సాధనతో దొరికేదా సద్గతి ?
ఉన్నది ఉన్నట్టుగా ఉండటమే ఉన్నతి!
ముక్తికాంతతో ముచ్చటలాడాలని, మోక్ష మౌక్తికాన్ని ముద్దాలాటలని ఎంతోమంది ముముక్షు వులు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. మోక్షం నిజానికి మనం పొందవలసిన పదార్థం కాదు. ఇదివరకే మనం పొందిన పదార్థం. మనం పొందాలనుకునే మోక్షం, మనం ఇదివరకే పొందామని (మెడలోని దండలాగా) గ్రహించటానికి అవసరమైన జ్ఞానాన్ని పొందటం మనం చేయవలసిన పని. మనం ఎక్కడెక్కడో వెదికే హారం మన మెడలోనే వ్రేలాడుతూ ఉన్నదని చూపించే అద్దాన్ని పొందటమే అసలైన సాధన.
మనకు ఏఏ సామర్థ్యాలు ఎంత మేరకు అవసరమో, ఆయా సామర్థ్యాలు ఆ మేరకు మాత్రమే మనకు ప్రకృతి ప్రసాదిస్తుంది. మనకు లేని సామర్థ్యాలు మనకు అవసరమైనవి. పి.టి.ఉష మైళ్ళదూరం పరుగెత్తగలదు. అంత పరుగు మనం తీయగలమా? ఆ ఓపిక మనకు లేదు. ఆమెవలె పరుగెత్తడం మనకు సరికాదు. మన శారీరక, మానసిక సామర్థ్యాన్ని అనుసరించి మనకు తగినవి చెయ్యాలి. మనకు సంతోషాన్నిచ్చేది, సౌకర్యంగా ఉండేది మనం చెయ్యగలిగినంతవరకు చెయ్యాలి. మనకు నిజంగా అవసరమైనది చేయలేకపోతే, మన తరపున ప్రకృతి ఆ పని చేస్తుంది.
ఎంతో కొంత కృషి లేకపోతే ఏదీ సాధించలేం కదా అని అనుకుంటాం. చిన్న-చిన్న లక్ష్యాలు సాధిం చడం, ఉన్నత లక్ష్యసాధనకు దారితీస్తుంది. బ్రతక డానికి ఆహారం కావాలి. అందుకై కష్టపడాలి. పనిచెయ్యాలి. డబ్బు సంపాదించాలి. ఇవన్నీ ‘జీవించడం’ అనే పెద్ద లక్ష్యం కోసమే. ఇంట్లో సేవకులు గృహనిర్వహణ ఏ విధంగా చేస్తారో, అదే మాదిరిగా ఇవి జీవిత నిర్వహణకు ఉపకరణాలు. ఈ చిన్న లక్ష్యాలే మనం బ్రతకడానికి పనికొస్తే అంతకంటే కావల్సినదేముంది ?
మౌనం నీకు ఆనందదాయకమైతే హాయిగా మౌనంలో ఆనందించు. పరుగెత్తడం సంతోషకరమైతే నిక్షేపంగా ఆ పని చెయ్యి. రెండూ ఇష్టమైతే రెండూ చెయ్యవచ్చు. అయితే రెండింటి మధ్య సరైన నిష్పత్తి పాటించు. మాట్లాడటం అవసరమైన చోట మౌనం వహించడం నేరం. మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడటం అంతకంటే నేరం, పాత్రనెరిగి సందర్భోచితంగా ప్రవర్తించాలి.
నా కర్తవ్యమేమిటో నాకెలా తెలుస్తుంది, నేను నిర్వహించే పాత్రనెలా గుర్తించాలి. అనే అనుమానం రావచ్చు. మన కడుపునిండిన విషయం మనకెలా తెలుస్తుంది? ఏవైనా పరికరాలు, కొలబద్దలు కావాలా? నడిచి -నడిచి నొప్పులతో అలసిన కాళ్ళకు విశ్రాంతి పొందాలని ఎలా తెలుస్తుంది?
కడుపు నిండిన తర్వాత కూడా మరింత తినాలనిపించి కక్కూర్తి పడ్డామనుకో, కడుపునొప్పి వస్తుంది. ఈ నొప్పిని కర్మసిద్ధాంతంతో ముడిపెట్ట కూడదు. ఇది కార్య-కారణ సంబంధం అంటే బాగుంటుంది. లేదా వ్యవహారప్రాధాన్యం (ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్) అనండి, సరిపోతుంది. అంతేకాని, పూర్వ నిర్ణయ సిద్ధాంతం (ఫ్రీ డిటర్మినేషన్)తో సమర్థించకండి. సృష్టిలో అంతా సక్రమమైన రీతిలో ఉన్న విషయం అర్థం చేసుకుంటే పూర్వనిర్ణయ సిద్ధాంతం గురించి మాట్లాడే పనేముంది?
విశ్వంలో ప్రతి ఒక్కటీ క్రమపద్ధతిలో ఉంది. సమతుల్యంగా ఉంది. ప్రతి జీవికీ, ప్రతి వస్తువుకీ, ప్రతి సంఘటనకూ ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నిర్వహించవలసిన ప్రత్యేక పాత్ర ఉంది.మంచం మీద నుండి దొర్లిపడి మన చేతికి నొప్పి కలిగిందనుకోండి. ఇక్కడ మనకు కారణం తెలు స్తోంది. కాని ఒక్కోసారి కారణం తెలియకపోవచ్చు. దొర్లిపడినందువల్ల కలిగిన నొప్పికి ఖచ్చితంగా కార్యకారణ సంబంధముంది. పడిన సమయంలో గాఢనిద్రలో ఉన్నామనుకుందాం. మనకు పడినట్లు తెలియనే తెలియదు. అలాగే మన జీవితాల్లో జరిగే సుఖాలకు, దుఃఖాలకు కారణమున్నా మనకు తెలియకపోవచ్చు.
మనం ఎంత డబ్బు సంపాదించినా దాన్ని ఆనందంగా మార్చుకుని అనుభవించకపోతే వృధా! భవిష్యత్తు అవసరాల కొరకు ఆదా చేయవచ్చు. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో జీవితంలో సంతోషపు సరిగమలు పలికించాలి. అన్ని లక్ష్యాల అంతిమ లక్ష్యం ఆనందం…. ఆనందం..! ఆనందం….! కూడ బెట్టడం ఖుషీ కోసమే! ఆర్జన ఆనందార్చన కొరకే!! ఎవరికి ఎంత సంపాదన అవసరమో అది పొందే మార్గం అవసరమైనపుడు సృష్టికర్త మనకు సృష్టించి ఇస్తాడు.
ఎవరికెంత ఉంటే అదే వారికి సరిపోతుంది. పసిపాప ఒక్కపైసా సంపాదించదు. కానీ తల్లి పాలిస్తుంది. పోషిస్తుంది. ప్రకృతి మేధస్సు గురించి మళ్ళీ మళ్ళీ అనుమానం వ్యక్తం చేయనవసరం లేదు. ఆ మహామేధాశక్తికి అబ్బురపడి తబ్బిబ్బు కావలసినదే! ప్రకృతి నియమాలు సరిగా అర్థంకానంతవరకూ దుఃఖం వీడదు. ఒక్కసారి అవగాహన అయితే హృదయం తేలికవుతుంది. ‘నీవు ఏది కావాలను కుంటున్నావో, ఎప్పుడో అది అయి ఉన్నావనే సత్యాన్ని’ గ్రహించడమే ముక్తి, మోక్షం, నిర్యణం.!
Review ముక్తి మౌక్తిక మార్గాలు.