భగవంతునికి సంకల్పం చెప్పడం అంటే?

పూజకు ముందు భగవంతుడికి సంకల్పం చెప్పుకుంటారు కదా? సంకల్పం కింద నెరవేర్చాల్సిన విధులేమిటి? వివరిస్తారా?

భగవంతుడికి మనం చెప్పుకునే సంకల్పంలో ప్రధానమైనవి నాలుగు క్రియలు ఉన్నాయి. అవి..

1. కాల నిర్ణయం: దేశకాలంలోని కదలికలనే ప్రపంచమని శాస్త్రజ్ఞులు అంటారు. కానీ, కాలగతి, విశ్వం యొక్క వ్యాపకత్వం రెండూ కూడా మనిషి మేధస్సుకు అందనివి. ఈ అనంతమైన బ్రహ్మాండము, అంతులేని కాల ప్రవాహం.. ఈ రెండూ భగవంతుని విభూతులే. ఈ అనంత విశ్వంలో, కాలగతిలో మనిషి ఉనికి, జీవితం రెండూ నామమాత్రమే. ఇవి బుద్బుధప్రాయాలే అనే విషయం మరిచిపోకుండా గుర్తుంచుకునేందుకు రోజూ దేవుడికి చేసే పూజకు ముందు దేశ, కాల ప్రస్తావన చేయడం జరుగుతుంది. పూజ చేసే రోజు, ఫ•లానా వారం, పక్షం, తిథి, నక్షత్రం, మాసం, రుతువు, ఆయనం, సంవత్సరం, యుగం, పాదము, కల్పము, బ్రహ్మము యొక్క జీవితకాలంలోని ఎన్నో అంశమో.. ఈ విషయాలన్నీ కాల నిర్ణయంలో చెప్పుకుంటారు.

2. పూజా ప్రదేశ ప్రస్తావన: మనం నివసించే ప్రదేశం బ్రహ్మాండంలో ఎక్కడుందో కూడా తలుచుకోవాలి. అందుకే ఆ ప్రదేశం ఏ ద్వీపం, ఏ ఖండానికి చెందినది, మేరు పర్వతానికి ఏ దిశలో ఉన్నదీ, శ్రీశైలానికి ఏ దిశలో ఉన్నదీ, ఏ రెండు నదుల మధ్య ఉన్నదీ, ఏ పుణ్యక్షేత్రం లేదా దేవాలయం సమీపంలో ఉన్నదీ సంకల్పంలో భాగంగా రెండో అంశం కింద చెప్పుకోవాలి.

3. భగవంతుని వర్ణన: మనం పూజించే మూర్తి కేవలం నామరూపాలకు, దేశకాలాలకు పరిమితమైన ఒక విగ్రహం కాదని, అనంతతత్త్వానికి ఆ విగ్రహం ప్రతీకమని తలుచుకోవాలి. అనేక కోటి బ్రహ్మాండ నాయకుడని, సృష్టి, స్థితి, లయములకు మూలమైన శక్తి అని, దుష్టశిక్షణ, శిష్టరక్షణకు వివిధ అవతారాలు దాల్చిన దేవతా సార్వభౌముడని, ఆయన పరతత్త్వాన్ని గురించే నామాలను ఇందులో భాగంగా జపించాలి.

4. సంకల్ప నివేదన: ఇది భగవంతునికి నివేదించే సంకల్పం చెప్పుకోవడం అనే అంశంలో చివరిది. ఏ ప్రయోజనం కోరి దేవుని పూజించదలిచామో, ఆ కోరికను దేవుడికి చెప్పుకోవడం ఇందులోని ఉద్దేశం.
మన పూజల్లో సామాజిక స్ఫూర్తి, లోక కల్యాణం కూడా ఒక భాగమై ఉంటాయి. మనం ఈ అనంతమైన విశ్వంలో ఎంత పరిమాణం గలవారిమో గుర్తించడంతో పాటు తనతో పాటు అందరి క్షేమాన్ని కోరుకోవడమే సంకల్పంలో ఇమిడి ఉన్న పరమోద్దేశం.

వీరుడిని కన్నతల్లి సుభద
సుభద్ర.. మహాభారతంలోనూ, భాగవతంలోనూ ప్రముఖ పాత్ర. ఈమె రోహిణి – వసుదేవుల కుమార్తె. శ్రీకృష్ణుడు, బలరాముడి సోదరి. అర్జునుడికి భార్య. అభిమన్యుడికి తల్లి.
అర్జునుడు అరణ్యవాసానికి వెళ్లగా, సుభద్ర కొడుకు అభిమన్యుడిని తీసుకుని పుట్టినిల్లయిన ద్వారక చేరుకుంది. అమ్మానాన్నా అన్నీ తానే అయి అతడిని పెంచి పెద్ద చేసింది.
పూర్తిగా అమ్మమ్మ గారి ఇంటనే పెరిగిన అభిమన్యుడిని యుద్ధవిద్య ప్రావీణ్యంలో తండ్రిని మించిన తనయుడిని చేసింది సుభద్ర.
అరణ్యవాసం ముగిసే సమయానికి విరాట నగరం చేరుకుని భర్త అర్జునుడిని చేరుకున్న సుభద్ర.. చెట్టంత కొడుకు అభిమన్యుడిని తండ్రి ఎదుట నిలబెట్టింది.
చివరకు అభిమన్యుడు తండ్రి అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో ద్రోణుడుచే వ్యూహరచన జరిగిన పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు. అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించినా.. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు తదితరులు అన్యాయంగా చుట్టిముట్టి అతడిని సంహరిస్తారు. అలా యుద్ధభూమిలో వీరమరణం పొందడంతో అభిమన్యుడి కథ మహా భారతంలో దాదాపు ముగుస్తుంది.
అభిమన్యుడి మరణంతో అర్జునుడు తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. సుభద్ర పుత్ర శోకంతో విలపిస్తుంది. తన కొడుకు మరణాన్ని నివారించలేదని, అన్నగారైన కృష్ణుడిని నిలదీస్తుంది.
సుభద్ర నిండు గర్భంతో ఉన్నపుడు ఒకసారి అర్జునుడు ఆమెకు పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో చెబుతాడు. గర్భంలో ఉన్న అభిమన్యుడు అది విని పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసుకుంటాడు. అయితే, పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడాలో అర్జునుడు చెప్పకుండా కృష్ణుడు అడ్డుపడతాడని, అందువల్లే అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కి బయటపడలేక వీరమరణం పొందాడని మహాభారత కథ. ఒక వీరుడిని తీర్చిదిద్దిన తల్లి.. సుభద్ర.

Review భగవంతునికి సంకల్పం చెప్పడం అంటే?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top