పిల్లలు ఏం తింటున్నారు?

ఈ కాలం పిల్లలకు అన్నం అంటే రుచించడం లేదు. స్పైసీ, జంక్‍ ఫుడ్‍ అంటే మాత్రం ‘నాలుక కోసుకుంటున్నారు’. తల్లిదండ్రులు కూడా మునుపటి మాదిరిగా ఆరోగ్యకరమైన, పౌష్టికరమైన ఆహారాన్ని అందించే విషయంలో మిన్నకుండిపోతున్నారు. బలవంతంగా తినిపించడం వల్ల మేలు కన్నా చేటే ఎక్కువ చేస్తుందని భావిస్తున్నారు. దీంతో పిల్లలు ఏం తింటున్నారో?, ఏం జీర్ణం చేసుకుంటున్నారో? ఎలా పెరుగుతున్నారో అనే పట్టింపే ఎవరికీ లేకుండా పోతోంది. దీని ఫలితంగానే చిన్న వయసులోనే కళ్లజోడు రావటం దగ్గరి నుంచి ఊబకాయం, పౌష్టికాహార లోపం, బలహీనత వంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. చిన్న వయసులోనే పిల్లలు మధుమేహం బారిన కూడా పడుతుండటం. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి? పౌష్టికాహారాన్ని ఎలా అందించాలి? పిల్లల ఆరోగ్యం- ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు అవగాహన చేసుకోవాలి.

జంక్‍ ఫుడ్‍ అంటే మనందరికీ ఇష్టమే. ఇక పిల్లల గురించి ప్రత్యేకం చెప్పుకోవాల్సింది ఏముంది? జంక్‍ ఫుడ్‍ అంటే పిల్లలు అమితంగా ఇష్టపడతారు. అయితే జంక్‍ ఫుడ్‍ను ఎక్కువగా తినే పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఐదేండ్ల నుంచి పదిహేడు సంవత్సరాలలోపువారు ఎక్కువమంది వరకు ఉంటారని వివిధ పరిశోధనల ద్వారా అంచనా వేస్తున్నారు. జంక్‍ ఫుడ్‍ అధికంగా తీసుకోవడం వల్ల అధిక బరువుతో బాధపడే పిల్లలు 2010లో 76 మిలియన్ల మంది ఉంటే 2025 నాటికి 91 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని పీడియాట్రిక్‍ ఓబేసిటీ జనరల్‍ పరిశోధకులు తమ అధ్యయనాల ద్వారా వెల్లడిస్తున్నారు. అలాగే, 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 12 మిలియన్ల మంది పిల్లల్లో గ్లూకోజ్‍ టాలరెన్స్ కూడా ఉంటాయని, నాలుగు మిలియన్ల పిల్లలు టైప్‍-2 డయాబెటిస్‍తో బాధపడతారని, 27 మిలియన్ల పిల్లల్లో హైపర్‍ టెన్షన్‍, 38 మిలియన్ల పిల్లల్లో కాలేయంలో కొవ్వు పెరుగుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. ఇలా పిల్లలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఫిజికల్‍ యాక్టివిటీస్‍కు దూరమైపోవడం వంటి కారణాల వల్ల ఊబకాయగ్రస్తులుగా మారిపోతున్నారు. అందుకే చిన్న వయసులోనే పిల్లల జీవనశైలిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని పై పరిశోధనలు, అధ్యయనాలు తెలియ చెబుతున్నాయి. అందుకోసం ప్రతి తల్లిదండ్రులు ఏం చేయాలంటే..

పండ్లు, కూరగాయలు..

పిల్లలకు చిన్ననాటి నుంచే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయాలి. సాధారణంగా మొదటి ఐదు సంవత్సరాలు పిల్లల మారాం తట్టుకోలేక, వారిని ఒప్పించలేక వారి చేత ఏదో ఒకటి తినిపించడానికి, తినడాన్ని అలవాటు చేయడానికి రుచికరమైన పదార్థాల పేరుతో తమకు తెలియకుండానే జంక్‍ఫుడ్‍ను అలవాటు చేస్తున్న పరిస్థితి నేడు నెలకొంది. అయితే, నయానో భయానో ఒప్పించి పిల్లలను చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలి. అత్యధిక పోషకాలను అందించే, సహజంగా, తాజాగా ఉండే కూరగాయలు, ఫలాలను ఎక్కువగా తీసుకునేలా వారిని మేనేజ్‍ చేయాలి. ఏ సీజన్‍లో దొరికే పండ్లను ఆ సీజన్‍లో తగినంతగా తినిపించాలి.

ఆహారంలో పోషకాలు.. అవగాహన

పిల్లలకు పోషకాహారంపై చిన్నప్పటి నుంచే అవగాహన కలిగించే ప్రయత్నాన్ని తల్లిదండ్రులు చేయాలి. ఏయే తరహా ఆహారం తీసుకుంటే భవిష్యత్తులో ఏయే విధమైన మేలు, ప్రయోజనం కలుగుతుందో వారికి వివరంగా తెలియచెప్పాలి. అందుకు తగిన ఉదాహరణలు చూపాలి. ఆహారం ఎంపిక విషయంలో వాణిజ్య ప్రకటనలను ప్రామాణికంగా తీసుకోరాదు. పోషకాలపై వారికి అవగాహన కలిగించడం వల్ల వారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి, వారి జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండటానికి దోహదపడుతుంది.

జంక్‍ఫుడ్స్ వద్దే వద్దు..

సహజంగానే పిల్లలు జంక్‍ ఫుడ్‍ పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు. జంక్‍ ఫుడ్‍ తింటామని పిల్లలు మారాం చేస్తే వాటి వలన కలిగే హాని గురించి సోదాహరణంగా వివరించాలి. ఇంట్లో తయారు చేసిన తేలికపాటి ఆహారాన్ని, స్నాక్స్, మీల్స్ను అలవాటు చేయాలి. జంక్‍ ఫుడ్‍ను తలపించేలా పై వంటకాలను తయారుచేసి పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. స్కూల్‍ బ్రేక్‍ టైమ్‍లో తినడానికి కూడా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్నే అందించాలి. ఇన్‍స్టంట్‍ ఫుడ్‍కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేడు సమయం సరిపోవడం లేదనే సాకుతో లేదా తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులైతే.. తొందరగా తయారైపోతుందనే భావనతో ఇన్‍స్టంట్‍ ఫుడ్‍ వండుతున్నారు. ఇవి కూడా పిల్లల ఆరోగ్యానికి చెరుపు చేస్తాయని గుర్తించాలి. దీనివల్ల మీకు సమయం కలిసి వస్తుందేమో కానీ, పిల్లల ఆయుష్షు తరిగిపోతుందనే ప్రమాదాన్ని గమనించాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే గడపడానికి తగినంత సమయం ఉంటుంది.

ఆహారపు అలవాట్లు

నేడు చాలా చిన్న వయసులోనే పిల్లలు అధిక బరువుతో, ఊబకాయంతో బాధపడుతుండటం చూస్తున్నాం. ఇందుకోసం ఇంటిల్లిపాది తగిన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. ఆ అలవాట్లను పిల్లలకు చిన్న వయసులోనే నేర్పాలి. పెద్దలతో పాటు పిల్లలకూ ఒకే విధమైన ఆహారాన్ని అందివ్వడం వల్ల అందరూ ఒకే విధమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఇది కుటుంబ ఆరోగ్యానికి సూచికగా నిలుస్తుంది.

అధిక తిండి.. ఆరోగ్యానికి గండి

పిల్లలు నిరంతరం ఒకటే విధమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వారికి నచ్చిన ఆహారాన్నే (ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని మాత్రమే) తయారు చేసి పెట్టాలి. అవసరమైతే ఫ్లేవర్‍ రావడం కోసం వంటకాల తయారీలో చిన్నపాటి మార్పుచేర్పులు చేయవచ్చు. వేపుడు ఆహారాలను తగినంత దూరం ఉంచాలి. ఇది పిల్లలకే కాదు పెద్దల ఆరోగ్యానికీ మేలు చేయదని గ్రహించాలి. అలాగే, నచ్చింది కదా అని ఒకటే తరహా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోనివ్వకుండా చూడాలి. మితం అపరిమితమైన ఆనందాన్ని ఇస్తుందని తెలియ చెప్పాలి. టీవీ చూస్తూ తినడం వల్ల తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తీసుకునే ప్రమాదం ఉంది. అసలు తినేటప్పుడు పిల్లలు, పెద్దలు కూడా టీవీకి దూరంగా ఉండాలి. తినేటపుడు ఇతర విషయాలపై దృష్టి పెడితే ఎంత తింటున్నామో తెలియదు. దీంతో తెలియకుండానే ఎక్కువ ఆహారం తినేసి.. చాలామంది బరువు పెరిగిపోతున్నారని పరిశోధనలు తెలియ చెబుతున్నాయి.

బమ్‍చిక్‍..బమ్‍చిక్‍ చెయ్‍ బాగా వ్యాయామం..

చదువు పేరుతో పిల్లల్ని ఎప్పుడు ఇంటికే పరిమితం చేయకూడదు. వారిని ఒకేచోట కట్టిపడేయకూడదు. ఫిజికల్‍ యాక్టివిటీస్‍ను తగినంతగా ప్రోత్సహించాలి. ఇటువంటి కార్యకలాపాలు పిల్లల్లోని క్యాలరీసులను తగ్గిస్తాయి. ఆకలిని పెంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి దోహదం చేస్తాయి. ఆరుబయట ఆడుకోనివ్వడం, ఔట్‍డోర్‍ గేమ్స్కు పంపడం, శారీరక శ్రమను నేర్పించడం వంటివి పిల్లలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుతాయి.

వంటగదిలోకి పిల్లలనూ రానివ్వండి

వంటలు వండే సమయంలో పిల్లలను వంటగదిలోకి రానివ్వాలి. ఆయా ఆహార పదార్థాల తయారీలో వారినీ భాగస్వాములను చేయాలి. ఇలా పిల్లలతో కలిసి ఆహారం వండటం వల్ల ఏయే ఆహార పదార్థాల్లో ఎటువంటి పోషకాలు ఉంటాయో, ఆహారం యొక్క విలువ ఏమిటో, ఎటువంటి ఆహారం ఆరోగ్యాన్ని కలిగిస్తుందో వారు ప్రత్యక్షంగా చూసి తెలుసుకోగలుగుతారు.

అభిరుచులు.. అలవాట్లు

బంధువులు, కుటుంబసభ్యులు అందరూ అప్పుడప్పుడూ కలవడం, అంతా కలిసి ఇంట్లోనే సరదాగా ఆహారాన్ని వండుకోవడం వంటి చర్యల వల్ల పిల్లలకు ఇంటి ఆహారం యొక్క విలువ తెలిసి రావడంతో పాటు ఇతరులతో ఎలా మెలగాలనే విషయాలు తెలుస్తాయి. అలాగే ఒకరి ఆహారపు అలవాట్లు, అభిరుచులు మరొకరు తెలుసుకుని, మంచివైతే ఆచరించడానికి వీలవుతుంది. అలాగే నలుగురూ కలవడం వల్ల అభిప్రాయాలు, అభిరుచులు కొత్తవి ఏర్పడటంతో పాటు కొత్త అలవాట్లు జీవనశైలిలో మార్పులు తెస్తాయి. అందుకే పిల్లలను నెలకు రెండుసార్లయినా బయటికి తీసుకువెళ్లాలి.

Review పిల్లలు ఏం తింటున్నారు?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top