వెన్నెల వెలుగుల రక్షాబంధన్

శ్రావణ శుద్ధ పూర్ణిమ (ఆగస్టు 26, ఆదివారం) చాలా విశేష పర్వాల కలయిక. ఈనాడు జంధ్యాల పున్నమి, రాఖీ పున్నమి, నార్లీ పున్నమి, హయగ్రీవ జయంతి అనే పర్వాలు నిర్వహిస్తారు.
శ్రావణ పూర్ణిమే నార్లీ పూర్ణిమ. ఈ పర్వానికి పౌరాణిక సంబంధం ఉన్నట్టు కనిపించదు. ఈనాడు గుజరాతీ బ్రాహ్మలు తమ పోషకుల్ని దర్శించి వారి ముంజేతికి రాఖీ కడతారు. రాఖీ అంటే తోరము. అందుచేత ఈ పర్వానికి రాఖీ పూర్ణిమ అనే పేరు కూడా వచ్చింది. తోరం పట్టు దారంతో కానీ, నూలు దారంతో కానీ పోస్తారు. ముచ్చి బంగారం కొద్దిగా ఆ తోరానికి ముడి వేస్తారు. కింది అర్థం వచ్చే మంత్రం చదువుతూ ఆశీర్వదిస్తారు.
‘‘ఓ రక్షా! దానవ ప్రభువైన బలిని బంధించిన దుష్కార్యాలను అన్నిటినీ నీ యందు నేను బంధిస్తున్నాను. నీవు కదలకుండా ఉందువు గాక!’’.
ఇలా కట్టడాన్నే రక్షాబంధనమని అంటారు.
అలాగే, బ్రాహ్మణులు ఈనాడు శ్రావణి పర్వాన్ని నిర్వహిస్తారు. గతేడాది చేసిన పాపాల పరిహారార్థం దీనిని చేస్తారు. రుగ్వేద, యజుర్వేద శాఖల రెండింటికీ ఈ పర్వం ముఖ్యమైనది. ఈ రెండు శాఖల బ్రాహ్మణులు ఒకరి ఇం• ఒకరు భోజనాలు చేసినా పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోరు. సప్త మహర్షులను పూజించడం, హోమం చేయడం, పురోహితుడికి దక్షిణ ఇవ్వడం వంటివి ఈనాటి విధాయ కృత్యాలు.
ముంబైలో ఈనాడు ప్రజలు కొత్త బట్టలు కట్టుకుని సాయంకాలం చౌపతి సముద్రతీరానికి వెళ్లి వరుణదేవుని తృప్తి కోసం కొబ్బరికాయలు సమర్పిస్తారు. కాబట్టే దీనికి నారికేళ పూర్ణిమ అనీ, నార్లీ పూర్ణిమ అనీ పేరు వచ్చింది.
శ్రావణ పూర్ణిమను మాళవ దేశంలో రాఖీ పున్నమి అంటారు. సోదర సోదరీ ప్రేమను వ్యక్తపరిచే పర్వాల్లో ఇది చాలా ముఖ్యమైనది. రాఖీ అనేది ఒక ఆభరణం. మంచి రంగుతో ఒప్పే దారంతోనూ, కాగితంలోనూ దీనిని తయారు చేస్తారు. దానిని ఒక తోరానికి కట్టి ఆ తోరాన్ని సోదరి.. సోదరుని ముంజేతికి ఈ పండుగ నాటి ఉదయాన్ని కడుతుంది. మధ్యాహ్నం సోదరుడు తన ఇంట్లో కానీ, తన సోదరి ఇంట్లో కానీ
తన సోదరి వండి వడ్డించిన అన్నాన్ని తింటాడు. భోజనానంతరం సోదరి సోదరుడికి హారతి ఇస్తుంది. దీపపుకుందిలో రెండు జతల వత్తులు వేసి నూనె పోసి వెలిగిస్తుంది. ఆ కుందిని ఒక పళ్లెంలో పెడుతుంది. ఆ పళ్లెంలోనే కొద్దిగా అక్షింతలు, రెండు పోకలు ఉంచుతుంది. సోదరుడు తూర్పుముఖంగా పీట మీద కూర్చుంటాడు. అప్పుడు సోదరి అతనికి కుంకుమతో బొట్టు పెడుతుంది. అతని మీద అక్షింతలు చల్లుతుంది. పిమ్మట ఆమె ఆ పళ్లాన్ని అతని తల చుట్టూ తిప్పుతుంది. తరువాత ఆ పళ్లెంలోని పోకను ఒక దానిని పుచ్చుకుని అతని తల చుట్టూ కుడి నుంచి ఎడమకు తిప్పి తిరిగి పళ్లెంలో వేస్తుంది. తరువాత రెండో పోకను కూడా పుచ్చుకుని అతని తల చుట్టూ ఎడమ నుంచి కుడికి తిప్పి దానిని కూడా పళ్లెంలో వేస్తుంది. అతని కుడి ముంజేతికి అప్పుడు ఆమె రాఖీ కట్టడంతో తంతు ముగుస్తుంది. అనంతరం సోదరుడు సోదరికి పట్టు చీర, రవికెల గుడ్డ, బంగారంతో చేసిన నగ (వెండితో చేసిన నగ నిషిద్ధము) కానీ లేకపోతే కొంత రొక్కము కానీ ఇస్తాడు.
ఈ డబ్బు ఆ సోదరి సొంతం. ఆమె మాత్రమే వాడుకోవాలి. ఒకవేళ ఆమె వివాహిత అయి ఉంటే, ఆ ధనాన్ని ఆమె భర్త ముట్టుకోకూడదు. సొంతాని• వాడుకోకూడదు.
ఏ కారణం చేత కానీ సోదరుడిని ఇంటికి భోజనానికి పిలవడానికి వీలు కాకపోతే సోదరి కేవలం భక్ష్యాలు ఇచ్చి సోదరుడిని తృప్తి పరచ వచ్చు. అప్పుడు కూడా మిగతా తతంగమంతా పై మాదిరిగానే జరుగుతుంది.
నూతనంగా వివాహమైన సోదరి తన సోదరుడికి ఇచ్చే మొదటి రక్ష బంగారపు పువ్వు గల వెండి కంకణం అయి ఉండటం పరిపాటి. బంగారపు పువ్వు లేకపోయినా వెండి కంకణం ఇవ్వడం ముఖ్యం.
ఈ పండుగ ఎలా పుట్టిందనే దాని గురించి ఎటువంటి కథలు ఉన్నట్టు కనిపించదు.
ఈ రాఖీ ప్రదానాన్ని బట్టే ఒక స్త్రీ ఒక పురుషుడికి అతడు తనకు సోదరుడు కాకపోయినా రాఖీ పంపి అతని రక్షణ కోరే వింత ఆచారం ప్రస్తుతం ఏర్పడింది. ఒక స్త్రీ పంపిన రక్ష ఒక పురుషుడు అందుకోవడంతోనే అతను ఆమెకు సోదరుని వంతు అయి ఆమె రక్షణకు బాధ్యత వహించవలసిన వాడవుతాడు.
తమ రాజ్యం మీదకు మహ్మదీయ ప్రభువు ఒకడు దండెత్తి వచ్చినప్పుడు ఒక రాజపుత్ర రాణి ఒక రాజపుత్ర వీరునికి ఇటువంటి రాఖీ పంపిందనీ, అందు మీదట ఆ రసపుత్ర వీరుడు తన సేనలతో వెళ్లి ఆ మహ్మదీయ ప్రభువును ఎదిరించాడనే కథ ఒకటి ఉంది.
అనేక ఆచారాల మాదిరిగానే రాఖీ ఆచారం కూడా ఆంతర్యాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఎవరైనా సరే తన పోషకుని వలన ఉపకారం పొందడానికి కూడా ఈ రాఖీ ఉపయోగించే వాడుక ఏర్పడింది.
మాళవ దేశంలో స్త్రీలు ఇప్పటికీ ఈ పండుగ సందర్భంలో తమ సోదరులకు రాఖీ తోరాన్ని కడతారు. శ్రావణ పూర్ణిమ ఇంకా రెండు మూడు రోజులు ఉందనగా బజారు నుంచి ఇళ్లకు వెళ్లిపోయే ప్రతి మగవాడు ఒకటి రెండు రక్షా తోర గ్రంథులు కొనుక్కుని పట్టుకు వెళ్తుండటం చూస్తాం.
ఆంధప్రదేశ్‍లో రాఖీ ఆచారం మరో విధంగా ఉంది. ఈనాడు ‘శ్రావణ తగువు’ అని ఆడవాళ్లకి అత్తవారు ఇస్తారు. శ్రావణ వరలక్ష్మీ పూజ కొత్త నగతో చేయాలని నియమం.
పూర్వ కాలంలో శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మానంతరం వేదవిద్య నేర్చుకోవడం ప్రారంభించే వారు. అలాగే దక్షిణ భారతం, గుజరాత్‍, ఒడిశా, పశ్చిమబెంగాల్‍ ప్రాంతాలలో మాత్రం ఈనాడు ‘శ్రావణి పూజ’ నిర్వహిస్తారు.
దక్షిణ భారతదేశంలో శ్రావణ పూర్ణిమకు పౌవతి పూర్ణిమ అని పేరు. ఈ రోజు విష్ణు, శివుడు, గణపతిలను పూజిస్తారు. దీనినే ముంబైలో నార్లీ పూర్ణిమ అంటారు. ఆనాడు అక్కడ వరుణ దేవుని పూజ కోసం సముద్రుడిని పూజిస్తారు. ఆ రోజుల్లో సముద్రం ప్రశాంతంగా ఉంటుందని వారి నమ్మిక. అందుచేత పూర్వకాలంలో సముద్రాంతర వర్తకానికి ఈ కాలాన్ని ఉపయోగించే వారు. తిరిగి రావడానికి కూడా ఇదే సమయాన్ని ఎంచుకునే వారు. ఆనాడు యజ్ఞోపవీతాలు, నారికేళాలు సముద్రంలో పడవేస్తారు. అందుచేత దీనికి నారికేళ పూర్ణిమ అనే పేరు వచ్చింది.
సర్వరోగ ఉపశమనం కోసం సర్వాశుభ వినాశనం కోసం ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఉపాయం అడిగాడు. శ్రీకృష్ణుడు అప్పుడు రక్షాబంధన విధి ఉపదేశించాడు. దేవసుర యుద్ధంలో ఇంద్రుడికి ఇంద్రాణి రక్షాబంధనం ఇచ్చి జయం సంపాదించిందని శ్రీకృష్ణుడు చెప్పాడు. రక్షాబంధనం విధి శ్రావణ పౌర్ణమి నాడు జరుగుతుంది. శాస్త్రంలో రక్షాబంధనం భార్య భర్తకు కట్టాలని ఉన్నా ఆచరణలో చెల్లెలో, చెల్లెలు కూతురో కడుతుంది అని వ్రతోత్సవ చంద్రికలో ఉంది.
శ్రావణ పౌర్ణమి నాడు వేద పఠనం మిక్కిలి పవిత్ర కార్యంగా భావిస్తారు. పితరులకు నేడు తర్పణం విడుస్తారు.
శ్రావణ శుక్ల పూర్ణిమకు శ్రావణి అని పేరు. శ్రావణిని తెలుగు వారు జంధ్యాల పూర్ణిమ అంటారు. జంధ్యాలు ధరించే జాతుల వారు ఈనాడు కొత్త జంధ్యాలు వేసుకోవడం ఆచారంగా ఉండటం చేత దీనికి జంధ్యాల పున్నమి అనే పేరు వచ్చింది.

హయగ్రీవ జయంతి
శ్రావణ శుద్ధ పూర్ణిమ హయగ్రీవ జయంతి దినం కూడా. హయగ్రీవుడు అంటే గుర్రపు ముఖం కలవాడని అర్థం. ఇతను ఒక రాక్షసుడు. దేవిని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆమె ప్రత్యక్షం కాగానే చావు లేకుండా వరం కోరుకున్నాడు. దేవి కుదరదని చెప్పింది. అయితే, తనకు చావు హయగ్రీవుడు అయిన వాడి వల్లనే వచ్చేలా చేయాలని కోరాడు. దేవి సరేనంది. వర గర్వంతో హయగ్రీవుడు దేవతలను పీడించసాగాడు.
ఇదిలా ఉండగా ఒకనాడు విష్ణుమూర్తి రాక్షసులతో యుద్ధం చేసి అలసిపోయి, ఎక్కుపెట్టిన బాణంపైనే తల పెట్టుకుని నిలుచుండే నిద్రపోయాడు. దేవతలకు ఆయన నిద్రలేపే ధైర్యం లేకపోయింది. దీంతో శివుడు ఒక ఉపాయం చెప్పాడు. ‘ధనస్సు యొక్క నారిని తెంపితే విల్లు కదులుతుంది. ఆ కదలికకు విష్ణుమూర్తి తప్పకుండా నిద్రలేస్తాడు’ అని అన్నాడు. దేవతలకు ఆ ఉపాయం నచ్చింది. అప్పుడు వారు వమ్రి అనే కీటకం చేత ఆ నారిని కొరికించారు. ధనుస్సు ఎక్కుపెట్టి ఉండటంతో వింటి కొన బెట్టు వదిలి విష్ణువు తలను దూసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో విష్ణువు తల ఎగిరిపోయింది. దేవతలంతా బెగ్గడిల్లారు. విష్ణువు తల కోసం లోకమంతా గాలించారు. ఎక్కడా దొరకలేదు.
అప్పుడు బ్రహ్మ.. దేవతల చేత తపస్సు చేయించాడు. దేవి ప్రసన్నమై- ‘హయము తల తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించండి’ అని చెప్పింది.
సరిగ్గా ఇది జరిగిన రోజు శ్రావణ శుద్ధ పూర్ణిమ. దేవతలు దేవి చెప్పినట్టే చేశారు. దీంతో విష్ణువుకు ప్రాణం వచ్చింది. వచ్చిన ప్రాణంతో మెలకువ కూడా వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవుడు అయ్యాడు. ఈ హయగ్రీవుడు ఆ హయగ్రీవునితో యుద్ధం చేసి సంహరించాడు.అప్పుడు దేవతలంతా హయగ్రీవుని రూపంలో ఉన్న విష్ణువును ఇలా స్తుతించారు.
‘స్వామీ! నువ్వు శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు పుట్టువునొందావు. అజేయుడుగా ఉంటూ వచ్చిన హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించావు. కాగా, నీ పుట్టిన దినాన నిన్ను పూజించి నీ జయంతి జరుపుకొంటాం’.
అప్పటి నుంచి హయగ్రీవ జయంతిగా శ్రావణ శుద్ధ పూర్ణిమ వరలుతూ ఉంది.
ఇక, హయగ్రీవ జయంతికి సంబంధించి రెండో కథ కూడా ఉంది. ఈ కథ ప్రకారం.. వేదాలను అపహరించుకుపోయిన మధుకైటభులు అనే రాక్షసులను గుర్రపు ముఖం దాల్చిన విష్ణువు సంహరించాడు.

Review వెన్నెల వెలుగుల రక్షాబంధన్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top