దక్షిణామూర్తి ఈశ్వరాలయాల్లో దక్షిణ దిక్కున విలసిల్లే దైవం. ఆయన గురువులకు గురువు. నిత్య యవ్వనుడు. మౌనముద్రలో నిశ్చలంగా ఉపదేశించే మహాయోగి. శాంతమూర్తి. చిద్విలాసుడు. అటువంటి సచ్చిదానంద మూర్తినే స్మరించుకుంటూ చేసి ఈ స్తోత్ర రచన గంభీరమైన శైలిలో నడుస్తుంది. సకల ప్రాణుల సృష్టి – స్థితి – లయాలకు కారణభూతుడైన పరమ గురువున తన కవితాధారతో స్తుతించడానికే ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ రచన చేసినట్టు కనిపిస్తుంది.
విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా ।
యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ।।
మాయ వలన బయట వ్యక్తమైనట్టు కనబడుతున్న ప్రపంచాన్ని తన హృదయంలో ఉన్న అద్వితీయమైన పరమాత్మలో, అద్దంలో ప్రతిబింబిస్తున్న నగరంలా, ఒక స్వప్న దృశ్యంలాగా, ఆత్మజాగృత స్థితిలో సంగ్రహించే జ్ఞానమూర్తికి, దక్షిణామూర్తి రూప గురువర్యులకిదే నా నమస్కారం.
బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఞ్నర్వికల్పం పునః
మామాకల్పిత దేశకాలకలనావైచిత్య్ర చిత్రీకృతమ్ ।
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ।।
ఒక మహా వృక్షం బీజస్థితిలో అవ్యక్తంగా కంటికి కనబడకుండా సూక్ష్మంగా ఎలా ఉంటుందో, ఈ విశ్వమంతా ఆవిర్భావానికి పూర్వం పరమాత్మలో అలాగే ఉంది. ఆ పరమాత్మ స్వయంగా మహా యోగి అయి ఉండి కూడా ఇంద్రజాలికుని వలే చిత్ర విచిత్రంగా మాయా రూప దేశకాల విశేషాలతో ఇచ్ఛామాత్రంగా ఈ జగత్తును సృష్టిస్తున్నాడు. ఆ పరమాత్మ స్వరూపమైన దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువర్యులకు ఇదే నా నమస్కారం.
యస్మైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే
సాక్షాత్ తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాంష్ట్రశ్రితాన్ ।
యస్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిః భవాంభోనిదౌ
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ।।
సద్రూపమైన పరమాత్మయే ఈ కార్య ప్రపంచంలో ఉన్న సమస్తమునూ ఆవరించి భాసిస్తున్నది. ‘నీవు స్వయంగా ఆ పరమాత్మవే’ అనే వేద వాక్యాలను బోధించే, ఆ పరమాత్మను సాక్షాత్కరించుకున్న వారు భవసాగరాన్ని తరిస్తారనీ, తనను ఆశ్రయించిన వారికి ఉద్బోధించే, ఆ దక్షిణామూర్తి రూపంలోఉన్న గురువర్యులకిదే నా నమస్కారం.
నానా ఛిద్రఘటోదరస్థిత మహాదీపభ్రాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ।
జానామీతి తమేవ భాంత మనుభ్యాతే తత్ సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ।।
ఎన్నో ఛిద్రములు ఉన్న కుండలో నలువైపులా ప్రకాశిస్తున్న మహా దీపము వలే, సకల ప్రాణుల దేహములలోని చక్షురాది ఇంద్రియాలను ఆ పరమాత్మ కాంతివంతం చేస్తూ భాసిస్తున్నది. ఈ జగత్తులో ఉన్న సమస్తము ఆ పరమాత్మను అనుసరించే చైతన్యవంతం అవుతున్నదని బోధిస్తున్న జ్ఞానమూర్తి రూపంలోఉన్న గురువర్యులకు ఇదే నా నమస్కారం.
దేహం ప్రాణ మపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః ।
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ।।
ఈ స్థూల దేహం, ప్రాణ ఇంద్రియాలు, చలించే బుద్ధి.. ఇవన్నీ శూన్యాలు (స్వయం ప్రకాశాలు కావు. జడములని భావం). ఈ విషయం (పరమాత్మ వలన దేహం చైతన్యవంతమవుతుందని) గ్రహించక స్త్రీలు, అంధులు, అజ్ఞానులు, బాలురు వలే (సామాన్యంగా ఎక్కువ తత్త్వ విచారం చేయని వారు అని భావం) అహంకారంతో భ్రాంతి మూలంగా శరీరేంద్రియబుద్ధ్యాదులు వాటి వాటి స్వశక్తితోనే కార్యకలాపాలు సాగిస్తుంటాయని భావిస్తారు. మాయాశక్తి విలాసం కల్పించిన, ఈ అహంకారమనే మహా మోహాన్ని సంహరించే, దక్షిణామూర్తి రూపంలో
ఉన్న గురువర్యులకు ఇదే నా నమస్కారం.
Review పరమ గురువు దక్షిణామూర్తి.