సామాన్యం – అసామాన్యం

ప్రతి అద్భుతం ఆవిష్కరింపబడే విధం అతి సామాన్యం(46)
ప్రతి సామాన్యం నిజానికి అనన్యసామాన్య

అద్భుతమైన విషయాలు అతిసామాన్యమైనవిగా అనిపిస్తుంటాయి కారణం తెలుసా? అద్భుతాలన్నీ ఎంతో మామూలుగా జరుగుతుంటాయి. ఓ గ్లాసు పళ్లరసం తాగే విషయమే తీసుకోండి. అందులో ఏమంత గొప్పతనం ఉందనిపిస్తుంది. అయితే గొంతు క్యాన్సర్‍ ఉన్న వ్యక్తికి అదో అపురూపమైన అనుభవం. సాయంసంధ్యలో సముద్రపుటొడ్డున అలా అలా నడుస్తున్నామనుకోండి. అందులో పెద్ద విశేషమేముంది? కీళ్లవాతంతో బాధపడే మనిషి, తనను నడిచేటట్లు చేస్తే సర్వస్వం ధారపోస్తాడు. అతనికది గొప్ప మహిమ.

రెండో కారణం, అన్ని అద్భుతాలూ అంద రికీ అందుబాటులో ఉంటాయి. ఒకే అనుభవాన్నిస్తాయి. అందుకే వాటిని పెద్దగా పట్టించుకోం. గొప్పగా గుర్తుపెట్టుకోం. నేను ఉదయాన్నే నిద్రలేస్తాను. మా పక్కింటి ఆసామి కూడా అంతే. నాకు రెండు కళ్ళున్నాయి. ఆయనకీ ఉన్నాయి. వింత ఏముందనిపిస్తుంది.
ఇక మూడో కారణం. ఎన్నో పనులు ఎల్ల వేళలా, నిరంతరం జరుగుతుంటాయి. కాబట్టి అద్భుతాలుగా గుర్తించలేక పోతున్నాం. రోజూ తింటున్నాం, నిద్రిస్తున్నాం, అనుక్షణం శ్వాసి స్తున్నాం. వీటిని చిన్న విషయాలుగా పొర బడుతున్నాం. అతి ముఖ్యమైన ఆఖరి కారణం, ఈ అద్భుతాలు అప్రయత్నంగా, అలవోకగా జరుగు తున్నాయి.
ఎంతో శ్రమించి సాధించిన వాటిని మాత్రమే మనం అమూల్యమైనవిగా భావిస్తాం. ప్రభాకరుడు పంచే వెలుగుకు ఎంత ధనం చెల్లిస్తున్నాం? మాట మాత్రమైనా అడగకుండానే కాంతినిస్తున్నాడే? వర్షం కురిపిస్తున్నందుకు ఆకాశం పన్ను వసూలు చేస్తోందా? అనాయాసంగా లభించే వస్తువులపై అనాదరణ చూపిస్తాం కదా! ప్రాణవాయువు విలువ పైకమిచ్చి కొనుక్కుంటే తెలిసి వస్తుంది. ఆస్పత్రుల్లో చేరిన వారెందరో ఆక్సిజన్‍ కోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు. ఇటువంటి దైహిక, దైనిక ముఖ్యావసరాలు లేకపోతే ఎలా జీవించాలో ఊహకు కూడా అందదు. కానీ, ఇంతటి అద్భుతాలకు విలువ ఇవ్వం. నింగి తొలకరి జల్లులు చిలకరించే సమయంలో స్తబ్ధునిగా కూర్చోవద్దు. నీలిమేఘాలు ఇన్ని జలనిధులను ఎలా నిక్షిప్తం చేసుకున్నాయని ఆశ్చర్యపడుతూ ఇంతింత కళ్లు చేసుకుని పులకించి చినుకు – చినుకుతో హృదయ మయూరం పురివిప్పి చిందులు వేయాలి. హరివిల్లు చూసి పర వళ్ళు తొక్కి కవితాఝరులు పారించే కవీశ్వరుని కలంతో పోటీపడి నీ మానస సరోవరం హర్షాతిరేకాలు ప్రవహింప చెయ్యాలి. ఈ ఆనందపారవశ్యమే భక్తియోగం. ఇందుకు ప్రత్యేకమైన సాధనతో పని లేదు. ఆశ్చర్యంలో మునిగితే చాలు.
ఎక్కడో గగన మండలం నుండి జలరాశులు పయనించి వచ్చి నీ తోటను పలకరించి, నీ ఇంటి ప్రాంగణాన లయబద్ధంగా ఆడుతున్న వైనాన్ని నీ బుద్ధి కుశలతతో పరిశీలించు. ప్రకృతి మేధోశక్తిని లోతుగా అధ్యయనం చేసి జేజేలు పలుకు.
విజ్ఞానశాస్త్రం ఎలా పెంపొందుతుంది? అవధి లేని జిజ్ఞాస, అంతులేని ఆశ్చర్యం, నిరంతర పరిశోధన. జ్ఞానమంటే ఇదే కదా! మరి ఇది జ్ఞానయోగం కాదా? అమాయకమైన పసిపాప మాదిరిగా ఆశ్చర్యపడుతూ అద్భుతరసావిష్కరణ చెయ్యాలి.
ఎండ తీవ్రతకు సముద్రపు నీరు ఆవిరిగా మారి మేఘమై వర్షించడం, ఒక్కసారిగా కాక, అంచెలంచెలుగా జలధారలు కురియడం, వాన వెలసి తిరిగి ఎండ కాయడం, ఎక్కడి మబ్బులు అక్కడ మాయం కావడం అద్భుతంగా లేదూ? తల్లి తన బిడ్డకు పాలిచ్చి నట్టు, ప్రకృతి వర్షించి మనసు పోషిస్తున్నది. జ్ఞానంతో ఋతుచక్రం పరికించి, పరవశించడమే కదా జ్ఞానయోగం!
ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చొని యాంత్రికంగా భగవద్గీత చదువుకునే వారు బయట ఇలాంటి కమనీయ దృశ్యం చూసి తరించలేరు. దైవాన్ని గ్రంథాలలో వెతకవద్దు. ప్రకృతిలో పరమాత్మను దర్శించండి. పదాల గూఢార్థాలలో పరమేష్టి దాగిలేడు. ప్రకృతిమేధస్సులో ప్రత్యక్షంగా వీక్షించండి.
మనకు ఎంతో అవసరమైన వర్షాన్ని, భగవంతుడి అంతులేని ప్రేమ ప్రసాదంగా భావించి హర్షాతిరేకంతో ఆలింగనం చేసు కోవటం భక్తియోగం. వర్షాన్ని కురి పించడంలో పరమాత్మ ప్రదర్శించిన ప్రతి భను, వైజ్ఞానిక మేధస్సును పరిశీలించి, అవ గాహన చేసుకోవటం జ్ఞానయోగం. అమృతతుల్యమైన వర్షధారల్ని కర్షకుడు భగవంతుడి కానుకగా భావించి పంటల్ని పండించటానికి, దాహాన్ని తీర్చటానికి వాడుకుంటే, అది కర్మయోగం. ఈవిధంగా గీతాజ్ఞానం నిత్యజీవితంలో అనుభవైక వేద్యం కావాలి.

Review సామాన్యం – అసామాన్యం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top