దేవుడు చేసిన లోకాన్ని ప్రేమిద్దాం
దేవుడు చేసిన మనుషులుగా జీవిద్దాం
ఆస్తికుల గురించి, నాస్తికులు గురించి, వారు చేసిన అనేక తర్కాలు, సిద్థాంతాల గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఆస్తికులైనవారు కూడా చాలామంది ఎందుకో జీవితాన్ని విషాదంగా గుడపుతూ ఉంటారు. దైవాన్ని నమ్మినవాళ్లకు భయమంటూ ఉండకూడదు కదా! కానీ వీళ్లెందుకు భయపడతారు? అసలు భయంతోనే దేవుణ్ణి నమ్ముతారు. దేవునిపై విశ్వాసం కంటే భయమే ఎక్కువ వీరికి. విశ్వాసమున్నచోట భయానికి తావు లేదు. భయమున్న చోట విశ్వాసానికి చోటు లేదు. ఒకరకంగా నాస్తికులే చీకూచింతా, బాదరబందీ లేకుండా సుఖంగా ఉన్నారేమో అనిపిస్తుంటుంది.
నాస్తికులకు ఏమైనా సమస్యలు వస్తే చెప్పుకోడానికి దేవుడు లేడు. కానీ వాళ్లేమైనా తప్పులు చేస్తే ఒప్పుకొని సరిదిద్దుకుంటారు.
ఇక ఆస్తికుల విషయానికొస్తే
వాళ్ళు, ఓ స్వామీ, నరకాన్నెందుకు సృష్టించావయ్యా! ఇన్ని కష్టాలెందుకు పెట్టావు! అది బాగుండలేదు. ఇది సరిగ్గా లేదు అని అస్తమానం సణుగుతుంటారు. మా మొర ఆలకించవు, మా బాధలు తీర్చవు అంటూ విలపిస్తారు. అసలు చిక్కు ఎక్కడుందంటే వీళ్లు తమంతట తాము సృష్టించుకున్న దేవుణ్ణి నమ్ముకుని కాలం వెళ్లబుచ్చుతుంటారు. వీరికి నాస్తికులకు పెద్దగా తేడా ఏమీ కనబడదు. వారికున్న పరిమితజ్ఞానంతో, వారి అనుభవాల పరిధిలో, వారి నమ్మకాల చట్రాలలో దేవుణ్ణి తయారుచేస్తారు. వారి అభిప్రాయాలు దేవుడి భావాలుగా ఆపాదించి, కథలు కథలుగా రాస్తూ నమ్మిస్తుంటారు. వాళ్ల ఆత్మకథలను భగవంతుని జీవిత చరిత్రలుగా చలామణీ చేస్తుంటారు.
నిజమైన భక్తుడు మాత్రం, తనను సృష్టించిన దేవుణ్ణి మనస్ఫూర్తిగానమ్ముతాడు. దేవుడు చేసిన మనుషులకు, మనుషులు చేసిన దేవుడికి ఉన్న వ్యత్యాసం తెలుసుకోలేని వాళ్లు మాత్రమే నాస్తికులుగామారతారు. ఈశ్వరున్ని సరిగ్గా అర్థం చేసుకోనివారు చెప్పే నిర్వచనాలు విని, నిస్ప•హతో వారు నాస్తికులయ్యారు. మనకు తోచిన లక్షణాలు దేవునికి అంటగట్టి, ఆఖరికి దేవుడు దయలేని వాడని, అష్టకష్టాలు పెడుతున్నాడని నిందలు వేస్తున్నాం. ఉన్నాడని కొన్నాళ్లు నమ్ముతాం. లేడని కొన్నాళ్లు వాదిస్తాం.
కొంతకాలానికి మళ్లీ నమ్మడం మొదలుపెడతాం. కొంత అనుమానంతో, కొంత భయంతో, ఎందుకైనా మంచిదని కాస్త నమ్ముతూ, కాస్త నమ్మక గడిపేస్తుంటాం. ఊహల్లో తేలుతూ, వాటినే భక్తిగా భ్రమపడుతూ బ్రతుకుతుంటాం. సమస్య ఎక్కడ వస్తుందంటే, లోకంలో మనకు నచ్చని వాటిని తిరస్కరిస్తూ ఉంటాం. మనకు అయిష్టమైనవి ద్వేషిస్తుంటాం. ప్రపంచం అస్తవ్యస్తమైనది అంటాం. సృష్టిని ఇష్టపడం. కానీ సృష్టికర్త పైన ఎక్కడ లేని భక్తిని ప్రదర్శిస్తాం. భగవంతుడిని ప్రేమిస్తాం కానీ ఆయన సృష్టించిన మనుషుల్ని ద్వేషిస్తాం. ఎవరినీ మనం ప్రేమించం. దేవుడు మాత్రం మనల్ని ప్రేమించెయ్యాలి. ఇదేమైనా న్యాయమా? ఎంత హాస్యాస్పదం! పక్కఇంటి సత్యనారాయణతో నిత్యం గొడవలు పడుతూ, మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే ఫలం సిద్ధిస్తుందా? ఎదురింటి సూర్యనారాయణను ఆదరించే హృదయం ఉంటే ఆదిత్య హృదయం పారాయణ చేసినట్టే కదా! సృష్టి లోని ప్రతి జీవినీ, ప్రతి వస్తువునూ, ప్రతి సంఘటననూ ప్రేమించడమే సృష్టికర్తను పూజించడం.
ఈ ప్రాథమిక విషయం విడిచిపెట్టి కొంత మంది సాధువులు, యోగులు అనేక విషయాలు బోధిస్తారు. సందేహం లేదు, వారు కూడా చాలా మంచి విషయాలే బోధిస్తారు. వారి బోధనల సారం గ్రహించండి. మీకు అవసరమైనంత వరకు తీసుకోండి. అనవసరమైన వాటిని వదలండి. అధ్యాత్మికజీవనం అంటే ప్రత్యేకంగా మరొకటి ఏమీ కాదు. సరళమైన, సహజమైన జీవనం, అంతే.
సహజమైన జీవనం అంటే ఏమిటని మీరు అడగవచ్చు. కనిపించే ఈ ప్రకృతి కనిపించని పరమాత్మ ఆకృతి. జగమంతటినీ జగన్నాథునిగా చూడటమే సరళ జీవనం. జనమందరిలో జనార్దనుని దర్శించటమే సహజ జీవనం.
అధ్యాత్మికత అంటే లౌకికజీవనంలో వెనకడుగు వెయ్యటం కాదు. లోకాన్ని ముందడుగు వేయించటం. నిత్యవ్యవహారాల నుండి తప్పించుకు తిరగడం కాదు, మరింత శ్రద్ధగా నిమగ్నం కావటం, మరింత సమర్థవంతంగా నిర్వహించడం.
ఆరోగ్యవంతమైన శరీరం, నిర్మల పసిహృదయం యొక్క కలయికఆధ్యాత్మికత. శరీరంతో చెమటను చిందిస్తూ, మనసుతో చిరునవ్వు చిలికించటం ఆధ్యాత్మికత. వేదనలో వెన్నెల చూడటం ఆధ్యాత్మికత. కసాయిలో ‘సాయి’ని చూడటం ఆధ్యాత్మికత. సన్మానానికీ, అవమానానికీ నడుమ ‘సన్మౌనసేతువు’ ఆధ్యాత్మికత. నీకంటే అధికులెవరూ లేరని, నీకంటే ఎవరూ తక్కువ కాదనీ తెలుసుకోవటం ఆధ్యాత్మికత. జననం ఎంత సంతోషమో, మరణం అంతకంటే ఆనందమని గ్రహించటం ఆధ్యాత్మికత. ప్రపంచ సుఖాల నుండి ‘దూరం’ కావటం కాదు, వాటి ‘సారం’ అనంతంగా పెంచటం ఆధ్యాత్మికత.
చిన్న గడ్డిపరకలో ఏ చైతన్యం ఉందో, ఐన్‍స్టీన్ మహామేధస్సులో కూడా అదే చైతన్యం ఉంది. ఏ శక్తి విశ్వాసాన్ని కలిగిస్తుందో, అదే శక్తి అవిశ్వాసాన్ని కూడా కలిగిస్తోంది. ఏ శక్తి ప్రమాదాలకు గురి చేస్తుందో, అదే శక్తి రక్షణ కూడా కల్పిస్తోంది.
ఇక్కడ అపనమ్మకానికి చోటు లేదు. పసిపాప దగ్గరకు వెళ్ళి ‘నీ తల్లిని నీవు నమ్ముతావా’ అని అడిగి చూడండి, బోసి నవ్వు సమాధానంగా వస్తుంది. అసలు ఆ పాపకు మీ ప్రశ్నే అర్థం కాదు. తల్లిఎప్పుడూ బిడ్డను అంటిపెట్టుకుని ఉంటుంది. నిరంతరం ఆలనా పాలనా చూస్తూ ఉంటుంది. లాలిస్తుంది, జోకొడుతుంది. పాపకు ఆమె జన్మనిచ్చింది. కాపాడటం ఆమె కనీస బాధ్యత. అలాగే ప్రకృతి మనందరికీ కన్నతల్లి. ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పగా చూసుకుంటుంది. అయితే మనం కోరుకున్న విధంగా కాదు. ఆమె చేయవలసిన పద్ధతిలో చేస్తుంది. మనం అనుభవించేదంతా సహజదృష్టితో చూడకపోతే అయోమయంలో పడిపోతాం. పైకి మనకు కనబడే లోకవ్యవహారాలు చూసి తికమక పడతాం. కొంతమంది అధ్యాత్మిక జీవనం గడిపేవారు కూడా కష్టనష్టాలతో సతమతమవుతూ ఉండవచ్చు. ముఖాన కొంచెమైనా నవ్వు ఉండదు. ఏదో పోగొట్టుకున్నట్లు కనపడుతూ ఉంటారు. ముఖాన కొంచెమైనా నవ్వు ఉండదు. తొలకరి జల్లుల వంటి తొణికిసలాడే చిరునవ్వులే ఆధ్యాత్మికతలకు లక్ష్యం, పరమావధి. నా దృష్టిలో, దరహాసాన్ని సమాధి చేసిన తర్వాత సమాధిస్థితి పొందినా ఒకటే, పొందకున్నా ఒకటే. నిండుగా నవ్వగల్గిన వ్యక్తి ఏ నవగ్రహపూజా చేయనక్కర్లేదు. జీవనకావ్యంలోని నవరసాలను ‘నవ్వు’ రసంలో రంగరించు.
ప్రతిరేయీ చిరునవ్వుల చిరుదీపాలు వెలుగుతున్న ఇళ్లలో దీపావళి ఎందుకు? సదా సరదా పండుతున్న సంసారాలలో దసరా ఎందుకు? ప్రతిక్షణంలోని మాధుర్యాన్ని ఆస్వాదించే మెళకువ తెలుసుకుంటే, చిరాకులు, ఒత్తిళ్లు, ఆందోళనలు ఎందుకుంటాయి? మనుషులు చేసిన దేవుడు, మనుషుల్ని చేసిన దేవుడు ఇద్దరూ వేర్వేరు. మనలో చాలామంది, మనం చేసిన దేవుణ్ణి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే మనకంత సందిగ్ధావస్థ. మనల్ని చేసిన దేవుడిని ఆరాధిస్తే, మనలో ఆయన నింపిన ప్రేమను, ప్రదర్శించిన ప్రజ్ఞను దర్శించగలిగితే, జీవితమంతా ఆనంద దర్శనభాగ్యం కలుగుతుంది.
Review సృష్టిగా మారిన సృష్టి కర్త.