ధర్మసందేహం కార్తీక దీపారాధన ఎందుకు?

కార్తీక మాసంలో ప్రధానంగా దీపారాధనే ప్రధాన విధి ఎందుకైంది? ఈ మాసంలో చేసే దీపారాధన చేయడం వెనుక గల ఆచార నేపథ్యం ఏమిటి?
ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే రెండు పున్నములను శరత్పూర్ణిమలని అంటారు. ఈ రోజుల్లో చేసే ధ్యాన, అర్చనలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మికంగా, యోగసాధన పరంగా ఈ రెండు పున్నములకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజుల్లో దీపాలు వెలిగించడం ప్రధానమైన అంశం. ఇలా శరత్కాలంలో దీపాలు వెలిగించడాన్నే ‘దేవ దీపావళి’ అని అంటారు.
కార్తీక మాసంలో పౌర్ణమి కృత్తిక నక్షత్రం రోజున వస్తుంది. ఈ నక్షత్రం అగ్ని సంబంధమైనది. ఇందుకు ప్రతీకగానే ఆ రోజున దీపారాధన చేయడం ఆచారంగా వస్తోంది. అలాగే, కృత్తిక నక్షత్రంలో జన్మించిన కుమారస్వామి ఆరాధన కూడా ఈ మాసంలోనే చేస్తారు. కార్తీక పున్నమి రోజునే కుమారస్వామి తారకాసురుడిని సంహరించాడని అంటారు. ఇందుకు సంకేతంగా కొన్ని ప్రాంతాల్లో కార్తీక పూర్ణిమను ‘కుమార దర్శనం’ పేరుతో వ్యవహరిస్తారు. అలాగే, త్రిపురాసురులను పరమేశ్వరుడు వధించిన రోజుకు గుర్తుగా కార్తీక పూర్ణిమను ‘త్రిపుర పూర్ణిమ’గానూ పాటిస్తారు.
కార్తీక పౌర్ణమికి జైన సంప్రదాయంలోనూ, పంజాబ్‌లోనూ ఎంతో ప్రాధాన్యం ఉంది. పౌర్ణమి రోజుల్లో వారు గంగా మహోత్సవం నిర్వహిస్తారు. గురునానక్‌ జయంతి కార్తీక పూర్ణిమ నాడే. కాబట్టే ఈనాడు సిక్కులు ‘గురుపూరబ్‌’ పేరుతో ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు. ఇక, కార్తీక పూర్ణిమ నాడు ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం స్త్రీలకు సౌభాగ్యం కలిగించే వ్రతంగా పేరొందింది.
కార్తీక మాసంలో ఉపవాసానికి ప్రాధాన్యం ఉంది కదా! ఉపవాస విధులను ఎలా ఆచరించాలి?
కార్తీక మాసం నెల రోజులూ చేయాల్సిన విధులను, వ్రతాలను గురించి కార్తీక పురాణం వివరిస్తోంది.
మొదటి రోజు అర్చన, అగ్నిపూజను నిర్వహించాలి. సాయంత్రం పూట విధిగా ఆలయంలో దీపం పెట్టి పరమశివుడకి నైవేద్యాలను సమర్పించాలి. ఇలా కార్తీక మాసం పొడవునా చేయాలి.
వశిష్టుడు కార్తీక సోమవారం వ్రతాన్ని గురించి కార్తీక పురాణం రెండో అధ్యాయంలో వివరించాడు. ఈ సోమవారం వ్రతాన్ని ఆరు విధాలుగా ఆచరించవచ్చు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలాదానం.
కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించడం ఈ ఉపవాస విధం. ఇలా చేయడం సాధ్యం కాని వాళ్లు ఉదయం పూట యథా ప్రకారం స్నాన, దాన, జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రి శివతీర్థాన్నో, తులసి తీర్థాన్నో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడాన్ని ఏకభుక్తం అంటారు.
పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు.
తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు. దీనినే అయాచితం అంటారు.
ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం అనే నాలుగింటిలో ఏదీ చెయ్యలేని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా సరిపోతుంది.
పై ఆరు విధానాల్లో కనీసం ఏదో ఒకటైనా ఆచరించడం శ్రేయస్కరమని శివపురాణం చెబుతోంది.

Review ధర్మసందేహం కార్తీక దీపారాధన ఎందుకు?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top