అక్షరానికో లేక

‘ప్రియమైన అక్షరానికి..
చిన్నప్పుడెప్పుడో అమ్మఒడిలో ఆటలాడుకున్నప్పుడో, నాన్న చిటికెన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటున్నప్పుడో సరిగ్గా గుర్తు లేదు కానీ, తొలిచూపు
లోనే భలే నచ్చేశావ్‍. చిక్కటి చీకటిలో వెన్నముద్దలు ఆరేసి నట్టు, నల్లటి పలకపై తెల్లగా మెరిసిపోతూ విచిత్రంగా కనిపిం చావ్‍. అప్పుడే తొలిసారి నీ మాయలో పడిపోయి ఉంటా.
‘అ’ అమ్మ, ‘ఆ’ ఆవు అంటూ మొదలైన నీతో పరిచయం ఇంకా లీలగా నా కళ్ల ముందు మెదులుతూ ఉంది.
‘ఎప్పటికైనా మన కడుపు నింపేవి ఈ అక్షరాలే బుజ్జికన్నా’ అని అమ్మ లాలనగా అంటుంటే, ‘అ, ఆ’లు ఏమైనా వండుకుని తింటామా?’ అనుకునే వాడిని. అప్పటి నా మట్టి బుర్రకు అంతే అర్థమైంది. మరి గుణింతాలూ, నుడికారాలూ, కథలూ, పద్యాలూ, పురాణాలూ, పాఠాలూ అంటూ నన్ను నా జీవితంలోకి పరుగులు పెట్టించావు ఓ స్నేహితునిలా, ఓ ప్రేయసిలా..
కనికి కొన పట్టుకుని ‘అ’ని దిద్దుతున్నప్పుడు అమ్మే గుర్తొచ్చేది. బడికీ, ఇంటికీ ఉన్న దూరాన్ని తగ్గించేసి- అమ్మని నా పక్కనే కూర్చో బెట్టేది. ఇది మాత్రమే కాదు. ఒక్కో అక్షరమైన నువ్వు నా మనసులో ముద్రించుకుపోవడానికి ఒక్కో కారణం ఉంది.
‘శ్రీ’ అచ్చం నటరాజుని ప్రతిరూపంలా తోచేది. ఎన్నిసార్లు దండం పెట్టానో?
‘శ’ అయితే పల్లెదనం నడుమొంపులా చూడగానే గబుక్కున ఆకర్షించేది. ఇంకెన్ని సార్లు సిగ్గుపడ్డానో..?
‘ఠ’లోని ఠీవే వేరు. శివుడి కంఠంలో దాక్కున్న గరళంలా గంభీరంగా కనిపించేది.
‘గ’ అయితే కొన కత్తిరించిన గుత్తొంకాయలా నిగనిగలాడిపోయేది.
‘తి’ తిరునాళ్లలో కొన్న జంతికలా కనిపిస్తే, పండక్కి అమ్మ చేసే జిలేబిలా ‘ఋ’ ఊరించేది. ఇంకోసారి పట్టాలపై దూసుకెళ్లే రైలింజనులా మారిపోయేది. అచ్చులు బెల్లమచ్చులైపోయి, హల్లులు నేతి హల్వాల్లా మారిన తియ్యని జ్ఞాపకాలు కోకొల్లలు. ఇలా ఒక్కో అక్షరంతో ఒక్కో అనుభూతిని మిగిల్చావు. అందుకే నువ్వంటే అంత ప్రేమ.
నిన్ను ఎన్నెన్ని రూపాల్లో దర్శించుకునే భాగ్యం దక్కిందో? శ్రీశ్రీ సన్నిధిలో శ్రామిక రక్షాక్షరివై పొంగిపోయే దానివి. తిలక్‍ దగ్గర వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలా మారి అల్లరి చేసే దానివి. సినారె నట్టింట్లో మాత్రం సంక్రాంతి ముగ్గులా ఎంత సంప్రదాయబద్ధంగా కనిపించావో? చలం కలం ప్రవాహంలో నీకెన్ని కొత్త ఒంపులొచ్చాయో?. పింగళి పలుకుల్లో, వేటూరి వర్ణనల్లో నీ జిలుగులూ, వెలుగులూ చూడతరమా? నిన్ను నింపుకు న్న కవిత్వం సాయంత్రపు చిరుగాలిలా హాయిని పంచితే, కథ సూర్యోదయంలా మేల్కొలిపేది.
‘సున్నా’ని చూస్తే మాత్రం కాస్తో కూస్తో జాలేస్తూ ఉంటుంది. అక్షర మాలలో ఒంటరిగా నిలబడే అదృష్టం లేక, బిక్కు బిక్కుమంటూ ఇంకో అక్షరం పంచకి చేరుతుంది కానీ, అది లేకపోతే పదాలకు సంపూర్ణ సౌందర్యం ఎక్కడుంది? పదాల అర్థాలు మార్చేసే నేర్పరి, గడసరివి నువ్వు.
నీ సుగంధం, నీ సోయగం అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉంది. మేం మాత్రం చాలా మారిపోయాం. అమ్మలాంటి నిన్ను అడుగడుగునా నిర్లక్ష్యం చేశాం. పరాయి పదాల మధ్య ఇరికించి కలుషితం చేశాం. నీ మాధుర్యాన్ని గత వైభవంగా విడిచిపెట్టి మరో మోజులో పాకులాడాం. ఇంతకాలానికి మెల్లగా కళ్లు తెరుస్తున్నాం. బడిలో నిన్ను దిద్దుకొన్నట్టే ఇప్పుడు మమ్మల్నీ, మా తప్పుల్నీ సరిదిద్దుకుని మళ్లీ తెలుగుదనాల గుమ్మంలోకి అడుగు పెడుతున్నాం. ఎప్పటిలా మమ్మల్ని నీ దరి చేర్చుకుంటావనీ, ప్రేమగా లాలిస్తావనీ ఆశిస్తూ…’.

Review అక్షరానికో లేక.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top