పల్లె వెలుగుల ‘అరవిందం’

అరవింద పిల్లలమర్రి.. ఈ పేరు పల్లె జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అమెరికాలోని మేరీల్యాండ్‍లో స్థిరపడిన ఈ తెలుగు మహిళ ‘ఎయిడ్‍’ పేరుతో అందిస్తున్న సాయం ఎన్నో కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ‘అసోసియేషన్‍ ఫర్‍ ఇండియాస్‍ డెవలప్‍మెంట్‍’ (ఎయిడ్‍) ప్రపంచ సమన్వయకర్తే అరవింద. మహిళా రైతులకు ఆర్థిక సహకారాన్ని అందించడం, చిరుధాన్యాల సేద్యాన్ని ప్రోత్సహించడం వంటి కార్యకలాపాల ద్వారా ‘ఎయిడ్‍’ ఇప్పటి వరకు దాదాపు 20 వేల మందికి సేవలందించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎయిడ్‍ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఆయా రాష్ట్రాల అవసరాలను బట్టి లక్షలాది గ్రామీణ ప్రజలను ఈ సేవా సంస్థ తన కార్యక్రమాల ద్వారా ఆదుకుంటోంది.
అరవింద స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి దగ్గర కొల్లూరు. తండ్రి రామకృష్ఱ ఎలక్ట్రికల్‍ ఇంజనీరింగ్‍ చదివారు. అరవింద పుట్టిన ఏడాదికే ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె బాల్యం, యవ్వనమంతా అమెరికాలోనే గడిచింది. అమ్మ లలిత ఎంఏ తెలుగు చదివినా.. అమెరికాలో అకౌంటెంట్‍గా స్థిరపడ్డారు. అరవింద డిగ్రీ చదివే నాటికే ఆఫ్రికా దేశాల స్థితిగతులు చూసి ఆ దేశాల కోసం ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడి పేదరికం, అవిద్య, అనారోగ్యం వంటి సమస్యలపై ఏదైనా చేయాలని ఆమె అనుకునే వారు. ఈ సమయంలోనే చిన్మయ మిషన్‍కి చెందిన ఓ యువతితో కలిగిన పరిచయం ఆమెను భారతీయ, ముఖ్యంగా తెలుగు గ్రామీణ జీవితం గురించి కూడా తెలిసివచ్చేలా చేసింది. అనంతపురం జిల్లాలోని ఓ గ్రామీణ పాఠశాలలో ఆరు నెలల పాటు పిల్లలకు పాఠాలు బోధించే విధిని అరవింద నిర్వర్తించారు. ఆ సమయంలోనే ఆమె ‘ఎయిడ్‍’ గురించి తెలిసింది.
అరవింద భర్త రవి ఫిజిక్స్ శాస్త్రవేత్త. ఎయిడ్‍ సేవా సంస్థ రూపకర్త, వ్యవస్థాపకుడు ఆయనే. ఎయిడ్‍ సర్వసభ్య సమావేశానికి ఒకసారి వెళ్లిన అరవింద.. వెంటనే ఆ సంస్థలో సభ్యురాలిగా చేరిపోయారు. భారత్‍లో ఎయిడ్‍ కార్యకలాపాలను విస్తరించాలని రవి, అరవింద నిర్ణయించుకున్నారు.
ఈ సమయంలోనే
పెద్దల అనుమతితో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. నర్మద బచావో ఆందోళన్‍లో బిల్గావ్‍ అనే ముంపు గ్రామానికి అండగా నిలిచింది ఎయిడ్‍. ముంపు గ్రామ వాసులకు అండగా నిలవడంతో పాటు ఆ గ్రామానికి ఉచితంగా జలవిద్యుత్‍ను అందించే బృహత్తర కార్యక్రమానికి ఎయిడ్‍ శ్రీకారం చుట్టి.. ఆ పనిలో విజయవంతమైంది. ప్రముఖ బాలీవుడ్‍ దర్శకుడు అశుతోష్‍ గొవారికర్‍ షారూఖ్‍ఖాన్‍తో తీసిన ‘స్వదేశీ’ సినిమాలోని చాలా సన్నివేశాలకు అరవింద ఆధ్వర్యంలో నడిచే ‘ఎయిడ్‍’ సేవా కార్యక్రమాలే స్ఫూర్తి. ఎయిడ్‍ సంస్థ తెలుగుగడ్డపైనే కాదు.. అంతర్జాతీయంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయుల నుంచి విరాళాలు సేకరించి, వాటిని భారత్‍లోని పల్లెల్లో గ్రామీణుల జీవన ప్రమాణాల పెంపునకు వినియోగిస్తుంది.

బ్రిటిష్ ఇండియన్ ఆచార్యునికి ‘నైట్ హుడ్’

భారత సంతతికి చెందిన బ్రిటిష్‍ ఆచార్యునికి అరుదైన గౌరవం లభించింది. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో వైద్య రసాయన శాస్త్రంలో ప్రొఫెసర్‍గా పని చేస్తున్న డీఎన్‍ఏ నిపుణుడు శంకర్‍ బాలసుబ్రమణియన్‍ బ్రిటన్‍ అత్యున్నత పురస్కారమైన ‘నైట్‍హుడ్‍’ను అందుకున్నారు. ఆయనతో పాటు ఒలింపిక్‍ స్టార్స్ ఆండీ ముర్రే, ఎంవో ఫరాహ్‍లను కూడా క్వీన్‍ ఎలిజబెత్‍-2 ఈ గౌరవంతో సత్కరించారు.
బాలసుబ్రమణియన్‍ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మెడిసినల్‍ కెమిస్ట్రీ ఆచా ర్యులుగా పని చేస్తున్నారు. డీఎన్‍ఏపై ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ గౌరవానికి ఎంపికయ్యారు. భారత్‍ నుంచి ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న వ్యక్తిగా బాలసుబ్రమణి యన్‍ భారత్‍ గౌరవాన్ని ఇనుమడింప చేశారు.

Review పల్లె వెలుగుల ‘అరవిందం’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top