శ్వేతసౌధంలో వికసించిన – ‘నల్ల కలువ’

ఆమె అమెరికా భవిష్యత్తు ఆశారేఖ. అమెరికన్‍ మహిళల్లో రేపటి అవకాశాలపై ఆశల రెక్కలు తొడిగిన సాహస ప్రతీక. అగ్రరాజ్య సార్వభౌమత్వానికి చిహ్నమై వెలుగొందే శ్వేతసౌధం (వైట్‍హౌస్‍)లో వికసించిన నల్లకలువ ఆమె. ఆ కలువ పువ్వు తల్లి వేరు భారతదేశంలో ఉంది. అనుబంధం వెస్టిండీస్‍తో ముడిపడి ఉంది. ఆమే.. కమలా హారిస్‍. అమెరికా చరిత్రలో ఆమె కొత్త పుటను లిఖించారు. అగ్రరాజ్యం ఉన్నత స్థానాల్లో మహిళలు లేరన్న అపవాదును ఆమె సాధించిన విజయం సమూలంగా తుడిచిపెట్టేసింది. నల్లజాతీయుల్లో గుండె ధైర్యాన్ని నింపింది. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే కమలా హారిస్‍.. అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళ.. మొదటి నల్లజాతీయురాలు కూడా. తొలి ఆసియన్‍ అమెరికన్‍ కూడా ఆమే. కమలా హారిస్‍.. భారతీయ మూలాలున్న ఆఫ్రికన్‍, ఆసియన్‍ అమెరికన్‍ ఉమెన్‍.

పూర్తిగా మాతృమూర్తి పెంపకంలో పెరిగిన కమలా హారిస్‍ మహిళలకు ఆదర్శం. చదువు, పట్టుదల ఉంటే ఎంతటి స్థానాల•కైనా ఎదగవచ్చన్న దానికి ఆమె ఉదాహరణ. ఒక్కసారి ఆమె జీవితాన్ని పరిశీలిస్తే.. ముందుగా ఆమె తల్లి శ్యామలా గోపాలన్‍ గురించి చెప్పుకోవాలి. ఆమె భారత్‍లోని తమిళనాడుకు చెందిన వారు. అక్కడి ఒక చిన్న గ్రామమైన తులసెంథిరపురం స్వస్థలం. ఈ గ్రామం చెన్నై నగరానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. 19 సంవత్సరాల వయసులోనే 1958లో చదువుల నిమిత్తం శ్యామల అమెరికా వచ్చారు. చేతిలో కాసిన్ని డాలర్లు, సూట్‍కేసులో కొన్ని దుస్తులు తప్ప ఇంకేమీ లేవు. గుండె నిండా ఆత్మవిశ్వాసం మాత్రమే ఉంది. బర్కెలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేరారు. 1964లో పీహెచ్‍డీ పట్టా తీసుకున్నారు. క్యాన్సర్‍ పరిశోధకురాలిగా ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఆమె పౌర హక్కుల కార్యకర్త కూడా. అమెరికాలోనే.. వెస్టిండీస్‍లో భాగమైన జమైకాకు చెందిన డొనాల్డ్ జే హారిస్‍ను శ్యామల వివాహం చేసుకున్నారు. అనంతరం ఆయన స్టాన్‍ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‍గా ఎదిగారు. ఆ దంపతులకు కమల, మాయ అనే కుమార్తెలు జన్మించారు.

ఆక్లాండ్‍ నుంచి ప్రస్థానం మొదలు..
కమల ఆక్లాండ్‍లో ఉండగా జన్మించారు. కమల ఏడో ఏటలో ఉండగా తల్లిదండ్రులు విడిపోయారు. శ్యామల గోపాలన్‍ ఒంటరిగానే కుమార్తెలు ఇద్దరినీ పెంచి పెద్ద చేశారు. కమలకు చెల్లెలు మాయతో అనుబంధం ఎక్కువ. తల్లి పెంపకంలో పెరుగుతున్న వీరిని ఉద్దేశించి ఇరుగుపొరుగు వారు ‘శ్యామల అండ్‍ ద గర్లస్’ అని పిలిచే వారు. పిల్లలిద్దరూ సెలవు రోజుల్లో తండ్రి వద్దకు వెళ్లినపుడు ఇరుగు పొరుగు వారు కమల, మాయను నల్లజాతీయులుగానే చేసేవారు. తెల్లజాతి పిల్లలు వీరిద్దరినీ తమతో ఆడుకోవడానికి కలవనిచ్చే వారు కాదు. చిన్నతనంలో అక్కచెల్లెలు ఇద్దరూ నల్ల జాతీయుల చర్చిలకు వెళ్లి పాటలు పాడేవారు. తల్లి శ్యామల వీరికి హిందూ పురాణ కథలను చెప్పేవారు. మద్రాస్‍ (ఇప్పటి చెన్నై)లోని తండ్రి పీవీ గోపాలన్‍ ఇంటికి తీసుకెళ్లి తన మూలాలను, కుటంబ వరసలను గురించి పిల్లలిద్దరికీ వివరించే వారు.

చదువుల పయనం..
చదువుల్లో రాణించిన కమలా హారిస్‍ వాషింగ్టన్‍లోని హోవార్డ్ యూనివర్సిటీలో చేరారు. ఆఫ్రికన్‍ – అమెరికన్‍ సంతతి విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా చదువుతుంటారు. తన జీవితంపై ఎక్కువగా ప్రభావితం చూపిన అనుభవాల్లో కాలేజీ జీవితమూ ఒకటని కమలా హారిస్‍ చెబుతుంటారు. కాలిఫోర్నియాలోని హేస్టింగ్స్ లా కాలేజీ నుంచి ఆమె న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అక్కడ బ్లాక్‍ లా స్టూడెంట్స్ అసోసియేషన్‍కు కమల అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1990లో కాలిఫోర్నియాలో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని న్యాయవాద వృత్తిని చేపట్టారు.

భారతీయ వారసత్వంతోనే..
పూర్తి భారతీయ వారసత్వంతోనే కమలా హారిస్‍ ఎదిగారు. తల్లితో కలిసి భారతదేశాన్ని సందర్శించే వారు. కానీ తన తల్లి ఆక్లాండ్‍ నల్లజాతి సంస్కతిని పుణికిపుచ్చుకున్నారని, తనను, తన చెల్లెలు మాయా హారిస్‍ను ఆ సంస్కతిలో పెంచారని కమలా హారిస్‍ చెబుతుంటారు. చిన్నప్పుడు వారింట్లో ఎప్పుడూ నల్లజాతి అమెరికన్‍ గాయకుల సంగీతం వినిపిస్తుండేదట.

‘కమల’ పలుకులు
‘ద ట్రూత్‍ వియ్‍ హోల్డ్’ పేరుతో తన ఆత్మకథతో నిండిన పుస్తకాన్ని కమలా హారిస్‍ 2018లో విడుదల చేశారు. ‘నా పేరును ‘కమలా’ అని పిలవాలి. పంక్చుయేషన్‍ కోసం ఉపయోగించే కామా (,) పలికినట్టు పలకాలి అని అందులో కమలా రాశారు.
‘కమల అంటే తామర లేదా కమలం అని అర్థం. భారతీయ సంస్క•తిలో దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పైకి ఆ పువ్వు కొలనులో తేలియాడుతున్నట్టే కనిపిస్తుంది. కానీ, దాని వేళ్లు కొలను అడుగున బలంగా పాతుకుపోయి ఉంటాయి’ అంటూ అమెరికన్లకు తన పేరు గురించి ఆ పుస్తకంలో వివరించారామె.
ద్విజాతి మూలాలు, ఆ పెంపకంలో పెరిగిన కమల అమెరికన్‍ అస్తిత్వాలలో కలిసిపోగలరు. సులువుగా ఇమిడిపోగలరు.
‘కమలా హారిస్‍ భారత సంస్క•తిని ఆకళింపు చేసుకుంటూ పెరిగారు. కానీ, ఇప్పుడు ఓ ఆఫ్రికన్‍ అమెరికన్‍గా ఆమె గర్వంగా జీవిస్తున్నారు’ అని 2018లో వాషింగ్టన్‍ పోస్ట్ ఓ కథనం రాసింది.

‘‘ఇద్దరు నల్లజాతి కూతుళ్లను పెంచుతున్నానని మా అమ్మకు బాగా తెలుసు. అందుకే, మేం ఉంటున్న దేశం (అమెరికా) నన్ను, చెల్లెలు మాయను నల్లజాతి బాలికలుగానే చూస్తుందన్న విషయం మా అమ్మకు అర్థమైంది. అందుకే ఆత్మవిశ్వాసంతో గర్వించే నల్లజాతి మహిళలుగా మమ్మల్ని తీర్చిదిద్దాలని ఆమె నిర్ణయించుకుంది’’.

– ‘ద ట్రూత్‍ వియ్‍ హోల్డ్’ అనే తన
ఆత్మకథలో కమలా హారిస్‍

Review శ్వేతసౌధంలో వికసించిన – ‘నల్ల కలువ’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top