మన భారతీయ సంస్క•తిలోని ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు అనేక అర్థపరమార్థాలకు చిరునామాగా నిలుస్తాయి. ఒక్కో ఆచారం వెనుక ఒక్కో నేపథ్యం.. ఒక్కో సంప్రదాయం వెనుక ఒక్కో పరమార్థం.. వాటిని తెలుసుకొంటేనే ఆయా ఆచారాలు, సంప్రదాయాల్లోని విశిష్టత అవగతమవుతుంది. వాటి అర్థపరమార్థాల విశేషాల సమాహారమే ఈ శీర్షిక.
‘‘జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం’’ అని ఎందుకంటారు ?
దండకారణ్యంలోని ఇల్వలుడూ, వాతాపీ అనే రాక్షస సోదరులు ఉండే వారు. అరణ్యంలోకి వచ్చి పోయే వారిని మాయమాటలతో పిలిచి, ఆరగిస్తుంటారు. అతిథి పూజకని భోక్తలను పిలుస్తాడు ఇల్వలుడు. వారురాక ముందే వాతాపి మేకలా మారిపోతాడు. ఇల్వలుడు మేకను కోసి వండి వడ్డిస్తాడు. వాతాపి భోక్తల కడుపు చీల్చుకుని బయటికి వస్తాడు. ఆ తర్వాత ఎంచక్కా వారిని ఇద్దరూ కలసి భుజిస్తారు.
అగస్త్యుడికి ఈ విషయం తెలిసి భోక్తలా వెళతాడు. ఎప్పటిలానే ఇల్వలుడు వాతాపిని వండి వడ్డిస్తాడు. అగస్త్యుడు భుజించిన తర్వాత ఎప్పటిలా ఇల్వలుడు ‘వాతాపీ బైటకిరా’ అంటాడు. అప్పుడు ఆగస్త్యుడు ‘ఇంకెక్కడి వాతాపి…… ఎప్పుడో జీర్ణమయిపోయాడు. ‘జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణమంటూ’ పొట్టను రుద్దుకుంటాడు. అలా అగస్త్యుడు వాతాపిని జీర్ణము చేసుకొని ఇల్వలుడ్ని బూడిద చేస్తాడు. ఎంత చెడు ప్రభావం కలదైనా, అరగనిదైనా అలా అంటే కడుపులో కొండ ఉన్నా అరుగుతుందని తల్లి నమ్మకం. అందుకనే తల్లి పిల్లలకు భోజనం పెట్టి పూర్తయిన తర్వాత ఆ మాటంటుంది.
వివాహంలో కచ్చితంగా చేయాల్సిన 16 విధులేమిటి?
ఒకటి వరాగమనమూ, రెండు స్నాతకము, మూడు మధుపర్కమూ, నాలుగు మంగళస్నానమూ, అయిదు గౌరిపూజా, ఆరు కన్యావరణమూ, ఏడు కన్యాదానమూ, ఎనిమిది సుముహూర్తము, తొమ్మిది మంగళ సూత్ర ధారణమూ, పది తలంబ్రాలూ, పదకొండు హోమము, పన్నెండు పాణిగ్రహణమూ, పదమూడు సప్తపదీ, పధ్నాలుగు అరుంధతీ నక్షత్ర దర్శనమూ, పదిహేను స్ధారీపాకమూ, పదహారు నాగవల్లీ…. ఈ విధులతో వివాహ మహోత్సవం సంపూర్ణమవుతుంది. పూర్వం పెళ్ళంటే పదిరోజులు పైనే చేసేవారు.
తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యేకత ఏమిటి?
అద్దాల మంటపానికి ఉత్తరం దిక్కున ఉంది పూలబావి. స్వామి వారికి సమర్పించిన తులసీ, పూలదండలు, పువ్వులు ఎవరికీ ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు. ఆపద వచ్చినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య సొరంగ మార్గం ద్వారానే ఆ వెంకటేశ్వరస్వామిని శరణువేడుకునే వాడట. ఒకసారి తొండమానుడు ఇలాగే ఆపద సమయంలో స్వామి దర్శనానికి వెళ్లేసరికి శ్రీవారు ఏకాంతంగా ఉన్నారు. తొండమానుడిని చూసి శ్రీ మహాలక్ష్మి సిగ్గుతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో చేరింది. అదే సమయంలో భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్ళి రహస్యంగా దాక్కుందని పురాణాల గాధ.
కుంకుడూ, మామిడీ, దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు?
ఇలాంటి చెట్లు నీటి శాతాన్ని ఎక్కువగా పీలుస్తాయి. తద్వారా గృహావసరాలకి ఉపయోగపడే అనేక చెట్లు నీరు సరిపోక పెరగవు. కొన్ని చెట్లు గృహ యజమాని జాతకానికి సరిపోవు. అందెందు సర్వసమ్మతమైనవీ, గృహావసరాలకి ఉపయోగపడే చెట్లనే పెంచుకుంటారు. అలాగే, ఈ రోజుల్లో మామిడి, దానిమ్మ చెట్లను ఇంటి ఆవరణలోనే పెంచుకోవడం అభిరుచిగా మారింది. కాకపోతే, పై చెట్లు పెంచాలనుకుంటే తమ తమ జాతకాల ప్రకారం, నక్షత్రాల ప్రకారం సరిచూసుకుని పెంచుకొంటే మంచిది.
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవకూడదా?
వ్యాసమహర్షి రచించిన 18 పురాణాల్లో ఒకటి గరుడ పురాణం. నరకం గురించి, పాపాత్ముల శిక్షలను గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీమహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి. దీనిలో ప్రేతకల్పం ఉండటం వలన ఇంట్లో చదవచ్చా, చదవకూడదా అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఈ పురాణం వ్యాస విరచితం. అన్ని పురాణాల్లాగానే దీనినీ ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎవ్వరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో కలిపి కానుకగా ఇవ్వాలి
Review తెలుసుకుందాం.