కోడి కొత్త అప్పు తీరుస్తుంది..

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం..
వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువులు రైతులకు ప్రాణ సమానం. కడుపున పుట్టిన వారిని చూసుకున్నంత ప్రేమగానే రైతులు వాటిని సాకుతుంటారు. కొందరైతే పిల్లలతో సమానంగా పశువులనూ చూసుకుంటారు. అందుకే పశువులు ఏమైనా అనారోగ్యానికి గురైతే కర్షకులు అల్లాడిపోతారు. ఈ క్రమంలో వాటికి వచ్చే వ్యాధులకు సంబంధించి కూడా కొన్ని సామెతలు పుట్టాయి. పశువులకు సోకే వ్యాధులు, వాటి తీవ్రత ఆయా సామెతల్లో ఉంది.
కొన్ని రోగాలకు వాతలు వేయడం ఒక వైద్య పద్ధతి. పశువులకు ఆకలి పెంచేందుకు ఉప్పు, నల్లేరు కలిపి పెడతారు. కారం నీళ్లలో కలిపి గొట్టంతో పోస్తారు. మూలికలు, దినుసులు సిద్ధంగా ఉంచుకుని అప్పుడప్పుడూ తినిపిస్తుంటారు. కళ్లారా గొడ్డు తిరిగితేనే బలం అని తెలిసిన రైతులు వాటిని సాయంత్రం వేళల్లో అలా వదిలి తిరగనిస్తారు. ఆ విషయాలను తెలిపే సామెతలివి..
రోగాలతో గురక ప్రమాదం
గేదె ఉండగా, దూడ ఉండగా గుంజకు వచ్చెరా గురక రోగం,
దోమలన్నింటిలో మిడిదోమ మిండడు, మాదలన్నిటిలో కొమ్ముమాద ప్రమాదకరం,
గాలికుంటు అయితే కురము అన్నట్టు,
సూతికావాతం వచ్చిన గొడ్డును చూడగానే మందు,
అన్ని రోగాలకూ వాతలు వేసే వైద్యుడిని అవతల ఉంచు,
ఉప్పు తిన్న కోడె ఊరిపోయింది, పప్పు తిన్న కోడె పారిపోయింది,
మేత కన్నా మసలితేనే బలం.
కొన్ని ఊళ్లలో శక్తికి మించిన పనులు చేసి పశువులు బక్కచిక్కిపోతుంటాయి. లోతుగా ఉండే బావుల్లోని కపిల (మట్టి) తోలలేక, బంక నేలల్లో దమ్ము చేయలేక, కొండొకచో భూమిని దున్నలేక పశువులు దెబ్బతింటాయి. అందుకే చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎద్దులను తెలిసిన ఊరికి చెందిన రైతులకు అమ్మి కష్టబెట్టబోరు. ఈ క్రమంలో పుట్టిన సామెతలివి..
వెల్లటూరులో ఎద్దును, పరుచూరులో పడుచును ఇవ్వరాదు
ఎలమర్రుకు ఎద్దునివ్వ రాదు, పామర్రుకు పడుచు నివ్వరాదు
పెనుగొండకు పిల్లనివ్వరాదు, రొద్దానికి ఎద్దునివ్వ రాదు
పై సంపాదన కోసం రైతులు కోళ్లను పెరట్లోనూ, పందులను ఇతరులకు ఎవరికైనా కొని ఇచ్చి పెంచుతుంటారు. వాటిపై కూడా సామెతలు ఉన్నాయి-
కోడిని సంపాదించుకుంటే కోడితలకాయలంత బంగారం సంపాదిస్తుంది
పంది పాత అప్పు తీరుస్తుంది. కోడి కొత్త అప్పు తీరుస్తుంది
ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ నిజంగానే వాడుకలో ఉన్న సామెతలు. వాటి పెంపకంతో జీవనోపాధి పొందడం కూడా నిజమే. ఇది నిరూపితమైన సత్యం. కేవలం కోళ్లు, ఇతర పాడి ద్వారా అప్పులు తీర్చుకున్న, తీర్చుకుంటున్న రైతు కుటుంబాలు నేటికీ ఉన్నాయి. అలాగే, జీవనోపాధికి వీటి పెంపకాన్నే వృత్తిగా మలుచుకున్న కుటుంబాలూ ఉన్నాయి. కోళ్లు, పందుల పెంపకం, వాటి పోషణ కూడా ఒకింత భారమే. ఈ విషయాన్నే చెబుతాయీ కింది సామెతలు-
తాదిన తవుడు లేదు.. వారానికి ఒక పందిపిల్ల
మేడికీ కోడికీ నిలికి లేదు
మేడిచెట్టు మేస్తూనే ఉంటుంది. కోడి గుడ్లు పెడుతూనే ఉంటుంది

Review కోడి కొత్త అప్పు తీరుస్తుంది...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top