జనహితమే నా సంకల్పం..

రాజకీయ నాయకుల్లో హుందాతనం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒకవేళ కనిపించినా.. ఏదో సమయంలో ఏదో విషయంలో అది మసకబారుతుంది. మబ్బు చాటు చంద్రుడిలా.. కొన్నాళ్లు.. మబ్బులు వీడిన చంద్రుడిలా.. ఇంకొన్నాళ్లు.. రాజకీయ జీవితం అంటేనే అంత! కానీ, ఆయన శైలే వేరు. ఆయన ఎప్పుడూ ఒకే తీరు. ఆయన రాజకీయ జీవితం పిండారబోసిన వెన్నెల చందం. ఒకటీ రెండూ కాదు ముప్ఫై ఏళ్లుగా ఏనాడూ ఆయన రాజకీయ జీవితం మసకబారింది లేదు. ఏనాడూ మరకలు పడిందీ లేదు. ఆయన ఒంటిపై ఉండే తెల్లని ఖద్దరు చొక్కా చందం.. ఆయన మనసు కూడా స్వచ్ఛం. మొన్నటి వరకు ఉమ్మడి ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో, ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో నిఖార్సయిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమై నిలుస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. రాజకీయాలకు గుమ్మంలాంటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ప్రస్థానం ప్రారంభించిన ఆయన రాజకీయ నాయకుల్లోనే విలక్షణమైన వ్యక్తి. ప్రజా నాయకుడిగా, ప్రజల మనిషిగా పేరొందిన తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్‍ జర్నలిస్టు డాక్టర్‍ కుమార్‍ అన్నవరపుతో పంచుకొన్న తన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు ఆయన మాటల్లోనే.
ఎన్టీఆర్‍ సమక్షంలో రాజకీయాల్లోకి..
1982 సెప్టెంబరులో ఖమ్మం జిల్లా చర్ల మండలం ఏటుపాక గ్రామంలో జరిగిన ఓ కార్య క్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‍ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. రాజకీయాల్లో అది నా తొలి అడుగు. మాది సత్తుపల్లి నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామం. 1983లో తెలుగుదేశం పార్టీ తరపున సత్తుపల్లి నుంచి పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే ఓటమి చవిచూశాను. మళ్లీ 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం దక్కింది. గెలవడంతోనే ఎన్టీఆర్‍ మంత్రివర్గంలో చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా చేరాను. ఆ తరువాత 1994, 1999 ఎన్నికల్లో గెలిచినపుడు చంద్రబాబు క్యాబినెట్‍లో కీలకమైన ఎక్సైజ్‍, భారీ నీటిపారుదల, ఆర్‍ అండ్‍ బీ శాఖలు నిర్వ హించాను. 2004 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. 2009 ఎన్నికల్లో గెలిచి.. మళ్లీ 2014 ఎన్నికల్లో ఓడిపోయాను. అనంతరం పరిణామాల నేప థ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాను. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాను.
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన..
ఎన్టీఆర్‍ తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందే గ్రామంలో జరిగే స్థానిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకున్న అనుభవం ఉంది. ప్రజల కోసం ఏదో చేయాలనే తపన, కాంగ్రెస్‍ పార్టీపై ఉన్న వ్యతిరేకతతో అనంతరం టీడీపీలో చేరాను. 32 ఏళ్లకే మంత్రిని కాగలిగాను. ప్రజల కోసం నిక్కచ్చిగా, నిజాయతీగా పని చేయాలని తపించే వాడిని. అవే లక్ష్యాలతో ఎన్టీఆర్‍ రాజకీయాల్లోకి రావడంతో ఆయన నాయకత్వంలో నా లక్ష్యాల సాధన సులభమైంది. ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమం, ప్రవేశపెట్టే ప్రతి పథకం అట్టడుగు స్థాయి మనిషికి కూడా చేరా లనేది నా ఉద్దేశం. ఆ మేరకు నేను ప్రజలతో మమేకమై పనిచేసే వాడిని. మధ్యలో ఓటమి ఎదురైనా నిరంతరం ప్రజల్లో ఉండటం, ప్రజలు నా వెంట ఉండటం వంటి కారణాలతో ముప్పై ఏళ్లుగా రాజకీయ ప్రస్థానం సాగించగలిగాను.
నా దృష్టిలో భారత్‍..
ప్రధానంగా మనది ప్రజాస్వామ్య దేశం కావడం వల్ల అనుకున్న రీతిలో అభివృద్ధిని సాధించగల పరిస్థితి లేదు. అధిక జనాభా, శాంతి భద్రతలు, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, వివిధ మతాలు, వర్గాల మధ్య సమన్వయం సాధించి అభివృద్ధిని సాధించాల్సి ఉంది. రాజకీయ, న్యాయ వ్యవస్థలో కొంచెం మార్పు వస్తే ఈ అభివృద్ధి ఇంకొంత వేగం పుంజుకొంటుంది. మనది పురాతన చరిత్ర. మన సంస్క•తీ సంప్రదాయాలే మన బలం. కలిసి బతకడం నేర్పిన నేల ఇది. అద్భుతమైన రాజ్యాంగం మనందర్నీ ఏకతాటిపై నడిపిస్తోంది. అభివృద్ధి విషయంలో ప్రపంచంలో మొదటి మూడు స్థానాల్లో నిలుస్తున్నా.. ఇంకా మేలైన స్థాయిలో మనం నడవాల్సి ఉంది.
మన రోడ్లు బాగుపడాలి..
రహదారుల విషయంలో మనం శాస్త్రీయంగా వెళ్లలేకపోతున్నాం. ట్రాఫిక్‍ నిబంధనలు, రహదారి నిర్మాణాల తీరు మారాల్సి ఉంది. అయితే, రోడ్డు నెట్‍వర్క్ విషయంలో దేశంలో గుజరాత్‍ తరువాత తెలంగాణే ఉంది. ఇప్పటికే జాతీయ రహ దారులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం, విస్తరిస్తున్నాం. బెస్ట్ ప్రాక్టీసెస్‍, బెస్ట్ టెక్నాలజీతో ప్రమాదరహిత రహదారులను నిర్మించాల్సి ఉంది. అనేక విదేశీ కార్లు మన దేశంలో పరుగులు పెడుతున్నాయి. అయితే, వాటికి తగిన రోడ్‍ నెట్‍ వర్క్ మన వద్ద లేదనే చెప్పాలి. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది.
కొత్త రహదారులు..
నాగరికతకు చిహ్నాలు రహదారులు. హైదరా బాద్‍-విజయవాడ రహదారిని బ్రహ్మాండంగా రూపుదిద్దాం. మన దగ్గర రోడ్ల నిర్మాణానికి నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే. అయితే, నాబార్డ్, సెంట్రల్‍ రోడ్‍ ఫండ్‍ నిధులతో పాటుగా బీఓటీ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఇప్పుడున్న ట్రాఫిక్‍ స్థితిగతులకు, సాంకేతికతకు, వాహనాలకు అనుగుణంగా ఆయా రోడ్ల నిర్మాణాలను చేపడుతున్నాం. వచ్చే రెండు మూడే ళ్లలో రోడ్ల విషయంలో దేశంలోనే నంబర్‍వన్‍గా తెలంగాణ నిలుస్తుంది. విదేశాల్లో రోడ్ల పక్కన మాల్స్, రెస్ట్ రూమ్స్, బోర్డింగ్‍ కోట్‍ వంటివి విరివిగా వెలుస్తాయి. మన దగ్గర ఈ సంస్క•తి ఇంకా రాలేదు. ఇవి పెరిగితే ఆదాయ మార్గాలుగా నిలుస్తాయి. మన పరిస్థితులకు తగినట్టు మన రోడ్లను తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. ఉదాహరణకు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా భద్రాచలానికి తక్కువ సమయంలో చేరుకోగలిగితే, అటువంటి మార్గాన్ని సిద్ధం చేస్తే ఆదాయం మరింత పెరుగుతుంది. హైదరాబాద్‍కు యాదగిరిగుట్ట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోడ్డును మేం ఆరులైన్లుగా మార్చాం. దీంతో ఆదాయం రెండింతలు పెరి గింది. అలాగే, పర్యాటక ప్రాంతాలు, దర్శనీయ క్షేత్రాలు తదితరాలను రోడ్‍ నెట్‍వర్క్తో కలిపే విధంగా ప్రణాళిక రూపొందించి ఆ మేరకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. తెలంగాణలో ఒక్క ఆదిలాబాద్‍కు తప్ప మిగతా ఎక్కడికైనా రెండున్నర గంటల వ్యవధిలో చేరుకునే విధంగా మన రోడ్‍ నెట్‍వర్క్ ఉంది. అయితే, వీటిని మరింత ప్రమాదరహితంగా తీర్చిదిద్దడంపైనే మేం దృష్టి పెట్టాం.
రోడ్‍ ఎడ్యుకేషన్‍ పెరగాలి..
రహదారి నిర్మాణ సంస్థకే దాని నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నాం. హైవేలపై గ్రీనరీ పెంచుతున్నాం. తెలంగాణలో ప్రతి రోడ్డు నిర్మాణంలో ప్లాంటేషన్‍ను కంపల్సరీ చేశాం. మన రోడ్లను అమెరికా ప్రమాణాల స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా ఆస్ట్రేలియా, సింగపూర్‍ టెక్నాలజీలను వినియోగిస్తున్నాం. కాకపోతే, అధిక జనాభా, ట్రాఫిక్‍, భారీ వాహ నాల కారణంగా, ప్రజల్లో తగిన ‘రోడ్‍ ఎడ్యు కేషన్‍’ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడు తున్నాయి. రానున్న రోజుల్లో ట్రాఫిక్‍, రోడ్‍ ఎడ్యుకేషన్‍ పెంచే విధంగా అవగాహన కార్య క్రమాలు చేపడతాం. రహదారి భద్రత పెరగాలి. రోడ్డు ప్రమాదాలు తగ్గాలి. జర్నీ అనేది హాయిగా, ఆహ్లాదంగా సాగాలనేదే మా లక్ష్యం.
నీటిపారుదల మంత్రిగా హ్యాపీ..
నాకు నీటిపారుదల రంగమంటే చాలా ఇష్టం. రైతాంగానికి నీళ్లందిస్తే ఆనందిస్తారు. రైతు కుటుంబాలు బాగుండాలంటే వారికున్న నాలుగైదు ఎకరాల్లో పంటలు పండాలి. అందుకు నీళ్లు కావాలి. అవి ఇవ్వగలిగితే చాలు అన్నదాత ఆశీర్వాదాలు మనకు పుష్కలంగా లభిస్తాయి. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న కాలంలో రైతుల కోసం ఎంత చేయాలో అంతా చేశాను. తమ పొలాల్లో నీళ్లు పారుతుంటే.. ఆ సమయంలో రైతుల కళ్లల్లో ఆనందం చూస్తే.. అది చాలనిపిస్తుంది. ఇక, తరువాత నాకు ఇన్‍ఫాస్ట్రక్చర్‍ రంగం అన్నా కూడా బాగా ఇష్టం. ఆ ఇంట్రెస్ట్కు తగినట్టే ప్రస్తుతం ఆర్‍ అండ్‍ బీ మంత్రిగా పటిష్టమైన రోడ్‍ నెట్‍వర్క్ కోసం పాటుపడుతున్నాను.
నేను, నా కుటుంబం..
మాది చాలా చిన్న కుటుంబం. నేను రాజకీయాల్లోకి వచ్చే సమయానికి నాన్న గారు లేరు. నాకు ఇద్దరు సోదరులు. చదువు మానేసి వ్యవసాయం చేసినప్పుడు మా అన్నయ్య ఎందు కిలా చేస్తున్నావని అడగలేదు. నేను ఏం చేస్తే అందులో సక్సెస్‍ అవుతానని అన్నయ్య నమ్మకం. అలాగే, ఏది చెబితే అది మా తమ్ముడు చేశాడు. వాళ్లిద్దరి ప్రోత్సాహం నా ఎదుగుదలలో చాలా ఉంది. మాది ఉమ్మడి కుటుంబం. రాజకీయాల్లో నాకు గాడ్‍ఫాదర్‍ ఎవరూ లేకున్నా.. ప్రజలు, కుటుంబసభ్యులు, స్నేహితులే నా వెన్నంటి నిలిచి నన్ను ముందుకు నడిపించారు.
నిబద్ధత ఉంటేనే రాణింపు..
రాజకీయాల్లో అయినా, మరే రంగంలోనైనా నిబద్ధత చాలా అవసరం. ముఖ్యంగా రాజ కీయాల్లో నిబద్ధత ఉంటేనే ఎక్కువ కాలం కొనసాగగలం. తాత్కాలిక రాజకీయాలు, తాత్కా లిక ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటే ఎవరైనా తెరమరుగైపోతారు. నేనెక్కడా తలొంచకూడదు. నన్నెవరూ వేలెత్తి చూపకూడదు. అలా జరగాలంటే నేను నిబద్ధతగా, క్రమశిక్షణతో ఉండాలి. ఈ రెండూ ఉండటం వల్లే నన్ను పదవులు, అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఏ సందర్భంలో, ఎవరినీ, ఏదీ నేను అడిగి తీసు కున్నది లేదు. నా శక్తిని గుర్తించి నాకు అవకాశం ఇచ్చిన వారి మాటను నిలబెట్టడానికి నేను శక్తివంచన లేకుండా పని చేయాలనేదే నా కోరిక.
నా ‘సత్తువ’.. సత్తుపల్లి..
‘అంతా మేమే.. మేం చెప్పినట్టే వినాలి.. రాజ కీయాలు మాకే సొంతం.. ఎవరైనా మాకు దాసులుగా ఉండాల్సిందే..’ ఇదీ సత్తుపల్లి నియోజకవర్గంలో నా కంటే ముందున్న రాజకీయ నాయకుల ధోరణి. దీన్ని నేను సహించ లేకపోయాను. సామాన్యుడు కూడా రాజకీయం చేయగలుగుతాడు. సేవ చేయగలిగే అవకాశం లభిస్తే చేస్తాడు’ అని నిరూపించాలనే పట్టుదలతో రాజకీయాల్లోకి వచ్చాను. ‘సత్తుపల్లి మా కంచు కోట’ అనుకున్న వారి కలలు కల్లలయ్యేలా పని చేసి విజయం సాధించాం. చివరకు ఎంతో సీనియర్‍ నాయకులైన జలగం వెంగళరావు గారే ‘మా కంటే బాగా నియోజకవర్గంలో పనులు చేశారు’ అని మెచ్చుకునే స్థాయిలో నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశాను. వెంగళరావు గారు సత్తుపల్లిని పెట్టనికోటగా మలుచుకున్నారు. అలాంటి కోటలో నేను పాగా వేయాలంటే, అంతకంటే వెయ్యిరెట్లు మెరుగ్గా పని చేయాలి. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల్లో గెలిచిన వెంటనే వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి నియోజకవర్గం కోసం ఎంత చేయాలో అంతా చేశాను. వెంగళరావు గారు సీఎంగా ఉన్నా కాని పనులు తుమ్మల హయాంలో అయ్యాయి అని జనం అనుకునేలా చేసి చూపించాను. ప్రజలు ఎప్పుడైతే నన్ను నమ్మడం ప్రారంభించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మరింత శ్రమించడం ప్రారంభించాను. ఇక అక్కడి నుంచి రాజకీయాల్లో వెనుదిరిగి చూసింది లేదు. నా గెలుపోటములు, నా సంరక్షణ అంతా నా నియోజకవర్గ ప్రజలే చూసుకుంటున్నారు. నేను ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఎవరినీ పిలవకుండానే, నిరాడంబరంగానే చేరాలని అను కొన్నాను. కానీ, ఆ కార్యక్రమం జరిగే సమయానికి వేలాది మంది వచ్చి చేరారు. ఏమిస్తే వాళ్ల రుణం తీర్చుకోగలం? అందుకే వాళ్ల కోసం ఇంకా కష్టపడి పనిచేయాలనే సంకల్పం నాలో పెరిగింది.
ప్రవాస భారతీయుల గురించి..
విధానాలు, పద్ధతులు వేరైనా.. ఎవరు ఎక్కడున్నా.. మన ఉనికి చాటుకోవాలి. మన జాతి గౌరవం, మన దేశ గౌరవాన్ని నిలిపేలా నడుచు కోవాలి. ఎన్నారైల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నాం. ఐటీ అంటే హైదరాబాదే కాదు.. త్వరలో ఖమ్మం లోనూ ఐటీ హబ్‍ను ప్రారంభిస్తున్నాం. ఇటువంటి ప్రాజెక్టులకు ఎన్నారైల సహకారం చాలా అవసరం.
అమెరికా చదువులకు ఆర్థిక సాయం..
విద్యతోనే ప్రగతి సాధ్యం. అందరూ చదువు కుంటేనే పరిస్థితులు మారతాయి. ఇది గుర్తించే తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం. కేజీ టు పీజీ విద్యకు పునాది వేశాం. గురుకులాల ద్వారా ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.లక్ష వరకు వెచ్చిస్తున్నాం. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం రూ.29 లక్షల వరకు అందిస్తున్నాం. ప్రతిభ ఉన్న విద్యార్థులకు పేదరికం అడ్డు కారాదనే లక్ష్యంతో ఎంత ఖర్చయినా వారి చదువుల ఖర్చును మేమే భరిస్తున్నాం.
నేటి యువత గురించి..
మన సంస్క•తీ సంప్రదాయాలను కాపాడు కుంటూనే, కుటుంబ నేపథ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దృడ సంకల్పంతో యువత ముందుకెళ్లాలి. పుట్టిన ఊరికి, కన్నవారికి పేరు ప్రఖ్యాతులు తేవాలి. దేశానికి ఏదో విధంగా ఉపయోగపడాలి. మంచి నైపుణ్యం గల విద్యార్థులు, యువకులు మనకు ఉన్నారు. వారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేలా మసులుకోవాలి. మనం చేసేది వ్యాపారమా? వ్యవసాయమా? రాజ కీయాలా? అన్నది కాదు.. ఏ పని చేస్తున్నా మంచి సంకల్పం తోడైతే ఆ పనిలో రాణించగలం. యువత ఈ విషయాన్ని గుర్తించి ముందడుగు వేయాలి.

Review జనహితమే నా సంకల్పం...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top