అణువణువున

సృష్టిలో ప్రతి విషయం గ్రహించడం చాలా సులభం. ప్రకృతి ధర్మాలు అర్థం చేసుకునేందుకు మనకున్న మామూలు ఇంగితజ్ఞానం చాలు. ‘నేను దేవుడిని చూడగలనా’ అనే ప్రశ్న వేదాంతపరమైనది. సంతృప్తికరమైన సమాధానం ఎన్నటికీ రాదు. ఈ ప్రశ్న అడిగినవారికి దైవం గురించి సరైన నిర్వచనం తెలియదనుకోవాలి. వారు మనసులో దైవమంటే ఇది, అది అనే అభిప్రాయం ముందుగానే ఏర్పరచు కొని అడుగుతున్నారు. ‘దైవాన్ని చూడగలమా’ అనేది మీ ప్రశ్న. ‘దైవాన్ని తప్ప వేరేమి చూడగలం’? అని నా ప్రశ్న. మీరు చూసేదంతా దైవమే. మీ చుట్టూ ఉన్న దంతా దీనికి సాక్ష్యం. సృష్టిలో ఏ ఒక్కటీ సాధారణ మైనది కాదు. ప్రతిదీ అద్భుతమే. అద్భుతం కానిది ఒక్క టంటే ఒక్కటి చూపించండి. అసాధ్యం! అసాధ్యం!!

చిన్నరాయిని గానీ, కొంచెం దూదినైనా గాని సృష్టించగలమా? ప్రతి వస్తువూ దైవమే! ప్రతి వస్తువూ దైవమే! ప్రతి వస్తువునూ దైవం సృష్టించలేదు, ప్రతి వస్తువుగా దైవం రూపాంతరం చెందాడు. ప్రతి వస్తువుగా దైవం ఉన్నాడు. అణువణువుగా అవతరించాడు. ఈ అనుభవం పొందడానికి ఏ పవితగ్రంథమూ చదవాల్సిన పనిలేదు. ప్రకృతి మహాగ్రంథాన్ని సరాసరి పఠించు. నిత్యపారాయణ చెయ్యి. దైవాన్ని కనుగొనడం కష్టసాధ్యమైన పని అంటారు. ఈ మాటకు అర్థం లేదు. నిజానికి ఇంతకంటే సులభమైన పనిలేదు. ఇప్పుడు మనం తెలుసుకున్న పద్ధతి కంటె తేలికైన పద్ధతి కూడా లేదు. ఒక పుస్తకం కొనాలంటే ఒక పద్ధతి ఉంది. వీసా పొందాలంటే మరొక పద్ధతి ఉంది. ప్రతి పని లోనూ ఎంత కోంత కష్టం ఉంది. కానీ దైవాన్ని కనుగొనడం అన్నిటికంటె సులభం. ఆయన నీ లోపల ఉన్నాడు. నీ బయట ఉన్నాడు. నీ పైన ఉన్నాడు. నీ చుట్టూ ఉన్నాడు. ఇంతకంటె తేలికైన పని లేనేలేదు. ఆయన బారి నుండి నువ్వు తప్పించుకోలేనంతగా నిన్ను చుట్టుముట్టి గట్టిగా పట్టుకొని ఉన్నాడు.

ఒక బిడ్డ తన తల్లిని కనిపెట్టడం ఎంత తేలిక! అక్కను గుర్తించడం, అన్నను గుర్తించడం, పసికందుకు కష్టం. మరి అమ్మ విషయం…? అమ్మను పసిపాప కెలా పరిచయం చేస్తాం? అమ్మను గురించి ఏమని వర్ణించి వివరిస్తాం? అమ్మకు నిర్వచనం పాపకు చెప్పగలమా? అమ్మను చూసీ చూడగానే పసికందు పెదవులపై నాట్య మాడే బోసినవ్వు కంటె సమాధానమేముంది ?

‘అమ్మలగన్నయమ్మ’ ఆ ప్రకృతి. ఆమె సంతతికి ఆమె గురించి పరిచయం చెయ్యాలా? వర్ణించాలా? నిర్వచించాలా? అన్నిటా దైవమే! అంతటా దైవమే!!
‘దేవుడు నీతో ఉన్నాడు’ అనే మాట తప్పు. ‘దేవుడు నీలో ఉన్నాడు.’ ఇది కూడా తప్పు.

‘నీవే దైవం’ ఇది నిజం!! దేవుడు నిన్ను సృష్టించలేదు. దేవుడు నీ రూపుదాల్చాడు. ఈ సత్యం గ్రహించడానికి ఏ జ్ఞానమూ అవసరం లేదు.
మన శరీరం చేసే పనులు సామాన్య మైనవా? తలచుకుంటే ఒక్కసారి వళ్ళు ఝల్లుమంటుంది. ఒక ఇడ్లీ ముక్కను రక్తంగా మారుస్తుంది. ఒక దోసె చేతి కివ్వండి, ఏ యోగిపుంగవుడు, ఏ యోధానుయోధుడు రక్తంగా మారుస్తాడో చెప్పండి? మనం మామాలు మను షులమని మనల్ని మనం చలకన చేసు కుంటాం. ‘నేను మానవుణ్ణి’ అన్న మాట కంటె పచ్చి అబద్ధం మరొకటి లేదు. ‘నేను దేవుణ్ణి’ అనటంకంటె పరమసత్యం మరొకటి లేదు. ఈ వాస్తవం తెలియడానికి తెలివితేటలతో ఏ మాత్రమూ పనిలేదు. జీవితం చాలా చిన్నది. ఈ కొద్ది సమయాన్ని, నా మొదటి లక్ష్యం ఇది, తర్వాత లక్ష్యం అది అని వృధా చెయ్యకు. ప్రతిదీ సహజదృష్టితో చూసి, సహజంగా జీవించు. దేవుడికి ఆకారం ఉందా లేదా అని చాలామంది అడుగుతారు. ఇటువంటి ప్రశ్నలు ఏళ్ళ తరబడి వస్తూనే ఉన్నాయి. ఈ రకం ప్రశ్నలకు, వీటికి చెప్పబడే జవాబులకు మనం అలవాటు పడిపోయాం. దేవుడెలా ఉంటే ఏమిటి ? ఇప్పుడు నీటిని ఘనమా, ద్రవమా, వాయువా అంటే ఏం చెబుతాం? మంచుగా ఉంటే ఘనం, నీరుగా ఉంటే ద్రవం, ఆవిరైతే వాయువు. సందర్భాన్ని బట్టి రూపం ఉంటుంది.

దైవానికి ఆకారం ఉంది, రెండూ నిజమే. మనకు ఎపుడు ఎలా కనిపించటం అవసరమో అపుడు ఆ దైవం అలా కనిపిస్తాడు.

అసలు దేవుడే గనుక ఉంటే, ఆయన అంతటా ఉంటాడు. లేనట్టయితే ఎక్కడా ఉండదు. అన్నిటా పరమాత్మను చూడలేకపోతే, మరెక్కడా ఆయనను చూడలేవు. భగవంతుని ఉనికికి ‘నీవే’ స్పష్టమైన సాక్ష్యం. ఇతరమైన అల్పమైన ఆధారాల కోసం వెదుకులాడకు. పరమేశ్వరునికై నీలోనే అన్వేషించు. అద్దంలో నిన్ను చూసుకో. ఆశ్చర్యచకితుడవుకా. నీ శరీరంలోని ప్రతి అవయవాన్నీ దైవమే నిర్మించాడు, మరెవ్వరూ కాదు. మరింత లోతుగా నీలో నిన్ను చూసుకో. నీ మనసులోని అద్భుతమైన ఆలోచనలు, నీ హృదయంలోని అపురూపమైన అనుభవాలు, భావోద్వేగాలు అన్నీ ఆయన సృజన మాత్రమే. నిన్ను చూసి గర్వించు, నీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి గర్వించు. నీ నుంచి, సృష్టి నుండి ఆనందాన్ని ఆస్వాదించు. ఈ జగత్తు – జగత్కారకుడు ఒక్కటిగా కలిసిపోయారు. ఈ సృష్టి-సృష్టికర్త ఒక్కరై లీనమయ్యారు. ఇప్పుడు దైవాన్ని కనిపెట్టడం కంటో విడిచి పెట్టడం నీకు అసాధ్యం. నీ జీవితం అనంతకాలం ఆనంద తాండవం చేయునుగాక!

Review అణువణువున.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top