ధ్యానం

పరమేశ్వరుని ప్రేమలో మనసును చేయి లీనం,
నీ హృదయం చేస్తుంది నృత్యం, గానం. అదే అసలైన ధ్యాన
మనల్ని ప్రకృతి ప్రేమించినంతగా, ప్రకృతిని మనం ప్రేమించగలమా ? ప్రకృతి ఇచ్చినదంతా పొంది మైమరచి ఉండగలమా ? ఆ స్థితికి మనం చేరగలిగితే, ప్రకృతిపట్ల ఆత్మీయతతో, కృత్ఞతతో హృదయం బరువెక్కుతుంది. మది నాట్యం చెయ్యడం ప్రారంభిస్తుంది. మన హృదయం చేసే ఆనందతాండవమే ‘ధ్యానం.’
బయట కనపడే భగవంతుని అనుక్షణం అనుభవంలోకి తెచ్చుకోవాలి. తీరికవేళలో, కనపడని దేవుని ప్రావీణ్యాన్ని, ప్రేమను, ప్రతిభను తలచుకొని పరవశించాలి. ఆయన ఆప్యాయత అవగతమైన మరుక్షణమే దేవుని పాదాల వద్ద వాలిపోయి మోకరిల్లుతాం. సంతృప్తి నిండిన హృదయం నర్తిస్తుంది. ఇదే ధ్యానం.
ఒకే విషయంపై మనసు కేంద్రీకరించడం వలన అక్కర్లేని ఇతర విషయాలపై దృష్టి మరలకుండా ఉంటుంది. కొద్దిసేపు మనశ్శాంతి దొరుకుతుంది. అటు-ఇటు తిరిగే తుంటరి మనసు తాత్కాలికంగా కట్టుబడుతుంది. కానీ నిజమైన ధ్యానం వల్ల కలిగే ప్రశాంతస్థితి చాలా కాలం నిలిచి ఉంటుంది.
వేల వర్ణాల పూలతో నిండిన తోటను చూడండి. ఆ పరిమళాలు ఎదలో నింపండి. అర్ధ నిమీలిత నేత్రాలతో సృష్టికర్త భావుకతను మౌనంగా కీర్తించండి. ఆ ‘చైతన్యం’తో పూర్తిగా తాదాత్మ్యం చెందండి.
అసలీ శక్తి ప్రకృతికి ఎలా వచ్చింది ? ఎక్కడి నుండి వచ్చింది ? ఈ విధమైన నిబిడాశ్చర్యంతో నిశ్చల మానసికస్థితి ప్రాప్తిస్తుంది. హృదయం ఒడుదుడుకులు లేని సరోవరమవుతుంది. బహిర్ముఖం చేద్దామని ప్రయత్నించినా మనసు చెక్కు చెదరదు. ఇటువంటి ‘సహజసుఖస్థితి’ కావాలి. ఈ స్థితి అలవాటు కావాలి.
మనసును సహజంగా నెమ్మదించనీయండి. బలవంత పెట్టకండి. అసంకల్పితంగా, అలవోకగా ఒక అంశం మీద కేంద్రీకరించనీయండి. యాంత్రి కంగా ‘పాదయుగళం’ పైన, లేదా ‘నానికాగ్రం’ మీద బలవంతంగా దృష్టి పెట్టకండి. ఇష్టదేవతల యొక్క నామస్మరణ చేసినా, వారి చరణ కమలాల మీద దృష్టి నిలిపినా, వెనువెంటనే విశ్వాంతరాళమంతటా నిండిన ఆ మహాశక్తి యొక్క అనంతసామర్థ్యం మనోనేత్రానికి దర్శనం కావాలి. ఆ అద్భుతప్రజ్ఞ మన బుద్ధికి స్ఫురించాలి. ఆ అపారవాత్సల్యం, ఆ ప్రేమ పరిమళంతో మన మది మత్తులో మునిగి తేలాలి. కృతజ్ఞతతో హృదయం నుండి పొంగి పోవాలి. అదే నిజమైన ధ్యానం. అప్పుడే అవధిలేని ఆనందం లభిస్తుంది.
తీవ్రమైన ఆధ్యాత్మికసాధనలు చేసిన కొందరు, తమకు మానవాతీతశక్తులు, సిద్ధులు లభించాయని చెబుతుంటారు. అవి నిజమేనా అని సందేహం వస్తుంది, అవునా? అతీతశక్తులు మనకు లేనట్లయితే వాటి అవసరం మనకు లేదని అర్థం. మనకు అక్కరలేని సిద్ధులు మనకు సంప్రాప్తించవు. ఇది ప్రకృతి ప్రథమసూత్రం. నాకు ఆకాశంలో ఎగిరే శక్తి లేదు. ఎందుకంటే, నాకు ఎగరవలసిన పని లేదు. ఒకవేళ ఎగిరానే అనుకోండి, ఆకాశంలో స్నేహితులున్నారా, హోటళ్లున్నాయా, సినిమా థియేటర్లున్నాయా? తిరిగి, తిరిగి విసుగుపుట్టి మళ్ళీ కిందనే వస్తాను. ఎంతకాలం ఏకాకినై ఎగరను? అలాగే, నీళ్ళలో నడిచే శక్తి నాకుంటే సముద్రంలో వందల మైళ్ళు తిరుగుతాను. కానీ ఏం లాభం? చేపలు, తిమింగలాలు… అంతేకదా ! పార్కు లున్నాయా? షాపింగు మాల్స్ ఉన్నాయా? మంచి మిత్రులున్నారా ? అలసి కాళ్ళరగిపోయి మళ్ళీ నేల మీదకు రావలసినదే కాదా ! సాధన చేసి ఎటువంటి సిద్ధులూ పొందవలసిన పనిలేదు. అతీతశక్తుల అవసరమే ఉంటే, అడగకుండానే ఎప్పుడో ప్రకృతి మనకు ఇచ్చి ఉండేది. శ్వాసించే శక్తి మనకు ‘సాధన’తో రాలేదు. ఏ మంత్ర, తంత్ర సాధనతో ఆహారాన్ని జీర్ణం చేసుకొనే శక్తిని పొందాం? ఏ సాధనా చేయకపోవడమే, నీ అవసరాలన్నీ తీరడానికి నువ్వు చేసే ప్రత్యేక సాధన. మనకు అవసరమైన శక్తులన్నీ అడగకుండానే తన శక్తినంతా ధారపోసి మనకు సృష్టికర్త ప్రసాదించాడు.
ఒక కూలీ బియ్యపు బస్తాను అవలీలగా మోస్తాడు. అది నాకు అసాధ్యం ఒక వ్యక్తి ఇరవై నాలుగు గంటలూ ఎండలో పనిచేయగలడు. ఒక్కగంటసేపే ఎండలో ఉంటే నాకు జ్వరం వస్తుంది. అతని జీవనోపాధి కోసం ఆ శక్తి ప్రకృతి ఇచ్చింది. ఎవరి అవసరానికి తగన శక్తి యుక్తులు వారికి లభ్యమవుతాయి.
ప్రకృతి ప్రాథమికసూత్రాలతో అనుసంధింపబడని ఏ సిద్ధాంతమైనా, చివరికి వేదాంతమైనా సరే నిలబడలేదు. సృష్టితో మనకున్న సున్నితమైన అంతర్లీనమైన బంధం తెగినట్లయితే అయోమయమవుతుంది. అశాంతి చెలరేగుతుంది. మౌలిక జీవన సూత్రాలను అన్వేషించండి. కనుగొనండి. నిత్య సంతోషాన్ని సొంతం చేసుకోండి.
మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి. దైవం పట్ల ప్రేమతో, కృతజ్ఞతతో సంతృప్తిగా హృదయమయూరం చేసే నృత్యమే ధ్యానం.

Review ధ్యానం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top