స్వరూపం -స్వభావం

మండటం పెట్రోలు సహజగుణం. ఆర్పడం నీటి సహజ లక్షణం. అదీ మారదు, ఇదీ మారదు. కొన్ని వస్తువుల మారని తత్వం, మరికొన్ని వస్తువుల మారే స్వభావం, ఈ రెండూ కూడా చిత్రంగా లోకంలో కలసిమెలసి ఉన్నాయి. కనుక ఒక వ్యక్తి సహజ గుణాలను మార్చాలని ప్రయత్నించడం వ్యర్థం. ప్రపంచాన్ని మార్చలేక పోతున్నామని కొంతమంది విచారిస్తుంటారు. లోకాన్ని మార్చటం అసాధ్యం! తీరని కల!
ఒక్కొక్కరికి ఒక్కొక్క సహజ లక్షణాన్ని కావాలనే ప్రకృతి ఇస్తుంది. ఆ లక్షణాలను మార్చడం కుదరదు. ఈ మార్పులేని స్వభావం సృష్టికి ఎంతో అవసరం. బాహ్యంగా మారినట్లు కనబడే అంశాల్లో అంతర్లీనంగా మార్పుండదు. ఒక చొక్కా మార్చి, వేరొక చొక్కా వేసుకున్నంత మాత్రాన నువ్వు మారలేదు. లేగదూడకు ప్రస్తుతానికి కొమ్ములు లేవు. అంటే ఇంకా ఎదగలేదని అర్థం. అంతేకానీ అసలు కొమ్ములే ఉండవని కాదు.
శీతాకాలంలో విపరీతమైన చలి ఉంటుంది. అప్పుడు స్వెట్టరు ధరిస్తాం. చలికాలాన్ని మార్చలేం. కొంచెమైనా చలిని తగ్గించలేం. కానీ చలి బారిన పడకుండా కాపాడుకోగలం. దారి మొత్తం రాళ్లతో, ముళ్లతో ఉన్నప్పుడు చెప్పులు వేసుకుంటే సరిపోతుంది కదా !
మనకు నచ్చిన రీతిలో మనం ఉండవచ్చు. దేన్నైనా మార్చలేనపుడు, దానికి అనుగుణంగా మనం మారాలి. ప్రతి వ్యక్తిలోనూ, పరిస్థితులను, పరిసరాలను అనుసరించి, మారే లక్షణాలు కొన్ని, ఎట్టిపరిస్థితుల్లోనూ మారని సహజ లక్షణాలు కొన్ని ఉంటాయి. మానవసంబంధాల్లో మారని లక్షణాలు మనకు ఎదురైనపుడు వాటికి అనుగుణంగా సర్దుకుపోవాలి. అంతేగానీ, వాటితో ‘సై’ అంటూ పోటీపడరాదు. ఒక వ్యక్తిలో మనకు నచ్చని, ఇబ్బంది, బాధ కలిగించే లక్షణాలు
ఉండవచ్చు. ఆ వ్యక్తిలో మనం వాటిని చూడగానే అవి మనం మార్చగలిగిన లక్షణాలూ, లేక మార్చలేని లక్షణాలా అన్నది గుర్తించాలి. ఒకవేళ మార్పుకు లోనయ్యే లక్షణాలైతే మార్చ ప్రయత్నించవచ్చు. అదే మార్పుకు లొంగని లక్షణాలైతే, వాటి స్వభావాన్ని కాకుండా, వాటి స్వరూపాన్ని మార్చి మనకు అనుగుణంగా మార్చుకోవాలి. ఒక రాయిని శిల్పి శిల్పంగా మారుస్తాడు. ఇక్కడ రాయి యొక్క స్వరూపం మారింది. మనకు ఉపయోగకరంగా మారింది. దాని స్వభావంలో అంత గట్టిగా ఉండే లక్షణంలో మార్పు లేదు. అలాంటి లక్షణాలు మనకు ఎదురైనపుడు మనమే సర్దుకుపోవాలి.
ఒక రాయిని చదును చేస్తే, దాని గరుకుదనం పోయి నున్నగా మారుతుంది. కానీ దాని సహజగుణమైన గట్టిదనంలో తేడా ఉండదు. మెత్తబడదు. చదును చేశాక, పిండిమరలో ఈ రాయిని వాడుకుంటారు. అంతక్రితం పనికి రానిది ఈ మేరకు ఉపయోగపడుతుంది. గట్టిదనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోదు.
రోడ్డు వేసేటప్పుడు కంకరరాళ్లు పరుస్తారు. ఆ స్థితిలో నడవలేం. వాహనాలు నడపలేం. ఆ తర్వాత బుల్‍డోజర్‍తో అణిగేట్టు చేస్తారు. అప్పుడు రోడ్డు వాడకానికి పనికొస్తుంది. కంకరలోని సహజగుణం గట్టిదనం. దాని శక్తి చెక్కు చెదరదు. పైగా రోడ్డును గట్టి పరుస్తుంది కూడా.
ఈ విధంగా ఒక వ్యక్తిలోని స్వరూపాన్ని మార్చుకుని మనకు ఉపయోగపడే మనిషిగా మార్చుకోవాలి. అంతేకాని మనం మార్చలేని లక్షణాల జోలికి వెళ్ళకూడదు. చాలామంది అనవసరంగా అంతులేని దుఃఖానికి లోనుకావటానికి కారణం ఇలాంటి ప్రయత్నం చేయటమే. ఎంత ప్రయత్నించినా ఒక వ్యక్తి స్వభావాన్ని మార్చలేం. రాయి గట్టి దనాన్ని మార్చలేం. ఒక విత్తనం మొక్కగా, పిదప వృక్షంగా మారినపుడు ఎంతో మార్పు వచ్చినట్లు కనపడుతుంది. అదంతా కేవలం స్వరూపంలో మార్పు మాత్రమే, స్వభావంలో కాదు. ఆకు ఆకారం మారదు, పుష్పాల రంగు మారదు, పండు రుచి మారదు. ఇవన్నీ స్వభావానికి సంబంధించినవి. కాబట్టి, మన చుట్టూరా
ఉండేవాళ్లతో సత్సంబంధాలు ఉండాలనుకుంటే ఆ వ్యక్తుల్లోని స్వరూపానికి సంబంధించిన మారే లక్షణాలను, స్వభావానికి సంబంధించిన మారని లక్షణాలను గుమనించి మసలు కోవాలి. మీరు నడిచే దారిలో తలుపు ఉంటే, దాని గుండా బయటకి వెడతారు. తెర ఉంటే, పక్కకు నెట్టుకుని వెడతారు. ఒకవేళ గోడ ఉంటే, మీరే తప్పుకుని వెడతారు. సరిగ్గా ఇలాగే మనుష్యులతోనూ ప్రవర్తించాలి. మనం మార్చలేని లక్షణాల వల్ల కలిగే ఇబ్బందుల్ని సాధ్యమైనంతవరకు మనం సర్దుకుపోవటం ద్వారా పరిష్కరించుకుంటాం. పరిష్కారం దొరకని వాటిని ఆనందంగా పరమాత్మకు వదలి వేయాలి.
జీవితంలో ఎదురయ్యే సమస్యలు మనం ‘చేయలేని’ పనుల వల్ల ఉత్పన్నం కావు. మనం చేయగలిగి కూడా ‘చేయని’ పనుల వల్ల మాత్రమే ఎదురవుతాయి. కార్యాలను నిర్వహించడం చేతగాక చిక్కులొస్తున్నాయని భావిస్తాం. నిర్వహించగలిగినా తెలిసో తెలియకో ఆ పనులను తలపెట్టకపోవడమే అసలు సమస్య. నీ శక్తి మేరకు చెయ్యి మిగిలినది ఆ మహాశక్తికి వదిలెయ్యి. గాలి బుడగలా తేలికగా సాగిపో, తేలిపో. నీ తెలివితేటలు, ప్రకృతి మేధాసంపత్తి, చెట్టపట్టాలు వేసుకొని చెలిమి చెయ్యాలి. నీ ప్రతిభ చాలదని తేలినపుడు, దైవసామర్థ్యం చొరవ తీసుకుంటుంది.

Review స్వరూపం -స్వభావం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top