సీతాకోకచిలుకల్లాంటి వారు.

ఆడుకోవడానికి వారి చేతిలో వీడియో గేమ్‍ ఐటమ్‍ను పెడితే సహజమైన ఆటలకు దూరమైపోతారు.
ఇంట్లోని హోమ్‍ థియేటర్‍లో పాటలు వినిపిస్తే స్వతహాగా పాడే స్వభావాన్ని కోల్పోతారు.

ఏ ప్రాబ్లమ్‍ను ఎలా సాల్వ్ చేయవచ్చో గూగుల్‍ సెర్చ్లో చూపిస్తే సొంతంగా సమస్యలను పరిష్కరించుకునే శక్తిని సంపాదించుకోలేరు.
అందుకే వారిని ఆరుబయట ఆడనివ్వాలి. నోరారా పాడుకోనివ్వాలి. ఆసక్తితో నేర్చుకోనివ్వాలి. వాళ్లకు వాళ్లు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశమివ్వాలి.

పిల్లలంటే రేపటి పౌరులు. అంటే రేపటి భవిష్యత్తు. ఆ భవిష్యత్తు విలువలతో కూడినది, శక్తిమంతమైనదీ అయి ఉండాలి. ‘రెడీమేడ్‍’ మాదిరిగా పెరిగి పెద్దవాళ్లయిన పిల్లల భవిష్యత్తు అందంగా రూపుదిద్దుకోదు.

అందరికీ అన్ని రోజులున్నట్టే చిన్నారులకూ ఒక రోజు ఉంది. అది నవంబరు 14. ఈ ఒక్కరోజే ఆడిపాడనిచ్చి, స్వేచ్ఛా విహంగాలుగా వదిలిపెట్టి మిగతా రోజుల్లో నిర్బంధం తరహా వాతావరణాన్ని సృష్టిస్తే.. అటువంటి పిల్లలు జాతికి సంపదగా కాదు.. ఆపదగా మారతారు.
అందుకే పిల్లల గురించి, వారికి అందుతున్న విద్య గురించి, వారెలా పెరుగుతున్నారు? ఎలా పెంచుతున్నాం? నైతిక విలువలు నేర్చు కుంటున్నారా? నేటి తరం పిల్లల్లో మనో వికాసం ఎలా ఉంది?.. ఇంకా ఎన్నెన్నో అంశాలను చర్చించుకోవడానికి ‘బాలల దినోత్సవం’ ఒక సందర్భం.. ఒక వేదిక..

ఙఙఙ

ప్రస్తుతం పిల్లలంటే ‘చదివే యంత్రాలు’గానే మారిపోయారు. అయితే, చదువొక్కటే వారికి బతకడం నేర్పదు. విజయవంతంగా జీవించడానికి అవసరమైన వనరులను, శక్తియుక్తుల్ని, లోకజ్ఞానాన్ని వారికి వారు సముపార్జించుకునేలా తల్లిదండ్రులు, గురువులే వారికి మార్గనిర్దేశం చేయాలి. కానీ, ఈ నెపంతో పెత్తనం చేయకూడదు సుమా!.

అత్యధిక మార్కులు సాధించి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడమే పిల్లల అంతిమ లక్ష్యంగా నిర్దేశించే పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. దీనివల్ల వారు బతకడానికి ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోగలరే కానీ, జీవించడానికి అవసరమైన నేర్పును ఒడిసిపట్టుకోలేరు. చిన్నారుల్లో, ముఖ్యంగా, ఐదు నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో పిల్లల్లో సామాజికంగా, ఉద్రేకపరంగా జరిగే అభివృద్ధిని తల్లిదండ్రులు, నేటి విద్యావ్యవస్థ చిదిమేస్తున్న పరిస్థితి అంతటా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బయటికి వస్తున్న పిల్లలు.. కెరీర్‍లో స్థిరపడుతున్నా.. జీవితంలో మాత్రం పరాజితులుగా మిగులుతున్నారు. ఒక్కసారిగా ఒత్తిడికి గురవుతూ కుదేలవుతున్నారు.

పిల్లలంటే పువ్వుల్లాంటి వారు. వారిలో మనో వికాసం పుష్పం మాదిరిగానే నెమ్మదిగా, అందంగా జరగాలి. అటువంటి పరిస్థితిని పెద్దలు కల్పించాలి. పిల్లలతో సున్నితంగా వ్యవహరించాలి. వారిపై పెత్తనం చేస్తున్నట్టు ఉండకూడదు. మన ఇష్టాయిష్టాలు రుద్దకూడదు. వారిని చక్కగా పెంచడంలో, సామాజిక, ఉద్విగ్నతా సామర్థ్యాలను, లోకజ్ఞానాన్ని పెంపొందించే విషయంలో ఎంతో జాగరూకతతో, సమన్వయంతో వ్యవహరించాలి. పిల్లలను భావి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గురుతర బాధ్యత పోషించాలి.

ఙఙఙ
పిల్లలు చిన్ననాట తాము చూసిన, వినిన, నేర్చుకున్న వాటినే మును ముందు జీవితంలో ‘అనుభవాలు’గా మార్చుకుంటారు. ప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్‍ ఫ్రాయిడ్‍ చెప్పిన ప్రకారం- ప్రతి బాలికకూ, బాలుడికీ తన చిన్నతనంలో కలిగిన అనుభవాలే భావి జీవిత విధానానికి మూలం అవుతాయి. ‘స్కాప్‍’ అనే మనస్తత్వ శాస్త్రవేత్త నిర్ధారించిన దాని ప్రకారం- కుటుంబ వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు మంచి ప్రవర్తనతో వ్యవహరించడమే కాక, ఎవరితోనైనా సర్దుకుపోగలరు. కుటుంబ నేపథ్యం సరిగా లేని పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని, డిప్రెషన్‍కు గురవు తున్నారని, కొందరు నేరాలకు అలవాటు పడుతోంటే, ఇంకొందరు మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని వివిధ అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. సాధారణంగా పిల్లలు సమాజంలో ఏం చూస్తారో దానినే అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కుటుంబం, పాఠశాల, తోటి స్నేహితులు, పరిసరాల వాతావరణం.. ఇవి చక్కగా, సవ్యంగా ఉన్న పిల్లలే తమ జీవితంలో చేరువైన అంశాల నుంచి సామాజికతను నేర్చుకుంటారు.

చిన్న పిల్లల సత్ప్రవర్తనకు మొదటి కారణం కుటుంబం అయితే, రెండోది పాఠశాల. పిల్లలు తమ జీవితంలోని మొదటి దశను బడిలోనే గడుపుతారు. బడి.. పిల్లలకు కొత్త సమాజం. సంపూర్ణ మూర్తిమత్వానికి మూడు పరిధులు ఉన్నాయి.
1. అధ్యయన సామర్థ్యం.
2. సామాజిక అభివృద్ధి.
3. ఉద్వేగ వాతావరణం.

ఈ మూడింటినీ పిల్లల పెంపకంలోనూ, అభివృద్ధిలోనూ ముఖ్యంగా పరిగణించాలి.

ఙఙఙ

పిల్లలందరిలో నేర్చుకునే సామర్థ్యాలు ఒకే మాదిరిగా ఉండవు. ఏదైనా అంశాన్ని నేర్చుకునే రీతిలో పిల్లలలో ఒకరితో మరొకరికి వ్యత్సాసం ఉంటుంది. విభిన్న రీతులు గల పిల్లల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు, మందబుద్ధి గల విద్యార్థులు ఉంటారు. కొంతమంది పిల్లలు కొన్ని ప్రత్యేకమైన అంశాల్లో, విషయాల్లో, అంటే అభ్యసన రీతిలో, చదవడంలో, రాయడంలో, లెక్కల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు. ఇంకొందరు లెక్కలు సరిగా చేయలేక, లెక్కించలేక, రాయలేక వంటి లోపాలతో బాధపడుతుంటారు. ఇటువంటి లోపాలకు అభ్యసనమే (ప్రాక్టీస్‍) చికిత్స. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తగిన సహకారంతో, సంయమనంతో వ్యవహరించ గలిగితే లోపాలు కలిగిన విద్యార్థులు కూడా ఆయా అంశాల్లో ప్రావీణ్యం సంపాదించగలుగు తారు. పిల్లలు నేర్చుకోవడంలో పడే ఇబ్బం దులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సరిగా గుర్తించలేకపోతున్నారు. సరికదా, వారిపై మరింత ఒత్తిడి పెంచుతున్నారు. చదువు విషయంలో పిల్లల్లో గల సామర్థ్య లోపాలను సరిగా గుర్తించగలిగితే, బోధన పద్ధతులను వారికి అనుగుణంగా మార్చగలిగితే పిల్లలందరూ సమాన స్థాయి గల అభ్యసన పద్ధతులను అలవర్చుకో గలుగుతారు.

తల్లిదండ్రులు తమ ఇష్టాయిష్టాలను పిల్లలపై రుద్దడం వల్లే నేడు పిల్లలు చదువుల్లో వెనుక పడుతున్నారు. తమ లక్ష్యాలను, అభిరుచులను వారి చేత చేయించడమే తమ వారసత్వ హక్కుగా భావించే వైఖరి తల్లిదండ్రులు విడ నాడాలి. చాలామంది తల్లిదండ్రులు ప్రతిభ గల పిల్లలతో తమ పిల్లలను పోలుస్తూ చిన్నానాటే వారిలో ఆత్మన్యూనత భావాన్ని పెంచుతున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లల ప్రవర్తనలో ఉద్రిక్తత (ఒత్తిడి) చోటుచేసుకుని అకస్మాత్తుగా అభ్యసన స్థాయి నిలిచిపోతుంది. తమ పిల్లలు తమకు మూసపోతలు కారని, స్వతంత్ర వ్యక్తులనే వాస్తవాన్ని తల్లిదండ్రులు తొందరగా గుర్తించాలి. చదువులో ఉత్తీర్ణత సాధించడం ఒక్కటే విజయవంతమైన జీవితానికి లక్ష్యం అని నూరిపోయకూడదు. పిల్లలకు స్వేచ్ఛనిస్తే.. చదువులోనే కాదు వివిధ రంగాల్లో చిన్ననాడే ప్రతిభ చాటుకోగలరు.

ఙఙఙ

పిల్లలు తమ జీవితకాలంలో తల్లిదండ్రుల తరువాత ఎక్కువ సమయం గడిపేది ఉపాధ్యాయుల వద్దే. అందుకే ఉపాధ్యాయుడు ఏది చెబితే దానిపైనే విద్యార్థికి గురి ఉంటుంది. ఆయన చెప్పే మాటలకే పిల్లలు ప్రేరేపితులవుతారు. ఆయన మార్గాన్నే అనుస రిస్తారు. ఆయననే అనుకరిస్తారు. చివరకు ఆయన జీవన విధానానికే ఆకర్షితుడై తనకు మార్గదర్శిగా భావిస్తారు. జీవితాంతం ఆయనను గుర్తుపెట్టుకుంటారు. ఇదో సామాజిక పక్రియ. గురువు జీవితం విద్యార్థి క్యారెక్టర్‍ను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు మన చుట్టూ ఉన్న సమా జంలో ఎవరైనా ఏదైనా ఘనత సాధించినా, ప్రముఖ స్థానం పొందినా, మరేదైనా ప్రత్యేకతతో వార్తల్లో నిలిచినా వారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ‘మీరు చిన్నప్పుడు ఎలా చదువుకున్నారు? అప్పట్లో ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెప్పేవారు?’ వంటి ప్రశ్నలు వింటుంటాం. ఒక విద్యార్థి జీవితంపై గొప్ప ఉపాధ్యాయుడి ప్రభావం ఎంత ఉంటుందో చెప్పేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు.

ఙఙఙ

సామాజిక విలువలతో కూడిన చదువే సమాజాభివృద్ధికి బీజం వేస్తుంది. మానవత్వాన్ని పరిమళింప చేస్తుంది. ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ వ్యక్తిత్వ వికాసం, విలువలు, నైతికత, నిస్వార్థ జీవన విధానాలను నేర్పింది. తద్వారా సామాజిక అభ్యున్నతికి కొత్త బాటలు వేశారు. ఈ పక్రియలో ఉపాధ్యాయులకు ఎంతో గౌరవం ఏర్పడింది. ఉపాధ్యాయులు కూడా నిత్య విద్యార్థులుగా ఉంటూ ప్రజల అవసరాలను తీర్చే దిశగా చొరవ తీసుకుంటూ అప్పట్లో మార్గదర్శకులుగా ఉండేవారు. బతకలేక బడి పంతులు అనే నానుడి ఆ రోజుల్లో ఉన్నా.. ఉపాధ్యాయులు మాత్రం నిరాడంబర జీవితాన్ని కొనసాగిస్తూ సామాజిక అభ్యున్నతికి కృషి చేసేవారు. గ్రామ గ్రామాన తిరిగి విద్యావ్యాప్తికి వారు చేసిన కృషి అజరామరం. విలువలతో కూడిన విద్యను బోధించడం తమ సామాజిక బాధ్యతగా భావించే వారు. అందుకే నాటి ఉపా ధ్యాయుల వద్ద చదువుకున్న నాటి తరం పిల్లలు నేడు చాలామంది ప్రముఖ స్థానాల్లో ఉన్నారు.

strongఙఙఙ

జీవితాన్ని చిన్న కృష్ణుడిలా చిరునవ్వుతో సాగించాలంటే, దాని పూర్వాపరాల పరిజ్ఞానం అలవర్చుకోవడం అవసరం. ఏ పనికైనా విషయ పరిజ్ఞానం కలిగించేది విద్య. అది దృష్టి వంటిది. ఆచరణ పరిజ్ఞానం కలిగించేది శిక్షణ. అది నడకలాంటిది. దృష్టి, నడక బాగుంటేనే మన పయనం సవ్యంగా సాగు తుంది. శిక్షణలో శ్రద్ధతోటే ఆచరణలో నైపుణ్యం కలుగుతుంది. ఆసక్తి లేనపుడు ఏ శిక్షణ అయినా శిక్షలాగే ఉంటుంది. శిక్షణతో పాటు మంచి సదుపాయాలు గల ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుందంటే ఎంతోమంది దానిపై ఆసక్తి చూపిస్తారు. ఇష్టమైన అనుభూతి కోసం పడే ఏ శ్రమా కష్టంగా అనిపించదు. ఇష్టుల కోసం పడే కష్టం సైతం శిక్షగా అనిపించదు. జీవితాన్ని ఇచ్చిన వాడే జీవించడం ఎలాగో నేర్పే శిక్షకుడు. ఆ విశ్వాసం ఉన్నంతసేపు శిక్షణలో ఏ సంఘటనా శిక్ష అనిపించదు. అది తమ సంరక్షణలో ఒక భాగం అనే స్ప•హ కలుగుతుంది.

ఙఙఙ

ఈ కాలంలో నిత్య జీవితంలో యాంత్రిక సదుపాయాల వాడకం గణనీయంగా పెరిగింది. గృహోపకరణాలు, రవాణా సౌకర్యాలు, ప్రసార మాధ్యమాలే కాక ఎన్నో, ఎందరికో చేరువ అయ్యాయి. ఏది వాడాలన్నా శిక్షణ అవసరం. శక్తిమంతమైన రవాణా వాహనాల వాడకంలో శిక్షణ మరింత విలువైనది. అన్నింటికన్నా అమూల్యమైన జీవితానికి ఆసరా అయ్యే వాహనం మన శరీరం. దాని సంరక్షణ కోసం శిక్షణ మరింత అవసరం.
పసితనంలో పాలు తాగడం నేర్పించడం శిక్షణ ఆరంభ దశ. ఆది నుంచి ప్రతీ దశలోనూ క్రమంగా ఏదో ఒకటి నేర్చు కుంటూనే ఉండాలి. మన ఉనికికి మూలం ప్రకృతి. సకల జీవజాలమైన ప్రకృతే మనిషికి తొలి గురువు. ఫలదాత. ప్రకృతితో సమన్వయం అంటే దేశ, కాలాలను అనుసరించే క్రమ ప్రవర్తన, క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణనే పిల్లలకు చిన్నానాడే అలవర్చాలి.

ఙఙఙ

జీవితం చదువుతోనే ముడిపడి ఉందనే అభిప్రాయం నేటి తల్లిదండ్రుల్లో బాగా నాటుకుపోయింది. ఇది కొంత వరకు నిజమే అయినా పూర్తిగా నిజం కాదు. అసలైన విద్య లక్ష్యం.. విజ్ఞానం. నేడు అది ఉద్యోగానికే పరిమితం అయ్యింది. నేటి బాలలు రేపటి పౌరులు కావాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా మన ప్రాథమిక, సెకండరీ విద్యా విధానం, బోధన పద్ధతులు మార్చాలసిన అవసరం ఉంది. ఆత్మహత్యలకు ప్రేరేపించేంత ఒత్తిడితో కూడిన విద్య కన్నా విద్యార్థులను ఆలోచింపచేసే విద్యకు పెద్దపీట వేయాలి.

పుస్తకాల్లో ఉన్నది బట్టీపట్టి, మంచి మార్కులు సంపాదించి, ఆపై మంచి ఉద్యోగం పొంది.. ఇదే నేడు పిల్లలు, వారి తల్లిదండ్రుల జీవితం అయిపోయింది. లోకజ్ఞానం అసలు అబ్బడం లేదు. లోకం పోకడ అసలే పట్టడం లేదు. విద్య.. విజ్ఞానం స్థాయి నుంచి ఉద్యోగానికి కుదించుకు పోయింది. కేవలం సంపాదనకే పరిమితమైంది. వ్యక్తిత్వ వికాసం మరిచి పోయింది. మంచిచెడులను చెత్తబుట్టలో వేసింది. మార్కుల గారడీలో పడి కొట్టుకుంటున్నది. పరీక్షల సుడిగుండంలో పడి విలవిల్లాడుతోంది. చదువుకు కావాల్సిన మౌలిక పదుపాయాలు లేక చతికిలబడుతోంది. బతకడానికి కావాల్సిన తెలివితేటలను అందించ లేకపోతున్నది. నిరాశ, నిస్ప•హల మధ్య విద్యార్థులు జీవిస్తున్నారు. ఇది ఏ ఒక్కరి సమస్యనో కాదు. దేశ భవిష్యత్తు సమస్య.

ఈ పరిస్థితి కారణం.. మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుందనే తల్లిదండ్రుల మూఢ నమ్మకం. గురువుల బోధనా పద్ధతులు. కర్ణుని చావుకు కారణాలనేకం అన్నట్టుగా దిగజారుతున్న మన విద్యా ప్రమాణాలకూ కారణాలు అనేకం. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే సిలబస్‍ ఒక్కటే. అయినా బోధించే విధానంలో, మౌలిక సదుపాయాల్లో, తల్లిదండ్రుల ఆలోచనల్లో తేడాలు ఉండటం వల్ల అందరికీ సమానమైన విద్యను అందించలేక పోతోంది నేటి విద్యా వ్యవస్థ.

ఙఙఙ

అమెరికాలోని వాషింగ్టన్‍ సైకాలజీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనాన్ని వెలువరించారు.

యుక్త వయసు వచ్చిన పిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డలు తమతో ఉంటున్న విధానాలే వారిలో మార్పులకు కారణాలుగా గమనించాల్సి ఉంటుందని ఈ పరిశోధకులు చెప్పారు. అంటే, తమ మధ్య సంబంధ బాంధవ్యాలు వారి వ్యక్తిత్వ వికాసం ఎలా ఉందన్న విషయంపై జరిపిన పరిశీలనలో చిన్నారులు సాధారణంగా ఆత్రుత, ఒత్తిడికి లోనవడం తదితర లక్షణాలపై ఈ యూనివర్సిటీ అధ్యయనం చేసింది.

ఆత్రుత, ఒత్తిడికి గురయ్యే టీనేజ్‍ పిల్లల నుంచి అందుకు గల కారణాలను తెలుసుకోగలిగితే, దానివల్ల పెద్దల నుంచి చేదోడు దొరికిందన్న ఆనందంతో తమ చిన్న చిన్న విషయాలనూ పెద్దలతో పంచుకునేందుకు ఆస్కారం ఉంటుందని యూనివర్సిటీ వాషింగ్టన్‍ స్కూల్‍ ఆఫ్‍ మెడిసిన్‍కు చెందిన కారా కిఫ్‍ తమ పరిశోధనా ఫలితాలను వెల్లడిస్తూ వివరించారు.

ముఖ్యంగా చదువుకునే సమయంలో పిల్లలు చీటికీమాటికీ చీకాకు పడటం వంటివి చేస్తుంటే వారెందుకు అలా ప్రవర్తిస్తున్నారో పెద్దలు గమనించాలి. వారిపై ప్రేమ, ఆప్యాయతలు ప్రదర్శించడం వల్ల మీతో స్నేహ పూర్వకంగా ఉంటారు. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికీ తల్లిదండ్రులు వారిపై గయ్‍మనడం, వారిపై లేనిపోనివి రుద్ది వారి తలపై తుపాకీ పెట్టి కాల్చినట్టు, వారిపై ఏవో పెద్దగా ఆశలు పెట్టు కోవడంతో పాటు వారిపై లేనిపోని భారం మోపడం వంటివి జరుగుతుండటం వల్ల తల్లిదండ్రులకు తమ సమస్య చెప్పేందుకు కూడా పిల్లలు వెనకడుగు వేస్తున్నారు సైకాలజీ అధ్యాపకులు చెబుతున్నారు.

యుక్త వయసులోకి అడుగుపెట్టే పిల్లలకు కేవలం ఆర్థికపరంగానే కాక, విద్యాపరంగా, విజ్ఞానపరంగా తల్లిదండ్రులు తోడ్పాటును ఎక్కువగా అందించాలి. ఒకవేళ పిల్లలతో ఎలా మెలగాలో తెలియకుంటే ఇతరుల వద్ద తెలుసుకుని చెప్పేందుకు ప్రయత్నించడం వల్ల పిల్లల్లో సహజ జ్ఞానం పెరుగుతుందని మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల విషయంలో అప్పుడప్పుడు సహాయ సహకారాలు అందించాలి కానీ, వారిని పర్యవేక్షిస్తూనే, వారి అంతర్గత విషయాలు, వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదని పరిశోధకులు చెబు తున్నారు.

కాగా, వాషింగ్టన్‍ యూనివర్సిటీ సైకాలజీ పరిశోధకులు యూనివర్సిటీ ఆఫ్‍ కాలిఫోర్నియా, శాన్‍ఫ్రాన్సిస్కోలకు చెందిన మేధావులతో రెండు వందల పద్నాలుగు మంది టీనేజ్‍ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఒకచోట కూర్చోబెట్టి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తల్లిదండ్రులు, టీనేజర్లు పరస్పర సహకారాలు, వారి అభిప్రాయాలపై ముఖాముఖి చర్చను జరిపి పై నివేదికను వెల్లడించారు.

ఙఙఙ

పైన చర్చించుకున్న విషయాలను బట్టి నేడు చిన్నారులు ఏదో నిర్బంధంలో ఉన్నారనో, మరొకటో అనుకునే పరిస్థితి లేదు. నేడు పిల్లలు వివిధ రంగాల్లో అసమాన ప్రతిభా పాటవాలు చూపుతున్న వైనాన్ని మనం ప్రపంచ వ్యాప్తంగా గమనించవచ్చు.
నిండా పదిహేను సంవత్సరాలు నిండకుండానే ఎవరెస్ట్ను అధిరోహిస్తు న్నారు.

గుక్క తిప్పుకోకుండా సంస్క•త పద్యాలను వల్లె వేస్తున్నారు.
అసమాన ధైర్యసాహసాలు, తెగువ చూపి తోటి చిన్నారులను రక్షిస్తున్న దాఖలాలు ఉన్నాయి.
ఇంకా, చిత్రలేఖనం, సంప్రదాయ నృత్యాలు, క్విజ్‍, ఇతరత్రా ప్రతిభా పాటవ పోటీలలో తమ సత్తాను చాటుకుంటున్నారు.
ముఖ్యంగా క్రీడారంగంలో చిన్నారులు, యుక్త వయస్కులు పెద్దసంఖ్యలో దూసుకొస్తున్నారు.
కొందరు పిల్లల బహుముఖ ప్రతిభకు కారణం ఏమై ఉంటుందోననే ఆలోచన మిగతా తల్లిదండ్రులకు వస్తే లోపం ఎక్కడ జరుగుతుందో గుర్తించి సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది.

సౌకర్యవంతమైన స్వేచ్ఛను ఇవ్వడంవల్ల పిల్లలను ఎప్పుడూ మిగతా వారి కంటే ఒకడుగు ముందే ఉంచుతుందని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లలు ఏయే అంశాల్లో, విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నారో గుర్తించి, అందులో ప్రోత్సహిస్తే ఆకాశమే హద్దుగా ప్రతిభను చాటు కుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు.
కానీ, చాలామంది చిన్న వయసులోనే చిన్నారి కోరికలను చిదిమేస్తున్నారని చెప్పక తప్పదు. చదువే లోకమని, అది తప్ప మిగతా ఎంత ప్రతిభ ఉన్నా, అభినివేశం ఉన్నా వ్యర్థమనే ఆలోచన ధోరణి మార్చుకోనంత కాలం పిల్లల ప్రతిభ మరుగునపడిపోతూనే ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర మారాలి. తల్లిదండ్రులే పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. స్నేహపూర్వక, సౌఖ్యవంతమైన స్వేచ్ఛను పిల్లలకు కల్పించాలి. విలువలకు, లక్ష్యాలకు చక్కని రూపాన్ని ఇవ్వడంలో తల్లిదండ్రులే కీలకం. లక్ష్యాలు వాస్తవికతకు దగ్గరగా ఉండాలే తప్ప అద్భుతంగా ఉండకూడదు.

అలాగే, పిల్లలపై ఆకాశాన్నంటే అంచనాలు పెట్టుకోవడం కూడదు. వారొక పెట్టుబడి సాధనంగా, మునుముందు తమ ఖర్చుకు తగిన ప్రతిఫలం రాబట్టే ‘సంపద’గా పిల్లలను భావించకూడదు.

ఙఙఙ
పిల్లలు కానివ్వండి.. పెద్దలు కానివ్వండి.. ప్రతి మ
నిషి మస్తిష్కంలో ఉద్వేగం సామాన్యకారకంగా ఉంటుంది. వివిధ స్థాయిలలో విభిన్నమైన ఉద్విగ్నతలు ఉంటాయి. వాటిని నియంత్రించడానికి అనేక కారణా లున్నాయి.
ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు పిల్లల ఉద్విగ్నతాభివృద్ధిని అత్యధికంగా ప్రభావితం చేస్తారు. భయం, కోపం, ఈర్ష్య, ప్రేమ వంటి కొన్ని సామాన్య ఉద్విగ్నతలు పిల్లల్లో ఉంటాయి. ఇవి పిల్లల ఉద్విగ్నతాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అలసట, ఆరోగ్యం, తెలివితేటలు, సామాజిక పరిస్థితులు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉద్విగ్నాభివృద్ధిని ప్రభావితం చేసి చూపుతాయి.

పిల్లలకు కావాల్సింది ఆహారం, నీరు, బట్టలే కాకుండా ఇంకొన్ని అవసరాలు ఉన్నాయి. తమతో అందరూ మాట్లాడాలనీ, తమ కోరికలు, ఆశలు, సమస్యలు తీర్చాలనీ పిల్లలు కోరుకుంటారు. ప్రతిరోజూ తల్లిదండ్రులు పిల్లలతో కలిసి మాట్లాడాలి. పిల్లలు ముఖ్యంగా తమకు స్నేహితులు కావాలని కోరుకుంటారు. స్నేహితుల వల్ల వారి జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి. తమ ఇష్టాయిష్టాలకు తగిన వ్యక్తులను స్నేహితులుగా వారు కోరుకుంటారు. ఇందుకు వారికి సహకరించాలే తప్ప రకరకాల నిర్దేశాలు విధించి కట్టడి చేయకూడదు.

‘చెడు సావాసం చెరుపు’ అనేది సామెత. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహాన్ని అతి చేరువతో గమనించాలి. తమకు ‘గుర్తింపు కావాల’ని పిల్లలు కోరుకుంటారు. ఒక పిల్ల/పిల్లవాడు వేరొకరితో భిన్నంగా ఉంటారు. పిల్లలందరూ వారి వారి మనోభావాలను అనుసరించి భిన్న లక్షణాలను వ్యక్తపరుస్తారు. తమ పిల్లల్లో గల అటువంటి అంశాన్ని గమనించి సరైన రీతిలో ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత కావాలి.

ఙఙఙ

జీవితం ఒక నిరంతర సమరం. ఉరుకుల పరుగుల జీవనం. యాంత్రిక జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, శారీరక, మానసిక సంఘర్షణ. ఆధునిక యుగంలో ప్రశాంతత కొరవడింది. చదువు, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, కర్షక, కార్మిక రంగాల్లో ఎవరికి వారే అంతర్గత శక్తిని కోల్పోయి అంతులేని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే ప్రాచీన విజ్ఞానం వైపు పిల్లలను అడుగులు వేయించడం అత్యంతావశ్యం. గతంలో వేసవి సెలవులు వస్తే పిల్లలు అమ్మమ్మ, నాన్నమ్మ ఊళ్లకు వెళ్లే వారు. అక్కడ వారికి కావాల్సినంత లోకజ్ఞానం, నడవడి, సంప్రదాయాలపై అవగాహన కలిగేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, ఉపాధి కోసం పల్లెలంతా పట్నం బాట పట్టడంతో నగరాల్లో జీవనం పరమ యాంత్రికంగా మారిపోయింది.

సహజంగానే పిల్లలకు కాస్తంత ఆటవిడుపు లభించగానే ఆటపాటల్లో మునిగిపోతారు. విహారయాత్రలకు ఆసక్తి చూపుతారు. ప్రయాణాలను ఇష్టపడతారు. కానీ, నగరాల్లో ఇవి పరిమితంగానే పిల్లలకు లభిస్తున్నాయి. యాంత్రికత పిల్లల్లో అంతర్గత శక్తి సామర్థ్యాలను హరించివేస్తుంది. కాబట్టి వారికి తక్షణ ఉపశమనంగా యోగా నేర్పించడం అవసరమని, ఇది వారిలోని అంతర్గత శక్తిని వెలికితీస్తుందని, జీవితంపై ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రోజులో కనీసం గంటపాటైనా యోగాభ్యాసం చేయడం వల్ల పిల్లలో మనో వికాస స్థాయిలో మంచి మెరుగుదల కనిపిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. యోగాతో పాటుగా తేలికపాటి శ్రమతో చేయగలిగే సూర్య నమస్కారాలు పిల్లల్లో మన ప్రాచీన సంప్రదాయాలపై అవగాహన కలుగుతుందని, ఫలితంగా అవి పది కాలాల పాటు నిలిచి ఉంటాయని అంటున్నారు. నిజానికి మనం ఎదగడం అంటే మన సంప్రదాయాలను, మన సంస్క•తిని మరిచిపోవడం కాదు కదా!. వాటిని నిలుపుకుంటూ మన ఎదుగుదల సాగితేనే మన జాతీయత అనే చిరునామా చిరస్థాయిగా నిలుస్తుంది. అందుకు చిన్నారులే మన సాంస్క• తిక వారధులుగా నిలవాలి.

ఙఙఙ

చివరిగా.. నేటి బాలలే రేపటి పౌరులు అనేది మన భారతీయ ఆర్యోక్తి. చిన్నతనంలో, ముఖ్యంగా పాఠశాల స్థాయిలో సిల్లలకు సనాతన ధర్మాన్ని పరిచయం చేస్తే వారి జీవితం ధర్మబద్ధంగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో వారు పెరిగి పెద్దయిన తరువాత బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరిస్తారు. తద్వారా ఆరోగ్యకరమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. పసి హృదయాలపై నాటిన ధర్మబీజాలు మొలకెత్తి విద్యార్థులకు జ్ఞానవృక్షాన్ని ప్రసాదిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాధారణంగా 12 – 14 ఏళ్లలోపు పిల్లల్లో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ వయసులో నేర్చుకున్న అంశాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. మనం నేర్చుకునేవి మంచి విషయాలైతే.. మన జీవితం మంచిగా రూపాంతరం చెందుతుంది. భారత తొలి ప్రధాని జవహర్‍లాల్‍ నెహ్రూ భారత భావితరంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలతోనే ఆయన పిల్లలను ఎంతగానో ప్రేమించారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబరు 14 బాలల దినోత్సవమైంది. ఆధునిక భారత్‍ నిర్మాత అయిన ఆయన ఆశయాలను మన చిన్నారులు నెరవేర్చాలని ఆశిస్తూ…

Review చిన్నారి లోకం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top