‘కారు’ దే సర్కారు

తొలి రాష్ట్రంలో తొలిసారి తెలంగాణ సెంటిమెంట్‍తో గద్దెనెక్కిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‍ఎస్‍)కి ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాదనే ఊహాగానాలు.. ప్రజా కూటమి గట్టి పోటీనిస్తుందనే సంకేతాలు.. 60 స్థానాలు దాటి ఎవరికీ మెజారిటీ రాదనే అంచనాలు.. కూటమిదే అధికారమని కొన్ని సర్వేలు.. టీఆర్‍ఎస్‍దే విజయమని జాతీయ చానెళ్ల ఎగ్జిట్‍ పోల్స్.. అత్యంత ఉత్కంఠ పరిణామాల మధ్య జరిగిన తెలంగాణ శాసనసభ 2018 ఎన్నికల్లో చివరికి టీఆర్‍ఎస్‍నే విజయం వరించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‍) వరుసగా రెండోసారి తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబరు 11న జరిగిన ఓట్ల లెక్కింపులో 88 స్థానాలతో విజయకేతనం ఎగురవేసిన కేసీఆర్‍.. డిసెంబరు 13న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటుగా మాజీ డిప్యూటీ సీఎం మొహమద్‍ అలీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు కీలకమైన హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. అలాగే, తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‍)ను పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍గా నియమించారు.

ఇదీ ఎన్నికల క్రమం..

సెప్టెంబరు 6, 2018న కేసీఆర్‍ అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించారు. అక్కడి నుంచి రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కేసీఆర్‍ అసెంబ్లీ రద్దుచేసి ముందస్తు శంఖారావం పూరించడమే కాకుండా.. ఏకంగా 105 స్థానాల్లో (మొత్తం స్థానాలు 119) సిట్టింగ్‍ ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబరు 6న ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు వీలుగా షెడ్యూల్‍ను జారీ చేసింది. నవంబరు 12న ఎన్నికల నోటిఫికేఫన్‍ వెలువడింది. డిసెంబరు 7న పోలింగ్‍.. 11న ఓట్ల లెక్కింపు పక్రియలు పూర్తయ్యాయి.

అప్పటి నుంచే యుద్ధం మొదలు..

సెప్టెంబరు 2న కేసీఆర్‍ ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తెరలేపుతూ.. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‍లో ‘ప్రగతి నివేదన’ పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించారు. ఆ వెంటనే సెప్టెంబరు 6న తెలంగాణ శాసనసభను రద్దుచేస్తూ ముందస్తున్న ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించడమే కాక.. 105 స్థానాల్లో అప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న వారినే తిరిగి 2018 ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ పరిణామాలు వేగంగా మారిపోయాయి. టీఆర్‍ఎస్‍ను ఢీకొట్టడానికి కాంగ్రెస్‍ పార్టీ ఎన్నో అంచనాలు, ఎత్తుగడలతో ఈ ఎన్నికల బరిలోకి దిగింది. ఇతర పార్టీలతో కలిసి ప్రజా కూటమిగా ఏర్పడింది. తన చిరకాల ప్రత్యర్థి అయిన తెలుగు దేశం పార్టీ (టీడీపీ)తో చేతులు కలపడానికీ సందేహించలేదు. ఇంకా, తెలంగాణ జన సమితి (టీజేఎస్‍), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‍ ఇండియా (సీపీఐ), తెలంగాణ ఇంటి పార్టీ మరికొన్ని పక్షాలతో కలిసి పొత్తు పెట్టుకుంది. ఇక, సీపీఎం.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్‍ (బీఎల్‍ఎఫ్‍) పేరుతో పలు ఇతర పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒంటరిగానే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఇవన్నీ టీఆర్‍ఎస్‍కు వ్యతిరేకంగానే పోటీలో ఉండటంతో ఈసారి గట్టిపోటీ ఉంటుందనే అంచనాలు ఊపందు కున్నాయి. ఓట్ల లెక్కింపు వరకు కూడా ఎవరిది విజయమనే విషయంలో స్పష్టత లేని పరిస్థితి కనిపించింది.

కారు’ దూకుడు..

అన్ని పార్టీల కంటే చాలాముందే టీఆర్‍ఎస్‍ తన అభ్యర్థులను ప్రకటించడంతో, మరుక్షణం నుంచే ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారం భించారు. ఎన్నికలకు చాలినంత సమయం ఉండటంతో టీఆర్‍ఎస్‍ అభ్యర్థులు నియోజక వర్గాల్లోని ఇంటింటికీ చొచ్చుకుపోయారు. పలు దఫాలుగా గ్రామాలను చుట్టొచ్చారు. కుల, సామాజిక సంఘా లతో ఆత్మీయ సమ్మేళనాల పేరిట మమేకం అయ్యారు. టీఆర్‍ఎస్‍ అభ్యర్థులు ప్రచారాన్ని మొదటి దఫా పూర్తి చేసే నాటికి కూడా కాంగ్రెస్‍ కూటమి అభ్యర్థులకు సీట్ల పంపకాలు తేలలేదు. దీంతో ప్రజా కూటమి అభ్యర్థులు చాలా ఆల స్యంగా ప్రచారాన్ని ప్రారంభించడమే కాకుండా, ప్రచారంలో వెనుకబడిపోయారు. టీఆర్‍ఎస్‍కు అన్నీ తానైన కేసీఆర్‍ ఏకంగా 116 నియోజక వర్గాల్లో ఏకబిగిన ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన కుమారుడు కేటీఆర్‍ 85 స్థానాల్లో, టీఆర్‍ఎస్‍లో మరో కీలక నేత హరీశ్‍రావు 25 స్థానాల్లో పార్టీ అభ్యర్థుల తరపున సుడిగాలిలా చుట్టొచ్చారు. నిజానికి ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన కేసీఆర్‍ బ•ందానికి.. ప్రచారంలో చెప్పుకోవడానికి ఏమీ లేదనే చెప్పాలి. తన హయాంలోనే గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ, అభివ•ద్ధి పనుల గురించే ఆయన ఏకరువు పెట్టే వారు. దీంతో టీఆర్‍ఎస్‍ ప్రచారం చప్పగా సాగుతోందని, గతంలో మాదిరిగా కేసీఆర్‍ ఆకట్టుకునేలా మాట్లాడలేకపోతున్నా రనే వాదన తెరపైకి వచ్చింది. అయితే, చిరకాల ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్‍-టీడీపీ చేతులు కలిపి కూటమిగా ఏర్పడటంతోనే కేసీఆర్‍ చేతికి మంచి ఆయుధం దొరికి నట్టయింది. టీడీపీ అధినేత చంద్రబాబును బూచిగా చూపి.. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సెంటిమెంట్‍ను తెలివిగా టీఆర్‍ఎస్‍ తనకు అనుకూలంగా మలుచుకుంది. కూటమి అధికారం లోకి వస్తే తెలంగాణ ప్రజలు ఏ పని కాలన్నా అటు అమరావతికి లేదంటే ఢిల్లీకి వెళ్లాలంటూ కేసీఆర్‍ అండ్‍ కో చేసిన ప్రచారం ప్రజలను ఆలో చనలో పడేసింది. అలాగే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ్ర ధ పెత్తందారుల చేతుల్లోకి వెళ్లిపోతుందనే ప్రచారం కూడా ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. ఇవే టీఆర్‍ఎస్‍ చిహ్నమైన ‘కారు’ గుర్తు దూసుకుపోవడానికి కారణమయ్యా యని ఎన్నికల అనంతరం రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే, ఎన్నికల చివరి వరకు మాత్రం టీఆర్‍ఎస్‍ తన విజయం కోసం గట్టిగానే పోరాడాల్సి వచ్చింది. విజయం ఏమంత తేలిక కాదని సాగిన ప్రచారం.. కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చిన కొన్ని సర్వేలు ఆ పార్టీని కొంత ఆత్మరక్షణలోనూ పడేసిన మాట వాస్తవం. అయితే ఎగ్జిట్‍ పోల్స్ మాత్రం టీఆర్‍ఎస్‍కే పట్టం కట్టాయి. ఆ పార్టీ దాదాపు 80 స్థానాలతో విజయం సాధి స్తుందని పలు జాతీయ చానళ్లు ఘంటాపథంగా చాటాయి. చివరకు అదే నిజమైంది. 88 స్థానాలతో టీఆర్‍ఎస్‍ ‘కారు’ ఎదురే లేకుండా దూసుకుపోయింది. ఆ పార్టీ దరిదాపున కనీస స్థాయిలో నిలిచే పార్టీ కూడా ఏదీ లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 21 స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్‍ పార్టీ.. ఈసారి టీడీపీ, సీపీఐ, టీజేఎస్‍ వంటి పార్టీలతో జత కట్టినా.. 19 స్థానాలకే పరిమితమైంది. టీడీపీ మాత్రం ఖమ్మం జిల్లాలో 2 స్థానాలను గెలుచు కుంది. టీజేఎస్‍, సీపీఐ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక,టీఆర్‍ఎస్‍కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం తన 7 స్థానాలను తిరిగి గుప్పిట బిగించుకుంది. బీజేపీ 1 (గోషామహాల్‍ – రాజాసింగ్‍) స్థానానికే పరి మితం కాగా, ఏఐఎఫ్‍బీ, ఇండిపెండెంట్‍ అభ్య ర్థులు చెరొక స్థానాల్లో గెలిచారు. ఇక, టీఆర్‍ఎస్‍ నుంచి ఓడిపోయిన ప్రముఖుల్లో నలుగురు మంత్రులు ఉండటం విశేషం. తుమ్మల నాగేశ్వర రావు (పాలేరు- ఖమ్మం జిల్లా), జూపల్లి క•ష్ణా రావు (కొల్లాపూర్‍- ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లా), అజ్మీరా చందూలాల్‍ (ములుగు- ఉమ్మడి వరంగల్‍ జిల్లా), పట్నం మహేందర్‍రెడ్డి (తాండూరు- రంగారెడ్డి జిల్లా).. ఈ నలుగురు మంత్రులూ ఓటమి పాలయ్యారు. పాలేరు, కొల్లాపూర్‍ నియోజకవర్గాల్లో పార్టీలోని అంతర్గత విభేదాలే ఆ పార్టీ కొంపముంచాయి.

కూటమి ఓటమికి కారణాలెన్నో..

నిజానికి కూటమి ఏర్పడే కంటే ముందే రాష్ట్రంలో టీఆర్‍ఎస్‍కు వ్యతిరేక గాలులు వీస్తు న్నట్టు జోరుగు ప్రచారం సాగింది. అధికార పార్టీ కావడం, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై స్థానికంగా అసంత•ప్తి నెలకొనడం, తిరిగి సిట్టింగ్‍ ఎమ్మెల్యేలకే టీఆర్‍ఎస్‍ టీకెట్లు కేటాయించడం వల్ల ప్రభుత్వం, సిట్టింగ్‍ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న అసంత •ప్తి, వ్యతిరేకత తనకు కలిసి వస్తాయని, అదీగాక టీడీపీ వంటి క్యాడర్‍ ఉన్న పార్టీతో పొత్తు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజేఎస్‍, పోరాట పటిమ గల సీపీఐతో పెట్టుకున్న పొత్తుతో ఈసారి తెలంగాణలో తమ జెండా ఎగుర వేయడం ఖాయమని కాంగ్రెస్‍ ఆశలు పెట్టు కుంది. అయితే, చివరి వరకు కూటమిలో సీట్లు సర్దుబాటు కాకపోవడం, నామినేషన్ల ఉపసంహ రణ గడువు ముగిసే చివరి వరకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడం వంటివి కూటమి ఆశలపై నీళ్లు చల్లాయి. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లడానికి సమయమే లేకపోయింది. ఇక కాంగ్రెస్‍ పార్టీ రాష్ట్ర సారథులు ఎవరూ ఇతర నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లిన దాఖలాలే లేవు. రెండు మూడుచోట్ల సోనియాగాంధీ, రాహుల్‍గాంధీ ప్రచార సభలే తప్ప రాష్ట్ర నేతలెవరూ ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేసింది లేదు. ప్రసార, ప్రచార మాధ్యమాల్లో మాత్రం ప్రకటనలను హోరెత్తించినా.. ఫలితం లేక పోయింది. తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న పొత్తును.. తెలంగాణ అస్థిత్వానికి ముప్పు తెచ్చేదిగా టీఆర్‍ఎస్‍ ప్రచారం చేయడంలో సఫలీక•తమైంది. అలాగే, టీడీపీ ఆవిర్భావమే కాంగ్రెస్‍ వ్యతిరేకతతో జరిగింది. దాదాపు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‍-టీడీపీలు రాజకీయ ప్రత్యర్థులు. అటు వంటిది ఇప్పుడు కూటమిగా ఏర్పడటం రెండు పార్టీల్లోని దిగువ శ్రేణి కార్యకర్తలకు మింగుడు పడలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సరిగా జరగలేదు. అలాగే, టీఆర్‍ఎస్‍ కుటుంబ పాలనకు ఈ ఎన్నికలతో స్వస్తి చెప్పాలన్న కూటమి పిలుపును ప్రజలు పట్టించుకున్నట్టు కనిపించలేదు. పైగా టీడీపీతో కాంగ్రెస్‍ జత కలవడాన్ని తెలంగాణ సమాజం అనుమానంగా చూసింది. ఇవన్నీ కలిసి టీఆర్‍ఎస్‍కు లాభించాయి. దీంతో కాంగ్రెస్‍ పార్టీ 19 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‍ నుంచి ఉద్ధండులైన జానారెడ్డి (నాగార్జున సాగర్‍), డీకే అరుణ (గద్వాల), జె.గీతారెడ్డి (జహీరాబాద్‍), మాజీ ఉప ముఖ్యమంత్రి దామో దర రాజనర్సింహ (అందోలు), మాజీ మంత్రి సునీతారెడ్డి (నర్సాపూర్‍), పీసీసీ చీఫ్‍ ఉత్తమ్‍ కుమార్‍రెడ్డి భార్య పద్మావతీరెడ్డి (కోదాడ), కాంగ్రెస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్లు రేవంత్‍రెడ్డి (కొడంగల్‍), పొన్నం ప్రభాకర్‍ (కరీంనగర్‍), పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య (జనగామ) తది తరులు ఓటమి పాలయ్యారు. టీడీపీ ఖమ్మం జిల్లాలో 2 స్థానాల్లో గెలుపొందింది. సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మచ్చా నాగేశ్వరరావు (అశ్వారావు పేట) ఆ పార్టీ తరఫున విజయం సాధించారు. ఇక, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూకట్‍పల్లి స్థానంలో ఓటమి ఆ పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా దివంగత హరిక •ష్ణ కుమార్తె సుహాసిని రంగంలోకి దిగారు. ఆమె గెలుపు కోసం టీడీపీ సర్వశక్తులు ఒడ్డింది. కానీ, చివరకు ఓటమి తప్పలేదు. అలాగే, ఉద్యమ అనుభవంతో రాజ కీయ పార్టీగా మారిన తెలంగాణ జన సమితి (టీజేఎస్‍)ని కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. ఈ పార్టీ అధినేత కోదండరామ్‍ ఎక్కడా పోటీ చేయలేదు. అలాగే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి (హుస్నాబాద్‍)లో ఓటమి పాలయ్యారు.

-జగదీశ్వర్‍, రాజకీయ విశ్లేషకులు, తెలుగుపత్రిక

Review ‘కారు’ దే సర్కారు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top