బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తులు ఆరాధించే దైవం తిరుమల శ్రీనివాసుడు. స్థల ప్రభావం, శిలా వైభవం కలగలసిన తిరుమల దివ్య క్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా భావిస్తారు. శ్రీ వేంకటేశ్వరుని జగన్మోహనత్వం, జగదీశ్వర తత్వం యుగయుగాలుగా పరిఢవిల్లుతోంది. నిత్యకల్యాణం పచ్చ తోరణంగా విలసిల్లే తిరుమల శ్రీవారి సన్నిధి బ్రహ్మోత్సవ శోభతో అలరారనుంది. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 1 వరకు కోనేటిరాయుడు బ్రహ్మోత్సవ సంరంభంతో కొలువు దీరతాడు. కన్నుల వేడుకగా, అంగరంగ వైభవంగా సాగే ఈ మహోత్సవాలు అంకురార్పణతో ఆరంభమై చక్రస్నానంతో ముగుస్తాయి.
‘నానా దిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి’ అని అన్నమయ్య వర్ణించినట్టు- ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తజన ప్రభంజనం పోటెత్తుతుంది. వరాహ, భవిష్యోత్తర పురాణాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల ప్రశస్తి కనిపిస్తుంది. శ్రీవారికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాన్ని జరిపించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి కెక్కాయి. నవాహ్నిక దీక్షతో నవ బ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపే ఈ ఉత్సవ పరంపర బ్రహ్మోత్సవాలయ్యాయని అంటారు.
శ్రీవారి బ్రహ్మోత్సవ సంరంబంలో వాహన సేవలదే విశేష ప్రాముఖ్యం. తొమ్మిది రోజుల పాటు ఇరు దేవేరులతో శ్రీనివాసుడు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తాడు. దివ్యాలంకృతంగా, నవ్యమోహనంగా భక్తులకు శ్రీవారు భవ్యానందాన్ని అనుగ్రహిస్తాడు. ‘తిరువీధుల మెరసీ దేవదేవుడు- గరిమల మించిన సింగారముల తోడను’ అని అన్నమయ్య స్తుతించినట్టుగా ఈ ఉత్సవాలు నేత్రోత్సవంగా వర్థిల్లుతాయి. బ్రహ్మోత్సవాల వేళ జరిగే ఊరేగింపులో దేవదేవునికి భక్తజనం బ్రహ్మరథం పడుతున్నారా అన్నంతగా కిటకిటలాడతారు. ఏ ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ అష్టదిక్పాలకులను, అంటే- అగ్ని, ఇంద్ర, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ముందుగా బ్రహ్మరథం, ఆ వెనుక వేదాలను, ద్రవిడ ప్రబంధాలను గళం నిండా నింపుకొన్న జీయరు స్వాములు, ఆ వెనుక అర్చకులు, ఆ వెనుక విష్వక్సేన- సుదర్శన- అనంత- గరుడులు, ఆ వెనుక జంత్రగాత్ర మంగళవాద్యకారులు, వేదాలను పఠిస్తూ వైదికులు, ఏనుగులూ, గుర్రాలూ, విలువైన వస్త్రాలను నడుంపై వేసుకున్న ఎద్దులూ, ఆ వెనుక దేవాలయంలో స్వామి ఊరేగింపులో పాల్గొనేందుకు నియమించిన ప్రత్యేక జనం, ఆవెనుక చక్కటి వస్త్రధారణతో పురందరదాసు కీర్తనలను ఆలపిస్తూ భక్తులు, ఆ వెనుక నృసింహ, శ్రీరామ, కృష్ణావతారాల్లో శ్రీహరి అవతార, మహత్యాలను, విశేషాలను వివరించే నర్తకీమణులు, ఆ వెనుక తాళాలు, భజనలు, సుద్దులు, జోలలు, తరువోజ పద్యాలు, దండకాలు చదువుతూ భక్తజనం, ఆ వెనుక పుష్పమయమైన ఆనాటి స్వామి రూపంలోని ఒక విగ్రహం, ఆ వెనుక అలంకరించుకున్న బోయీల భుజస్కందాల మీద మలయప్ప స్వామి (ఉత్సవమూర్తి అయిన వేంకటేశ్వరుడు) శ్రీదేవి, భూదేవిలతో వస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే వైభవం అనే మాటకు అర్థం కళ్లకు కట్టాలంటే తిరుమల బ్రహ్మోత్సవాలను తిలకించాల్సిందే!

Review బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top