శివుడు, యముడు పక్కపక్కనే..

ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆలయం- కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం. ఇక్కడికి సమీపంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం.. పలువురు ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుండటంతో ఈ దేవాలయం ఒక్కసారిగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.
ఈ ఆలయం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జయశంకర్‍ భూపాలపల్లి జిల్లా మహదేవ్‍పూర్‍ మండలం కాళేశ్వరం గ్రామంలో ఉంది. దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమణీయమైన ప్రకృతి మధ్య, పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన ఈ క్షేత్రం నిజానికి చాలా ప్రాచీనమైనది. శివుడి, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహిణిదగా సరస్వతీ నది ప్రవహించడం వల్ల త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాల్లో కాళేశ్వరం ఒకటిగా ప్రసిద్ధిగాంచింది.
గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తిని ఇస్తుండటంతో పక్కనే ఉన్న యముడికి పని లేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యముడిని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరుడిని చూసి యముడిని దర్శించకుండా వెళ్తే మోక్షప్రాప్తి దొరకదని, అలా నన్ను చూసి, నిన్ను దర్శించని వాళ్లను నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకుని, కాళేశ్వర స్వామి (యముడు)ని కూడా దర్శించుకుంటారు.
లింగంపై నీరుపోస్తే.. సంగమ స్థానానికి..
ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకం చేస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం.

శివరాత్రి ఉత్సవాలు
మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆనాడు ఉదయం ఐదు గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 4.16 గంటలకు ముక్తీశ్వర, శ/భానందదేవి కల్యాణోత్సవం, రాత్రి 12 గంటలకు గర్భగుడిలోని ద్విలింగాలకు మహాభిషేకం, లింగోద్భవ పూజ, చండీ హవనం, కాళరాత్రి హవనం నిర్వహిస్తారు. మర్నాడు ఉదయం ఐదు గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం, 11.30కి యాగశాలలో పూర్ణాహుతి, సదస్యం, మహదాశ్వీరాదం, పండిత సన్మానం, సాయంకాలం నాలుగు గంటలకు కల్యాణోత్సవం, రాత్రి 8 గంటలకు నాకబలి, పవళింపు సేవతో పూజలు ముగుస్తాయి.

ఎలా వెళ్లాలంటే..
రైలు, రోడ్డు మార్గాల ద్వారా కాళేశ్వరం ఆలయానికి సులభంగానే చేరుకోవచ్చు. కాళేశ్వరంలో రైల్వే స్టేషన్‍ లేదు. ఇక్కడికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‍ రామగుండం. ఇది కాళేశ్వరానికి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రైలు దిగి బస్సులో ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు.

  • రామగుండం నుంచి కాళేశ్వరానికి బస్సులు తరచూ తిరుగుతూనే ఉంటాయి.
  • వరంగల్‍, కాజీపేట రైల్వేస్టేషన్లలో దిగి కూడా కాళేశ్వరానికి వెళ్లవచ్చు. ఈ రెండు స్టేషన్లు కాళేశ్వరానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
  • తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్‍ నుంచి కాళేశ్వరానికి నేరుగా బస్సులను నడుపుతోంది. మహాత్మాగాంధీ బస్సు స్టేషన్‍ లేదా జూబ్లీ బస్సు స్టేషన్‍ నుంచి ఈ బస్సులు రోజూ అందుబాటులో ఉంటాయి. ఎక్స్ప్రెస్‍ బస్సుల్లో నాలుగు నుంచి ఐదు గంటలు ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.
  • కారు లేదా బైక్‍లపై వెళ్లాలంటే.. హైదరాబాద్‍ – సిద్దిపేట – పెద్దపల్లి – కాళేశ్వరం (300 కిలోమీటర్లు – 5 గంటల ప్రయాణ సమయం), హైదరాబాద్‍ – భువనగిరి – వరంగల్‍ – పరకాల – కాళేశ్వరం (260 కిలోమీటర్లు – 4.15 నిమిషాల ప్రయాణం).
  • కాళేశ్వరం నీటి ప్రాజెక్టు నిర్మాణానంతరం ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ప్రాజెక్టును చూసేందుకు వస్తున్న పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు.

Review శివుడు, యముడు పక్కపక్కనే...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top