శివం.. కేశవం
హరిహరుల మధ్య భేదం లేదని చాటే మాసం` కార్తీకం. వేదం అంతర్యామి తత్వాన్ని పురుషుడు అనే పేరుతో ప్రతిపాదించింది. ఆ పురుషుడు శివుడని కానీ, విష్ణువని కానీ చెప్పలేదు. పురుష సూక్తం పురుషుడిని వర్ణించిన మహా మంత్రం. అందులో ఎక్కడా శివకేశవుల ప్రస్తావన రాదు. వేదాల్లో అలా పురుషుడిగా ప్రతిపాదించిన అంతర్యామి సర్వవ్యాపిగా వర్ణితమైనపుడు విష్ణువుగా, శుభకరుడు, మంగళకరుడు అనే ప్రతిపాదనల్లో శివుడిగా కనిపిస్తాడు.
‘విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచమ్’ అనే విష్ణత్వ వైభవం,
‘శివతరాయచ’ అనే పరమశివ వైభవం అంటూ అంతర్యామికి చెందిన రెండు వైభవాలను మాత్రం వేదం వర్ణించింది. ఇక్కడ ఉన్నది ఒక్కడే అనేదే వేద ప్రతిపాదనగా మనం గ్రహించాలి.
ఈ సృష్టి నిర్వహణ, నిర్మూలన అనే రెండు భాగాలుగా కనబడుతూ ఉంటుంది. వీటిని నిర్వహించే దైవం కూడా రెండు స్వరూపాలుగా కనబడుతుంది. అంటే ఒకే చైతన్యాన్ని రెండు రూపాలుగా చూస్తున్నామని అర్థం. ఆ చైతన్యం సగుణం, సాకారం అయినపుడు శివకేశాత్మకంగా, నిర్గుణం, నిరాకారం అయినపుడు అది పరమాత్మ, ఓంకార స్వరూపంగా వేదాలు ప్రతిపాదించాయి.
అందుకే వేదాలు ఆ పరమ పురుషున్ని ఈ మంత్రాలతో కీర్తించాయి.
సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్‌వకమ్భువమ్
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదమ్
అనేక వేల శిరస్సులు, నేత్రములు కలిగి ఈ సమస్త విశ్వాన్ని ఆవరించి ఉన్న మంగళకరమైన జగదాధార రూపమే విరాట్ రూపం. ఇందుకు ఆద్యుడు, సర్వాధార మూర్తి, శుభంకరుడు అయిన ఆ పరమాత్మ నాశనము లేనివాడై, జగదాధారుడై ఉన్నాడు. ఆ సర్వేశ్వరునికి సదా నమస్కారము.
విశ్వతః పరమా న్నిత్యం విశ్వం నారాయణగ్‌ం హరిమ్
విశ్వమే వేదం పురుష స్త ద్విశ్వ ముపజీవతి
ఈ విశ్వము కంటే విశిష్టోన్నతుడు, ఉత్కృష్టుడు, శాశ్వతుడు, సమస్త విశ్వాన్ని ఆవరించి ఉన్న సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, నారాయణుడు, పాపములను పోగొట్టే వాడు అయిన అతీతమైన పరమాత్మ స్వరూపుడు ఈ విశ్వమంతటినీ ప్రకటించి, పరిపూర్ణుడై ఉన్నాడు. సమస్త విశ్వానికి ఆధారమైన వాడు, సకలమును ఆవరించి ఉన్న ఆ విరాట్ స్వరూపుని ఆశ్రయించే సమస్తమును మనగలుగుతున్నది. ఈ విరాఢ్రూపుడే నిత్యసత్య శాశ్వతుడు. అటువంటి సర్వేశ్వరునికి భక్తిపూర్వకంగా నమస్కారం చేయుచున్నాను.
పతిం విశ్వ స్యాత్మేశ్వరగ్‌ం శాశ్వతగ్‌ం శివ మచ్యుతం
నారాయణం మమాజ్ఞేయం విశ్వాత్మానాం పరాయణం
ఈ సమస్త విశ్వానికి పతి అయిన వాడు, సకల చరాచర జీవరాశికి ఆధారభూతమైన వాడు, శాశ్వతుడు, నిత్యశుభంకరుడు, మంగళప్రదాత, విశిష్టోన్నతుడు, తన ఉన్నతిని ఏ మాత్రం కోల్పోని వాడు అయిన నారాయణుడు ఒక్కడే సర్వజ్ఞుడు, విశ్వాత్మకుడు, విశ్వాధారుడు అయి ఉన్నాడు. అట్టి సర్వోత్కృష్టమైన పరమాత్మకు పాదాభివందనములు అర్పించుచున్నాను.
Review మంత్రపుష్పం.