మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం..
అనేకానేక వృత్తుల్లో ఒకటి- చౌర్యం. ఇది చతుష్షష్టి (64) కళల్లో ఒకటి. బ్రిటిష్ వారి హయాంలో ఎరుకలు, యానాదుల వారిని నేరస్థ జాతులుగా పరిగణించే వారు. వీరిని పూర్వం రాజులు తమ స్వప్రయోజనాలకు వాడుకునే వారు. వీరిని సరిహద్దుల్లో ఉంచి పొరుగు రాజులపై ఉసిగొల్పుతూ ఉండాలని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో రాశాడు.
సమాజం దొంగతనాన్ని ఒక న్యాయమైన వృత్తిగా గుర్తించక పోయినా.. కొందరు దీనిని వృత్తిగా స్వీకరించారు.
దొంగతనం చేసేవాడికి భయం ఉండకూడదని, చోరీకి పాల్పడబోయే ఇల్లు ఆనుపానులు ఆ ఇంటి సేవకుడి ద్వారా దొంగ తెలుసుకుంటాడని, దొంగకు భయం వేశ్యకు సిగ్గు పనికిరావు, దొంగకు తోడు దొరకు సాక్షి, ఇంటివాడిని లేపి దొంగతనానికి కట్టె ఇచ్చినట్టు అనే సామెతలు చెబుతున్నాయి.
దొంగ కూడా ఒక మనిషే. అతడేమీ కొత్తగా ఊడిపడిన జాతి వాడు కాదు. బీదలో, సోమరులో దొంగలవుతారనేది సమాజానికి తెలిసిన విషయమే. బీద బలిసి బందికాడైనట్టు, ఒళ్లు వంగని వాడు దొంగలలో కలిసినాడట అనే సామెతలు పై విషయానికి ఉదాహరణలు.
సమాజంలో తిండికి నోచని వారు భిక్షాటన చేస్తుంటారు. దొంగలు వీరిని దొంగిలించేటంత దొరతనముండగా అడుక్కు తినేటంత అదవతనమేల? అని ఎద్దేవా చేస్తారని ఈ సామెత చెబుతుంది.
దొంగకు ఉండాల్సిన పరికరాల్లో కత్తి ఒకటి. అందుకే ఎప్పుడూ కన్నగాడు కత్తి మరువడు అనే సామెత తెలుపుతుంది.
దొంగ సంగతి దొంగే ఎరుగును, దొంగను దొంగయే పట్టవలెను అనే సామెతలు దొంగల్ని పట్టేందుకు పాత దొంగలనే పోలీసులు వాడుకుంటారనే విషయానికి ఉదాహరణలు.
ఎంత నేర్పరి దొంగలైనా ఎప్పుడోసారి దొరక్కపోడు. కానీ, అంతవరకు దొరలాగే తిరుగుతుంటాడు. ఈ విషయాన్ని పాత దొంగ ఒకరోజున దొరకకపోడు, దొరికితే దొంగ దొరక్కపోతే దొర అనే సామెతలు తెలుపుతున్నాయి.
తను దొంగ అయితే అందరినీ అనుమానిస్తాడని దొంగకు అందరి మీదా అనుమానమే, తను దొంగైతే పొరుగును నమ్మడు అనే సామెతలు చెబుతాయి.
కాలం ఎదురు తిరిగినపుడు దొంగపడే కష్టాలను కన్నంలో దొంగకు తేలు కుట్టినట్టు, దాగబోయి తలారి ఎదుట దాగినట్టు, కొల్లకు పోయి పై చీర (బట్ట) పోగొట్టుకున్నట్టు అనే సామెతలు తెలుపుతున్నాయి.
దొంగలు తాము అపహరించిన సొత్తును వ్యాపారులకో, ధనికులకో చౌకగా అమ్మేస్తుంటారు. దీంతో చోరీసోత్తుకు సరైన ధర రాక దొంగలు తమ అవసరాల కోసం మళ్లీ చోరీలకు పాల్పడుతుంటారు. పూర్వం రాజులు, నేడు పోలీసులు చోరీ సొత్తును దొంగల నుంచే రికవరీ చేస్తుంటారు. ఈ విషయాన్ని దొంగల సొమ్ము దొరల పాలు అనే సామెత విశదీకరిస్తుంది.
గుమ్మడికాయలు, పుచ్చకాయలు, ఇతర పంటల ఉత్పత్తులు కూడా చోరీ అవుతుంటాయి. గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టు, దొంగకు చేను పచ్చి లేదు అనే సామెతలు ఈ కోణంలో పుట్టుకొచ్చినవే.
ధనికులకే తప్ప బీదలకు దొంగల భయం లేదనే విషయాన్ని దొంగను పుట్టించిన వాడు మతిభ్రష్టును పుట్టించక మానడు, గోచిపాతలరాయుడు దొంగల మిండడు అనే సామెతలు చెబుతున్నాయి.
దారి పక్కనున్న గట్టుపై కూర్చుని ఒక దొంగ ప్రయాణికులను లేస్తే మనిషిని కాను అని బెదిరించే వాడట. బాటసారులు భయపడి సొమ్ము అక్కడపెట్టి పారిపోయే వారట. ఈ విషయాన్ని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారు తమ కథలు-గాథలు అనే పుస్తకంలో వివరించారు. నైజాం ప్రాంతంలో కొంగల మల్లాయగట్టు అనే ప్రాంతం తగులు తుందట. కొంగల మల్లాయ ఈ దారిన పోయేవారిని బెదిరించి డబ్బులు గుంజుకునే వాడట. అతడు వృద్ధుడైన పిమ్మట ఆ గట్టుపై కూర్చుని నేను లేస్తే మనిషిని కాను అనేవాడట. అలా ఈ సామెత పుట్టింది.










































































































































































Review సామెత కథ.