మేటి తెలుగు పద్యం

పూలు వేరైనా పూజ ఒక్కటే
పసుల వన్నె వేరు పాలేక వర్ణమౌ
పుష్పజాతి వేరు పూజ యొకటి
దర్శనములు వేరు దైవంబు యొక్కటి
విశ్వదాభిరామ వినురవే

వేమన రచించిన పద్యాల్లో సాటి లేని మేటి పద్యమిది. నేటి సామాజిక జీవనాన్ని, అందులోని స్థితిగతులను ఏళ్ల క్రితమే తన పద్యాల్లో వ్యక్తీకరించిన అద్భుత కవి వేమన. అందుకే ఆయన్ను ప్రజాకవిగా వర్ణించారు. ప్రజలలో ఉన్న మూఢ నమ్మకాలను పోగొట్టడానికే కలం పట్టాడు యోగి వేమన. ‘నా కులం గొప్పది.. నా మతం గొప్పది’ అని కొట్లాడుకుంటున్న సమాజాన్ని దర్శించాడు ఆ మహాకవి. అతని విశ్వమానవ భావనకు ఈ సమాజ రూపం విపరీతంగా తోచింది. తనకున్న అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పడం అతని పద్ధతి. ఈ సమాజాన్నే నిరసించి దూరంగా వెళ్లిన కవికి సమాజ నగ్న రూపాన్ని వర్ణించడానికి భయమెందుకు?
సంఘంలోని మన కళ్లెదురుగా కని పిస్తున్న రెండు ఉపమానాలను పై పద్యంలో తీసుకున్నాడు వేమన. నల్లవి, తెల్లవి, ఎర్రవి, మచ్చలవి తదితర ఎన్నో రకాల పశువులను ఆయన చూసి ఉన్నాడు. కానీ, అవి ఇస్తున్న పాలు అన్నీ తెల్లనివే. అంటే అవి కనిపించే రూపాలు. రంగులు వేరైనా వాటి పాల రూపం, రంగు ఒక్కటే. అలాగే ఎన్నో జాతుల పూలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ వేర్వేరు రంగులు కలిగి ఉన్నాయి. కానీ, దేవుని వద్దకు చేరగానే అవన్నీ ఒక పూలమాలగానో, కదంబంగానో కలిసి అందాలు వెలువ రిస్తాయి.
లోకరీతి ఇలా ఉండగా, వివిధ కాలాల్లో, వివిధ ప్రవక్తలు చెప్పిన మత గ్రంథాలు, రకరకాల పద్ధతులలో ఆ భగవంతుని కీర్తించి వర్ణించారు. అంత మాత్రం చేత వాటి అంతస్సూత్రమైన, అంతస్సారమైన భగ వంతుని తత్వం వేరుగా ఎందుకు
ఉంటుంది? ఆ తత్వాన్ని పూజించే ప్రజలు వేరు వేరైనప్పటికీ ఒకే సమాజంగా కలిసి మెలిసి ఒకే దైవంగా పూజిస్తే ఎంత అందంగా ఉంటుంది. ఆ అందాన్నే కాంక్షించి వేమన పై పద్యాన్ని రచించాడు. ఆవులు, గేదెలు మున్నగు పశువుల రంగులు వేరైనా అవి ఇచ్చే పాలు, ఆ పాల రంగు మాత్రం ఒక్కటే. పూలు రకరకాల వర్ణాలు కలిగి ఉన్నా.. అవన్నీ భగవంతుని పూజకే వినియోగమవుతాయి. వేమన ఈ పద్యం ద్వారా వసుధైక కుటుంబ భావనను సృజించాడు. ఇంత గొప్ప భావనను తన వేన వేల పద్యాల ద్వారా సృష్టించాడు కాబట్టే వేమన విశ్వమానవుడు అయ్యాడు. ఆయన తన పద్యాల ద్వారా ప్రజల్లో గూడుకట్టుకున్న మూఢ నమ్మకాలను తొలగించడానికి ప్రయత్నించడంతో పాటు వసుధైక కుటుంబ భావాన్ని విశ్వవ్యాప్తం చేశాడు.

Review మేటి తెలుగు పద్యం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top