రియల్ జెంటిల్ మెన్ మనోహర్ పారికర్

గోవా రాష్ట్రంలోని మపుస అనే ఊళ్లో మనోహర్‍ పారికర్‍ జన్మించారు. ఆయనది అత్యంత నిరుపేద కుటుంబం. మరగోవాలోని లయోలా హైస్కూలులో ఆయన హైస్కూలు విద్యాభ్యాసం కొనసాగింది. అనంతరం ఆయన మరాఠీలో సెకండరీ విద్యను పూర్తి చేశారు. 1978లో ఇండియన్‍ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ టెక్నాలజీ-ముంబాయి (ఐఐటీ-ముంబాయి)లో మెటలర్జికల్‍ ఇంజనీరింగ్‍ చేశారు. భారతదేశంలో ఐఐటీ గ్రాడ్యుయేషన్‍ అర్హత కలిగిన మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా పారికర్‍ రికార్డు సృష్టించారు. ఆయన చిన్ననాటి నుంచే చదువులో, వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో అత్యంత వినయ విధేయతలు కలిగిన వ్యక్తి. ఆయన చదువులో చూపిన ప్రతిభకు, తన పూర్వ విద్యార్థి అత్యున్నత శిఖరాలకు చేరినందుకు గాను ఐఐటీ- ముంబాయి 2001లో ‘డిస్టింగ్విష్డ్ అలుమ్నస్‍’ అవార్డుతో సత్కరించింది.
చిన్ననాడే ఆర్‍ఎస్‍ఎస్‍లో చేరిక..
పారికర్‍ యుక్త వయసులో ఉండగానే, రాష్ట్రీయ స్వయం సేవక్‍ సంఘ్‍ (ఆర్‍ఎస్‍ఎస్‍)లో చేరారు. ఆయన స్కూలు ఫైనల్‍ ఇయర్‍లో
ఉండే నాటికే ఆర్‍ఎస్‍ఎస్‍లో ’ముఖ్య శిక్షక్‍’ అయ్యారు. ఐఐటీ-ముంబాయిలో గ్రాడ్యుయేషన్‍ పూర్తి చేసిన అనంతరం మపుస పట్టణంలో ఆర్‍ఎస్‍ఎస్‍ తరపున వివిధ కార్యక్రమాలు నిర్వహించే వారు. అదే సమయంలో వ్యాపారం చేపట్టారు. ఆయన 26 ఏళ్ల వయసులో
ఉండగా ఆర్‍ఎస్‍ఎస్‍లో ‘స్వయంచాలక్‍’గా ఎంపికయ్యారు. ఆర్‍ఎస్‍ఎస్‍ నార్త్ గోవా విభాగానికి నాయకత్వం వహించిన ఆయన ఆ రోజుల్లో సంఘ్‍ కార్యకలాపాల్లో చాలా క్రియాశీలకంగా ఉండేవారు. రామ్‍ జన్మభూమి ఉద్యమ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆర్‍ఎస్‍ఎస్‍లో ఆయన పాత్ర.. క్రమంగా భారతీయ జనతా పార్టీలో ప్రవేశానికి వీలు కల్పించింది. దీంతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది.
క్రమశిక్షణ, విధేయత ‘సంఘ్‍’ నేర్పిన పాఠాలే..
మనోహర్‍ పారికర్‍ ఆర్‍ఎస్‍ఎస్‍ కఠోర శిక్షణలో రాటుదేలారు. క్రమశిక్షణ, ప్రగతివాదం, లింగ సమానత్వం, న్యాయం ముందు అందరూ సమానమే అనే భావన, జాతీయవాదం, సామాజిక బాధ్యత వంటి అత్యుత్తమ లక్షణాలను ఒంటబట్టించుకున్నారు. ఆల్చిప్పలో పడిన స్వాతి చినుకు ముత్యమైనట్టు ఆయన ఆర్‍ఎస్‍ఎస్‍ ‘బడి’లో చేరి సానబెట్టిన వజ్రంలా మారారు. ఆర్‍ఎస్‍ఎస్‍ ప్రచారక్‍గా ఆయన పలుమార్లు కీలక బాధ్యతలు, కీలక పాత్రలు నిర్వర్తించారు.
రాజకీయ జీవితం..
1994లో మనోహర్‍ పారికర్‍ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభ అభ్యర్థిగా గోవా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1999 జూన్‍ నుంచి నవంబరు వరకు ఆయన శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. 2000 సంవత్సరంలో జరిగిన గోవా ఎన్నికల్లో బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఆయన విజయవంతంగా పార్టీని నడిపించి ఒంటిచేత్తో గెలిపించారు. అక్టోబరు 24, 2000 సంవత్సరంలో ఆయన తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ పదవిలో ఆయన ఫిబ్రవరి 27, 2002 వరకే కొనసాగారు. జూన్‍ 5, 2002లో ఆయన తిరిగి మరో పర్యాయం గోవా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అనంతరం గోవా రాష్ట్రంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాల అనంతరం పారికర్‍ మార్చి 2012లో జరిగిన ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గోవా రాష్ట్రంలోని రెండు లోక్‍సభ స్థానాలను బీజేపీ గెలుపొందింది. ఈ నేపథ్యంలోనే పారికర్‍ పయనం ‘దిల్లీ’ దిశగా సాగింది. ఆయనను ప్రధానమంత్రి మోదీ.. రక్షణ శాఖ మంత్రిగా తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటికి గోవాలోని పనాజీ శాసనసభ స్థానం నుంచి పారికర్‍ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో భారత రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పారికర్‍.. ఇటీవల వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరిన అంనతరం పార్లమెంటు తరపున ఉత్తరప్రదేశ్‍ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
అవే ఆయన ఆయుధాలు..
సౌమ్యత, బాధ్యతాయుత ప్రవర్తన, సామాన్యంగా ఉండటం, విధేయత చూపడం, సత్వరమే నిర్ణయాలు తీసుకోవడం, పారదర్శకంగా ఉండటం, కీలక సమయంలో సామర్థ్యం చూపడం.. ఇవే మనోహర్‍ పారికర్‍ ఆయుధాలు. అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు రాజకీయ జీవితంలోనూ ఆయన ఇవే లక్షణాలతో ఉన్నత స్థాయిలో రాణించారు. రక్షణ మంత్రిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన పారికర్‍.. మార్చి 14, 2017లో తిరిగి గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
వ్యక్తిగత జీవితం..
వ్యక్తిగత జీవితంలో పారికర్‍ చాలా సామాన్యుడుగా ఉండటానికే ఇష్టపడతారు. రాజకీయ నాయకులకు సహజ లక్షణాలుగా
ఉండే హంగూ ఆర్భాటాలను ఆయన అసలు మచ్చుకైనా దరిచేరనివ్వరు. డాబూ దర్పాలను ప్రదర్శించడం, అధికారాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవడం వంటివి ఆయనకు అసలు తెలియదు. గోవా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన మునుపటి మాదిరిగానే గోవా నగర వీధుల్లో మార్నింగ్‍ వాక్‍ చేసేవారు. రోడ్డు పక్కన ఉన్న టీ బడ్డీ వద్దనే టీ తాగేవారు. ఆ సమయంలోనే ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకునే వారు. సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోయి వారి మనోగతాన్ని వినే వారు. భారత రాజకీయాల్లో మనోహర్‍ పారికర్‍ వంటి ‘సామాన్యుడు’ మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక, ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన భార్య పేరు మేధా పారికర్‍. 2001 సంవత్సరంలో ఆమె క్యాన్సర్‍ బారిన పడి కన్నుమూశారు. పారికర్‍కు ఇద్దరు కుమారులు. ఉత్పల్‍ పారికర్‍.. మిచిగాన్‍ స్టేట్‍ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్‍ ఇంజనీరింగ్‍ గ్రాడ్యుయేషన్‍ పూర్తి చేశారు. అభిజిత్‍ పారికర్‍.. గోవాలోనే ఉంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
నిజాయితీకి పెట్టింది పేరు..
మనోహర్‍ పారికర్‍ సామాన్య జీవితం గడపటమే కాదు.. మచ్చలేని మనిషిగానూ చరిత్ర సృష్టించారు. ఆయన గోవా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మంత్రివర్గంపై, ఇతరత్రా అవినీతి ఆరోపణలు వచ్చాయి కానీ.. ఆయనపై మాత్రం ఈగ వాలలేదు. వాటితో ఆయనకు ఏమాత్రం సంబంధం లేదని ఆయా విచారణల్లో తేలింది. ఆ నిజాయితీయే ఆయనను తిరిగి సొంత రాష్ట్రానికి రప్పించింది. రక్షణ మంత్రిగా పారికర్‍ పనితీరు గురించి చెప్పడానికి నిజంగా మాటలు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే డిఫెన్స్ మినిస్టర్‍గా ఆయన ‘ఎవరెస్ట్’ శిఖర సమానులు. రెండు సంవత్సరాలు మాత్రమే ఆయన ఆ పదవిలో ఉన్నా కూడా.. గొప్ప సంస్కరణలు తెచ్చారు. శాఖ పనితీరులో సమూల మార్పులు చేశారు. సైనిక బలగాల్లో అమేయమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. ఆయన తన సహజ ధోరణితో, సామాన్య వైఖరితో గోవా ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రజలపై చెరగని ముద్ర వేశారు. అది నచ్చే ఆయనను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏరికోరి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తిరిగి ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో గోవాలో భారతీయ జనతా పార్టీ గెలుపొందగానే… పారికర్‍ను మించిన వారు లేకపోవడంతో తిరిగి ఆయనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపారు. నిజానికి ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరిన సమయంలో గోవా ప్రజలు కంటతడి పెట్టారు. మౌనంగానే రోదించారు.. ఇక అటువంటి ముఖ్యమంత్రిని చూడలేమోననే బాధతో!. తిరిగి రెండు సంవత్సరాల విరామం తరువాత అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా రావడంతో సంబరాలు జరుపుకొన్నారు.
నాయకుడంటే అతడే..
అవును.. నాయకుడంటే మనోహర్‍ పారికరే. ఆయనంత సామాన్యంగా ఉండే ‘ధనికుడు’ భారత రాజకీయాల్లో భూతద్దం పెట్టి వెతికినా ఎవరూ దొరకరు. జనం ఆయనను కోరుకుంటారు. ఆయన కోసం విలపిస్తారు. ఆయన కోసం తపిస్తారు. రాజకీయ నాయకుడంటే.. పదుల కొద్దీ సెక్యూరిటీ గార్డులను వెనకేసుకుని తిరిగే వాడు కాదనే వాస్తవానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. రాజకీయ నాయకుడంటే.. జనం ట్రాఫిక్‍లో చిక్కుకుని బాధలు పడుతుంటే.. తాను మాత్రం బుగ్గ కారులో రయ్యిన దూసుకుపోయే వాడు కాదు. రాజకీయ నాయకుడంటే జనంలో కలిసిపోవాలి. జనంతో మమేకం కావాలి. జనం గోడు వినాలి. జనం బాధ చూడాలి. జనం గుండెచప్పుడు కావాలి. అతడే నిజమైన రాజకీయ నాయకుడు. ఈ లక్షణాలకు అద్దం పట్టే గొప్ప వ్యక్తిత్వం మనోహర్‍ పారికర్‍ సొంతం. ఆయన గోవా ముఖ్యమంత్రి కావడం, అటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఉండటం మన అదృష్టం.

Review రియల్ జెంటిల్ మెన్ మనోహర్ పారికర్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top