ప్రకృతి ప్రజ్ఞ

మట్టి కున్న ‘బుర్ర’ మన మట్టి బుర్రలకు తెలిసేనా మట్టిలోని ‘మహిమ’ మన మందబుద్ధికి అందే

మనం మరమనుషులమై పోయాం. కృత్రిమమైన తెలివితేటలు మితిమీరి, సహజ లక్షణాలు చచ్చిపోయాయి. ఇక ప్రకృతి మేధా శక్తిని ఎక్కడ గుర్తిస్తాం? సృష్టిచాతుర్యంపై దృష్టి పెడితే చాలు, తన్మయత్వం చెందుతాం.
పసిపాప అవసరాలకు కావలసిన పదార్థా లన్నీ తల్లిపాలలో సమకూర్చబడినాయి. బిడ్డ పెరిగిన పిదప తల్లిపాలు సహజంగా ఆగి పోతాయి. ఇదీ శరీరం యొక్క నేర్పరితనం!! మన మెదడులోని తెలివికంటె మన శరీరపు మేధస్సు చాలా గొప్పది. ఆ పసిపాప తన కన్నబిడ్డ అయినప్పటికీ, తల్లి మెదడుతో ఆలోచించి పాప పోషణకు కావలసిన రీతిలో పాలను తయారు చేయగలదా ? తల్లి ప్రయత్నం లేకుండానే ఆమె శరీరం అమృతతుల్యమైన పాలను సృష్టిస్తున్నది. ఇప్పుడు చెప్పండి, దేనికి తెలివితేట లున్నాయి, శరీరానికా? మెదడుకా? ఇంత గొప్ప విషయం కొంచెం కూడా గమనించం కదా! తల్లి తిన్న ఒక్క రొట్టె ముక్క పాలుగా మారు తుంది. ఏ శాస్త్రజ్ఞుడు రొట్టెను పాలుగా మార్చగలడు? గడ్డి తిని ఆవు పాలు ఇస్తుంది. ఏ మేధావి గడ్డితో పాలను చెయ్య గలడు?
ఒక్కసారి మన శరీరంలోని రక్తప్రసార వ్యవస్థపై దృష్టిని ప్రసారం చేద్దాం. ఇది శరీరంలోని రవాణావ్యవస్థ. ఇది చాలా పొడవైన ప్రయాణ మార్గం. సువిశాల భారతదేశానికి వెన్నెముక లాంటి ప్రధాన రవాణావ్యవస్థ ‘భారతీయ రైల్వే.’ అరవైమూడు వేల కిలోమీటర్ల సుదీర్ఘమైన రైలు మార్గంలో, పదకొండువేల రైళ్లు, వేలాది టన్నుల సరుకులను, లక్షలాది ప్రజలను ప్రతిరోజూ రవాణా చేస్తున్నాయి. ఆసియాలో మొదటి స్థానం, ప్రపంచంలో నాల్గవ స్థానం ఆక్రమించి, మనకు గర్వకారణమై, భారత ప్రగతిలో ప్రముఖపాత్ర నిర్వహిస్తున్నాయి. దేశంలోనే అధికసంఖ్యలో, పదిహేను లక్షల మందికి ఉపాధినిచ్చి అన్నం పెడుతున్న మహాసంస్థ భారతీయ రైల్వే. దేశానికి రైల్వే ఎటువంటిదో, దేహానికి రక్తప్రసార వ్యవస్థ అటువంటిది. నమ్మండి, నమ్మకపొండి! లక్షా అరవైవేల కిలోమీటర్ల పొడ వైన రక్తనాళాలతో శరీరమతా వ్యాపించి ఉందీ వ్యవస్థ! వ్యాపించిన వాడు విష్ణువు అని శాస్త్రాలు తెలుపుతున్నాయి. శరీరమంతా విస్తరించిన విష్ణుతత్వం ఇదేనా! ప్రతి మనిషి శరీరంలోనూ, భారత రైల్వే వ్యవస్థ కంటె సుమారు మూడు రెట్లు పొడవైన రవాణా వ్యవస్థ పొందుపరచబడింది. దేశంలో పదకొండు వేల రైళ్లు రవాణాపక్రియలో భాగస్వామ్యం వహిస్తుండగా, దేహంలో ఒక మిల్లీలీటరు రక్తంలో సగటున యాభై లక్షల కణాల లెక్కన మొత్తం శరీరంలో రెండున్నర లక్షల కోట్ల రక్తకణాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయి. పోషక పదార్థాలను శరీరమంతా పంచి పెడుతున్నాయి. ‘ఆయన’ ఏం చేసినా అంత పెద్దస్థాయిలో చేస్తాడు. భారీ చెయ్యి కదా మరి! రక్త కణాలు ప్రాణాధారమైన ఆక్సిజన్‍ను శరీరంలోని అణువణువుకూ చేరవేస్తున్నాయి. వ్యర్థమైన కార్బన్‍ డయాక్సైడ్‍ను మోసుకెళ్లి బయటకు పంపిస్తున్నాయి. ఇవన్నీ ఎర్రరక్త కణాలు చేసే పనులు. తెల్ల రక్త కణాలు రక్షణబాధ్యతలు నిర్వహిస్తాయి. రోగక్రిములతో యుద్ధం చేసి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిని ముద్దుగా మైక్రోపోలీస్‍మెన్‍ (సూక్ష్మ రక్షకభటులు), మైక్రోస్కావెంజర్స్ (సూక్ష్మ పారిశుద్ధ్య కార్మికులు) అని పిలుస్తారు. బయట వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాసరే, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తూ, సమ తుల్యంగా ఉంచడం రక్తం యొక్క మరో ప్రధాన భూమిక.
ఇది రక్తం గడ్డకట్టే విధానం విశ్వజనకుని విశేషప్రతిభకు, ఆపారకరుణకు అద్వితీయ నిదర్శనం. అయ్యో, నా పిల్లలకు ప్రమాదవశాన గాయాలైతే…? రక్తం కారితే? శరీరంలోని రక్తమంతా పోదా! వారి బ్రతుకులేం కావాలి ! అని విలవిలలాడుతూ, ప్రేమగా రక్తస్రావానికి అడ్డుకట్ట వేయడానికి రక్తంలోని ప్లాస్మాలో పోత్రాంబిన్‍, ఫైబ్రినోజిన్‍ అనే రెండు ప్రోటీన్లు తయారుచేశాడు. అయితే ఓ చిక్కు వచ్చి పడింది. ఇది రక్తాన్ని గడ్డకట్టింటే లక్షణమున్నవి కదా! ఇవి తయారై వెంటనే రక్తాన్ని గడ్డ కట్టించడం మొదలుపెడితే రక్తనాళాల్లోనే రక్తం ఘనీభవించి మనిషి వెంటనే చనిపోతాడే! మొదటికే మోసమొస్తుంది కదా! సరిగ్గా ఇక్కడే విశ్వంభరుని ప్రతిభావిశేషం ఎలా ప్రదర్శితమవుతున్నదో చూడండి! అనవసరమైన సమయంలో అనవసర మైన ప్రదేశంలో ఇష్టమొచ్చినట్టు రక్తం గడ్డ కట్టించి ఈ రెండు ప్రోటీన్లు తమ శక్తిని దుర్వినియోగ పరచకుండా కట్టడి చేసేందుకు ‘హెపారిన్‍’ అనే పదార్థం కాలేయం (లివర్‍)లో ప్రత్యేకంగా ఉత్పత్పి చేస్తున్నాడు. గాయమైన ప్రాంతానికి ‘పోత్రాంబిన్‍’, ‘ఫైబ్రినోజన్‍’ లను రవాణా చేస్తూ అదే సమయంలో దారి పొడుగునా వాటిని ‘హెపారిన్‍’ ద్వారా నియంత్రిస్తున్నాడు. దెబ్బ తగిలిన చోటికి చేరగానే తన పని పూర్తయిందని హెపారిన్‍ పక్కకు తప్పుకుని, రక్తస్రావం అరికట్టడానికి ఈ రెండు ప్రోటీన్లకూ అవకాశమిస్తుంది. తనువుకైన గాయాలు మాన్పడానికి ఎంతమెత్తగా వెన్నపూసను రాస్తున్నాడు మాధవుడు! మరి, మనసుకైన గాయాలకు మందు పూయడా? ఇంకెందుకు దిగులు ? ఇంకెందుకు ఆందోళణ! ఆశ్చర్యంతో నోటమాట రావట్లేదు కదూ మీకు?
మనకు కావలసిన కాయగూరలు, ఫలాల గురించి మట్టికెలా తెలుసు? మన పెరుగు దలకు, మనుగడకు కారణభూతమైన అన్ని విటమిన్లు, ఖనిజాలు, లవణాల వివరాలు ఇంత స్పష్టంగా మట్టికెలా తెలుసు? ‘మట్టిబుర్ర’ అని ఎవరినీ హేళన చెయ్యకండి! మట్టిలోని ప్రతిభ మహత్తరమైనది. పిల్లల మధ్యాహ్న భోజనం కొరకు తల్లి ఉదయాన్నే వంట వండుతుంది. కోట్ల సంత్సరాల తర్వాత పుట్టబోయే తన పిల్లలు వాహనాలు తయారు చేసుకుంటారనీ, అవి నడవటానికి ఇంధనం కావాలనీ, నేలతల్లి పెట్రోలును తన గర్భంలో ఎప్పుడో తయారుచేసి మోస్తున్నది. ఇది కదా ప్రేమకు నిర్వచనం! కన్న తల్లి ప్రేమ వంటిది కదా నేలతల్లి ప్రేమ!!
నాగరికత వృద్ధి చెందటానికి ఇనుము యొక్క ప్రాధ్యాన్యత ఎంతో ఉంది. ఇనుముతో ఎన్నెన్నో వస్తువులు తయారు చేస్తున్నాం. కానీ ఇనుమును మనం తయారు చేయలేం. ఇనుముతో పాటు ఎన్నో ఖనిజాలను భూమాత మనకు కానుకగా ఇచ్చింది. ఇంకోమాట! బంగారమంటే మనకు ఎంతో మోజు ఉంటుందని ఆభరణాల కోసం బంగారాన్ని బహూకరించింది కూడా! అయితే బంగారం కంటే ఇనుమెక్కువ అవసరమని గుర్తించి తక్కువ బంగారాన్ని, ఎక్కువగా ఇనుమును అందించింది. ఇదీ ప్రకృతి వివేకం, గ్రహించండి!!

Review ప్రకృతి ప్రజ్ఞ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top